cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍ కథ: అచలపతీ - అసహనమూ

ఎమ్బీయస్‍ కథ: అచలపతీ - అసహనమూ

నవంబరు 2015. టీవీలో ఆమిర్‍ ఖాన్‍ ఇంటర్వ్యూ వస్తోంది. ‘‘దేశంలో అసహనం పెరిగిపోతోంది, నాకు భయం వేస్తోంది, దేశం విడిచి వెళ్లిపోదామండీ’ అంది మా ఆవిడ. నువ్వలా అనడం దురదృష్టం’ అని నచ్చచెప్పాను’’ అంటున్నాడతను.

‘‘..మా ఆవిడా అదే అందిరా, అనంత్‍’’ అన్నాడు మా కోదండం.

‘‘ఏమిటి? ఏమిటీ మీ ఆవిడకు ఆమిర్‍ ఖాన్‍తో మాటామంతీ వున్నాయా?’’ ఆశ్చర్యపడ్డాను.

‘‘స్కూలు రోజుల్నించి చూస్తున్నా, నీ బుర్ర ఎప్పటికీ ఎదగదు. నీ పక్కన అచలపతి వుండి బండి నడుపుకు వస్తున్నాడు కానీ లేకపోతే నీ తెలివితేటలకు మీ పెద్దలిచ్చిన ఆస్తి ఎప్పుడో కరిగిపోయేది.’’ మండిపడ్డాడు కోదండం.

ఇదే నాకు నచ్చనిది. నేను బద్ధకస్తుణ్నన్న మాటా, తాతతండ్రులిచ్చిన ఆస్తిని కరగబెట్టడం తప్ప చేస్తున్న పనేమీ లేదన్నమాటా నిజమే కావచ్చు, మరీ అవసరమైతే నా తెలివితక్కువతనం గురించి ప్రస్తావించినా పోన్లే అనుకోవచ్చు. కానీ సందర్భశుద్ధి లేకుండా అచలపతిని పొగడ్డం దేనికి? అతను నాకు సచివుడు, సఖుడు, సేవకుడు.. వగైరా అని అందరికీ తెలుసు. ఏదో కాస్త బుర్ర వుందన్న మాటా నిజమే. అయినా అతను లేకపోతే ‘పూవు లేక తావి నిలవలేదులే’ అన్న లెవెల్లో బిల్డప్‍ యివ్వాలా వీడు?

‘‘మా ఆవిడా అదే అంటుంది.. అన్నావా లేదా?’’ కసిరాను.

‘‘మా ఆవిడ నాతో అంది, ఆమిర్‍ ఖాన్‍ ఆవిడ అతనితో అంది.’’ పళ్లు గిట్టకరచి చెప్పాడు.

‘‘అలా విడమర్చి చెప్పు. ఇంతకీ మీ ఆవిడ ఎందుకలా అంది?’’ జవాబుగా కవిత్వం ఒలకపోస్తాడని తెలియక అడిగాను.

వాడు అత్యంత నాటకీయంగా అభినయం జోడించి ‘‘దేశంలో ఎటు చూసినా మతపరంగా, కులపరంగా, ప్రాంతపరంగా వైషమ్యం, ద్వేషం..’’ అని వాపోయాడు.

‘‘ఇవన్నీ ఎప్పణ్నుంచో వున్నాయి కదరా, యిప్పుడే ఎందుకు వెళ్లిపోదామనుకుంటున్నావ్‍?’’ అడిగాను కానీ వాడు వినలేదు. తన ధోరణిలో తను చెప్పుకుపోతున్నాడు.

‘‘..ద్వేషం, విద్వేషం, రోషం..’’

‘‘..ఉక్రోషం’’ అందించాను.

‘‘..పరుషం, ఆవేషం, కావేషం..’’

‘‘..మారువేషం’’ యింకోటి అందించాను.

‘‘..తొండి ఆటలూ..’’

‘‘మధ్యలో యిదేమిటి? ఏదో ప్రాస గురించి పాకులాడుతున్నావనుకుంటే యీ ఆటలెక్కణ్నుంచి వచ్చాయ్‍?’’

‘‘మహిళా మండల్లో మ్యూజికల్‍ ఛైర్స్ ఆటలో ఒకావిడ చివర్లో మా ఆవిణ్ని నెట్టేసి ప్రైజు కొట్టేసిందట. అప్పణ్నుంచీ రగిలిపోతోంది.. యిక యిక్కడ వుండలేమంది.’’

‘‘..ఓహో, ఏ దేశానికి వలసపోతున్నారు? ఇరాన్‍? ఇరాక్‍? టర్కీ? సిరియా?..’’

‘‘అబ్బ దేశం అంటే దేశమని కాదురా, దేశంలోనే వేరే ఎక్కడికైనా వెళ్లిపోదా మనిపిస్తోందట.’’

‘‘యుపి? బిహార్‍? కర్ణాటక..?’’ అడిగి చూశాను.

వాడు విసుక్కున్నాడు. ‘‘ఇంకా గట్టిగా అనుకోలేదురా, ఎఫెక్టు కోసం అంటే నువ్వు బంకలా పట్టుకున్నావు. చూడబోతే నన్ను యీ వూరినుంచి తోలేయాలని నీకు మహా ఉబలాటంగా వున్నట్టుంది. ఇక్కడ పాయింటు నేను ఎక్కడికి వెళతాననేది కాదు. దేశంలోని అసహనం గురించి మనం ఏం చేయాలి అనే క్వశ్చన్‍మీద ఆలోచించాలి.’’

‘‘ఆలోచిస్తూ వుండు’ అని వాడికి చెప్పి ‘ఇదిగో అచలపతీ, వాడు మెదడుకు మేత పడేశాడు కానీ మనం కడుపుకు మేత పడేద్దాం. మంచి కట్‍లెట్స్, స్ట్రాంగ్‍ కాఫీ చేసి పట్రా’ అని ఆర్డరేశాను.

కట్‍లెట్‍ కొరకగానే కోదండం ఎగిరి గంతేశాడు - ‘అవార్డు వాపసీ!’ అని కేక పెట్టాడు. దేశంలో పెరుగుతున్న అసహనానికి నిరసనగా వాడు అవార్డు వెనక్కి యిచ్చేసి ప్రజల్లో ఆ సమస్యపై స్పృహ పెంచుతాట్ట. ఐడియా బాగానే వుంది కానీ వెనక్కి యివ్వడానికి నీ దగ్గర వున్న అవార్డేముంది అని అడిగాను. అదే సమస్యట. ఉండి వుంటే యిచ్చేసేవాట్ట. ఇప్పటిదాకా ఏ అవార్డూ రానందుకు చింతిస్తూ యింకో రెండు కట్‍లెట్స్ లాగించాడు.

కాస్సేపటికి ‘‘నా కెలాగైనా అవార్డు సంపాదించి పెట్టే బాధ్యత నీదేరా అనంతం’’ అన్నాడు బేస్‍ వాయిస్‍లో. ‘‘వెనక్కి యిచ్చేసేదానికి సంపాదించడం దేనికిరా’ అంటే వినలేదు. స్కూలు రోజుల్లో తన సైన్సు పేపరు కాపీ కొట్టనిచ్చినందుకు యిది నే చేయాల్సిన ప్రత్యుపకారంట. ఆ పరీక్షలో యిద్దరం ఫెయిలయిన విషయం లెక్కలోకి రాదట.

వారం తిరిగేసరికి ఒక సంస్థతో బేరం కుదిర్చాను. వాళ్లు ఏటా తమ వార్షికోత్సవానికి ఒక సాహిత్యకారుడికి అవార్డు యిస్తారట. ఈసారి ఒక ముసలాయనకు యిద్దామనుకుంటున్నారు. ఆయన సొంతంగా కవిత్వం ఏదీ రాయలేదు కానీ పాతకాలం పద్యాలన్నీ పోగేసి, స్వహస్తాలతో ఓ పుస్తకంలో రాసుకున్నాడు. వాళ్ల అబ్బాయి ఓ కార్పోరేట్‍ సంస్థలో జనరల్‍ మేనేజరు. చావుకి దగ్గర పడుతున్న తండ్రికి ఏదైనా చేయాలనుకుని ఆయన ‘రాసిన’ పుస్తకాన్ని అచ్చేసి దానికి యీ సంస్థ ద్వారా యీ అవార్డు ఏర్పాటు చేశాడు. అయితే ఫంక్షన్‍ రోజు దగ్గర పడుతున్నా పుస్తకం రెడీ అయ్యేట్టు లేదు.

నేను ఆ సంస్థకి చెప్పాను - ‘మీ వార్షికోత్సవం రోజు మా వాడికి అవార్డు యిచ్చేయండి. ఓ పది రోజుల్లో మా వాడు వెనక్కి యిచ్చేస్తాడు. అప్పుడు మళ్లీ దాన్ని ఆ ముసలాయనకు యిచ్చేద్దురు గాని, ఆ పాటికి ఆయన పుస్తకం తయారవుతుంది కూడా.’ అని.

‘‘ఒకే అవార్డుతో యిద్దర్ని శాటిస్ఫయి చేయడం గొప్పే కదా, పైగా రెండుసార్లు సభ అంటే డబుల్‍ పబ్లిసిటీ’’ అన్నాడు సంస్థ సెక్రటరీ.

‘‘అంతేకాదు, అవార్డు వెనక్కి యివ్వడం మీకు గొప్ప పబ్లిసిటీ తెచ్చిపెడుతుంది. అసలీ అవార్డు ఏవిటి? అదిచ్చిన సంస్థ ఏవిటి? అని అందరూ లేచి నిటాగ్గా కూర్చుని తేరిపార చూస్తారు. ఇప్పటిదాకా మీ సంస్థ వుందని తెలియనివాళ్లు కూడా ఈ అవార్డు వాపసీ వార్త మీడియాలో రాగానే మీ గురించి తెలుసుకుంటారు. అందువలన మీరు రెండోసారి సభ ఏర్పాటు చేసినపుడు మరింత ఘనంగా జరుగుతుంది. మీ జనరల్‍ మేనేజరుగారు తనిచ్చిన డబ్బుకి పూర్తి పైసా వసూల్‍ అని సంతోషపడతాడు.’’ అని చెప్పాను.

నే చెప్పినది నూటికి నూరు శాతం కరక్టన్నాడు సెక్రటరీ. ‘మీ కోదండంగారు అవార్డు తిరిగి యిచ్చేయడం ఖాయం కదా, లేకపోతే జనరల్‍ మేనేజరుగారు మా తాట తీస్తాడు, మాకు స్పాన్సర్లు లేకుండా పోతారు’ అన్నాడు కాస్త బెరుకుగా.

‘‘భలేవారే, మా వాడికి మాత్రం పబ్లిసిటీ అక్కరలేదా? ఇప్పటిదాకా వాడి పేరు ఎవరికీ తెలియదు, యిప్పుడు మారుమ్రోగిపోతుంది. టీవీల్లో యింటర్వ్యూలు దంచి కొట్టవచ్చు.’’ అన్నాను అతని భుజం తడుతూ.

అతను ఫకాలున నవ్వి ‘‘అవును అడగడం మర్చిపోయా. మీ కోదండంగారు వచన కవి అన్నారు, ఆయన ఎన్ని పుస్తకాలు రాశారేమిటి?’’

‘‘అబ్బే, పుస్తకరూపంగా యింకా రాలేదు. మా స్కూలు మ్యాగజైన్లో ప్రతీ ఏడూ రాసేవాడు.’’

ఆముదం తాగిన మొహం అంటే ఏమిటో సెక్రటరీ మొహం చూస్తే నా కర్థమైంది. అంతలోనే తమాయించుకుని ‘సరే, కానీయండి, ముసలాయన కంటె బెటరేగా, ఏదో ఒకటి సొంతంగా రాశారు’ అని తనను తాను ఓదార్చుకున్నాడు.

ఆవార్డు వాపసీ ప్రకటన తర్వాత వచ్చిన పబ్లిసిటీ విషయంలో కోదండం, సెక్రటరీ యిద్దరూ ఫుల్లు హ్యేపీ. అవార్డు వచ్చినపుడు ఎవరూ యింటర్వ్యూ చేయలేదు కానీ, తిరిగి యిస్తానన్నపుడు మేధావి సంఘాలన్నీ సన్మానాలు చేశాయి. టీవీ కెమెరాలు వెంటపడ్డాయి. మా వాడు వేదికల మీద, టీవీ యింటర్వ్యూల్లో  కొట్టిన ఆవేషం, కావేషం డైలాగులు బాగానే పేలాయి. వాటికి తోడుగా క్రోధం, ద్వేషం కలిపి క్రోషం అనే కొత్తపదాన్ని కాయిన్‍ చేశాడు కూడా. అవార్డు తిరిగి యివ్వడానికి ఒక సభ పెట్టి సంస్థ సెక్రటరీ చేతికే యిస్తానని చెప్పినప్పుడు ఆ కొత్త ఆలోచనకు అందరూ మెచ్చుకున్నారు. ఈ ఐడియా తమకు రానందుకు వాపసీ బ్యాచ్‍ సాహిత్య ఎకాడమీ అవార్డు గ్రహీతలు, సినిమా అవార్డు గ్రహీతలు నొచ్చుకున్నారు.

ఇంతలో అనుకోని అవాంతరం వచ్చిపడింది. ఇలా అవార్డు తిరిగి యివ్వడం తెలుగు కవిత్వాన్ని, తెలుగు జాతిని అవమాన పరచడమే అని అవార్డు వాపసీ విరోధీ అనే పేరుతో ఏర్పడిన ఒక సంఘం నిరసన తెలిపింది. ‘అవార్డు యిచ్చినది సంస్థ కాదు, యావత్తు తెలుగు జాతి! ఉన్నతమైన, ఉదాత్తమైన తెలుగు కవిత్వానికి వారసుడిగా కోదండాన్ని గుర్తించి సన్మానించిన తెలుగు సాహిత్యాభిమానుల ఆశలను, ఆశయాలను, ఆకాంక్షలను తృణీకరించడమే యి బహుమతి తిరస్కరణ’ట. ఈ సంస్థ సభ్యుల్లో ఒక్కరైనా కోదండం కవిత్వం చదివారా అన్నది నా కనుమానమే. ఆ స్కూలు మ్యాగజైన్‍ కాపీలు వాడి దగ్గరే లేవు. కానీ విరోధీ వాళ్లు వాణ్ని ఎక్కడికో తీసుకెళ్లి పోయారు. అక్కణ్నుంచి దిగితే తంతామనసాగారు. అవార్డు వెనక్కిస్తే మాట దక్కదన్నారు. చూస్తూండగానే వేర్వేరు పేర్లతో అదే తరహా భావాలతో యింకో నాలుగు సంస్థలు పుట్టుకుని వచ్చి అదే ధోరణిలో బెదిరించాయి.

ఇవ్వకపోతే ఒప్పుకోమని యింకో నాలుగు సంస్థలు అంతే ఫోర్సుతో వెంటపడ్డాయి. రోజుకో సంఘం చొప్పున కోదండం యింటికి వచ్చి నచ్చచెప్పసాగారు. ముందు నుయ్యి, వెనక గొయ్యి కావడంతో వాడికి ఏం చేయాలో పాలుపోక వాపసు సభ వాయిదా వేయసాగాడు. దాంతో సెక్రటరీ వచ్చి నా దగ్గరకు వచ్చి మొత్తుకున్నాడు. ‘‘ఆ ముసలాయన యివాళో రేపో అన్నట్టున్నాడట. పుస్తకం కూడా రెడీగా వుందట. సభ ఎప్పుడని జనరల్‍ మేనేజరు గారు చావగొడుతున్నాడు. ఈయనేమో ఏదీ తేల్చడు. మీరు చెప్పారు కదాని ఒప్పుకున్నాను’’ అంటూ.

కోదండాన్ని పిలిచి చివాట్లేశాను.

‘‘దేశంలో అసహనం వుందని తెలుసుకానీ యి లెవెల్లో వుందని తెలియదురా. ఇప్పుడు అవార్డు ఉంచుకున్నా, తిరిగి యిచ్చేసినా దెబ్బలు తినడం ఖాయమన్నట్టుంది. మొహానికి సిరా పూస్తామని ఒకరంటే, ఏకంగా తారే పూస్తామని యింకోరంటున్నారు...’’

‘‘...ఒరే నువ్వు ఏం పూయించుకుంటే అది పూయించుకో. అవార్డు వెనక్కి యివ్వకపోతే ఆ సెక్రటరీ నాకు యాసిడ్‍ కలిపిన తారు పూసేట్టున్నాడు.’’ 

‘‘..అవార్డు మీద నాకేం వ్యామోహం లేదురా, ఓ చెక్కముక్కంతే. కాస్త సద్దు మణిగాక యిచ్చేస్తానులే. ఈలోపుగా యింకో అవార్డు వాపసీ కాండిడేటు తెర మీదకు వస్తే నన్ను వదిలేస్తారులే..’’ విసుక్కున్నాడు కోదండం.

‘‘అంత టైము లేదురా, ఆ ముసలాయన ఏడు కట్లలో రెండు కట్లు యిప్పటికే కట్టించేసుకున్నాట్ట..’’

‘‘కాస్త ఆగమను. డబ్బు పోగేయాలంటే టైము పడుతుంది..’’

‘‘పోగేయడమేమిట్రా, ఆ లక్ష రూపాయలూ తినేశావా?’’

కోదండం ఏడుపుమొహంతో చెప్పాడు. బహుమతితో బాటు డబ్బిస్తారని వాడికి తెలియదట. అవార్డు వస్తుందని వాళ్లావిడతో అనగానే ‘అవార్డు మీకు, దాంతో వచ్చే రివార్డు నాకు’ అందిట. ఏ వెయ్యి నూటపదహార్లో యిస్తారు కాబోలనుకుని సరేనన్నాట్ట. తీరా ప్రకటన వచ్చాక లక్ష రూపాయలని విని గుండెల్లో రాయి పడిందట. డబ్బు చేతికందాక, ‘మీరు అవార్డు వాపసీ బ్యాచ్‍లో వున్నారు కానీ నేను రివార్డు వాపసీ బ్యాచ్‍లో లేనందట ఆవిడ. పైగా శత్రుధనం దోచేశాను, తిరిగి యివ్వడమేమిటందట.

శత్రుధనం ఎలా అయిందని అడిగితే ఈవిణ్ని మహిళా మండలి మ్యూజికల్‍ ఛెయిర్స్‌లో తొండి ఆటతో గెలిచినది సెక్రటరీ పెళ్లమేట. ‘లక్ష యివ్వకపోతే డబ్బు తినేశాననని అనంతం గాడనుకుంటాడు’ అని వీడు మొత్తుకుంటే ‘రోజూ వచ్చిపడే నచ్చచెప్పుడు బృందాలను మేపడానికి ఎంత ఖర్చవుతోందో లెక్క చూపించండి, ఇదంతా ఆయనిప్పించిన అవార్డు వల్ల కాదా’ అంటోందిట.

‘కాఫీ, టిఫెన్ల కెంతవుతుందేమిట్రా పెద్ద’ అంటే ‘చాల్లే, ఆ రోజులు పోయాయి, మందూ ముక్కాయే, అరడజను మంది వస్తారు, వాళ్లలో మాట్లాడేందుకు యిద్దరు వస్తే, తాగడానికి నలుగురు వస్తున్నారు. ఈ విషయం మీద మా ఆవిడకు, నాకూ రోజూ గొడవే. దేశంలో వున్న అసహనం మా యింట్లోకి దూరి తిష్టవేసింది’ అని గోలపెట్టాడు.

‘ఆలస్యమైన కొద్దీ ఖర్చు పెరిగి లక్షకు చేరుతుంది, అప్పుడు మీ ఆవిడ సరే అన్నా లాభం వుండదు’ అని హడలేశాను. అయినా వాడు ఎటూ తేల్చకుండా గంభీరంగా తల వూపి వీపు నా వైపుకి పెట్టి హొరైజన్‍లోకి వెళ్లిపోయాడు.

అచలపతిని రంగంలోకి దింపకపోతే నేనూ హొరైజన్‍ దారి పట్టాల్సిందేనని తోచింది. కానీ డైరక్టుగా అడిగితే లోకువై పోనూ? ‘‘అచలపతీ, ఈ కోదండం ప్రాణం కాపాడ్డం మానవధర్మంగా నీకు తోచటం లేదా?’ అని చివాట్లేశాను.

‘‘అవార్డు యిప్పించినవారే కాపాడతారనుకున్నానండి’’ అనే వినయపూర్వకమైన జవాబు వచ్చింది.

‘‘కాపాడుదును కానీ హఠాత్తుగా వూరు వెళ్లాల్సి వస్తోంది. ఈ లోపుగా ఏదైనా ఎమర్జన్సీ వస్తే నువ్వు చూసుకో.’’ అని చెప్పి నేను ఊటీ చెక్కేశాను.

మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చేసరికి స్టేషన్‍లో సెక్రటరీ తారసిల్లాడు. ‘‘మీ అచలపతి అసాధ్యుడండి. భలే పరిష్కారం చూపించాడు. పై వారమే ఫంక్షన్‍ పెట్టుకున్నాం.’’ అన్నాడు.

అచలపతి చెప్పిన సలహా ప్రకారం - కోదండం అవార్డు ఆ సంస్థకు వాపసు చేయడట. తనే డైరక్టుగా ఆ ముసలాయనకు అందిస్తాడట. తనది ఆధునిక కవిత్వమార్గంట, ముసలాయనది ప్రాచీనమార్గంట. అయినా దేశంలో నెలకొన్న అసహన వాతావరణానికి చెంపపెట్టు పెట్టినట్లు, వ్యతిరేక భావజాలం వున్నవారి పట్ల సహనం పాటించడమే కాక, గౌరవం కూడా ప్రకటిస్తూ అవార్డు ఆయనకే యిస్తాడట. ఆ మాట చెపితే జనరల్‍ మేనేజరు సంతోషించాట్ట. ఈ మధ్య కోదండానికి వచ్చిన పబ్లిసిటీతో ఆ ఫంక్షన్‍కు మీడియా కవరేజి బాగా వస్తుందని అతని ఆనందం. 

అవార్డు మాట సరే, లక్ష మాటేమిటన్న సందేహం మనసులో వున్నా ఆయన్ను అడగలేదు. ఇంటికి వచ్చి అచలపతిని అడిగాను.

‘‘నేనే వెళ్లి ఆవిడతో మాట్లాడానండి. లక్ష రూపాయలకు చెక్కు గీకి సెక్రటరీగారి భార్య మొహం మీద విసిరి కొట్టే ఛాన్సు పోతుందేమో ఆలోచించమన్నానండి. ఆవిడ సరేననడానికి నిమిషం పట్టలేదండి.’’

‘‘అంటే అవార్డు ముసలాయనకు, చెక్కు సంస్థ కూనా? జనరల్‍ మేనేజరు ఒప్పుకుంటాడా?’’

‘‘కోదండంగారు అవార్డు ముసలాయన చేతిలో పెట్టాక, యీవిడ చెక్కును సెక్రటరీగారి భార్య కళ్ల ముందు గాలిలో దులిపి, ఉఫ్‍న వూది, అప్పుడు ముసలాయన చేతిలో పెట్టేందుకు ఒప్పందమండి.’’

నేను నిట్టూర్చాను. ‘‘ఈ మ్యూజికల్‍ ఛైర్స్ కాదు కానీ, ఆడాళ్ల మధ్య అసహనం పెరిగిపోతోందయ్యా’’

‘‘దానిపై నిరసన తెలపడానికి మీరూ ఏదైనా వాపసు యిచ్చేద్దామనుకుంటున్నారా, సర్‍?’’ వాకబు చేసినట్లు వినయంగానే అడిగినా అచలపతి మాటల్లో వెటకారం కొట్టవచ్చినట్లు కనబడింది.

జులై 2022. తొలి ఆదివారం. కోదండం వచ్చి ‘‘దేశంలో అసహనం గతంలో కంటె బాగా ఎక్కువై పోయిందిరా’’ అని మొదలెట్టాడు. నాకు అన్ని వారాలూ ఒకటే అయినా, ఆదివారాలు మరింత బద్ధకంగా ఉంటాను. అందునా పొద్దున్న! ఆవులిస్తూ ‘‘సళేలే’’ అన్నాను.

‘‘దేశం విడిచి వెళతానన్న ఆమిర్ ఖాన్ భార్య దేశం కంటె భర్తనే విడిస్తే మంచిదనుకుంది.’’

‘‘సర్సరే’’

‘‘ఒక మతం వారిపై మరొకరు విమర్శలు చేస్తూ వాట్సాప్‌లు పంపడం ఎక్కువైంది. ఎప్పటెప్పటివో తవ్వి తీస్తున్నారు. మధ్యయుగాల చరిత్రను తలుచుకుని ఉడుకెత్తి, అంధయుగాల వైపు పయనిస్తున్నారు. శిరచ్ఛేదాలు చేస్తున్నారు. ఒకరి దేవుళ్ల గురించి మరొకరు అశ్లీలంగా మాట్లాడుతున్నారు...’’

‘‘..సర్సర్సరే’’

‘‘ఇవన్నీ ప్రభుత్వం చూసి అది కూడా అసహనానికి లోనవుతోంది. సోషల్ మీడియాపై, డిజిటల్ మీడియాపై ఆంక్షలు విధిద్దామనుకుంటోంది. సర్వం తన నియంత్రణలో ఉంచుకుందామని ప్రయత్నిస్తోంది. ఎవరైనా వెబ్‌సైట్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ మరి దేనిలోనైనా కానీ అభ్యంతరకర వ్యాఖ్యలు పెడితే దుంప తెంపేట్లుంది...’’

నాకు సహనం నశించింది. ‘‘..ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు?’’ అని అరిచాను కోపంగా.

వాడు భయపడి, దీర్ఘోపోద్ఘాతం మానేసి గబగబా తన ప్లాను చెప్పేశాడు. ‘‘దేశంలో యింత అసహనం ఉండగా దాన్ని ఎన్‌క్యాష్ చేసుకోకుండా ఎలారా? ఎప్పుడో ఏడేళ్ల క్రితం నాటి ఎవార్డు సంగతి ఎవడికి గుర్తు? అందుకని నేను ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టి కొన్ని మతాల దేవుళ్లను తిడదా మనుకుంటున్నాను. ఎంతసేపూ ముఖ్యమైన మూడు మతాలేనా, తక్కిన మతాలేమున్నాయా అని వికీపీడియా చూశాను. వందలాది మతాలున్నాయిరా. ఎవరో ఒకరి మీద మనమో రాయి వేస్తాం... ఆగాగు.. ఆ విషయం ఎవరికి తెలుస్తుంటావ్? నేనే మారుపేరుతో నా మీద కంప్లెయింట్ యిస్తాన్రా! వెంటనే మనకు అరెస్టు, బెయిల్, పేపర్లో న్యూసూ! ఇప్పుడు జరాతుస్త్ర అనే ఆయనతో మొదలు పెడదామనుకుంటున్నాను. ఆయనెవరో తెలియదు కానీ, పేరు మాత్రం భలే క్యాచీగా ఉందిలే...’’

నేను అచలపతి కేసి చూశాను. ‘‘వీణ్ని తక్షణం యిక్కణ్నుంచి తరిమేసే ఉపాయం ఏమైనా తడుతోందా అచలపతీ?’’ అని అడిగాను.

‘‘ఈయన వచ్చిన దగ్గర్నుంచి అసహనంగా చూస్తున్న కుక్కను వదిలిపెడితే, స్కూల్లో పరుగుపందాల నాటి వేగం, ఉద్వేగం కోదండం గారిలో యింకా ఉందో లేదో తెలుసుకునే  అవకాశం ఉంది సర్’’ అన్నాడు అచలపతి కుక్క గొలుసు విప్పబోతూ.

‘‘రైఠో, అలాక్కానీ.’’ అని పర్మిషన్ యిచ్చేసి పడక్కుర్చీలో అటువైపు ఒత్తిగిలి పడుక్కున్నాను. (మరో హాస్యకథ వచ్చే నెల మూడో బుధవారం)

- ఎమ్బీయస్‍ ప్రసాద్‍  (జులై 2022)

mbsprasad@gmail.com

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి