Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: హిల్లరీ పరువు తీసినది రష్యానా?

ఎమ్బీయస్‌: హిల్లరీ పరువు తీసినది రష్యానా?

అమెరికా ఎన్నికలలో డెమోక్రాటిక్‌ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్‌ వివాదరహితంగా జరగలేదు. రాష్ట్రాల ఎన్నికలలో డెమోక్రాటిక్‌ పార్టీ నేషనల్‌ కమిటీ పక్షపాత వైఖరి అవలంబించి, శాండర్స్‌పై దుష్ప్రచారం చేసి, హిల్లరీని ఎలాగైనా నెగ్గించాలని ప్రయత్నించిందని నిరూపించే ఈమెయిల్స్‌ బయటపడడంతో హిల్లరీ పరువు పోయింది. ఈ కమిటీ నాయకురాలైన డెబ్బీ షుల్ట్‌జ్‌ రాజీనామా చేయవలసి వచ్చింది. కమిటీ సభ్యులు అంతర్గతంగాను, రాష్ట్రాలలోని తమ పార్టీ నాయకులకు పంపిన 20 వేల ఈమెయిల్స్‌ను వికీలీక్స్‌ బయటపెట్టింది. ఇదంతా రష్యా ప్రమేయంతోనే జరిగిందని హిల్లరీ వర్గం ఆరోపిస్తోంది. నిజానిజాలు తేల్చడానికి పార్టీ క్రౌడ్‌స్ట్రయిక్‌ అనే డిజిటల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ సంస్థను వినియోగించింది. డెమోక్రాటిక్‌ పార్టీ ఓటర్ల సమాచార సేకరణకు, నిధుల సేకరణకు ఉపయోగిస్తున్న కంప్యూటర్లపై 2015 జూన్‌ నుంచి ''కోజీ బేర్‌'' అనే సంస్థ ద్వారా, 2016 ఏప్రిల్‌ నుంచి ''ఫ్యాన్సీ బేర్‌'' అనే సంస్థ ద్వారా హ్యేక్‌ చేసిందని, దానికి రష్యన్‌ మిలటరీ యింటెలిజెన్సు సర్వీసు (జిఆర్‌యు)కు సంబంధం వుందని హిల్లరీ అనుయాయులంటున్నారు.  ఈ విషయాలను అమెరికా ప్రభుత్వాధికారులు కూడా ధృవీకరిస్తున్నారు. ఈ విషయాలను సహజంగానే రష్యా ఖండించింది. ఈమెయిల్స్‌ బయటపడితే హిల్లరీ కెందుకు యిబ్బంది? 

హిల్లరీ అందరికీ పరిచితురాలే. ప్రజాహక్కుల కోసం, బాలల, మహిళల హక్కుల కోసం పోరాడే న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకుంది.1975లో పెళ్లయినా స్వతంత్ర భావాలు కల హిల్లరీ రోధామ్‌ అనే తన యింటిపేరు  ఓ పట్టాన మార్చుకోలేదు. ఆమె భర్త బిల్‌ క్లింటన్‌ అర్కన్సాస్‌కి గవర్నరు అయినా దరిమిలా 1992లో, 1996లో దేశాధ్యక్షుడైనా తనకంటూ ఒక ప్రత్యేకత ఎప్పుడూ నిలబెట్టుకుంటూనే వచ్చింది. ఆమెను ఎంపిక చేసిన సమావేశంలో ఒబామా దంపతులు, బిల్‌ క్లింటన్‌ అందరూ ఆమెను ఆకాశానికి ఎత్తివేశారు. ఆమె నెగ్గితే ప్రప్రథమ మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టిస్తుంది. హిల్లరీ నెగ్గితే ఒబామాకు మూడో టెర్మ్‌ యిచ్చినట్లే అని రిపబ్లికన్లు చెప్పేది నిజమే అనుకోవాలి. దాన్ని మెప్పుగా అనుకోవాలో, నిందగా అనుకోవాలో అనేది వారివారి దృక్పథంపై ఆధారపడి వుంటుంది. తన విధానాలను కొనసాగించాలంటే హిల్లరీనే ఎన్నుకోవాలని ఒబామా పిలుపు నిచ్చాడు. హిల్లరీ కూడా అదే చెపుతోంది. ఇప్పటిదాకా జరుగుతున్నదేమిటి? అమెరికాలోని 40% సంపదను పోగేసుకున్న 1% కంపెనీలు, సంస్థలు తమ చిత్తం వచ్చినట్లు లాభాలు ఆర్జిస్తూ వచ్చాయి. పరదేశాలలో శాఖలు పెడుతూ, పరదేశస్తుల చేత పనులు చేయించుకుంటూ స్థానికులకు ఉద్యోగావకాశాలు లేకుండా చేశాయి. ఒబామా ప్రభుత్వం దాన్ని అనుమతిస్తూ వచ్చింది. దీనివలన అమెరికన్‌ కార్మికుల జీవితం అతలాకుతలం అయిపోయాయని డెమోక్రాటిక్‌ పార్టీలోనే హిల్లరీకి ప్రత్యర్థి ఐన బెర్నీ శాండర్స్‌ వాదిస్తూ వచ్చాడు. తను అధికారంలోకి వస్తే యీ 1%ను నియంత్రిస్తానన్నాడు. మధ్యతరగతి ప్రజలు, యువత, కార్మికులు అతన్ని సమర్థించారు. అందువలన అతను ఎన్నిక కావడం 1% వాళ్ల ప్రయోజనాలను దెబ్బ తీస్తుంది. రిపబ్లికన్‌ పార్టీ తరఫున ట్రంప్‌ కూడా యిలాటి భాషే మాట్లాడుతున్నాడు. అందువలన యథాతథ పరిస్థితి కొనసాగాలంటే హిల్లరీయే నెగ్గాలని వారి ఆశ. దానికి అనువుగా పావులు కదిపారు. డెమోక్రాటిక్‌ పార్టీ సభ్యుల్లో కొందరికి కూడా యిలాటి ఆలోచనలే. వాళ్లు వీళ్లతో చేతులు కలిపారు. ప్రైమరీలలో హిల్లరీకు అనుకూలంగా శాండర్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారు.

మరో రకమైన ఈ మెయిళ్లతో కూడా హిల్లరీ విమర్శల నెదుర్కుంది. ఆమె సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌గా వున్నపుడు రహస్య (క్లాసిఫైడ్‌) సమాచారాన్ని తన వ్యక్తిగత ఈ మెయిల్‌ సర్వర్‌ద్వారా పంపింది. అది దేశద్రోహం కిందే వస్తుందని ట్రంప్‌ విమర్శించాడు. 'దానిలో ఆమె నిర్లక్ష్యమే కనబడుతోంది తప్ప దురుద్దేశం కనబడటం లేదు' అని ఎఫ్‌బిఐ అంది. ఎఫ్‌బిఐ ప్రభుత్వసంస్థ కాబట్టి, ప్రభుత్వం హిల్లరీకి అనుకూలం కాబట్టి ఆ సర్టిఫికెట్టుకి విలువ ప్రశ్నార్థకమే. విషయం బయటకు రాగానే హిల్లరీ 30 వేల ఈమెయిళ్లను డిలీట్‌ చేసిందని, ఆ 30 వేల ఈ మెయిళ్లలోని సమాచారమేమిటో చెప్పాల్సింది మీరేనని ట్రంప్‌ రష్యన్లను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అలా అడగడం జాతీయభద్రతపై రాజీ పడడమే అని హిల్లరీ క్యాంప్‌ ట్రంప్‌ను నిందించింది. డెమోక్రాటిక్‌ పార్టీలో హిల్లరీ మద్దతుదారులకు కొదవ లేదు. 34 రాష్ట్రాలలో గెలిచింది. జూన్‌ 7 నాటికే తనతో పోటీ పడిన శాండర్స్‌పై ఆమె ఆధికత్యత సాధించింది. పరాజితుడైన శాండర్స్‌ చాలా హుందాగా ప్రవర్తించాడు. హిల్లరీకి బలం వుందని తోచగానే ఆమెను బలపరచమని తన అనుచరులకు పిలుపు నిచ్చాడు. నిజానికి వారందరూ హిల్లరీకి పూర్తి వ్యతిరేకంగా వున్నారు. సమావేశస్థలంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వారిని చల్లార్చడానికి శాండర్స్‌ చాలా కష్టపడ వలసి వచ్చింది. ఇంత చేసినా హిల్లరీ అతన్ని తనతో పాటు ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేయలేదు. పెద్ద వ్యాపారస్తులతో సంబంధాలున్న టిమ్‌ కేన్‌ను తన రన్నర్‌గా ఎంచుకుంది. వారి దగ్గర్నుంచి ఖరీదైన బహుమతులు తీసుకున్న అతనికి ట్రంప్‌  'కరప్ట్‌ కేన్‌' అనే పేరు పెట్టాడు. 

ట్రాన్స్‌-పసిఫిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లినది ఒబామాయే. హిల్లరీ దాన్ని గతంలో సమర్థించింది కానీ ప్రస్తుతం వ్యతిరేకిస్తోంది ఎందుకంటే దాన్ని వ్యతిరేకించిన శాండర్స్‌ చాలామందికి ఆప్తుడయ్యాడు. ఆ ఒప్పందాన్ని ట్రంప్‌ కూడా వ్యతిరేకిస్తున్నాడు. ఇవన్నీ ఎన్నికల ముందు జరిగే వాదనలే తప్ప రిపబ్లికన్లు నెగ్గినా, డెమోక్రాట్లు నెగ్గినా అమెరికాలో విధానపరమైన మార్పు పెద్దగా వస్తుందని ఆశించలేము. ఎందుకంటే మార్పు తీసుకురావడం అంత సులభం కాదు. ముస్లిములంటే ట్రంప్‌కు పడదు కాబట్టి పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్తాడని మన భారతీయులు ఆశపెట్టుకున్నాం కానీ రిపబ్లికన్‌ పార్టీ జాతీయ సమావేశంలో ఆమోదించిన తీర్మానం చూడండి - ఇండియా కీలకస్థానంలో వున్న మిత్రుడు! మరి పాకిస్తాన్‌? 'టెర్రరిజంను, తాలిబన్లను ఎదుర్కోవడంలో మన భాగస్వామి. పాకిస్తాన్‌ అణ్వాయుధాలను మనం కాపాడుకోవాలి.' అన్నారు. అమెరికన్‌ మిలటరీ స్థావరాలు పాకిస్తాన్‌లో వున్నాయి. వాటిని రక్షించుకోవడానికైనా పాకిస్తాన్‌తో చెలిమి కొనసాగిస్తారు. హిల్లరీ కూడా పాకిస్తాన్‌ అభిమానే. ఇలాగే మధ్యప్రాచ్యం వ్యవహారాల్లో అమెరికా తలదూర్చడం మానేస్తుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్లకు చౌకగా పెట్రోలు కావాలి. ఆ దేశాల్లో పెట్టుబడులు పెట్టి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్‌ కంపెనీల ప్రయోజనాలను కాపాడాలి.

ఇక ఎన్నికల విషయానికి వస్తే హిల్లరీ ప్రస్తుతం లీడ్‌లో వుంది. డెమోక్రాట్లకు అన్ని జాతులవారు ఓట్లేయడం చాలాకాలంగా సాగుతోంది. శ్వేతజాతీయులు కానివారి పట్ల ట్రంప్‌పై  నానాటికీ ద్వేషం ప్రకటించడంతో పోలరైజేషన్‌ జరిగి యితర జాతులన్నీ హిల్లరీని సమర్థించవచ్చు. హిల్లరీ యథాతథ స్థితి కొనసాగిస్తుందనే నమ్మకంతో 1% వారి నిధులిచ్చి ఆదుకోవచ్చు కూడా.   ఇది జరగకూడదని పుతిన్‌ వ్యూహరచన సాగించాడని అంటున్నారు. విదేశీ వ్యవహారాలు చూసిన హిల్లరీ రష్యాకు, పుతిన్‌కు వ్యతిరేకంగా చాలా చర్యలు చేపట్టింది. వ్యక్తిగతంగా దెబ్బ తీయడానికి తనకు వ్యతిరేకంగా 2011లో రష్యా వీధుల్లో నిరసన ప్రదర్శనలు జరిపించిందని పుతిన్‌ నమ్మకం. ఆమెకు ప్రత్యర్థిగా నిలబడుతున్న ట్రంప్‌ రాజకీయభావాలు ఎటువంటివో తెలియదు కాబట్టి అతను ఒక ప్రశ్నార్థకమే కానీ హిల్లరీ మాత్రం శత్రువు. రిపబ్లికన్‌ పార్టీలో ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన మిట్‌ రోమ్నీ రష్యాను ''మన రాజకీయ శత్రువు నెం.1'' అని వర్ణించాడు. ట్రంప్‌ మాత్రం రష్యాలో మానవహక్కుల హరణం గురించి వ్యాఖ్యానించడానికి నిరాకరించాడు. అంతేకాదు, తనను హీరోగా వర్ణిస్తూ ఓ సారి ట్వీట్‌ చేయడం, నాటో ఒప్పందానికి విరుద్ధంగా బహిరంగంగా మాట్లాడడం పుతిన్‌ను మెప్పించి వుంటుంది. ట్రంప్‌ కాంపెయిన్‌ సలహాదారుల్లో ఒకడైన కార్టర్‌ పేజ్‌ రష్యన్‌ ప్రభుత్వానికి చెందిన ఎనర్జీ సంస్థ గాజ్‌ప్రోమ్‌కు సలహాదారు. ఉక్రెయిన్‌ మాజీ ప్రెసిడెంటు, పుతిన్‌ అనుయాయి అయిన విక్టర్‌ యానుకోవిచ్‌కు వ్యూహకర్తగా వున్న పాల్‌ మానాఫోర్ట్‌ యిప్పుడు ట్రంప్‌ కాంపెయిన్‌కు చైర్మన్‌. రిపబ్లికన్‌ జాతీయ సమావేశానికి ముందు తయారుచేసిన చిత్తుప్రతి తీర్మానంలో 'ఉక్రెయిన్‌ తిరుగుబాటుదారులకు మారణాయుధాలు సరఫరా చేయాలనే' తీర్మానం వుంది. కానీ ట్రంప్‌ వర్గీయులు దాన్ని మార్పించి 'ఉక్రెయిన్‌ తిరుగుబాటుదారులకు తగిన సాయం చేయాలి' అని తీర్మానం చేయించారు. మానాఫోర్ట్‌-ఉక్రెయిన్‌-రష్యా సంబంధాలపై లోతుగా పరిశోధించబోయిన డెమోక్రాటిక్‌ పార్టీ ఆఫీసు ఉద్యోగస్తురాలి ఈ మెయిల్‌ కూడా హ్యేకింగ్‌కు గురైంది. 

తన శత్రువు హిల్లరీపై ట్రంప్‌ పైచేయి సాధించేట్లు చూడడానికి పుతిన్‌ యత్నిస్తున్నాడని అనుకోవచ్చు. అందుకే రిపబ్లికన్‌ సమావేశం పూర్తయి, డెమోక్రాట్ల సమావేశం ప్రారంభం కావడానికి మధ్య నున్న 3 రోజుల వ్యవధిలో హిల్లరీకి యిబ్బంది కలిగించే ఈమెయిళ్లను వికీలీక్స్‌ ద్వారా విడుదల చేయించాడని ''టైమ్‌'' అంటోంది. పుతిన్‌ రష్యన్‌ గూఢచారి వ్యవస్థలో గతంలో పనిచేసి వున్నాడు. సమాచార సేకరణకై రెండేసి గూఢచారి సంస్థలను ఒకరికి తెలియకుండా మరొకరిని నియమించే అలవాటు అతనికి వుందట. శత్రువుల పట్ల సైబర్‌ ఎటాక్‌ చేసే అలవాటు కూడా వుందట. రష్యా నుంచి విడివడిన ఇస్టోనియా దేశం తమ ప్రాంతంలోని సోవియట్‌ యుద్ధవీరుల స్మారకచిహ్నం తొలగించినపుడు పుతిన్‌ దానికి ప్రతీకారంగా ఆ దేశపు కంప్యూటర్‌ వ్యవస్థపై సైబర్‌ దాడి చేయించాడట. దాంతో కొన్ని వారాల పాటు సమస్త కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ దౌత్యాధికారులు వ్యక్తిగత సంభాషణల్లో దొర్లిన అసభ్యపదాల దగ్గర్నుంచి అన్నీ వెలుగులోకి వచ్చేశాయి. క్రిమియా, ఉక్రెయిన్‌ వ్యవహారాల్లో డిస్‌-యిన్‌ఫర్మేషన్‌ కూడా ప్రధాన భూమిక వహిస్తోంది. హిల్లరీ ఎన్నికకై క్లింటన్‌ ఫౌండేషన్‌ ద్వారా నిధుల సేకరణ ఎప్పణ్నుంచో చేస్తున్నారు. ఆ ఫౌండేషన్‌ కంప్యూటర్‌ను జూన్‌లోనే హ్యేక్‌ చేశారంటాడు - ఆమెకు మద్దతుగా నిలిచిన మీడియా మోతుబరి బ్లూమ్‌బెర్గ్‌! ఇప్పుడు యీ ఇ-మెయిల్స్‌ ద్వారా హిల్లరీ ఓటమికి పుతిన్‌ తన వంతు ప్రయత్నం చేస్తున్నాడని అనుకోవచ్చు. కానీ రష్యాపై అమెరికన్లకు ఆగ్రహం కాబట్టి యీ ప్రయత్నం వలన హిల్లరీపై సానుభూతి పెరిగి ఆమె నెగ్గేందుకు దోహదపడవచ్చు కూడా!

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?