Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: హైకోర్టు ఉద్యోగాలు - ప్రాధాన్యతల్లో తేడా

ఎమ్బీయస్‌: హైకోర్టు ఉద్యోగాలు - ప్రాధాన్యతల్లో తేడా

రాష్ట్రం విడగొట్టినపుడు ఫలానా తేదీలోగా హైకోర్టు విడిపోవాలి అని చట్టంలో రాయలేదు. హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా పదేళ్లు వుంటుంది అన్నారు. రేవంత్‌రెడ్డి పట్టుబడబట్టి బాబు ఆంధ్రకు తరలిపోవడానికి కంగారుపడ్డారు కానీ లేకపోతే పదేళ్లూ యిక్కడే కాలక్షేపం చేసేవారు - మేం ప్లాను చేస్తున్న అంతర్జాతీయ స్థాయి రాజధాని యింకా తయారు కాలేదు అంటూ. వెళ్లిపోవడం ఎలాగూ మొదలుపెట్టారు కాబట్టి, హైకోర్టు మాత్రం యిక్కడెందుకు, చీల్చేసి మీది మీరు పట్టుకుపోండి అని తెలంగాణ వారనసాగారు. తెరాస ప్రభుత్వం తలపెట్టిన అనేక తిక్కపనులకు హైకోర్టు అడ్డుపడింది. దాంతో తమ రాష్ట్రానికంటూ వేరే హైకోర్టు వచ్చి దాన్ని తనవాళ్లతో నింపేస్తే తప్ప తమ మాట చెల్లదని తెరాస ఫీలవసాగింది. నిజానికి యిలాటివన్నీ విభజన చట్టం తయారు కావడానికి ముందే తేల్చుకోవలసిన విషయాలు. ఉమ్మడి కుటుంబం విడిపోతున్నపుడు ముందుగా ఫలానాది నీకు, ఫలానాది నాకు అని మాట్లాడుకుని, రాజీపడి అప్పుడు పార్టిషన్‌ డీడ్‌ రాసుకుంటారు. విడాకులు తీసుకునేముందు భరణం ఎంత, పిల్లలెవరి దగ్గర వుండాలి వంటి విషయాలు తేల్చుకుని అప్పుడు విడాకుల పత్రం మీద సంతకాలు చేస్తారు. మరి దాదాపు 6 దశాబ్దాలు కలిసి వున్న ఆంధ్ర-తెలంగాణ కాపురం విడాకులు తీసుకునేముందు ఎన్ని విషయాలు తేల్చుకోవాలి, అవన్నీ తర్వాత చూసుకుంటాం అంటూ చట్టం తయారు చేసేశారు. వాటికి తెరాసతో సహా పార్టీలన్నీ ఆమోదముద్ర కొట్టేశాయి. చర్చలు మొదలుపెడితే విభజన ఆలస్యమౌతుందని గాభరా అప్పుడు. ఎలాగోలా రాష్ట్రం సాధించుకోవాలని ఆదుర్దా. అడావుడిగా పనులు చేసినప్పుడు అవకతవకలు వస్తాయి మరి. ప్రస్తుతం గొడవంతా వంద ఉద్యోగాల గురించి! ఆట్టే మాట్లాడితే వాళ్ల ప్రమోషన్ల గురించి! విభజన వలన ఎంతోమంది ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆదాయాలు, జీవితాలు తలకిందులై పోయాయి. వాటిని పట్టించుకునేవాడు లేడు కానీ దీని గురించి మొత్తం న్యాయవ్యవస్థను స్తంభింపచేసి సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురయ్యారు. 

విభజన జరిగినా ఉమ్మడి కాపురం పదేళ్లపాటు సాగాలని చట్టంలో వుండగా యిప్పుడు తెరాస 'రాష్ట్రం విడిపోయాక కూడా యింకా మీ పెత్తనం ఏమిటి? ఉద్యమం జరిగినదే నీళ్లు, నిధులు, నియామకాలకు. ఒకప్పుడు గుంటూరులో హైకోర్టు బెంచి కావాలని నెలల తరబడి ఆందోళన చేశారు. ఇప్పుడు బెంచీ, కుర్చీ ఏం ఖర్మ, హైకోర్టే పట్టుకెళ్లి పెట్టుకోండి.' అని ఆందోళన చేయసాగింది. 'పాపం మీ కక్షిదారులు యింత దూరం రావడం ఎందుకు?' అని ఆంధ్రులపై జాలి పడడం కూడా మొదలుపెట్టారు. 'హైకోర్టు ఎక్కడ పెట్టాలో యింకా తేల్చుకోనే లేదు. మాకేం తొందర లేదు.' అనసాగారు చంద్రబాబు. 'అనేక ఉమ్మడి ఆస్తుల పంపిణీ జరగలేదు, నదీజలాల కేటాయింపు జరగలేదు. ఎన్నో అంశాలు పెండింగులో వున్నాయి. సామరస్య ధోరణి ఎక్కడా కనబడటం లేదు. చేస్తే అన్నీ ఒకేసారి కూర్చుని తేలుద్దాం. హైకోర్టు మా ప్రాధాన్య అంశం కాదు. ఎన్నో పోగొట్టుకున్నాం. ఇప్పుడు హైకోర్టు పట్టుకెళితే అర్జంటుగా ఒరిగేదేమీ లేదు.' అని బాబు హైకోర్టు వివాదాన్ని యితర సమస్యలతో కలిపి ముడివేశారు. అది తెరాసకు నచ్చటం లేదు. ''కలియుగ మహాభారతం'' సినిమాలో నూతన్‌ ప్రసాద్‌ తండ్రి పేరు చెప్పుకుని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన అహంభావి యువకుడి పాత్ర వేశారు. ప్రచారానికి వెళ్లి ఓటేయమని అడిగితే ఓటరు ''నాకు యిల్లు లేదండి'' అంటాడు. ఇతనికి చిర్రెత్తుకొస్తుంది. ''నీ యింటి గురించి ఎవడడిగాడ్రా? ఓటు గురించి నేను మాట్లాడుతూంటే నీ వెధవ యిల్లు గురించి మాట్లాడతావేమిటి? నీ సొద ఎవడికి కావాలి?'' అని మండిపడతాడు. ఇప్పుడు తెరాస కూడా అదే ధోరణిలో ''జలాల పంపిణీ, షెడ్యూలు 9,10 సంస్థల ఆస్తుల పంపిణీ అంటూ మాట్లాడతారేమిటి? వాటి గురించి మాకక్కరలేదు. మాక్కావలసింది, అర్జంటుగా హైకోర్టు చీల్చడం. అది మాక్కావాలి కాబట్టి మీరు వెంటనే దాని మీద పనిచేయాలి.'' అంటోంది. ''మాకు యిక్కడ వుండడానికి యిల్లే లేదు, ఉద్యోగులు లేరు, వాళ్లకు క్వార్టర్సు లేవు, ఇటికా, యిసుకా దగ్గర్నుంచి అన్నీ వెతుక్కుంటున్నాం. కోర్టుకేం తొందర!'' అంటుంది టిడిపి.

 ''ఓస్‌, దానికేముంది, ఇప్పుడు వున్న హైకోర్టులోనో, వేరే బిల్డింగులోనో హైదరాబాదులో ఆంధ్ర హైకోర్టు ఏర్పాటు చేసేస్తాం. మీరు వూ అంటే చాలు'' అని గ్రాండ్‌ ఆఫర్‌ యిచ్చింది తెరాస, కేంద్రానికి కూడా చెప్పింది. 'హైదరాబాదులో వున్న ప్రతీ బిల్డింగూ, ప్రతీ ఆస్తీ మాదే. ఉమ్మడి గుమ్మడి జాన్తానై' అంటున్న తెరాస యీ విషయంలో మాత్రం ఔదార్యం కురిపించినా హైకోర్టు 'నో, థ్యాంక్స్‌' అనేసింది 2015 మే 1 నాటి తన తీర్పులో. 'ఆంధ్ర హైకోర్టు ఏర్పాటులో తెలంగాణ ప్రభుత్వానికి ఏ పాత్రా లేదు, రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్రపు హైకోర్టు ఆ రాష్ట్రంలోనే వుండాలి, హైదరాబాదు యుటీ అయి వుంటే వేరే విషయం, కానీ దాన్ని తెలంగాణకు యిచ్చేశారు కాబట్టి, ఆంధ్ర హైకోర్టు సొంత భవనంలో గాని, అద్దె భవనంలో గాని వుండడానికి వీల్లేదు. ఆంధ్ర హైకోర్టు వెలసేవరకు ప్రస్తుత హైకోర్టు ఉమ్మడిగానే వుంటుంది.' అని కుండ బద్దలు కొట్టి చెప్పేసింది. దాన్ని పునస్సమీక్షించమంటూ తెలంగాణ ప్రభుత్వం మళ్లీ కోర్టు తలుపు తట్టింది. జులై 21కు వాయిదా. న్యాయమార్గాల్లో వెళితే యిలాటి చిక్కులు వస్తున్నాయని యిక ఆందోళన మార్గం చేపట్టింది తెరాస. ఎక్కడా కనీవిని ఎరగనట్లుగా న్యాయాధిపతులు రోడ్డెక్కారు. న్యాయాధీశులు కార్మికుల్లా ప్రవర్తించడమేమిటని కోర్టు చికాకు పడింది. కఠినంగానే వ్యవహరించిందని చెప్పాలి. అసలింతకీ యీ నియామకాల గొడవేమిటి? 

మొట్టమొదటగా చెప్పవలసినది - ఇదంతా ఒక వింత హైపోథిసిస్‌పై ఆధారపడి ఆలోచించడం వలన వస్తోంది. అదేమిటంటే పక్షపాతరహితంగా న్యాయం చెప్పవలసిన న్యాయమూర్తి అలా చెప్పడని, తను ఏ ప్రాంతానికి చెందినవాడైతే ఆ ప్రాంతానికి అనువుగా తీర్పు చెప్తాడని అనుకుంటున్నారు. అందుకే తెలంగాణ కేసులను తెలంగాణవారే నిర్ణయించాలని, తెలంగాణ కోర్టుల్లో ఆంధ్రులు వుండకూడదని అనడం. ఏ న్యాయమూర్తయినా తన ఎదుటకు వచ్చిన ఆధారాల బట్టి తీర్పు చెప్పగలడు కానీ తన యిష్టాయిష్టాల బట్టి, ప్రాంతీయాభిమానం బట్టి చెప్పలేడు కదా. కక్షిదారుల్లో ఒకరు ఆంధ్రకు, మరొకరు తెలంగాణకు చెందినవారైతే న్యాయం తెలంగాణవారి పక్షాన వున్నా, ఆంధ్ర జడ్జి ఆంధ్ర కక్షిదారుకి అనుకూలంగా తీర్పు చెప్తాడా? ఒకవేళ యిద్దరూ తెలంగాణావారే అయితే అప్పుడెవరి పక్షాన చెప్తాడు? ఇద్దరూ ఆంధ్రావాళ్లే అయితే అప్పుడు తన సొంత జిల్లావాడి పక్షాన చెప్తాడా? ఆంధ్రలో కాని, తెలంగాణలోకాని అందరూ ఒకేలా ఆలోచిస్తారా? తెరాస ప్రభుత్వ విధానాలను ఆమోదించని తెలంగాణ జడ్జి తీర్పు చెప్తే అప్పుడేమని అడుగుతారు? ముఖ్యమంత్రి కులస్తుడినో, ఆయన యింటి పక్కవాణ్నో ఆ స్థానంలో వేయమంటారా? జడ్జి మన వూరువాడో, మన కులస్తుడో అయితే మన తరఫున సాక్ష్యాలెలా వున్నా, మన లాయరు ఎలా వాదించినా గెలుపు మనదేనా? ఏమిటీ తర్కం? ఇలాటి వింత ఆలోచనాధోరణి చేతనే జడ్జి ప్రాంతం గురించి యింత రగడ సాగుతోంది. దేశంలోని న్యాయవ్యవస్థ మాత్రం యిలా ఆలోచించదు. అందుకే భారతదేశవాసి ఎవరైనా ఎక్కడైనా న్యాయాధికారి కావచ్చు. కోర్టువారు పెట్టే పరీక్ష పాసవ్వాలి. దిగువ కోర్టుల్లో అయితే ప్రాంతీయ భాష వచ్చి వుండాలి. అంతే!

ఇప్పుడున్న జడ్జిల్లో ఎవరు ఏ ప్రాంతం వాళ్లు అనే గణాంకాలను ఉద్యమకారులు ముందుకు తెచ్చారు. వాటిపై చర్చించడానికి ముందు రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఒకటి - యివి కోటాల్లో వచ్చిన ఉద్యోగాలు కావు. ప్రతిభతో పరీక్షలు రాసి తెచ్చుకున్న వుద్యోగాలు. రెండు - ఎవరు ఆంధ్ర, ఎవరు తెలంగాణ అనేది తేల్చడం సులభం కాదు. దానికి ఎవరికి తోచినట్లు వారు నిర్వచనాలు చెప్తున్నారు. గతంలో ఉద్యమకాలంలోనే హైకోర్టులో నియామకాల గురించి న్యాయవాదులు ఆందోళన చేసినప్పుడు 'గుంటూరు నుంచి హైకోర్టు తరలించినప్పుడు వచ్చిన ఆంధ్ర న్యాయవాదుల పిల్లలు యిక్కడే పెరిగి, పెద్దవారై, చదువుకుని, ప్రాక్టీసు చేస్తూ వుంటే వారు స్థానికులు కామని ఎలా అనగలం?' అని అడిగారు. దానికి గుత్తా సుఖేందర్‌ రెడ్డి వంటి సీనియరు నాయకులు 'ఆంధ్రోళ్ల పిల్లల్ని తెలంగాణవారని ఎలా అంటాం?' అని వాదించారు. అంటే ఎవరైనా తెలంగాణ అవునో కాదో తెలుసుకోవాలంటే తాత, ముత్తాల దాకా వెళ్లాలన్నమాట. (కార్పోరేషన్‌ ఎన్నికలు వస్తే మాత్రం తెలంగాణలో వుండేవారందరూ తెలంగాణ వారే అంటారు) ఈ పద్ధతికి చట్టబద్ధత లేదు. ఉద్యోగంలో చేరినప్పుడు రాసిన జన్మస్థలం పేరు బట్టి నేటివిటీ నిర్ధారించి జాబితా తయారు చేయడం కూడా కరక్టు కాదు. ఎందుకంటే  పిల్లలు సాధారణంగా అమ్మమ్మగారింట్లో పుడతారు. ఉద్యోగరీత్యానో, మరో కారణం చేతనో అప్పటికి మాతామహుడు ఎక్కడ వుంటే అక్కడ పుడతారు. అదే సొంత వూరు అని ఎలా అనగలరు? ఎక్కడ పెరిగితే, ఎక్కడ ఎక్కువకాలం విద్యాభ్యాసం చేస్తే అదే నేటివ్‌ ప్లేస్‌గా పరిగణించమని చట్టాలు చెప్తున్నాయి. అవేమీ పట్టించుకోకుండా పోటీ పరీక్షలో తనకంటె ఎక్కువ మార్కులు తెచ్చుకున్న ప్రతివాడి మీద 'ఆంధ్రోడు' ముద్ర వేద్దామంటే కుదురుతుందా?

వాళ్ల లెక్క ప్రకారం హైదరాబాదు హైకోర్టులో 61 జడ్జి పోస్టులు శాంక్షనైతే 25 మంది మాత్రమే సిటింగ్‌ జడ్జిలున్నారు. వారిలో 18 మంది ఆంధ్రవారు, 3గ్గురు తెలంగాణ వారు, 4గురు తెలంగాణ వారు. హైకోర్టు జడ్జిల నియామకం మాత్రం మూడోవంతు మందిని పదేళ్ల అనుభవం వున్న జిల్లా జడ్జిల నుండి, తక్కిన రెండు వంతుల మందిని సీనియర్‌ న్యాయవాదుల నుంచి ఎంపిక చేస్తారు. జిల్లా జడ్జిలు 234 మంది కాగా, ఆంధ్రులు 140, తెలంగాణవారు 94, సీనియర్‌ సివిల్‌ జడ్జిలు 195 మంది కాగా, ఆంధ్రులు 117 మంది, తెలంగాణ  వారు 78, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు 533 మంది కాగా, ఆంధ్రులు 320, తెలంగాణవారు 213. వీరంతా పరీక్షలు పాసయి ఉద్యోగాలు తెచ్చుకున్నవారే. అనుభవం లేకపోయినా లా చదివి వుంటే జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టుకి అప్లయి చేయవచ్చు. జిల్లా జడ్జి కావాలంటే ఏడేళ్లు లాయరుగా అనుభవం వుండాలి. పరీక్షలు హైకోర్టే నిర్వహిస్తుంది. కేసులెన్నో పెండింగులో వున్నాయని కింది స్థాయి న్యాయమూర్తుల నియామకం చేపడదామని చూస్తే పోటీ పరీక్షలంటే భయమో ఏమో హైకోర్టు చీల్చేదాకా నియామకాలు జరగడానికి వీల్లేదని తెలంగాణ న్యాయోద్యోగులు ఆందోళన చేశారు. విభజన పైనుంచి జరగాలా, కింద నుంచి జరగాలా అన్నదానిపై కోర్టుకు, వీళ్లకు మధ్య భేదాభిప్రాయాలున్నాయి.  వివాదం సుప్రీం కోర్టుదాకా వెళ్లింది. చివరకు సుప్రీంకోర్టు 2015 డిసెంబరు 10 నాటి ఆదేశాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయాధికారులను ఆంధ్ర, తెలంగాణల మధ్య 60-40 నిష్పత్తిలో పంచమంది.  ప్రభుత్యోద్యోగుల పంపిణీకై కమలనాథన్‌ కమిటీ వేయడం, అది వివాదాలతో కూరుకుపోవడం చూశాం. హైకోర్టు మాత్రం పద్ధతి ప్రకారం చేద్దామని చూస్తోంది. 

 2016 జనవరి 12 న న్యాయాధికారులను యిరు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభించింది. తాము ఏ రాష్ట్రంలో పనిచేయాలనుకుంటున్నారో ఆప్షన్‌ యివ్వాలని సబార్డినేట్‌ జడ్జిలను అడిగింది. దీని తర్వాత ఫిబ్రవరి 26 న కోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆప్షన్‌ యివ్వడానికి గైడ్‌లైన్స్‌ విడుదల చేశారు. సీనియారిటీ, నేటివిటీ గైడ్‌లైన్స్‌గా న్యాయాధికారులను విభజిస్తామని దానిలో చెప్పారు. తెలంగాణ జడ్జిల్లో 200 మంది కొందరు టిజెఎ (తెలంగాణ జడ్జ్‌స్‌ అసోసియేషన్‌)గా ఏర్పడి దీన్ని తప్పుపట్టారు. మే 3 న తుది జాబితా విడుదలైంది.  ప్రమోషన్లను దృష్టిలో వుంచుకుని 'ఆంధ్ర' న్యాయమూర్తుల్లో చాలామంది తెలంగాణకు ఆప్షన్‌ యిచ్చారు. ఈ కేటాయింపులు ఎలా చేయాలన్నదానిపై సలహా సంఘం వేస్తే అది ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. అందువలన 25 జడ్జిలతో కూడిన హైకోర్టు ఫుల్‌ కోర్టు దీనిపై నిర్ణయం తీసుకుంది. జడ్జిల్లో ఆంధ్రులు ఎక్కువగా వున్నారు కాబట్టి యిలాటి కేటాయింపు జరిగిందంటూ దానికి నిరసనగా తెలంగాణా న్యాయవాదుల జాక్‌ జూన్‌ 13న చీఫ్‌ జస్టిస్‌ ఛాంబర్‌ ఎదుట ప్రదర్శనలు నిర్వహించారు. టిజెఎ చీఫ్‌ జస్టిస్‌కు సమర్పించిన పిటిషన్‌లో - 'తెలంగాణకు కేటాయించిన 95 జిల్లా జడ్జిలలో 46 మంది ఆంధ్ర నేటివ్స్‌. ఆంధ్రలో 140 పోస్టులుండగా 110 మంది మాత్రమే ఆంధ్రకు ఆప్షన్‌ యిచ్చారు. అక్కడ 30 ఖాళీలుంచారు. అక్కడ 30 ఖాళీలున్నపుడు యీ 46 మందిలో 30 మందిని అక్కడ నియమించకుండా తెలంగాణకు ఎందుకు కేటాయించారు? చిన్నా, పెద్దా కలిపి మొత్తం న్యాయాధికారుల వేకెన్సీలు ఆంధ్రలో 100 వున్నాయి. వాటిని అలాగే వుంచి 134 మంది ఆంధ్రులను తెలంగాణకు కేటాయించారు. వారినక్కడ వేసి వుంటే ఆ 100 పోస్టుల్లో తెలంగాణ వారికే అవకాశం వచ్చేది కదా.' అన్నారు. ఈ అంకెలపై హైకోర్టు కాని, యితరులు కానీ వ్యాఖ్యానాలు చేయలేదు. న్యాయవ్యవస్థ గురించి సాధారణంగా కోర్టులు గోప్యత పాటిస్తాయి. మీడియాతో కూడా ఎక్కువగా మాట్లాడరు. ఆంధ్రకు చెందిన మొత్తం జడ్జిల్లో 10% మంది మాత్రమే తెలంగాణకు ఆప్షన్‌ యిచ్చారని ఆంధ్ర వర్గాలు చెప్పాయని పేపర్లో వచ్చింది. ఈ అంకెలే కరక్టనుకున్నా ఆంధ్రలోని ఆ 100 పోస్టులు ఆంధ్రులకే రిజర్వ్‌ చేయలేదు కదా. దేశంలో ఎవరైనా - తెలంగాణ వారితో సహా - వాటికై పోటీ చేయవచ్చు. మా సొంత రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రానికి వెళ్లి ఎందుకు పనిచేయాలి? అంటే దానికి జవాబుగా మరి బొంబాయి, దుబాయి ఎందుకు వెళుతున్నారు? అని అడగాల్సి వస్తుంది. తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలోనే పనిచేయాలనుకునే ధోరణి పెరుగుతోంది. బియస్‌ఎన్‌ఎల్‌ను రెండు సర్కిళ్లుగా విభజించినప్పుడు మమ్మల్ని ఆంధ్రలో వేయడానికి వీల్లేదు, అండమాన్‌లో నైనా పనిచేస్తాం కానీ, ఆంధ్రలో చేయం అని కొందరు ఉద్యోగులు హెచ్చరించారట. దేశంలో ఎక్కడైనా పనిచేస్తామని రాసి యిచ్చి ఉద్యోగంలో చేరే కేంద్రప్రభుత్వ ఉద్యోగులు అలా అంటే ఎలా కుదురుతుంది? 

వివాదమంతా యీ వంద పోస్టుల గురించే అనుకోవాలి. 100 మంది న్యాయాధికారులు ఏ ప్రాంతానికి చెందినవారైతే ఏమవుతుందో సామాన్యుడికి అర్థం కాదు. టిజెఎ పిటిషన్‌ యిచ్చి వూరుకోలేదు. కొందరు జూన్‌ 26 న గవర్నరు వద్దకు మార్చి చేసుకుంటూ వెళ్లారు. కనీవినీ ఎరగని యీ సంఘటనపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మండిపడ్డారు. బహుశా సుప్రీం కోర్టు న్యాయమూర్తులను సంప్రదించే మర్నాడు అసోసియేషన్‌ అధ్యక్షుడు, కార్యదర్శిని సస్పెండ్‌ చేశారు. ఆ మర్నాడు మరో 9 మంది జడ్జిలను సస్పెండ్‌ చేశారు. న్యాయశాఖ ఉద్యోగుల వ్యవహారాల్లో కోర్టుదే అంతిమ అధికారం. ప్రభుత్వాలేమీ చేయలేవు. దాంతో టిజెఎ సభ్యులు సామూహిక సెలవులో వెళ్లారు. సస్పెన్షన్‌ ఎత్తివేస్తేనే ఆందోళన విరమిస్తామని కాస్త బెట్టు చేసి చివరకు చర్చల హామీ తీసుకుని విరమించారు. ఈ ఆందోళనల వెనక కెసియార్‌ వున్నారనేది బహిరంగ రహస్యం. అందుకే న్యాయవాదులు చంద్రబాబుకి హెచ్చరికలు చేసే ప్లకార్డులు పట్టుకున్నారు. విద్యుత్‌ సంస్థ ఉద్యోగుల త్రిశంకు వ్యవహారం కళ్లముందు కనబడుతోంది. ఎలాగోలా ఆంధ్రమూలాల వారిని తరిమివేసినా, యితర రాష్ట్రాల వారి వచ్చి పరీక్షలు పాసయితే వారినేం చేస్తారు? పైగా ఉద్యోగులకు ఆప్షన్లు యిచ్చే అవకాశం వుండకూడదనే వాదన కోర్టులో చెల్లదు. హైకోర్టు కేటాయింపులు చేసినపుడు న్యాయవిరుద్ధంగా చేసిందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే పైన సుప్రీం కోర్టుకు వాళ్లు జవాబు చెప్పుకోవాలి. విభజనకు సంబంధించి మొత్తం అన్నిటితో కలిపి పరిష్కరించినప్పుడే హైకోర్టు విభజన గురించి మాట్లాడతానని బాబు గవర్నరుకు నిర్మొగమాటంగా చెప్పడంతో గవర్నరు కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ విషయంలో కేంద్రం చొరవ తీసుకోవాలి అని రాసి ముగించవచ్చు. కానీ చొరవ తీసుకున్న సందర్భాల్లో కూడా యిరు రాష్ట్రాలు వాళ్ల మాట ఖాతరు చేయటం లేదని గుర్తించాలి. ఏదీ సరిగ్గా తేల్చుకోకుండా పెద్దమ్మ, చిన్నమ్మ చేతులు కలిపి, ప్రశ్నలడిగేవాళ్లని చావకొట్టి, చీకట్లో చీలిక చట్టం చేసిపారేస్తే దాని ఫలితాలు యిలాగే అఘోరిస్తాయి.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2016) 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?