Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 40

కానీ ఇందిర అంతటితో ఆగలేదు. బ్యాంకులను జాతీయం చేయడం, మాజీ సంస్థానాధీశుల రాజభరణాలు రద్దు చేయడం వంటి చర్యలు చేపట్టి తనను సోషలిస్టుగా చూపించుకోవాలని పథకం రచించింది. ఇది ఆర్థికశాఖకు సంబంధించిన విషయం కాబట్టి మొరార్జీ అడ్డుపడడం ఖాయం. అందువలన ముందు అతన్ని తొలగించాలి. 'మొరార్జీ నమ్మిన మౌలిక సిద్ధాంతాలు భారత ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు విరుద్ధంగా వున్నాయి కాబట్టి ఆయన ఆర్థికమంత్రిగా కొనసాగడం భావ్యంగా లేదు' అంటూ అతని నుంచి ఆర్థిక శాఖ తను తీసేసుకుంది. ఉపప్రధాని పదవి అలాగే వుంచింది. తనను సంప్రదించకుండా యిలా చేయడాన్ని అవమానంగా భావించిన మొరార్జీ రాజీనామా చేశాడు. ఆమెకు కావలసినదీ అదే! వెంటనే జులై 21న  ఆర్డినెన్సుల ద్వారా 14 బ్యాంకులను జాతీయం చేసింది, రాజభరణాలు రద్దు చేసింది. ఈ నిర్ణయం గురించి కాబినెట్‌కు మొక్కుబడిగా తెలియపరిచింది. ప్లానింగ్‌ కమిషన్‌కు అదీ లేదు. 

జాతీయకరణకు ఎందుకింత ప్రాధాన్యత అంటే బ్యాంకింగ్‌ వ్యవస్థ గురించి కాస్త తెలుసుకోవాలి. తక్షణావసరం లేని వాళ్ల దగ్గర వున్న మిగులు డబ్బును సేకరించి అవసరం వున్నవాళ్లకు అప్పులిచ్చి వడ్డీ సంపాదించడమే బ్యాంకింగ్‌. డబ్బు అవసరం వున్న వ్యక్తిని గుర్తించడం, అతని ఆర్థిక స్తోమతను, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని, నిజాయితీని అంచనా కట్టడం, వసూలు చేసుకునే సాధనసంపత్తి కలిగివుండడం -  వడ్డీ వ్యాపారస్తుడికి తెలిసిన కళ. డబ్బు వుండడంతో బాటు ఆ కళ కూడా వుంటేనే మన దగ్గర వున్న డబ్బు మీద వడ్డీ సంపాదించవచ్చు. కానీ మనలో చాలా మంది దగ్గర కాస్తో కూస్తో డబ్బున్నా ఆ కళ వుండదు. అందుచేత మనలాటి వాళ్ల వద్ద డబ్బులు తీసుకుని మన తరఫున బ్యాంకు వడ్డీ వ్యాపారం చేసి వడ్డీ సంపాదించి దానిలోంచి మనకు కాస్త యిస్తుంది. సొంతంగా వడ్డీ వ్యాపారం చేయలేం కాబట్టి మనం బ్యాంకుల మీద ఆధారపడతాం. మన దగ్గర నుంచి తీసుకుని దాచిన డబ్బుకి (డిపాజిట్‌ అంటారు) కాలపరిమితి బట్టి 4-10%  వరకు బాంకులు వడ్డీ యిస్తాయి. అలా సేకరించిన డబ్బును ఋణం అవసరం వున్నవారికి 12-18% (ఈ అంకెలన్నీ ఉదాహరణగా యిస్తున్నవే) వడ్డీకి అప్పిస్తాయి. వడ్డీల మధ్య వుండే సుమారు 8% తేడాయే బ్యాంకులకు ఆదాయం. దానిలో బ్యాంకు నిర్వహణకు 6-7% పోతే మిగిలినది లాభమన్నమాట. అయితే బ్యాంకులు సరైనవారికి ఋణాలు యివ్వకపోయినా, వసూలు చేయకపోయినా, ఋణగ్రహీతలు తాకట్టుగా పెట్టిన ఆస్తులకు విలువ తరిగిపోయినా లాభం తగ్గిపోతుంది, నష్టం వాటిల్లుతుంది కూడా. సేకరించిన ధనంలో బ్యాంకులు ఏ మేరకు అప్పులివ్వాలి, ఏ యే జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు రిజర్వ్‌ బ్యాంకు పర్యవేక్షిస్తుంది. 

ఈ వ్యవస్థను కొన్ని పెద్దపెద్ద వ్యాపారసంస్థలు తమకు అనుకూలంగా మలచుకున్నాయి. ఉదాహరణకు బిర్లాలు వున్నారు. పరిశ్రమలు పెట్టడానికి వారికి మూలధనం కావాలి. దాన్ని కనీసం రూపాయి వడ్డీకి తేవాలి. షేరు మార్కెటు ద్వారా నిధులు సేకరిద్దామంటే బోల్డు తతంగం వుంది. కంపెనీ బాగా నడిచి లాభాలు చూపించకపోతే షేర్లు అమ్ముడుపోవు. అందువలన వాళ్లు యునైటెడ్‌ కమ్మర్షియల్‌ బ్యాంక్‌ (యుకో బ్యాంక్‌)  అని పెట్టారు. ప్రజల నుంచి తక్కువ వడ్డీకి డిపాజిట్లు సేకరించి, వాటిని తమ సంస్థలకే ఋణాలుగా యిచ్చేవారు. బ్యాంకు వారిదే కాబట్టి పూచీకత్తులు, తాకట్టులు వంటి వాటిల్లో చూసీచూడనట్లు పోవచ్చు. మరీ కొంప మునిగితే తప్ప రిజర్వ్‌ బ్యాంక్‌ దృష్టి వారిపై పడదు. ఇలా పెద్ద పెద్ద ఋణాలన్నీ వారే తీసుకున్నాక, వారితో బాటు కొంతమంది మామూలు వ్యాపారస్తులకు కూడా ఋణాలు యిచ్చేవారు. వారికి డబ్బు కావాలంటే కొత్త బ్రాంచ్‌లు తెరిచి మరిన్ని నిధులు సేకరించేవారు. బిర్లాలు ఒకరే కారు, ప్రతీ పెద్ద బిజినెస్‌ హౌస్‌ విడిగా కానీ, కొంతమందితో కాని కలిసి బ్యాంకులు పెట్టేవారు. కొన్ని సందర్భాల్లో ఒకే కులానికి లేదా ఒకే మతానికి చెందిన వారు కలిసి బ్యాంకులు పెట్టారు. ఆ బ్యాంకులో భారీ ఋణాలన్నీ వారికే యిస్తారు. ఇప్పటికీ ప్రయివేటు బ్యాంకుల్లో యీ ధోరణి కనబడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ మధ్య అనేక ప్రయివేటు బ్యాంకులు దివాలా తీయడానికి కారణం యిదే. ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి తమకు కావలసినవారికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోకుండా అప్పులిచ్చేశారు. వాళ్లు చేతులెత్తేస్తే వీళ్లు బోర్డు తిప్పేస్తారు. డబ్బు దాచుకున్నవారి పని గోవిందే. ఇలా అనేక బ్యాంకులు మూతపడ్డాయి.

మూతపడకుండా సవ్యంగా నడుస్తున్న పెద్ద బ్యాంకుల సంగతి తీసుకుంటే వాటిని డబ్బున్నవాళ్లే వుపయోగించుకునేవారు. సామాన్యులకు బ్యాంకు ఋణం అంటే అందరాని చందమామే. ఇప్పుడు చెపితే ఆశ్చర్యంగా వుంటుందేమో కానీ జాతీయకరణకు ముందు సామాన్యుడికి బ్యాంకులో సేవింగ్స్‌ ఖాతా అంటే అబ్బురం. డబ్బు దాచుకుందామనుకునేవారికి పోస్టాఫీసే గతి. బ్యాంకు లోను తీసుకుని యిల్లు కట్టుకోవడం, ఫర్నిచర్‌, వాహనాలు కొనుక్కోవడం, పై చదువులు చదవడం అనేవి ఎవరూ వూహించలేదు. వ్యాపారస్తులు, ఉన్నతోద్యోగులు తప్ప తక్కినవారు బ్యాంకు జోలికి వెళ్లేవారే కాదు. స్టేటు బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకులు మాత్రమే గవర్నమెంటు బ్యాంకులు. గవర్నమెంటుకు సంబంధించిన చలానులు కట్టించుకునేవి. వాటికి మాత్రమే మామూలువాళ్లు వెళ్లేవారు. అన్ని బ్యాంకులను జాతీయకరణ చేసి బ్యాంకులపై పారిశ్రామిక సంస్థల పట్టు సడలించి, ఋణాలను చిన్న వ్యాపారస్తులకు, వృత్తిపనివారికి, విద్యార్థులకు  లభ్యం చేసి అందరూ అభివృద్ధి చెందేట్లు చూడాలని కాంగ్రెసులోని సోషలిస్టులు వాదించేవారు. ఆ మేరకు ఎన్నిసార్లు తీర్మానాలు చేసినా, వాటిని కాంగ్రెసులోని రైటిస్టులు, బ్యాంకులపై తమ పట్టు పోతుందని భయపడిన పెట్టుబడిదారులు అమలు కానీయలేదు. ఇప్పుడు ఇందిర తన రాజకీయ అవసరాల కోసం ఆ పని చేసింది. బ్యాంకుల జాతీయకరణ ప్రభావం ఎలా వుంటుందనేది అప్పట్లో చాలామందికి అర్థం కాలేదు. ఇప్పటికి కూడా చాలామంది ప్రభుత్వబ్యాంకుల సర్వీసు బాగా వుండదని, ఆధునిక టెక్నాలజీ వుపయోగించే ప్రయివేటు బ్యాంకులను ప్రోత్సహించాలని వాదిస్తూ వుంటారు. వీరంతా ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాల వారే. పేదలు, దిగువ మధ్యతరగతివారికి, మధ్యతరగతివారికి ప్రభుత్వ బ్యాంకులే ఊపిరి పోశాయి. 

పాలకులు ఎప్పుడూ ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడుతూంటారు. ఇంటికో ప్రభుత్వోద్యోగం అని, చదువుకున్నవారందరికీ ఉద్యోగాలిస్తామనీ అమలు కాని హామీలు గుప్పిస్తారు. అన్ని ఉద్యోగాలు సృష్టించడం ఎవరి తరమూ కాదని జనాలందరికీ తెలుసు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే చాలు. వాళ్ల బతుకు వాళ్లు బతుకుతారు. జాతీయం చేసిన బ్యాంకులు అవే కల్పించాయి. రిక్షా, ఆటో, టాక్సీ, తోపుడుబండి కొనుక్కోవడానికి అప్పులిచ్చారు. చిన్న వర్క్‌షాపులు, సైకిలుషాపులు, దుకాణాలు, చిన్న వ్యాపారాలు చేసుకోవడానికీ యిచ్చారు. లాయర్లు, డాక్టర్లు, చార్టెర్డ్‌ ఎకౌంటెంట్లు ప్రాక్టీసు చేసుకోవడానికి ఋణాలిచ్చారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే రైతులకు వ్యవసాయ ఋణాలు లభించాయి. ఇవన్నీ వ్యక్తిగతమైనవైతే, పరిశ్రమల విషయంలో స్మాల్‌ స్కేల్‌ యిండస్ట్రీస్‌, కాటేజి యిండస్ట్రీస్‌ అని వర్గీకరించి వాటికి ప్రత్యేకమైన రాయితీలు కల్పించారు. ఇవన్నీ తక్కువ వడ్డీ రేటుకి, పెద్దగా పూచీకత్తు లేకుండా అప్పులివ్వడంతో  చదువుకున్నవారికి లేనివారికీ అందరికీ బతుకుతెరువు ఏర్పడి ఆదాయాలు పెరిగాయి. కొనుగోలు శక్తి పెరిగి వారు పెట్టి ఖర్చు వలన వస్తూత్పత్తి పెరిగింది. దేశంలో ఆర్థికాభివృద్ధికి అది దోహదపడింది. ఇదంతా  ముందుగా వూహించి జాతీయకరణ వ్యవహారాన్ని మొత్తాన్ని పార్టీ పేర కాకుండా ఇందిర పేర నడిపించిన ప్రతిభ హక్సర్‌ది. ఆలిండియా రేడియోలో ఇందిర పేరే మోగేట్లు చేశాడు. ప్రకటనలలో కాంగ్రెసు పేరు లేదు, మరో మంత్రి పేరు లేదు. ఆ ఘనతంతా పార్టీ ఖాతాలో కాకుండా ఇందిర ఖాతాలో పడేట్లు చేశాడు. అందువలన రాబోయే రోజుల్లో ఆమె ఏ వర్గంలో వుంటే అదే ప్రధాన పార్టీగా మారింది. 

ప్రకటన రాగానే ఇందిర యింటి ముందు రిక్షావాళ్లు, ఆటోవాళ్లు, విద్యార్థులు ఆమెను ఆకాశానికి ఎత్తివేస్తూ నినాదాలు చేశారు. ప్రదర్శనలిచ్చారు. ఆమె వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ''పేదల కోసం పనిచేయడానికి నేనొక్కత్తినే వున్నాను. కొందరు అడ్డుపడుతున్నారు, అయినా నేను లెక్క చేయడం లేదు. నా పోరాటం ఆపేది లేదు'' అంది. ఈ ప్రదర్శనలకు విపరీతంగా ప్రచారం కల్పించారు. ప్రజల మెదళ్లలో పేదల పక్షపాతిగా ఇందిర యిమేజి ముద్రితమై పోయింది. వాళ్లు ఆమెను 'ఇందిరమ్మ' అని పిలుచుకున్నారు. మేధావులు, విద్యావంతులు ఇందిర రాజకీయ కుట్రలను, నియంతృత్వాన్ని అసహ్యించుకున్నారు. ఆమె ఆర్థిక విధానాలను కూడా విమర్శించారు. కానీ పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, మహిళలు యివేమీ పట్టించుకోలేదు. వారామెను ఆరాధించారు, ఆమె వ్యతిరేకులను సందేహించారు. జాతీయకరణ చేసే మేలును వూహించలేక పోయిన లోపం సిండికేటు తదితర రైటిస్టు నాయకులది. దీనికి ప్రజలు మద్దతు పలకుతారని ఊహించిన వాణిజ్యవేత్తల సంఘం - ఫిక్కి (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ) ఖండించడానికి దడిసి ఏమీ వ్యాఖ్యానించకుండా వూరుకుంది. గుజరాతీలు ఎక్కువగా వున్న ఇండియన్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ మాత్రం మొరార్జీని ఆర్థికశాఖనుండి తొలగించినందుకు, బ్యాంకులను జాతీయం చేసినందుకు ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ప్రకటన చేసింది. సిండికేటు నాయకులు జాతీయకరణను ఆహ్వానించక పోవడం చేత ప్రజల్లో వారిపై నిరాదరణ కలిగి, ఇందిర పలుకుబడి హఠాత్తుగా పెరగడం గమనించిన ఎంపీలు కొందరు అధ్యక్ష ఎన్నికలలో ఆమెకు అనుకూలంగా మారారు. (సశేషం) ఫోటో - పి ఎన్‌ హక్సర్‌

 - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2015)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?