cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: జానపద చిత్రాలు - 01

''బాహుబలి'' గురించి నేను రాసినప్పుడు గతంలో నేను జానపదాల గురించి రాసిన సీరీస్‌ను ప్రస్తావించాను. అది చాలా ఏళ్ల క్రితం వచ్చింది కాబట్టి అనేకమంది 'మేం చదవలేదు, మళ్లీ రాయమ'ని కోరారు. గతంలో రాసినదాని సంక్షిప్తరూపం యిది. జానపద సినిమాల్లో రకాలు, వాటిలో ఉండే పాత్రల స్వరూపస్వభావాలు, కథల్లో మలుపులు వంటివి చర్చిస్తుందీ సీరీస్‌. ''బాహుబలి'' స్ఫూర్తితో మరిన్ని జానపదాలు వచ్చే అవకాశం వుంది కాబట్టి, పాత సినిమాలు, బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలు చూడడానికి జంకే పాఠకులకు జానపద సినిమాల్లో కథాసంవిధానం ఎలా వుంటుందో అర్థమై యీ రకమైన సమీక్షపై ఆసక్తి కలుగుతుందని అనుకుంటున్నాను. జానపద సినిమాలంటే చాలామంది చదువుకున్నవారిలో  తక్కువ భావం వుండవచ్చు. అవన్నీ అభూతకల్పనలతో, మాయామంత్రాలతో వుంటాయనీ, బి గ్రేడు ఆర్టిస్టులతో, పిచ్చిపిచ్చి డ్రస్సులతో, చవకరకం సెట్స్‌పై తీస్తారనీ అనుకోవచ్చు. వాటిని తీయడానికి పెద్ద తెలివితేటలక్కరలేదని భావించవచ్చు. ఏదో చిన్నపిల్లల్నీ, చదువురాని పల్లెటూరి వాళ్లనీ మెప్పించడానికి తీసే సినిమాలని వాటిని చిన్నచూపు చూడవచ్చు.

నా అభిప్రాయంలో జానపద సినిమాలు అంత తీసిపారేయవలసిన సెక్టర్‌ కాదు. చవకరకం సెట్సంటారా? సాంఘిక సినిమాల్లోనూ చవకరకంగా తీసి పారేసినవి బోల్డున్నాయి. తెలుగుకి సంబంధించినంత వరకు అగ్రౖశ్రేణి నటీనటులు నటించిన జానపదాలు బోల్డు వున్నాయి. అగ్రసంస్థలు తీసిన జానపద సినిమాలున్నాయి. జానపదాలనగానే అన్నిట్లోనూ హీరో రామచిలుక అయిపోవడం, విలన్‌ బోదురుకప్ప అయిపోవడం వుండవు. మాయామంత్రాలు ఏవీ లేని జానపదాలు కూడా వున్నాయని మనం గుర్తించాలి. థీమ్‌ ప్రకారం చూసి నేను వాటిని నాలుగు రకాలుగా వర్గీకరించాను. 

శక్తి ప్రధానమైనవి - అంటే హీరో ఏదో ఒక లక్ష్యం పెట్టుకుని దానికోసం తన భుజబలంతో కార్యాన్ని సాధించడం. అంటే 'పాతాళభైరవి'లో తోటరాముడిలాగ అన్నమాట. యుక్తి ప్రధానమైనవి - 'మంగమ్మ శపథం' సినిమా వుంది. ఒక పల్లెటూరి అమ్మాయి ఓ పొగరుబోతు రాజుతో పందెం వేస్తుంది. మరి ఆమె తన ఆశయాన్ని ఎలా సాధిస్తుంది? రాజుకంటె శక్తి గలది కాదు. అప్పుడు యుక్తి ఉపయోగిస్తుంది. శక్తి, యుక్తి పుష్కలంగా వున్నా కార్యసాధన జరగదు. అందుకుగాను భక్తి కూడా తోడవ్వాలి అని కొన్ని సినిమాలు ఉద్బోధిస్తాయి. ఒక్కోప్పుడు నాయకుడు తన ప్రమేయం లేకుండానే శాపానికి గురవుతాడు. 'సువర్ణసుందరి'లో హీరో పగటిపూట స్త్రీ అయిపోయినట్టు. ఆ శాపం నుంచి గట్టెక్కాలంటే దేవుణ్ని ప్రార్థించాల్సిందే! మానవయత్నంతోనే పనులు కావు అని జనరంజకంగా సందేశాన్నిచ్చే సినిమాలు - భక్తి ప్రధానమైన సినిమాలు. 

ఇక నాలుగో రకం సినిమాలు రాజనీతి ప్రధానమైనవి - 'రాజమకుటం' లాటి సినిమాలు. ఓ రాజుగారిని తన తమ్ముడే హత్య చేయించాడు. యువరాజు పేర అనేక అత్యాచారాలు చేయించి, అతన్ని అప్రదిష్టపాలు చేసి చివరిలో తన కొడుకుని సింహాసనంపై కూచోబెట్టాలని అతని ప్లాను. యువరాజు ఈ విషయం కొన్నాళ్లకు గ్రహించాడు. కానీ పినతండ్రిని ఎదుర్కోవడమెలా? తను కూడా కుటిల రాజనీతి ఉపయోగించాల్సిందే! వీటిలో మాయమంత్రాలుండవు. బుద్ధి కుశలత మాత్రమే వుంటుంది, ఎత్తుకు పై యెత్తులుంటాయి. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడముంటుంది. 

శక్తి ప్రధానమైన జానపద సినిమాల గురించి మొదట చూదాం. కథానాయకుడు అంటే కండబలం, గుండెబలం కలిగి వుండాలి అన్నది అందరూ ఒప్పుకునే నిత్యసత్యం. ఎంత తెలివితేటలైనా వుండవచ్చు, ఎంత అందంగానైనా వుండవచ్చు, ఎంత పెద్ద రాజ్యానికైనా వారసుడు కావచ్చు, కానీ శారీరకబలం, ధైర్యం లేకపోతే అతన్ని కథానాయకుడిగా ఒప్పుకోలేరు ప్రేక్షకులు. సాంఘిక చిత్రాల్లో పాత్రలు మంచీ, చెడూల మిశ్రమంగా వుండవచ్చు. కానీ జానపదాల్లో పాత్రస్వభావం స్పష్టంగా వుంటుంది. అయితే మంచి లేదా చెడు. 

ఎందుకిలాగ? ఎందుకంటే చిన్నపిల్లలుగా మనం ఆదరించేది జానపద గాథలనే! ఓ రాజు, అతనికి ఇద్దరు రాణులు. పెద్దరాణి మంచిది, చిన్నరాణి చెడ్డది. పెద్దరాణి కొడుకు ధైర్యం కలవాడు. చిన్నరాణి కొడుకు మందబుద్ధి. ఇలాగ పాత్రతో బాటు వాడి లక్షణం కూడా చెప్పేయకపోతే పిల్లవాడు కథను ఆస్వాదించలేడు. సాంఘిక కథలోలా పరిస్థితుల ప్రభావానికి లోనై మంచివాడు చెడ్డవాడిగా మారి, ఆ తర్వాత మళ్లీ మంచివాడై.., కానీ తన బలహీనతల కారణంగా... అబ్బే యిదంతా కన్‌ఫ్యూజింగ్‌ వ్యవహారం. 'కథ బాగాలేదు, యింకోటి చెప్పు' అంటాడు పిల్లాడు. చిన్నప్పుడు మనం కథలు చెప్పేది - పిల్లల్లో ఆసక్తి రేకెత్తించడానికి, వారికి నీతి బోధించడానికి. అంతేగానీ సమాధానాలు లేని క్లిష్టమైన జీవితసమస్యలతో వాళ్లని విసిగించడానికి కాదు. 

అందువల్ల ఆ కథల్లో హీరో ఎప్పుడూ శక్తి కలిగివుండాలి. అమ్మా, నాన్నా చెప్పినమాట వినాలి. గురువుగారికి మొక్కాలి. సాహసం కలిగి వుండాలి. తన శక్తిని యింకొకరి మేలుకై ఉపయోగించాలి. ఇతరులకు అసాధ్యమైనది  సాధించుకు రావాలి. కథకుడు చేయాల్సి ఏమిటంటే ఈ సర్వశక్తిమంతుడికి కార్యసాధనలో అవరోధాలు కల్పించి అతను ఓడిపోతాడేమోనని భయం శ్రోతలో కలిగించి అంతిమంగా విజయం చేకూర్చాలి. జానపద హీరో విఫలుడవ్వడానికి వీల్లేదు. 

 జానపద కథలన్నీ పైన చెప్పుకున్నట్టే వుంటే యిక వైవిధ్యమేముంది? అనుకోవచ్చు. ఇంత పకడ్బందీ చట్రంలో వైవిధ్యం చూపించడం కష్టమే కదూ! అలా చూపించినవారికి మనం జోహారు చెప్పాల్సిందే కదూ!  సినిమా ప్రారంభించిన పదినిమిషాల్లోనే హీరో, హీరోయిన్‌, విలన్ల పరిస్థితి మనకు తెలిసిపోతుంది. కథకు ముగింపు ఫలానా విధంగా వుంటుందని మనకు ముందే తెలుసు. అయినా చిత్ర విచిత్రమైన కథాగమనంతో, అనూహ్యమైన మలుపులతో ఆ చిత్రసారథులు మనను రెండున్నర గంటలసేపు కూర్చోబెట్టగలిగారంటే అది వారి ఘనతే కాదూ! అందుకే నాకు జానపద సినిమాలంటే యిష్టం. జానపద సినిమాలకు పెట్టుబడి మనకు తరతరాలుగా వస్తున్న కథలే! కథాసరిత్సాగరం వుంది, కాశీమజిలీ కథలు వున్నాయి, మదనకామరాజు కథలున్నాయి, శుకసప్తతి కథలున్నాయి, భట్టి విక్రమార్క కథలున్నాయి, బేతాళ కథలున్నాయి.. ఇంకా బోల్డున్నాయి. వాటిల్లోంచి రెండుమూడు కథలు తీసుకుని  కలిపి తమకు అనువుగా మార్చుకుని జానపద సినిమాలకు కథలల్లారు పెద్దలు. అవన్నీ మనం నమ్మే జీవనమూల్యాలకు సంబంధించినవి కాబట్టే మనం ఆదరించాం. అవి మనల్ని ఎక్కడికో ఊహాలోకాలకు తీసుకుపోతాయి, మనసును అలరిస్తాయి, సేద తీరుస్తాయి. సాంఘిక సినిమాల్లా మనసులో, మెదడులో అలజడి రేపవు. అందుకే జానపద సినిమాలు మళ్లీ మళ్లీ చూస్తారు. 

ఇక్కడ మీకో విషయం చెప్పాలి - ఎన్టీ రామారావుగారు జానపద హీరోగా అందరికీ తెలుసు. నిర్మాతగా జానపదాలు తీసి బోల్డంత ఆర్జించాడని తెలుసు. కానీ అది ఆయన ఫస్ట్‌ ప్రిఫరెన్సు కాదు. 'పాతాళభైరవి'తో జానపద హీరోగా హిట్‌ కొట్టినా నిర్మాతగా ఆయన సామాజిక స్పృహ కలిగిన రెండు సినిమాలు తీశాడు - 'పిచ్చిపుల్లయ్య' , 'తోడుదొంగలు' అని. రెండోదానికి ప్రెసిడెంటు అవార్డు వచ్చింది కూడా. కానీ రెండింటికీ డబ్బులు రాలేదు. 

ఆ సినిమాల అపజయంతో రామారావుకి ఆవేశం వచ్చింది. 'కార్లు అమ్మేద్దాం, సైకిళ్లమీద తిరుగుదాం' అని. అంతలోనే వెంకటపార్వతీశ కవులు రాసిన 'వీరపూజ' అనే నవల చదవడం తటస్థించింది. నచ్చింది. దాని ఆధారంగా 'జయసింహ' సినిమా తీద్దామని ప్లాను చేశారు.  అంజలి, ఎస్వీరంగారావు - భారీగానే తీశారు. విమర్శకులు ఆ సినిమాను 'తుప్పుకత్తుల యుద్ధం' అని తీసిపారేశారు. అయినా సినిమా హిట్‌ అయింది. ఎన్‌ఏటీ సంస్థ నిలబడింది. అప్పట్నుంచి ఆయన అదే చెప్పేవాడు. 'జయసింహ' లేకపోతే ఎన్‌ఏటీయే లేదు అని. ఇంతకీ ఆ సినిమా కథేమిటి? క్లుప్తంగా చెపుతాను. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2015)

mbsprasad@gmail.com

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి