Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 38

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 38

జవాబులు - హక్సర్‌ పేరు హస్కర్‌ అని తప్పు రాశాను. ఎత్తిచూపినవారికి ధన్యవాదాలు.

పబ్లిక్‌ సెక్టార్‌, ప్రైవేట్‌ సెక్టార్‌ రెండింటిలో ఏది మంచిది అనేదానిపై చాలా చర్చలు సాగుతూ వుంటాయి. సర్కారు కొలువు అనగానే జాబ్‌ సెక్యూరిటీ ఎక్కువగా వుంటుందని, డెలివర్‌ చేయవలసిన సమయం గురించి కానీ, క్వాలిటీ గురించి కానీ పట్టించుకోరని, నష్టం వచ్చినా ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి, సేల్స్‌ గురించి వర్రీ కారని అందువలన పబ్లిక్‌ సెక్టార్‌ అంటే ప్రభుత్వధనం దుర్వినియోగం తప్ప మరొకటి కాదని కొందరి అభిప్రాయం. అందువలన సాధ్యమైనంత మేరకు పబ్లిక్‌ సెక్టార్‌లను మూసివేసి పరిశ్రమలను, వాణిజ్యాన్ని ప్రతిభకు పట్టం కట్టే ప్రైవేటు పరం చేయాలని వారి వాదన. ఇటీవలి కాలంలో యీ ఆలోచనా ధోరణి బాగా ప్రబలింది కాబట్టి యిది సమంజసమైన ఆలోచన అని యీనాటి యువతకు తోచడంలో ఆశ్చర్యం లేదు. కానీ యిక్కడ పరిగణించవలసిన అంశాలు కొన్ని వున్నాయి. ప్రైవేటు సెక్టారుకు లాభార్జన తప్ప మరో లక్ష్యం వుండదు. పెట్టిన పెట్టుబడికి వెంటనే, హెచ్చు మొత్తంలో రిటర్న్‌ రావాలి అనే దృష్టితోనే వారి ప్రణాళికలుంటాయి. ఆ దృష్టి లేకపోతే అది మనజాలదు. హెచ్చు పెట్టుబడి అవసరం పడే దీర్ఘకాలిక ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టడానికి ప్రయివేటు కంపెనీ వాటాదారులు సిద్ధపడరు. అధికోత్పత్తి  చేయగల అవకాశం వున్నా, దానికి మార్కెటు ధర పెద్దగా లేకపోతే ఉత్పత్తి ఆపేస్తుంది ప్రయివేటు రంగం. ఉదాహరణకి పెట్రోలు నిక్షేపాలు అపారంగా వున్న బావి తమ చేతిలో వున్నా అంతర్జాతీయంగా పెట్రోలు ధర కిట్టుబాటుగా లేకపోతే ప్రయివేటు రంగం పెట్రోలు తీయడాన్ని జాప్యం చేస్తుంది - అవతల ధర పెరిగేవరకూ! అదే పబ్లిక్‌ సెక్టారైతే పెట్రోలు దిగుమతి తగ్గించే ఉద్దేశంతో పెట్రోలు ఉత్పాదన కొనసాగిస్తుంది. 

రైల్వే పబ్లిక్‌ సెక్టార్‌లో వుంది, దాన్ని ప్రయివేటు రంగానికి అప్పగిస్తే ఏమవుతుంది? డిమాండ్‌ పెద్దగా లేని మార్గాలలో రైళ్లు నడపడం మానేస్తారు, లేదా తగ్గించి వేస్తారు. అదే పబ్లిక్‌ సెక్టార్‌లో వుంటే లెక్కలు వేరేగా వుంటాయి. ఉదాహరణకి ఈశాన్య ప్రాంత ప్రజలకు తక్కిన  ప్రాంతాలతో రాకపోకలు పెంచి వారిని జనస్రవంతిలో కలిసేట్లా చేయాలంటే రైలు మార్గం వేయాలి అని ప్రభుత్వం నిర్ణయించి, అమలు చేయిస్తుంది. కొంకణ ప్రాంతంలో రైల్వే మార్గం వేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఆ మార్గంలో వచ్చే ఆదాయంతో ఆ పెట్టుబడి తిరిగి రాబట్టడానికి  రెండు, మూడు దశాబ్దాలు పడతాయి అన్నా పబ్లిక్‌ సెక్టార్‌ చేయిస్తుంది, ప్రయివేటు సెక్టార్‌ చేయదు. రైల్వే ఎన్నో రకాలుగా సామాజిక బాధ్యత తలకెత్తుకుంటుంది. వృద్ధులకు, వికలాంగులకు, స్వాతంత్య్రయోధులకు, విద్యార్థులకు రాయితీలు, కారుణ్య నియామకాలు,  సిబ్బంది నియామకంలో రిజర్వేషన్లు, యిలా అనేక రకాలుగా భారాన్ని మోస్తుంది. ప్రయివేటు రంగానికి ఆ బాధ్యతలు వుండవు. పరిశ్రమల వద్దకు వస్తే ఏ పరిశ్రమైనా ఎదగాలంటే రిసెర్చి, సిబ్బంది తర్ఫీదు చాలా ముఖ్యం. పబ్లిక్‌ సెక్టార్‌ వాటిపై సమయాన్ని, ధనాన్ని వెచ్చిస్తుంది. రిసెర్చి అనేది చాలా సమయం తినేస్తుంది. ఫలితాలు ఎలా వుంటాయో ఎవరికీ తెలియదు. పబ్లిక్‌ సెక్టార్‌కు లాభమే పరమావధి కాదు కాబట్టి కొన్ని నిధులు దానికి కేటాయిస్తుంది. ప్రయివేటు సెక్టార్‌ రిసెర్చిపై పెట్టుబడి పెట్టదు. ఇటీవలే హైదరాబాదులోని నైపర్‌కు వచ్చిన కేంద్రమంత్రి వాపోయారు - స్వాతంత్య్రం వచ్చి యిన్నాళ్లయినా మన దేశం జనరిక్‌ ఔషధాలు మాత్రమే తయారుచేస్తోంది తప్ప ఒరిజినల్‌ రిసెర్చి ఏదీ చేయలేదని. ప్రయివేటు ఔషధరంగంలో దిగ్గజాలు ఎన్నో వున్నాయని గర్వపడాలా? ఈ పరిస్థితి చూసి బాధపడాలా? రిసెర్చికి కేటాయిస్తే టాక్స్‌ రిబేట్లు యిస్తామంటే రిసెర్చి లాబ్స్‌కై స్థలాలు కొన్నామంటూ పరోక్షంగా రియల్‌ ఎస్టేటు ఆస్తులు పెంచుకుంటున్నాయి కంపెనీలు. 

టీవీల విషయంలో చూశాం. పబ్లిక్‌ సెక్టారులోని ఇసిఐఎల్‌ ఇన్‌-హౌస్‌ రిసెర్చితో ఇసిటివి తయారుచేసింది. ప్రయివేటు రంగంలో చాలా కంపెనీలు విదేశాల నుంచి టీవీ సెట్లను దిగుమతి చేసుకుని వాటిని ఎసెంబుల్‌ చేసి తమ బ్రాండ్‌ స్టిక్కరు అతికించి మార్కెట్లోకి దిగిపోయారు. వీటినే 'స్క్రూడ్రైవర్‌ టెక్నాలజీ' అనే పేరుతో వెక్కిరించారు. గతంలో నకిలీ వస్తువులతో అసెంబుల్‌ చేసేసిన, క్వాలిటీ దైవాధీనం అయిన వస్తువులను 'జలంధర్‌ మాల్‌' అనేవారు. కొన్ని రంగాల్లో మాత్రమే ప్రయివేటు సెక్టార్‌ రిసెర్చ్‌ చేసింది. ఇందిర హయాంలో లైసెన్సు, పర్మిట్ల రాజ్యం నడిచినపుడు తమకు తగినంత స్వేచ్ఛ లేదని, అది వుంటే అదరగొట్టేద్దుమని అనేవారు. ఇప్పుడు గ్లోబలైజేషన్‌ జరిగాక, చైనా సామాన్ల ధాటికి మన ప్రయివేటు రంగం తోక ముడుస్తోంది. ఎగుమతుల, దిగుమతుల ఖాతాలో బాలన్సింగ్‌ అస్సలు కుదరటం లేదు. మన ప్రయివేటు రంగంలో ప్రొఫెషనలైజేషన్‌ వుండి వుంటే దిగుమతి అయిన వస్తువులతో ఎందుకు పోటీ పడలేకపోతున్నారు? దిగుమతులను నిషేధించాలని మళ్లీ లైసెన్సు, పర్మిట్ల రాజ్యం రావాలని ప్రయివేటు రంగం అడిగే పరిస్థితి వచ్చింది.  ఇప్పుడు విదేశీ పెట్టుబడులను అన్ని రంగాల్లో అనుమతిస్తున్నారు. ఆ పోటీలో ప్రయివేటు రంగం ఎక్కడ తేలుతుందో వేచి చూడాలి. చూడబోతే మన దేశంలో పబ్లిక్‌ సెక్టార్‌, ప్రైవేటు సెక్టార్‌ రెండూ అసమర్థతలో పోటీ పడుతున్నాయనిపిస్తుంది.

ఇక సిబ్బంది తర్ఫీదు విషయంలో కూడా ప్రయివేటు రంగం సాధ్యమైనంత వరకు పబ్లిక్‌ సెక్టార్‌లో పనిచేసిన వారికి హెచ్చు జీతాల ఆశ చూపించి తమ సంస్థల్లో చేర్చుకుంటారు. ప్రయివేటు హాస్పటల్లో కనబడే పెద్ద వైద్యులందరూ ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి వచ్చినవారే! తర్ఫీదు ఖర్చు పబ్లిక్‌ సెక్టార్‌ది, ప్రయోజనం సిద్ధించేది ప్రయివేటు సెక్టార్‌ది. పబ్లిక్‌ సెక్టార్‌ కొన్ని నియమాలకు లోబడి పనిచేస్తుంది. కార్మికుల సంక్షేమ చట్టాలు, భద్రతా చట్టాలు, పర్యావరణ చట్టాలు ఖర్చుకి వెనకాడకుండా అమలు చేస్తాయి. కానీ ప్రయివేటు సెక్టారు వీటిపై రాజీ పడుతుంది. ప్రభుత్వ అధికారులను మేనేజ్‌ చేసి, యీ చట్టాలను ఉల్లంఘిస్తుంది. పట్టుబడినపుడు జరిమానాలు కట్టి, త్వరలో అమలు చేస్తామని చెప్పి తప్పించుకుంటుంది తప్ప వీటిపై నిధులు వ్యయం చేయదు. ఉదాహరణగా చెప్పాలంటే గంగానది కాలుష్యానికి ప్రధాన కారణం గంగాతీరంలో వున్న పరిశ్రమలు తమ వ్యర్థాలను గంగానదిలో వదిలేయడమే. ఇంకో ఉదాహరణ మన రాష్ట్రంలో అసంఖ్యాకంగా వున్న ప్రయివేటు కాలేజీలు. మౌలిక వసతులు లేకుండా, బోధనా సిబ్బంది లేకుండా నడుపుతూ పట్టుబడినప్పుడు కోర్టులకు వెళుతూ, సౌకర్యాలు సమకూర్చుకోవడానికి సమయం కావాలని కోరుతూంటాయి. పబ్లిక్‌ రంగం వలన కొన్ని రకాల ప్రయోజనాలుంటే, ప్రయివేటు రంగం వలన కొన్ని ప్రయోజనాలున్నాయి. రెండిటికి మధ్య సహకారరంగం వుంది. అది కొన్ని రాష్ట్రాలలో బాగా పనిచేస్తోంది, కొన్ని రాష్ట్రాలలో రాజకీయాలతో భ్రష్టు పట్టింది. వాణిజ్యాన్ని ప్రయివేటు రంగానికి వదిలేసినా భారీ పరిశ్రమల రంగంలో పబ్లిక్‌ సెక్టార్‌ను సరిగ్గా పనిచేయనిస్తే, అది ప్రయివేటు రంగంతో సామర్థ్యం విషయంలో పోటీ పడుతూ ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి వుపయోగపడుతుందని మిక్సెడ్‌ ఎకానమీని ప్రతిపాదించిన నెహ్రూ ప్రభృతులు భావించారు. 

అయితే పబ్లిక్‌ సెక్టార్‌ సమర్థవంతంగా పనిచేయాలంటే ప్రభుత్వం సహకరించాలి. వ్యాపారపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో, కావలసిన నిపుణులను నియమించుకోవడంలో దానికి స్వేచ్ఛ నివ్వాలి. కానీ అలా యివ్వడానికి కేంద్రప్రభుత్వం నడిపేవారికి మనసు రాదు. తాము నిధులిస్తున్నాం కాబట్టి అది తమదే, తాము చెప్పినట్లే నడవాలి అనే భావన వారిది. అందువలన ఒక పట్టాన నిధులు విడుదల చేయకపోవడం, చేశాక అడుగడుగునా అజమాయిషీ చేయడానికి పూనుకోవడం, తమకు కావలసిన వారిని నియమించుకోవడానికి దాన్ని ఓ సత్రంగా మార్చుకోవడం - యివీ వారి లక్ష్యాలు. పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లపై పర్యవేక్షణకు పార్లమెంటు తరఫున ఒక స్టాచ్యుటరీ కమిటీ వుండాలని ఎంపీలు డిమాండ్‌ చేసినా నెహ్రూ వాళ్ల మాట తోసిరాజన్నాడు. 'పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థలు కాంపిటీటివ్‌ స్పిరిట్‌తో, స్వేచ్ఛగా, స్వతంత్ర ఆలోచనతో పనిచేయవలసిన సంస్థలు, వాటిని మరొక గవర్నమెంటు డిపార్టుమెంటుగా మార్చకూడదు.' అని వాదించేవాడు. నెహ్రూ పోగానే పద్ధతంతా మార్చేశారు. ఎంపీలు విజృంభించేశారు. పబ్లిక్‌ అండర్‌టేకింగ్స్‌ను తమ యిష్టారాజ్యంగా నడపసాగారు. ఎపాయింట్‌మెంట్స్‌లో, ప్రమోషన్లలో, బదిలీలలో, కాంట్రాక్టులలో అన్నిట్లో జోక్యం చేసుకోసాగారు. తాము అలా చేయడానికి సాకుగా పబ్లిక్‌ సెక్టార్‌లో జరిగిన పొరపాట్లను ప్రజలకు భూతద్దాలలో చూపించారు. ఈ విషయంలో అధికారపక్షాలు, ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. రాజకీయజోక్యంతో వాటిని భ్రష్టు పట్టించినదీ వారే, అవి సరిగ్గా పనిచేయటం లేదని చెప్పి వాటిని మూయించి, ప్రయివేటు సెక్టార్‌కు అప్పగించడానికి ప్రయత్నించినదీ వారే! చివరకు ప్రభుత్వం కూడా తమ ఆర్డర్లను పబ్లిక్‌ సెక్టార్‌కు కాకుండా ప్రయివేటు సెక్టార్‌కు యిచ్చేది. ప్రయివేటు సెక్టారు పెద్దలు రాజకీయ నాయకులతో సఖ్యం నెరపి, పార్టీలకు నిధులిచ్చి, చట్టాలను తమకు అనుకూలంగా మలచుకునేవారు. 

ప్రయివేటు సెక్టార్‌కు, రైటిస్టు భావజాలానికి అనుకూలమైన సిండికేటు కాంగ్రెసు నాయకుడు నిజలింగప్ప కాంగ్రెసు అధ్యక్షుని హోదాలో 1969 ఏప్రిల్‌లో జరిగిన కాంగ్రెసు సమావేశంలో పబ్లిక్‌ సెక్టార్‌పై విరుచుకుపడ్డాడు. భారీ పరిశ్రమల రంగం నుంచి పబ్లిక్‌ సెక్టార్‌ను తప్పించి వేయాలని పిలుపు నిచ్చాడు. 1968-69 సం||రంలో పబ్లిక్‌ సెక్టార్‌లో పెట్టిన పెట్టుబడి రూ.2500 కోట్లు కాగా వాటిల్లిన నష్టం రూ. 28 కోట్లు, దాన్ని ఉదహరిస్తూ నిజలింగప్ప తన వాదనను సమర్థించుకున్నాడు. నిజానికి కితం సంవత్సరం కంటె నష్టం రూ. 7 కోట్లు తగ్గింది. దీర్ఘకాలిక, భారీ ప్రాజెక్టులలో లాభాలు చాలా ఆలస్యంగా వస్తాయన్న అంశం కూడా వుంది. కానీ యివన్నీ నిజలింగప్పకు పట్టలేదు. పబ్లిక్‌ సెక్టార్‌ను మూతమూయించడమే అతని సహచరుల లక్ష్యం. (సశేషం) (ఫోటో -  నిజలింగప్ప)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015) 

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?