Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: హమ్మయ్య, కృష్ణాష్టమికి ఏం చేయలేదు

ఎమ్బీయస్‌: హమ్మయ్య, కృష్ణాష్టమికి ఏం చేయలేదు

కృష్ణా పుష్కరాలు అయిపోయాయి కాబట్టి బాబు కృష్ణాష్టమి సందర్భంగా ఏదో ఒక కార్యక్రమం భారీ ఎత్తున చేస్తారేమోనని బెంగ పెట్టుకున్నాను. జిల్లా పేరు కృష్ణ కాబట్టి, ఆ కృష్ణుడికి, యీ జిల్లాకు ఎక్కడో లింకు కలిపి ఏదో ఫంక్షన్‌ పెట్టేస్తారనుకున్నాను. కృష్ణుడి వేషంలో ఎన్టీయార్‌ విగ్రహాన్ని కృష్ణవేణీ నదీతీరాన నిలపడమో, ఉట్టి కొట్టే సంబరానికి 13 జిల్లాల నుంచి యువతీ యువకులందరూ పాలు, పెరుగు కుండలు చేత ధరించి పట్టుకుని వచ్చే విధానం గురించి బాబు వివరించడమో, వచ్చినవారిని పదింతలుగా లేజరు కిరణాలతో చూపే గ్రాఫిక్‌కు బోయపాటి శ్రీనుకు కాంట్రాక్టు యివ్వడమో, ఉట్టికొట్టే కళలో తర్ఫీదు యిచ్చేందుకు ఒక అకాడమీ ప్రకటించి దానికి భూమి కేటాయించడమో... యిలాటివి ఏవో వుంటాయని వూహ పోయింది. పుష్కరాల అలసట వలననో ఏమో బాబు యీ ఏడాదికి కృష్ణాష్టమిని వదిలేశారు.

బాపు-రమణల వద్ద ఓ ముస్లిం డ్రైవరు దశాబ్దాలపాటు పనిచేసేవాడు. అతను ముస్లిం పండగలకు సెలవడిగి తీసుకోవడంతో మొదలు పెట్టి, క్రమేపీ దసరా, సంక్రాంతి, ఉగాదికి కూడా సెలవలడిగి తీసుకోసాగాడు. బాపు గారికి చిరాకేసినా దాన్ని జోక్‌గా మార్చి తన ఆఫీసులో పనిచేసే శ్రీరమణ (ముళ్లపూడి వెంకటరమణగారు వేరు, యీయన వేరు) గారి దగ్గర అన్నారట - ''వాడికి హిందూ పండగల గురించి ఎవరు ఆచూకీ యిస్త్తున్నారో కాస్త కనిపెట్టండి. చూడబోతే వీడు భీష్మ ఏకాదశికి, పోలాల అమావాస్యకు కూడా సెలవడిగేట్లున్నాడు.'' అని. ఇప్పుడు బాబుగారి వరస చూస్తూంటే నాకు ఆ జోకే గుర్తుకు వస్తోంది. ఆయన కూడా పంచాంగం కాలండర్‌ దగ్గర పెట్టుకుని ఏ పండగ వస్తుందా ఎంత ధూమ్‌ధామ్‌ చేయాలా అని చూస్తున్నట్లుంది. సాంస్కృతిక సంఘాల వాళ్లుంటారు. వాళ్ల దగ్గర ఆర్గనైజ్‌ చేసే శక్తిసామర్థ్యాలుంటాయి, చేతిలో ఆర్టిస్టులుంటారు, స్పాన్సర్లుంటారు, కార్యక్రమం పెడితే వచ్చి హాలు నింపే జనాలుంటారు. వాళ్లు నిరంతరం వెతికేది సందర్భం కోసం! ఎవరిదైనా శతజయంతి గట్రా అంటే సరేలే అనుకుంటాం. కానీ శతజయంతులు నూరేళ్లు పోయాక కానీ రావు. మరి వీళ్లకు పబ్లిసిటీ ఎలా? అందుకని ఫలానా సినిమా రిలీజై 32 ఏళ్లు, ఫలానా బ్యానర్‌ స్థాపించి 43 ఏళ్లు, ఫలానావారు మద్రాసులో అడుగుపెట్టి 48 ఏళ్లు.. అంటూ ఫంక్షన్లు చేస్తారు. పింగళి గీతాలు, విజయా సినిమాల వీనుల విందు, ఎన్టీయార్‌ హిట్స్‌... యిలా ఏ పేరు పెట్టినా అవే పాటలు, అదే హాలు! ఆహూతులు, ఆర్టిస్టులు, వక్తలు.. అంతా ఎప్పటివారే! 

బాబుది కూడా యిదే తంతు! పండగ లేదా ఫంక్షన్‌ ఏదైనా సరే, అవే నినాదాలు, అవే ప్రకటనలు. 'ఏర్పాట్లన్నీ ఘనంగా, అంతర్జాతీయ స్థాయిలో వుండాలని, ముందస్తు ప్రణాళిక వేసుకుని సిద్ధంగా వుండాలని బాబు మూడు నెలల ముందుగానే అధికారులకు ఆదేశాలిచ్చారు', 'నిధులకు ఏ కొరత వుండదని హామీ యిచ్చారు', 'ఈ ఫంక్షన్‌ నిర్వహణాసామర్థ్యం చూసి రాష్ట్రానికి పెట్టుబడులు వరదగోదారిలా వచ్చిపడతాయని పరిశీలకులు వ్యాఖ్యానించారు', 'రాష్ట్రంలోని ప్రతీ యింటి నుంచి అందరూ దీనికై తరలి రావాలని బాబు పిలుపు నిచ్చారు, ఎలా రావాలో కూడా ఆ విధివిధానాల గురించి ముప్పావు గంట ఉపన్యాసం యిచ్చారు', 'పెట్టుబడుల కోసం విదేశాలు వెళ్లి తిరిగి వచ్చిన బాబు ఏర్పాట్లు పర్యవేక్షించి పెదవి విరిచారు, రాష్ట్రప్రతిష్ఠ పెంచాలని తను రోజులో 20 గంటలు శ్రమిస్తూ వుంటే అధికారులు అలసత్వం చూపడం బాధాకరంగా వుందన్నారు, దీనిలో ప్రతిపక్షాల కుట్ర వుందని, రాష్ట్రం అలా ముందుకు పోతూ వుంటే వారికి కిట్టదని, తన 45 ఏళ్ల రాజకీయజీవితంలో యింత దుర్మార్గుడైన ప్రతిపక్ష నాయకుణ్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు', 'పనులు వేగవంతం చేయడానికి టెండర్ల ప్రక్రియ పక్కన పెట్టి నామినేషన్‌ పద్ధతిని పనులు చేపట్టమని ఆదేశాలిచ్చారు', 'ఆదరాబాదరాగా పనులు చేయడం వలన కట్టినవి అప్పుడే కూలిపోతున్నాయని, నాణ్యత విషయంలో మీరు తృప్తి పడ్డారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనకు ఏ విషయంలోను ఎన్నడూ తృప్తి వుండదని, దానికి వెంకయ్యనాయుడే సాక్షి అనీ బాబు సమాధానమిచ్చారు', 'రాజధాని కూడా లేని రాష్ట్రంలో, నిధుల కొరత వున్నా, ప్రజలను ఉత్సాహపరచడానికి, రాష్ట్రాన్ని ప్రపంచపటంలో నిలపడానికి తను పడుతున్న శ్రమను గుర్తించడం మానేసి కోడిగుడ్డుకు యీకలు పీకితే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు', 'ఫంక్షన్‌కి వచ్చిన స్పందన చూసి ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు, వచ్చే ఏడాది దీనికి మించిన స్థాయిలో చేస్తానని ప్రజలకు వాగ్దానం చేశారు'.... యివే వార్తలు. 

గోదావరి పుష్కరాలప్పుడూ యివే హామీలు, హుంకరింపులు విన్నాం. అప్పుడు వేసిన రోడ్లు, కట్టిన ఘాట్లు, చేసిన నిర్మాణాలు ఏడాది తర్వాత ఎలా వున్నాయో గమనించండి. అప్పుడూ సమయం తక్కువని చెప్పి నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టారు. పుష్కరాలు అనుకోకుండా వచ్చిపడేవి కావు, ఏడాది ముందుగానే ప్లాను చేయవచ్చు. బాబు బిజీగా వుంటారు కాబట్టి వేరేవారికి అప్పగించవచ్చు. దేవాదాయ మంత్రి వుంటాడు, రోడ్లు, బిల్డింగులు, పబ్లిక్‌ వర్క్‌స్‌, హెల్త్‌.. యీ శాఖలన్నిటికి మంత్రులుంటారు. వాళ్లేమీ పనిచేయరా? అధికారులకు ఆదేశాలివ్వాలన్నా, మందలించాలన్నా వారెవరూ పనికి రారా? అన్నిటికీ బాబేనా? ఆయన విదేశయాత్రకు వెళితే పనులు పడక వేయడమేనా? ఇదెక్కడి ఎడ్మినిస్ట్రేషన్‌? తక్కిన మంత్రులందరూ, డిపార్టుమెంటు హెడ్స్‌ ఏ గుఱ్ఱానికి పళ్లు తోముతున్నారు? సర్వమూ తానె ఐనా గోదావరి పుష్కరాల మొదటిరోజు దుర్ఘటనకు మాత్రం తాను బాధ్యులు కారంటారు బాబు. ఆ తప్పిదానికి కారకులు అధికారులు, ప్రజలు, ఆట్టే మాట్లాడితే పుష్కరుడు. కృష్ణా పుష్కరాల సమయంలోనే సింధుకు ఒలింపిక్‌ రజిత పతాకం వచ్చింది కాబట్టి రెండూ కలిపి చేసేయాల్సి వచ్చింది. లేకపోతే విడివిడిగా చేసే ఛాన్సుండేది. అదీ మంచిదే అయింది. పుష్కరజనం వున్నారు కాబట్టి కాస్త నిండుగా వుంది. 

బాబు ఎప్పటిలాగానే సింధుకి మెడలు రావడంలో తన పాత్ర ఏమిటో చెప్పేసుకున్నారు. రెండేళ్లలో ఒలింపిక్స్‌ నిర్వహించేస్తామంటున్నారు. అలా ఎలా!? అంటూ ఎవరెన్ని జోకులు వేసినా ఆయన దూకుడు ఆగదు. సింధుకి 3 కోట్లు బహుమతి ప్రకటించేశారు. ఉద్యోగుల జీతాలకే కటకటలాడుతూన్న యీ స్థితిలో యీ వితరణ అవసరమా? ఆమెకు యిప్పటికే కోట్లు కురిశాయి. సింధులా అవకాశాలు అందని పేద క్రీడాకారిణులకు తలో లక్ష యిచ్చి ప్రోత్సహిస్తే 300 మంది తయారవుతారు. వారిలో 30 మంది జాతీయ స్థాయికో, 3గ్గురు అంతర్జాతీయ స్థాయికో వెళ్లవచ్చు. అలాటి స్కీముకి బదులు గోపీచంద్‌ అకాడెమీకి అమరావతిలో 15 ఎకరాలు భూమి యిస్తానన్నారు. ఆయనకే ఎందుకివ్వాలి? ఆయన హైదరాబాదు విడిచిపెట్టి వస్తానన్నాడా? స్థానికంగా ఎవరికైనా యివ్వవచ్చు కదా? అసలు యీ డబ్బుతో ప్రతీ స్కూల్లో డ్రిల్‌ టీచర్లను నియమించవచ్చు కదా? స్కూళ్లలో ఆటస్థలాలు ఏర్పాటు చేయవచ్చు కదా? గ్రామీణ ప్రాంతాల్లో ఆటవస్తువులు పంచవచ్చు కదా? రాజుల కాలంలో కవులకు భూములు దానం యిచ్చినట్లు, అమరావతిలో భూదానాలేమిటి? ఏ పంటా పండని హైదరాబాదు భూములంటే వేరు. ఇవి రైతులను లాలించి, బెదిరించి లాక్కున్న సస్యశ్యామలమైన భూములు. 

అసలు పుష్కరాలకు యింత సందడి అవసరమా? అనే విషయం తెలుగు ముఖ్యమంత్రులిద్దరూ ఎందుకు ఆలోచించరో తెలియటం లేదు. కృష్ణ మహారాష్ట్ర, కర్ణాటక రెండు రాష్ట్రాల్లోనూ ప్రవహిస్తోంది. అక్కడ ప్రభుత్వపక్షాన ఏవైనా కార్యక్రమాలు జరుగుతున్నాయా అని యింటర్నెట్‌ గాలించినా ఏమీ దొరకలేదు. వాళ్ల పేపర్లలోనూ ఏ న్యూసూ లేదు. గతంలో మన దగ్గరా అలాగే వుండేది. ఏదైనా జాతర, ఉత్సవం ఏ వూళ్లోనైనా జరిగినప్పుడు ప్రభుత్వం బందోబస్తు ఎలా నిర్వహిస్తుందో అలాగే పుష్కరాల విషయంలో జరిగేది. పుష్కరాలకు జనం బాగా వస్తారు కాబట్టి వాళ్లను ఆకట్టుకోవడానికి ప్రయివేటు వ్యాపారస్తులు ఎగ్జిబిషన్లు, కుస్తీ పోటీలు, విమానం తెచ్చి తిప్పడాలూ వంటివి చేసి డబ్బు గడించేవారు. ఆర్టీసి, రైల్వేలు బస్సులు, రైళ్లు ఎక్కువ వేసి ఆర్జించేది. సేవా సంస్థలు ప్రజాసేవ చేయడానికి యిదొక అవకాశంగా భావించి అన్నదాన శిబిరాలు, చలివేంద్రాలు, రేవుల దగ్గర వాలంటీర్లను సమకూర్చడాలు చేసేవారు. ఇక ప్రభుత్వం పని - కాస్త ముందుగా రేవులను మరమ్మత్తు చేయించడం, బారికేడ్లు కట్టించడం, పోలీసులను, పారిశుధ్య పనివారిని తగినంతగా నియోగించడం, శాంతిభద్రతలు కాపాడడం. ఇప్పటిలా ముఖ్యమంత్రి ఫోటోలతో 'రండు, పుష్కరస్నానం చేయుడు, పాపములను ప్రక్షాళన చేసుకొనుడు' అంటూ క్రైస్తవ పునీత/స్వస్థత సభల్లా వాల్‌పోస్టర్లు వేసే పద్ధతి లేదు. 

ప్రతీ ఏడాదీ ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూనే వుంటాయి. ఏ రాష్ట్రంలోనూ యిలాటి పోస్టర్లు వెలిసి వుండవు. అసలు పుష్కరాలకు యింతమంది జనం తరలి వెళ్లేట్లా చేసిన ఘనత చంద్రబాబుదే! అది పెద్దలకు తర్పణాలు విడిచే స్నానం కాబట్టి, కుటుంబ పెద్దలు మాత్రమే వెళ్లేవారు. పిల్లా, పాపాతో తరలి వెళ్లే వాటర్‌స్పాట్‌ కాదది. తెలుగునాట పుష్కరమంటే గోదావరి పుష్కరమే, అదీ రాజమండ్రిలోనే సందడి వుండేది. గోదావరి ఎన్ని రాష్ట్రాలలో ఎన్ని మైళ్లు ప్రవహించినా రాజమండ్రి వద్దనే వెడల్పుగా కనబడి, అఖండ గౌతమి అనిపించుకుంటుంది. తరతరాలుగా పుష్కరస్నానం అక్కడే చేసేవారు. గోదావరి అవతలివైపు వున్న కొవ్వూరు వద్ద కూడా సందడి తక్కువే. గోదావరి పుష్కరానికి వున్న ప్రశస్తి కృష్ణాపుష్కరాలకు ఎప్పుడూ లేదు. బాబు ముఖ్యమంత్రిగా వుండే రోజుల్లో 2003లో గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఆయన తన మార్కెటింగు బుర్రతో పుష్కరాలకు పెద్ద పబ్లిసిటీ కల్పించాడు. ఆబాలగోపాలం వెళ్లాలనే ప్రచారం సాగింది. అదో ఫ్యామిలీ ఎక్స్‌కర్షన్‌ అయిపోయింది. దాని వలన దైవభక్తి లేదా నదుల పట్ల పర్యావరణ స్పృహ పెరిగిందా అని అడిగితే ఎవరూ సమాధానం చెప్పలేరు. ఎందుకంటే గత 13 ఏళ్లల్లో నేరాలూ పెరిగాయి, వాతావరణ కాలుష్యమూ పెరిగింది. 

అప్పుడే బాబు తెలంగాణలో అనేక గోదావరి ఘాట్లు నిర్మించి, అక్కడకు కూడా వెళ్లమని ప్రచారం చేశారు. అప్పటిదాకా గోదావరి తమ ప్రాంతాల ద్వారా ప్రవహిస్తోందన్న స్పృహే లేని తెలంగాణ ప్రజలు ఆయా క్షేత్రాల వైపు పరుగులు తీశారు. హైదరాబాదులో వున్న ఆంధ్రమూలాల వారు కూడా ఏదైనా గోదావరే కదా అనుకుంటూ అక్కడికి వెళ్లారు. కొందరు ఎందుకైనా మంచిదని యిక్కడా మునిగి, రాజమండ్రికీ వెళ్లారు. ఆనాడు బాబు తెలంగాణలో కలిగించిన పుష్కరస్పృహ యిప్పుడు ఆయనకు హాని కలిగించిందని చెప్పుకోవాలి. బాబు బాటలోనే వైయస్‌ వెళ్లారు. తెలంగాణలో కృష్ణ ప్రవహించే ప్రాంతాలను వెతికి పట్టుకుని హైలైట్‌ చేశారు. ఈసారి గోదావరి, కృష్ణ పుష్కరాలు వచ్చేసరికి బాబుకి పబ్లిసిటీలో ఏ మాత్రం తీసిపోని కెసియార్‌ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ఉధృత ప్రచారంతో చాలామంది తెలుగువాళ్లను తెలంగాణకే పరిమితమయ్యేట్లు చేయగలిగాడాయన. గోదావరి జలాలు కలవడం చేత పుష్కర సమయంలో కృష్ణ పవిత్రత  ప్రశ్నార్థకం అంటూ తెలంగాణ పండితులు లేవనెత్తిన సెంటిమెంటు భక్తులపై బాగానే పనిచేసిందట. అసలు పుష్కరస్నానమే ఓ సెంటిమెంటు. దుర్గా ఘాట్‌లో కంటె ఫెర్రీల వద్ద ఎక్కువమంది స్నానాలు చేశారట. ఇవన్నీ ముందుగానే వూహించి ఆంధ్ర ప్రభుత్వం మరీ అంత భారీగా ఏర్పాట్లు చేయకుండా వుంటే సరిపోయేది. గత పుష్కరాల కంటె కృష్ణాజిల్లాలో ఘాట్ల సంఖ్య 10 రెట్లు పెరిగిందట. కానీ జనం ఆ మేరకు పెరగలేదే! 

ఏ మేరకు జనం వచ్చి స్నానం చేశారన్నది ఎవరికి వారే వూహించుకోవాలి. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వ లెక్కలు ఏవీ నమ్మడానికి లేదు. వాళ్లు వేల కోట్లు ఖర్చు పెట్టేసి, దాన్ని జస్టిఫై చేసుకోవడానికి జనాల సంఖ్య పెంచి చెపుతున్నారు. ఎన్నికల సభ నిర్వహించినపుడు చూడండి, 4 లక్షల మంది వచ్చారంటారు. నిజానికి ఆ మైదానం విస్తీర్ణం లెక్క వేసి చూస్తే ఒకళ్ల నెత్తిన మరొకళ్లు నిల్చున్నా 50 వేలకు మించరు అని పరిశీలకులు చెప్తారు. జనబాహుళ్యాన్ని కంటితో చూసి ఈ ఏరియాలో యింతమంది వున్నారు అని చెప్పడం మామూలు ప్రజలకు అసాధ్యం. పుష్కరాలలో మొదటి రోజు జనం లేరు. వరలక్ష్మీ వ్రతం కాబట్టి అన్నారు. తర్వాతి రోజు కొద్దిగా పెరిగారు. ఆదివారం, సోమవారం సెలవులు కాబట్టి జనం వచ్చారు. మళ్లీ ఆదివారం వచ్చారు. తక్కిన రోజుల్లో విజయవాడలో జనం పలచగానే వున్నారు. ఊహూ జనం వచ్చేస్తారని ఎక్కడెక్కడో వాహనాలు ఆపించేసి, నడవమన్నారు. ఎండలు దంచుతున్నాయి. ఎండలో నడవలేక ఉదయం 9 తర్వాత నుంచి సాయంత్రం 4 దాకా ఎవరూ స్నానాలకు వెళ్లడానికి సాహసించలేదు. నేను నా సొంత పనిమీద 19 శుక్రవారం నాడు విజయవాడ వెళ్లాను. స్టేషన్లో కట్టిన షెడ్లన్నీ ఖాళీ. బయట కట్టినవి కూడా ఖాళీగానే వుంటున్నాయని ఊళ్లో చెప్పారు. స్టేషన్లో ఎప్పుడూ వుండే హడావుడే వుంది. మహా అయితే 5% ట్రాఫిక్‌ ఎక్కువుందేమో. పోలీసులు, సఫాయి పనివారు తప్ప యాత్రికులు పెద్దగా లేరు. మధ్యాహ్నం వూళ్లో రోడ్లన్నీ ఖాళీగానే వున్నాయి. ఎక్కడా పండగ వాతావరణం లేదు. పుష్కరాలకని రేట్లు పెంచిన హోటళ్లు (రోజు లెక్కను 24 గంటల కాకుండా 12 గంటలు చేస్తామన్నారట) డిస్కౌంటులో రూములిస్తామంటున్నారు. నేను పుష్కరస్నానం చేయలేదు కాబట్టి ఘాట్లలో పరిస్థితి కళ్లతో చూడలేదు. కానీ వెళ్లినవాళ్లు రద్దీ లేదనే చెప్పారు. జాతీయ మీడియా వారు కూడా దీన్ని గమనించి అడిగితే బాబు 'కృష్ణాజిల్లాపై కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ కాబట్టి..' అని సర్దిచెప్పారట. ఎప్పటి కమ్యూనిజం? ఇప్పుడు కృష్ణా జిల్లా నుంచి ఎన్నికైనవారిలో కమ్యూనిస్టులెవరైనా వున్నారా? ఈ తరం కమ్యూనిస్టులు దైవభక్తిని కాదనటమే లేదు. గణపతి నా యిష్టదైవం అని సిపిఎం రాఘవులుగారు బాహాటంగానే చెప్పారు. అసలు వాస్తవమేమిటంటే - జనాలు లేరు, పేపర్లలో పుష్కర యాడ్స్‌ లేవు, ప్రయివేటు వ్యాపారస్తుల్లో ఉత్సాహం లేదు.

ఉన్న ఉత్సాహమంతా బాబుగారిలోనే కనబడింది. వచ్చిన యాత్రికులకు బస్‌స్టాప్‌కు వెళ్లి బైబై చెప్పి వచ్చారట కూడా. సొంతింట్లో ఫంక్షన్‌కౖౖెనా యింత చేసి వుండరు. ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకులు పిల్చుకుని వచ్చారు. వెంకయ్యనాయుడు, సురేశ్‌ ప్రభు (ఆంధ్ర రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎన్నికైనందుకు కాబోలు) మాత్రమే వచ్చినట్లున్నారు. ఈ మాత్రం భాగ్యానికి 1600 కోట్ల దాకా ఖర్చుపెట్టాలా? ఎంత ఖర్చు పెట్టారన్న అసలు ఫిగరు తర్వాతతర్వాత తెలియవచ్చు. డెక్కన్‌ క్రానికల్‌ జులై వార్త ప్రకారం అప్పటికే 1080 కోట్లు వివిధ శాఖలకు కేటాయించారని, అది సరిపోదని మరో వెయ్యి కోట్ల ఖర్చు ప్రతిపాదనలను శాఖలు పంపించాయని రాశారు. తాజా హిందూ వార్త ప్రకారం - రాష్ట్ర రెవెన్యూ 10% పెరుగుతూండగా గత ఐదు నెలలుగా ఖర్చు మాత్రం 26% పెరుగుతోంది. నగదు చేతిలో లేని రాష్ట్రం పుష్కరాలకై 1600 కోట్లు ఖర్చుపెట్టడంతో ఢిల్లీ కళ్లెగరేసింది. గతంలో యిచ్చిన నిధులకు లెక్కలు చెప్పకపోగా కొత్తగా నిధులడిగి, అవి యివ్వటం లేదని తమను నిందిస్తున్న రాష్ట్రం యిలాటి ఖర్చుకు పాల్పడడం వాళ్లకు సహజంగానే నచ్చదు. 

ఇవేమీ బాబుకి తోచడం లేదు. 'పుష్కరాల నిర్వహణ తర్వాత ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరిగింద'ంటూ స్టేటుమెంటు యిచ్చారు. పెరిగితే గిరిగితే దేవుడిమీద నమ్మకం పెరగాలి, ఇప్పటిదాకా చేసిన పాపాలు కడుక్కుపోతాయని గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి కొత్త పాపాలు చేసుకోవచ్చని! ప్రభుత్వం మీద నమ్మకం ప్రశ్న ఎలా వస్తుంది? 2018 కల్లా పోలవరం కట్టేస్తానని బాబు అంటున్నారు కాబట్టి కట్టేస్తారని వాళ్లు నమ్మగలరా? నిజంగా కడితే గోదావరి పుష్కర ఘాట్‌లాగే అవుతుందది. నమ్మకం అంటూ కలిగితే 'రాజధాని నిర్మాణం, ఢిల్లీ నడిగి ప్రత్యేక హోదా తేవడం, పరిశ్రమలు తేవడం యిలాటివి చేతకావు కానీ ఏదైనా సందర్భం దొరికితే మాత్రం, జనం వచ్చినా రాకపోయినా, రూపాయి పెట్టే చోట పదిరూపాయలు పెట్టయినా సరే, బాబు రెచ్చిపోయి అన్నీ తానై చేయగలరు. గతంలో నేను సిఎం కాదు, సిఇఓని అని చెప్పుకునేవారు. ప్రస్తుతం నేను సిఎంని కాను, సిఇఎం (చీఫ్‌ ఈవెంటు మేనేజర్‌) అని చెప్పుకోవచ్చు.' అని నమ్ముతారు.  

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?