Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ : జాతీయతావాదంలో తప్పేముంది? - 2/2

ఈ మెజారిటీవాదం చాలా ప్రమాదకరమైనది. బహుళ సంఖ్యలో వున్నవారే మాట చెల్లాలనడం ముప్పు తెస్తుంది. పైన చెప్పిన అనేక ఉదాహరణల్లో మెజారిటీ ప్రజలను మెప్పించి అధికారంలోకి వచ్చాక దాన్ని ఎలా దురుపయోగం చేశారో చూపడం జరిగింది. ఈ చరిత్రే మన రాజ్యాంగనిర్మాతలను భయపెట్టింది. వారు రాజ్యాంగం రాసేనాటికి శతాబ్దాలుగా కలిసివున్న దేశం అప్పుడే భారత్‌, పాకిస్తాన్‌లుగా మతపరంగా విడిపోయింది. పాకిస్తాన్‌ జనాభా కంటె ఎక్కువగా భారత్‌లో ముస్లిములు వుండిపోయారు. జనాభాలో దాదాపు 80% హిందువులున్నా భారత్‌ను హిందూరాజ్యం అనడం సబబు కాదనుకున్నారు. అందుకే లౌకిక - సెక్యులర్‌ - రాజ్యంగా రూపొందించారు. ఆచరణలో వ్యత్యాసాలున్నా ప్రపంచంలో చాలా దేశాలు తమను తాము సెక్యులర్‌గా ప్రకటించుకున్నాయి.  పాకిస్తాన్‌ సైతం 1956 వరకు ఇస్లామిక్‌ దేశంగా చెప్పుకోలేదు. కొన్ని దేశాలు క్రైస్తవ లేదా ముస్లిం దేశాలుగా చెప్పుకుంటాయి. సెక్యులర్‌గా వున్న కొన్ని దేశాల్లో మతపరమైన విప్లవాలు వచ్చి తమ అధికారమతం ఫలానా అని చెప్పుకున్నాయి. 

లౌకిక, లేదా సెక్యులర్‌ అంటే అర్థమేమిటి? మతప్రమేయం లేని... అని! తరతరాలుగా మతవిశ్వాసాలు ప్రజల్లో పాతుకుపోయినప్పుడు మతాన్ని తీసి పక్కన పడేయగలుగుతారా? మన దగ్గర ఏదైనా ప్రభుత్వ భవంతి కట్టబోతూ వుంటే శంకుస్థాపన చేయకుండా, కట్టాక కొబ్బరికాయ కొట్టకుండా వుంటారా? ప్రభుత్వ ట్రెజరీలో లక్ష్మీదేవి పటం తీసేయమంటే తీసేస్తారా? దీపం ముట్టించకుండా సభ ప్రారంభిస్తారా? మరి లౌకిక రాజ్యంలో యిది తగునా? ఇది కొన్ని యితర దేశాల్లో కూడా వుంది. అధిక సంఖ్యాకులు వెళ్లే చర్చిల జీతభత్యాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. (మన దగ్గర కూడా ప్రభుత్వం ఆలయాల అజమాయిషీ తీసుకుని, ఆర్చకుల జీతాలు, నిర్వహణ ఖర్చులు చెల్లిస్తుంది. వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణ కూడా ప్రభుత్వం చూస్తుంది) అక్కడ యితర మతస్తులు తక్కువ కాబట్టి చర్చి ప్రత్యక్షంగా రాజకీయాల్లో జోక్యం చేసుకోకుంటే చాలు సెక్యులరిజం అనేస్తున్నారు. అనేక మతాలున్న, మైనారిటీలు గణనీయంగా వున్న మన దగ్గర లౌకికవాదం అంటే 'సర్వమత సమభావన' అనే అర్థం రూఢి అయింది. అంటే ఏదైనా ప్రారంభోత్సవం జరుగుతూంటే అన్ని మతాల నుంచి గురువులను పిలిచి ప్రార్థనలు చేయిస్తారు. నాయకులు అన్ని ప్రార్థనాలయాలకు వెళతారు, అందరు మత గురువుల దగ్గర్నుంచి ఆశీస్సులు తీసుకుంటారు. ఒక మేరకు యిది బహుళత్వంతో కూడిన భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది కాబట్టి నడిచిపోతూ వచ్చింది. 

పోనుపోను ఓటుబ్యాంకు రాజకీయాలు మొదలయ్యాయి. కులస్తులను, మతస్తులను ఓటు బ్యాంకులుగా చూసి వారి కోసం రిజర్వేషన్లు, ప్రత్యేక సౌకర్యాలు ప్రకటించడం మొదలుపెట్టారు. తమాషా ఏమిటంటే యిదంతా సెక్యులరిజం పేర నడపసాగారు. మతప్రమేయం లేని లేదా సర్వమతాలను సమానంగా చూసే సిద్ధాంతం లౌకికవాదం అన్నప్పుడు మతపరంగా కాని, కులపరంగా (మతం వుంటేనే కదా కులం వుండేది) కాని బుజ్జగించడాలు, తాయిలాలు చూపడాలు సెక్యులరిజం కిందకు ఎలా వస్తాయి? (సెక్యులరిజం పేర నాయకులు ఎటువంటి తమాషాలు ఆడుతున్నారో, ఏ రోటి దగ్గర ఆ పాట ఎలా పాడుతున్నారో గంగాధర గాడ్గీిళ్‌ అనే మరాఠీ రచయిత గొప్ప కథ రాస్తే నేను దాన్ని ''లౌకికవాదర వర్ధిల్లాలి'' పేరుతో అనువదించాను. ఎమ్బీయస్‌ కథలు 25). http://telugu.greatandhra.com/articles/mbs/mbs-kathalu-25-61176.html ఈ నాటకాల వలన సెక్యులరిజం పదమే వెక్కిరింతకు గురి కాసాగింది. అది సెక్యులరిజం కాదు, సిక్‌(రోగగ్రస్తం)యులరిజం అనసాగారు. కొందరైతే దాన్ని క్వాలిఫై చేసి కుహనా లేదా సూడో సెక్యులరిజం అనసాగారు. మొత్తానికి కొందరికి అది తిట్టుపదం అయిపోయింది. అయితే వెక్కిరించేవారు కూడా మతపరమైన బుజ్జగింపులు, రిజర్వేషన్లు గురించి మాట్లాడతారు తప్ప కులపరమైన బుజ్జగింపులు, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడరు. ఎందుకంటే వారికి యితర మతస్తుల ఓటు బ్యాంకులు అక్కరలేదు కానీ కులపరమైన ఓటు బ్యాంకులు కావాలి. 

హిందువులు మెజారిటీలో వున్నారు కాబట్టి దేశాన్ని హిందూరాజ్యంగా ప్రకటించాలి అని కొందరు వాదిస్తారు. ప్రపంచంలో వందలాది దేశాలు అలా చేయలేదు. తమ దేశంలో మెజారిటీ మతం ఏదో ఒకటి వున్నా తమది సెక్యులర్‌ దేశమే అని చెప్పుకున్నారు. ఎందుకంటే మెజారిటీ మతం అని పేరుకు వున్నా మళ్లీ దానిలో ఉపమతాలుంటాయి. విభజనలుంటాయి.  ముస్లింలలో షియాలు, సున్నీలే కాదు, యింకా బోల్డు వుంటాయి. అలాగే క్రైస్తవుల్లోనూ వందలాది విభజనలు. హిందూమతంలో చూడండి, విష్ణ్వాలయంలో శైవ పూజారి వుండడు. మతం సంఘటితం చేస్తుంది - పరమతస్తులపై దాడి చేసేటప్పుడు మాత్రమే! ఆ భయం తొలగాక మళ్లీ వీళ్లల్లో వీళ్లు కొట్టుకుంటారు. క్రైస్తవ మతావలంబీకులైన దేశాల మధ్య, ఇస్లాం దేశాల మధ్య యుద్ధాలు జరగటం లేదా? మన రాజులందరూ హిందువులే అయినా కొట్టుకుని చావలేదా? అందువలన ఫలానా చోట ఫలానా వారిది మెజారిటీ కాబట్టి వారిది గొప్ప, తక్కినవాళ్లు వాళ్లకు వంత పాడాలి అనే సిద్ధాంతంతో మొదలుపెడితే చివరకు అది ఎక్కడ ఆగుతుందో తెలియదు. 

మనం మైదాన ప్రాంతాల వాళ్లం. పర్వతప్రాంతాల వాళ్ల ఆచారవ్యవహారాలు వేరే వుంటాయి. వాటిని అనాగరికంగా తీర్మానించి మనం మెజారిటీలో వున్నాం కాబట్టి మన పద్ధతులు వాళ్ల మీద బలవంతంగా రుద్దబోతాం. వాళ్లు ప్రతిఘటిస్తారు. వాళ్లను సంస్కరిస్తున్నాం అనే ఉద్దేశంలో ఆ ప్రతిఘటనను అణచివేస్తాం. నిజానికి వారి పద్ధతుల్లో కొన్ని మార్చాల్సి వున్నా, కొన్నిటిని మనం స్వీకరించడమో, ఆమోదించడమో చేయవచ్చు. కానీ మనకు వాళ్లపై చిన్నచూపు. వాళ్లే మన దారికి రావాలన్న పట్టుదల. దాంతో ఘర్షణ. మన దగ్గర వున్న కోయవాళ్లననే కాదు, మనం ఈశాన్య భారతంలో వున్న వాళ్లని కూడా ఖాతరు చేయం. అందరూ చైనా వాళ్లల్లా వున్నారనుకుంటాం. అసలక్కడ ఎన్ని రాష్ట్రాలున్నాయో, ఏ పార్టీ ప్రభుత్వాలున్నాయో కూడా చాలామంది పట్టించుకోము.

మనం వాళ్లని ఎలా లక్ష్యపెట్టమో, ఉత్తరాది వాళ్లు మననూ లక్ష్యపెట్టరు. దక్షిణాదిన ఎన్ని రాష్ట్రాలంటే వాళ్లల్లో చాలామంది చెప్పలేరు. అసలే అక్కడ అక్షరాస్యత తక్కువ, ఉన్నది కూడా హిందీలోనే వుంటుంది. జనరల్‌ నాలెజ్‌ పెంచుకోవాలన్న తృష్ణ వుండదు. వాళ్ల కడుపే కైలాసం, వాళ్లున్నదే వైకుంఠం. 'దక్షిణాది వాళ్లందరూ మద్రాసీలే, అక్కడ అందరూ నల్లగా రాక్షసుల్లా వుంటారు, రావణాసురుణ్ని పూజిస్తారు. మనం ఎడ్డెం అంటే వాళ్లు తెడ్డెం అంటారు' ఇదీ జనరల్‌గా వాళ్లకుండే అభిప్రాయం. ఉత్తరాదిన ప్రయాణాలు చేసినపుడు అనేకమందిని కలిశాను. చాలామంది సహోద్యోగులున్నారు. తక్కినవిషయాల్లో వాళ్లకు కొంతయినా జ్ఞానం వున్నా, దక్షిణాది విషయంలో అస్సలు ఏమీ తెలియదు. డికె, డిఎంకె వాళ్లు రావణలీల చేస్తే దాన్ని హైలైట్‌ చేస్తూ హిందీ పత్రికలు కథనాలు వేస్తాయి. అవి చదివి అందరూ రావణభక్తులే అనుకుంటారు వాళ్లు. చదువుకోసమో, ఉద్యోగం కోసమో దక్షిణాది వచ్చినప్పుడు చాలా విషయాలు బోధపడి ముక్కున వేలేసుకుంటారు.

దానికి తోడు మనకు దేశభక్తి లేదనే చిన్నచూపు తోడవుతుంది. వాళ్ల చరిత్ర పుస్తకాల్లో లాలా లజపతి రాయ్‌, భగత్‌ సింగ్‌,  పటేల్‌, బాల గంగాధర టిళక్‌, చంద్రశేఖర ఆజాద్‌, సుభాష్‌ బోసు గురించి వుంటుంది తప్ప దక్షిణాది స్వాతంత్య్రయోధుల గురించి ఏమీ వుండదు. అందువలన మేం త్యాగాలు చేసి స్వాతంత్య్రపోరాటం చేసే రోజుల్లో మీరు హాయిగా ఇడ్లీ సాంబారు మెక్కుతూ కూర్చున్నారు అంటారు. నా చిన్నప్పటి పాఠ్యపుస్తకంలో గోవింద వల్లభ్‌ పంత్‌ గురించి పాఠం వుండేది. మరి వాళ్ల పుస్తకాల్లో ప్రకాశం పంతులు పాఠం వుందా? ఛస్తే వుండదు. పార్లమెంటులో కూడా దక్షిణాది నాయకుల ఫోటోలు ఎన్ని వున్నాయో లెక్క వేయండి. ఇప్పటికీ సైన్యంలో దక్షిణాది వారి సంఖ్య తక్కువ. ఇవన్నీ మనసులో మెదలడం వలన, విదేశీ దాడులు ఎదుర్కునేది, మతకలహాల్లో, దేశవిభజనలో నష్టపోయేది, ప్రాణాలకు ఒడ్డి సరిహద్దులు కాపాడేది - మేము, కడుపులో చల్ల కదలకుండా ఉద్యోగాలు చేసుకుంటూ అతి తెలివి ప్రదర్శించేది మద్రాసీలు (అనగా యావన్మంది దక్షిణాది వాళ్లు) అనే భావం ఉత్తరాది వాళ్లల్లో పాతుకుపోయి వుంది. గత 20 ఏళ్లగా శాటిలైట్‌ టీవీలు వచ్చి దక్షిణాది గురించిన వార్తలు ఎక్కువ తెలిసేందుకు అవకాశం వుంది కాబట్టి మన గురించి అవగాహన కొంత పెరిగి వుండవచ్చు. ఏదైనా సరే ఆసక్తి వున్నవాడికి తెలుస్తుంది. వీళ్ల గురించి తెలుసుకునేదేముంది బోడి అనుకునేవాడు ప్రాంతీయ ఛానెల్‌ తప్ప మరొకటి పెట్టనే పెట్టడు.

ఉత్తరాది వాళ్లల్లో మెజారిటీవాదం ఎలా వుందో తాజాగా తరుణ్‌ విజయ్‌ వ్యాఖ్య చెప్తుంది. ఆయన బిజెపి లీడరు కాబట్టి అది బిజెపి పార్టీ అధికార వైఖరి అనే వాదన నేను చేయను. వ్యక్తిగతమైన పాప్యులారిటీ కోసం కొందరు బిజెపి నాయకులు తీవ్రవ్యాఖ్యలు అప్పుడప్పుడు చేస్తూంటారు, తర్వాత క్షమించమని అడుగుతూ వుంటారు. మమతా బెనర్జీ తల నరికితే బహుమతి.. వంటి వ్యాఖ్యలు అలాటివి. వెంటనే వాళ్లను పార్టీలోంచి తీసేస్తే తప్ప వాళ్లకు బుద్ధి రాదు. తరుణ్‌ విజయ్‌ ఆగ్రహంలో చేసిన వ్యాఖ్య కాదు. మా ఇండియన్స్‌కు వర్ణవివక్షత లేదు అనే వాదనను సోదాహరణంగా చెప్పడానికి 'మాకు అలాటిది వుంటే నల్లగా వుండే దక్షిణాది వాళ్లతో కలిసి ఎందుకు వుంటాం?' అని తర్కించాడాయన. అతన్ని ఖండిస్తూ 'దక్షిణాది వారిలో తెల్లగా వుండేవారు, ఉత్తరాది వాళ్లలో నల్లగా వుండేవారు వుంటారు' అంటూ కొందరు వాదించారు. అసలు అక్కడ కీలకమైన మాట - 'మేం'! దాని అర్థం మా ఉత్తరాదివాళ్లం అని. వాళ్లే ఇండియన్స్‌! మరి మనమంతా ఏమిటో!? తరుణ్‌ విజయ్‌ ఏ సాధుయో, సాధ్వీయో అయితే అంత పట్టించుకోనక్కరలేదు. కానీ ఆయన ఆరెస్సెస్‌ వారి ''పాంచజన్య'' పత్రికకు ఎడిటరుగా చేసినవాడు. నిస్సందేహంగా మేధావి, ఆలోచనాపరుడు, సీనియర్‌ పాత్రికేయుడు. వివాదం వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పి హుందాగా బయటపడ్డాడు. అసలా భావం అలా ఎలా వెలువడింది అంటే మనసులో అంతర్లీనంగా వున్న అభిప్రాయమే అది. నార్త్‌ ఇండియన్సే ఇండియన్స్‌ అని. 

ఇలాటి భావమే గతంలో ఒక ఉత్తరాది రాజకీయ నాయకుడు అన్నాడు - ''కడవా చౌథ్‌ జరుపుకోని మహిళ హిందూ స్త్రీ కానే కాదు' అని. మా అమ్మ, నా భార్య ఆ పండగేదో చేయనే చేయరు. హిందీ సినిమాల్లో చూపారు కాబట్టి అదో జల్లెడ పండగని గుర్తుంది కానీ లేకపోతే మాకు తెలిసేదే కాదు. మరి మా అమ్మ, నా భార్య హిందూ స్త్రీలు కారా? వాడెవడు సర్టిఫికెట్టు యివ్వడానికి? ఆ మూర్ఖుడు క్షమాపణ చెప్పలేదు, అతని పార్టీ నాయకులు బహిరంగంగా మందలించలేదు. ఏ మతస్తులైనా సరే, దేశపౌరులందరికీ ఒకడే పౌరస్మృతి (యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌) వుండాలని కొందరు వాదిస్తారు. ఆచరణలో అదెలా సాధ్యమో నాకు అర్థం కాదు. హిందువుల్లోనే దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం వుంది. తండ్రి ఆస్తంతా పెద్దకొడుక్కే వస్తుంది కొన్ని చోట్ల, మగపిల్లలకే వస్తుంది కొన్ని చోట్ల, ఆడపిల్లలకే వస్తుంది కొన్ని చోట్ల, అన్నగారు పోతే వదినగార్ని పెళ్లాడి, ఆమె పిల్లలకు సంరక్షకుడు కావడం ఒప్పు ఒకచోట, యింకోచోట అది వూహించడానికే బెదిరే ఆలోచన. ఇలాటి పరిస్థితుల్లో నార్త్‌ ఇండియాలో వున్న ఆచారమే దేశప్రజలందరి ఆచారం అంటూ అందరిపైనా రుద్దుతారేమో! 

జాతీయతావాదంతో మొదలుపెట్టి, మతరాజకీయాల మీదుగా మెజారిటీవాదం గురించి చర్చించడం జరిగింది. ఇవన్నీ ఒకదానితో మరొకదానికి లింకు వున్నవే. రేదర్‌, లింకు పెడతారు. ఇప్పుడు ట్రంప్‌ చూడండి, అమెరికా ఫస్ట్‌ అంటూ జాతీయతావాదాన్ని ఎత్తుకున్నాడు. ఇతర దేశస్తులు వచ్చి మన సంస్కృతిని కలుషితం చేసేశారన్నాడు. సమాజాన్ని నేరపూరితం చేశారన్నాడు. ఇతరుల వేషభాషలను వెక్కిరించాడు. మెజారిటీ ప్రజలైన అమెరికన్లకు అవకాశాలు లేకపోతే ఎలా అని వాపోయి, వాళ్ల హక్కులు పరిరక్షిస్తానన్నాడు. అలా మెజారిటీ వాదం కలిపాడు. అంతటితో ఆగాడా? మతాన్నీ కలిపాడు. శరణార్థుల్లో ముస్లిములను, క్రైస్తవులను వేర్వేరుగా చూడాలన్నాడు. చర్చి అబార్షన్లను వ్యతిరేకిస్తుంది కాబట్టి దాని మద్దతు కోసం తనూ అబార్షన్లకు వ్యతిరేకమన్నాడు. అతని జీవనశైలి చూస్తే అచ్చమైన, స్వచ్ఛమైన క్రైస్తవుడిగా బతికినట్లు తోచదు. కానీ యిప్పుడు జనాల ఆదరణ కావాలి కాబట్టి, ఇస్లాం దేశాలను వేరు పరచాలి కాబట్టి రష్యాతో చేయి కలపడానికి క్రైస్తవ ప్రస్తావన తెచ్చాడు. 

ఈ గిమ్మిక్కులన్నీ అంతిమంగా సామాన్య అమెరికన్ల బతుకు మెరుగుపరచడానికే చేస్తున్నాడని కాస్సేపు అనుకుందాం. కానీ ఒకసారి యిలాటి భావాలను వ్యాప్తిలోకి తెచ్చాక దాని ప్రభావం సామాన్యుడిమీద ఎలా వుంటోందో చూస్తున్నాం. ఎవడు అక్రమ వలసదారుడో, ఎవడు సక్రమ వలసదారుడో వాడికి అనవసరం. తమ రంగులో లేనివాడు పరాయివాడు, తమ అవకాశాలు దోచుకోవడానికి వచ్చినవాడు అనుకుని ద్వేషం పెంచుకుంటున్నాడు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని దండిస్తున్నాడు. పోలీసుల్లో కూడా గోధుమరంగు వారిపై అనుమానాలు పెరిగిపోయి, అవమానాలకు గురి చేసే ధోరణి పెరుగుతోంది. ట్రంప్‌ సంస్కరణలకు కోర్టులు అడ్డు తగులుకున్న కొద్దీ సామాన్య అమెరికన్‌లో ఫ్రస్ట్రేషన్‌ పెరిగి అన్ని రకాల మైనారిటీలపై అసహ్యం పెరుగుతుంది. క్రమేపీ యిది కార్యాలయాల్లో, బయటా వ్యాపించే అవకాశం వుంది. క్రైస్తవేతర ప్రార్థనాలయాలపై దాడులూ జరగవచ్చు. ప్రభుత్వం ఏమేరకు వాళ్లను ఆపగలదో ఎవరూ చెప్పలేరు. పైన చెప్పినట్లుగా ఏదో ఒక వాదం ఎత్తుకుని ప్రజలను రెచ్చగొట్టడం సులభం, నియంత్రించడం కష్టం. ఈ ధోరణి యూరోప్‌కూ వ్యాపించేట్లు వుంది. మన దేశప్రజల్లో కొందరైనా ప్రభావితులవుతున్నారనేది వాస్తవం. (సమాప్తం)

(ఫోటో -తీవ్ర జాతీయవాదంతో ఫ్రాన్సు రాజకీయాల్లో సంచలనం రేపుతున్న లే పెన్‌)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 
- mbsprasad@gmail.com

ఎమ్బీయస్‌ : జాతీయతావాదంలో తప్పేముంది? - 1/2