cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍ కథ: నాలోని కవి

ఎమ్బీయస్‍ కథ: నాలోని కవి

‘‘నాకు తెలిసున్న లైబ్రేరియన్ ఉన్నాడు.’’ అని మొదలుపెట్టారు, ఫైనాన్స్ డిపార్టుమెంటులో సెక్రటరీగా ఉన్న వివేకమూర్తి. ‘‘పదేళ్ల క్రితం ఓ ముఖ్యమంత్రిగారికి అమెరికా తెలుగు సంఘం వారు న్యూజెర్సీలో సన్మానం చేస్తూంటే తోడుగా వెళ్లాల్సి వచ్చింది. అక్కడొక ఎన్నారై పరిచయమయ్యాడు. తెలుగు భాషాభిమాని. తిరిగి వచ్చిన ఓ ఏడాదికి నాకు ఫోన్ చేసి, ఒక ప్రాజెక్టు తలపెట్టా, సాయం చేయండి అన్నాడు. అదేమిటంటే, తెలుగులో వచ్చిన పుస్తకాలన్నీ కేటలాగు చేయించాలట. కేటలాగు అంటే పేరు వగైరాలు రాసి ఊరుకోవడం కాదు. ప్రతీ పుస్తకం చదివి, దాని సారాంశాన్ని ఐదారు అరఠావులలో రాసి యివ్వాలి.

‘ఎందుకండీ, యిప్పటికే సాహిత్యవిమర్శలు అంటూ వ్యాసాలున్నాయిగా’ అన్నాను. ‘అబ్బే, అవన్నీ కొందరి గురించే చెప్తాయండి. కవిత్వం అనగానే విశ్వనాథ, శ్రీశ్రీ, దేవులపల్లి.. అని, కథ అనగానే గురజాడ, శ్రీపాద, మల్లాది.. అని. ఎప్పుడూ అవే పేర్లు. పెద్దగా తెలియని కవులు ఎందరో ఉంటారు. వారు కూడా ఒకటో, రెండో గొప్ప రచనలు చేసి ఉండవచ్చు. కొందరి రచనలు అచ్చుకు కూడా నోచుకుని ఉండకపోవచ్చు. వాళ్లందరినీ వెలుగులోకి తీసుకురావాలి. కనీసం పరిచయం చేయాలి. ముద్రిత రచనల పని అయ్యాక, అముద్రిత రచనల గురించి కూడా కష్టపడదాం. ఎవరినైనా మంచివాణ్ని చూపించండి. పుస్తకానికి వెయ్యి యిస్తాను.’ అన్నాడతను. ఎవరినైనా సూచించవయ్యా అని ఒక సీనియర్ జర్నలిస్టు నడిగితే లైబ్రేరియన్ సుందరం పేరు చెప్పాడు. ‘స్వీటు షాపు వాడికి స్వీట్లంటే వెగటు పుడుతుందన్నట్లు, పుస్తకాలు చుట్టూ ఉండడంతో సాధారణంగా లైబ్రేరియన్లు పుస్తకాలు చదవరండి. కానీ యితను బాగా చదువుతాడు. పుస్తకావిష్కరణ సభల కవరేజికి వెళ్లినపుడు తారసపడుతూంటాడు. ఇంకా పెళ్లి కాలేదు. మర్యాదస్తుడు. పైగా అతను పని చేసే లైబ్రరీ చాలా పురాతనమైనది, ఎక్కడా దొరకని పాత పుస్తకాలు అక్కడే చాలా ఉన్నాయి.’ అని చెప్పడంతో పిలిచి మాట్లాడి, పని అప్పచెప్పాను. మొదట అరుదైన పుస్తకాలతో పని ప్రారంభించమన్నాను.

‘‘..నాకు తెలిసిపోయింది. ఆ వెతుకులాటలో అద్భుత కథాసంకలనం అనే పుస్తకం దొరికిందని మూర్తిగారు చెప్పబోతున్నారు.’’ అన్నాడొక శ్రోత.

మూర్తి అతని కేసి తీక్ష్ణంగా చూసి, ‘‘నేను చెప్పేది కథ కాదు బాబూ, నిజంగా జరిగిన సంఘటన. ఆ సుందరానికి సంబంధించిన కథ. ఏదో పుస్తకంలో చదివి, చెపుతున్న కథ కాదు.’’ అన్నారు. ఆ శ్రోత సారీ అని ఊరుకున్నాడు. మూర్తి తన కథనం కొనసాగించారు.  ‘మూడు నెలల పాటు పని బాగా జరిగింది. ఎన్నారై చాలా సంతోషపడ్డాడు. ప్రతీ నెలా ఠంచనుగా డబ్బు పంపేసేవాడు కూడా. ఆ తర్వాత రెండు నెలలపాటు ఏ పనీ జరగలేదు. అతనికో, యింట్లో వాళ్లకో ఒంట్లో బాగా లేదేమోననుకుని ఊరుకున్నాడు. చివరకు నాకు ఫోన్ చేసి సంగతి కనుక్కోమన్నాడు. కబురు పెట్టాను. వచ్చాడు. బాగా చిక్కిపోయాడు. జబ్బేమిటన్నాను. ప్రత్యేకంగా ఏమీ లేదండి, పని చేద్దామనే అనుకుంటున్నాను. కానీ చేయలేక పోతున్నాను అన్నాడు.

ప్రభుత్వాస్పత్రి సూపర్నెంటుకి ఫోన్ చేసి చెప్తాను. వెళ్లి థరోగా టెస్టులు చేయించుకో అన్నాను. శారీరకంగా యిబ్బందులేమీ లేవండి, మెంటల్‌గానే డిస్టర్బ్ అయ్యాను అన్నాడతను. ‘‘అలా అయితే సైకియాట్రిస్టు దగ్గరకు పంపుతాను.’’ అన్నాను. ‘‘భలేవారే! నాకు పిచ్చా, ఏమైనానా?’’ అని అతను వెళ్లిపోయాడు. మూడు వారాలు పోయాక తనే వచ్చి ‘‘సైకియాట్రిస్టు అన్నారు కదా, కాస్త చెపుతారా?’’ అని అడిగాడు. డాక్టరు రవిశంకర్ అని మంచి ఫ్రెండు. అతని దగ్గరకు పంపించాను. ఐదారు వారాలయ్యాక రవిశంకర్ ఫోన్ చేశాడు. ‘‘మూర్తిగారూ, నేను మీకెప్పుడైనా తెలిసో తెలియకో ద్రోహం చేశానా?’’ అన్నాడు సీరియస్‌గా. అదేం ప్రశ్నయ్యా? అంటే ‘‘లేకపోతే నా ప్రాక్టీసుకే ఎసరు పెట్టారేమిటండీ బాబూ! ‘‘తెనాలి’’ సినిమాలో సైకియాట్రిస్టు మీద అసూయ కొద్దీ ఓ పేషంటును తగిలిస్తారు. చివరకు డాక్టరుకే పిచ్చెక్కుతుంది. అలా ఉంది మీరు పంపించినతని వ్యవహారం.’’ అంటూ పకపకా నవ్వాడు. ‘‘ఏం? ఏవైంది?’’ అని అడిగితే ‘‘ఫోన్‌లో చెప్పడం కుదరదు. సాయంత్రం క్లబ్బుకి రండి.’’ అన్నాడు.  

క్లబ్బులో కుశలప్రశ్నలు కాగానే మొదలుపెట్టాడు. ‘‘1900లలో శ్రీకాకుళం ప్రాంతాల్లో ఒకతను ఉండేవాడు. తన పేరులో పొడి అక్షరాలు కలిపి క.వి. అని పెట్టుకున్నాడు...’ అని మొదలుపెట్టాడు. ‘సుందరం గురించి చెప్తానని మొదలుపెట్టి, అసందర్భంగా ఎవడో కవి గురించి చెప్తావేమిటి?’ అని అడిగితే ‘మీరు కాస్త ఓపిగ్గా వినాలి. సంబంధం లేని విషయాలు చెప్తానని ఎలా అనుకున్నారు?’ అని ఎదురు ప్రశ్నించాడు. సరే కానీయమన్నాను.

ఈ కవి అప్పటికి కొత్తరకం కవిట. అప్పట్లో అందరూ ఛందస్సు, యతిప్రాసలు పాటిస్తూ పద్యాలు రాస్తే యితను వేరే తరహా కవిత్వం రాశాడు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఎవరికీ అర్థం కాకపోవడం చేతనే తనకు గుర్తింపు రాలేదని అతనికి బాధగా ఉండేది. తన తర్వాత వచ్చిన కొందరు ఆధునిక విధానంలో పద్యాలు రాస్తున్నామంటూ ప్రకటించుకుని పేరుప్రఖ్యాతులు తెచ్చుకోవడంతో అతనికి మండింది. వాళ్లకంటె ముందుగానే తను ప్రయోగాలు చేశానని, పల్లెటూళ్లో పడి వుండడం చేత, చిన్న ఉద్యోగంలో యిరుక్కుపోయి, డబ్బు లేకపోవడం చేత ఆదరణ లేకుండా పోయిందని చాలా బాధపడ్డాడు. తన కవితలో మేలైనవి అని అనుకున్నవి ఎంచి, సంకలనం చేశాడు. పస్తులుండి, డబ్బు కూడబెట్టి, ఓ పుస్తకం అచ్చేయించాడు. అయితే దాని ఆవిష్కరణ కూడా జరగలేదు. జనం యితన్ని ఒక పిచ్చివాడిగా జమకట్టడం చేత, బతిమాలినా పుస్తకం చదవలేదు.

నిరాశానిస్పృహలతో అతను ఉద్యోగం మానేశాడు. భార్యను విడిచేశాడు. కాపాలికులతో స్నేహం చేశాడు. గంజాయి తాగి, చీర కట్టుకుని, గంటల తరబడి తన గదిలో ఒక్కడూ ఏవేవో మంత్రాలు చదువుతూ గడిపేవాడు. మధ్యమధ్యలో తన కవితలు, వాటికి తనే వాహ్వాలు... సమాజం అతన్ని దూరంగా పెట్టేసింది. ఇలాటి బాపతు వాళ్లు నలుగురైదుగురు చేరువయ్యారు. అందరూ శ్మశానంలో చేరి దమ్ము కొట్టేవాళ్లు. దురలవాట్లతో, మనోవ్యథతో అకాలమృత్యువు దాపురించింది. ఆ సమయంలో అతనొక పని చేశాడు. తన ఆత్మను ఓ క్షుద్రశక్తికి అమ్మివేశాడు.

డాక్టరు యిక్కడిదాకా చెప్పేటప్పటికి నేను అడ్డు తగిలాను. ‘ఇదేమైనా సైతాను ఆత్మ అమ్మే ఇంగ్లీషు నవలా? హాలీవుడ్ సినిమానా? క్షుద్రశక్తికి అమ్ముడుపోవడమేమిటయ్యా? మతి లేకుండా మాట్లాడుతున్నావు’ అని చివాట్లేశాను. ‘‘మూర్తిగారూ, యీ అమ్మకాలూ, కొనడాలూ కవిగారే చెప్పాడు. నేను కల్పించింది కాదు.’’ అని డాక్టరన్నాడు.

‘‘ఏవిటి? వందేళ్ల క్రితం నాటి కవి కూడా నీ క్లయింటు అయ్యాడా?’’

‘‘అబ్బే, సుందరం చెప్పాడండి... ఆగండాగండి... కవి తనకు చెప్పాడని సుందరం నాకు చెప్పాడు. కవి సుందరానికి మాత్రం ఎలా చెప్పాడని మీ ప్రశ్న కదా, కథ సరిగ్గా వింటే తప్ప అర్థం కాదు.’’

నేను పళ్లు నూరుకుని, కానిమ్మన్నట్లు చేత్తో సైగ చేశాను.

‘‘ఈ కవి ఇంగ్లీషు పుస్తకాలూ అవీ బాగా చదివేవాడు. సైతానుకి అత్మ అమ్ముకోవడం అనే కాన్సెప్టు అతని మనసులో బాగా యింకింది. అది చూసి ఎవడో గానీ యీ ఏర్పాటు చేసినట్లు మనం అనుకోవాలి. ఆత్మను తనకు అమ్ముకున్నందుకు ఆ క్షుద్రశక్తి యిచ్చిన వరం ఏమిటంటే, అతని పుస్తకాన్ని తొలిసారిగా ఎవరైతే చదువుతారో, వాళ్ల శరీరంలోకి యితని దెయ్యం ప్రవేశించి దానిలో తిష్ట వేయవచ్చు. అతని ద్వారా తనకు కావలసిన పనులు చేయించుకోవచ్చు..’’

‘‘ఆగాగు, కొద్దిగా అర్థమవుతోంది. నేను అప్పగించిన పనిలో భాగంగా సుందరం అతని పుస్తకాన్ని చదివాడు. వందేళ్లగా ఎవరూ ముట్టుకోని ఆ పుస్తకం తొలి పాఠకుడు అతనే కావడంతో ఆ కవి ఆత్మ యితనిలో ప్రవేశించి యిబ్బంది పెడుతోంది. ఇతన్ని మానసిక రోగిగా మార్చింది. అంతేనా?’’

‘‘కరక్టుగా చెప్పారు.’’ అన్నాడు డాక్టరు ఆనందంగా.

‘‘ఛస్, సైకియాట్రిస్టువై ఉండి యీ దెయ్యాల కథలు ఎలా నమ్ముతున్నావయ్యా? ఇదేదో అరేబియన్ నైట్స్‌ జాలరి ఒకడు సముద్రంలో దొరికిన జాడీ మూత తీస్తే, వందల ఏళ్ల భూతం బయటకు వచ్చిన కథలా ఉందింది. అక్కడ జాడీలో దాక్కుంటే, యిక్కడ పుస్తకంలో దాక్కుందా?’’

డాక్టరు రవిశంకర్ నా చేతులు పట్టుకున్నాడు. ‘‘అరవకండి మూర్తిగారూ, నా కెరియర్‌లో యిలాటి కేసు తగల్లేదు. సుందరం చెప్పినప్పుడు నేను నమ్మలేదు కూడా. కానీ అతను చెప్పిన సంగతులు చూడబోతే యింకెలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు. ఒక రోజు రాత్రి ఆ కవి పుస్తకం మొదలుపెట్టాడు.  కాస్త చదివి పడుక్కున్నాడు. మర్నాడు పొద్దున లేచేసరికి, సిగరెట్టు కాల్చబుద్ధయింది. కాలేజీ రోజుల్లో సిగరెట్టు కాల్చేవాట్ట కానీ, లైబ్రేరియన్‌గా ఉద్యోగం వచ్చాక మానేశాడు. ఏడేళ్ల తర్వాత యిప్పుడీ కోరిక బలంగా కలగడమేమిటాని ఆశ్చర్యపడ్డాడు. మళ్లీ మొదలెడితే మానడం కష్టమని, సిగరెట్టు తాగకుండానే డ్యూటీకి వెళ్లిపోయాడు. సాయంత్రానికి విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఇంటికి వచ్చేటప్పుడు తలనొప్పి మాత్ర తెచ్చుకుని వేసుకున్నాడు. ఆ రోజు పుస్తకం ఎక్కువసేపు చదవబుద్ధి కాలేదు. తెల్లవారుతూండగా అతనికి కల వచ్చింది. ఒక గది నిండా పొగ, చాలామంది తాపీగా కూర్చుని ఉన్నారు. పొగాకు, మరుగుతున్న నీళ్లు గిన్నెల్లో ఉన్నాయి. మనసులో ‘హుక్కా’ అని తట్టింది.

మెలకువ వచ్చేసింది. వస్తూనే తను పడుక్కోబోయేముందు చదివిన కవిత పేరు హుక్కా అని గుర్తుకు వచ్చింది. అందువలననే యీ కల అనుకున్నాడు. లేచి కూర్చుని దాన్ని చదివాడు. నాలుగు లైన్లు చదివేసరికి, చెత్తగా ఉందని తోచింది. తన నోట్సులో ఆ పాయింట్లు రాసి పెట్టుకున్నాడు. రోజంతా మనసు పొగాకు మీదకు పోతూనే ఉంది. సాయంత్రానికి భరించలేక సిగరెట్లు కొన్నాడు. తను మానేసిన తర్వాత రేటు చాలా పెరిగిందని గమనించి ఆశ్చర్యపడ్డాడు. ఇంటికి వచ్చి సిగరెట్టు కాల్చినా తృప్తి పడలేదు. ఇదేం సిగరెట్టు? ఇంకా బాగా ఘాటుగా ఉండాలి, బీడీ కాల్చాలి అని తోచిందతనికి. బట్టలు మార్చుకుని, మళ్లీ బయటకు వెళ్లి బీడీలు కొనుక్కుని వచ్చి కాలిస్తే హమ్మయ్య అనిపించింది. వెంటనే తనెప్పుడూ బీడీ కాల్చలేదన్న సంగతి గుర్తుకు వచ్చింది. ఇప్పుడెందుకు కాల్చాలనిపించింది? ఏమో!

భోజనం తర్వాత తన బట్టల అల్మయిరా వెతకాలని తోచింది. వెతికాడు. దేని కోసం వెతుకుతున్నాడో తెలియకుండానే చాలా సేపు వెతికాడు. ఆయాసం వచ్చి కూలబడ్డాక గుర్తుకు వచ్చింది, తను లాల్చీ కోసం వెతికినట్లు! అంతలోనే నవ్వు వచ్చింది, తనకు లాల్చీయే లేదని! తనెప్పుడూ కొనుక్కోని, వేసుకోని లాల్చీ కోసం వెతకడమేమిటి, వింతగా లేదూ! అనిపించింది. మర్నాడు తను తినే విధానంలో, తాగే విధానంలో మార్పు వచ్చినట్లు గమనించాడు. ఆఫీసుకి రోజూ వేసుకునే బూట్లు కాకుండా చిరిగిన చెప్పులు వేసుకుని వెళ్లాలనే కోరిక పుట్టినట్లు గమనించాడు. రోజులు గడిచేకొద్దీ ఏవేవో సంస్కృత మంత్రాలు తన బుఱ్ఱలో తిరుగాడుతున్నట్లూ గమనించాడు. తన మాటల్లో ఒడియా భాషాపదాలు దొర్లడం మరీ వింతగా తోచింది. తనకా భాషలు రానే రావు. తన రుచుల్లో, అభిరుచుల్లో మార్పు వస్తూండడం చూసి అతనికి గాభరా పుట్టింది. ఎందుకిలా జరుగుతోందో తెలియక కంగారు పడసాగాడు. పని మీద ధ్యాస తప్పింది. ఉద్యోగమైతే రొటీన్ కానీ, శ్రద్ధగా చేయాల్సిన మీ ప్రాజెక్టు పని వెనకపడింది.  

ఈ పుస్తకాన్ని పక్కన పెట్టి, వేరే పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. చదువుతూంటే ఎవరో తనతో పాటే చదువుతూ, తర్వాతి కథ ఏమవుతుందో ఊహించి చెప్పేస్తున్నట్లు తోచసాగింది. ఇదంతా ట్రాష్ యిది చదవడం వేస్ట్ అని చెప్తున్నట్లు అనిపించింది. వాకింగ్‌కు వెళితే కల్లు కాంపౌండు దగ్గర కాళ్లు ఆగిపోయేవి. గంజాయి సంపాదించి తాగాలని ఎవరో తొందర పెట్టినట్లు అనిపించేది. తను ఒకడా? ఇద్దరా? అనే అనుమానం పొడసూపింది. అదేం పిచ్చి ఆలోచన అని కొట్టి పారేశాడు. కానీ క్రమేపీ సైకియాట్రిస్టుకి చూపించుకుంటే మంచిదని తోచింది. అప్పుడు మీ ద్వారా నా దగ్గరకి వచ్చాడు. నేను ట్రీట్‌మెంట్ మొదలుపెట్టాను...’’

‘‘..ఓహో, యిది స్ప్లిట్ పెర్శనాలిటీ కేసా, మూర్తిగారూ! మరి వందేళ్ల క్రితం నాటి దెయ్యం కథలా చెప్పుకొచ్చారు!’’ అన్నారు ముఖ్యమంత్రిణి.

‘‘మీరు తొందర పడుతున్నారు, మేడమ్. అదే అయితే అద్భుతరసం కింద ఎందుకు చెప్తాను? ఈ సైకియాట్రిస్టు తన సిటింగులతో సుందరంలో రెండు రకాల వ్యక్తిత్వాలున్నట్లు గమనించాడు. ఒకడు అహంకారి, ఆరాచకవాది. పాతకాలం భాష, వ్యక్తీకరణ. మరొకడు మర్యాదస్తుడు, మంచివాడు, యిప్పటికాలం వాడు. అయితే యిలా స్ప్లిట్ కావడానికి కారణం ఏమిటో అర్థం కాలేదతనికి. ఇద్దరి మధ్య కాలవ్యవధి చాలా ఉంది. సిటింగులలో ఆ కవి గురించి వివరాలు సేకరించాడు. సిటింగు తర్వాత సుందరానికి ఆ నోట్సు చూపించి, ‘నీకు యితను తెలుసా?’ అని అడిగాడు. ‘ఇతను రాసిన కవితల పుస్తకం చదువుతున్నాను తప్ప, యితని వ్యక్తిగత జీవితం గురించి ఏమీ తెలియదు. పుస్తకంలో కూడా ఏమీ రాయలేదు. వేరెవరూ యితని గురించి ప్రస్తావించలేదు.’ అన్నాడు సుందరం. ‘వేరే ఎవరి గురించైనా బాగా తెలిసి, అతని వ్యక్తిత్వాన్ని నీపై ఆపాదించు కుంటున్నావనుకున్నా. నీ కేసు నాకు అర్థం కావటం లేదు.’ అన్నాడు డాక్టరు.

ఆ రాత్రి సుందరానికి కల రావడంతో మిస్టరీ విడింది. కలలో కవి వచ్చి ‘నేనెవరో అర్థమైందా?’ అంటూ నవ్వాడు. తన గురించి చెప్పుకున్నాడు. క్షుద్రశక్తికి తన ఆత్మ అమ్ముకున్న సంగతి, ఆ శక్తి యిచ్చిన వరప్రభావం చేత సుందరం శరీరంలోకి ప్రవేశించిన సంగతీ చెప్పాడు. సుందరానికి ఆశ్చర్యమేసింది. ‘అంటే యీ వందేళ్లలో నీ పుస్తకం ఎవరూ చదవలేదా?’ అని అడిగాడు. ‘ఎవ్హరూ చదవలేదు. ఆఖరికి మేటరు కంపోజు చేసినవాడు కూడా యాంత్రికంగా చేసి వుంటాడు తప్ప చదివి ఉండడు. అచ్చయ్యాక ఒఖ్కడూ చదివిన పాపాన పోలేదు. ఇన్నాళ్లకు నువ్వు అట్ట తీసి చదివావు.’ అన్నాడు కవి.’

ఈ మాట మూర్తి చెప్పగానే శ్రోతలందరూ పకపకా నవ్వారు. ‘మూర్తిగారు కవుల మీద సెటైర్లు వేయడానికే యిది చెప్తున్నారు.’ అన్నారొకరు.

‘‘అంతేకాదు, నిఖిల్ సినిమా ఒకదానిలో వెన్నెల కిశోర్ తన లోపల ఒకడున్నాడు అంటూంటాడు. మూర్తిగారు ఆ లోపలివాణ్ని కవిని చేశారు.’ అన్నారు మరొకరు.

మూర్తి నవ్వారు. ‘మీరేమైనా అనుకోండి. జరిగినది చెపుతున్నా. ఇంతకీ ఆ ఫ్రస్ట్రేటెడ్ కవి సుందరంలో తిష్ట వేశాడు. నానా చాకిరీ చేయించుకునేవాడు. కల రాగానే సుందరం సైకియాట్రిస్టు దగ్గరకు వచ్చి చెపితే ఆయన కొట్టి పారేశాడు. కానీ నమ్మక తప్పలేదు. కవిని వదిలించుకోవడం ఎలా చెప్పండి అని సుందరం పట్టుకున్నాడు. ఆలోచించి చెపుతా అని పంపించేశాడు.

ఆ రాత్రి కవి మళ్లీ కలలోకి వచ్చి ‘నన్ను వదిలించుకోవడం నీ తరం కాదు. నీ ద్వారా నా రచనాశక్తి జనాలకు తెలియాలి. ఆధునిక కవులుగా పేరు తెచ్చుకున్నవారందరూ నా ముందు బలాదూరు అని తెలుగు ప్రజలు గుర్తించాలి. నా విగ్రహాలు ఊరూరా వెలవాలి. నా పేర ఎవార్డులు ప్రకటించాలి. నేను తృప్తి పడేదాకా నిన్ను వదిలి వెళ్లే ప్రశ్నే లేదు. అసలు నేను ఆ క్షుద్రశక్తితో ఒప్పందం చేసుకుని, మరొకరి శరీరంలోకి ప్రవేశించింది ఎందుకనుకున్నావు? కవి సమ్మేళనాల్లో నువ్వు నా కవిత్వం చదవాలి. నా గురించి వ్యాసాలు రాయాలి. నా పుస్తకాన్ని మళ్లీ అచ్చేయించాలి. నేను బతికున్నప్పుడైతే పల్లెటూళ్లో కాబట్టి నా పేరు తెలియకుండా పోయింది. ఇప్పుడు నువ్వుంటున్నది సిటీలో. ప్రచారసాధనాలు ఎన్నో రెట్లు పెరిగాయి. నేను కవిత్వం రాసే రోజుల్లో నా స్నేహితులు ‘నువ్వు నీ ఆలోచనల్లో చాలా ఎడ్వాన్స్‌డ్‌గా ఉన్నావు. ఈ తరం వాళ్లు నీ భావాలను అందుకోలేకుండా ఉన్నారు. సాంప్రదాయ విరుద్ధమైన నీ కవిత్వం వీళ్లకు జీర్ణం కాలేదు. నువ్వు రాబోయే శతాబ్దపు కవివి’ అన్నారు. అందువలన నా రచనలు యీ శతాబ్దానికి నచ్చి తీరతాయి.’ అన్నాడు.

సుందరం కలలోనే వాదించాడు. ‘నీ కవిత్వం నాకు నచ్చలేదు. నాకు నచ్చని కవిత్వాన్ని ఎలా ప్రచారం చేయగలుగుతాను? అసలు వాక్యనిర్మాణమే బాగా లేదు. కవిత్వఛాయలు బొత్తిగా లేవు. ఈనాటి కుర్రకారు కవులు కూడా నీకంటె మెరుగ్గా రాస్తున్నారు. గందరగోళంగా ఏదేదో రాసేసి, అది వినూత్న కవితాధోరణి అని బుకాయిస్తే ఎలా?’ అన్నాడు. ఇక అప్పణ్నుంచి కవి సుందరం మీద పగబట్టాడు. పగలు స్తబ్దంగా ఉండేవాడు. రాత్రి అయ్యేసరికి విజృంభించేవాడు. నిద్ర పట్టకుండా చేసేవాడు. ‘నీకు అభిరుచి లేదు. నువ్వు పనికిమాలినవాడివి. ఎవరైనా చెపితే వినని శుంఠవు.’ అని చెవిలో రొద పెట్టేవాడు.

సుందరం యిది గమనించాడు. రాత్రి అయేసరికి తన మనసులో ఏ కోరిక పుట్టిందో దానికి విరుద్ధంగా చేసేవాడు. మిరపకాయ బజ్జీలు తినాలని అనిపిస్తే స్వీటు తినేవాడు. బీడీ కాల్చాలని తోస్తోందని వాటిని బయట పారేశాడు. బయటకు వెళ్లాలని తోస్తే యింట్లో కూర్చునేవాడు. పుస్తకం చదవాలని తోస్తే టీవీ చూసేవాడు. ఇలా లోపలున్న కవిని నానా యిబ్బందీ పెట్టాడు. కవి కలలోకి వచ్చి బెదిరించేవాడు. పోవోయ్ అనేవాడు సుందరం. తనతో తనే చేసుకునే యీ ఘర్షణలో సుందరం నిద్ర కోల్పోయాడు. పగలు ఆఫీసులో కునికిపాట్లు పడేవాడు. ఈ బాధ భరించలేక సైకియాట్రిస్టును సలహా అడిగాడు.

‘దీనికి సైన్సుపరంగా నాకే పరిష్కారమూ తోచటం లేదు. కానీ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఒక ఐడియా తడుతోంది. ఈ కవికి సాంప్రదాయ కవిత్వమంటే తగని విరోధం. దాని మీదే తిరుగుబాటు చేసి నెగ్గలేక తన ఆత్మను అమ్ముకున్నాడు. నువ్వు ఆనాటి సంప్రదాయ కవిత్వం చదువుతూ, ఆస్వాదిస్తూ, అతన్ని యిరిటేట్ చేయి. ఉక్కిరిబిక్కిరై నీ శరీరం విడిచి వెళ్లిపోతాడు.’ అన్నాడు డాక్టరు.

ఇది వినగానే అందరి పెదాల మీద చిరునవ్వులు మొలిచాయి. ముఖ్యమంత్రిణి ‘‘మూర్తిగారూ, మీ కథలో అన్‌కాన్నీ థింగ్ ఉన్నా, హాస్యకథలా తయారవుతోంది. పట్టు పోకముందే క్లయిమాక్స్‌కి వచ్చేయండి.’’ అన్నారు.

మూర్తి ‘‘ఓకే మేడమ్, ఏజ్ యూ ప్లీజ్. జరిగిందేమిటంటే దీనివలన కవికి కోపం మరింత పెరిగింది. సుందరం పగలు చదివినది, రాత్రికల్లా తుడిచిపెట్టేసేవాడు. రాత్రి చదువుదామని కూర్చుంటే నిద్ర తెప్పించేసేవాడు. దీనివలన సుందరానికి రాత్రి నిద్ర సమస్య తీరిపోయింది కానీ, కవిని వదుల్చుకోలేక పోయాడు. అతను యితని కలల్లోకి వచ్చి హెచ్చరించేవాడు, నన్ను యిబ్బంది పెడితే నిన్ను పిచ్చివాణ్ని చేస్తాను జాగ్రత్త అని. చివరికి సుందరానికే ఒక ఐడియా వచ్చింది. నా దగ్గరకు వచ్చి ఏదో ఒక సాంస్కృతిక సమాజానికి చెప్పి కవితాసభ ఏర్పాటు చేయించమన్నాడు. సభకు ఎవరో పెద్దవాళ్లని అతిథిగా పిలిచి, జనాలను పోగేసి కూర్చోబెట్టారు. సుందరం కవిగారి కవిత్వం చదవడం మొదలుపెట్టాడు. జనాలు లేచి జారుకోవడం మొదలుపెట్టారు. ముప్పావుగంట కల్లా హాలు ఖాళీ అయిపోయింది.

మర్నాడు సైకియాట్రిస్టు సుందరంలోని కవితో సంభాషించాడు. ‘‘నీ కవిత్వం వందేళ్ల తర్వాత మన్ననలు పొందుతుందని నీ స్నేహితులు చెప్పినది తప్పు. తెలుగువాళ్లలో యింకా చైతన్యం, భావవిప్లవం రాలేదు. నీ కవిత్వాన్ని అందుకోవాలంటే ఇంకో ఏభై, వందేళ్లు పట్టవచ్చు. నువ్వు మళ్లీ పుస్తకంలోకి వెళ్లిపోయి, మరో తరం తర్వాత, యింకో మనిషి ద్వారా ప్రజల్లోకి వస్తే మంచిది.’’ అన్నాడు. కవి నిట్టూర్చి ‘‘చూడబోతే అదే నిజమనిపిస్తోంది.’’ అన్నాడు.

మర్నాటికల్లా సుందరం పాత సుందరంలా అయిపోయాడు.’ అంటూ మూర్తిగారు కథ ముగించారు.

(ఫ్రెడ్ చాపెల్ రాసిన ‘‘ద లా(డ్)జర్’’ కథ స్పూర్తితో) మరో అద్భుతరస కథ వచ్చే నెల రెండో బుధవారం

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2022)   

mbsprasad@gmail.com

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి