Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: జయలలిత వారసత్వం

ఎమ్బీయస్‌: జయలలిత వారసత్వం

తను పోయాక తన ఆస్తులు, ఎడిఎంకె పార్టీ, తమిళనాడు ప్రభుత్వం ఏమయిపోతాయని జయలలిత ఆలోచించలేదంటే ఆశ్చర్యంగా వుంటుంది. వీలునామా రాయకుండానే ఆమె చనిపోయిందంటే నమ్మబుద్ధి కాదు. రాసేవుంటుందని, కానీ పాపాలభైరవి శశికళ మాయం చేసేసి వుంటుందని తీర్మానించడం సులభమైన పని. ఆమె, ఆమె ముఠా అవినీతికి పాల్పడి జయలలితకు చెడ్డపేరు తెచ్చారని ఆమె ప్రత్యర్థులైన ఎడిఎంకె నాయకులు యిప్పుడు ఆరోపిస్తున్నారు. అంటే అవినీతి జరిగిందని ఒప్పుకుంటూనే దానికి కారణం శశికళ అంటున్నారు. జయలలితకు తెలియకుండా, అనుమతించకుండా శశికళ కానీ మరొకరు కానీ ఆమె పార్టీలో వ్యవహరించగలరా? ఏది ఏమైనా జయలలిత శశికళను విపరీతంగా నమ్మింది. శశికళ, ఆమె బంధువులు కలిసి తనకు చెడ్డపేరు తెస్తున్నారని అనుమానం తగలగానే 2011లో ఆమెను, వారందరినీ పార్టీలోంచి బహిష్కరించింది. కానీ ఆ బంధువులు తనకు కూడా తెలియకుండా ఆ పనులు చేసివుంటారని, తను నిర్దోషినని శశికళ జయలలితను నమ్మించగలిగింది. మళ్లీ ఆత్మీయురాలైంది. డిసెంబరు 6న, జయలలిత పార్థివదేహం చుట్టూ ఆ బంధువులంతా ప్రత్యక్షమయ్యారు. శశికళ భర్త నటరాజన్‌ పేరు చెపితేనే జయలలిత మండిపడేది. అతనూ అక్కడ హాజరయ్యాడు. 

ఎమ్జీయార్‌ చనిపోయినపుడు శవం దగ్గర జయలలిత నిలబడితే ఆమెను తరిమివేయడానికి వీరప్పన్‌ వర్గం శతథా ప్రయత్నించింది. ఈ రోజు శశికళకు అలాటి అవస్థ ఏమీ పట్టలేదు. బంధుసమేతంగా ఆమె శవం చుట్టూ నిలబడితే, ముఖ్యమంత్రి, యితర కాబినెట్‌ సహచరులు కింద మెట్ల మీద కూర్చున్నారు. వచ్చినవారందరూ శశికళను ఓదార్చి వెళ్లారు. 'జయలలిత కుటుంబసభ్యులకు ప్రాముఖ్యత యివ్వలేదు, శశికళ అక్రమాలను ఎండగడతా' అంటూ జయలలిత మేనకోడలు దీప రంగంలోకి దిగింది. మీడియా తప్ప వేరెవ్వరూ ఆమెను పట్టించుకోవటం లేదు. ఎందుకంటే జయలలిత బతికి వుండగా ఆమె వీళ్లెవరినీ దగ్గరకు రానీయలేదు. వీళ్లూ నోరెత్తలేదు. చచ్చిపోయిన తర్వాత 'మా అత్త పార్టీని రక్షిస్తా' అని చెప్పుకుంటే ఎవరికి పట్టింది? జయలలిత తనకు కుటుంబం వున్నట్లే ఎప్పుడూ చూపుకోలేదు. ఆమెకు డాక్టరీ చదివిన కూతురు వుందని పుకారు వుంది. ఆ కూతురు అంత్యక్రియల్లో ఎక్కడా కనబడినట్లు లేదు, ఆమె పేర ఆస్తులు రాసినట్లూ కనబడటం లేదు. 

ఈ రోజు వున్న వాస్తవమేమిటంటే - తమిళనాడులో శశికళ అత్యంత శక్తివంతమైన మహిళగా అవతరించింది. దానికి ఆధారం ఆమెకు జయలలితతో వున్న 30 ఏళ్ల సాన్నిహిత్యం. పార్టీకి జనరల్‌ సెక్రటరీగా ఆమె కావడం నిశ్చయంగా కనబడుతోంది. పార్టీయే కాదు, ముఖ్యమంత్రి కూడా అవుతానని ఆమె పేచీ పెట్టి రెండు రోజుల తర్వాత వెనక్కి తగ్గింది.  ఎందుకు తగ్గింది అనేదానికి కొన్ని కథనాలు వినబడుతున్నాయి. పన్నీరు సెల్వం పార్టీని బిజెపి వైపు నడిపిద్దామని చూస్తున్నాడని, శశికళ కాంగ్రెసు వైపు నడిపిద్దామని చూస్తోందని అంటున్నారు. అంత్యక్రియల్లో శశికళ భర్త నటరాజన్‌తో రాహుల్‌ గాంధీ మాట్లాడగా, సెల్వంతో మోదీ మాట్లాడారు. సెల్వంను ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి శశికళను భయపెట్టాలి. అందుకే టిటిడి శేఖరరెడ్డి, మరో ఫైనాన్సర్‌పై దాడులు జరిగాయట. దాంతో శశికళ వెనక్కి తగ్గిందట. ముఖ్యమంత్రిగా సెల్వం జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో గందరగోళం జరగకుండా సామర్థ్యం చూపాడు. ప్రభుత్వం సెల్వం చేతిలో, పార్టీ శశికళ చేతిలో అనే ఏర్పాటు ఎంతకాలం నడుస్తుందో చూడాలి.

దీనిలో కులకోణం కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. తమిళనాడులో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక నియోజకవర్గంలో అధిక సంఖ్యాకుల కులప్రాతిపదికపై జరిగినా యిన్నాళ్లూ ముఖ్యనాయకులు ప్రధాన కులాలకు చెందనివారై అన్ని కులాల ఆదరాన్నీ పొందినవారు. ఎమ్జీయార్‌ మలయాళీ మేనోన్‌, కరుణానిధి తెలుగు ఇసై వెల్లాలర్‌ (సంఖ్యాపరంగా చాలా తక్కువమంది వున్నారు), జయలలిత అయ్యంగార్‌ బ్రాహ్మణి. జనాభాలో వణ్నియార్‌ (18%), గౌండర్‌ (14%), దేవర్‌ (26%) అనే బిసి కులాలకు చెందినవారు 58% దాకా వున్నారు. (అంకెలు రమారమివే) వీరిలో ఎవరూ ముఖ్యమంత్రి కాలేదు. పిఎంకె పార్టీ వణ్నియార్ల కోసమే వెలసిన పార్టీ. గౌండర్లు యిటీవలి కాలంలో తమ ఆధిపత్యాన్ని చూపించుకుంటూ దళితులతో కలహిస్తున్నారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన సెల్వం, శశికళ యిద్దరూ దేవర్లే కాబట్టి ఆ కులం గురించి కొంత తెలుసుకోవాలి. దేవర్లను ముక్కులతోర్లు అని కూడా అంటారు. అంటే మూడు కులాల కూటమి అని అర్థం. ఆ మూడు కులాలు - అగముదయార్‌, కల్లార్‌, మారవర్‌! వీరు తాము ఇంద్రుడికి, ఒక అప్సర ద్వారా కలిగిన సంతతి అనుకుంటారు. అగముదయార్‌లు తాము చేర వంశస్తులమని, కల్లార్‌లు తాము చోళ వంశస్తులమని, మారవర్‌లు తాము పాండ్య వంశస్తులమని చెప్పుకుంటూ, యితర ఉపకులాల కంటె తామే అధికులమని అనుకుంటూ వుంటారు. 

సెల్వం మారవర్‌ కాగా, శశికళ కల్లార్‌. ఏది ఏమైనా యిద్దరూ దేవర్లే కాబట్టి ఎడిఎంకెలో యిక దేవర్ల ప్రభ వెలుగుతుందని అనుకుంటున్నారు. డిఎంకెకు దేవర్ల వ్యతిరేక పార్టీ అనే పేరుంది. దాన్ని సవరిద్దామని స్టాలిన్‌ యిటీవలే దిండిగల్‌ పెరియసామి అనే దేవర్‌ను పార్టీ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా చేశాడు. ఎడిఎంకె ఎప్పణ్నుంచో దేవర్లను దువ్వుతోంది, వారితో పాటు గౌండర్లను కూడా. కాబినెట్‌లో 8 మంది దేవర్లు, 8 మంది గౌండర్లు వున్నారు. గౌండర్లయిన పొణ్నియన్‌, తంబిదురై పార్టీ జనరల్‌ సెక్రటరీ పదవికి శశికళతో పోటీపడి అంతలోనే వెనక్కి తగ్గారు. కులప్రాతిపదికపై సెల్వం ముఖ్యమంత్రి కాలేదు. జయలలిత అతని విశ్వసనీయతను నమ్మింది కాబట్టి అయ్యాడు. కానీ శశికళ, అతను యిద్దరూ ఒకే కులానికి చెందినా రాజకీయంగా ఎవరికి అండగా నిలవాలన్న విషయంలో భేదాభిప్రాయాలున్నాయి. ఏది ఏమైనా ఎమ్జీయార్‌ మరణించాక ఎడిఎంకె జానకి వర్గంగా, జయలలిత వర్గంగా చీలిపోయి నష్టపోయింది. ప్రజామోదం సంపాదించి జయలలిత వారసురాలిగా గుర్తించబడి, పార్టీని ఐక్యం చేయగలిగింది. జయలలిత తదనంతరం పార్టీలో ఏ మాత్రం చీలిక వచ్చినా డిఎంకె లాభపడుతుంది. శశికళ వేసే ఎత్తులపై తర్వాతి కథ ఆధారపడుతుంది.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2016) 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?