Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ కథ: పొరుగింటి డబ్బుమూట...

ఎమ్బీయస్ కథ: పొరుగింటి డబ్బుమూట...

ఓ సినిమా యాక్టరు బావగారి యింటిపై ఆదాయపుపన్ను వారి దాడి జరిగింది. నోట్లు కుక్కిన మూటలు నాలుగు దొరికాయని వార్తలు వచ్చాయి. ఎనిమిది దొరికాయి కానీ వాటిలో నాల్గిటిని దాడి చేసిన అధికారులు నొక్కేశారని నీలివార్తలు వచ్చాయి. ఆ రోజు టీవీ ఛానెళ్లకు అదే ఫలహారం.. ఆహారం అన్నీ. పొద్దుటినుండీ మొదలుపెట్టారు. సాయంత్రం అయ్యేసరికి నొక్కేసినవాటి సంఖ్య ఎనిమిదికి చేరింది. అన్ని ఛానెళ్లూ 'తాము మాత్రమే యీ వార్త కనుక్కున్నాయనీ, ఎక్స్‌క్లూజివ్‌ రిపోర్టింగ్‌' అనీ చెప్పుకున్నాయి. రిమోట్‌ నొక్కినొక్కి ప్రతీ చోటా అదే కనబడడంతో సావిత్రికి విసుగేసి టీవీ కట్టేసింది. చివరికి నిట్టూర్చి ''చూస్తే ఏమొస్తుంది? నా తలరాతే బాగుంటే మీకా యిన్‌కమ్‌టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చుండేది!'' అంది భర్త రాజాతో.

''ఏం? ఓ రెండు బస్తాలు యింటికి పట్టుకొచ్చేవాణ్ననా? మనకంత లక్కేదీ?'' అన్నాడు రాజా - 'మీ సెల్‌ నెంబరుకు వేలాది డాలర్ల బహుమతి వచ్చిందం’టూ యిన్‌బాక్స్‌ నింపేసిన మెసేజ్‌లు డిలీట్‌ చేస్తూ. ''నా కంత ఆశ లేదు...ఓ సంచీడు తెచ్చినా చాలు..'' అంది ఆశగా సావిత్రి. ''దానికి ఇన్‌కమ్‌టాక్స్‌లో చేరనక్కరలేదు. ఆయన యింటి వెనక్కాల చేరినా చాలు. ఇలాటి సందర్భాల్లో పెరట్లో దాచిన మూటలు గోడమీద నుండి బయటకు విసిరేస్తారు. రోడ్డు మీద వెళుతూంటే ఓ మూట నెత్తిన పడుతుంది. ఆటోలో వేసుకుని వచ్చేయడమే..'' అన్నాడు రాజా భార్య కేసి చూసి నవ్వుతూ .

సావిత్రి నవ్వలేదు. ''నిజమే కదూ, కొన్నేళ్ల క్రితం ఓ ఘనాగనుడి యింట్లో యిలాటి దాడే జరిగినపుడు రోడ్డు మీద కట్టలు కట్టలు పడేశారటగా...'' అంది కనుబొమలు ముడివేసి. ''..అవును, ..అదీ లారీల్లో తరలించినది కాకుండా..! మొన్నామధ్య బొంబాయిలో డబ్బుమూటలు గుజరాత్‌ మెయిల్‌కి ఎక్కిస్తూ దొరికిపోయారు గుర్తుందా? అది లెక్కపెట్టడానికి 50 మందికి మూడు రోజులు పట్టిందిట. మొదటి రోజు వందకోట్లు అన్నారు. లెక్క పూర్తయేసరికి పది కోట్లన్నారు. రైల్వే స్టేషన్‌కి నాలుగు ట్రక్కుల్లో నూరు బస్తాల్లో తెచ్చినది అంతేనా!? సగానికి సగం బస్తాలు అటూయిటూ పడేశారంటావా? '' అన్నాడు రాజా.

సావిత్రి కాస్సేపు వూరుకుని ''మనకలాటి ఓ బస్తాయో, అధమం పదో, పన్నెండో కట్టలు దొరికితే భలేగా వుంటుంది కదూ...''అంది. రాజా సెల్‌ఫోన్‌ చార్జింగులో పెట్టి ''పదయింది. పడుక్కుంటే యింకా యింతకంటె మంచి కలలు వస్తాయి'' అని లేచాడు. సావిత్రి విసుక్కుంది. ''ఏబ్రాసికి నిద్ర ఎక్కువని... వుండండి... నాకేదో ఆలోచన వస్తోంది. ఇప్పుడు.. అలా దొరికితే, అదేమీ దొంగతనం కాదు కదా. వాళ్లకు అక్కరలేనిది బయటపడేశారు. మనకు పనికి వస్తుంది కాబట్టి యింటికి తెచ్చుకుంటున్నాం. తప్పేముంది?'' రాజా ఆవలిస్తూ, ''ఏవ్హీ లేదు, ళేపణ్నుంచి ఆ బావగాళి యింటెనక్కాల గుళారం వేసుక్కూచో..'' అన్నాడు. ''నెత్తిమీద పెద్దమ్మ తాండవిస్తూ వుంటే యిలాటి వెకసెక్కాలు కాక మరేం వస్తాయి? ఈయన మీద దాడి అయిపోయింది కదా, మళ్లీ ఎందుకొస్తారు? తక్కిన యాక్టర్ల మీద, వాళ్ల బంధువుల మీద పడతారు.''

ఆమె దీన్నంత సీరియస్‌గా తీసుకోవడం రాజాకు చికాకు తెప్పించింది. ఆవలింతలు ఆపి ''మనకు డజను మంది హీరోలు, యింకో డజను మంది హీరోయిన్లు వున్నారు. నిర్మాతలున్నారు. వాళ్ల బావలు, మావలు, అన్నలు, తమ్ముళ్లు.. వీళ్లందర్నీ లెక్కవేస్తే వందల్లో తేలతారు. ప్రతీ వాడి యింటి వెనక్కాల నక్కి కూర్చుంటావా? ఎంతకాలం? ఎప్పుడు దాడి చేస్తారో వాళ్లకే తెలియదు. నీకేం తెలుస్తుంది? కొంపా గోడూ పట్టించుకోకుండా గోడలు పట్టుకుని తిరుగుతావా? మతిమాలిన ఆలోచనలు మాని వచ్చి పడుక్కో. నేను రేపు పొద్దున్నే లేచి ఆర్డర్ల కోసం వెళ్లాలి.'' అంటూ పడగ్గదివైపు నడిచాడు.

ఓ గంట పోయాక సావిత్రి అతన్ని తట్టి లేపింది. లేపుతూనే కప్పు కాఫీ యిచ్చింది. ''ఇదేమిటి?'' అన్నాడతను విస్తుపోతూ. ''నేను చెప్పేది శ్రద్ధగా వినండి.'' అంది సావిత్రి అతి గంభీరంగా. కాఫీ తాగుతూండగానే సావిత్రి తన ప్రణాళిక చెప్పింది, మధ్యమధ్యలో తన భర్త సందేహాలు తీరుస్తూ!  ఇలాటి దాడులు ఎదుర్కుంటున్నవాళ్లు సినిమా యాక్టర్లు మాత్రమే కాదు. దాడులు చేసేది ఐటీ మాత్రమే కాదు, సిబిఐ కూడా. అధికారపక్షం తనను ధిక్కరించిన వాళ్లందరిపైనా, తన పార్టీ నుండి ఫిరాయిద్దామనుకున్న వాళ్లందరిపైనా, విరాళాలివ్వని వ్యాపారస్తుల పైనా సిబిఐ చేత దాడి చేయిస్తుంది. అలా దాడి చేసినపుడు మనలాటి వాళ్లు గోడ పక్కన నక్కనక్కరలేదు. పక్కింట్లో కాపురమున్నా చాలు. స్నేహం కుదిరితే దాడి జరుగుతోందన్న సమాచారం రాగానే మనింట్లో నాలుగు బస్తాలు పడేస్తారు. అధికారులు వెళ్లిపోయిన తర్వాత తిరిగి యిచ్చేయమంటారు. అవసరానికి ఆదుకున్నామన్న కృతజ్ఞత కొద్దీ అరబస్తాయో, పావుమూటో మనకి యిచ్చేస్తారు.

అలాటి వాళ్లతో మనలాటి మధ్యతరగతి వాళ్లకు పరిచయాలేముంటాయని సందేహాలు వద్దు. మాలతి సంగతి గుర్తు తెచ్చుకోండి. చిన్నపుడు మా నాన్నగారి దగ్గరకి లెక్కలు చెప్పించేందుకు ట్యూషన్‌కి వచ్చేది. డబ్బున్నవాళ్ల అమ్మాయే, మా నాన్నగారు వాళ్ల యింటికి వెళ్లి చెప్పననడంతో రోజూ రిక్షాలో పంపించేవారు. నా యీడుదే. 'మాస్టారమ్మాయి' అంటూ చాలా ఆప్యాయంగా వుండేది. డిగ్రీ కాగానే వాళ్ల నాన్న ఓ కలక్టరుకి యిచ్చి పెళ్లి చేసేశాడు. ఇంకో పదేళ్లకి ఆయన ఆ ఉద్యోగం మానేసి రాజకీయాల్లో చేరాడు. ఆ కులం వాళ్లలో మంచి కాండిడేటు ఎవరూ దొరక్క పిలిచి ఎమ్మెల్యే టిక్కెట్టు యిచ్చారు. నెగ్గి హోం మంత్రికి దగ్గరయాడు. ఆయనతో కలిసి సెటిల్‌మెంట్లు చేయడం మరిగాడు. ఈ మధ్య హోం మంత్రి గ్రూపులు కట్టడంతో, ముఖ్యమంత్రి అతన్ని అణిచేద్దామని చూస్తున్నాడు. ఇదంతా పేపర్లో వచ్చింది. హోం మంత్రి గుట్టుమట్లు లాగడానికి అతనికి కుడిభుజంగా వున్న మాలతి మొగుడిపై ముఖ్యమంత్రి సిబిఐ దాడి చేయించేందుకు చాలా అవకాశాలున్నాయి. అవునా? కాదా?

సావిత్రి రాజకీయపరిజ్ఞానం చూసి రాజా ముగ్ధుడై పోయి, 'భలే ఎనాలిసిస్‌' అని మెచ్చుకున్నాడు. సావిత్రి సిగ్గుపడి ''మాలతి కాస్త చెప్పిందిలెండి' అంది. ''ఏమిటి, మాలతి నీతో అంత చనువుగా వుంటుందా? మీ స్కూలు పాత స్టూడెంట్స్‌ కలిసి ఫంక్షనంటూ తిరిగినపుడు వెళ్లి కలిశావని తెలుసు కానీ, నిన్ను దగ్గరకు రానిచ్చిందా? మన లెవెల్‌ ఎక్కడ? వాళ్ల లెవెల్‌ ఎక్కడ?'' సావిత్రి మూతి ముడిచింది. ''స్కూలు పేరు చెపితే మహామహా సిబిఐ డైరక్టర్లే గంటల తరబడి ఫోన్లో మాట్లాడతారు. మాలతి కేమైనా పనా? పాడా? ఎమ్మెల్యే భార్యే కదా! అడ్డదారిలో డబ్బు సంపాదించి జూబిలీహిల్సులో బంగళా కట్టుకున్నారు. నరఘోష ఎక్కువగా వుందని చెప్పి ఓ సిద్ధాంతి పది వారాలపాటు శుక్రవారాల్లో పదేసి ముత్తయిదువులకు పసుపు కుంకుమ యిమ్మన్నాట్ట. జూబిలీ హిల్స్‌ యిరుగుపొరుగు వాళ్లనడిగితే వాయినాలు పుచ్చుకోం అన్నారట. కావాలంటే వాచ్‌మన్‌ పెళ్లానికి యిచ్చుకోమన్నారట. నాతో చెప్పుకుని యిదయితే మన కాలనీ నుండి ప్రతీ శుక్రవారం ముత్తయిదువులను తీసుకెళ్లేదాన్ని. తను కారు పంపించేది. ఆ విధంగా స్నేహం మళ్లీ గట్టిపడింది.''

''...అందుచేత వాళ్ల పక్కనే మనం కాపురం వుంటే సిబిఐ దాడో, ఐటీ దాడో జరిగినపుడు పొరుగింటి డబ్బుమూటలు మనింటికి చేరవచ్చంటావ్‌..'' అన్నాడు రాజా ఆవలిస్తూ. ''ఔనౌనౌను... ఐడియా బ్రహ్మాండంగా వుంది కదూ'' అంది సావిత్రి పరమానందంగా. ఈ బ్రహ్మాండంలో ఓ లొసుగు వుందని రాజాకు అప్పుడే తట్టింది కానీ చెప్పదలచుకోలేదు. చెపితే సావిత్రి ఆలోచిస్తూ  రాత్రంతా నిద్రపోదు, తనను పోనివ్వదు. అందుకని పొద్దున్న బయటకు వెళ్లే వేళ చెప్పాడు. ఆ సమయంలో సావిత్రి లక్ష్మీదేవి పటం ముందు రెండు చీట్లు పడేసి రోజూ కంటె ఎక్కువసేపు పూజ చేస్తోంది. 'ఇప్పుడే తట్టిన సందేహం' అంటూ 'జూబిలీ హిల్స్‌లో మాలతి పక్కిల్లు అద్దెకు తీసుకునే స్తోమత మన కెక్కడుంది? మనం యిక్కడిచ్చే అద్దె కంటె అక్కడి వాళ్ల్లు తోటమాలి కిచ్చే జీతం ఎక్కువ. అయినా వాళ్లింటికి అటూ యిటూ మినిస్టర్లున్నారు, కార్పోరేట్‌ దిగ్గజాలున్నారు. ఇల్లు అద్దె కిచ్చుకోవాల్సిన ఖర్మ వాళ్లకేం పట్టింది?' అన్నాడు.

ఫెళ్లున ఎండకాసి చప్పరించబోతున్న ఐస్‌క్రీమ్‌ను కరిగించేసినట్టనిపించింది సావిత్రికి. ఇంత చిన్న విషయం తట్టనందుకు తిట్టుకుంది. పూజ అర్ధాంతరంగా ముగిసించేసింది. ఆ చీటీలు చింపేసింది. ''మాలతి డబ్బు మూట పడేస్తుందా? లేదా? అని రాసి పెట్టుకున్నాను. పడేసినా మనకేం లాభం? డబ్బుంటే తప్ప జూబిలీ హిల్స్‌కు వెళ్లలేం, వెళితే తప్ప డబ్బు రాదు.. వెధవ బతుకు యిలా గడిచిపోవాల్సిందే. ఎన్ని ఐడియాలుండి ఏం ప్రయోజనం?'' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. రాజా ఆమెను దగ్గరకు తీసుకుని ఓదారుద్దామనుకున్నాడు కానీ అప్పటికే డ్రెస్‌ చేసేసుకున్నాడు. ఆమె కన్నీళ్లు షర్టు మీద పడినా, కుంకం బొట్టు అంటినా చొక్కా మార్చేటంత టైము లేదు. అందుకని ''ఇవన్నీ జరిగేందుకు ఛాన్సు ఎక్కడుంది? ఒట్టి ఫార్‌ఫెచ్‌డ్‌ ఐడియాస్‌..'' అని  దూరం నుండే నచ్చచెప్పబోయాడు.

సావిత్రి చివ్వున తలెత్తి చూసి - 'రాత్రి అడిగినపుడు ఛాన్సుందన్నారు..' అంది కోపంగా. ''అప్పుడలా అనిపించింది'' అంటూ రాజా నీళ్లు నమిలాడు. ''అనిపిస్తుం దనిపిస్తుంది, నన్ను ఖుషామత్‌ చేసి పబ్బం గడుపుకోవడానికి..''

ఆసక్తి వున్న విషయాల్లో భార్య ఎంత చురుకుగా, క్షుణ్ణంగా ఆలోచించగలదో తెలియని భర్తల్లో రాజా ఒకడు. డిన్నర్‌ తర్వాత సావిత్రి తన ఐడియా చెప్పబోయినపుడు అతను తెల్లబోతూ ''ఇంకా దాన్ని వదిలిపెట్టలేదా?'' అని అడిగాడు ఆశ్చర్యంగా. అతని మెదడులో ఆ ఫైల్‌ ఎప్పుడో 'రీ-సైకిల్‌ బిన్‌'లోకి వెళ్లిపోయింది. ఆదివారం మందుపార్టీలో దాన్ని ఎమ్టీ చేస్తాడు.

''మనం జూబిలీ హిల్స్‌కి వెళ్లనక్కరలేదు'' అంది సావిత్రి. ''మాలతికి చిలుకూరు దగ్గర ఫామ్‌హౌస్‌ వుంది. దాని పక్కకు యిల్లు మారవచ్చు. శివారు ప్రాంతం కాబట్టి అద్దెలు తక్కువ, ఖర్చులూ తక్కువ. ఓ సారి శ్రావణగౌరి నోము అక్కడ చేసింది మాలతి. మేమంతా వెళ్లి చూశాం. అటూ యిటూ మామూలు వాళ్ల యిళ్లు. మంత్రులూ, యాక్టర్లూ ఎవరూ లేరు. ఖాళీగా వున్నాయి. ఆ ఫామ్‌హౌస్‌ మాలతీవాళ్లదని ఎవరికీ తెలియదు. అక్కడ నేమ్‌ ప్లేట్‌ కూడా లేదు. మీడియా కంటబడకుండా గూడుపుఠాణీలు చేయడానికే అక్కడకు వెళతారట.'' పల్లెటూరికి యిల్లు మారాలనేసరికి రాజాకు తల తిరిగిపోయింది. సావిత్రికి పట్టిన యీ భూతాన్ని వదల్చడానికి అనేక సందేహబాణాలను సంధించాడు. సావిత్రి వాటన్నిటినీ మధ్యదారిలోనే తునాతునలు చేసేసింది.

'ఫామ్‌హౌస్‌లోనే డబ్బు దాస్తారని ఖచ్చితంగా ఎలా చెప్పగలవు?'

-'జూబిలీ హిల్స్‌ కంటె అది పదిలం అని మాలతికి బ్రెయిన్‌ వాష్‌ చేసే బాధ్యత నాది',

'పల్లెటూరిలో బతకడం ఎంత కష్టమో తెలుసా? పిల్లల చదువులు పాడవుతాయి. నాకు రానుపోను హైరాణ'

-'కష్టపడకపోతే కాసులు రాలవు. మన తండ్రీ తాతా బద్ధకించడం వలననే మనం యిలా బతుకుతున్నాం, రేపు మన పిల్లలూ యిలాటి మిడిమిడి బతుకే బతకాలా?',

'కష్టపడడానికి రెడీ. కానీ నా బిజినెస్‌ అంతా సిటీలోనే వుంది. రానూపోనూ పెట్రోలుకి బోల్డు అవుతుంది. మనం ఊళ్లోకి సినిమాకు రావాలన్నా చాలా ఖర్చు.'

-'కొండకు వెంట్రుక వేస్తున్నాం. వెంట్రుక కూడా వేయడానికి సిద్ధపడకపోతే ఎలా?'

'నువ్వు చిలుకూరు వైపు యిల్లెందుకు మారుతున్నావని మాలతి అడిగితే?'

-'ఏడాది పాటు నిత్యం వెంకటేశ్వరుడి దర్శనం చేసుకుంటానని మీరు మొక్కుకున్నారని చెప్తా'

'వెంకటేశ్వరుడికి కోపం వస్తే..?'

-'ఆయనకు రాదు. డబ్బు కోసం అగచాట్లు పడేవాళ్లంటే ఆయనకీ జాలి. ఆయనా కుబేరుడి వద్ద డబ్బు, వరాహస్వామి వద్ద స్థలం అప్పు పుచ్చుకున్నాడు.'

'ఆఖరిగా ఒక్క ప్రశ్న. నువ్వు మాలతికి చెప్పి ఫామ్‌హౌస్‌లో బ్లాక్‌ మనీ దాచేట్లు చేస్తావ్‌. కానీ వాళ్లకు ఫామ్‌హౌస్‌ వున్నట్టే ఎవరికీ తెలియదు. సిబిఐకీ, ఐటీకి ఎవరూ చెప్పలేదనుకో. అప్పుడు దాడి జరగదు, వాళ్లు దాచమని నీకు మూటలూ యివ్వరు. ఇంకెందుకు మనకీ ఆయాసం?'

-'మూణ్నెళ్లు చూసి దాడి జరగకపోతే మీరే ఆకాశరామన్న ఉత్తరం రాసి సిబిఐవాళ్లకు చెపుదురుగాని..'

'బాబోయ్‌, అది బయటపడి నా ప్రాణానికి ముప్పు వస్తే...?'

-'ఇందాకటిదే ఆఖరి ప్రశ్న అన్నారు...!?'

'దీనితో జీవితమే ఆఖరంటూ వుంటే, ఆఖరి ప్రశ్నంటూ లాజిక్కులేమిటి నీ బొంద'

-'రిస్కు లేనిదే రిచెస్‌ రాలవు..! కొటేషన్‌ నాదే!'

'రిస్కు నాదీ, రిచెస్‌ మీవీ అయితే..?'

-'పైనుంచి నన్నూ, పిల్లల్నీ ఆశీర్వదించండి... రంభ కౌగిలిబిగి సడలించినపుడు..'

సావిత్రి అసాధ్యురాలు. ఫామ్‌హౌస్‌ విషయంలో మాలతి కళ్లు తెరిపించింది. దాని పక్కింటికి తన కాపురం మార్పించింది. ఫామ్‌హౌస్‌లో స్విమ్మింగ్‌ పూల్‌ ఆశ చూపించి పిల్లల్నీ ఒప్పించింది. వారానికి ఓ సారైనా మాలతి ఫామ్‌ హౌస్‌కు వస్తోంది. అవేళంతా సావిత్రి అక్కడే బిచాణా. ఇరుగుపొరుగు అన్నాక ఒకళ్ల కొకళ్లు ఆపత్సమయంలో ఆదుకోవాలనీ, గుట్టుమట్లు దాచడంలో తను దిట్ట అనీ, భర్త కూడా తనంత నిజాయితీపరుడనీ, పరుల సొమ్మును పాములా చూస్తాడనీ, ఎవరైనా ఏదైనా అప్పగిస్తే పువ్వుల్లో పెట్టి తిరిగి యిచ్చేస్తాడనీ.. ఇలా రకరకాలుగా సావిత్రి మాలతికి నూరిపోసింది. మాలతి వచ్చినప్పుడల్లా ఐదారు సూటుకేసులు కార్లోంచి దిగుతున్నాయి. తక్కిన రోజుల్లో ఎవరెవరో వచ్చి అవి పట్టుకెళుతున్నారు. పదిహేను రోజులకోసారి రాత్రివేళల్లో మాలతి మొగుడి సమక్షంలో అక్కడ సమావేశాలు జరుగుతున్నాయి. హోం మంత్రికి, ముఖ్యమంత్రికి గొడవలు పెరుగుతున్నాయని జాతీయ ఛానెల్స్‌ కూడా అనసాగాయి.

వచ్చి నాలుగు నెలలైనా రాజా యీ పల్లెటూరి జీవితానికి అలవాటు పడలేకపోయాడు. సిటీకి వెళ్లిరావడంతోనే ఓపిక హరించుకుపోతోంది. మాటిమాటికీ కరంటు కోత, చుట్టూరా చీకటి, చిన్నచిన్న పురుగులు. పాముల బుసబుసలు. కప్పల బెకబెకలు. డబ్బుమూటలు వచ్చిపడతాయన్న ఆశ ఎంతమాత్రం లేదతనికి. భార్యకు బుద్ధి వచ్చేవరకు ఓపిక పట్టాలనుకున్నాడు. ఈ లోపున చీకట్లో ఏ గుంతలోనే బైక్‌తో సహా పడతానేమోనన్న భయం పీకుతోంది. ఇప్పుడు కొత్తగా దెయ్యం భయం వచ్చి చేరింది. అవేళ మాత్రం ఖరాకండీగా భార్యకు చెప్పేశాడు - 'ఫామ్‌హౌస్‌కు అవతలివైపు యింట్లో దెయ్యం వుందట. సిటీలో అయితే భయం తెలియదు. ఇక్కడ దానిదే రాజ్యం. రాత్రి వచ్చేటప్పుడు పట్టుకుంటే.... మరి.. నీ పేరే చెప్తాను'

సావిత్రి ఫక్కున నవ్వింది. ''నిక్షేపంలా చెప్పండి. ఆ దయ్యాన్ని పుట్టించినది నేనే! ఎందుకంటారా...యీ మధ్యే నాకో ఐడియా వచ్చింది. సిబిఐ వాళ్లు వచ్చినపుడు వీళ్లు సూటుకేసులో, డబ్బు బస్తాలో అటైనా పడేయవచ్చు, యిటైనా పడేయవచ్చు. ఇటైతే మనం తీసుకుంటాం. అటైతే ఆ యింట్లో వాళ్లకు దక్కుతుంది. అందుకని దాన్ని దయ్యం పేరు చెప్పి ఖాళీ చేయించేశాను. ఈ ఫామ్‌హౌస్‌ పనివాళ్లు దెయ్యం భయం చేత అటు పడేయరు. ఒకవేళ పడేసినా, సిబిఐ వాళ్లు వెళ్లిపోయాక మనం వెళ్లి తీసేసుకోవచ్చు, యీ లోపున ఎవరూ రారు, దెయ్యం భయం చేత!'' రాజాకు కోపం వచ్చి గట్టిగా అరిచాడు - ''సావిత్రీ! నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించి ప్లాన్లు వేస్తున్నావ్‌. నిద్రలో కూడా సిబిఐ అనే కలవరిస్తున్నావు. పిచ్చి ముదిరింది. అసలిది ఎంతవరకు జరుగుతుందనుకుంటున్నావో సీరియస్‌గా చెప్పు.''

భర్త కోపం చూసి సావిత్రి బెదిరింది. ''శాంతంగా వినండి. నేను మాలతితో అన్నీ స్పష్టంగా మాట్లాడాను. సిబిఐకానీ, ఐటీ కానీ దాడి చేస్తే వాళ్లకు ముందే తెలిసేట్లు పై వాళ్లతో చెప్పి ఏర్పాట్లు చేసుకుంది. ఆ కబురు తెలియగానే వాచ్‌మన్‌ దాచాల్సినవి పట్టుకునొచ్చి మనకిస్తాడు. చెప్పాపెట్టకుండా వచ్చి పడ్డారనుకో.  వచ్చినవాళ్లు వాచ్‌మన్‌ను అడుగుతూంటే, వాడి భార్య పెరట్లోంచి మనింట్లోకి పడేస్తుంది. మనం దాచి పెట్టాలి. వాళ్లు వెళ్లిపోయాక, మాలతి చెప్పినపుడు తిరిగి యివ్వాలి.''

రాజా పళ్లు పటపటలాడించాడు - ''సినిమా స్క్రీన్‌ప్లే కూడా యింత డిటెయిల్డ్‌గా వుండదు. కొనబోయే యింట్లో, వేయబోయే చెట్టుకి, కాయబోయే కాయల్లో నీకు సగం, నాకు సగం అన్నాట్ట వెనకటికెవడో. ఇలా దాచిపెట్టినందుకు చార్జీలెంతో అవి కూడా మాట్లాడేసుకున్నారా?'' ''ఛ, ఛ. బొత్తిగా బిజినెస్‌లా వుంటుంది. అంతా అయ్యాక తను దాని మాట ఎత్తకపోతే, అప్పుడే బస్తాకో నాలుగు కట్టల చొప్పున మనమే తీసుకుని తక్కినది యిస్తే సరి... పాపం ఏమీ కాదు. ఏం లాకరు యిచ్చినందుకు బ్యాంకువాళ్లు కూడా అద్దె తీసుకోరా?''

ఆర్నెల్ల తర్వాత ఓ మందు పార్టీలో రాజా తన స్నేహితులతో యిదంతా చెప్తూ వుంటే వాళ్లంతా మాటమాటకీ మాటిమాటికీ పడిపడి నవ్వారు. ''చిలుకూరుకి యిల్లెందుకు మార్చావురా అంటే స్వచ్ఛమైన ప్రకృతి, వాతావరణపరిరక్షణ అంటూ ఏవో కథలు చెప్పావ్‌. ఇదా అసలు కారణం?'' అని ఒకతను అన్నాడు. ''ఇంతకీ కథకు ముగింపు ఏమిటి? అది చెప్పు...దాడి జరిగిందా? మీరు డబ్బు దాచారా? కమిషన్‌ దక్కిందా?'' అడిగాడు  ఆత్రగాడైన ఓ శ్రోత.

''ఇది పోటీకి పంపాల్సిన హాస్యకథ లాటిదిరా బాబూ, ముగింపు యింకెలా వుంటుంది? దాడీ, గీడీ ఏమీ జరగక భార్యాభర్తలిద్దరికీ పల్లెటూరి రోగాలొచ్చి, ఆ పై బుద్ధొచ్చి.. కళ్లు తెరుచుకుంటాయి. 'దురాశ దుఖ్కమునకు చేటు' అని హెడింగ్ పెట్టి కథ పంపవచ్చు.'' అన్నాడు మరో మిత్రుడు. ''కరక్ట్‌. రెణ్నెళ్ల క్రితం ఢిల్లీ నుండి పెద్దలు వచ్చి హోం మంత్రి, ముఖ్యమంత్రి మధ్య సఖ్యత కుదిర్చారని తెలుసు. ఇక మాలతి మొగుడి మీద దాడి ఎందుకు జరుగుతుంది? వీళ్ల ప్లాన్లు ఫట్టన్నమాట! ఇఫ్‌ విషెస్‌ వర్‌ హార్సెస్‌.. అని సామెత ఏదో వుంది. పూర్తిగా తెలియదనుకో.'' అన్నాడు యింకో మేధావి. మనుష్యులు యింత ఫూలిష్‌గా ఎలా ఆలోచిస్తారో తెలియదన్నాడు ఒకడు. దానికి కారణం జీన్స్‌లో వుందన్నాడు ఓ బయోకెమిస్టు. సైకో ఎనాలిసిస్‌ చేస్తే తప్ప ఏమీ చెప్పలేనన్నాడు ఓ ఫ్రాయిడియన్‌. ఇదంతా గ్లోబలైజేషన్‌ ప్రభావమే అని వాపోయాడు ఓ సోషల్‌ సైంటిస్టు. అందర్నీ అన్నీ చెప్పనిచ్చి అప్పుడు నోరు విప్పాడు రాజా - ''ఒకరోజు రాత్రి వేళ దాడి జరిగింది. బయటకు పొక్కనీయలేదు. దాని తర్వాతే హోం మంత్రి దిగివచ్చి, ముఖ్యమంత్రితో రాజీ పడ్డాడు.''

అదేదో యాడ్‌లోలా అందరూ అవాక్కయ్యారు.

విజయగర్వంతో నవ్వుకుంటూ రాజా కొనసాగించాడు - ''దాడి విషయం మాలతికి ముందే తెలిసింది. వాచ్‌మన్‌ మా దగ్గరకు పరిగెట్టుకుని వచ్చి మాలతి యిమ్మందంటూ ఓ పెట్టె పట్టుకుని యిచ్చాడు...''

 ''.. పెట్టా!?'', ''..ఎంత సైజులో వుంది?'', ''..వజ్రాలు పొదిగినదా?'', ''..డబ్బు బస్తాలేమయ్యాయి?'', ''...సూట్‌కేసా? బ్రీఫ్‌ కేసా?''

నలుమూలల నుండి ఎగసిపడుతున్న ప్రశ్నలను రాజా పట్టించుకోకుండా చెప్పుకుపోయాడు.. ''ఆరంగుళాల పొడవు, ఆరంగుళాల వెడల్పు, ఐదంగుళాల లోతు వుంది. ఓ గుడ్డలో చుట్టబెట్టి, లక్కతో సీళ్లు వేసేశారు. సీలు విప్పతీస్తే తప్ప లోపల ఏముందో తెలియదు. తీద్దామంటుంది సావిత్రి. మాలతికి ఏం సమాధానం చెప్తాం అంటాన్నేను. 'పిల్లలకు అదేమిటో అర్థం కాక యిప్పేశారని చెప్దాం' అంటుంది సావిత్రి. 'పిల్లల చేతికి ఎందుకిచ్చావంటే ఏం చెప్తావన్నాను' నేను..''

''టీవీ సీరియల్లా డైలాగులతో సాగదీయక బ్రదర్‌. దాన్లో డైమండ్స్‌ వుండి వుంటాయని నా గెస్‌... త్వరగా చెప్పి చావు..'' అని అరిచాడు ఓ ఫ్రెండు.

''... సావిత్రి కూడా అదే గెస్‌ చేసింది. 'డైమండ్స్‌ పట్టుకుని యిక్కడ యిక్కణ్నుంచే పారిపోతే యిలాటి వెధవ ప్రశ్నలకు మాలతికి జవాబు చెప్పవలసిన పనుండదు' అని విసుక్కుంది...''

''..మీ ఆవిడ డాషింగ్‌ లేడీ.'', ''..డేరింగ్‌ డెవిల్‌'', ''...యీ డబ్బున్నవాళ్ల రోగం కుదర్చాలంటే అలాగే చేయాలి'', ''...ఆ ధైర్యంలో సగం మా ఆవిడకున్నా నేను ఎక్కడికో వెళ్లిపోయేవాణ్ని..'', ''..ఏమనుకోవద్దు భయ్యా, నువ్వు మా సిస్టర్‌కి అన్‌ఫిట్‌'', ''ఒక్క డైమండ్‌ చూపించు గురూ..'' ''మేమూ వున్నాం ఎందుకూ లక్కు లేకుండా..''- రకరకాల వావాకారాలూ, హాహాకారాలు చెలరేగాయి.

''మా ఆవిడ పోరు భరించలేక, ఏమైతే అది అయిందని బ్లేడు తెచ్చి సీలు వూడదీసి, గుడ్డ చింపి పెట్టె తెరచి చూశాను. లోపల చిన్న పెన్‌డ్రైవ్‌ లాటి కంప్యూటరు చిప్‌ వుంది. అంతకు వారం రోజుల కితమే పంపిణీ చేసిన డబ్బు ఎవరెవరికి దగ్గర దాచారో, స్విస్‌ బ్యాంకులో ఎంత వేశారో ఆ వివరాలన్నీ దాన్లో వున్నాయట, తర్వాత తెలిసింది..''

చీమ చిటుక్కుమన్నా వినబడేటంత నిశ్శబ్దం.

''డబ్బు మూటల్ల్లా కాకపోయినా, డైమండ్సులా వచ్చిందనుకుంటే చివరాఖరికి చేతికి చిప్పు వచ్చిందన్నమాట..'' అన్నాడొకతను.

''..చిప్ప వచ్చిందను. సీలు తెరిచినందుకు మాలతికి కోపం వచ్చింది. సర్పంచ్‌తో చెప్పి యింటికి నీళ్లు రాకుండా చేసింది. బయట నుండి కొనుక్కుంటున్నాం. నీళ్లకోసం డబ్బు నీళ్లలా ఖర్చు చేస్తున్నాం. సిటీకి మారదామంటే పిల్లల చదువులు అడ్డం వచ్చాయి. పరీక్షలయ్యేదాకా యీ అవస్థలు తప్పవు.'' అన్నాడు రాజా చివరి గుక్క తాగి ఖాళీ చేసిన గ్లాసు కింద పెడుతూ. *** (వచ్చే నెల మూడో బుధవారం మరో హాస్యకథ) 

- ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022) 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?