Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : హిందువులు అక్రమవలసదారులు కారా?

ఎమ్బీయస్‌ : హిందువులు అక్రమవలసదారులు కారా?

బంగ్లాదేశ్‌ తదితర దేశాల నుంచి మన దేశంలో అక్రమంగా వలస వచ్చినవారికి వ్యతిరేకంగా సరిహద్దుల్లో వున్న రాష్ట్రాలలో ఎప్పుడూ అలజడి రేగుతూనే వుంది. ముఖ్యంగా అసాంలో దీని విషయమై ఆల్‌ అసాం స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఆసు) అనే విద్యార్థి సంస్థ ఏర్పడింది. ప్రఫుల్ల మొహంత, భృగు పూకన్‌ అనే యిద్దరు యువకులు దానికి నాయకులుగా రాష్ట్రంలోని కాంగ్రెసు  ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే నడిపారు. 1971లో బంగ్లాదేశ్‌ ఏర్పడ్డాక అక్రమంగా అసాంకు వచ్చిపడిన బంగ్లాదేశీయులను వెనక్కి పంపేయాలని 1979 నుంచి ఆరేళ్లపాటు హింసాత్మక ఆందోళన నడిపారు. చివరకు రాజీవ్‌ గాంధీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం 1985లో దిగివచ్చి ఆసుతో, రాష్ట్రప్రభుత్వంతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం అమలు చేయాలంటే కాంగ్రెసు వారిని నమ్మడానికి లేదని, తామే రాజకీయాల్లోకి వచ్చి దాన్ని అమలు చేయాలని ప్రచారం చేసుకుని తమ విద్యార్థిసంఘాన్ని అసాం గణపరిషత్‌ (ఎజిపి) అనే ప్రాంతీయపార్టీగా మార్చారు. దానికి ఎన్‌టి రామారావు ఆర్థికంగా తోడ్పడడమే కాక, ఎన్నికలలో దాని పక్షాన ప్రచారం కూడా చేశారు. ఎజిపి నెగ్గి ప్రఫుల్ల ముఖ్యమంత్రిగా, భృగు ఉపముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. ఆ ఒప్పందం ప్రకారం 1971 మార్చి 24 తర్వాత అక్రమంగా వచ్చినవారందరూ - మతంతో సంబంధం లేకుండా - అక్రమవలసదారులే. వారిని వెంటనే గుర్తించి వెనక్కి పంపేయాలి. భారతీయ పాస్‌పోర్టు కానీ విదేశీ ప్రభుత్వంచేత జారీ చేసిన వీసా కానీ లేనివారు, వీసాలో పేర్కొన్న కాలపరిమితికి మించి భారతదేశంలో నివాసం వుంటున్నవారు అక్రమవాసులుగా నిర్వచించబడ్డారు. ఇక రెండో అంశమేమిటంటే అసామీ ప్రజల భాష, సంస్కృతీసంప్రదాయాలు, సామాజికవారసత్వం కాపాడడానికి రాజ్యాంగపరమైన రక్షణలు కల్పించాలి.

అయితే ఎజిపి రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చినా కేంద్రప్రభుత్వం ఉదాసీనత వలన యీ ఒప్పందం సరిగ్గా అమలు కాలేదు. అక్రమవలసలు సాగుతూనే వున్నాయి. స్థానిక రాజకీయనాయకులు తమతమ రాజకీయ ప్రయోజనాల కోసం తమ వర్గానికి చెందిన వలసదారులను రక్షిస్తూ వచ్చారు. అసామీయులు ఎవరో నిర్వచించడం కష్టమై పోవడం వలన రెండో అంశమూ మరుగున పడింది. అక్రమవలసదారులనేది అసాంలో నిరంతర సమస్యగా మారింది. నాయకులందరూ ఎన్నికల సమయంలో ప్రత్యక్షంగా దాన్ని వ్యతిరేకిస్తూ, పరోక్షంగా ప్రోత్సహిస్తూ సమస్యను జటిలం చేశారు.  ఈ మధ్య జరిగిన అసాం అసెంబ్లీ ఎన్నికలలో కూడా వలసదారులందరినీ వెళ్లగొడతామనే అందరూ వాగ్దానాలు చేశారు. అయితే అంతిమంగా బిజెపి, దాని మిత్రపక్షాలు నెగ్గాయి. ఇప్పుడు వాళ్లు అక్రమవలసదారుల్లో హిందువులను, ముస్లిములను విడగొట్టాలని చూస్తున్నారు. తమ ఓటు బ్యాంకైన హిందువులకు పౌరసత్వం ప్రసాదించి, యితర పార్టీలకు ఓటేసే ముస్లిములను తరిమివేద్దామని పథకం రచించారు. దానికి కేంద్రంలో వున్న బిజెపి సహకరిస్తోంది. 1955 నాటి పౌరసత్వ చట్టానికి సవరణలు చేయడానికి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. 2016 నాటి యీ సవరణ ప్రకారం బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌ దేశాలలో మైనారిటీలుగా వున్న హిందువులు, సిఖ్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులు భారతదేశానికి వలస వస్తే వారిని అక్రమవలసదారులుగా పరిగణించరు. ఆ దేశాలలో ఇస్లాం మైజారిటీ ప్రజల మతం కాబట్టి ముస్లిములు ఇండియాకు వలస వస్తే మాత్రం అక్రమవలసదారులుగా పరిగణిస్తారు. పౌరసత్వం పొందడానికి అవసరమైన 11 ఏళ్ల కాలపరిమితిని ఈ హిందువులు మొదలైన యీ ఆరు మైనారిటీ వర్గాలకు ఆరేళ్లకు కుదించారు. ఈ చట్టం అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుంది కానీ ఎక్కువ ప్రభావితమయ్యేది అసామే. అందుకే అక్కడ ఆందోళన జరుగుతోంది. 

సరైన పత్రాలు లేకుండా వలస వచ్చిన వాళ్లందరినీ, హిందూ, ముస్లిం తేడా లేకుండా వెనక్కి పంపేయాలని ఉద్యమం చేసిన ఆసు ఉద్యమనాయకుడిగా వుండి బిజెపిలోకి ఫిరాయించిన సర్వానంద్‌ సోనోవాల్‌ ముఖ్యమంత్రిగా వుండగానే యీ బిల్లు రంగంమీదకు వచ్చింది. దాంతో అతను దీని గురించి ప్రశ్నలడిగితే తప్పించుకుంటున్నాడు. కాబినెట్‌లో ద్వితీయస్థానంలో వున్న హిమంత విశ్వశర్మ మాత్రం దీన్ని బాహాటంగా సమర్థిస్తున్నాడు. దీనివలన రాష్ట్రంలో హిందువుల సంఖ్య పెరుగుతుందని, ఆ విధంగా ముస్లిములు మెజారిటీగా పరిణమించే దురవస్థ తప్పిపోతుందని అంటున్నాడు. బిజెపి, ఆరెస్సెస్‌ సహజంగానే యీ బిల్లును సమర్థిస్తున్నాయి. ఆరెస్సెస్‌ సంపర్క్‌ ప్రముఖ్‌ రంజీవ్‌ కుమార్‌ శర్మ ''ఆరెస్సెస్‌ దృష్టిలో భారతదేశం హిందూదేశం. అందువలన ఏ దేశానికి చెందిన హిందువైనా సరే భారతదేశంలో విదేశీయుడిగా పరిగణించకూడదు.'' అని వాదిస్తున్నాడు. విదేశీయులందరి మీద కత్తికట్టిన ఎజిపిలో యిప్పుడు విభేదాలు పొడసూపాయి. బిజెపితో అంటకాగుతున్న ఎజిపి ప్రస్తుత అధ్యక్షుడు, సోనావాల్‌ కాబినెట్‌లో మంత్రి ఐన అతుల్‌ బోరా యీ బిల్లు గురించి వ్యతిరేకత తెలిపి వూరుకోవాలి తప్ప బిజెపిని మరీ ఘాటుగా విమర్శించకూడదని అంటోంది. అయితే ఎజిపిలో మహంత వర్గం మాత్రం దీనిపై గట్టిగా పోరాడాల్సిందే అంటోంది. బిజెపి ప్రభుత్వంలో మరో భాగస్వామి బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ బిల్లును సమర్థిస్తోంది. ఆసు, ఆసాం జాతీయవాదీ యువ ఛాత్ర పరిషత్‌, కృషక్‌ ముక్తి సంగ్రామ్‌ పరిషత్‌ వంటి సంస్థలు బిల్లును వ్యతిరేకిస్తూ కాగడాల ప్రదర్శన నిర్వహించాయి.

దీనిలో మతపరమైన అంశం ఒకటే కాదు అసాం అస్తిత్వసమస్య కూడా వుంది. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చేవారు మాట్లాడే భాష బెంగాలీ. బెంగాలీయులు అసాంపై ఆధిపత్యం వహించడానికి సర్వదా ప్రయత్నిస్తూనే వుంటారు. ఆంగ్లప్రభుత్వం వుండే రోజుల్లో దానిలోని బెంగాలీ అధికారులు 1836లో అసాంలో అధికారభాషగా అసామీకి బదులు బెంగాలీని ప్రకటించారు.  దాదాపు మూడు దశాబ్దాల పోరాటం తర్వాత 1873లో మళ్లీ అసామీ అధికారభాష అయింది. అప్పణ్నుంచి అసామీయులకు బెంగాలీ ఆధిపత్య ధోరణిపై అనుమానాలున్నాయి. బంగ్లాదేశ్‌ వలసల కారణంగా 1991లో జనాభాలో 57.81% వున్న అసామీ భాషీయులు 2001 నాటికి 48.80%కి పడిపోయారు. అది కూడా బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన ముస్లిములు మాట్లాడే బెంగాలీ యాసతో కూడిన అసామీని, ఆదివాసుల భాషలను కలిపితే ఆ అంకె వచ్చింది. అదే సమయంలో బెంగాలీ భాషీయుల శాతం 21.67 నుంచి 27.54కి పెరిగింది. ఇప్పుడు హిందువులన్న మిష మీద బిజెపి ప్రభుత్వం బెంగాలీలకు పౌరసత్వం యిచ్చేస్తే తాము భాషపరంగా మైనారిటీలమై పోతామని అసామీయుల భయం. ఇప్పటికే అసాంలోని బెంగాలీ సంఘాలు యీ బిల్లును స్వాగతించాయి. 

ఈ బిల్లును 11 వామపక్ష, ప్రజాస్వామ్యపక్షాలు నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెసు గట్టిగా మాట్లాడలేకపోతోంది. 'అవిభక్త భారతదేశంలోని ప్రాంతాల నుండి మతవివక్షత కారణంగా ఆశ్రయం కోరుతూ భారత్‌ వచ్చిన కాందిశీకుల పట్ల కేంద్రం ఒక వైఖరి తీసుకోవాలని' కోరుతూ మాజీ కాంగ్రెసు ముఖ్యమంత్రి తరుణ్‌ గొగొయ్‌ నేతృత్వంలో 2014 జులైలో కాబినెట్‌ తీర్మానం చేసి వున్నారు. వలసదారులందరినీ తరిమివేయాలని గట్టిగా అనలేదు - వారిలో దొంగతనంగా ఓటుహక్కు సంపాదించినవారి ఓట్లు పోతాయన్న భయం చేత. ఇప్పుడు బిల్లు వచ్చాక రాష్ట్ర కాంగ్రెస్‌ తరుణ్‌ నాయకత్వంలో ఓ కమిటీ వేసి బిల్లు పరిణామాలను అధ్యయనం చేసి జాతీయ కమిటీకి నివేదన పంపాలని నిర్ణయించింది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?