Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : గుజరాతీ సైనికులు

ఎమ్బీయస్‌ : గుజరాతీ సైనికులు

గుజరాతీలు వ్యాపారస్తులుగా ప్రసిద్ధులు. ఉద్యోగస్తుల్లో కూడా కొందరు కనబడతారు. మోదీ హయాం వచ్చాక రాజకీయాల్లో, ప్రధాని కార్యాలయంలో, ఉన్నత పదవుల్లో ఎక్కడ చూసినా గుజరాతీలో, గుజరాత్‌ క్యాడర్‌ అధికారులో కనబడుతున్నారని గగ్గోలు పుడుతోంది. గుజరాతీ వ్యాపారస్తుల హవా ఎప్పటికంటె యిప్పుడు ఉధృతంగా వీస్తోందంటున్నారు. మరి గుజరాతీలు అన్ని రంగాల్లో గణనీయంగా వున్నారా? 

ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌షాను అహ్మదాబాద్‌లో ఓ బహిరంగసభలో మాట్లాడమని పిలిచారు. ఆయన ఇంగ్లీషులో తన ప్రసంగం ప్రారంభించగానే, సభలో కలకలం పుట్టింది. ''గుజరాతీలో మాట్లాడండి. గుజరాతీలో మాట్లాడితేనే మేం వింటాం.'' అని కేకలు వేశారు. ఆయన జన్మతః పార్శీ కాబట్టి గుజరాతీ వచ్చే వుంటుందని అంచనా. మానెక్‌షా ఆగిపోయి, చుట్టూ పరికించాడు. ఆయన చాలా ధైర్యశాలి. 1971 ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌ (అప్పటి తూర్పు పాకిస్తాన్‌)లో అలజడి రేగుతున్నపుడు రెండు నెలల వ్యవధిలోనే యుద్ధానికి వెళ్లవలసి వస్తుందని ఇందిరా గాంధీ అనుకుంది. కాబినెట్‌ సమావేశం ఏర్పరచి దానికి ఆర్మీ చీఫ్‌గా వున్న మానెక్‌షాను కూడా పిలిచింది. 'అవసరమైతే రెండు నెలల్లో యుద్ధానికి సిద్ధం కావాలి' అంటూ మానెక్‌షాకు ఇందిరా చెప్పింది. 'అది చాలా తక్కువ సమయం, చాలా ప్రాక్టికల్‌ ప్రాబ్లెమ్స్‌ వున్నాయి' అన్నాడు మానెక్‌షా. 

ఆ సమావేశంలో రక్షణ, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ, వ్యవసాయంకు చెందిన సీనియర్‌ మంత్రులున్నారు. వారి ఎదుట ఆర్మీ చీఫ్‌ యిలా మాట్లాడడం ఇందిరకు రుచించలేదు. ''నాలుగు గంటలకు మళ్లీ సమావేశమవుదాం.'' అంటూ ప్రకటించింది. అందరూ బయటకు వెళుతూండగా, మానెక్‌షాతో మాత్రం ''మీరు కాస్త ఆగుతారా?'' అని అడిగింది. ఏకాంతంలో ఆమె కటువైన భాష ఉపయోగించే ప్రమాదం వుందని గ్రహించిన మానెక్‌షా ''మేడమ్‌ ప్రైమ్‌ మినిస్టర్‌, మీరేదో చెప్పాలనుకుంటున్నాను. దానికి ముందు నా రాజీనామా లేఖలో ఏ కారణం చేత పదవి వదులుకుంటున్నానని రాయాలో చెప్తారా? ఆరోగ్యసమస్యా, మానసిక సమస్యా, కుటుంబకారణమా, ఏం రాయను?'' అన్నాడు.

 అతని కఠినవైఖరిని ఇందిర గుర్తించింది. అతని సామర్థ్యం కూడా ఆమెకు తెలుసు కాబట్టి, తక్కువ వ్యవధిలో యుద్ధం సాధ్యం కాదని గ్రహించి ఆయన చెప్పినట్లే వింది. దేశప్రధాని వద్దనే అలా మాట్లాడిన మానెక్‌షా ఆ రోజు సభలో గుజరాతీలో మాట్లాడలన్న డిమాండ్‌ రాగానే ''స్నేహితురాలా, నేను చాలాకాలం ఆర్మీలో పనిచేసి, చాలా మందితో కలిసి యుద్ధరంగంలో పోరాడాను. సిఖ్‌ రెజిమెంటు నుంచి వచ్చినవారి నుండి పంజాబీ నేర్చుకున్నాను, మరాఠా రెజిమెంటు నుంచి వచ్చినవారి వద్ద మరాఠీ నేర్చుకున్నాను, మద్రాసు సాపర్స్‌ నుండి తమిళం నేర్చుకున్నాను, బెంగాల్‌ సాపర్స్‌ నుండి బెంగాలీ నేర్చుకున్నాను. గూర్ఖా రెజిమెంటు నుంచి నేపాలీ సైతం నేర్చుకున్నాను. కానీ దురదృష్టవశాత్తూ నాకు సైన్యంలో గుజరాతీలు ఎవరూ ఎదురు కాకపోవడం వలన గుజరాతీ నేర్చుకోలేక పోయాను.'' అన్నాడు.  

సూది కింద పడినా వినబడేటంత నిశ్శబ్దం అలముకుంది ఆ బహిరంగ సభలో! 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?