Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ కథ: చివరి కోరిక

ఎమ్బీయస్ కథ:  చివరి కోరిక

ఇది స్వీయానువాదం కేటగిరీలోకి రాదు. నేను రాసిన ‘‘ద లాస్ట్ విష్’’ ఇంగ్లీషు కథను ఇంగ్లీషు ప్రొఫెసర్, అనువాదకురాలు డా. భార్గవీ రావు ‘‘చివరి కోరిక’’గా తెలుగులోకి అనువదించారు. విపుల వారు  1991 మే సంచికలో ప్రచురించారు. ‘‘ద లాస్ట్ విష్’’ నా తొలి ఇంగ్లీషు కథ. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, తమిళనాడు ఎడిషన్స్ వారు 1987 నవంబరు 14న ప్రచురించారు. కథకు ఇన్‌స్పిరేషన్ ఎక్కణ్నుంచి వచ్చిందో చివర్లో చెప్తాను. ముందుగా కథ.

చివరి కోరిక

ఆగస్టు 23

ఈ రోజు శ్రావణ పూర్ణిమ. నాకెంతో ఆనందంగా అనిపిస్తోంది. చాలా రోజుల తరువాత మళ్లీ డైరీ రాస్తున్నాను. నేను అరెస్టు అయి ఇక్కడికొచ్చాక డైరీ రాయడం మానేశాను. నేను అరెస్టు అవడానికి కారణం నా డైరీయే. నా డైరీలో నేను రాసుకున్న విషయాలనే సాక్ష్యంగా తీసుకుని నా భార్యను చంపానన్న ఆరోపణపై నన్ను అరెస్టు చేశారు. కాని ఇవాళెందుకో నా ఆలోచనల్ని కాగితంమీద పెట్టాలనిపిస్తోంది. ఎలాగూ ఇంకొన్ని రోజుల్లో నన్ను ఉరి తీస్తారు. అలాంటప్పుడు నేను ఏం రాసుకుంటే ఏం పోయింది?

ఈ రోజు ఉదయం ఒకమ్మాయి నాకు రాఖీ కట్టాలని వచ్చింది. నా వాళ్లెవరూ పట్టించుకోక జైలులో మగ్గిపోతున్న నాకు రాఖీ కట్టిన ఆ అమ్మాయిని చూసి మనసు ఆర్ద్రమయింది. "ఈ స్నేహబంధానికి మారుగా నీ కేమివ్వగలను చెల్లీ" అన్నాను నా దగ్గరివ్వడానికేమీ లేదని తెలిసి కూడా.

కాని ఆమె కోరిక నన్ను దిగ్భ్రాంతుణ్ణి చేసింది. నా మూత్రపిండం దానం చేయమంది. ఆమె ఏమడుగుతోందో నాకర్థం కాలేదు. ఆమె వివరంగా నచ్చచెప్పింది. నా జీవితానికేమీ హాని కలగకుండా నా మూత్రపిండం వేరొకళ్లకి ఇవ్వచ్చుట. నేను వెంటనే సరేనన్నాను కాని అదెలా సాధ్యమో నాకు తెలీలేదు. వాళ్ళ ‘సమాజం’ అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఆమె నాకు చెప్పింది. వీరూని, రాజూనీ కూడా కలుసుకోమని ఆమెకు చెప్పాను. జగన్నాధం ద్వారా కబురు కూడా పంపించాను.

ఆగస్టు 24

చాలా రోజుల తరువాత నిన్నరాత్రి కంటి నిండా నిద్రపోయాను. నిన్న జరిగిన సంఘటన కలా నిజమా అని ఆలోచించే లోపలే జగన్నాధం వచ్చి వీరూ, రాజూ కూడా వాళ్ల మూత్రపిండాల్ని దానం చేయటానికి ఒప్పుకున్నట్టు చెప్పాడు. ఎంత చిత్రం! నా మాట మేరకు ఒక హత్య చేసిన వీళ్లే, నా భార్యను చంపిన వీళ్లే నా మాట విని మరో మనిషికి ప్రాణదానం కూడా చేస్తున్నారు.

ఆగస్టు 26

మేం మూత్రపిండం దానంచేసే విషయం అన్ని పత్రికలు ప్రచురించాయి. ఎప్పుడూ రాజకీయాల గొడవలే రాసే పత్రికలు ఇలాటి విషయాల్ని ప్రచురించడం, అందులోనూ నా పేరు ఒక మంచిపనితో ముడిపెట్టి ప్రస్తావించబడటం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.

ఆగస్టు 28

“సమాజం' నుండి గురూజీ మమ్మల్ని కలవడానికి వచ్చారు. ఇంత మంచి పని చేస్తున్నందుకు దీవించి మేం చేసిన పాపాలన్నీ దీనితో హరించి పోతాయన్నారు. నాకు అంతగా నమ్మకం కలగలేదు కానీ వీరూకి, రాజుకి బాగా నమ్మకం కుదిరి ఏదో బరువు దింపుకున్నట్టుగా కనిపించారు. చాలామంది తమ మూత్రపిండాలను లక్ష రూపాయలకు అమ్ముకుంటారని గురూజీగారు చెప్పారు. మాకు డబ్బు అవసరం లేదని ముగ్గురం ముక్తకంఠంతో చెప్పాం.

ఆగస్టు 30

పత్రికలో ప్రకటనచూసి చాలామంది మెచ్చుకుంటూ సంపాదకుడికి లేఖలు రాశారు. మమ్మల్ని కలుసుకోడానికి కాలేజీ స్టూడెంట్స్, ఇంటర్వ్యూలు చేయడానికి పత్రికా విలేకర్లు వచ్చారు. ఇంత ప్రోత్సాహం ఆదరణ లభిస్తుంటే మూత్రపిండాలేమిటి, ప్రాణమే యిచ్చేయవచ్చనిపించింది.

సెప్టెంబరు 1

నా సొంత చెల్లెలు రాధ తన తోడికోడల్ని వెంటబెట్టుకుని నన్ను కలవడానికి వచ్చింది. వాళ్లెవరూ ఇప్పుడు నన్ను వెలివేసినవాడి లాగ చూడ్డం లేదు. వీరూని, రాజుని వాళ్ల బంధువులు ఎన్నడూ వెలివేయలేదు. వాళ్లు చదువూ సంధ్యా లేని 'అలగా జాతి' వాళ్లు కదా! కాని సంస్కారం ఉందని చెప్పుకునే మధ్యతరగతి కుటుంబంలో ఒకసారి తెలిసో తెలియకో తప్పుచేస్తే ఆ మనిషిని జన్మలో క్షమించరు. ఈ కిడ్నీ డొనేషను ధర్మమాని వాళ్లు కూడా మనసు మార్చుకుని నన్ను చూడ్డానికి వచ్చారు. “నిన్ను ఇప్పుడు నా అన్నయ్య అని చెప్పుకోడానికి గర్వపడుతున్నాను” అంది రాధ. కానీ నాకా విషయం గొప్పగా ఏమీ అనిపించలేదు.

సెప్టెంబరు 5

మేమిచ్చిన ఇంటర్వ్యూలు అన్ని పత్రికలూ ప్రముఖంగా ప్రచురించాయి. అవన్నీ నా అభిప్రాయాల్ని ప్రస్తావించి, నన్ను పొగుడుతూ రాశాయి. వీరూని, రాజుని ఊరికే నామమాత్రంగా ప్రస్తావించారు. అది నాకు నచ్చలేదు. నా త్యాగం కంటే వారి త్యాగమే గొప్ప. నాలాగ వాళ్లు ఉరికంబం ఎక్కబోవటం లేదు. నా మాట విని నేరం చేసినందుకు వాళ్లకు ఆజన్మాంతం జైలు శిక్ష పడింది, చదువూసంధ్యా లేకపోయినా, కిడ్నీ డొనేషన్ సంగతి తెలీకపోయినా ఆపరేషనుకు భయపడక ఒప్పుకున్నారు. లక్షరూపాయలు కూడా వద్దన్నారు. నిజానికి వాళ్లు ఆ డబ్బు తీసుకుని జైలు నుండి విడుదలయ్యాక ఏదేనా కొత్త జీవితం మొదలు పెట్టి వుండవచ్చు.

వాళ్ల అభిప్రాయాలను నాకు మల్లె చక్కని మాటల్లో చెప్పలేకపోవడం వల్ల పత్రికల్లో వాళ్ల గురించి ఎక్కువగా రాయలేదు. నేను ఆత్మశోధన, త్యాగం, పాపపరిహారం వంటి పెద్ద పెద్ద మాటలు వాడాను. వీరూని, రాజుని ప్రశ్నలడిగినప్పుడు వాళ్లు నవ్వి వూరుకున్నారు. చదువుకున్నవాళ్లు మాటల గారడీతో అనవసరంగా గొప్పవాళ్లయి పోతారు!

సెప్టెంబరు 5

ఈ రోజు ఉదయం పేపర్లో ఒక ఉత్తరం పడింది. అందులో నేను కిడ్నీ డొనేట్ చెయ్యడం పేరు తెచ్చుకోవడం కోసం ఆడిన నాటకమనీ, నేరం నుంచి జనం దృష్టిని మరల్చే ఆకర్షించే ఒక ఎత్తు అనీ వ్యాఖ్యానించారు. దీన్ని అడ్డుగా పెట్టుకుని ఉరిశిక్షను రద్దు చేసుకోవాలని ప్రయత్నించబోతున్నాననీ, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరితే ఆయనా సుముఖంగా ఆలోచించవలసి వస్తుందనీ రాశారు. నాకలాటి ఉద్దేశం లేదని ఎలా నమ్మించగలను? కొంతమంది ఎపుడూ అందర్నీ అనుమానంగానే చూస్తారు. ఆ ఉత్తరం నా ముఖానికి ఎదురుగా పెట్టి ‘ఇప్పుడేమనిపిస్తోంది, హీరోగారూ!’ అని హేళనగా అడిగాడు వార్డెను. నాకెందుకో ఇతన్ని చూస్తే అసహ్యం. మేం చేసిన మంచి పనిని ఒక్కసారి కూడా అతను మెచ్చుకోలేదు. అతనికిదంతా ఏదో తమాషా వ్యవహారంలా అనిపిస్తున్నట్టుంది.

సెప్టెంబరు 10

నా రాఖీ చెల్లెలు వచ్చి అధికారులు నీ మూత్రపిండం తీసుకోడానికి నిరాకరించారని, వీరూ రాజులది మాత్రం తీసుకుంటారనీ చెప్పింది. అందుకు కారణాలేమిటో సరిగ్గా చెప్పలేకపోయింది. వాళ్ల కేవో రూల్సు ఉన్నాయిట. మరోసారి గురూజీ ద్వారా ప్రయత్నించమని అడిగాను.

సెప్టెంబరు 15

గురూజీ ఊళ్లో లేరట! విషయాలేమీ తెలీటం లేదు. నాకెందుకో చికాకుగా అనిపిస్తోంది. నా అప్లికేషను తోసిపుచ్చిన మాట నిజమా? ఈ విషయం వార్డెన్ను అడగాలనిపించలేదు. అసలే అతను హేళనగా మాట్లాడుతున్నాడు. కారణం అతనికి తెలిసే వుంటుంది కాని అతన్ని అడగదలుచుకోలేదు.

సెప్టెంబరు 21

గురూజీ ఈరోజు వచ్చారు. నాకన్ని విషయాలూ వివరంగా చెప్పారు. ఉరి తీయడానికి ముందు ఒక వ్యక్తి సంపూర్ణంగా ఆరోగ్యవంతుడై ఉండాలట. నేను మూత్రపిండం ఇవ్వడం వల్ల నా ఆరోగ్యం దెబ్బ తినవచ్చు. అందువల్ల నా అభ్యర్థనను త్రోసిపుచ్చారట. మొదట నాకు అర్థం కాలేదు. తరువాత గురూజీ తమాషా చేస్తున్నారా అనిపించింది. నిర్జీవమైన నా నవ్వు, కళ్లలో నీళ్లు చూసి గురూజీ నాచేత ఇంకో పిటిషను పెట్టించారు. నా కోరిక తీరేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు.

సెప్టెంబరు 22

నిన్న గురూజీని కలుసుకుని ప్రస్తావించిన విషయాలన్నీ ఒక పీడకలగా మరచిపోవాల నుకుంటున్నపుడు వంకరనవ్వు నవ్వుతూ మా జైలు వార్డెను ప్రత్యక్షమయ్యాడు. “హీరోనై పోదామనుకున్నావు గదూ” అన్నాడు వెక్కిరింతగా. అయితే ఈ సంగతి నిజమేనా? అధికార్లు ఒప్పుకున్నట్టు లేరు. ఏమిటీ పిచ్చి రూల్సు? ఎవర్ని ఉద్ధరించను? కొంచెం తెలివితేటల్ని ఉపయోగించి మానవతా దృష్టితో ఆలోచించవచ్చు కదా? నిజానికి ఈ బ్యూరోక్రసీని, అధికారవర్గాన్ని మంచీ చెడూ అని విశ్లేషించలేం. వాళ్లు రూల్సుకి కట్టుబడి నిరాసక్తంగా ఉంటారు. నిన్నమొన్నటి వరకూ నేనూ అలాటి వ్యవస్థలో ఉద్యోగినే కదా! అందుకే ఈ జైలు సూపర్నెంట్ దృష్టికోణాన్ని అర్థం చేనుకోగలను. కిడ్నీ డొనేషన్ వంటి పని చేస్తున్నందుకు నన్ను ప్రోత్సహిస్తే, రేపు మరో ఇద్దరు నన్ను అనుకరించాలని ప్రయత్నిస్తే, వాటిలో ఏవైనా చిక్కులు తటస్థపడితే, లేనిపోని తలనొప్పి అనిపించటం అధికార్లకు సహజమే కదా!

సెప్టెంబరు 25

కిడ్నీ డొనేషన్ అనేది చాలా సామాన్యమయిన విషయం. అవతలి మనిషికి కావాల్సిందీ, అతని దగ్గర లేనిదీ నేనివ్వదలుచుకున్నాను. దీనికి వేరేవాళ్లు అభ్యంతర మెందుకు పెట్టాలి? నన్ను ఉరితీయ దల్చుకున్నపుడు వీళ్లకి నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎందుకు? నేనెలాగూ చావడం ఖాయం. ఆ కిడ్నీని నాతో తీసుకుపోవడం దేనికి? అవునూ, ఒకవేళ 'సమాజం' వారికి మంచి పేరొస్తుందని ఎవరేనా ఇలా అడ్డంకులు సృష్టిస్తున్నారా లేదా మనసుతో ఆలోచించలేని బ్యూరోక్రసీ బుద్ధే దీనికంతటికి మూలకారణమా? తెలియదు. తెలుసుకునే మార్గమూ లేదు.

అక్టోబరు 12

నా అభ్యర్ధనను తోసిపుచ్చుతూ పై అధికారుల నుండి ఫైనల్‌గా జవాబు వచ్చింది. దానితో బాటే వచ్చిన మరో ఉత్తరంలో ఆ పై శనివారం నాడు నన్ను ఉరి తీయడానికి నిశ్చయించినట్టుగా తెలిపారు. దాంతో నేను అన్నం ముట్టుకోకుండా రోజంతా సెల్ లోనే ఉండిపోయాను. ఏ పనీ చెయ్యాలనిపించలేదు. ఇలా ఎందుకయింది? నేనొక చెడ్డపని చేసినపుడు నన్నెవ్వరూ ఆపలేదు. ఇప్పుడొక మంచి పని చేస్తానంటే, ఒకరి ప్రాణం నిలబెడతానంటే ఎందుకిన్ని అడ్డుపుల్లలు? నేను ఆత్మసంతృప్తితో చనిపోతానన్న దుగ్ధ కామోసు. నేను శవంగా మారిపోయాక ఈ మూత్రపిండాలతో ఏం పని? నేను చచ్చేలోగా ఎలాగేనా ఒక మంచి పని చేసి చావాలి. ఏమైనా చేయాలి. ఎప్పుడో కాదు, ఇవాళే.. ఇప్పుడే...

డాక్టరు డైరీ చదవడం ఆపి ఇన్‌స్పెక్టర్ కళ్లలోకి సూటిగా చూశాడు. “..అంటే అతను ఆ రోజు రాత్రే జైల్లోంచి తప్పించుకు పోయాడన్నమాట”

“అవును, అతను మీ హాస్పిటలు గురించి వాకబు చేస్తుండగా మా వాళ్లు చూశారు. అతను తప్పించుకు పారిపోతుంటే వెంబడించి పిస్తోలుతో కాల్చారు. అందుకే ఈ పరిస్థితుల్లో మీ దగ్గరికి తీసుకొచ్చాం” అన్నాడు ఇన్స్‌పెక్టర్.

“ఏం ప్రయోజనం? ఇతను ఇంకొన్ని గంటల కంటే బ్రతకడు” అన్నాడు డాక్టర్.

అంతలో నర్సు అక్కడికి వచ్చి డాక్టరుతో పేషెంట్‌కి తెలివి వచ్చిందని చెప్పింది. ఇన్‌స్పెక్టరూ, డాక్టరూ ఇద్దరూ వార్డులోకి పరిగెత్తారు. పేషెంటు ఒళ్లంతా కట్లతో కళ్లు మూసుకుని మంచం మీద పడుకుని ఉన్నాడు. బరువుగా ఊపిరి పీలుస్తున్నాడు. ఇంకొన్ని క్షణాల్లో అతని జీవితం అంతరించి పోతుందని చెప్పడానికి ఎవరూ డాక్టర్లు కానవసరంలేదు.

డాక్టరు అతని దగ్గరకు వెళ్లి నాడి పరీక్షించి చూశాడు. పేషెంటు చాలా కష్టంతో ఏదో చెప్తున్నాడు సరిగ్గా వినిపించడం లేదు కూడా. “ఏం ప్రయోజనం లేదు. డాక్టర్... నేను చచ్చిపోతున్నాను... ఏమీ చెయ్యకుండానే ... కిడ్నీ ... వెధవ రూల్సు.. మనశ్శాంతి లేదు. డాక్టర్"

ఇప్పటివరకూ అతని డైరీ చదివిన డాక్టర్ అతని మాటల్లోనూ, సగం మూతబడిన కళ్లల్లోనూ నిజాయితీని చూడగలిగాడు. వణుకుతున్న గొంతుతో “నువ్వు నిజంగా ఎవరికేనా సాయం చేయదలుచు కున్నావా?” అని అడిగాడు.

“ఇది కూడా అర్థం చేసుకోలేరా?” అని వెక్కిరించినట్టుగా ఎండిపోయిన అతని పెదాలు నవ్వాయి. గద్గదమైన కంఠంతో డాక్టరు “అలా అయితే నీ కళ్ల నెందుకు దానం చెయ్యకూడదు? వాటినైతే నీ ప్రాణం పోయాక కూడా తీసుకోవచ్చు. నీ ప్రాణం ఉరికంబంపై కాకుండా ఇక్కడే పోతోంది కాబట్టి కళ్లు తీయడం సాధ్యమే” అన్నాడు డాక్టరు.

మూసుకుపోతున్న కళ్లలో ఒక్క చిన్న మెరుపు మెరిసింది. ఆ కళ్ళల్లో సంతోషం. తృప్తి కదిలాయి. దండం పెట్టడానికై రెండు చేతులూ జోడించాలని ప్రయత్నించాడు. అవి నిర్జీవంగా కిందికి జారబోతూండగానే ‘తప్పకుండా’ అన్నట్లు పెదాలు కదిలాయి.

డాక్టరు నిశ్శబ్దంగా కళ్లు తుడుచుకున్నాడు.

ఈ కథకు స్ఫూర్తినిచ్చింది, 30 11 1983 నాటి ‘‘ఇండియా టుడే’’లో వచ్చిన ఒక రిపోర్టు. గుజరాత్‌లోని రాజకోట్‌ జైల్లో ఉరిశిక్ష నెదుర్కుంటున్న పర్మార్ అనే వ్యక్తి తన మూత్రపిండాలను దానం చేస్తానని అర్జీ పెట్టుకున్నాడు. అయితే ఉరి తీయబడే వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, యీ దానం వలన అతని ఆరోగ్యం దెబ్బ తింటుందని లెక్క వేసిన జైలు అధికారులు అతని అభ్యర్థనను తిరస్కరించారు. ఉరి తీయబోయే ముందు సంపూర్ణ ఆరోగ్యం అనే థీమ్‌పై ‘‘అచానక్’’ (1973) హిందీ సినిమా వచ్చింది. భార్యను చంపిన నేరానికి ఒకతనికి ఉరిశిక్ష పడుతుంది. తప్పించుకుని పారిపోతూంటే పోలీసు కాల్పులు జరుగుతాయి. మృత్యుముఖంలో ఉన్న అతనికి డాక్టర్లు ప్రాణం పోసి బతికిస్తారు. తీరా చూస్తే అతను సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాక జైలు అధికారులు వచ్చి అతన్ని తీసుకుని పోతారు – ఉరి తీయడానికి! వైద్యుడు తన విధిని నిర్వహిస్తే, జైలు అధికారి తన విధిని నిర్వహించాడు. అతను ఆసుపత్రిలోనే చనిపోతే కళ్లు డామేజి కావు కదా, కనీసం నేత్రదానం చేసే అవకాశం వస్తుంది కదా అనే ఊహతో కల్పించిన కథ యిది. మరో అనువాద కథ వచ్చే నెల నాలుగో బుధవారం.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?