Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: జానపద చిత్రాలు- 18

ఇంకో ఫ్యాక్టర్‌ కూడా వుంది యిక్కడ. రాజకీయ చైతన్యం గల సినీ నిర్మాతలు ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబిస్తూ సినిమా తీస్తే వాటిని ప్రభుత్వం నిషేధిస్తుందని, రాజుల కాలం కథలా మార్చి తీసేవారు. లేదా ఫాంటసీగా తీసేవారు. 'యమగోల' నాటికి జానపదాలు తగ్గిపోయాయి కాబట్టి సోషల్‌ ఫాంటసీ తీసి యముడిమీద పెట్టి ఎమర్జన్సీని విమర్శించారు. సంజయ్‌ గాంధీపై జోకులు పేల్చారు. 

'సింహబలుడు' అని ఎన్టీయార్‌ సినిమా వచ్చింది. అందులో రావుగోపాలరావును నియంతగా చూపించారు. ఆయన విగ్రహాలు దేశమంతా పెట్టిస్తాడన్నమాట. ఈ ఐడియా 'కో వాడిస్‌' సినిమానుంచి తీసుకున్నారులాగుంది. దానిలో పీటర్‌ ఉస్తినోవ్‌ నీరో పాత్ర వేశారు. నీరో కూడా నియంతే. తన విగ్రహాలు రోమ్‌ అంతా పెట్టిస్తాడు. మన దేశంలో కూడా ప్రజస్వామ్యం ముసుగులో నియంతృత్వం సాగిందని విమర్శించడానికి ఆ ఘట్టం అక్కరకు వచ్చింది.  గిడుతూరి సూర్యం గారి లాటి వామపక్షవాదులు 'రణభేరి' అనే జానపదం తీసి శ్రీశ్రీ గారి 'మరో ప్రపంచం' పాట పెట్టారు. 'భూలోకంలో యమలోకం' అనే జానపద సినిమాకు ఆధారం రాజాజీ కథ. అది పొలిటికల్‌ సెటైర్‌ట. నిజం చెప్పాలంటే తమిళనాడువాళ్లు రాజకీయాలకు సినిమాను ఉపయోగించుకున్నట్టు వేరెవరూ ఉపయోగించుకోలేదు. ముఖ్యంగా డిఎంకె వాళ్లు. వాళ్లలో మంచి రచయితలున్నారు. అణ్నాదురై, కరుణానిధి యిలాటివాళ్లు. అప్పట్లో తమిళనాడులో రాజకీయాల్లో ప్రాబల్యంలో వున్న బ్రాహ్మణులను పడగొట్టడానికి వాళ్లు సినిమాలను ఎంచుకున్నారు. జానపద సినిమాల్లో ముఖ్య విలన్‌ ఎవడ్రా అంటే రాజపురోహితుడన్నమాట. 

మామూలు జానపద సినిమాల్లో రాజపురోహితుడికి పట్టాభిషేక వేళల్లో కిరీటం పట్టుకొచ్చి రాజు తల మీద పెట్టడం తప్ప వేరే పాత్రే వుండదు. కానీ డిఎంకె వాళ్ల సినిమాల్లో కుట్రలు పన్ని రాజును పడగొట్టేది, శ్రామిక వర్గంనుండి వచ్చిన హీరోను పైకి రాకుండా తొక్కి పారేసేది యివన్నీ రాజపురోహితుడి పనే! ఇలా సినిమాల ద్వారా తమ సిద్ధాంతాలని ప్రచారం చేసి, చేసి చివరకు 1967లో డిఎంకె వాళ్లు గద్దెకెక్కారు. అప్పణ్నుంచి కాంగ్రెసుకు మళ్లీ ఛాన్సు రాలేదు. డిఎంకెయో, అన్నా డిఎంకెయో ఏదో ఒక పార్టీ పరిపాలిస్తోంది. చెప్పవచ్చేదేమిటంటే సినిమా ఎంత పవర్‌ఫుల్‌ ఆయుధమో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా జానపద సినిమాలో వున్న ఆకట్టుకునే అంశాలకు తను చెప్పదలచుకున్న సందేశాన్ని రంగరిస్తే అది ప్రజల్లోకి గాఢంగా, సూటిగా వెళుతుంది. 

తెలుగులో ఎన్టీయార్‌ రాజకీయాల్లోకి వచ్చారంటే ఆ పరిస్థితి వేరు. ఆయన కెరియర్‌లో వుండగా పాత్ర బట్టి వేషాలు వేశారు కానీ రాజకీయాలను ప్రచారం చేయలేదు. కానీ ఎంజిఆర్‌ అలాగ కాదు. మొదట్లో జానపదాలు వేసినప్పుడైనా, తర్వాత జానపద లక్షణాలున్న సాంఘికాలు వేసినప్పుడైనా ఆర్త్రపరాయణుడిగా, మంచివాడిగా, స్త్రీ జనోద్ధారకుడిగా తనను తాను ప్రొజెక్టు చేసుకుంటూ వచ్చాడు. 'ఆయురత్తిల్‌ ఒరువన్‌' సినిమాలో ఆయన బానిసలను విముక్తి చేస్తాడు. 'అడిమై పెణ్‌' సినిమాలో ఓ పొగరుబోతు మహారాణి కొమ్ములు విరుస్తాడు. ఇలా అనేక సినిమాలున్నాయి. వాటిలో పాటలు కూడా 'ఏం? ఎందుకు అని ప్రశ్నించు, బానిస బతుకును వీడు' అనో, 'నేనే రాజ్యానికి వస్తే పేదలకు కన్నీళ్లు లేకుండా చేస్తాను' అనో యిలానే వుండేవి.  బ్యాక్‌డ్రాప్‌లో వాళ్ల పార్టీ గుర్తువున్న నలుపు, ఎరుపు కలిసిన జండాలు ఎగురుతూ వుండేవి.     

తెలుగులో మనకు యిలాటి పార్టీల గోల లేదు కాబట్టి ప్రాపగాండా సినిమాలు లేవు. రాజకీయాల గురించి సినిమాలు తీసిన సినిమాలు ప్రజాచైతన్యం గురించి, ప్రజలను పీడిస్తే రాజులు సైతం మట్టి కరుస్తారని చెప్పడానికే ఉపయోగపడ్డాయి. ఇటువంటి వాటిల్లో మనకు బాగా నచ్చే థీమ్‌ 'రాబిన్‌ హుడ్‌'. రాబిన్‌ హుడ్‌ కథ అందరికీ తెలుసుకాబట్టి మళ్లీ చెప్పటం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే డబ్బున్నవాణ్ని దోచుకుని పేదలకు పంచిపెట్టే ఓ మంచి దొంగ. ప్రభుత్వం దృష్టిలో అతను దొంగ, చెడ్డవాడు, అందుకని సైనికులు అతన్ని వెంటాడతారు. కానీ పేదల దృష్టిలో అతను ఉత్తముడు, ప్రభుత్వం బారినుండి వారిని కాపాడుతున్నవాడు.

రాజుగారి అధికారగణంలో వున్నవారు ఆయన కూతురు కావచ్చు, లేదా మంత్రికుమారుడు కావచ్చు వాళ్లు యితన్ని పట్టుకోవడానికి బయలుదేరి క్రమంగా యితని కార్యకలాపాలు తెలుసుకుని ముగ్ధులయిపోయి, యితనికి సహకారం అందించడం జరుగుతూంటుంది. ఇది ప్రేక్షకుడికి ఎంతో కిక్‌ యిస్తుంది. ఒక్కోప్పుడు తండ్రి రాజుగారి కొలువులో వుంటాడు. తరతరాలుగా ఆయన సేవలో తరిస్తున్నానన్న భ్రమలో వుంటాడు. కానీ కొడుకు స్వతంత్ర భావాలు కలవాడు. ప్రజల కోసం రాజధిక్కారం చేసి ఎదిరిస్తాడు. ఇతన్ని పట్టుకునే పని రాజుగారు తండ్రికి అప్పగిస్తాడు. తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం. మధ్యలో తల్లికి ధర్మసంకటం. భర్త నెగ్గాలని కోరుకోవాలా, కొడుకు నెగ్గాలని కోరుకోవాలా? 

పైన చెప్పిన థీమ్‌తో 'తలవంచని వీరుడు' అనే సినిమా వచ్చింది. అది 'వలంగాముడి' అనే తమిళసినిమాకు డబ్బింగ్‌. శివాజీ గణేశన్‌ హీరో. దానిలో రాకుమారితో రాజాస్థానంలో వున్న వుద్యోగి కొడుకు ప్రేమలో పడతాడు. అందుకు మండిపడ్డ రాజుగారు ఆ హీరోని తల తీయించడు. ప్రజలనందరినీ పిలిచి గొప్ప తర్కంతో అతను చేసినది తప్పని ప్రజలచేతనే ఒప్పిస్తాడు. వాళ్లు అతనికి ఉరివేయమని సిఫార్సు చేస్తే గొప్ప ఉదారబుద్ధి చూపించినట్టు దేశబహిష్కార శిక్ష వేస్తాడు. అక్కడ రాజుగారి మేధస్సు చక్కగా చూపుతాడు రచయిత. జానపదాల్లో బుర్ర ఉపయోగించక్కరలేదని భావించేవారు ఆ సినిమా చూడాలి. తర్వాత ఆ హీరో వేరే రాజ్యానికి రాజై ఈ రాజ్యంమీద దండెత్తుతాడు.  తండ్రి ఈ రాజ్యం తరఫున కొడుకుతో పోరుకు సిద్ధమవుతాడు. తర్వాత కథ ఏదో నడుస్తుందనుకోండి. ఇలాటి థీమ్‌తో తర్వాత ఎన్టీయార్‌తో సింహబలుడు సినిమా వచ్చింది. 

 'రేచుక్క-పగటిచుక్క' అని ఇంకో సినిమా వుంది. దానిలో కథ రివర్స్‌. కొడుకు రాజు పక్షాన, తండ్రి ప్రజల పక్షాన! యస్వీ రంగారావు అసలు రాజుగారే! కానీ సేనాపతి కుట్రవల్ల పదభ్రష్టుడై, కుటుంబంతో విడిపోయి, ఏకాకి అయిపోయి రాబిన్‌ హుడ్‌ అవతారం ఎత్తాడు. రేచుక్క అనే పేరుతో దోపిడీలు చేసి ప్రజలను ఆదుకుంటున్నాడు. అతని కొడుకు ఎన్టీ రామారావు రాజాస్థానంలో చేరి రేచుక్కను పట్టుకోవడానికి పగటిచుక్క అనే పేరుతో రంగంలోకి ప్రవేశించాడు. కొన్ని యెత్తుపై యెత్తుల తర్వాత తండ్రీ కొడుకులు ఒకరినొకరు గుర్తుపట్టుకుని ఇద్దరూ కలిసి విలన్‌ పని పడతారు. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2015)

mbsprasad@gmail.com

Click Here For Archives

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను