Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍ కథ: అదే పాత కథ

ఎమ్బీయస్‍ కథ: అదే పాత కథ

(ఇది నా ఇంగ్లీషు కథ ‘‘ద సేమ్ ఓల్డ్ స్టోరీ’’కు స్వీయానువాదం. ఆ కథ 1996 సెప్టెంబరు నాటి ‘‘ఎలైవ్’’ పత్రికలో ప్రచురించబడింది. సెల్‌ఫోన్లు రావడానికి ముందు ప్రయివేటు టెలిఫోన్ బూత్‌ (పిసిఓ)ల నుంచి జనాలు ఫోన్లు చేసుకునే కాలమది.)

‘‘ఓ కాల్ చేసుకోవచ్చా, తమ్ముడూ?’’

అదే వాయిస్. చాలా రోజుల తర్వాత అతను మళ్లీ వచ్చాడు. రెండు నెలలైందా? ఇంకా ఎక్కువా? అతను మాట్లాడే పద్ధతి విలక్షణంగా ఉంటుంది. పైగా మాట్లాడిన ప్రతీసారి 15 నిమిషాలకు తక్కువ మాట్లాడడు. అందుకే అతని కంఠస్వరం నాకు బాగా గుర్తుండి పోయింది. నేను గుడ్డివాణ్ని కావడం చేత కాబోలు, తక్కినవారి కంటె నా వినికిడి శక్తి ఎక్కువ. గొంతు బట్టి మనుష్యులను గుర్తు పట్టే అలవాటూ ఎక్కువే. ప్రభుత్వం విశేషాంగుల కోటాలో నాకీ టెలిఫోన్ బూత్ ఎలాట్ చేసిన తర్వాత నా శ్రవణశక్తి మరింత పెరిగింది. గుడ్డివాణ్ని కదాని కొంతమంది మోసం చేయబోతారు. ఒకసారి మోసం చేస్తే చాలు, గొంతుబట్టి గుర్తు పెట్టుకుని, తర్వాతిసారి వచ్చి అడిగినప్పుడు ‘కుదరదు’ అని చెప్పేస్తాను.

అంధుణ్ని కాబట్టి నా మనోనేత్రంలోనే నా రెగ్యులర్ కస్టమర్ల చిత్రపటాలను గీసుకుంటాను. వాళ్లకు ఓ పేరు కూడా ఆపాదిస్తాను. అసలు పేరేమిటో వాళ్లెప్పుడూ చెప్పరు, నేనడగను. అందుకని గుర్తు పెట్టుకోవడానికి యీ పెట్టుడు పేరు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ సదరు పెద్దమనిషికి ‘‘మ్యాన్ ఫ్రైడే’’ అని పేరు పెట్టుకున్నాను. అదేదో విదేశీ నవలలో పేరనుకుంటా. ఇతను ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు తన గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడడానికి వస్తాడు కాబట్టి యితనికి ఆ పేరు తగిలించాను. అతను చెప్పబోయే నెంబరు నాకు కంఠతా వచ్చు. అతను చెప్పడానికి ముందే డయల్ చేసి యివ్వగలను. కానీ అలా చేస్తే అతని విషయాల్లో నేను అనవసర ఆసక్తి చూపిస్తున్నానని, వాళ్ల సంభాషణలు వింటున్నానని అతను కనిపెట్టేసే ప్రమాదం ఉంది. అది నా వ్యాపారానికి దెబ్బ. చుట్టూ అనేక బూత్‌లు ఉండగా నేను గుడ్డివాణ్ని కావడం చేత, కస్టమర్ల సంభాషణల పట్ల అనాసక్తి ప్రదర్శించడం వలననే నా దగ్గరకు వస్తున్నాడని నా ఉద్దేశం.

అసలతను మధ్యాహ్నం ఒంటిగంట సమయాన్ని ఎందుకు ఎంచుకున్నాడంటారు? అది లంచ్‌టైమ్ కాబట్టి, ఫోన్ బూతుల వాళ్లు దుకాణం కట్టేసి, యింటికి భోజనాలకు వెళతారు. నాకైతే వెళ్లిరావడం యిబ్బంది కాబట్టి, పొద్దున్న వచ్చేటప్పుడే భోజనం మూట కట్టుకుని తెచ్చుకుని, నా బంక్‌లోనే తినేస్తాను. బూత్‌లు మూసేసేవేళ కాబట్టి ఫోన్ చేసేవాళ్లు ఆ సమయంలో పెద్దగా రారు. ఇతను యించక్కా తన గర్ల్‌ఫ్రెండ్‌తో మనసు విప్పి మాట్లాడగలడు. ఎక్కడ రహస్యంగా కలవాలో, వచ్చేటప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో విపులంగా వివరించగలడు. ఇవన్నీ నేను గమనిస్తానని అతనికి తెలియకపోవడమే నాకు, నా వ్యాపారానికి శ్రేయస్కరం. అందుకని నెంబరు తెలిసినా, తెలియనట్లే, ‘నెంబరేమిటండి?’ అని అడిగాను.

నేనెప్పుడూ నెంబరు డయల్ చేసి, రింగ్ టోన్ వచ్చాక రిసీవరు కస్టమరు చేతికిస్తాను. లేకపోతే గుడ్డివాణ్ని కదాని జనాలు రెండు మూడు కాల్స్ చేసేసుకుని ఒకటే చేశానని అబద్ధమాడేస్తారు. బిల్లు వచ్చాక నేను లబోదిబో మనాలి. అతను నెంబరు చెప్పేలోపునే నా చేతివేళ్లు ఫోన్ డయల్ దగ్గరకు ఆటోమెటిక్‌గా వెళ్లిపోయాయి. 7...5..! ఆగాగు, అతను వేరే నెంబరు చెప్తున్నాడే! 6..4..9..8..7..0..1. ఇతను మ్యాన్ ఫ్రైడే కాదా? పొరబాటు పడ్డానా? కావచ్చు.

అతనడిగిన నెంబరు డయల్ చేసి రిసీవర్ అతని చేతికిచ్చాను. అతను మాట్లాడడం మొదలుపెట్టాడు. అదే గొంతు. అతను కాక వేరెవరో అయ్యే ఛాన్సే లేదు. ఇది తన ప్రియురాలికి చేసే కాల్ కాకపోవచ్చు. ఏది బిజినెస్ కాల్ అయి వుండవచ్చు. నాకు నవ్వు వచ్చింది. ఇతనికి ప్రేమించడం తప్ప వేరే పని లేదని అనుకోవడం నా మూర్ఖత్వం కాదూ! ఉదరపోషణకు ఏదో ఒక పని చేస్తూండాలిగా. కుటుంబబాధ్యతలు కూడా ఉండి వుంటాయి. వాటికి సంబంధించి వందలాది వ్యవహారాలుంటాయి. నా బూత్‌లోంచి తన ప్రియురాలితో వేరేవాళ్లతో మాట్లాడకూడదన్న రూలు ఏమీ లేదుగా!

నా ఆలోచనల్లోంచి బయటపడి అతని సంభాషణపై ఓ చెవి పడేశాను, వెంటనే ఉలిక్కిపడ్డాను. అమ్మాయితో మాట్లాడుతున్నట్లే ఉంది. అయితే గతంలో కంటె చాలా మృదువుగా మాట్లాడుతున్నాడు. గత రెండు నెలలుగా నా బూత్ నుంచే కాదు, వేరే ఎక్కణ్నుంచి కూడా మాట్లాడనట్లుగా ఉంది. ఆ అమ్మాయి అలిగిందేమో, బుజ్జగిస్తున్నాడేమో. సంభాషణ త్వరగానే ముగిసింది. అంటే అతని స్టాండర్డ్ ప్రకారం అన్నమాట. ఎంతైందో నేను చెప్పినంతా యిచ్చేశాడు.

అతను మాట్లాడేటప్పుడు ఎన్నిసార్లు కాల్ ఎక్స్‌టెండ్ చేశాడో అతను గుర్తు పెట్టుకోడు. ఒక్కోప్పుడు పాడుపొట్ట కోసం నేను ఎక్కువేసి చెప్పినా పట్టించుకోడు. అందుకే అతను నాకు విలువైన కస్టమర్. అసలే బిజినెస్ డల్. అలాటప్పుడు అనవసరమైన వాకబులు చేసి, విలువైన కస్టమర్లను పోగొట్టుకోను. ఆ విషయం అతనికీ తెలుసనుకుంటాను. ఒక్కోప్పుడు ఫోన్‌లో సరస సంభాషణలకు దిగుతాడు, నాకు వినబడతాయని తెలిసినా! నేను గుడ్డివాణ్ని కాబట్టి అతన్ని గుర్తు పట్టలేనన్న ధీమా ఒకటి!

తన మ్యాన్ ఫ్రైడే బిరుదుని అతను పోగొట్టుకోలేదు. గతంలో లాగానే ప్రతీ శుక్రవారం సరిగ్గా అదే టైముకి వచ్చి, అదే నెంబరు (కొత్త నెంబరు లెండి)కి యిదివరకు లాగానే నవ్వుతూ, తుళ్లుతూ, చిలిపి జోక్స్ వేస్తూ మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి యిల్లు మారిందేమో, అందుకే నెంబరు మారి ఉంటుంది అనుకున్నాను. ఇతని మాటల్లో ఆ అమ్మాయి స్నేహితుల గురించి అడుగుతూంటాడు. తను చేసిన సాహసాల గురించి చెప్తాడు, ఆమెకు సన్నిహితుడు కావడం చేత తక్కినవాళ్లు ఎలా అసూయ పడుతున్నారో చెప్తాడు. అప్పుడప్పుడు తన ఫ్రెండు రూముకి ఏ దారిలో వస్తే యిబ్బంది ఉండదో చెప్తాడు. గతసారి కలిసినప్పుడు జరిగినవి యింకా గుర్తున్నాయనీ, యీసారి శాశ్వతంగా గుర్తుండిపోయే విషయాలు జరుగుతాయనీ చెప్తూంటాడు.

ఇవన్నీ ఎప్పుడూ చెప్పే మాటలే కానీ యిటీవల అతని మాటల ధోరణిలో కాస్త తేడా ఉందని నాకు తోచింది. గతంలో అయితే యితని సమాధానాల బట్టి ఆ అమ్మాయి కూడా చిలిపిగా మాట్లాడుతుందని, ఒక్కోప్పుడు యితని కంటె శ్రుతి మించుతుందని నాకు అనిపించేది. కానీ యీ మధ్య ఆ అమ్మాయిలో గాంభీర్యం పెరిగినట్లుంది. బహుశా అప్పట్లో యింట్లో ఎవరూ ఉండేవారు కారేమో. కొత్త యింట్లో పక్క వాటాల వాళ్లు వస్తూ పోతూ ఉంటారేమో, లేకపోతే పనిమనిషో, వంటమనిషో పక్క గదిలో ఉంటుందేమో! తన ఫ్రెండు రూముకి రమ్మనమని యితని చేత ఎక్కువసార్లు బతిమాలించు కుంటోంది. ఇదివరకింత బెట్టు లేదు. ప్రణయకలహం తర్వాత బెట్టు పెంచిందేమో! మనిషిలో మార్పు వచ్చిందేమో!

ఒకవేళ.. ఒకవేళ.. మనిషే మారిందేమో అనిపించింది, ఓ సాయంత్రం ఖాళీగా కూర్చున్నపుడు! ఉలిక్కిపడ్డాను. మన మ్యాన్ ఫ్రైడే తన ప్రేయసినే మార్చేశాడా? కొత్త నెంబరు, కొత్త మాటల ధోరణి, ఫ్రెండు రూముకి రమ్మనమని కొత్తగా అభ్యర్థిస్తున్నట్లు సంభాషణ! ఇవన్నీ చూస్తే పాత ప్రేయసిని వదుల్చుకుని మరో అమ్మాయిని బుట్టలో పెడుతున్నాడా? ఛ, ఛ అలా ఎందుకు అనుకోవాలి? మనుషులన్నాక ఎప్పుడూ ఒకేలా ఉంటారా? ఆలోచనలో, ప్రవర్తనలో మార్పు రాదా? రెండు మూడుసార్లు ఏకాంతంగా కలిశాక ఎవరి కంటో పడి ఉంటారు. లేక పడబోయి ఉంటారు. దాంతో అమ్మాయిలో జంకు ప్రారంభమై ఉంటుంది. మగాడు కాబట్టి యితని తెగువ తగ్గలేదు. ఫర్వాలేదులే అని నచ్చచెప్పి, శాంతంగా మాట్లాడి మళ్లీ రప్పిస్తున్నాడేమో!

అయినా యిదంతా నాకెందుకు? నేను అతన్నీ చూళ్లేదు, ఆ అమ్మాయినీ చూళ్లేదు. ఆ మాటకొస్తే లోకంలో ఎవర్నీ చూళ్లేదు, చూళ్లేను. ఆ అమ్మాయి నా చుట్టంపక్కం ఏదీ కాదు. పనీపాటా లేక ఊరికే ఊహించుకుంటూ కూర్చుంటే యిలాగే ఉంటుంది. కళ్లుంటే ఏ పుస్తకమో చదువుకునేవాణ్ని, లేకపోతే దిక్కులు చూస్తూ కాలక్షేపం చేసేవాణ్ని. ‘ఏదీ లేకపోవడంతో యిలాటి దిక్కుమాలిన ఆలోచనలు వస్తున్నాయిరా శుంఠా, దేవుడు కళ్లు ఎటూ మూసేశాడు. చెవులు కూడా మూసుకుని నీ పని నువ్వు చూసుకో. నీ జీవితం నిస్సారమైంది కాబట్టి నీ చుట్టూ ప్రపంచంలో ఏదో డ్రామా, సస్పెన్స్ ఎదురుచూస్తూ యిలాటి పాడు ఊహలు చేస్తున్నావు.’ అని నన్ను నేనే తిట్టుకున్నాను. రెండు, మూడు రోజులు యిలా గడిచాయి కానీ, మళ్లీ నాలోని కుతూహలం  నన్ను ఊరికే ఉండనీయలేదు.

ఓ రోజు మధ్యాహ్నం, ఏ పనీ లేకపోవడంతో, ఏ కస్టమరూ రాకపోవడంతో గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నపుడు పాత నెంబరుకి ఫోన్ చేసి చూద్దామనిపించింది. ఆ అమ్మాయి అక్కడే ఉంటే, కొత్త నెంబరు అమ్మాయి యింకో అమ్మాయన్నమాట. మనవాడి ప్రేయసి నెంబరు టూ అన్నమాట. పాత నెంబరులో ఎవరూ లేకపోతే ఇద్దరమ్మాయిలు లేరు, ఒకమ్మాయే నన్నమాట, నేను యితని గురించి వేరేలా ఆలోచించడం తప్పన్నమాట. ఓ సారి చేసి చూస్తే నా ఆరాటం తగ్గుతుంది. ఇంతకీ అమ్మాయి పేరేమిటి? ఇతనెప్పుడూ పేరు పెట్టి పిలవలేదు. మై స్వీట్‌హార్ట్ అని పలకరిస్తాడు. అమ్మాయి మారిందో లేదో తెలియదు కానీ పిలుపులో మార్పు లేదు. అసలు అమ్మాయి కూడా మారలేదేమో, యిదంతా అనవసరమైన పత్తేదారీ పని అనుకుంటూండగానే నా వేళ్లు ఆటోమెటిక్‌గా డయల్ చేసేశాయి. 7..5..3..6..7..9..2!

రింగ్ టోన్ వస్తూండగా నాకు హఠాత్తుగా తట్టింది – ఆ అమ్మాయి వాయిస్ నేనెప్పుడూ వినలేదు కదా! విని ఉంటే రెండో నెంబరుకు కూడా చేసి, అక్కడ మరో వాయిస్ వినబడితే, వేర్వేరు అమ్మాయిలన్నమాట అని తెలిసేది. అయినా యీ టైములో ఆ అమ్మాయి యింట్లో ఉంటుందో లేదో, ఫోన్ ఎత్తిన అమ్మాయి మన కాండిడేటు అవునో కాదో! మన శుక్రవార పురుషుడు మధ్యాహ్నం ఒంటిగంటకు చేస్తాడు కాబట్టి కాస్త ముందో వెనకో చేస్తే, అప్పుడు ఆ అమ్మాయే ఫోన్ తీసేది. కానీ ఆ టైముకి చేస్తే మనవాడు అప్పుడే సరిగ్గా దిగబడితే? నా మాటలు అతని చెవిన పడితే? కొంప గుండమై పోదూ! నా వ్యవహారాలతో నీకేం పనిరా అని బూత్ అద్దాలు పగలకొడితే?

ఎందుకొచ్చిన గొడవిదంతా అనుకుని ఫోన్ కింద పెట్టేయబోతూంటే, ఎవరో అటువైపు రిసీవరు ఎత్తారు. ‘‘ఎవరండి?’’ యాస చూస్తే పనిమనిషిలా ఉంది. ‘‘అమ్మగారున్నారా?’’ అని అడిగాను. ‘‘పెద్దమ్మగారా? చిన్నమ్మగారా?’’

చచ్చాం. చిక్కు ప్రశ్నే. పెద్దమ్మగారు ఎంత పెద్దది? చిన్నమ్మగారు ఎంత చిన్నది? మనవాడి రొమాన్సు పెద్దవాళ్లతోనే అయితే!? చీకట్లో బాణం వేశాను. ‘‘..చిన్నమ్మగారే’’

‘‘చిన్నమ్మగారైతే లేరు కదా, పెళ్లి చేసుకుని వెళ్లిపోయి నెలవుతోంది కదా! ఇంతకీ మీరెవరు?’’

చిన్నమ్మగారు పెళ్లి చేసుకుని నెల్లాళ్ల క్రితమే వెళ్లిపోతే మరి చిన్నమ్మగారు కావాలా అని అడుగుతావేమిటే దద్దమ్మా అని మనసులో అనుకుని, ‘‘నేను డ్రై క్లీనింగ్ షాపు నుంచి ఫోన్ చేస్తున్నాను. అమ్మగారు ఓ చీర యిచ్చారు, కలక్ట్ చేసుకోలేదు. కనుక్కుందామని...’’ అన్నాను. ఆహా, నేను ఆశుకవిని కాకపోయినా, ఆశుకథారచయిత నన్నమాట. అప్పటికప్పుడు భలే అల్లేశాను.

‘‘ఆగండి, పెద్దమ్మగారిని పిలుస్తాను...’’ అని రిసీవరు పక్కన పెట్టి పనిమనిషి వెళ్లింది.

కొద్ది క్షణాల్లోనే కాస్త అథారిటీ ఉన్న వాయిస్ వినవచ్చింది. ‘‘ఎవరు మాట్లాడేది?’’

‘‘డ్రై క్లీనింగ్ షాపు నుంచండి. అమ్మగారు చీర యిచ్చి నెలైనా పట్టుకెళ్లలేదు. మర్చిపోయారేమో, గుర్తు చేద్దామని... రసీదు పోయినా ఫర్వాలేదు, యిచ్చేస్తాం. గబుక్కున మా షాపులో మిస్‌ప్లేస్ అయిపోతే.. ఖరీదైన చీర కదా.. మాకు రిస్కు.. అందుకని...’’

‘‘దాని చీరలన్నీ ఖరీదైనవే. దాని కోసం అన్నీ బెస్ట్‌వే సెలక్ట్ చేశాం. ఏదీ తక్కువ చేయలేదు... కానీ అదే యిలా చేసింది.. ఏ చీర నప్పుతుందో డిసైడ్ చేసుకోలేక పోయేది కానీ జీవితంలో పెద్దపెద్ద విషయాలు  తనంతట తనే డిసైడ్ చేసుకో గలుగుతాననుకుంది.. హుఁ.. యీ కాలపు పిల్లల గురించి ఏం చెప్తాం? ఇంతకీ చీర కలరేమిటి?’’

ఆవిడ గొంతులో గాంభీర్యం, విషాదం రెండూ తొంగి చూశాయి. ఏదో జరిగిందని నాకర్థమైంది. సంభాషణ కొనసాగించే ధైర్యం వచ్చింది. ఫోన్ ఎక్కణ్నుంచి వచ్చిందో వాళ్లకు తెలియదు. ఒకవేళ కష్టపడి తెలుసుకున్నా, ఎవరో కస్టమరు చేసుంటాడండి అని బుకాయించవచ్చు. ‘‘మేడమ్ తన పెళ్లికి పిలుస్తానని ఎప్పుడూ అంటూండేవారు. పెళ్లయిపోయిందని పనిమనిషి చెప్తోంది. ఈసారి మేడమ్ వచ్చినప్పుడు ‘పెళ్లికి పిలవలేదేంటండి? నన్ను మర్చిపోయారా?’ అని తప్పకుండా అడుగుతాను.’’ అన్నాను, ఫిర్యాదు చేస్తున్నట్లు.

ఆవిడలో తల్లి మేల్కొంది. ‘‘పెళ్లి గ్రాండ్‌గా చేసి మీలాటి వాళ్లందర్నీ పిలుద్దామని మేమూ అనుకున్నాం. కానీ ఏం చేస్తాం? అది తెచ్చిపెట్టిన చిక్కుతో అంతా హడావుడిగా చేయాల్సి వచ్చింది. అప్పటికప్పుడు అబ్బాయిని వెతకడం, పెళ్లి ఏర్పాట్లు చేయడం.. అంతా కంగాళీ అయిపోయింది. నీలాగే చాలామంది అడుగుతున్నారు. సమాధానం చెప్పలేక ఛస్తున్నాను.’’ అందావిడ సగం విసుగుతో, సగం కోపంతో. అంతలోనే ఆవిడ గాంభీర్యాన్ని తిరిగి తెచ్చుకుంది. ‘‘సరేలే, మీ అడ్రసేమిటో చెప్పండి, రాసుకుంటాను. లక్ష్మీ, కాగితం, పెన్నూ పట్టుకురా...’’ అంది.

ఠక్కున ఫోన్ పెట్టేశాను. ఇప్పుడు విషయం అర్థమై పోయింది. మన మ్యాన్ ఫ్రైడే 7536792 అమ్మాయితో శృంగారం వెలగబెట్టాడు. దాంతో ఆ అమ్మాయికి కడుపో, కాలో వచ్చి ఉంటుంది. అమ్మాయి తలిదండ్రులు వీణ్ని నిలదీస్తే చేసుకోనని అని ఉంటాడు. దాంతో వాళ్లు ఎవడో వెర్రిబాగులాణ్ని వెతికిపట్టి హడావుడిగా పెళ్లి చేసేశారు. రుచి మరిగిన మనవాడు కొన్నాళ్లు అణిగి ఉండి, యిప్పుడీ 6498701 అమ్మాయిని పట్టాడు. ప్రస్తుతానికి నెమ్మదిగా దువ్వుతున్నాడు. త్వరలోనే ఆమెను కూడా పెళ్లికాని తల్లిని చేయబోతాడు.

అదే పాత కథ. మహాభారతం నాటి నుంచి అదే కథ మళ్లీమళ్లీ జరుగుతూనే ఉంది. మగవాడు, ఆడది కలుస్తారు. ఆడది గర్భవతి అవుతుంది. మగవాడు మాయమౌతాడు. తుమ్మెదలా యింకో పుష్పం దగ్గరకి వెళ్లిపోతాడు. ఆడది నింద మోస్తుంది. తిరగబడితే శకుంతల అవుతుంది. రాజుల దగ్గర కొలువు చేశాడు కాబట్టి కాళిదాసు దుష్యంతుడు మునిశాపం వల్ల మర్చిపోయాడని కల్పించి నాటకం రాశాడు. రాయకపోయినా సమాజం మొగవాణ్ని ఏమీ అనదు. ఆడదాన్ని మాత్రం జాగ్రత్తగా ఉండద్దా అంటుంది. అమ్మాయిని కట్టడిలో పెట్టుకోవద్దా అని ఆమె తలిదండ్రులకే చివాట్లు పడతాయి. ఇవన్నీ తెలిసి కూడా, ప్రకృతి సైతం తమకే అన్యాయం చేస్తుందని ఎరిగి కూడా, అమ్మాయిలు సాహసిస్తూనే ఉంటారు. తను వలచినవాడు అలాటివాడు కాదనుకుంటారు.

ఇప్పుడు నేనేం చేయాలి? 6498701 అమ్మాయికో, లేకపోతే వాళ్ల అమ్మానాన్నలకో ఫోన్ చేసి వీడితో జాగ్రత్త సుమా అని చెప్పాలా? వీడి ఊరూ, పేరూ, రూపురేఖలు తెలియకపోయినా ఫలానా యీ టైముకి మీ యింటికి ఫోన్ వచ్చినపుడు చాటుగా విని పట్టుకోండి, లేకపోతే ఆ వేళకి మా బూత్‌కి రండి అని చెప్పగలను కదా!

కానీ నేనెందుకు చెప్పాలి? చెప్తే మ్యాన్ ఫ్రైడే గాడు నా మీద పగ తీర్చుకుంటాడు. నా బూత్‌ను ధ్వంసం చేసి పడేస్తాడు. గూండాల చేత తన్నిస్తాడు. పోనీ కదాని నీకు బూత్ యిప్పిస్తే, యిలాటి వాటిల్లో తలదూర్చమని ఎవడు చెప్పాడయ్యా అని లోను యిప్పించిన ఆఫీసర్లు తిట్టిపోస్తారు. రోజూ రేడియోలో యివే వార్తలు కదా, కథల్లో, నవలల్లో, సినిమాల్లో మనకు వినబడే అనేకమంది అభాగినుల్లో యీమె కూడా ఒకత్తవుతుంది. అయినా ఆ అమ్మాయికి రిస్కు తీసుకోవాలన్న ఉబలాటం, చాటుమాటు శృంగారంపై అంత బులబాటం ఉంటే చెడగొట్టడానికి మధ్యలో నేనెవణ్ని? చెడగొట్టి నేను సాధించిందేముంది? ఒక మంచి కస్టమర్ని, ఖర్మ కాలితే కాలో, చెయ్యో పోగొట్టుకోవడం తప్ప!

నా వాదన ఎక్కడో విన్నట్టుందా? అవును, నాదీ విసుగు పుట్టించే పాత కథే! సంబంధం లేకపోయినా కుతూహం కొద్దీ కూపీలాగి, తగు సమయంలో హెచ్చరించడానికి వెనకాడే మనిషి కథే!

ఇది 26 ఏళ్ల క్రితం నాటి కథ. ఇప్పటికీ యిది వర్తిస్తుంది. పేపరు తెరిస్తే, టీవీ ఆన్ చేస్తే యిలాటి కథలు రోజుకి రెండు మూడైనా కనబడతాయి. టెలిఫోన్ బూతులు పోయాయి, సెల్‌ఫోన్లు వచ్చాయి. నగ్న వీడియో వాట్సప్ కాల్స్ వచ్చాయి. ఫేస్‌బుక్‌లు వచ్చాయి. ఆడవాళ్లు మోసపోయే మార్గాలు మరిన్ని పెరిగాయి. వాళ్ల అజాగ్రత్తా పెరిగింది. గతంలో కంటె స్త్రీలలో ఎవేర్‌నెస్ పెరిగింది. అయినా స్వభావంలో మార్పు రావటం లేదు. ఏం చూసుకుని వాళ్ల ధైర్యమో నాకు యిప్పటికీ అర్థం కాదు.

వచ్చే నెల నాలుగో బుధవారం మరొక స్వీయానువాద కథ.

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?