Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40 - 35

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40 - 35

జవాబులు - నెహ్రూ ఇందిరను తన వారసురాలిగా ప్రకటించలేదు, తీర్చిదిద్దలేదు అని నేను రాసినదాన్ని ఖండిస్తూ ఒక పాఠకుడు ఎన్నికల కమిటీలో, వర్కింగ్‌ కమిటీలో స్థానం యివ్వలేదా, కాంగ్రెసు అధ్యక్షురాలిగా చేయలేదా అని అడిగారు. ఆయన ఉదహరించిన పదవులు చాలా చిన్నవి. నెహ్రూ కుటుంబం కాంగ్రెసులో ముందునుంచీ అగ్రస్థానంలో వున్నారు. ఇందిరకు ఆ పాటి పదవులు దక్కడం చాలా చిన్న విషయం. కాంగ్రెసు అధ్యక్షురాలిగా ఆమెను చేసినా, త్వరలోనే ఆమెను తొలగించి యితరులకు అప్పగించడం జరిగింది. వారసురాలిగా తీర్చిదిద్దుదామనుకుంటే తను అనారోగ్యం పాలు కాగానే ఏదో ఒక ముఖ్యమైన మంత్రిపదవి యిచ్చివుండేవాడు. మరొక పాఠకుడు కాంగ్రెసు 'సిండికేట్‌' ఫెడరల్‌ వ్యవస్థకు చిహ్నం అన్న ధోరణిలో రాశారు. సిండికేట్‌లో అన్ని రాష్ట్రాల నాయకులూ లేరనే విషయం గుర్తించాలి. వారిలో ఎస్‌కె పాటిల్‌, అతుల్య ఘోష్‌, ముఖ్యమంత్రులు కారు. కాంగ్రెసులో కొంతమంది 'జింజర్‌ గ్రూప్‌'గా ఏర్పడి వ్యవహరించిన విషయం చారిత్రక వాస్తవం. వీళ్లను సిండికేట్‌ అనేవారు, చంద్రశేఖర్‌ తదితరులను యంగ్‌ టర్క్‌స్‌ అనేవారు, ఇందిరకు ఆత్మీయులను కిచెన్‌ కాబినెట్‌ అనేవారు. ఈ పదాలను వాడకుండా రాజకీయచరిత్ర రాయడం అసాధ్యం. శాస్త్రి గురించి నేను రాసినది పూర్తిగా చదవకుండానే మరో పాఠకుడు నేను పని గట్టుకుని శాస్త్రికి వ్యతిరేకంగా రాస్తున్నానని అన్నారు. అందరూ రాసినదే మళ్లీ రాస్తున్నానా, భిన్నంగా రాస్తున్నానా అన్నది ముఖ్యం కాదు. వాస్తవాలు రాస్తున్నానా లేదా అనేదే చూడాలి. నిజానిజాలు తెలుసుకున్న పాఠకుడికి ఎవరేం సాధించారో, ఎవరికి ఏ విషయంలో ఎంత ఘనత కట్టపెట్టాలో వేరే ఎవరూ చెప్పనక్కరలేదు. ఏం చేయడానికైనా 19 నెలల సమయం చాలా తక్కువన్న మాట నిజమే. అందుకే పాలనపై శాస్త్రి ముద్ర చెప్పుకోదగిన స్థాయిలో లేదు. సాదాసీదా జీవితం గడపడమనేది వ్యక్తిగతశైలి. మన పరిశీలిస్తున్నది - పాలనా సామర్థ్యం, ఆర్థిక దృక్కోణం, రాజకీయ చతురత అనే అంశాలు. రూపాయి విలువ తగ్గించాలన్న ఆయన నిర్ణయం చాలా పొరపాటని చరిత్ర చెప్పింది. ఇందిర ఆయన మార్గంలో మరీ దూకుడుగా వెళ్లి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. 

శాస్త్రి వెనకడుగు వేయడం గురించి క్షేత్రస్థాయిలో సైనికాధికారి ఏమైనా అనుకోవచ్చు. ప్రధాని పదవిలో వున్నవారిపై అంతర్జాతీయంగా ఎటువంటి ఒత్తిళ్లు, బెదిరింపులు, లాలనలు వచ్చి వుంటాయో వూహించడం అప్పటికి సాధ్యం కాదు. కొన్నేళ్లు పోయాక విషయాలు బయటకు వచ్చినపుడు ఓహో ఆ నాటి నిర్ణయానికి కారణం యిదన్నమాట అని తెలుస్తుంది. ఆ పాఠకుడు శాస్త్రి గురించి విస్తారంగా చదువుతానని చెప్పారు. చదివి నేను రాసిన అంశాల్లో తప్పులుంటే ఎత్తి చూపాలని కోరుతున్నాను. ముఖ్యంగా మంత్రిగా శాస్త్రి సాధించిన విజయాల గురించి వెతికితే నాకు  ఏమీ కనబడలేదు. రైల్వేమంత్రిగా వున్నపుడు మూడు నెలల వ్యవధిలో రెండు ప్రమాదాలు వరుసగా జరిగితే రాజీనామా చేయడం ఒకటే కనబడుతోంది. దానిలో ఆయన నైతికత కనబడుతోంది తప్ప సామర్థ్యం గురించి తెలియటం లేదు. నాలుగున్నర ఏళ్లగా రైల్వేమంత్రిగా వున్నారాయన. సిగ్నలింగ్‌ సిస్టమ్‌ను పటిష్టపరచే చర్యలు చేపట్టారో లేదో తెలియదు. ఆ పాఠకుడి పరిశోధనలో వీటి గురించి ఏమైనా తెలిస్తే మనందరితో పంచుకోమని కోరుతున్నాను. వైట్‌ రివల్యూషన్‌ గురించి ఒక మాట - శాస్త్రి హయాంలో ఎన్‌డిడిబి ఏర్పాటు కాగానే వైట్‌ రివల్యూషన్‌ ప్రారంభం కాలేదని గమనించాలి. కురియన్‌ ఆత్మకథ చదివితే శాస్త్రి పాత్ర ఎంతో, ఎప్పణ్నుంచి వైట్‌ రివల్యూషన్‌ వచ్చిందో, దానికి కారకులెవరో సరైన అవగాహన వస్తుంది. 1965 యుద్ధం గురించి తెలియకపోతే రాయకుండా వుండడం మంచిదని నాకు సలహా యిచ్చిన మరో పాఠకుడు భారతసైన్యం లాహోర్‌ను ఆక్రమించిందన్న అర్థంలో రాశారు('ఇండియా వెంట్‌ ఆన్‌ టు ఆక్కుపై లాహోర్‌') లాహోర్‌కు వైపుగా వెళదామని భారతసైన్యం అనుకున్నంత మాత్రాన లాహోర్‌ చేజిక్కదు. లాహోర్‌ పట్టుకున్నారో లేదో, పట్టుకుని వుంటే ఎన్ని రోజులు వారి స్వాధీనంలో వుందో ఆయన రాస్తే ఆ యుద్ధం గురించి ఆయనకు ఏం తెలుసో నాకు తెలుస్తుంది. 

నెహ్రూ జీవించివున్న కాలంలోనే నెహ్రూ తదనంతరం ఎవరు? అనే ప్రశ్న వచ్చింది కానీ శాస్త్రి విషయంలో అలా జరగలేదు. అందువలన శాస్త్రి హఠాన్మరణంతో ఒక్కసారిగా అందరూ ఎలర్టయ్యారు. ఏడాదిన్నరగా ఏ పదవీ లేకుండా వున్న మొరార్జీ యీసారి పోటీ చేసి తీరతానని ముందుకు వచ్చాడు. ఆపద్ధర్మ ప్రధానిగా రెండు సార్లు చేసిన గుల్జారీలాల్‌ నందా నేనూ అన్నాడు. దేశానికి ఆర్థిక రాజధానిగా వున్న బొంబాయికి మకుటం లేని మహారాజుగా వున్న మహారాష్ట్ర నాయకుడు, కేంద్ర రక్షణమంత్రిగా పాక్‌ యుద్ధవిజయపు ఘనతను శాస్త్రితో బాటు పంచుకున్న వైబి చవాన్‌ కూడా ముందుకు వచ్చాడు. తను ప్రధానిగా వుండగా శాస్త్రి కులదీప్‌ నయ్యర్‌ అనే జర్నలిస్టుతో చెప్పారట - ''నేను రెండు మూడేళ్ల లోపుగానే చచ్చిపోతే నా స్థానంలో ఇందిర వస్తుంది. నేను అయిదారేళ్లు బతికితే అప్పటికి చవాన్‌ మరింత పుంజుకుని అతనే ప్రధాని అవుతాడు.'' అని. చవాన్‌ దురదృష్టం శాస్త్రి రెండేళ్ల లోపుగానే చచ్చిపోయాడు. చవాన్‌కు పూర్తి బలం ఏర్పడలేదు. అదే సమయంలో ఇందిర ఆప్తులు 'నువ్వు ప్రధాని కావడానికి యిదే అదను' అని ఎగదోశారు. కానీ నెహ్రూ కూతురన్న కితాబు తప్ప ఆమెకు వేరే అర్హత ఏమీ లేదు. మంత్రిగా కూడా పెద్దగా పేరు తెచ్చుకున్నది లేదు. అందువలన ఇందిర చవాన్‌తో ''ప్రధాని అయ్యే ఛాన్సు నీకు వస్తే నేను మద్దతు యిస్తాను. అలాటి ఛాన్సు నాకు వస్తే నువ్వు యివ్వాలి.'' అని ప్రతిపాదించింది. తనకు సరిపడని మొరార్జీ ప్రధాని కాకుండా చూడడానికి చవాన్‌ సరేనన్నాడు. 

ఈ పరిస్థితిలో కామరాజ్‌ కింగ్‌మేకర్‌ పాత్ర పోషించాడు. నువ్వే కింగ్‌ కావచ్చు కదా అని అడిగిన సన్నిహితుల వద్ద ''నో ఇంగ్లీష్‌, నో హిందీ, హౌ?'' అన్నాట్ట. పైకి అలా అన్నా కామరాజుకి తెలుసు - మొరార్జీతో పోటీ పడడానికి ఉత్తరాది నాయకుడే కావాలి తప్ప తనలాటి దక్షిణాది వాడికి ఛాన్సు లేదని. కానీ కీలకమైన పదవిలో వున్నాడు కాబట్టి చక్రం తిప్పాడు. ప్రధాని అయ్యాక శాస్త్రి కామరాజ్‌ ప్రాధాన్యతను తగ్గించేసినా, పార్టీ అధ్యక్ష పదవిలో యింకో టెర్మ్‌ కొనసాగించాడు. సిండికేటు నాయకులు మళ్లీ సమావేశమై యీసారి కూడా మొరార్జీని ఎలాగైనా తప్పించాలని నిశ్చయించుకున్నారు. అతనైతే తమ మాట వినని మొండి ఘటమని అందరికీ తెలుసు. శాస్త్రి రాజకీయాల్లో నలిగిన వ్యక్తి కాబట్టి తమను పట్టించుకోలేదని, ఇందిర మాటలు రాని ఆటబొమ్మ ('మూంగీ గుడియా') కాబట్టి, తనను జనాలకు చూపించి ఆ పదవిలో కూర్చోబెట్టి కలక్టివ్‌ లీడర్‌షిప్‌ పేరుతో మన విధానాలు ఆమె ద్వారా అమలు చేయవచ్చని కామరాజ్‌ అందరికీ నచ్చచెప్పాడు. యుపిలో సుచేతా కృపలానీ ముఖ్యమంత్రిగా వుండేవారు. పేరుకు ఆమె ముఖ్యమంత్రే కానీ పెత్తనమంతా యితరులదే. 'అదే పని కేంద్రంలో చేద్దాం, ఇందిర మహిళ, చిన్నపిల్ల, వాళ్ల నాన్న వెనక్కాల ఆయన ఆలనాపాలనా చూసుకుంటూ తిరగడం తప్ప రాజకీయపు టెత్తులు తెలియవు.' అన్నాడు కామరాజ్‌. 'మొరార్జీ వద్దనుకుంటే నందాను చేద్దాం, నెహ్రూ కుటుంబీకురాలిని తెస్తే నెహ్రూలా సోషలిజం అంటుందేమో' అన్నారు నిజలింగప్ప, ఎస్‌కె పాటిల్‌. 'ఇందిరకు పొగరెక్కువ, నేను కేంద్రమంత్రిగా, తను కాంగ్రెసు అధ్యక్షురాలిగా వున్నపుడు మర్యాద యిచ్చేది కాదు' అన్నాడు సంజీవరెడ్డి. 'నందా వట్టి గందరగోళపు, చాదస్తపు మనిషి. ప్రధాని పదవికి తగడు. నందా పేరు నార్త్‌లో తప్ప యితర ప్రాంతాల్లో తెలియదు. జనాల్లో నెహ్రూ అంటే మోజుంది. అతని కూతురంటే దేశమంతటికీ తెలుసు. కాంగ్రెసు నెహ్రూ విధానాలనే కొనసాగిస్తోంది అనే భావం కలిగించడం ఏడాదిలో రాబోయే ఎన్నికలలో ఎంతో ఉపయోగం.' అని కామరాజ్‌ వాదించాడు. 

కామరాజ్‌ లాగే ముఖ్యమంత్రులూ భావించారు. కేంద్రం నుంచి అధికారాలు గుంజుకోవాలంటే మొరార్జీ వంటి బలమైన ప్రధాని వుంటే కష్టమని, ఇందిర వంటి అనుభవశూన్యురాలు వుంటేనే మంచిదని వాళ్లు భావించారు. అందరి కంటె ముందుగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి డిపి మిశ్రా ఇందిరకు మద్దతు పలికి, యితర ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడాడు. నాలుగు రోజుల్లో మరో ఏడుగురు కూడా గొంతు కలిపారు. వాళ్లు సంయుక్త ప్రకటన చేసిన సాయంత్రం మరో నలుగురు వచ్చి చేరారు. ఇలా మొత్తం 14 మంది ముఖ్యమంత్రుల్లో 12 మంది ఇందిరకు బాసటగా నిలిచారు. వాళ్ల రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు ఆ మేరకు ఆదేశాలిచ్చారు. ఆ పై ఏడాదే సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి, టిక్కెట్ల పంపిణీ అధ్యక్షుడుగా వున్న కామరాజ్‌ చేతిలో వుంటుంది కాబట్టి కామరాజ్‌ మాటను కాదనలేని పరిస్థితి. అందువలన కామరాజ్‌ మాటకు నాయకులందరూ విలువ యిచ్చారు. వై బి చవాన్‌ తాలూకు ఎంపీలు, హరిజన నాయకుడు జగ్‌జీవన్‌ రామ్‌ తాలూకు ఎంపీలు కూడా ఇందిరకు బాసటగా నిలిచారు. జనవరి 19న కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రహస్యబాలెట్‌ నిర్వహించారు. మొరార్జీకి 169 ఓట్లు రాగా ఇందిరకు రెట్టింపు కంటె ఎక్కువగా 355 వచ్చాయి. ఆ విధంగా ఇందిర అనేక కాలిక్యులేషన్స్‌ కారణంగా ప్రధాని అయింది. కేవలం వారసత్వం కారణంగా కాదు. ఆమెయే ఒకసారి చెప్పుకుంది - ''ఆ ఎన్నిక నాకు అనుకూలంగా వచ్చింది అనుకోవడం కంటె మొరార్జీకి వ్యతిరేకంగా వచ్చింది అనుకోవడం కరక్టు.'' అని. మొరార్జీని పదవికి దూరంగా వుంచడానికి యింత తంటాలు పడిన సిండికేటు నాయకులు అతి కొద్ది కాలానికే ఇందిరను దింపి మొరార్జీని గద్దెపై కూర్చోబెట్టాలని ప్రయత్నించి భంగపడ్డారు.

ఆ విధంగా 1966 జనవరి 24 న ఇందిర ప్రధాని అయింది. ఇంచుమించు శాస్త్రి కాబినెట్‌నే కొనసాగిస్తూ చిన్నపాటి మార్పులు చేసింది.  కామరాజ్‌ సిఫార్సుపై జగజీవన్‌ రామ్‌ను కాబినెట్‌లో చేర్చుకుంది. గాంధీ, నెహ్రూల సమాధులకు దగ్గరలోనే శాస్త్రి సమాధి ఏర్పాటు చేసి దానికి 'విజయ్‌ ఘాట్‌' అనే నామకరణం చేసింది.  (సశేషం) (ఫోటో - ఇందిర చేత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయిస్తున్న దేశాధ్యక్షుడు రాధాకృష్ణన్‌)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?