Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: జపాన్‌ ప్రధాని యుద్ధోన్మాదం-చక్రవర్తి శాంతిమంత్రం

రెండవ ప్రపంచయుద్ధం (1939-45)లో పశ్చిమాన జర్మనీ, ఇటలీ తూర్పున జపాన్‌ కలిసి అక్షరాజ్యకూటమిగా ఏర్పడి యితరదేశాలను ఆక్రమించాయి. ఇంగ్లండు, అమెరికా, రష్యాలు మిత్రదేశాల కూటమిగా ఏర్పడి వారిని ఎదిరించాయి. ఇటలీ ముందుగా ఓడిపోయింది, తర్వాత జర్మనీ. అయినా జపాన్‌ లొంగలేదు, అప్పటి చక్రవర్తి హిరోహిటో (1926-89) సామ్రాజ్యవాద యుద్ధోన్మాది కావడం చేత, ప్రపంచయుద్ధం సందర్భంగా తూర్పున అనేక దేశాలను ఆక్రమించి, వాటిని వదులుకోవడానికి యిచ్చగించని కారణంగా యుద్ధాన్ని విరమించలేదు. అప్పుడు అమెరికా అతి దారుణంగా హిరోషిమాలో అణుబాంబు పడేసి అత్యంత అమానుషంగా ప్రవర్తించింది. యూరోప్‌లో ప్రయోగించని బాంబును యిక్కడ ప్రయోగించడానికి కారణం, అమెరికాకు జపాన్‌పై పగ. ఎందుకంటే రెండవ ప్రపంచయుద్ధంలో అమెరికా ప్రవేశించాలా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో జపాన్‌ హఠాత్తుగా యుద్ధరంగంలోకి దిగి, పసిఫిక్‌ సముద్రం మీదుగా అమెరికా చేరి ఏ విధమైన హెచ్చరికలు చేయకుండా పె(ర)ల్‌ హార్బరుపై బాంబులు వేసి సర్వనాశనం చేసింది. దాంతో అమెరికా క్రుద్ధురాలై మిత్రరాజ్య కూటమిలో చేరి, యుద్ధఫలితాలను తారుమారు చేసింది. ఆ పగతో జపాన్‌పై ఆటంబాంబు వేసింది. వేసిన తర్వాతైనా జపాన్‌ చక్రవర్తి లొంగలేదు, మొండిగా కూర్చున్నాడు. అప్పుడు నాగసాకిలో మరో బాంబు వేశారు. అప్పుడు యిక లాభం లేదని చేతులు ఎత్తేశాడు. యుద్ధం అంతమైంది.

జపాన్‌లో చక్రవర్తిని దైవస్వరూపుడిగా చూస్తారు ప్రజలు. ఆయనను అవమానిస్తే భరించలేరు. అందుకే ఆయనతో అమెరికా చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. ముస్సోలినీ పారిపోబోతూంటే అతని ప్రజలే అతన్ని చంపివేశారు. హిట్లర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మిత్రదేశాలు వారి అనుచరులను పట్టుకుని యూరోపులో పాల్పడిన యుద్ధనేరాలకు న్యూరెంబర్గులో విచారణ జరిపి, అనేకమందికి శిక్షలు వేశారు. కానీ హిరోహిటో సజీవంగా దొరికినా అతన్ని క్షమాపణ చెప్పమని అడగలేదు. తాము ఆక్రమించిన దేశాలలో జపాన్‌ సైనికులు చాలా హీనంగా, అమానుషంగా, నేరపూరితంగా ప్రవర్తించారు. అయినా అమెరికా జపాన్‌ మిలటరీ అధికారుల్లో చాలామందిని శిక్షించకుండా వదిలేసింది. ఎందుకని అడిగితే అమెరికన్‌ మిలటరీ అడ్వయిజరు జనరల్‌ డగ్లస్‌ మెక్‌ఆర్థర్‌ ''జపనీయులు జర్మన్లలా పరిణతి చెందిన జాతి కాదు, చక్రవర్తి ఆదేశాలు గుడ్డిగా పాటించడమే తప్ప ఆ నేరాలు వాళ్లు సొంతంగా చేసినవి కావు.'' అన్నాడు. జర్మనీ మళ్లీ యుద్ధానికి పాల్పడకుండా నడుం విరచడానికి దాన్ని రెండు ముక్కలు చేసి, ఒక ముక్కను కమ్యూనిస్టు బ్లాక్‌కు అప్పగించారు. జపాన్‌ విషయంలో దాని మానాన దాన్ని వదిలిపెట్టకూడదనుకున్నారు. ఏడేళ్లపాటు అక్కడే తిష్ట వేశారు. కొత్త రాజ్యాంగం రాసిచ్చి దాన్ని అవలంబించమన్నారు. ఆ 'పాసిఫిక్‌' రాజ్యాంగం ప్రకారం జపాన్‌ శాంతినే నమ్ముకోవాలి. సైన్యాన్ని పెట్టుకోవడానికి వీల్లేదు. అన్నీ కోల్పోయిన జపాన్‌ చక్రవర్తి, ప్రజలు కిక్కురుమనలేదు. ప్రజలు యుద్ధంతో విసిగిపోయారు. ఈ శాంతిపూర్వకమైన కొత్త రాజ్యాంగాన్ని మనసారా ఆహ్వానించారు. చక్రవర్తి గత్యంతరం లేక వూరుకున్నాడు. ఆక్రమించిన దేశాలలో తన సైన్యం చేసిన అత్యాచారాలకు ఎన్నడూ క్షమాపణ చెప్పలేదు. 

ఆయన కుమారుడు అకిహిటో ఆయనకు భిన్నమైనవాడు. 1989లో తండ్రి మరణం తర్వాత చక్రవర్తి అయ్యాడు. యుద్ధనేరాలకు పశ్చాత్తాపపడ్డాడు. శాంతియుతమైన రాజ్యాంగమే జపాన్‌కు శ్రీరామరక్ష అని నమ్మాడు. చక్రవర్తిగా తన అధికారాలు నామమాత్రంగా వుంచుకుని, ప్రజలకు సన్నిహితం కావడానికి ప్రయత్నించాడు. యుద్ధాలు చేయనక్కరలేని, సైన్యాన్ని పెద్దగా పోషించవలసిన అవసరం లేని, ఆయుధాలు పెద్దగా కొనే అగత్యం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం యితర అవసరాలకు తన నిధులు వెచ్చించడంతో, ప్రజలు పట్టుదలగా కృషి చేయడంతో గత 70 ఏళ్లల్లో జపాన్‌ ఎంతో పైకి వచ్చింది. తమ స్థితిగతులు బాగుపడడం వలన ప్రజలు శాంతియుత వాతావరణాన్నే కోరుకుంటూ వచ్చారు. 

ఇన్నాళ్లూ వున్న యీ పరిస్థితిని ప్రస్తుత ప్రధాని షింజో ఏబే మార్చాలని చూస్తున్నాడు. 62 ఏళ్ల షింజో లిబరల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ (ఎల్‌డిపి)కి అధ్యక్షుడు. 2006 సెప్టెంబరులో పార్లమెంటు స్పెషన్‌ సెషన్‌లో జపాన్‌కు ప్రధానిగా ఎంపికయ్యాడు. కానీ అనారోగ్య కారణాలతో ఏడాది తర్వాత రాజీనామా చేశాడు. ఆ తర్వాత 2012 వరకు ఐదుగురు ప్రధానులు మారారు. 2012 సాధారణ ఎన్నికలలో ఎల్‌డిపి 480 సీట్లకు 294 గెలిచి షింజో మళ్లీ ప్రధాని అయ్యాడు. తన పేర 'ఎబెనామిక్స్‌' అనే ఆర్థిక విధానాలను అమలు చేశాడు, కానీ అవి ఫలించలేదు. దాంతో 2014లో రాజీనామా చేసి మళ్లీ నిలబడ్డాడు. 475 సీట్లలో 291 సీట్లు గెలిచి మూడోసారి ప్రధాని అయ్యాడు. తన భాగస్వామ్య పక్షమైన కోమిటోతో కలిసి పార్లమెంటు దిగువసభలో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించాడు. 2018 వరకు అతను ప్రధానిగా వుండవచ్చు. 2016 జులై మూడోవారంలో పార్లమెంటు ఎగువ సభకు జరిగిన ఎన్నికలలో యిద్దరూ కలిసి అక్కడా మూడింట రెండు వంతుల మెజారిటీ తెచ్చుకోవడంతో షింజోకు ఎదురు లేకుండా వుంది. 

 ఆ ఎన్నికల సమయంలో 'దేశ ఆర్థికవ్యవస్థకు మళ్లీ జీవం పోస్తాను' అనే వాగ్దానం తప్ప రాజ్యాంగం మార్పుల గురించి మాట్లాడని షింజో గెలవగానే యిప్పుడు కొత్త పల్లవి ఎత్తుకున్నాడు. అతని విధానాలతో ఆర్థికంగా 4% ఎదుగుదల కలిగింది, స్టాక్‌ మార్కెట్‌ పుంజుకుంది. కానీ మాంద్యం నుండి బయట పడడానికి అది సరిపోలేదు. అతను చూస్తూండగానే చైనా జపాన్‌ను దాటుకుని వెళ్లిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థలో చురుకుదనం రావడానికి సేల్స్‌ టాక్స్‌ను 4% నుంచి 8% పెంచుతానని, ప్రస్తుతం 36% వున్న కార్పోరేట్‌ టాక్స్‌ను తగ్గిస్తానని అంటున్నాడు. చైనా ప్లాను చేసిన ఒన్‌ బెల్ట్‌, ఒన్‌ రోడ్‌ (ఒబిఒఆర్‌)లో జపాన్‌, ఇండియా తప్ప ఆ ప్రాంతంలోని దేశాలన్నీ సంతకాలు చేశాయి. దానికి ప్రతిగా ఒబామా చొరవతో ఏర్పడుతున్న ట్రాన్స్‌-పసిఫిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ (టిపిపి)లో జపాన్‌ను చేర్చాలని షింజో ఆలోచన. ఇప్పటివరకు దానిలో 11 దేశాలు మాత్రం సంతకాలు పెట్టడానికి సుముఖంగా వున్నాయి. 

ఆర్థికపరంగా అనుకున్నంత విజయం సాధించలేకపోవడంతో షింజో ప్రజల దృష్టిని మళ్లించడానికి కాబోలు జపాన్‌ను సైన్యమార్గం పట్టించడానికి చూస్తున్నాడు. ఇకపై శాంతియుత రాజ్యాంగానికి కట్టుబడి వుండనక్కరలేదని వాదన మొదలుపెట్టాడు. ఇరుగుపొరుగు దేశాలతో ఏదైనా వివాదం వస్తే దాన్ని సైన్యశక్తి వుపయోగించుకోకుండా పరిష్కరించుకోవాలని రాజ్యాంగంలో రాసిన వాక్యాలను తొలగించాలని అతని పట్టుదల. జపాన్‌ పార్లమెంటులో కొందరు రైటిస్టు జాతీయవాద సభ్యులు నిప్పన్‌ కైగీ పేర ఒక కూటమిగా ఏర్పడ్డారు. యూరోప్‌ వలసవాదుల బారి నుంచి ఆసియాను రక్షించడానికే జపాన్‌ అవతరించిందని, యుద్ధనేరాలకు జపాన్‌ క్షమాపణ చెప్పనక్కరలేదని, చరిత్రను వక్రీకరించి జపాన్‌ను దుష్టశక్తిగా చూపిస్తున్నారని,  రెండో ప్రపంచ యుద్ధంలో 3 లక్షల మంది చైనీయులను ఊచకోత కోసిన నాంజిగ్‌ సంఘటన జరగలేదని, జపాన్‌ చరిత్రను తిరగరాసి మళ్లీ ప్రబల శక్తిగా ఎదిగేందుకు అందరూ కలిసి రావాలనేది వారి ఉద్యమం. 'నిప్పన్‌ కైగీ'కి నాయకురాలైన తొనోమీ ఇనాడాను షింజో ఏరికోరి డిఫెన్సు మంత్రిగా నియమించాడు. యాసుకునీ అనే చోట జపాన్‌ యుద్ధవీరులకై కట్టిన స్మారక చిహ్నాన్ని షింజో, అతని సహచరులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించడం దక్షిణ కొరియా, చైనా ప్రజలను మండించి, పాతగాయాలను మళ్లీ రేపింది.

జపాన్‌కు బొత్తిగా సైన్యం లేదని కాదు. కానీ ఆ పేర కాకుండా 'ఆత్మరక్షణ దళం' పేర వుంటుంది. ఆసియాలో వున్న యితరదేశ సైన్యాలతో పోలిస్తే అత్యుత్తమ ఆయుధసంపత్తి, శిక్షణ కలిగివున్నారు. గత దశాబ్దకాలంగా అమెరికా తరఫున యితర దేశాలలో 'శాంతిదళం' (పీస్‌ కీపింగ్‌ ఫోర్స్‌) పేర యుద్ధాలలో పాల్గొంటోంది. ఇప్పుడు షింజో తన సైన్యానికి నేషనల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ అని పేరు పెట్టబోతున్నాడు. అందుకే సైన్యానికి కేటాయించిన బజెట్‌ను 50 బిలియన్‌ డాలర్లకు పెంచాలని, ఉత్తర కొరియా అణుపరీక్షలు నిర్వహించిన సందర్భంగా తాము కూడా అణ్వాయుధాలు, మిస్సయిల్స్‌, సబ్‌మెరైన్లు, ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సమకూర్చుకోవాలనేందుకు అనుమతించాలని కోరుతున్నాడు.  ఫుకిషిమా న్యూక్లియార్‌ రియాక్టర్‌ విస్ఫోటం తర్వాత మూసేసిన న్యూక్లియార్‌ రియాక్టర్లను పునఃప్రారంభించాలన్న షింజో ఆలోచన చైనా, కొరియాలకు భయం కొల్పుతోంది. అమెరికా అడ్డు చెప్పకుండా, అది జపాన్‌లో మరిన్ని మిలటరీ బేస్‌లు ఏర్పాటు చేసుకునేట్లా వీలు కల్పించాడు షింజో. ఆసియాలో నిరంతరం పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకోవడానికి అమెరికాకు జపాన్‌లో ఎన్ని సైనిక స్థావరాలుంటే అంత మంచిది. వాటి కోసం అమెరికా షింజోను ప్రోత్సహిస్తోంది. వారి తోడ్పాటుతో రాజ్యాంగం మార్చేద్దామని షింజో ప్లాను.

కానీ యివేమీ చక్రవర్తికి రుచించటం లేదు. చక్రవర్తులు సాధారణంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించరు. జపాన్‌ లొంగిపోయి 70 ఏళ్లయిన సందర్భంగా ఆగస్టు 8న ఆయన టీవీ ద్వారా ప్రసంగిస్తూ ప్రస్తుత రాజ్యాంగాన్ని మార్చడానికి తాను వ్యతిరేకినని స్పష్టంగా తెలిపాడు. యుద్ధబీభత్సాన్ని ఎవరూ మర్చిపోకూడదని, అలాటి పరిస్థితులు మళ్లీ రాకూడదనీ హితబోధ చేశాడు. చక్రవర్తికి పదేళ్లగా కాన్సర్‌ వుంది. గద్దె దిగిపోతానంటున్నాడు. ఈయన దిగిపోతే యువరాజుగా వున్న నరుహిటో చక్రవర్తి అవుతాడు. అతనేనా తన మాట వింటాడన్న ఆశ షింజోకు లేదు. ఎందుకంటే నరుహిటో యీ విషయంలో తండ్రి కంటె పట్టుదల వున్నవాడు. 2015 ఫిబ్రవరిలో తన పుట్టినరోజు నాడు ప్రసంగిస్తూ 'యుద్ధసమయంలో జరిగిన ఘోరాలను, నాశనాన్ని పెద్దలు పిన్నలకు వివరించి, శాంతి విలువను బోధించి, వారిలో యుద్ధోన్మాదం తలెత్తకుండా చూడాల'ని చెప్పాడు. అతను వస్తే తనకు మరీ యిబ్బందని షింజో ముసలాయననే కొనసాగమని కోరుతున్నాడు. ఎందుకంటే రాజ్యాంగం మార్పు పట్ల ప్రజలు అటూయిటూగా వున్నారు. తామెంతో గౌరవించే చక్రవర్తికి కూడా యిష్టం లేదని తెలిశాక ప్రతిఘటించేవారి బలం పెరుగుతుంది.  అప్పుడు షింజే నిస్సహాయ స్థితిలో పడతాడు. చివరకు యివన్నీ ఎటు దారి తీస్తాయో తెలియదు.

(ఫోటో - 1. జపాన్‌ ప్రధాని షింజో ఏబే, 2. చక్రవర్తి అకిహిటో ప్రసంగం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (సెప్టెంబరు 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?