Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40- 48

జవాబులు - ఒక పాఠకుడు 'మీరనే కాదు చాలామంది సూడో యింటలెక్చువల్స్‌ కాంగ్రెస్‌ను తిట్టినా, యీ డిజిటల్‌ యుగంలో కూడా దాన్ని ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు?' అని అడిగారు. నేను జరిగిన చరిత్రను చెప్పేవాణ్నే తప్ప సూడో లేదా జూడో యింటలెక్చువల్‌ని కాను.  కాంగ్రెసు చరిత్ర చెప్పేటప్పుడే ఆయనడిగిన పాయింటు విశదీకరించాను. కాంగ్రెసులో బహుళత్వమే దాని బలమూ, బలహీనతా! కాంగ్రెసును విమర్శిస్తూ రంగంలోకి దిగిన జాతీయ, ప్రాంతీయ ప్రతిపక్షాలన్నీ దాని అవలక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నాయి. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణలలో వున్న ప్రాంతీయపార్టీలని చూడండి - కుటుంబ పాలన, ప్రభుత్వం, పార్టీ ఒకే వ్యక్తి చేతిలో వుండడం, పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరపకుండా హై కమాండ్‌ నామినేట్‌ చేయడం, ఒకే వ్యక్తిచేతిలో అధికార కేంద్రీకరణ, ప్రతిఘటించిన వాళ్ల నోరు నొక్కడం - అన్నీ అవే ధోరణులు. కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం కనబడినపుడు ప్రజలు ఓసారి ఛాన్సిచ్చి చూస్తున్నారు. మోదీకి అలాగే యిచ్చారు. మంత్రులపై ఆరోపణలు వచ్చినపుడు ఆయనా కాంగ్రెసు బాటలోనే నడుస్తున్నాడు. ఇదే ధోరణి కొనసాగితే కాంగ్రెసుకు, బిజెపికి తేడా ఏముందని జనాలు నిరాశ పడతారు. 

 

ఇందిర మాత్రం యీ స్థితికి మీడియా, న్యాయవ్యవస్థ, ప్రతిపక్షం, విదేశీహస్తం (విదేశీహస్తం అంటూ ప్రతి చిన్నదానికి సిఐఏను నిందిచడం అప్పట్లో పెద్ద జోక్‌ అయిపోయింది)  కారణం అని చెప్తూ వుండేది. ఆమె మాటలు నమ్మినా నమ్మకపోయినా సమాజంలో కొన్ని వర్గాలు ఆమెనే అంటిపెట్టుకుని వున్నాయి. ఇది గమనించవలసిన అంశం. ఉత్తర భారతంలో గ్రామీణ ప్రాంతాల్లో వందలాది, వేలాది ఎకరాలుండే జమీందారీ వ్యవస్థ రద్దు చేశాక, కుటుంబానికి ముప్ఫయి, నలభై ఎకరాల ఆస్తి వుండే ధనిక రైతుల వర్గం ఒకటి బలం పుంజుకుంటూ వచ్చింది. గత రెండు దశాబ్దాలుగా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం, గ్రామీణ విద్యుత్‌ పథకాల ద్వారా, యిరిగేషన్‌ ప్రాజెక్టుల ద్వారా సాగునీటి లభ్యత పెరగడం, మార్కెటింగ్‌ అవకాశాలు పెరగడం వలన వారి స్తోమత పెరిగింది. వ్యవసాయ  కూలీలను అదుపు చేయడానికి తమ శక్తియుక్తులను ఉపయోగించేవారు. అయితే రైతు కూలీలు, భూవసతి లేని కౌలు రైతులు, చిన్న కమతాల వాళ్లు బ్యాంకుల ద్వారా ఇందిర అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై ఆమె వైపు మొగ్గారు. కూలీలు ఆమె పక్షం వహించడంతో, పెద్ద రైతులు ఆమెకు వ్యతిరేకంగా నిలిచిన పార్టీలకు, ఉద్యమాలకు మద్దతు యివ్వసాగారు. 

1973 ప్రారంభంలో ఆహారధాన్యాల ధరలు తగ్గించడానికి కేంద్రం ఆహారధాన్యాల హోల్‌సేల్‌ వ్యాపారాన్ని జాతీయం చేసింది. దళారులు లేకుండా రైతుల దగ్గర్నుంచి ప్రభుత్వం డైరక్టుగా కొని ప్రజలకు తక్కువ ధరలకు రేషన్‌ షాపుల ద్వారా అందిస్తుందని ప్రకటించింది. సరైన వ్యవస్థ ఏర్పరచకుండా హడావుడిగా చేపట్టిన చర్య యిది. పెద్ద రైతులు, దళారులు యీ పథకానికి గండి కొట్టదలచారు. రాత్రికి రాత్రి గోధుమలు, వరి మార్కెట్‌ నుండి మాయమై పోయాయి. ప్రభుత్వం చెప్పిన రేటుకు అమ్మడం యిష్టం లేక గోధుమ రైతులు ఉత్పాదన తగ్గించేశారు. దాంతో 1972లో 8.4 మిలియన్‌ టన్నుల గోధుమ సేకరించిన ప్రభుత్వం 1973లో 5.6 మిలియన్‌ టన్నులు మాత్రమే సేకరించగలిగింది. తక్కినదంతా బ్లాక్‌ మార్కెట్‌కు తరలి వెళ్లిపోయింది. రేషన్‌షాపుల్లో స్టాకులు వుండేవి కావు, బ్లాక్‌మార్కెట్‌లో హెచ్చు ధరలకు అమ్ముడుపోయేవి. బ్లాక్‌మార్కెటింగ్‌, అక్రమ నిల్వలు చేసే వ్యాపారులను అదుపు చేసేందుకు తగినంత మంది అధికారులు, పోలీసులు లేరు. పోలీసులు ఏ మాత్రం తణిఖీ చేయబోయినా వ్యాపారులు మండిపడేవారు. ఆ విధంగా వ్యాపారులు ఇందిరకు పూర్తి వ్యతిరేకమయ్యారు. వ్యాపారస్తులు, ధనికులు, మధ్యతరగతివారు, మేధావులు, యువత, విద్యార్థులు, నగరవాసులు ఇందిరను ఎంతలా ద్వేషిస్తే పేదలు, గ్రామీణులు ఆమెను అంతగా ఆదరించారు, ఎందుకంటే ప్రతిపక్షంలో వున్నవారెవరూ వారి విశ్వాసాన్నీ, అభిమానాన్నీ చూరగొనలేకపోయారు. కార్మికులలో కూడా సంఘటితరంగంలో వున్నవారు ఇందిరకు వ్యతిరేకంగా ఉద్యమించగా, అసంఘటిత రంగంలో వున్న అనేక రెట్ల మంది కార్మికులకు ఇందిర పట్ల అంత విముఖత లేదు. ఇందిర పాలనకు వ్యతిరేకంగా జెపి ఉద్యమం ప్రారంభించినప్పుడు అతను సోషలిస్టు అయినా గ్రామీణ ప్రాంతాల్లో స్పందన రాలేదు. అందుకే అతను విద్యార్థులను నమ్ముకోవలసి వచ్చింది. 

పరిస్థితిలోని సంక్లిష్టత అర్థం కావాలంటే అన్ని కోణాలలోంచి పరామర్శించాలి. భారతీయ ప్రజలందరూ ఇందిరను వ్యతిరేకించారనో, సమర్థించారనో తీర్మానించడం కుదరదు. జెపి ఉద్యమం ఉధృతంగా నడిచినప్పుడు మీడియా గంగవెర్రులెత్తి పోయింది. ఎందుకంటే మీడియా ఇందిరకు పూర్తిగా వ్యతిరేకంగా వుండేది. పైన చెప్పిన అంశాల్లో కులం కోణం కూడా వుంది. ధనిక, చిన్న తరహా రైతులు జాట్లు, పటేళ్లు, భూమిహార్లు వంటి మధ్యకులాలకు చెందినవారు. వారు ప్రతిపక్షాలను సమర్థించగా హరిజనులు, గిరిజనులు, మైనారిటీలు, అగ్రవర్ణాలు ఇందిరను సమర్థించాయి. అందుకే కాంగ్రెసు బలం పెద్దగా క్షీణించలేదు. ఉదాహరణ కావాలంటే - 1975లో ఎమర్జన్సీ విధించిన జూన్‌ నెలలోనే గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జెపి ఉద్యమానికి స్ఫూర్తి నిచ్చిన 1974 నాటి విద్యార్థుల నవనిర్మాణ్‌ ఉద్యమానికి రంగస్థలం గుజరాతే! అక్కడ ప్రతిపక్షాల కూటమి అయిన జనమోర్చా కంటె కాంగ్రెసుకు 7% ఓట్లు ఎక్కువగా అంటే 41% వచ్చాయి. అయితే సీట్ల దగ్గరకు వచ్చేసరికి 182 సీట్లలో కాంగ్రెసుకు 75 రాగా జనమోర్చాకు 87 వచ్చాయి! ఉత్తరాదిన యీ పరిస్థితి వుండగా దక్షిణాదిన ఇందిర ప్రభ ఎప్పుడూ వెలుగుతూనే వుంది. మధ్యతరగతి, మేధావులు, విద్యార్థులు తప్ప దాదాపు అన్ని వర్గాలూ ఇందిరకు అనుకూలంగానే వున్నాయి. గుజరాత్‌ నవనిర్మాణ్‌ ఆందోళన్‌, బిహార్‌లో జెపి ప్రారంభించిన సంపూర్ణ క్రాంతి ఉద్యమాలను సమీక్షించేటప్పుడు యీ అంశాలను గమనంలో వుంచుకోవాలి.

1972 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసు ఘనవిజయం సాధించింది. 168 స్థానాల్లో కాంగ్రెసుకి 140 రాగా పాత కాంగ్రెసుకు 16, జనసంఘ్‌కు 3, సిపిఐకు 1, ఇండిపెండెంట్లకు 8 వచ్చాయి. ప్రతిపక్షాలు చావుదెబ్బ తిని, మళ్లీ పుంజుకోవడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి. ముఖ్యమంత్రిగా గాంధేయుడైన ఘన్‌శ్యామ్‌ ఓఝాను ముఖ్యమంత్రిగా ఇందిరా గాంధీ ఎంపిక చేసింది. అయితే ఆ పదవి ఆశించి భంగపడిన చిమన్‌భాయ్‌ పటేల్‌ ఓఝాపై తిరుగుబాటు చేశాడు. అతని పోరు భరించలేక 16 నెలల తర్వాత 1973 జులైలో ఓఝాను దింపేసి చిమన్‌భాయ్‌కు అప్పగించింది. ఈ చిమన్‌భాయ్‌ దీర్ఘదర్శి, కార్యదక్షుడు, టక్కరి, పచ్చి అవకాశవాది. గుజరాత్‌కు జీవధార అనదగిన నర్మదా ప్రాజెక్టు రూపకల్పన చేసినది, నౌకాశ్రయాలను, విద్యుత్‌ ప్రాజెక్టులు, ఆయిల్‌ రిఫైనరీలను అభివృద్ధి పరచి గుజరాత్‌ పారిశ్రామికీకరణకు బీజాలు వేసినది అతనే!  పటేల్‌ కులస్తులకు పెద్దదిక్కుగా వున్నాడు. నవనిర్మాణ్‌ ఆందోళనలో అతనే విలన్‌. 1974 ఫిబ్రవరిలో ఇందిర అతని చేత రాజీనామా చేయించింది. కొన్ని నెలలకు పార్టీ నుంచి బహిష్కరించింది. అతను కిసాన్‌ మజ్దూర్‌ లోక్‌ పక్ష అనే పార్టీ పెట్టి ప్రతిపక్షాలకు చేరువయ్యాడు. వాళ్లూ వాటేసుకున్నారు. 1990 మార్చిలో జనతా దళ్‌లో చేరి బిజెపితో కలిసి మిశ్రమ ప్రభుత్వం ఏర్పరచాడు. ఏడు నెలలకే మళ్లీ బిజెపితో బంధం తెంపుకుని కాంగ్రెసు మద్దతుతో పదవి నిలుపుకుని, తర్వాత కాంగ్రెసులో చేరిపోయి 1994లో చనిపోయేవరకు ఆ పార్టీలోనే వున్నాడు. 

1973లో గుజరాత్‌లో ఆహారధాన్యాల కొరత వుంది. అది చాలనట్లు కేంద్రం కేటాయింపుల్లో 60% కోత విధించారు. అందువలన రేషన్‌ షాపుల్లో స్టాకు కనుమరుగై పోయింది. బ్లాక్‌మార్కెటింగ్‌ పెరిగిపోయి, ధరలు ఆకాశానికి అంటాయి. గుజరాత్‌లో వ్యాపారవర్గాలు చాలా బలంగా వుంటాయి కాబట్టి పార్టీలు వారిచ్చే నిధులపై ఆధారపడతాయి కాబట్టి వారిని అదుపు చేయలేక పెరిగిన ధరల భారమంతా ప్రజలపై నెట్టేశారు. కాలేజీ హాస్టళ్లల్లో నాసిరకం తిండి పెట్టడంతో పాటు మెస్‌ బిల్లు పెంచేవారు. 1973 డిసెంబరులో ఒక్కసారిగా 40% పెంచడంతో  మండిపడిన అహ్మదాబాద్‌ ఎల్‌డి ఇంజనీరింగు కాలేజీ విద్యార్థులు 1973 డిసెంబరు 20న కాలేజీ కాంటీన్‌ ఫర్నిచర్‌కు, కాలేజీ ఫర్నిచర్‌కు నిప్పు ముట్టించి, వార్డెన్‌ యింటిపై దాడి చేశారు. పదిహేను రోజుల తర్వాత 1974 జనవరి 3 నుంచి సమ్మె ప్రారంభించారు. దాన్ని ఎలా అదుపు చేయాలో తెలియక చిమన్‌భాయ్‌ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. వాళ్లు లాఠీ చార్జిలతో, అరెస్టులతో భయోత్పాతం సృష్టించారు. దాంతో ఆందోళన అహ్మదాబాద్‌లోని యితర కాలేజీలకు, స్కూళ్లకు వ్యాపించింది. ఆహారమంత్రి రాజీనామా చేయాలని, వేరుశెనగ వ్యాపారస్తులతో కుమ్మక్కయిన చిమన్‌భాయ్‌ అవినీతికి మారుపేరుగా మారాడని నినాదాలు వినవచ్చాయి. విద్యార్థులను శాంతింపచేయడానికి అరెస్టు చేసినవారందరినీ ప్రభుత్వం విడుదల చేసింది.

ప్రభుత్వాన్ని యిరకాటంలో పెట్టడానికి అదనుకోసం ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలు రంగంలోకి దూకాయి. జనవరి 10న అహ్మదాబాద్‌ బంద్‌కై విద్యార్థులు యిచ్చిన పిలుపుకు మద్దతు పలికి దాన్ని విజయవంతం చేశాయి. మర్నాడే నవనిర్మాణ్‌ యువక్‌ సమితి అనే పేర విద్యార్థి సంఘం ఏర్పడింది. అవినీతిని పారద్రోలి, సమాజాన్ని పునర్నిర్మించడానికి నడుం కట్టామని ప్రకటించుకున్నారు. సర్వోదయా కార్యకర్తలు, కాలేజీ, స్కూలు టీచర్ల సంఘాలు, బ్యాంకు, ఇన్సూరెన్సు కంపెనీల ఉద్యోగులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వోద్యోగులు విద్యార్థులకు మద్దతు పలికారు. ఆందోళనలు, ఊరేగింపులు జరిగాయి. వీటిలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయి. త్వరలోనే ఊరేగింపులు, అల్లరులు బడోదా, సూరత్‌ యిత్యాది పట్టణాలన్నిటికీ వ్యాపించాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నిరవధిక సమ్మె ప్రకటించి స్కూళ్లు, కాలేజీలు మూయించేశారు. బంద్‌్‌లు, ధర్నాలు, ఘొరావ్‌లు నిత్యకృత్యమయ్యాయి. బస్సులు తగిలేశారు, దుకాణాలు దోచుకున్నారు. వాళ్ల వంతుగా పోలీసులు దమనకాండ సాగించారు. ఇప్పుడు అధికధరల సమస్య పక్కన పెట్టారు. అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌ అందుకున్నారు. దీనిలో ప్రతిపక్షాల ఉద్దేశం తేటతెల్లమవుతోంది. దీనికి కాంగ్రెసు పార్టీలోనే చిమన్‌భాయ్‌ వ్యతిరేక వర్గం గొంతు కలిపింది. ఆందోళనకు చిమన్‌భాయ్‌ కేంద్రబిందువయ్యాడు. అతన్ని తీసేస్తే చాలు అవినీతి మొత్తం అంతమవుతుందన్న ధోరణిలో ప్రచారం సాగింది.

పరిస్థితి గమనించిన ఇందిరా గాంధీ అతన్ని 1974 ఫిబ్రవరి 9 న రాజీనామా చేయమంది. రాష్ట్రపతి పాలన విధించి అసెంబ్లీని రద్దు చేయకుండా సుషుప్తావస్థలో పెట్టింది. ఎందుకంటే ఎన్నికలు జరిగి గట్టిగా రెండేళ్లు కూడా కాలేదు. ఇంకా మూడేళ్ల వ్యవధి వుంది. రద్దు చేయకపోవడం ప్రతిపక్షాలకు రుచించలేదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల, మునిసిపల్‌ చైర్మన్ల, కౌన్సిలర్ల యిళ్లపై దాడి చేసి, కార్లు ధ్వంసం చేసి, ఘొరావ్‌ చేసి రాజీనామా చేయమని ఒత్తిడి చేయసాగారు. ఒక కాంగ్రెసు నాయకుణ్ని నగ్నంగా ఊళ్లో తిప్పారు. ఇవన్నీ భరించలేక 40 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు కూడా. ఏం చేసినా ఇందిరా గాంధీ అసెంబ్లీ రద్దు చేయడానికి సమ్మతించలేదు.  ఎందుకంటే యీ ఉద్యమమంతా పట్టణాల్లో, నగరాల్లో నడుస్తోంది. విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలే మద్దతిస్తున్నారు. గ్రామాల్లో ఉద్యమానికి స్పందన లేదు. అదీ ఆమె ధీమా. అప్పుడు మొరార్జీ దేశాయి రంగంలోకి దిగాడు. అసెంబ్లీ రద్దు చేసి, వెంటనే ఎన్నికలు ప్రకటించాలంటూ మార్చి 11న ఆమరణ నిరాహారదీక్షకు దిగాడు. గాంధేయవాది ఐన మొరార్జీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సుస్థిర ప్రభుత్వాన్ని రద్దు చేయమని డిమాండ్‌ చేయడం వింత. కానీ కుటిల రాజకీయాలు, ఇందిరపై అతని వ్యతిరేకత అలాటివి. 78 ఏళ్ల మొరార్జీ నిరాహారదీక్ష అనగానే ఇందిరకు భయం వేసింది. అతనికేమైనా అయితే తనకు చెడ్డపేరు వస్తుందని దడిసి, ఐదు రోజుల తర్వాత మార్చి 16 న అసెంబ్లీ రద్దు చేసింది, త్వరలోనే  తాజాగా ఎన్నికలు నిర్వహిస్తానని ప్రకటించింది. 

దీని తర్వాత నవనిర్మాణ్‌ ఉద్యమం చల్లారిపోయింది. విద్యార్థులు చదువులకు వెళ్లిపోయారు. మొత్తం మీద 10 వారాల పాటు గుజరాత్‌లో అరాచకం ఏలింది. లాఠీచార్జి, పోలీసు కాల్పుల్లో 100 మంది చనిపోయారు, 3 వేల మంది గాయపడ్డారు. నేను బ్యాంకులో చేరిన ఎనిమిది నెలలకు 1974 మార్చి చివర్లో నెలన్నరపాటు సాగే స్టాఫ్‌ ట్రైనింగ్‌కై గుజరాత్‌లోని భావనగర్‌లో వున్న మా ట్రైనింగ్‌ సెంటర్‌కు వెళ్లాను. హాస్టల్‌ మరమ్మత్తు జరుగుతూండడంతో కొంతమంది బయట రూము తీసుకుని వున్నాం. ట్రైనింగ్‌ పూర్తయ్యే సమయానికి రైల్వే స్ట్రయిక్‌ ప్రారంభం కావడంతో యింకో పదిహేను రోజుల పాటు భావనగర్‌లో, బడోదాలో పనిచేయవలసి వచ్చింది. నేను వెళ్లేసరికి నవనిర్మాణ్‌ ఆందోళన పూర్తయింది. స్థానికులతో మాట్లాడగా నాకు అర్థమైందేమిటంటే అది యువకులను అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలు నడిపిన ఉద్యమం. దాని గురించి విద్యార్థులు మాత్రమే ఉబలాటంగా మాట్లాడారు. వాళ్లు కూడా చిమన్‌భాయ్‌ పదవీచ్యుతుడు కావడంతో ఏదో సాధించినట్లు గొప్పగా ఫీలవుతున్నారు. అక్కడితో వాళ్ల ఉత్సాహం చల్లారింది. మళ్లీ మండల్‌ వ్యతిరేక ఆందోళన జరిగేవరకు గుజరాత్‌ యువతలో రాజకీయచైతన్యం మళ్లీ కానరాలేదు. మళ్లీ యిటీవల పటేల్‌ యువత ఉద్యమం! అహ్మదాబాద్‌ వంటి నగరాల్లో తప్పిస్తే సాధారణంగా గుజరాత్‌లో కార్మికోద్యమం, సామాజిక ఉద్యమం చాలా బలహీనం. కార్మిక చట్టాలు అమలు కాకపోయినా ప్రభుత్వం ఏమీ పట్టించుకోదు.  గుజరాత్‌ సమాజంలో ఛాందసత్వం  కూడా ఎక్కువ. అందుకే అది పెట్టుబడిదారుల స్వర్గమైంది. అక్కడ మూడు నెలలు కూడా నడవని ఒక ఉద్యమం జెపిని ఉత్తేజ పరచడం, ఆయన దాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడం, అది ఎమర్జన్సీకి దారి తీయడం - ఒక వింత పరిణామక్రమం.  (సశేషం) ఫోటో - చిమన్‌భాయ్‌ పటేల్‌

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2015)

[email protected] 

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?