Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 36

జవాబులు - 1965 యుద్ధంలో లాహోర్‌ ఆక్రమణ గురించి ప్రస్తావించిన పాఠకుడు భారతసైన్యం లాహోర్‌ ఎయిర్‌పోర్టుకు అవతలే ఆగిపోయిందని ఒప్పుకున్నారు. అంటే లాహోర్‌ను పట్టుకోలేదనేగా! అలా అంటూనే చివరి పేరాలో 'ద టెరిటరీ ఆక్కుపైడ్‌ బై ఇండియా వాజ్‌ మైన్లీ ఇన్‌ ద ఫెర్టయిల్‌ సియాల్‌కోట్‌, లాహోర్‌ అండ్‌ కశ్మీర్‌ సెక్టార్స్‌..' అన్నారు. ఇంత గందరగోళం దేనికి? లాహోర్‌ పట్టుకున్నామని అతిశయోక్తులెందుకు? వాస్తవాలను వాస్తవాల్లా స్వీకరిద్దాం. 2) నేను భారతసైన్యాన్ని తక్కువ చేసి రాయలేదు. సైన్యాధిపతి దృక్పథం, దేశాధిపతి దృక్పథం ఒకలా వుండవని అన్నానంతే!

ఇందిరా గాంధీ 1966 నుండి 1977 వరకు ఏకధాటీగా 11 ఏళ్లు పాలించింది. తర్వాత మళ్లీ 1980 నుండి 1984 వరకు. ఆమె రాజకీయ సిద్ధాంతం ఏమిటి? నా దృష్టిలో సిద్ధాంతం లేదు, రాజకీయం మాత్రమే వుంది. ఆమె ఒకసారి చెప్పుకుంది - 'మా నాన్న రాజకీయవేత్త (స్టేట్స్‌మన్‌), నేను రాజకీయనాయకురాలిని (పొలిటీషియన్‌)' అని. ఆమె అవసరం బట్టి ఒక్కోసారి లెఫ్ట్‌కు, మరోసారి రైట్‌కు మళ్లింది. మరోసారి సెంటర్లో వుండిపోయింది. ప్రజల్లో పాప్యులారిటీ ఎలా సంపాదించాలన్నదే ఆమె లక్ష్యం. ఆమెకు కొందరు కమ్యూనిస్టు నాయకులతో వ్యక్తిగతమైన స్నేహం వుంది కానీ కమ్యూనిజమంటే పడదు. ప్రపంచంలో తొలిసారి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కమ్యూనిస్టు ముఖ్యమంత్రి నంబూద్రిపాద్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెసు అధ్యక్షురాలి హోదాలో ఆందోళన చేపట్టింది. కాంగ్రెసులోని రైటిస్టు నాయకుల ద్వారా తండ్రిపై ఒత్తిడి తెచ్చి దాన్ని రద్దు చేయించి, తండ్రికి మాయనిమచ్చ తెచ్చింది. అధికారంలోకి వస్తూ తన తండ్రి ఆశయాలకు పూర్తి విరుద్ధంగా అమెరికాకు దాసోహమంది. దాని కారణంగా దేశ ఆర్థికపరిస్థితి నాశనం కావడంతో బిత్తరపోయింది. తర్వాతి రోజుల్లో తనను పైకి తెచ్చిన కాంగ్రెసు నాయకులను దెబ్బ తీయడానికే వాళ్ల రైటిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెసులోని సోషలిస్టులను, కమ్యూనిస్టులను సోషలిజం పేరుతో ఆకట్టుకుంది. కొంతకాలం సోషలిజంతో వూరేగి ప్రజల్లో పాప్యులారిటీ పెరిగాక  కమ్యూనిస్టు వ్యతిరేకి ఐన తన కొడుకు సంజయ్‌ గాంధీని పైకి తీసుకుని వచ్చింది. ఎమర్జన్సీ కాలంలో ఏ యిజానికి కట్టుబడకుండా తన కిష్టం వచ్చినట్లు పాలించింది. అధికారానికి దూరంగా వున్న కాలంలో, తర్వాత 1980లో మళ్లీ అధికారానికి తిరిగి వచ్చిన కాలంలో ఆమె సంజయ్‌ చెప్పినట్లే వింది. సోషలిజం పేరును వాడుకుంటూ పబ్బం గడుపుకుంది. కానీ పూర్తి రైటిస్టుగా మాత్రం మారలేదు. ఎందుకంటే 1966 రూపాయి విలువ తగ్గించడం అనుభవం ఆమెకు చాలా నేర్పింది.

రూపాయి విలువ తగ్గిస్తే ఎగుమతులు పెరుగుతాయని, దిగుమతులు తగ్గుతాయని అమెరికా, వరల్డ్‌ బ్యాంకు చెప్పిన మాటలను శాస్త్రి  పూర్తిగా విశ్వసించి, తగ్గించడానికి ఒప్పుకున్నారు. శాస్త్రి మరణం తర్వాత నీ పరిస్థితి ఏమిటని అమెరికావారు ఇందిరను కదలేశారు. నెహ్రూ కూతురు కాబట్టి అమెరికాకు ఆమెపై సందేహాలున్నాయి. కానీ దేశంలో ఆహారధాన్యాల కొరత ఎదుర్కోవాలంటే అమెరికా సహాయం తప్పదని ఇందిరకు తోచింది.  1964-65లో 89 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి 1965-66 నాటికి 76కి పడిపోయింది. కేరళ, బెంగాల్‌లలో బియ్యం కోసం రేషన్‌ షాపులపై దాడులు జరుగుతున్నాయి. విదేశీ సాయం లేనిదే గట్టెక్కలేమని అందరూ గ్రహించారు. రష్యా మనకు ఎంత మిత్రదేశమైనా ఆదుకునేటంత ఆర్థికస్తోమత వాళ్లకు లేదు. కృశ్చేవ్‌ పాలించేరోజుల్లో అక్కడకు వెళ్లిన భారతమంత్రులతో అతను అన్నాట్ట - ''మేం ఐశ్వర్యవంతులం కాము. అమెరికా నుండి రాబట్టుకోగలిగినంత రాబట్టుకోండి. మాతో సఖ్యంగా వుండండి.'' అని. అయితే అమెరికా అప్పనంగా ఏదీ యివ్వదు. తాము చెప్పిన షరతులకు లోబడాలంటుంది. ఆ షరతులు తమ వ్యాపారప్రయోజనాలకు అనుకూలంగా వుంటాయి తప్ప మన దేశప్రయోజనాలకు అనుగుణంగా వుండవు. అమెరికా అధ్యక్షుడు లిండన్‌ బి. జాన్సన్‌ ఇందిరను వాషింగ్టన్‌కు వచ్చి మాట్లాడమన్నాడు. వెళ్లాక 3.5 మిలియన్‌ టన్నుల ధాన్యాలు యిస్తామని చెప్పాడు. తక్కినదేశాలు కూడా యివ్వాలని సిఫార్సు చేశాడు. ఇండియా తీసుకున్న ఋణాలను తిరిగి చెల్లించే వ్యవధి పెంచేట్లా రీషెడ్యూల్‌ చేయమని సిఫార్సు చేశాడు. అమెరికన్‌ వ్యాపారవేత్తలు ఇండియాలో భారీగా పెట్టుబడులు పెడతామని ముందుకు వచ్చారు. (కానీ 51% వాటా కావాలన్నారు) భారత పరిశ్రమలకు కావలసిన ముడిసరుకు, విడిపరికరాలు యిస్తామన్నారు. ఇవన్నీ చెప్పి రూపాయి విలువ 36% తగ్గిస్తే ఏమీ లాభం లేదని 57.3% తగ్గిస్తే యీ లాభాలన్నీ అందుతాయని నచ్చచెప్పారు. ఇందిరకు వాళ్ల మాటలు నచ్చాయి. సరేననేసింది. 1966 జూన్‌లో ఆ మేరకు తగ్గించింది.

అమెరికాకు అత్యంత అనుకూలురైన స్వతంత్ర పార్టీ నాయకుడైన మీనూ మసానీ కూడా యింతటి తీవ్రమైన తగ్గింపుకు నిర్ఘాంతపోయాడు.  అమెరికా తన విధానాలను మనపై రుద్దుతోందని వాపోయాడు. సోషలిస్టులు, కమ్యూనిస్టుల మాట చెప్పనే అక్కరలేదు. అమెరికా నుండి తిరిగి వస్తూ ఇందిర మాస్కోలో దిగినప్పుడు రష్యన్లు స్పష్టంగా చెప్పారు. ''మీరు యిప్పటిదాకా జనపనార (జూట్‌), టీ మాత్రమే భారీగా ఎగుమతి చేస్తున్నారు. వాటి వలన వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. తక్కిన వాటిల్లో మీరు ఎగుమతి చేసేవి క్వాలిటీ పరంగా కానీ, వెరైటీ పరంగా కానీ అంతర్జాతీయ విపణిలో డిమాండ్‌ లేనివి. వాటిని చౌకగా లభ్యం చేసినా వాటిని ఎవరూ కొనరు. మీరు దిగుమతులు చేసుకునే వాటి ధర విపరీతంగా పెరిగి మీపై భారం ఎక్కువగా పడుతుంది'' అని. అక్షరాలా అదే జరిగింది. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశమంతా గగ్గోలు పుట్టింది. దాంతో విలువ తగ్గించాలంటూ అప్పటివరకు వాదించిన మంత్రులు అశోకా మెహతా, సి.సుబ్రహ్మణ్యం, వారితో గొంతు కలిపిన అధికారులు ఎల్‌కె ఝా, ఐజి పటేల్‌లు దీనికీ మాకూ ఏ సంబంధమూ లేదు అనడం మొదలెట్టారు. కాంగ్రెసు నాయకులందరూ కలిసి ఇందిరను, ఇందిరను ఆ స్థానంలో కూర్చోబెట్టిన కామరాజ్‌ను తప్పుపట్టారు. కామరాజ్‌ తను బయటపడడానికి కాంగ్రెసు పార్టీ సమావేశం ఏర్పరచి ఇందిరకు బద్ధశత్రువైన మొరార్జీకి మాట్లాడే ఛాన్సిచ్చాడు. మొరార్జీ ఇందిరను తూర్పారపట్టాడు. ఆ క్షణంలోనే కామరాజ్‌ నిశ్చయించుకున్నాడు. మొరార్జీని ఎలాగైనా కాబినెట్‌లోకి తీసుకుని వచ్చి ఇందిరకు ముకుతాడు వేయాలని, లేకపోతే పార్టీ ప్రతిష్ఠ మంటకలిసిపోతుందని. 

ఇందిరపై విమర్శలు వెల్లువెత్తాయి. విదేశాంగ శాఖలో సహాయమంత్రి, ఆమెకు వ్యక్తిగతంగా ఆత్మీయుడైన దినేశ్‌ సింగ్‌ ఆమె 'కిచెన్‌ కాబినెట్‌'లో సభ్యుడని, ఆమెను తప్పుదారి పట్టిస్తున్నాడని అనసాగారు. నాయకురాలు బలహీనపడడంతో  మంత్రులు, ఎంపీలు తమ డిమాండ్ల చిట్ఠాను ముందు పెట్టారు. 1965 యుద్ధసమయంలో శాస్త్రి సూచన మేరకు మంత్రులందరూ తమ జీతాల్లో 10% కోతకు అంగీకరించారు. యుద్ధం అయిపోయింది కాబట్టి ఆ కోత ఎత్తివేయమని వారడిగారు. తమకు అంబాసిడరు కార్లు పనికి రావని యింపోర్టెడ్‌ కార్లు కావాలనీ మరో కోరిక. చిన్న యిళ్లకు మారాలన్న సూచనను తిరస్కరించారు. సిబ్బందిని పెంచుకున్నారు. టూర్లు పెంచారు. ఫోను బిల్లులు, కరంటు బిల్లులు విపరీతంగా పెరిగాయి. ఇదేమని అడిగే స్థితిలో ప్రధాని లేదు. దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంతో అధికవేతనాల కోసం సమ్మెలు, ఘొరావులు పెరిగిపోయాయి. కార్మికసంఘాలు చెప్పాపెట్టకుండా సమ్మెకు దిగేవి. దేశమంతా అల్లకల్లోలం. ఇందిర ప్రభుత్వంపై కమ్యూనిస్టు పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. ప్రతిపక్షంలో వున్నా రైటిస్టు పార్టీ అయిన స్వతంత్ర పార్టీ ప్రభుత్వానికి దన్నుగా నిలబడింది. నిజానికి ఇందిర అధికారంలోకి వస్తూనే బిహార్‌ ఎసెంబ్లీలో 49 మంది స్వతంత్ర పార్టీ సభ్యులను తన పార్టీలో కలిపేసుకుంది. ఆ విధంగా నష్టపోయినా కాంగ్రెసు రైటిస్టు పార్టీగా మారుతోందని సంబరపడిన స్వతంత్ర పార్టీ మద్దతు యిచ్చింది. 

ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెసులో 'యంగ్‌ టర్క్‌స్‌' అనే ఓ చిన్న గ్రూపు ఇందిరను తమ విధానాలను అనుకూలంగా మలచుకుందామని చూసింది. వైబి చవాన్‌ ఆశీస్సులతో ఏర్పడిన యీ గ్రూపులో సభ్యులుగా చంద్రశేఖర్‌ (తర్వాతి రోజుల్లో జనతా పార్టీ అధ్యక్షుడు, ప్రధాని), కృష్ణకాంత్‌ (ఆంధ్రప్రదేశ్‌కు గవర్నరుగా, దేశ ఉపాధ్యక్షుడిగా చేశారు), మోహన్‌ ధారియా (కేంద్రమంత్రిగా చేశారు), రామ్‌ ధన్‌ వున్నారు. వీళ్లంతా సోషలిస్టు భావాలు కలిగి పియస్‌పి వంటి పార్టీలలోంచి కాంగ్రెసులోకి వచ్చినవారు. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు వంటివి వీరి డిమాండ్లు. 1963లో నెహ్రూ కాలం నాటికే రాజభరణాల రద్దు విషయంలో రెండు రకాల ఆలోచనాధోరణులున్నాయి. 'రాజులు ప్రజలను దోచుకోగలిగినంతకాలం దోచుకున్నారు. ప్రభుత్వం వాళ్ల అధికారాన్ని తీసుకుంది కానీ రాజభవనాలు, ఆస్తిపాస్తులు తీసేసుకోలేదు. ఏటేటా వారికి ప్రజల నుంచి సేకరించిన పన్నుల్లోంచి భరణాలు ఎందుకు చెల్లించాలి?' అని ఒక వాదన. 'ప్రస్తుతం దానికోసం ఖర్చవుతున్నది  ఏటా రూ. 5 కోట్లు. దేశ బజెట్‌లో చూస్తే అది చాలా చిన్న మొత్తం. రాజుగారు చనిపోతే వారి వారసులకు 50% భరణం యిస్తే చాలని ఒప్పందం. ఆ లెక్కన భారం క్రమంగా తగ్గుతూ పోతుంది. దాని కోసం కక్కుర్తి పడి రద్దు చేస్తే 1948లో ప్రభుత్వం వారితో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. ప్రభుత్వానికి పరపతి పోతుంది. ప్రపంచంలో ఎవరూ భారతదేశం మాట నమ్మరు.' అని మరో వాదన. మొరార్జీ రెండో వాదన గట్టిగా వినిపించేవారు. ఈ విషయం యిలా నానుతూండగానే యంగ్‌ టర్కులు వైబి చవాన్‌ ప్రోద్బలంతో 1967 నాటి కాంగ్రెసు సమావేశంలో మొరార్జీని రైటిస్టు శక్తిగా దుయ్యబట్టి హఠాత్తుగా రాజభరణాల రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గందరగోళంలో వుండగానే అది ఆమోదం పొందింది. ఈ పరిస్థితుల్లో 1967 సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. (సశేషం) (ఫోటో వైబి చవాన్‌)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015) 

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?