Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : ఎమర్జన్సీ ఎట్‌ 40 - 56

ఎమ్బీయస్‌ : ఎమర్జన్సీ ఎట్‌ 40 - 56

హక్సర్‌పై సంజయ్‌కు అంత కోపం ఎందుకంటే అతను మారుతిని అహ్మద్‌నగర్‌లోని వెహికల్స్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (విఆర్‌డిఇ)కి పంపి ఫీజిబిలిటీ రిపోర్టు తీసుకోమని ఇందిరను ఒప్పించాడు. దాంతో అతను తన కారును వాళ్ల దగ్గరకు పంపాల్సి వచ్చింది! దాని కథ చెప్పేముందు మారుతి కంపెనీ ఫైనాన్షియల్స్‌ గురించి, యీ కారు పేరు చెప్పి సంజయ్‌ వసూలు చేసిన డబ్బుల గురించి చెప్పాలి. కార్ల ఫ్యాక్టరీ పెట్టడానికి 1971లో సంజయ్‌కున్న ఆర్థికస్తోమత ఏమిటి అని ప్రతిపక్షాలు అడిగితే '1970-71లో అతను దాఖలు చేసిన ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ప్రకారం ఆదాయం రూ.722' అని వై బి చవాన్‌ రాజ్యసభలో చెప్పాల్సి వచ్చింది. దాంతో అతను మారుతి లిమిటెడ్‌ అనే పేర 1971 జూన్‌ ప్రాంతాల్లో రూ. 2.50 కోట్ల ఆథరైజ్‌డ్‌ కాపిటల్‌తో పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ పెట్టేశాడు. తను మేనేజింగ్‌ డైరక్టర్‌. నెలకు రూ.4 వేల జీతం, అదనంగా సౌకర్యాలు (పెర్క్‌స్‌) మరో ముగ్గురు డైరక్టర్లు - రౌనక్‌ సింగ్‌, వి ఆర్‌ మోహన్‌, విద్యా భూషణ్‌. కాంగ్రెసుకు అత్యంత ఆత్మీయుడు, ఆటోమొబైల్‌ ప్రోడక్ట్స్‌ దిగ్గజం ఐన ఎం ఏ చిదంబరం చైర్మన్‌. వాళ్లందరూ బాగానే పెట్టుబడి పెట్టిన ఎండీ గారు మాత్రం పది రూపాయల షేర్లు పది పుచ్చుకున్నారు. ఆర్‌ఓసి (రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌) నియమం ప్రకారం బోర్డు మెంబరుకు కనీసం 25 షేర్లుండాలి. కానీ ఆ నియమం తమ కంపెనీకి వర్తించదని మారుతి లిమిటెడ్‌ తమకు తామే తీర్మానం చేసేసుకుంది. 

దీని తర్వాత అనేకమంది షేర్లు కొన్నారు. గమనించవలసిన అంశం ఏమిటంటే పెట్టుబడి పెట్టినవారందరిపైనా ఆర్థిక నేరాల కేసులో, ఇన్‌కమ్‌ టాక్స్‌ పేచీలో వున్నాయి.  ఈ మాట నిజమేనా అని పార్లమెంటులో అడిగితే హోం వ్యవహారాల సహాయ మంత్రి ఆర్‌ ఎన్‌ మీర్ధా 'కొంతమందిపై ఆర్థిక నేరాల కేసులు పెండింగులో వున్నాయి' అని ఒప్పుకున్నాడు. మారుతిలో పెట్టుబడి పెట్టి, యిన్‌కమ్‌ టాక్స్‌ కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిశాక ఆగుతారా? ఒక్క కారూ తయారు కాకుండానే 1972 జూన్‌ నాటికి ఆథరైజ్‌డ్‌ కాపిటల్‌ను నాలుగు రెట్లు, అంటే రూ. 10 కోట్లు చేశారు. మొదటి ఏడాదిలో రూ. 25 లక్షల విలువున్న షేర్లు అమ్మారు, రెండో ఏడు రూ.68 లక్షలు, మూడో ఏడు రూ.85 లక్షలు! 1974 సెప్టెంబరు వచ్చేసరికి పెయిడ్‌అప్‌ కాపిటల్‌ రూ. 1.80 కోట్లయింది. లక్షకు పైగా పెట్టుబడి పెట్టినవారు 52 మంది! లలిత్‌ మిశ్రా మారుతికి అండగా నిలిచి తన బంధువుల చేత పెట్టుబడులు పెట్టించాడని రాశాను కదా. అతని తల్లి, 8 మంది సోదరులు, ఒక మేనత్త, ఐదుగురు కజిన్స్‌, యిద్దరు మేనల్లుళ్లు అందరూ వెయ్యి రూ.ల షేర్లు 50 నుంచి 80 దాకా తీసుకున్నారు. ఇక తన భార్యవైపు బంధువులైతే చెప్పనే అక్కరలేదు. షేర్‌ హోల్డర్లలో ఎవరి పేరు చూసినా మిశ్రా లేక ఝా (వాళ్ల అత్తారి యింటిపేరు) వుండేది. 

షేర్ల ద్వారానే కాకుండా డీలర్‌ డిపాజిట్ల ద్వారా కూడా సంపాదించాలనుకున్నాడు సంజయ్‌. 1972 సంవత్సరాంతానికి కారు విడుదల చేస్తానని మాట యిచ్చి ఆర్నెల్ల ముందు  75 మంది డీలర్లను నియమించాడు. స్తోమత బట్టి లక్ష నుండి మూడు లక్షల దాకా డిపాజిట్టు రూపేణా సేకరించాడు. కారు డెలివరీలో లేటయితే డిపాజిట్టుపై బ్యాంకు వడ్డీ యిస్తానన్నాడు.  చిన్న కార్లకు తగిన విధంగా షోరూములు కట్టుకోమన్నాడు. డీలర్లు బ్యాంకుల నుంచో, బయటి నుంచో అప్పు తెచ్చి, ఆస్తులు తాకట్టు పెట్టి షోరూములు కట్టుకున్నారు. కానీ చిన్నకారును వాళ్లు కళ్లతో చూసిన పాపాన పోలేదు. పెట్టిన డిపాజిట్టుపై కంపెనీ వడ్డీ కూడా యివ్వలేదు. ఒకళ్లిద్దరు డిపాజిట్టు వెనక్కి యిచ్చేయమని అడిగే తిక్కపని చేస్తే ఎమర్జన్సీ విధించినపుడు  మీసా చట్టం కింద అరెస్టు చేసి జైల్లో పడేసి తిక్క కుదిర్చారు. లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ వచ్చాక చైర్మన్‌ చిదంబరం యూరోప్‌లోని కార్ల ఫ్యాక్టరీలను పరిశీలించేందుకు కొందర్ని ఎంపిక చేసి ఆ గ్రూపులో సంజయ్‌ గాంధీని కన్సల్టెంట్‌ హోదాలో పంపాడు. సంజయ్‌ పశ్చిమ జర్మనీ, ఇటలీ, బ్రిటన్‌, చెకొస్లొవాకియాలలో కార్ల ఫ్యాక్టరీలు చూసి పెదవి విరిచాడు. 'వీళ్ల దగ్గర నేర్చుకోవలసినది ఏమీ లేదు, మారుతికి విదేశీ మేధస్సు అవసరం లేదు' అనేశాడు. 

1972 సంవత్సరాంతానికి కారు విడుదల చేస్తానన్నాను కదాని నవంబరులో కారు ప్రొటోటైపు చూపెట్టి 1973 ఏప్రిల్‌ కల్లా రోడ్డు మీదకు వస్తుందన్నాడు. ధర విషయంలో గతంలో చెప్పినట్టుగా 6 వేలకు కాకుండా 11,300 కు యిస్తానన్నాడు. అంటే 90% పెరిగిందన్నమాట. ముడిసరుకుల ధర పెరగడం వలననే యీ పెంపు అని చెప్పుకున్నాడు. నిజానికి ఆ రేటులో కూడా తయారుచేయడం అసాధ్యం. కార్ల మ్యానుఫాక్చరింగ్‌ యూనిట్‌ అంటే కనీసం 60 కోట్ల రూ.ల పెట్టుబడి కావాలి. సంజయ్‌ పెట్టినది దానిలో పదోవంతు మాత్రమే. కొంతకాలానికి ప్రయివేటు పెట్టుబడితో కథ సాగదని గ్రహించిన సంజయ్‌ బ్యాంకులపై, ప్రభుత్వ ఋణసంస్థలపై పడ్డాడు. అవి చాదస్తంగా ప్రాజెక్టు రిపోర్టు అడిగాయి. సంజయ్‌ దగ్గర అలాటి పదార్థమేమీ లేదు. బ్యాంకులను బెల్లించి, బెదిరించి, కొల్లేటరల్‌ సెక్యూరిటీలు కూడా లేకుండా సెంట్రల్‌ బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో ఋణాలు సంపాదించాడు. ఇండస్ట్రియల్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ (ఐఎఫ్‌సి) దగ్గర్నుండి కూడా కొంత లాగాడు. వీటిపై పార్లమెంటులో ప్రశ్నలు వేశారు. 'ఏడాదిలో అన్నిటి కంటె పెద్ద లోనును మారుతికి ఐఎఫ్‌సి వారం రోజుల్లోనే  యిచ్చి రికార్డు సృష్టించిన మాట నిజమేనా?' అని అడిగితే పరిశ్రమల మంత్రి రఘునాధరెడ్డి 'ఆ విషయమై ఏమీ చెప్పలేను. కంపెనీ బాలన్స్‌షీటు కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది' అని జవాబిచ్చాడు. మారుతికి దాహం తీరలేదు. ఇంకా ఋణాలు కావాలని అడిగారు. బ్యాంకువాళ్లకు పరిమితులంటాయి కదా ఆర్‌బిఐ డిప్యూటీ డైరక్టరు డా|| ఆర్‌ కె హజారీ 'ప్రాజెక్టు రిపోర్టు లేకుండా మారుతికి యికపై లోన్లు యివ్వవద్దు' అని ఆదేశాలు జారీ చేశాడు. తన నిర్ణయాన్ని ఫైనాన్స్‌ మంత్రి సి.సుబ్రహ్మణ్యానికి తెలియపరచాడు. హజారీ అదేశాల తర్వాత సెంట్రల్‌ బ్యాంకు చైర్మన్‌ తనేజా ఋణం యివ్వడంపై తాత్సారం చేసిచేసి చివరకు 'నో' అని చెప్పేశాడు. ఎమర్జన్సీ విధించగానే తనేజాను తీసి పారేశారు. ఆయనకు మద్దతుగా బ్యాంకు ఉద్యోగులు, డైరక్టర్లు నిరసన ప్రదర్శనలు చేసినా ఖాతరు చేయలేదు. హజారీని కూడా యింటికి పంపేశారు. కానీ స్టేటు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ ఆర్‌ కె తల్వార్‌ను తీసేయడం అంత సులభం కాలేదు. (సశేషం)   (ఫోటో - తన ఫ్యాక్టరీ వద్ద సహచరులతో సంజయ్‌) 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2016) 

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?