Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 46

బంగ్లాదేశ్‌ ఏర్పడ్డాక శరణార్థులు క్రమంగా వెనక్కి వెళ్లిపోసాగారు. కానీ 90 వేలమంది పాకిస్తాన్‌ యుద్ధఖైదీలు భారత్‌ జైళ్లల్లో వుండిపోయారు. ఈ సమస్య పరిష్కరించడానికి 1972 జూన్‌లో షిమ్లాలో కొత్తగా ప్రధాని ఐన భుట్టో, ఇందిర సమావేశమై ఒప్పందం చేసుకున్నారు. కార్గిల్‌ సెక్టార్‌ వంటి కొన్ని కీలకస్థానాలు తప్ప ఇండియా తను ఆక్రమించిన ప్రాంతాలను వదులుకుంది. శ్రీనగర్‌ను లేహ్‌ ప్రాంతానికి వెళ్లే మార్గం సురక్షితంగా వుండడానికి అది అవసరం. కశ్మీర్‌లో ప్రస్తుతం వున్న అధీనరేఖ (లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌)ను గుర్తించడానికి పాకిస్తాన్‌ ఒప్పుకుంది. మీరు బంగ్లాదేశ్‌ను గుర్తిస్తే యుద్ధఖైదీలను విడుదల చేస్తామని ఇండియా చెప్పింది. చివరకు 1973 ఆగస్టులో పాకిస్తాన్‌ గుర్తించింది. ఇందిర పాప్యులారిటీ ఆకాశానికి అంటింది. కేంద్రంలో ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది కాబట్టే యీ విజయం సాధించామని ప్రజలు అనుకున్నారు. రాష్ట్రాల్లో కూడా అలాటి సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడితే చింత లేదనుకున్నారు. ఇంతలో అనేక అసెంబ్లీలకు కాలపరిమితి పూర్తయి ఎన్నికలు వచ్చాయి. 

అంతకు ముందే పార్టీపై తన పట్టు పూర్తిగా బిగిద్దామనుకుంది. 52 మంది వున్న కాబినెట్‌లో 14 కొత్త మొహాలు తీసుకుంది. ఒకప్పుడు ఆత్మీయుడిగా వున్న దినేశ్‌ సింగ్‌ ఇందిర యీ స్థాయికి రావడానికి తన తెలివితేటలే కారణం అని చెప్పుకోవడంతో అతన్ని నిర్దయగా తీసేసింది. కాస్త వాచాలత్వం వున్న వికెఆర్‌వి రావుకూ అదే గతి. దినేశ్‌తో స్నేహం కారణంగా గుజ్రాల్‌కు శిక్ష పడింది. అతన్ని హౌసింగ్‌ శాఖకు బదిలీ చేసింది. అయినా గుజ్రాల్‌ స్నేహం కొనసాగించడంతో ఉమా శంకర్‌ దీక్షిత్‌ను హెల్త్‌ మినిస్టర్‌గా వేసి హెల్త్‌, హౌసింగ్‌ కలిపి ఒక శాఖ చేసి గుజ్రాల్‌ను దీక్షిత్‌కు సహాయకుడిగా చేసింది. దినేశ్‌తో మరో స్నేహితుడైన విద్యా చరణ్‌ శుక్లాను ఫైనాన్స్‌ నుంచి డిఫెన్స్‌ ప్రొడక్షన్‌కు వేసింది. ఫైనాన్స్‌ మంత్రిగా వున్న చవాన్‌ అడ్డుపడినా లాభం లేకపోయింది. నిజానికి చవాన్‌, జగ్జీవన్‌ రామ్‌ మాట విలువ లేకుండా పోయింది. సీనియర్లయినా వాళ్లకి ముందుగా మంత్రుల జాబితాను చూపలేదు. పార్టీ వర్కింగ్‌ కమిటీలో తీర్మానం ఏమీ లేకుండానే ఆమె జగ్జీవన్‌ రామ్‌ను పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేయమని చెప్పి, అతని స్థానంలో డి సంజీవయ్యను తెచ్చింది. జగ్జీవన్‌ రామ్‌ పదేళ్లపాటు యిన్‌కమ్‌టాక్స్‌ కట్టలేదు. రిటర్న్‌స్‌ ఫైల్‌ చేయలేదు. ఇందిర ఫైనాన్స్‌ శాఖకు యిన్‌చార్జిగా వుండగానే ఆ సంగతి బయటకు వచ్చింది. కేవలం మతిమరుపు వలన అలా జరిగిందని పైకి చెప్పుకున్నా, తనను కావాలనే ఇందిర అప్రతిష్ఠపాలు చేసిందని జగ్జీవన్‌కు కోపం వుంది. 'మీరు కాబినెట్‌ వదిలి గవర్నరుగా వెళతారా?' అని అడిగితే వెళ్లను అని చెప్పాడు. తన బలం క్షీణిస్తోందని గ్రహించిన చవాన్‌ కూడా కాబినెట్‌ సమావేశాల్లో నోరెత్తడం మానేశాడు. 

ఇలా కేంద్రంలో తను తప్ప వేరెవరూ బలంగా లేకుండా చేసిన తర్వాత రాష్ట్రాలలో బలంగా వున్న ముఖ్యమంత్రులను తొలగించి సొంత బలం లేకుండా అన్నిటికీ తనపై ఆధారపడే నాయకులను ముఖ్యమంత్రులుగా తెచ్చి పెట్టింది. పదవి కారణంగా వాళ్లు బలపడకుండా వారి ప్రత్యర్థులను నిరంతరం దువ్వేది. వాళ్ల వేధింపు భరించలేక ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చి ఇందిర వద్ద మొర పెట్టుకునేవాడు. అలా కాకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడితే అతన్ని తీసేసేది. ఈ విధంగా ఇందిర కాలంలో దేశం మొత్తం మీద బలమైన నాయకుడంటూ ఎవరూ మిగల్లేదు. ఆ నాయకత్వ లేమి యిప్పటివరకు దేశాన్ని పీడిస్తోంది. ఇందిర ఆ సమయంలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా బర్కతుల్లా ఖాన్‌ను తీసి ఎంఎల్‌ సుఖాడియాను, ఆంధ్రప్రదేశ్‌లో బ్రహ్మానంద రెడ్డి స్థానంలో పివి నరసింహారావును పెట్టింది. 

అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెసుకు అఖండ విజయం సిద్ధించింది. ఇందిరా కాంగ్రెసు అంటే సుస్థిరత అని నమ్మిన ప్రజలు ఆ పార్టీకి ఓట్లు కురిపించారు. మొత్తం 2722 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెసు 71% గెలిచింది. దాన్ని వెన్నంటి వున్న సిపిఐకు 4% సీట్లు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌, ఆసాం, బిహార్‌, గుజరాత్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, మైసూరు, పంజాబ్‌, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌లలో కాంగ్రెసు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. గోవా, మణిపూర్‌, మేఘాలయల్లో మాత్రం యితరులు అధికారంలోకి వచ్చారు. 

ఈ విజయం తలకెక్కిన ఇందిర జగ్జీవన్‌రామ్‌ను రాష్ట్రపతి చేద్దామనుకుని వివి గిరికి ఒక ప్రతిపాదన చేసింది. అనారోగ్య కారణాలతో ఆయన తప్పుకుంటే ఆయన కొడుకు, మధ్యప్రదేశ్‌ ఎంపీ అయిన శంకర గిరికి కేంద్రమంత్రి పదవి యిస్తానంది. ఈ బేరాలకు గిరి మండిపడ్డారు. నో అన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ పాత కాంగ్రెసులోని కార్యకర్తలు, చిన్న నాయకులందరూ ఈ కాంగ్రెసులోకి వచ్చేశారు. పార్టీ చీల్చేముందు కాంగ్రెసు ఎటువంటి జాడ్యాలు పట్టి పీడించాయో, యిప్పుడు యీ కాంగ్రెసునూ అవే పీడించాయి. అవే పేచీలు, అంతఃకలహాలు, పదవికోసం పాకులాటలు, అవినీతికి పాల్పడడాలు. సిద్ధాంతం కంటె స్వార్థానికి, ప్రజాసేవ కంటె పదవికి పెద్ద పీట వేశారు. ఆసాం, బిహార్‌, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, మైసూరు, ఒడిశా, త్రిపుర, ఉత్తర ప్రదేశ్‌, బెంగాల్‌లలో పార్టీ కలహాలు ఉధృతమయ్యాయి. ఇవన్నీ గమనించిన ఇందిర ఒక పాత్రికేయ గోష్టిలో తన పార్టీ గురించి యిలా చెప్పుకుంది - ''కాంగ్రెసులో చేరేవాళ్లు చాలా రకాలు - ఎప్పణ్నుంచో రాజకీయాల్లో వుంది కదాని కొందరు, ఏదో లబ్ధి చేకూరుతుందని కొందరు, అక్కడ వుంటే రక్షణ వుంటుంది కదాని యింకొందరు..! కొంతమందికి నిశ్చిత అభిప్రాయాలున్నాయి. కొందరికీ సిద్ధాంతాల గురించి పట్టింపు లేదు. ఏదో నడిచిపోతే చాలనుకుంటారు. అన్ని పార్టీల్లో యిలాటి జనాభా వున్నారు. వీరందరినీ కలగలపుకుని ప్రజలకు మేలు చేద్దామని చూస్తున్నాం. సాధించగలమో లేదో తెలియదు, ప్రయత్నం మాత్రం జరుగుతోంది. '' అంది. ఏమైతేనేం, 1973 నుంచి ఇందిర పాప్యులారిటీ తగ్గసాగింది.  (సశేషం) ఫోటో - షిమ్లా సమావేశంలో ఇందిర, భుట్టో 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2015) 

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?