Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 44

ఆమె సూచనను రాష్ట్రపతి గిరి ఆమోదించడంతో అది సాధ్యపడింది. ఆ తర్వాత ఆమె ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగింది. ఆపద్ధర్మ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోకూడదన్న నియమాన్ని ఉల్లంఘించి బిహార్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో గవర్నర్లను నియమించింది. కోట్లాది రూపాయల విలువైన లైసెన్సులు జారీ చేయించింది. ఆల్‌ ఇండియా రేడియోను,  ప్రసార శాఖను తనను ఆకాశానికి ఎత్తివేయడానికి ధారాళంగా వినియోగించుకుంది. ఆమెను గట్టిగా విమర్శించడం ప్రతిపక్షాలకు  వీలు పడలేదు. ఎందుకంటే వాళ్లూ రాష్ట్రాలలో చేస్తున్నది అదే! 

ఎన్నికలలో యిరుపక్షాల మోహరింపు ప్రారంభమైంది. సిపిఐ కాంగ్రెసు(ఆర్‌)తో కలిసి కూటమిగా ఏర్పడదామనుకుంది. కానీ ఇందిరకు అది యిష్టం లేదు. అవతల పాత కాంగ్రెసువారు ఆమెను యిప్పటికే కమ్యూనిస్టు అంటున్నారు. భారతీయుల్లో దాదాపు అందరూ దేవునిపై నమ్మకం వున్నవారే. దేవుడు లేడని, మతం మత్తుమందని ప్రచారం చేసే కమ్యూనిస్టులు ప్రజాదరణ చూరగొనడం అతి కష్టమని ఆమెకు తెలుసు. వారితో పొత్తు పెట్టుకుంటే తనకూ యిబ్బంది వస్తుందనుకుంది. అందువలన కేవలం అవగాహనతో సరిపెట్టింది. ప్రాంతీయవాదం, మతతత్వం వున్న ప్రాంతీయ పార్టీలతో అవగాహనకు ఆమె సంకోచించలేదు. ఎందుకంటే అది స్థానికంగానే వుంటుంది. దేశమంతా ప్రభావితం చేసే పరిస్థితి లేదు. పంజాబ్‌లో అకాలీ దళ్‌కు 5 సీట్లు యిస్తానంటే వాళ్లు 7 అడిగారు. పొత్తు కుదరలేదు. కేరళలో ముస్లిం లీగుతో పొత్తు పెట్టుకుంది. అది మతతత్వ పార్టీ కదా అంటే అబ్బే సెక్యులరే అందామె. 1970 ఏప్రిల్‌లో పాల్‌ఘాట్‌లో జరిగిన వారి సమావేశంలో పాకిస్తాన్‌ అధ్యక్షుడి ఫోటోలు తగిలించారు అని ఎత్తి చూపినా పట్టించుకోలేదు. ఆమె లక్ష్యమంతా సొంతబలంతో మళ్లీ అధికారంలోకి రావడమే. మనుగడకు ఎవరి మీద ఆధారపడకూడదు. పార్టీలో తన మాటే చెల్లుబాటు కావాలి. అందువలన సహచరుల మాట కూడా కొంత మేరకే మన్నించింది. 

పాతకాంగ్రెసు రైటిస్టు పార్టీ అయిన స్వతంత్రతో, మతతత్వపార్టీగా ముద్ర పడిన జనసంఘ్‌తో చేతులు కలుపుదామంటూ  1970 జులైలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రతిపాదన చేస్తే చాలామంది కార్యకర్తలు వ్యతిరేకించారు. కానీ నిజలింగప్ప వంటి నాయకులు ఇందిరను ఓడించాలంటే యీ పాటి రాజీ తప్పదు అని అందర్నీ ఒప్పించి ఆ మేరకు డిసెంబరులో లఖన్‌వ్‌లో జరిగిన సమావేశంలో తీర్మానం చేయించారు. దాన్ని గుజరాత్‌లోని పాత కాంగ్రెసు నాయకులు హర్షించలేదు. పార్టీ విడిచి పోతామన్నారు. అప్పుడు రాష్ట్ర నాయకత్వం 'ఆ ఏర్పాటు జాతీయ స్థాయికే పరిమితం. రాష్ట్రస్థాయిలో అలాటి పొత్తు వుండదు' అని హామీ యిచ్చి ఆపారు. నిజలింగప్ప సొంత రాష్ట్రం మైసూరులో కూడా వ్యతిరేకత వచ్చింది. బెంగుళూరు మునిసిపల్‌ ఎన్నికలలో పార్టీ ఓడింది. మొత్తానికి యీ ముగ్గురూ ఒక గూటి పక్షుల్లా తేలినా నాలుగో భాగస్వామి విషయంలో తర్జనభర్జనలు జరిగాయి. పాత కాంగ్రెసులో వున్న అశోకా మెహతా గతంలో సోషలిస్టు కాబట్టి తన మిత్రులున్న సంయుక్త సోషలిస్టు పార్టీని కూటమిలోకి తెద్దామన్నాడు. యుపి ముఖ్యమంత్రిగా వున్న సిబి గుప్తా రైటిస్టు యిమేజి వుంటే ఓటర్లను ఆకర్షించలేమనే భయంతో తన మిత్రుడు, ఎస్‌ఎస్‌పి నాయకుడు ఐన రాజ్‌ నారాయణ్‌ ద్వారా ఎస్‌ఎస్‌పిని కలుపుకుని వచ్చాడు. నాలుగు పార్టీలతో ''గ్రాండ్‌ ఎలయన్స్‌'' (మహా కూటమి) ఏర్పడింది. ఇంతలో ఎస్‌ఎస్‌పి చైర్మన్‌గా వున్న మధు లిమయే సిపిఎంతో పొత్తు పెట్టుకుందామని ప్రతిపాదించాడు. ఆ వార్త బయటకు రాగానే స్వతంత్ర పార్టీ అధ్యక్షుడు మీనూ మసానీ మండిపడ్డాడు. ''పోయి పోయి కమ్యూనిస్టులతో చేయి కలపడమా? నాన్సెన్స్‌'' అన్నాడు.

పార్లమెంటులో 19 సీట్లున్న సిపిఎం రైటిస్టు పార్టీలతో కలవలేదు, అదే సమయంలో బెంగాల్‌లో తమ ప్రభుత్వాన్ని కూలదోసిన ఇందిరతోను చేతులు కలపలేదు. అందువలన ఇందిరా గాంధీ సోషలిస్టు విధానాలను పార్లమెంటులో సమర్థించినా  ఎన్నికలలో ఎటూ మొగ్గకుండా విడిగా పోటీ చేసింది. మహా కూటమి ఇందిర విధానాలను ఘాటుగా విమర్శిస్తూనే సోషలిస్టు పథకాలను బలపరుస్తూ 10 అంశాల ఎజెండా తయారుచేసింది. ఆ సమావేశం చివర్లో కామరాజ్‌ 'ఇక్కడ ఎన్ని పాయింట్లు రాసినా మెయిన్‌ పాయింటు ఇందిరను తొలగించడమే' అని యాదాలాపంగా అన్నాడు. దాన్ని ఇందిర క్యాంప్‌ ఎన్నికల అంశంగా మార్చుకుంది. 'వాళ్లది ఒకటే సూత్రం - 'ఇందిరా హటావో', నాది ఒకటే మంత్రం - 'గరీబీ హటావో''' అని. గరీబీ హటావో నినాదం హక్సర్‌ కాయిన్‌ చేశాడంటారు. అది తారకమంత్రంలా పనిచేసింది. ఎన్నికల ప్రచారంలో మహా కూటమి నాయకులు  ఇందిరపై వ్యక్తిగతంగా విరుచుకుపడగా ఇందిర వారిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదు. తనంటే పడనివాళ్లంతా అభివృద్ధికి, పేదలకు విరోధులు అనే భావాన్ని ఓటర్లలో బలంగా చొప్పించింది. ఎన్నిక మొత్తం ఇందిర చుట్టూనే తిరిగేట్లా చేయగలిగింది. 8 వారాలపాటు సాగిన ఎన్నికల ప్రచారంలో ఇందిర స్టామినా బాగా తెలియవచ్చింది. ఆమె సూర్యోదయానికి ముందే లేచి అర్ధరాత్రి పొద్దు పోయేదాకా సభల్లో ప్రసంగిస్తూ, కార్యకర్తలతో ముచ్చటిస్తూ గడిపేది. 30వేల మైళ్లు విమానం ద్వారా, 3 వేల మైళ్లు రోడ్డు, రైలు ద్వారా కవర్‌ చేసింది. 410 ఎన్నికల సభల్లో 2 కోట్ల మందిని ఉద్దేశించి ప్రసంగించింది. ఇందిర తమకై ఏదో చేస్తూంటే హరాయించుకోలేని ధనికులు ఆమెకు వ్యతిరేకంగా జట్టుకట్టారు అనే సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ముఖ్యంగా పల్లెల్లో, పేదల్లో. 

ఈ మూడ్‌ గమనించి జగ్జీవన్‌ రామ్‌ 270-280 సీట్లు వస్తాయనుకున్నాడు. హక్సర్‌ ఇంటెలిజెన్సు బ్యూరో సహాయంతో లెక్కలు వేసి 310 వస్తాయన్నాడు. ఎన్నికల ఫలితాలు వచ్చాక చూస్తే ఇందిరా కాంగ్రెసు 43% ఓట్లతో 350 గెలిచింది. దానితో కలిసి పోటీ చేసిన పార్టీల్లో సిపిఐ 23 సీట్లు, డిఎంకె 22, ముస్లిం లీగు 4 గెలిచాయి. పొత్తు కుదుర్చుకోని అకాలీదళ్‌ 13 పోటీ చేసి ఒక్కటే ఒక్కటి గెలిచింది. ఇందిర పాప్యులారిటీని ఎప్పటిలాగ పత్రికలు గమనించలేకపోయాయి. పాత్రికేయులు పల్లెలలకు వెళ్లడానికి బద్ధకించి, నగరాల్లో, పెద్ద పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలతో బుర్లాడి యావత్తు ప్రజలు అలాగే అనుకుంటున్నారని కథనాలు రాస్తారు. మధ్యతరగతి ప్రజలకు వాళ్ల అంచనాలు, విలువలు వేరే వుంటాయి. వాటిని బాహాటంగా వెలిబుచ్చుతారు. చివరకు పోలింగు రోజున బద్ధకిస్తారు. దానికి పూర్తి విపర్యంగా పల్లె ప్రజలు, పేదలు నోరు విప్పరు. ఓటెవరికి వేస్తావని అడిగినా గడుసుగా జవాబులు చెప్తారు. చివరకు ఓటు ద్వారా తమ అభిప్రాయాలను తెలుపుతారు. ఇందిర నియంతృత్వ పోకడలు నచ్చని పాత్రికేయులు ఆమె ప్రజాదరణ విషయంలో ఎప్పుడూ తప్పుడు అంచనాలే వేశారు. 

మహా కూటమి 23% ఓట్లతో 49 గెలిచింది. విడిగా చూస్తే - పాత కాంగ్రెసు 239 సీట్లకు పోటీ చేసి 16 గెలిచింది. నిజలింగప్ప సొంత రాష్ట్రం మైసూరులో వున్న 27 సీట్లలో ఒక్కటి కూడా గెలవలేదు. ఇక్కడో విషయం చెప్పాలి. కాంగ్రెసు పార్టీ ఎన్నికల గుర్తు కాడి-జోడెద్దులు. జనాభాలో వ్యవసాయమే ముఖ్యవృత్తిగా కలవారు కోట్లాదిమంది వున్నారు కాబట్టి కాంగ్రెసు గుర్తు వాళ్లను ఆకట్టుకుంటోందని, అందుకే గెలుస్తోందని ప్రతిపక్షాలు వాదించేవి. ముఖ్యంగా మైసూరు రాష్ట్రంలో నందీశ్వరుణ్ని బసవణ్ణ పేరుతో ఆరాధిస్తారు కాబట్టి అక్కడ కాంగ్రెసు గెలుపుకు అదే కారణం అనేవారు. కాంగ్రెసు రెండుగా చీలే రోజుల్లో ఆ ఎద్దులు  చీలిపోయి, కాడి కింద పడేసి ఒకదానితో మరొకటి పోట్లాటకు దిగినట్లు కార్టూన్లు వేశారు. 1971లో కాంగ్రెసు (ఆర్‌)కు ఆవు-దూడ గుర్తు కేటాయించి, పాత గుర్తును పాత కాంగ్రెసుకి వుంచేశారు. అయినా పాత కాంగ్రెసు దేశమంతా ఓడిపోయింది. బసవణ్ణను ఆరాధించే మైసూరు రాష్ట్రంతో సహా! కామరాజ్‌, మొరార్జీ తప్ప సిండికేటు నాయకులందరూ ఓడిపోయారు. 154 మందిని నిలబెట్టిన జనసంఘ్‌కు 22 సీట్లు వచ్చాయి. అటల్‌ బిహారీ వాజపేయి యుపి వదిలేసి మధ్యప్రదేశ్‌కు మారి, గ్వాలియర్‌ మహారాణి సౌజన్యంతో గ్వాలియర్‌ నుంచి పోటీ చేశాడు కాబట్టి గెలిచాడు. స్వతంత్ర  పార్టీ 58కి పోటీ చేసి 8 గెలవగా, ఎసెఎస్‌పి 93 పోటీ చేసి 3 గెలిచింది. యుపిలో 85 సీట్లలో చరణ్‌ సింగ్‌ బికెడి పార్టీ 1 గెలిచింది, కాంగ్రెసు 73 సీట్లు గెలిచింది. విడిగా పోటీ చేసిన సిపిఎం కేరళ, బెంగాల్‌లలో బలంగా వుంది కాబట్టి 25 గెలిచింది. 

మహా కూటమిలో పక్షాలు ఓటమిని అంగీకరించలేక పోయారు. ఇందిర నెగ్గడానికి కారణం రష్యా నుంచి దిగుమతి అయిన 'మాయ సిరా' అనే వాదన మొదలుపెట్టారు. వాళ్ల వాదన ప్రకారం దేశంలో ప్రింటయిన అన్ని బ్యాలట్‌ పేపర్లపై ముందుగా రష్యా నుంచి దిగుమతైన ఒక రకం మాయసిరాతో ఇందిరా గుర్తయిన ఆవు-దూడపై కొంతమంది గుద్దేశారు. అది ఎన్నికల సమయంలో అదృశ్యంగా వుండి, వారం రోజులు పోయాక ఓట్లు లెక్కించే సమయంలో పైకి తేలింది. మరి ఓటరు గుద్దే ముద్ర సంగతేమిటి? ఒకే బ్యాలట్‌పై రెండు ముద్రలుంటే చెల్లదు కదా! అందువలన రష్యా నుంచి రెండో రకం యింకు కూడా దిగుమతైంది. దాన్నే అన్ని పోలింగు బూతులకు సప్లయి చేశారు. (ఇవిఎంలు మాత్రమే వాడడం తెలిసిన పాఠకుల కోసం పాత పద్ధతి ఎలా వుండేదో చెప్తున్నాను - ఓటరుకు చెక్క పిడి వున్న చిన్న రబ్బరు స్టాంపు యిచ్చేవారు. దానిపై స్వస్తిక లాటి గుర్తు వుంటుంది. దాన్ని పోలింగు అధికారి యింకు ప్యాడ్‌పై ఒత్తి ఓటరు చేతికి యిచ్చేవాడు. ఓటరు క్యూబికల్‌లోకి వెళ్లి ఓటు పత్రంపై తనకు నచ్చిన అభ్యర్థి గుర్తుపై దాన్ని ఒత్తి ఓటును నిలువుగా మడిచి - అడ్డంగా మడిస్తే ఆ స్టాంపు యింకో గుర్తుకు కూడా అంటుకుని ఓటు పనికి రాకుండా పోతుంది - బయటకు వచ్చి పెట్టెలో పడేసేవాడు. దాదాపు ఒక వారం రోజులు పోయాక ఆ పెట్టెలు తెరిచి ఏ గుర్తుకు ఎన్ని ఓట్లు పడ్డాయో లెక్కించేవారు) ఆ యింకు వారం రోజులకు తనంతట తనే మాయమై పోయింది. ఆ యింకుతో ఏ గుర్తుపై ఓటు వేసినా నిష్ఫలమే. మొదట్లో అదృశ్యపు సిరాతో వేసిన గుర్తే లెక్కింపు సమయంలో కనబడింది. 

ఇది వినడానికి చాలా అభూతకల్పనలా కనబడినా జనసంఘ్‌, స్వతంత్ర, పాత కాంగ్రెసు నాయకులలో కొందరు అతి సీరియస్‌గా తీసుకున్నారు. నానీ ఫల్కీవాలా వద్దకు వెళ్లి కేసు వేద్దామని అడిగితే ఆయన ''నేను టేకప్‌ చేయను'' అని చెప్పేశాడట. నిజానికి ఈ వాదనలో ఏ మాత్రం నిజం వున్నా తెలంగాణా ప్రాంతంలో ఇందిర హవాను తట్టుకుని తెలంగాణా ప్రజా సమితి 10 సీట్లు గెలిచి వుండేది కాదు. బెంగాల్‌లో సిపిఎం గెలిచి వుండేది కాదు. అసలు దేశంలో కోట్లాది బ్యాలెట్‌  పేపర్లపై యింకు ముద్రలు వేయడం రహస్యంగా సాగడం సాధ్యమా? సాధ్యమే అని వాదించాడు జనసంఘ్‌ నాయకుడు బలరాజ్‌ మధోక్‌. ఆయన రాసిన ఒక పుస్తకం (ఇండియా బిట్రేడ్‌ అనుకుంటా గుర్తు రావటం లేదు) నేను చదివాను. దానిలో ఈ పనిని కొందరు టీచర్లకు అప్పగించారని, వాళ్లలో అంతరాత్మ ప్రబోధం విని కొందరు తనకు ఉత్తరాలు రాసి యీ విషయాన్ని బయటపెట్టారని రాశాడు. తర్వాతి రోజుల్లో యిదో పెద్ద జోక్‌ అయిపోయింది. (సశేషం) ఫోటో - పాత, కొత్త కాంగ్రెసు గుర్తులు 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2015) 

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?