Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ కథ: అంకెల చదరంగం

ఎమ్బీయస్ కథ: అంకెల చదరంగం

స్వీయానువాదం ఇంట్రో –

నేను తెలుగుతో బాటు ఇంగ్లీషులో కూడా స్వతంత్రంగా కథలు రాశాను. తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనువాదాలు చేశాను. ‘ఇండోఆంగ్లియన్ రైటర్స్ ఆఫ్ తెలుగు ఆరిజన్’ అనే అంశంపై ఒకాయన ఎం.ఫిల్ చేస్తూంటే నా వివరాలు పంపుతూ, తక్కినవారి గురించి కనుక్కుంటే అలాటివాళ్లు 20కి లోపే ఉన్నట్లు తేలింది. వారిలో వృత్తిరీత్యా జర్నలిస్టులు ఎక్కువమంది ఉన్నారు. ఇటీవలి కాలంలో ఇంగ్లీషులో ఫిక్షన్ రాసే తెలుగువారు పెరుగుతూన్నట్లున్నారు. నా ఇంగ్లీషు కథలను పుస్తకంగా తెస్తే మార్కెట్ చేసుకోవడం కష్టం. గ్రేట్ ఆంధ్ర ఇంగ్లీషు సెక్షన్ పాఠకులకు నా పేరు పరిచితం కాదు. అందువలన ఆ కథలను నేనే తెలుగులో అనువాదం చేసి, ప్రతి నెలా ఆఖరి బుధవారం యిద్దామనుకుంటున్నాను.

మొదటగా యిస్తున్న కథ ‘‘ద సెఫాలజిస్ట్’’. 14 07 1990, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమిళనాడు ఎడిషన్స్ వీకెండ్ సప్లిమెంట్‌లో ప్రచురితమైంది. దీని తమిళ అనువాదం ‘‘తేర్దల్ (ఎన్నికల) చాణక్యన్’’ ‘‘తామరై’’ అనే తమిళ మాసపత్రిక జూన్ 1993 సంచికలో ప్రచురితమైంది. కో. పిచ్చయ్ అనే ఆయన చేశారు. ఇన్నాళ్లకు తెలుగులో ‘‘అంకెల చదరంగం’’ పేర అనువదించి మీకందిస్తున్నాను. కథ చివర్లో కథానేపథ్యం యిస్తాను.

అంకెల చదరంగం

ఎలక్షన్ టూరుపై గుప్తాజీ కదులుతూండగానే సుమతి ఆటో దిగి "నాన్నా" అని ఒక్క పొలికేక పెట్టింది. పెట్టే, బేడాతో దిగిన కూతురు వాలకం చూడగానే గుప్తాజీ గుండె గతుక్కుమంది. “బేబీ, మళ్లీ అల్లుడిగారితో పోట్లాటేసుకుని.. ” పూర్తి చేసే ధైర్యం లేకపోయింది. కానీ కూతురికి ఆ ధైర్యం ఉంది. “మళ్లీ, గిళ్లీ లేదు నాన్నా, నువ్వెన్ని చెప్పినా నేను ఛస్తే అక్కడికి వెళ్లను."

ఈ లోపున గుప్తాజీ భార్య ఇంట్లోంచి బయటకు వచ్చి కూతుర్ని అక్కున చేర్చుకుంది. “నువ్వక్కడ అవస్థలు పడుతూంటే ఎవరుమాత్రం వెళ్లమంటారే! నాన్నగారికి విషయాలు తెలియకనా ఏం?” అని అనునయించబోయింది. భార్య వరస చూసి గుప్తాజీ చికాకు పడ్డాడు, “అదెంతకాలం ఉండాలంటే అంతకాలం ఇక్కడే ఉండచ్చు. కానీ డైవోర్సు, గీవోర్సు అంటే మాత్రం కుదరదు.” “నాన్నా, రవి విషయం తెలిసికూడా నువ్వలా అనడం..” అంటూ సుమతి అడ్డుతగల బోతూండగానే “రెండువారాల్లో ఎలక్షన్లు పెట్టుకుని ఇప్పుడివన్నీ వాదిస్తూ కూచోలేను. ప్రచారానికి బయలుదేరుతూండగానే నువ్వు ఎదురొచ్చావు. లోపలికి వెళ్లు. కాస్సేపు స్తిమితపడు. నేను తిరిగివచ్చాక అన్నీ మాట్లాడదాం. ఈ లోపున తొందరపడి అక్కడా ఇక్కడా ఏమీ వాగకు.” అని కాస్త అనునయంగా, కాస్త ఫోర్సుగా కూతురుకి చెప్పి “నువ్వు లోపలికి తీసుకెళ్లవే” అంటూ భార్యను గసిరి 'పదండయ్యా. చోద్యం చూస్తూ నిలబడతారు” అని అనుచరులను తిట్టి గబగబా కారెక్కాడు గుప్తాజీ.

రోడ్ షోలలో చేతులూపుతున్నా, మట్టిరోడ్లపై మండుటెండల్లో కారులో మగ్గుతున్నా, పదిమంది కనబడిన చోటల్లా ఉపన్యాసాలు దంచుతున్నా అతని మనసంతా కూతురి సంసారం చుట్టూనే పరిభ్రమిస్తోంది. అల్లుడు రవి సకలదుర్గుణాభిరాముడని, కూతురు నరకం అనుభవిస్తోందని తనకు తెలియకపోలేదు. విడాకులు తీసుకోవడం పాపమనీ, పతిని ప్రత్యక్షదైవంగా కొలిచితీరాలనే అనుకునే ఛాందసుడూ కాదు తను.  కానీ కూతురు విడాకులు తీసుకోవడానికి అనువైన టైము కాదిది.  గెలిచి తీరతామని చెప్పే స్టేజిలో లేదు ఎలక్షన్. కాస్త మొగ్గువచ్చి ఈ ఎలక్షన్లో తను, తనతోబాటు తను టిక్కెట్టు ఇప్పించినవాళ్లలో కనీసం డెబ్భయి మంది గెలిస్తే మాత్రం ముఖ్యమంత్రి పదవి అతి చేరువలో ఉంది. చేయిచాస్తే ఆ పదవి అందే తరుణంలో ఫ్యామిలీలో ఇలాటి స్కాండల్ వస్తే తన ఛాన్సు దెబ్బతింటుంది. అప్పోజిషన్ వాళ్లే కాదు, పార్టీలో తన ప్రత్యర్థులు సైతం ఇలాటి విషయం హైకమాండ్‌కు మోసుకుపోయి దీని పేరు చెప్పి తన అవకాశాలు దెబ్బతీస్తారు.

పబ్లిక్ లైఫ్ అంటేనే అంత, రాజకీయాల్లో రాని క్రితం తను ఎన్ని వేషాలు వేసినా చెల్లింది, ఎవరూ పట్టించుకునేవారు కారు. ఇప్పుడు బావమరిది స్నేహితుడు మందు కొట్టి బార్లో పడిపోయినా అది పేపర్ల కెక్కేస్తుంది. కోరి వరించిన నరకమేమో ఇది! గుప్తాజీ అన్యమనస్కంగా ఉన్న విషయం గ్రహించి అనుచరుడొకడు మాటల్లోకి దింపబోయాడు “సాయంత్రం మీటింగు జరగబోయే రంగాపూర్, మన కంపూటర్ బాబు వాళ్ల సొంతూరు తెలుసా గుప్తాజీ” అని. మాట్లాడే మూడ్‌లో లేడు గుప్తాజీ. కారు కిటికీలోంచి బయటకు తొంగిచూసి 'అహా' అని తలవూపి ఊరుకున్నాడు. ఆలోచనలు ప్రమోద్ వైపు మళ్లాయి. ప్రమోద్ పరిచయమయ్యాకనే, అతని సలహాల వల్లనే తన రాజకీయ జీవితానికి ఒక ఊపు వచ్చింది. ఇమేజికి సంబంధించిన ఇలాటి విషయాలన్నీ అతనే ఓపిగ్గా వివరిస్తాడు. ఏ పని చేస్తే దాని ప్రభావం ఓటర్లపై ఎలా వుంటుందో చక్కగా అంకెలతో సహా విశదీకరిస్తాడు.

వీళ్లంతా 'కంపూటర్ బాబూ' అని అతన్ని పిలుస్తారు కానీ నిజానికి ప్రమోద్ సెఫాలజిస్టు. మారుమూల పల్లెటూరిలో, విద్యాగంధం లేని నిరుపేద కుటుంబంలో పుట్టినా బాగా చదువుకుని కంప్యూటరుమీద ప్రావీణ్యం సాధించాడు. స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ సంపాదించుకుని సెఫాలజీపై ప్రత్యేక కృషి చేశాడు. సర్వేలు నిర్వహించడం, ప్రజాభిప్రాయాన్ని ఓట్లగా తర్జుమా చేసి ఏ అంశం ఎన్ని ఓట్లను రాలుస్తుందో, ఎన్ని సీట్లను ప్రభావితం చేస్తుందో లెక్కలు కట్టడంలో ఆరితేరాడు. రాజధాని చేరి నలుగురైదుగురు రాజకీయనాయకుల ప్రాపు సంపాదించి ముప్ఫయి యేళ్లు దాటకుండానే ఓ లక్ష రూపాయలు వెనకేశాడు. ఇతనిలాటివాళ్లు ఇంకో నలుగురున్నా ప్రమోద్‌కే బాగా డిమాండ్ ఉంది. తొలిదశలోనే ప్రమోద్‌ను చేరదీసిన వారిలో తనొకడు. పార్టీలో సీనియర్ నాయకులు 'ఇవన్నీ కాకుల లెక్కల'ని కొట్టిపారేసినా తను స్వంత ఖర్చుమీద సర్వేలు నిర్వహించమనేవాడు. ప్రమోద్ ఊరూరా కుర్రాళ్లను పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేసి పత్రికా ప్రకటనలు ఎలా యివ్వాలో తనకు చెప్పేవాడు. పబ్లిక్ మూడ్ బట్టి ఓ సారి మితవాదిగా, మరోసారి అతివాదిగా, ఇంకోసారి జాతీయవాదిగా, ఇంకోసారి ప్రాంతీయవాదిగా తను రకరకాల అవతారాలెత్తి ప్రజల్లో ఇమేజి పెంచుకున్నాడు.

ఇది చూసి తక్కినవాళ్లూ ప్రమోద్‌ను సంప్రదించడం మొదలెట్టారు. తనకంటె ఎక్కువ డబ్బు ముట్టజెప్పసాగేరు. అయినా తొలినుండీ ఆదరించినందుకు తనంటే ప్రమోద్‌కు గౌరవం. అర్ధరాత్రి పిలిచినా పరిగెట్టుకు వస్తాడు. అడక్కపోయినా సలహాలిచ్చి ఆదుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఓ సారి ఓ బందిపోటు దొంగను అరెస్టు చేయించాలని తను ఉద్యమం లేవనెత్తబోయాడు. ఎలక్షన్ టైము కాబట్టి శాంతిభద్రతల సమస్య ఓట్లు రాలుస్తుందని తన అంచనా. విషయం తెలియగానే ప్రమోద్ ఫోన్ చేశాడు. “చంపేశారు గుప్తాజీ., సర్వే చేయించి చూస్తే వాడికి జనాల్లో రాబిన్‌హుడ్ ఇమేజి ఉందని తేలింది. గట్టిగా హడావుడి చేస్తే జిల్లా మొత్తంలో మీ పార్టీ పని హుళక్కే” అన్నాడు. గబగబా ప్రెస్ స్టేటుమెంట్లన్నీ వెనక్కి తెప్పించేశాడు కాబట్టి బతికిపోయాడు. జిల్లాలో అత్యధికంగా సీట్లు రావడంతో ఆ సారి మంత్రిపదవి కూడా దక్కింది.

సుమతి విషయంలో కూడా ప్రమోదే అన్నాడు - 'ప్రస్తుతం మీ అల్లుడికి డాక్టరుగా మంచి పేరుంది. అతని దురలవాట్ల సంగతి ఎక్కువమందికి తెలియదు. ఇప్పుడు విడిపోతే మీ అమ్మాయికి, తద్వారా మీకూ చెడ్డపేరు రావడం ఖాయం. అతను ఎప్పుడో ఒకప్పుడు ఎవరో నర్సు చేయి పట్టుకోకపోడు, అప్పటిదాకా ఆగడం మంచిది.” అని. ఇవన్నీ చెప్తే అర్థం చేసుకుని ఓపికపట్టే మనిషి కాదు సుమతి. చిన్నప్పటి నుండీ గారాబంగా పెరిగింది! కూతురితో కూడా డిప్లమాటిక్‌గా వ్యవహరించవలసిన బతుకు తనది! ఏ పబ్లిక్ ఫిగర్ కైనా ఇది తప్పదేమో!

పొద్దున్న మౌనిబాబా ఆశ్రమం దగ్గర కూడా డిప్లమసీయే! జుట్టు అట్టలు కట్టి, ఒళ్లంతా బూడిద పూసుకుని, కంపుకొడుతూ ఘోరంగా ఉంటాడా బాబా. పాతరాతియుగం భావాలు ప్రచారం చేస్తాడు. పాలిటిక్స్ లో లేకపోయివుంటే తను అటు తిరిగి కూడా చూసేవాడు కాడు. కానీ ఈ నాలుగు జిల్లాలలోనూ కలిపి అతని భక్తులు రెండు శాతం మంది ఉన్నారని ప్రమోద్ చెప్పాడు. తను ఇప్పటి దాకా బాబా దర్శనం చేయలేదని వాళ్లు అలిగారట. ఆ రెండు శాతం స్వింగ్ ఇటొస్తే తన విజయానికి ఢోకా లేదుట. తప్పదురా అనుకుంటూ ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ పత్రికలవాళ్లు తగులుకున్నారు “బాబా ప్రవచిస్తున్న వర్ణవ్యవస్థను మీరు సమర్థిస్తారా?” అంటూ ప్రశ్నలు గుప్పించారు. అసలా టాపిక్ జోలికి పోవద్దని ప్రమోద్ హెచ్చరించాడు కాబట్టి మాటమార్చి బాబా నడుపుతున్న స్కూళ్ల గురించి, ఆసుపత్రుల గురించి నాలుగు ప్రశంసావాక్యాలు చెప్పి బతుకుజీవుడాని బయటపడ్డాడు.

“సాబ్ సాబ్, ఆ కటౌట్లు చూశారా?” అని భజ్‌రంగ్ ఉత్సాహంతో అరవడంతో గుప్తాజీ అటు చూశాడు. నలభై అడుగుల తన కటౌట్ ఊరి ముఖద్వారం వద్దనే నిలబెట్టారు. పెద్ద, పెద్ద స్తంభాలు అటూ ఇటూ నిలబెట్టి పేరు రాసి బ్యానర్లు కట్టారు. 'రంగాపూర్ కార్యకర్తలు గట్టివాళ్లే' అనుకున్నాడు తృప్తిగా. ఆ తృప్తి మీటింగులో కూడా కొనసాగింది. పక్కవూళ్లనుండి కూడా తీసుకొచ్చారేమో ఇసకేస్తే రాలని జనం. జనాలను చూసి గుప్తాజీ పొంగిపోయాడు. ఉపన్యాసం ప్రారంభించే ముందు ప్రమోద్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు - "ఒక్కో ఎలక్షన్లో ఒక్కో అంశం ప్రాధాన్యం వహిస్తుంది. ఒకప్పుడు అవినీతి, ఒకప్పుడు రాష్ట్ర విభజన, ఒకప్పుడు సింపతీ ఇలా. ప్రస్తుతం మతం మీద ఉంది జనాల మోజు. చదువుకున్నవాళ్లు కూడా సంస్కృతి, సంప్రదాయం అంటూ అటే మొగ్గు చూపుతున్నారు. మరీ ఛాందసం అనిపించుకోకుండా సంప్రదాయవాదిగా ఇమేజ్ తెచ్చుకుంటే ఓట్ల పంటే!” స్పీచి మొదలెడుతూ గుప్తాజీ ముందుగా కటౌట్ కూలి మరణించిన వ్యక్తికి శ్రద్ధాంజలి ఘటించాడు. తన రాక సందర్భంగా పెట్టిన కటౌట్ కాబట్టి తను నైతిక బాధ్యత వహించి ఆ కుటుంబానికి పదివేల విరాళం ప్రకటిస్తున్నానన్నాడు. ఆ తరువాత చనిపోయినవారిని ఇలా స్మరించడం హిందువుల ఆర్షసంప్రదాయం అన్నాడు. హిందువులకు ఇలాటివి సహజంగా అబ్బుతాయన్నాడు. భారతదేశం ఇంకా ఇలా ఉందంటే అది హిందువుల చలవే అన్నాడు.

ప్రజలు పొంగిపోయారు. చప్పట్లు చరిచారు. గుప్తాజీకి తెలిసిపోయింది. తనకు కావలసిన మొగ్గు వచ్చేసింది. త్రాసులో ఇంకొక్క తులసీదళం వేస్తే చాలు, అవతలివాడు వచ్చి కోట్లు గుమ్మరించినా తన గెలుపు ఖాయం. కాస్త పెర్శనల్ టచ్ ఇస్తే మంచిదనుకుని పొద్దుటినుండీ మనసులో మెదలుతున్న సుమతి విషయం ప్రస్తావించాడు. కాస్త కల్పన జోడించాడు. “ఉదయం నేను బయలుదేరు తూండగా మా అమ్మాయి వచ్చింది. మా ఆయన మంచివాడు కాడు, వదిలేస్తాను, విడాకులు ఇచ్చేస్తాను అంది. నేను చెప్పాను- నేనేదో చదువుకున్నవాడిని కదాని మన సభ్యత, సంప్రదాయం విడిచి పెట్టేశాననుకోకు. ఓ హిందూ మహిళకు భర్తే సర్వస్వం. భర్తలేని జీవితం శూన్యం, వ్యర్థం. సీతా, సావిత్రివంటి పతివ్రతలను ఓ సారి తలచుకో, మర్యాదగా అత్తింటికి వెళ్లు అన్నాను. అంతే! నమ్మండి, నమ్మకపొండి మా అమ్మాయి నా మాట వింది. సరే నాన్నా అంటూ భర్త దగ్గరకి తిరిగి వెళ్లిపోయింది.” సంప్రదాయంపట్ల గుప్తాజీకున్న గౌరవం చూసి ప్రజానీకం కన్నీరుమున్నీరయింది. జయజయధ్వానాలు పలికింది. దీనిలో సగం మంది ఓట్లేసినా చాలు గెలవడానికి అనుకున్నాడు గుప్తాజీ తనలో తాను మురిసిపోతూ.

మర్నాడు పొద్దున్న ఇంట్లో బ్రేక్ ఫాస్టు చేస్తూ సుమతికి నచ్చచెపుతున్నాడు గుప్తాజీ - “విడిపో, కానీ విడాకులు మాటెత్తకు, నీ యిష్టం వచ్చినట్టు బతుకు, కాదన్నదెవడు?” అని. అంతలో ఫోను మోగింది. రంగాపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఖంగారు పడుతూ చెప్పాడు - “సాబ్, కొంప మునిగింది. మీ బొమ్మ పడి ఒకడు చచ్చిపోయాడన్న సంగతి మీకు గుర్తుందికదా!” “ఉంది లేవయ్యా, పదివేల చెక్కు ఎలక్షన్లవ్వగానే పంపుతానులే" “దాని గురించి కాదు సార్, ఆ పోయినవాడి పెళ్లం సతీసహగమనం చేసుకుంది."

“మై గాడ్! సతీసహగమనమా! ఎందుకుట!?”

‘‘ఆవిడ వయసు పాతికేళ్లుండవు కానీ చాలా రెలిజియస్ మైండెడ్. ఈ ప్రాంతాల్లో అప్పుడప్పుడు సతీసహగమనాలు జరుగుతూనే ఉంటాయిగా. వాళ్లను జనాలు ఆరాధించడం చూసి తనూ అలాటి పతివ్రత కావాలని ఉబలాటపడిందేమో! ఇటీవల ఓ దక్షిణాది మహిళా నాయకురాలు తను ‘సతి’ చేసుకుంటానని అనడం ఆమెను ఇన్‌స్పయిర్ చేసిందట! పైగా నిన్న మీ స్పీచి తనకు నరైన దారి చూపించిందట!’’

“నా స్పీచేమిటి? దారిచూపించడమేమిటి? నేను సతీసహగమనం గురించి ఎక్కడ మాట్లాడేనయ్యా?” అరిచాడు గుప్తాజీ.

“ఏమో మరి, భర్త లేనిదే శూన్యం అనో ఏదో అన్నారులా వుంది. ఆ అమ్మాయే కాదు, ఊళ్లో అందరూ అలాగే అనుకుంటున్నారు. సతీసహగమనాన్ని సమర్థించే కులం వాళ్లు ఆ సతీస్థలంలో ఇవాళ సాయంత్రం మీటింగు పెట్టారు. ఆమెకో గుడికట్టి మీచేత ఆవిష్కరింప ‘జేద్దామని నిర్ణయిస్తారట.” “నా చేతా? నా చేత ఎందుకు?” అని ఫోన్ పగిలేట్లా అరుస్తున్నాడు గుప్తాజీ. అరుస్తున్నాడే కానీ సమాధానం తనకీ తెలుసు. తనకు నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు తనకో పాత్ర లభించింది. హిందూమత పరిరక్షకుడిగా తనకు ఓ ఇమేజి ఏర్పడుతోంది. అది తన మంచికా? చెడుకా? దానివల్ల రాజకీయంగా లాభమా? నష్టమా? ప్రమోదే చెప్పాలి.

ఇన్‌స్పెక్టర్ గోల ఇన్‌స్పెక్టరుది. “నన్నేం చేయమంటారు సార్, మీటింగుకు అనుమతి ఇవ్వమంటారా? వద్దా? పక్కవూళ్లలో కూడా ఇలాటి మీటింగ్స్ పెడతామనచ్చు. వీళ్ల కిస్తే..” “సర్లే, సర్లే, ఓ గంటపోయాక ఫోన్ చెయ్. ఏ విషయం చెప్తాను.” తండ్రి ఫోన్ పెట్టేయగానే సుమతి అందుకుంది - 'డైవోర్స్ ఇవ్వకపోతే మళ్లీ పెళ్లి చేసుకోవడం ఎలా నాన్నా?” అని. “బేబీ, కాస్సేపు ఊరుకుంటావా? ఇది నా చావుకొచ్చి నేనేడుస్తూంటే నీ పెళ్లి గోలేమిటి మధ్య?” అని విసుక్కున్నాడు.

అవును నిజంగా చావుకొచ్చినట్టే! సతీసహగమనం సమర్థించే కులాలవాళ్లు, డబ్బున్నవాళ్లు, ఓట్లు వేయించగలవాళ్లు, ఆట్టే మాట్టాడితే అవతలివాళ్ల ఓట్లు తామే వేసేయగల సామర్థ్యం ఉన్నవాళ్లు. అందుకే గుప్తాజీ ఎప్పుడూ 'సతి' గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలా అని సమర్ధించనూ లేదు. ఏదో అటూ, ఇటూ చెప్పకుండా ఇన్నాళ్లూ నడుపుకొస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా ఎత్తిన మతవాది అవతారం వల్ల ఇది ముంచుకొచ్చింది. లక్ష్మణరేఖ ఎక్కడో గుప్తాజీకీ తెలియదు, ప్రజలకు అంతకంటే తెలియదు.

ప్రమోద్ ఫోన్ ముప్పావుగంటదాకా దొరకలేదు. రాజకీయ నాయకులందరూ అతన్ని వదిలిపెట్టటం లేదు. రోజు రోజుకీ రాజకీయ సమీకరణాలూ మారుతూండడంతో ఆ లెక్కలతో అతని మహా బిజీగా ఉన్నాడు. గుప్తాజీ చెప్పినదంతా విని తన అభిప్రాయం చెప్పాడు-“ఈ స్టేజిలో కూడా సతీసహగమనాన్ని సమర్థించడం కానీ, నిరసించడం కానీ చేయకూడదని నా అభిప్రాయం సార్. ఛాందసవాదిగా ముద్రపడితే 34 శాతం ఎలక్టరేటులో 85 శాతం ఓట్లు పడడం ఖాయం. కానీ దానివల్ల తటస్థుల ఓట్లు కోల్పోతారు. సర్వేలో ‘తెలియదు’ కేటగిరీవాళ్లే మహా డేంజరస్. వాళ్లు అటు తిరిగారంటే 4 శాతం నెగటివ్ స్వింగ్, అంటే 65 సీట్లకు తిలోదకాలిచ్చినట్లే!”

'ప్రమోద్, నాకూ ఆ విషయం తెలుసు. వ్యక్తిగతంగా కూడా ఈ హిందూ ఇమేజి నాకు మహా అసహ్యం. స్టూడెంటు డేస్‌లో నేను రాడికల్‌నయ్యా బాబూ, కానీ ఇప్పుడు చూడు ఆ మహాతల్లి చితి ఎక్కేటప్పుడు గుప్తాజీయే నాకు స్ఫూర్తి, ప్రేరణ అంటూ చెప్పి మరీ ఎక్కింది. ఇప్పుడేం చేయమంటావు ఉపాయం చెప్పు, చాలు.” ఉపాయాలు చెప్పడం ప్రమోద్ పరిధిలోకి రాదు. అయినా అతను కాస్సేపు గట్టిగా ఆలోచించాడు. “గుప్తాజీ, ఇది సతీసహగమనం అంటేనే కదా ఈ గొడవంతా! దానికి హత్య అని పేరు పెట్టండి. ఆమె కిష్టం లేకపోయినా చితి ఎక్కించేశారనండి. ఫినిష్!” అన్నాడు చివరికి. గుప్తాజీ గుండె గంతులేసింది. “ఎక్సలెంట్ ఐడియా! అందుకే నిన్ను అడిగేది, థాంక్స్ ప్రమోద్, థాంక్స్ ఎ లాట్‌!” అని ఫోను పెట్టేశాడు.

రంగాపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు గుప్తాజీ చెప్పింది కాస్సేపటికి దాకా అర్థం కాలేదు. అర్థమయ్యాక నోరు చప్పరించేశాడు. “హత్యని ఎలా అంటాం సాబ్, వరకట్నం చావు అందామన్నా పెళ్లయి నాలుగేళ్లయింది. అత్తగారూ, మావగారూ ఎపుడో పోయారు..." “నువ్వు పోలీసుఫోర్సులో చేరి ఎన్నాళ్లయిందయ్యా? మోటివ్ గురించి నేను చెప్పాలా? అత్తగారు లేకపోతే ఆడపడుచు ఉంటుందిగా, మరిదులు ఉంటారుగా. చచ్చిపోయినవాడి ఆస్తి, ఎంతుంటే అంతే, కొట్టేద్దామనుకుని వాళ్లు ప్లాను వేసి దానికి మత్తుమందు ఇచ్చేసి చితిమీదకు బలవంతంగా ఎక్కించేశారు. నీకిప్పటికైనా అర్థమయిందా? మీ సీనియర్లతో మాట్లాడమంటావా?” ఇన్‌స్పెక్టరుకు అహం పొడుచుకు వచ్చింది. “అక్కర్లేదు సాబ్, మేనేజ్ చేస్తాను. పిల్లా, పాపా లేరు కాబట్టి ఈవిడ ఛస్తే ఆ పోయినవాడి ఆస్తి వీళ్లకే వస్తుంది. అది పెట్టుకుని కేసు నడుపుతాను. ప్రెస్ వాళ్లను కూడా అలాగే రాయమంటాను. సతీస్థలంలో మీటింగు పెట్టనివ్వను. అసలు సతీసహగమనమే జరగనప్పుడు..”

“గుడ్, పాయింటు బాగానే క్యాచ్ చేశావ్. జాగ్రత్తగా హేండిల్ చేయి. నిన్ను గుర్తు పెట్టుకుంటాను.”

మర్నాడు ఎలక్షన్ మీటింగులు పూర్తి చేసుకుని రాత్రి ఇల్లు చేరేసరికి ప్రమోద్ మధ్యాహ్నం నుంచి తనకోసం వెయిట్ చేస్తున్నాడని విని గుప్తాజీ తెల్లబోయాడు. నిద్రపోవాలనే కోరిక బలవంతాన ఆపుకుని డ్రాయింగురూము కెళ్లాడు. ప్రమోద్ చాలా ఆందోళనగా ఉన్నాడు. “గుప్తాజీ, నిన్న మీరు  చెప్పినపుడు పోయినవాడు మా తమ్ముడనీ, సతీసహగమనం చేసుకున్నది మా మరదలనీ చెప్పలేదు. ఇప్పుడు చూస్తే పోలీసులు మా అన్నయ్యను, వదినను, చెల్లెల్ని, మా ఆవిడను కటకటాల్లోకి తోసేశారు. నా పేరు మీద వారంటుంది..”

“పోయినతను మీ తమ్ముడా? తమ్ముడు పోతే నీకు కబురు తెలియలేదా?” గుప్తాజీ ఆశ్చర్యపడ్డాడు.

“నా ఖర్మ! మెహతాభాయి నన్ను వాళ్లింట్లో అట్టే పెట్టేశాడు. ముందస్తు ఎలక్షన్లు పెట్టడం లాభదాయకమో కాదో లెక్కలేసి చెప్పేదాకా వదలనని ఫోన్లన్నీ కట్ చేసేశాడు. మధ్యలో బట్టలు మార్చుకోవడానికి ఇంటికి వచ్చినపుడు మీ ఫోన్ వచ్చింది. నా కర్మ కాకపోతే చూడండి. మీకు దొరికాను. ఎంత ప్రయత్నించినా మా వాళ్లకి దొరకలేదు. తమ్ముడి అంత్యక్రియలకి హాజరు కాలేకపోయాను. మా మరదలు పట్టుబడితే వెంటనే జరిపించేశారు...."

గుప్తాజీ బాధపడ్డాడు. “అయ్యో పాపం, ఫ్యామిలీలో ఇద్దరు పోవడం, అది చాలనట్టు హత్యానేరం, వెరీ బ్యాడ్..ఐ యామ్ టెరిబ్లీ సారీ, ప్రమోద్..”  “మా వాళ్లందరూ హడిలిపోతున్నారు. కుటుంబం మొత్తం మీద నేనొక్కడ్నే కాస్త అక్షరాలు వచ్చినవాణ్ని. మిగతా వాళ్లందరూ పాతకాలం వాళ్లే! చూశారుగా మా మరదలు సతీసహగమనమంటూ..”

“ఇట్సాల్ రైట్ ప్రమోద్, చచ్చిపోయినవాళ్ల గురించి చెడు మాట్లాడుకోవడమెందుకు? ఉంటా, నిద్రవస్తోంది. పొద్దుటినుండీ ఒకటే తిరుగుడు.” అంటూ గుప్తాజీ ఆవలిస్తూ లేచాడు. ప్రమోద్ చటుక్కున గుప్తాజీ చేయి పట్టుకున్నాడు. “మీరే హెల్ప్ చేయాలి గుప్తాజీ. నా మీద హత్యానేరం మోపారు. ఊళ్లో లేకపోయినా నేనే ప్లాను వేశానని అభియోగం. పాపం మా అన్నయ్యకూడా.. కాస్త ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడి మా ఫ్యామిలీని బయటపడేయాలి.” ప్రమోద్ కంఠం రుద్ధమైంది.

గుప్తాజీ ప్రమోద్ భుజం తట్టాడు. “డోంట్ బీ చైల్డిష్, ప్రమోద్! మీ వాళ్లని విడిపించాలంటే అది హత్య కాదని, సతీసహగమనమనీ అనాలి. అంటే ఓటింగు సరళి ఎలా మారుతుందో నీకంతా తెలుసు. ఆ అంకెలన్నీ నీకు కంఠోపాఠమే! నేను వేరే చెప్పాలా!? నా సలహా ఏమిటంటే నువ్వు వెంటనే వెళ్లి పోలీసులకి లొంగిపో. నువ్విక్కడ ఉన్నట్టు ప్రెస్ వాళ్లు చూసేరంటే హంతకుడికి ఆశ్రయం ఇచ్చినందుకు నా రేటింగు పడిపోతుంది.”

ప్రమోద్ కళ్లవెంబడి నీళ్లు తిరిగాయి. వణికిపోయాడు. “గుప్తాజీ, గుప్తాజీ, ఇది అన్యాయం. నా గతేమిటి? మా ఆవిడ.. ? చిన్నప్పటినుండీ డబ్బు పంపి నన్ను చదివించిన అన్నయ్యా, వదినా.., అందరం ఉరికంబ మెక్కాల్సిందేనా?.. ఓ పాడుసలహా ఇచ్చినంత మాత్రానికి ఇంత శిక్షా..?”

“చూడు ప్రమోద్, ఎంత మంచి నిర్ణయం తీసుకున్నా రెండు శాతం మంది నష్టపోతారని, ఆ కారణంగా నిర్ణయం తీసుకోకుండా మానకూడదని నువ్వంటూంటావుగా. ఇవాళ ఆ శాతంలో నువ్వున్నావన్నమాట. ప్రస్తుతానికి నువ్వు ఒక అంకెవు మాత్రమే, అందుచేత మరీ ఎక్కువ ఆలోచించకు.” అన్నాడు గుప్తాజీ చికాగ్గా.

“అంతేనంటారా?” అన్నాడు ప్రమోద్ బేలగా. ప్రమోద్ బిక్కమొహం చూసి గుప్తాజీకి నవొచ్చింది. "వై డూ యూ పానిక్, ప్రమోద్..? ఏదో ఒకటి చేస్తాను. సరేనా? కానీ ఇప్పుడు కాదు. ఎలక్షన్లయ్యాక! అప్పటిదాకా మీ అసిస్టెంటు రఘుని టచ్‌లో ఉండమను. నువ్వు కనబడకు. వెళ్లి పోలీసువారి ఆతిథ్యంలో రెస్టు తీసుకో. నేనూ రెస్టు తీసుకుంటా. నిద్ర ముంచుకువస్తోంది.”

ప్రమోద్ నోరు వెళ్లబెట్టి చూస్తూండగానే గుప్తాజీ గదిలోంచి బయటకు నడిచాడు. **

ఇదీ కథ. ఇక కథానేపథ్యం గురించి రాస్తాను -

సర్వేలు నిర్వహించి, వాటిని బట్టి ఓటింగు సరళిని ఊహించి, ఓట్లను సీట్లగా తర్జుమా చేసి, ఫలితాలను ఊహించడం సెఫాలజీ. ప్రస్తుతం ఎన్‌డిటివి అధినేతగా ఉన్న డా. ప్రణయ్ రాయ్ ద్వారానే యీ విద్య మన దేశంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ‘‘ఇండియా టుడే’’ దీనికి విస్తారంగా ప్రాచుర్యం కలిగించింది. ప్రణయ్ రాయ్ గణాంకాలు యిచ్చి వదిలేశారు తప్ప ఏ పార్టీకి సలహాదారుగా పనిచేయలేదు. పని చేసి ఉంటే అని ఊహించి రాసినది యిది.

1985లో షాబానో కేసులో ముస్లిం వనితకు యివ్వాల్సిన భరణం గురించి వచ్చిన సుప్రీం కోర్టు తీర్పు ముస్లిం ముల్లాలకు రుచించకపోవడంతో వారిని తృప్తి పరచడానికి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ 1986లో ఒక చట్టం చేసి, ఆ తీర్పును నీరు కార్చాడు. దాంతో ముస్లిములకు దాసోహమంటున్నాడంటూ రాజీవ్‌పై తీవ్రవిమర్శలు వచ్చాయి. వెనువెంటనే 1986 ఫిబ్రవరిలో ఫైజాబాద్ జిల్లా కోర్టు ఓ తీర్పు నిచ్చింది. వివాదాస్పద స్థలమని దశాబ్దాలుగా మూతపడి ఉన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదులో గుడి తలుపులు తెరవాలని తీర్పు సారాంశం. ముస్లిం ఛాందసులను బుజ్జగించినట్లే, హిందూ ఛాందసులను కూడా బుజ్జగించడానికి రాజీవే ఆ తీర్పు యిప్పించాడని అనుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించలేదు.

కానీ అనుకోకుండా విశ్వ హిందూ పరిషత్ రంగంలోకి దిగి రామజన్మభూమి అంశాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. పరిస్థితిని ఎలా హ్యేండిల్ చేయాలో తెలియక కాంగ్రెసు దిక్కులు చూస్తూండగా, బిజెపి 1989 పాలన్‌పూర్ సమావేశంలో రామమందిరం కడతామని తీర్మానం చేసింది. బోఫోర్స్ వివాదంలో ప్రతిష్ఠ పోగొట్టుకున్న రాజీవ్‌పై దేశంలో నిరసన ప్రబలింది. 1989 నవంబరులో రామమందిరం శిలాన్యాస్ జరిగినప్పుడు ‘శిలాన్యాస్ హోగయా, కాంగ్రెస్‌కా సత్యనాశ్ హోగయా’ అనే నినాదాలు మిన్నుముట్టాయి. ఆ నెలలోనే జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెసు ఓడిపోయి, రాజీవ్ పదభ్రష్టుడయ్యాడు. కాంగ్రెసుకు 197, జనతాదళ్‌కు 143, రాగా బిజెపికి 85 వచ్చాయి.

1984లో 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న తమ పార్టీ అయోధ్య నినాదం ఎత్తుకోవడంతో 85కి ఎదిగిందని గ్రహించిన బిజెపి, మతరాజకీయాల ద్వారానే ఎదగగలమని గ్రహించింది. ఆడ్వాణీ 1990 సెప్టెంబరులో రథయాత్ర ప్రారంభించారు. అది సృష్టించిన ప్రభంజనం కారణంగా 1992 డిసెంబరులో బాబ్రీ మసీదును కూల్చివేత జరిగింది. అప్పణ్నుంచి ఇస్లామిక్ రాడికలిజం, టెర్రరిజం పెరిగాయి. ప్రతిగా హిందూత్వవాదం బలపడసాగింది. క్రమేపీ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మతం చుట్టూ రాజకీయాలు తిరగసాగాయి. ఈ కథ రథయాత్ర ప్రారంభానికి కాస్త ముందుగా 1990 జులైలో రాయబడింది. దేశంలో పెరుగుతున్న హిందూత్వవాదాన్ని, ఛాందసవాదాన్ని కథాంశంగా తీసుకోవడం జరిగింది.

సతీసహగమనమనే ఆచారం మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉండింది. 19వ శతాబ్దం తొలిరోజుల్లో, రాజా రామమోహన్ రాయ్ చొరవతో ఈస్టిండియా కంపెనీ మద్దతుతో చట్టవిరుద్ధం చేయడం జరిగాక, అది దాదాపు ఆగిపోయింది. కానీ 1980ల ఉత్తరార్థం నుండి పెరుగుతూ వస్తున్న ఛాందసవాదం వలన కాబోలు, 1987 సెప్టెంబరులో రాజస్థాన్‌లోని దేవ్‌రాలాలో 18 ఏళ్ల రూప్ కఁవర్ అనే ఆమె సతికి పాల్పడింది. అక్కడ సతీస్థలం అని కట్టి ఆమెను పూజించసాగారు. ఇది జరిగినందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెసు నాయకుడు, హరిదేవ్ జోషీపై పెద్ద వివాదం చెలరేగి 1988 జనవరిలో పదవి పోగొట్టుకున్నాడు. కానీ రాజపుట్‌లు రూప్ కఁవర్‌ను యిప్పటికీ సతీమాతగా కొలుస్తూన్నారు. ఈ సంఘటన జరిగిన నాలుగు నెలలకు 1988 జనవరి 8న యుపిలోని మిహిర్ ఖేరా గ్రామంలో 25 ఏళ్ల శకుంతలా యాదవ్ తనతో విడిపోయిన భర్త యాక్సిడెంటులో మరణించిన వార్త విని, అతని చితిలో పడి సతి చేసుకుందని మావగారు చెప్పాడు.

దాన్ని ‘సతి’గా గుర్తిస్తే రాజస్థాన్ ముఖ్యమంత్రికి పట్టబోతున్న గతే తనకూ పడుతుందన్న భయంతో యుపి ముఖ్యమంత్రి, కాంగ్రెసు నాయకుడు వీర్ బహాదూర్ సింగ్ దీన్ని హత్యగా బనాయించమని పోలీసులకు చెప్పి ఉంటాడని, అందుకే ఆమెను అత్తమామలు ఉరి వేసి, శవాన్ని చితిమీద పడేశారనే అభియోగంతో పోలీసులు కేసు పెట్టారని అనుకున్నారు. హత్య అనే సందేహంతో పోస్టుమార్టమ్ కూడా జరిపారు. ‘‘సండే’’ అనే వారపత్రిక 24 01 1988 సంచికలో యీ కథనం వచ్చింది. దాన్ని యీ కథలో ఉపయోగించుకున్నాను. కథలో ప్రస్తావించిన దక్షిణాది మహిళా నాయకురాలు జయలలిత. ‘ఎమ్జీయార్ పోయినప్పుడు సతి చేసుకుందామనుకున్నాను’ అని ఆమె ప్రకటించింది. 1991లో ఆమె ముఖ్యమంత్రి అయింది కూడా. పబ్లిక్ ఫిగర్స్ ఆత్మహత్యలను, యిటువంటి దురాచారాలను ప్రోత్సహించే విధంగా మాట్లాడకూడదని నా వ్యక్తిగత అభిప్రాయం. (వచ్చే నెల నాలుగో బుధవారం మరో స్వీయానువాద కథ)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?