Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40 - 57

ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40 - 57

బ్యాంకింగ్‌ రంగంలోనే కత్తి లాటి తల్వార్‌ను తొలగించడానికి ఎమర్జన్సీ టైములో ఒక చట్టం చేయవలసి వచ్చింది. దాని ప్రకారం జాతీయ బ్యాంక చైర్మన్‌ను ఎవరినైనా సరే మూణ్నెళ్ల నోటీసుతో ఏ కారణం లేకుండా తీసిపారేయవచ్చు. ఆ చట్టాన్ని వుపయోగించి ఆయన్ను యింటికి పంపారు. సంజయ్‌ కసి తీరింది. అసలింతకీ సాంకేతికంగా కారు నిర్మాణంలో సంజయ్‌ ఏ మేరకు సాధించాడు? అతను తన వర్క్స్‌ మేనేజరుగా పెట్టుకున్న వ్యక్తి గతంలో స్కూటర్‌ ఎసెంబ్లీ ప్లాంట్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేశాడు. అంతా కలిసి ఒక ఫర్నేస్‌ నెలకొల్పి దానిలో యినప కడ్డీలు కాల్చి ఇంజిన్‌ మోడలు అచ్చులో పోత పోసేవారు. ఆటోమెటిక్‌ యంత్రాలతో కాకుండా మాన్యువల్‌గా పోతపోయడం వలన యింజను నిర్మాణంలో రకరకాల లోపాలు వచ్చాయి. అతను తయారుచేసిన మొదటి ప్రోటోటైపులో మోటారు సైకిలు యింజన్ను కారుకి ఫిట్‌ చేసిన నడుపుదామని చూశాడు. కుదరలేదు. రెండో ప్రోటోటైపు నడుపుతూంటే బోల్తా కొట్టింది. మూడోదానిలో యింజను విపరీతంగా వేడెక్కిపోయి, ఆయిలు లీకైంది. విపరీతమైన రొద, తలుపులు సరిగ్గా మూసుకోలేదు. కారు సస్పెన్షన్‌ సరిగ్గా లేదు, పెట్రోలు తాగేయసాగింది. ఇలా మోడళ్లన్నీ ఫెయిలవుతూనే వున్నాయి. 

అయినా పరిస్థితి సవ్యంగానే వున్నట్లు సంజయ్‌ బిల్డప్‌ యిస్తూ వచ్చాడు. 1972లో ఢిల్లీలో జరిగిన వరల్డ్‌ ఫెయిర్‌లో హరియాణా పెవిలియన్‌లో స్వదేశీ టెక్నాలజీకి కీర్తిపతాకగా మారుతి మోడల్‌ను సగర్వంగా ప్రదర్శించారు. దీనివలన మారుతికి మంచి పబ్లిసిటీ వచ్చింది కానీ యింకో ముప్పు తెచ్చింది. ఈ కారు ఎలా వుందో చూసి మనం ప్రమోట్‌ చేద్దాం అనుకుని తమిళనాడు పరిశ్రమల మంత్రి ఎస్‌.మహాదేవన్‌ ఢిల్లీ వచ్చి మారుతిని చూడబోయాడు. అది సీనారేకుల డబ్బాలా తోచింది. నడుస్తూంటే కారు పార్టులన్నీ విడిపోయి పడిపోతాయన్న భయం వేసింది. 'ఓ సారి ఎక్కుతాను కానీ స్టార్ట్‌ చేయకండి. కాస్సేపు కూర్చుని దిగిపోతాను.' అన్నాడు. మద్రాసు తిరిగి వచ్చి ఆ సంగతి పత్రికల వాళ్లకు చెప్పాడు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆ వార్త రాసి 'టైనీ కార్‌' అని శీర్షిక పెట్టి వై ను బ్రాకెట్లో పెట్టింది. టైనీ కార్‌ అంటే చిన్న కారు అని, టిన్‌ కార్‌ అంటే డబ్బారేకుల కారని! ఇవన్నీ చూసిన హక్సర్‌ 'మారుతిని అహ్మద్‌నగర్‌లోని వెహికల్స్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (విఆర్‌డిఇ)కి పంపి ఫీజిబిలిటీ రిపోర్టు తీసుకుంటే మంచిద'ని  ఇందిరను ఒప్పించాడు. అతనికి ముందునుంచీ సంజయ్‌ సామర్థ్యంపై నమ్మకం లేదు. కానీ ఇందిర వినేట్టుగా లేదు. చివరకు యీ టెస్టు జరిపిస్తే మారుతి ఆ పరీక్షలో ఫెయిలవుతుందని, అప్పుడు ఇందిర సంజయ్‌కు నచ్చచెప్పి మారుతి మూయించేసి, యీ వివాదంలోంచి బయటపడుతుందని అతను ఆశించాడు. 

సంజయ్‌కు యీ సలహా అస్సలు నచ్చలేదు. అయినా తల్లి చెప్పింది కాబట్టి కాదనలేక పరీక్షకు పంపడానికి ఒప్పుకున్నాడు. ఆరువారాల పాటు పరీక్షించి 1974 మార్చి 30 న ఆ పరీక్ష పాసయినట్లు విఆర్‌డిఇ వాళ్లు సర్టిఫికెట్టు కూడా యిచ్చారు. మారుతి ఆ టెస్టు ఎలా గట్టెక్కిందో మిస్టరీగానే మిగిలిపోయింది. కారు హరియాణా నుండి అహ్మద్‌ నగర్‌ వరకు వెళ్లడమైతే వెళ్లింది. కానీ ఓ ట్రక్కు ఎక్కించి తీసుకెళ్లారని కొందరంటారు. ఇంజను విషయానికి వస్తే సంజయ్‌ ముల్లర్‌ అనే జర్మన్‌ యింజనియర్‌ను పిలిపించాడు. అతను రెండు ఫోర్‌స్ట్రోక్‌ జర్మన్‌ యింజన్లను రహస్యంగా దిగుమతి చేసి మారుతికి ఫిట్‌ చేయమని సలహా యిచ్చాడు. సంజయ్‌ అది అమలు చేశాడు. ఇది మధు లిమయే అనే సోషలిస్టు లీడరుకు తెలిసిపోయింది. అతను పార్లమెంటులో యాగీ చేశాడు. ఏది ఏమైతేనేం, విఆర్‌డిఇ వాళ్ల సర్టిఫికెట్టు చూపించుకుని సంజయ్‌ హంగు చేయసాగాడు. 1972లో మార్కెట్లోకి రావలసిన కారు 1973కి కూడా రాలేదు. ఇంజన్‌ సమస్య వలన అన్నారు. 1974లో యిదిగో ప్రొడక్షన్‌ మొదలుపెట్టేస్తున్నాం అన్నారు. ఫ్యాక్టరీ బిల్డింగు పూర్తయిపోయింది. మిషనరీ తెప్పించడం జరిగింది. 1975 వచ్చినా అదిగోయిదిగో పైకి అంటున్నా కారు తయారుచేయడం తన వలన కాదని సంజయ్‌కు అర్థమై పోయింది. 1975లో కొత్త యంత్రాలు ఏవీ తెప్పించలేదు. కంపెనీకి ఎలాట్‌ చేసిన సిమెంటు, స్టీలు అమ్ముకుని డబ్బు చేసుకోసాగాడు. కార్ల సంగతి పక్కన పెట్టి రోడ్డు రోలర్లు తయారుచేయసాగాడు. 

అలహాబాదు హైకోర్టు తీర్పు వచ్చేసరికి ఎంటర్‌ప్రెనార్‌గా ఫెయిలై, సంజయ్‌ గాంధీ యిలాటి ఫ్రస్ట్రేటెడ్‌ మూడ్‌లో వున్నాడు. తన చిత్తం వచ్చినట్లు చేయడానికి వీల్లేకుండా అడ్డుపడుతున్న ప్రజాస్వామ్యంపై, తనకు అడుగడుగునా అడ్డుపడుతున్న ప్రతిపక్ష నాయకులపై కోపం పెంచుకుని వున్నాడు. ప్రధాని పదవిలో వున్న తన తల్లి సర్వాధికారాలు చేతిలోకి తీసుకుని తనను విమర్శించేవాళ్ల నోళ్లు మూయిస్తే బాగుండునని అనుకుంటున్నాడు. సంపూర్ణ క్రాంతి పేరుతో ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తూన్నపుడు విశేషాధికారాలు చేతిలోకి తీసుకుని వాళ్లను జైళ్లల్లో కుక్కితే బాగుండునని తల్లికి సలహా యిచ్చాడు. బారిస్టరైన సిద్ధార్థ శంకర్‌ రాయ్‌ రాజ్యాంగంలో ఆ మేరకు ఎటువంటి అవకాశాలు వున్నాయో అన్నీ అధ్యయనం చేసి వచ్చాడు కూడా. అయితే ఇందిర అంతకు తెగించలేదు. వద్దని వారించింది. అయితే అలహాబాదు తీర్పు రాగానే ఆమె నిరాశలో, నిస్పృహలో మునిగింది. ఒక్కసారిగా అధైర్యం ఆమెను చుట్టుముట్టింది. ఆ సమయంలో సంజయ్‌ ఆమె బుద్ధిని పెడతోవ పట్టించాడు. అనేక రాజకీయ సంక్షోభాలు ఎదుర్కున్న ఇందిర వేరేవారి ప్రమేయం లేకపోతే రాజకీయంగానే దీన్ని డీల్‌ చేసి వుండేది. కానీ సంజయ్‌ రాజకీయజీవి కాదు. పదిమందిని ఒప్పించి, తన దారికి తెచ్చుకునే ఓపిక లేనివాడు. అందుకే అడ్డదారి వుపయోగించమని తల్లికి చెప్పి ఒప్పించాడు. ఆమె అతని మాటలకు చెవి ఒగ్గింది. ఒకసారి పులిస్వారీ ప్రారంభించాక దిగలేని పరిస్థితి వచ్చింది. సంజయ్‌ ఎల్లెడలా వ్యాపించి, తనకు చిత్తం వచ్చినట్లు చేయసాగాడు. ఆమె ఆపలేకపోయింది. అతన్ని వారించలేకపోయింది. అందుకే ఎమర్జన్సీలో ఎన్నో అత్యాచారాలు జరిగాయి. ఇందిర పేర జరిగినా, అంతిమ బాధ్యత ఇందిరదే అయినా మూలకారకుడు సంజయ్‌ గాంధీయే! (సశేషం)  

- (ఫోటో - కాటేజీ యిండస్ట్రీ స్టయిల్లో మారుతి ఫ్యాక్టరీ నడిపిన సంజయ్‌)

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2016)

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?