Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ కథ: మధ్యవర్తి అంతర్థానం

ఎమ్బీయస్ కథ: మధ్యవర్తి అంతర్థానం

ఈ కథకు మూలం ‘‘ద నెగోషియేటర్’’ అనే నా ఇంగ్లీషు కథ. 1991 మార్చి 23న ‘‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’’ తమిళనాడు ఎడిషన్స్‌లో ప్రచురితమైంది. కథాంశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినది. నక్సలైట్లు ఆ రోజుల్లో ఎలాటి హింసారాజకీయాలు నడిపారో, గ్రూపులుగా విడిపోయి, ఒకరిపై మరొకరు దాడి చేయడానికి ఎలాటి ఎత్తులు వేశారో చెప్తుంది. కథకు కేంద్ర బిందువు ఓ మధ్యవర్తి! ఇప్పుడు వీళ్లను ‘అర్బన్ నక్సల్స్’ అని పిలుస్తున్నారు కానీ అప్పట్లో ప్రజాహక్కుల కార్యకర్తలని పిలిచేవారు. వెంగళరావు హోం మంత్రిగా ఉంటూ నక్సలైట్ ఉద్యమాన్ని నిర్దయగా అణిచివేసినప్పుడు అనేక బూటకపు ఎన్‌కౌంటర్లు జరిగాయి. నక్సలైట్లే కాకుండా కొందరు అమాయకులు కూడా బలై పోయారు. వాటిని జస్టిస్ తార్కుండే కమిటీ బయటపెట్టి, ఎండగట్టింది.

అనేక మంది వామపక్షవాదులు ఒపిడిఆర్ వంటి ప్రజాహక్కుల సంస్థలు స్థాపించి యీ ఎన్‌కౌంటర్లను ఖండించేవారు. రాజ్యం చట్టాన్ని అతిక్రమించి, రాజ్యాంగేతర పద్ధతుల్లో నక్సలైట్లపై జరిపిన అమానుష చర్యలను దుయ్యబట్టేవారు. నేను వారి సమావేశాలకు హాజరై ప్రభుత్వం తీరు పట్ల అవేశపడేవాణ్ని. రానురాను నాకు ఒక విషయం వింతగా తోచసాగింది. నక్సలైట్లు కూడా గిరిజన ప్రాంతాల జనాలపై జులుం సాగించేవారు. ఓటేస్తే చేతులు నరికేవారు. తాము ఆమోదించని సారాయి కంట్రాక్టర్లను నరికి పోగులు పెట్టేవారు. పోలీసుల హింస భరించలేక తమ కదలికల గురించి వారికి చెప్పేసిన స్థానికుల ముక్కు చెవులూ కోసేవారు. ఈ ప్రజాహక్కుల సంఘాల వాళ్లు నక్సలైట్లపై పోలీసుల హింస గురించే మాట్లాడేవారు తప్ప, నక్సలైట్లు సాధారణ పౌరులపై చేసిన హింస గురించి నోరెత్తేవారు కాదు. ఇది అన్యాయమనిపించి వారిపై మోజు పోయింది. అసహ్యం కలగసాగింది.

గిరిజన ప్రాంతాల్లో భూకామందులు, కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు తరతరాలుగా దోపిడీ చేస్తూ వచ్చారు. వారికి అమ్ముడుపోయిన ప్రభుత్వాధికారులు మౌనంగా చూస్తూ ఉండడమో, లేక దోపిడీలో పాలు పంచుకోవడమో చేసేవారు. నక్సలైట్లు వచ్చి యీ పీడిత ప్రజల పక్షాన పోరు సలిపి, వారి సానుభూతి పొంది, ఆ ప్రాంతాలను తమ స్థావరాలుగా మార్చుకుని, అక్కణ్నుంచి ప్రభుత్వంపై సాయుధపోరాటం చేసేవారు. హఠాత్తుగా దాడి చేసి, పారిపోయి అడవుల్లో దాక్కునేవారు. వారికి గిరిజనులు రక్షణ కల్పించేవారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని తామే సరి చేస్తే, ఆ దోపిడీని తామే ఆపితే వాళ్లు నక్సలైట్లకు అండగా నిలవరు కదాన్న ఆలోచన ప్రభుత్వానికి వచ్చి, నిజాయితీ, ధైర్యం కలిగిన అధికారులను అక్కడ నియమించి, వారి ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఏదోలా గిరిజనులకు మేలు జరగడమే తమకు కావాలి అనుకుంటే నక్సలైట్లు ఆ అధికారులకు అండగా నిలవాలి. కానీ నిలవలేదు, వారిని భయపెట్టారు, కిడ్నాప్‌లు కూడా చేశారు. విడిచిపెట్టాలంటే షరతులు పెట్టారు.

నక్సలైట్ల శిబిరాలపై దాడి చేసిన పోలీసులు కొందర్ని పట్టుకుని కోర్టులో నిలబెట్టేవారు. నక్సలైట్లయితే తమ ప్రత్యర్థులు పట్టుబడినప్పుడు ‘ప్రజాదర్బారు’ పేరుతో ఓ ఏభై మంది మధ్య అప్పటికప్పుడు తీర్పు యిచ్చేసి కాల్చేసేవారు. కానీ ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం అలా చేయలేదు కదా, కోర్టు ప్రొసీజర్లన్నీ పాటిస్తూ ఏళ్లు పట్టించేది. ఈలోపున యిలాటి కిడ్నాపులకు తెగబడి, ఖైదులో ఉన్న తమ సహచరులను విడిచిపెట్టమని యీ నక్సలైట్లు షరతు పెట్టేవారు. పైన చెప్పిన ప్రజాదరణ పొందిన అధికారుల విషయంలోనైతే ప్రభుత్వానికి ఓ బాధ్యత ఉంటుంది. అతనిలాటి అధికారుల మొరేల్ దెబ్బ తినకుండా చూసుకోవలసిన కర్తవ్యం ఉంటుంది. పైగా గిరిజనుల్లో పేరు తెచ్చుకున్న అధికారి కాబట్టి గిరిజనులు కూడా ప్రభుత్వం ఏదో చేయాలని కోరుకుంటారు. అప్పుడు ప్రభుత్వం పైన చెప్పిన ప్రజాహక్కుల వారిని పిలిచి, మధ్యవర్తిత్వం చేయమని కోరుతూంటుంది.

తమాషా ఏమిటంటే, నక్సలైట్లు ఎక్కడుంటారో, వారి బలాబలాలేమిటో, వారి కోర్కెలేమిటో, ఏ మేరకు రాజీ పడతారో యీ మధ్యవర్తులకు తెలుసు. వారి తరఫున ప్రభుత్వంతో వాదిస్తారు కూడా. అయినా ప్రభుత్వం వీరిని సహిస్తుంది, నక్సలైట్ల ఆనుపానులు చెప్పమని బలవంతం చేయదు. ఈ ఛానెల్ కూడా మూసేసుకుంటే కిడ్నాపయిన వారిని విడిపించుకోలేమనే బెంగ దానిది. నక్సలైట్లు యిలా పేట్రేగిపోయారంటే తప్పు రాజకీయ పక్షాలది కూడా ఉంది. తాము ప్రతిపక్షంలో ఉండగా, నక్సలిజం సామాజిక సమస్య అనీ, నక్సలైట్లు దేశభక్తులని, సంప్రదింపులతో మాత్రమే పరిష్కారం దొరుకుతుందని, ప్రస్తుత ప్రభుత్వం తప్పుడు విధానాలతో సమస్యను పెద్దది చేస్తోందని అంటారు. ప్రభుత్వంలోకి రాగానే నక్సలైట్లను అణచివేస్తామని బీరాలు పలుకుతారు. తమకు కావలసిన వారు కిడ్నాప్ కాగానే స్ట్రాటజీ మార్చేస్తారు. దీనివలన అనేక అనర్థాలు జరుగుతాయి.

1989లో కేంద్రంలో విపి సింగ్ నేతృత్వంలో జనతా దళ్ ప్రభుత్వంలో ముఫ్తీ మొహమ్మద్ సయీద్ మంత్రి. కాంగ్రెసును ఎలాగైనా అధికారంలోకి రాకుండా చేయాలనే పట్టుదలతో ఉన్న బిజెపి, కమ్యూనిస్టులు ఆ ప్రభుత్వానికి చెరో కొమ్ము కాసారు. కశ్మీరీ మిలిటెంట్లు ముఫ్తీ కూతురు డా. రుబయాను కిడ్నాప్ చేశారు. కశ్మీరు వేర్పాటువాదుల పట్ల లొంగుబాటు వైఖరి చూపిందంటూ కాంగ్రెసును అప్పటిదాకా విమర్శిస్తున్న యీ పార్టీలే ఆమె కోసం మిలిటెంట్లను విడుదల చేశారు. ఆ తర్వాత మిలిటెంట్లు మరీ రెచ్చిపోయారు. ఇలా ప్రభుత్వాలు ఒక స్థిరమైన పాలసీ అవలంబించవు. దీన్ని నక్సలైట్లు అలుసుగా తీసుకుంటారు. సామాన్యులకైతే ఒక న్యాయం, ప్రసిద్ధులకైతే మరో న్యాయం. ఇలాటి వాతావరణంలో ఈ మధ్యవర్తులదే హవా. దాంతో తామెక్కణ్నుంచో దిగి వచ్చామనే ఫీలింగు తెచ్చుకుంటారు వీళ్లు. చీలికలుపేలికలుగా విడిపోయిన నక్సలైట్ గ్రూపుల్లో వీళ్లకు ఫేవరేట్స్ కూడా ఉంటారు. అది తక్కిన గ్రూపులకు నచ్చదు. వర్గశత్రువుల కంటె అంతఃశత్రువులను ముందు సంహరించాలనే సిద్ధాంతంతో ఈ గ్రూపులు ఒకరి నొకరు నిర్మూలించుకుంటూ ఉంటాయి. ఇలాటి సంక్లిష్టమైన నేపథ్యంతో సెట్ చేయబడిందీ కథ. చదవండి.

కథ: మధ్యవర్తి అంతర్థానం

‘‘మీ ధోరణి నాకు అంతుపట్టటం లేదు. పదిహేను రోజుల క్రితమే, ఆ మంత్రిగారబ్బాయిని విడిపించేట్లా చూడమని నన్ను కాళ్లావేళ్లా బతిమాలారు. ఇప్పుడు రెండు గంటలుగా నేను ప్రాధేయపడుతున్నా ఉలక్కుండా, పలక్కుండా కూర్చున్నారు. వాళ్లు చేస్తున్నది కూడా పెద్ద డిమాండేమీ కాదు. అయినా వినడానికి కూడా మీకు ఇంట్రస్టు లేదు. ఎందుకలాగ? కిడ్నాపైనవాడు ఏ మంత్రిగారికీ బంధువు కాదు, మామూలు మనిషి. అంతేగా?’’ అన్నాడు విసుగెత్తిన ఆజాద్. ‘‘ఇందాకనే చెప్పాను, దయచేసి మీరు ఆ కోణంలో చూడడం మానేయండి. అప్పటికి యిప్పటికి పరిస్థితులు మారాయి. ఈ నక్సలైట్ సమస్యకు యింతటితో ముగింపు పలకాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ బేరసారాలు, ఖైదులో ఉన్న నక్సలైట్లను విడిచి పెట్టడాలు యివన్నీ యికపై నడవవు. వీళ్లను పట్టుకోవడంలో ఎంతమంది పోలీసులు ప్రాణాలు పోగొట్టుకున్నారో మీకేమైనా ఐడియా ఉందా?’’ చివాట్లేసే ధోరణిలో మాట్లాడాడు ఐజీ సుధీర్.

ఆజాద్ కుర్చీలో వెనక్కి వాలి, చేతులు చాచి, హేళనగా ‘‘అయితే దెబ్బకు నక్సలైట్ సమస్య సఫా అన్నమాట! పోలీసు వ్యవస్థ యింత ఎఫిషియెంట్‌గా ఎప్పుడు మారిందబ్బా’’ అన్నాడు. సుధీర్ దానికి స్పందించకుండా, ‘‘మా పద్ధతులు మాకున్నాయి. మీకు బాగా తెలుసు. మేమేమీ చేతకానివాళ్లం కాదు. అయితే యిన్నాళ్లూ మా చేతులు కట్టేశారు. ఇవన్నీ రాజకీయ నిర్ణయాలు. ఆ పొలిటికల్ విల్ యిప్పుడు వచ్చింది. దృఢంగా ఉండండి అని ఆదేశాలిచ్చారు. ఉంటాం. దట్సాల్’’ అని చెప్పాడు. కానీ ఆజాద్ తన ధోరణి మార్చలేదు. ‘‘అందువలన, తమ కొత్త ప్రయోగాలకు తొలి బలిపశువుగా యీ ప్రభుత్వోద్యోగిని ఎంచుకున్నారన్నమాట. పాపం ఇన్నాళ్లూ మీలాగే ప్రభుత్వానికి తన రక్తమాంసాలు ధారపోసి, నక్సలైటు ఏరియాలో పోస్టింగు యిచ్చినా కిమ్మనకుండా వెళ్లి, నిజాయితీగా పని చేసినందుకు మీరిచ్చే బహుమతి యిదన్నమాట.’’ సుధీర్ తొణకలేదు. ‘‘ఎక్కడో అక్కడ మొదలుపెట్టాలి కదా. మీరు చెప్పిన వాటికి ఒప్పుకుని అతన్ని వదిలిపెట్టేననుకోండి, వచ్చేవారం మరొకణ్ని కిడ్నాప్ చేసి యింకోళ్లని విడిచి పెట్టమంటారు. దీనికి అంతెక్కడ? ఇవాళ చందర్ వంటి నిజాయితీ, ప్రతిభ గల ప్రభుత్వాధికారి కనుక ఒప్పుకుంటున్నాం అనుకుందాం, రేపు చదువురాని, అమాయకుడైన కూలీని ఎత్తుకుపోయారనుకోండి. ప్రతీ పౌరుడికీ రక్షణ కల్పించడానికి లోకంలో ఉన్న పోలీసు ఫోర్సు మొత్తం చాలదు. అప్పుడు డిమాండ్లు ఒప్పుకోకపోతే ప్రభుత్వోద్యోగికి ఒక రూలు, కూలీకి మరో రూలా? అని మీరే సాగదీస్తారు. ప్రాణం అనేది ఎవరికైనా ఒకటే కదా!’’ అన్నాడు.

ఆజాద్ కాస్సేపు ఊరుకుని ‘‘ఏదో ఒక స్థిరమైన పాలసీ పెట్టుకోండి చాలు. కారట్ యిచ్చి బుజ్జగించడమా? దుడ్డుకర్ర చూపించి దడిపించడమా? ఏదో ఒకటి తేల్చుకోండి. మంత్రుల దగ్గరకు వచ్చేసరికి ఒకటి, మామూలు వాళ్లకి మరోటి చేయకండి. రేపు ఎవరైనా రాజకీయపక్షి కిడ్నాప్ అయితే విధానాలు మార్చేయకండి చాలు. ’’ అన్నాడు. సుధీర్ అతని కేసి దీర్ఘంగా చూసి, క్యాప్ తీసి రుమాలుతో నుదురు తుడుచుకుని, బల్ల మీద చేతులు చాపి చెప్పాడు. ‘‘కాలేజీ కుర్రాడిలా మాట్లాడకండి. ఈ వ్యవహారాలెలా వుంటాయో మీకు తెలుసు. దేనిలో ఉంది స్థిరత్వం? మీకుందా? నక్సలైట్లకుందా? ఒక్కోసారి వెనక్కి తగ్గుతారు, మరోసారి అన్ని వైపుల నుంచీ దాడి చేస్తారు. వాళ్ల టాక్టిక్స్ మారినప్పుడల్లా మావీ మారతాయి. కేరట్ కాలం కొన్నాళ్లు నడిచింది. సీజను మారింది. తీవ్రవాదులతో చర్చలు జరిపితీరాలి అంటూ సలహాలిస్తూ వచ్చినవాళ్లకి ప్రస్తుతం గిరాకీ లేదు. ఇప్పుడు కర్ర సీజను. అది కూడా దుడ్డుకర్ర, అలాటిది, యిలాటిది కాదు. తీవ్రవాదులను కనబడ్డవాళ్లను కనబడినట్లు మట్టుపెట్టండని ఆర్డర్లున్నాయి.’’

‘‘నిజంగానే!? ఇన్నాళ్లూ తీవ్రవాద సమస్యను సజీవంగా ఉంచడంలో పోలీసు వాళ్ల స్వార్థం ఉందనుకుంటూ వచ్చాను. తక్కిన రాష్ట్రాలలో పోలీసు వాళ్లకి యిన్ని పోస్టులూ లేవు, యింతింత ప్రమోషన్లూ లేవు. ఇక్కడ యీ సమస్య ఉంది కాబట్టే మీరంతా వెలుగుతున్నారు. సుధీర్ బాబూ, నిజంగా, అచ్చంగా నక్సలైటు సమస్య పరిష్కారమై పోయిందనుకోండి, మీ సంగతే మవుతుందంటారు? మీకు రివర్షన్ వస్తుంది, నాకు యీ పనీ పోతుంది. నా గురించి తలుచుకునే వాడే ఉండడు. హాహాహా’’ అంటూ భళ్లుమని నవ్వాడు ఆజాద్. సుధీర్‌కు నవ్వు రాలేదు, కోపం వచ్చింది. ఏమీ మాట్లాడకుండా ఫైళ్లు తెరిచి చూడసాగాడు.

ఆజాద్ అది గ్రహించి సీరియస్‌గా ‘‘చూడండి, అసలిక్కడ యీ సమస్య ఎందుకు ప్రారంభమైందో మీకు తెలుసు. గిరిజనుల భూమిని కబ్జా చేసిన భూస్వాములకు, నిర్వాసితులను చేసిన పారిశ్రామిక వేత్తలకు, కారుచౌకగా అడవి ఉత్పత్తులను కొట్టేసిన వ్యాపారస్తులకు మీ పోలీసు వాళ్ల మద్దతున్నంత కాలం యీ సమస్య సమసిపోదు. దాని కోసం వ్యవస్థ మారాలి. మారాలంటే పొలిటికల్ విల్ ఉండాలి. దానికి యింకా టైము పడుతుంది. ఉన్న నక్సలైటు గ్రూపుల్లో ఎకె గ్రూపు అందరి కంటె రీజనబుల్ అని మీకూ తెలుసు. మీ అభిమాన గ్రూపైన జికె గ్రూపు అందరికంటె డేంజరస్ అని, నమ్మదగ్గది కాదనీ మీకూ, నాకూ తెలుసు...’’ సుధీర్ అతని మాటను మధ్యలోనే తుంచివేశాడు. ‘‘మాకెవరి మీదా ప్రేమా, గౌరవమూ లేవు. వాళ్లల్లో వాళ్లకు గొడవలు రావడానికే కొంతకాలం జికెను ఫేవర్ చేశాం. కానీ యిప్పుడు స్ట్రాటజీ మారిందని చెప్తున్నా కదా! ఎవరైనా మాకు ఒక్కటే. తుడిచిపెట్టేయడమే!’’

‘‘ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి. కానీ మీ పోలీసు వాళ్లు చేసిన అత్యాచారాలన్నీ వాళ్లకు తెలుసు. మీరు దృఢంగా ఉండడం మొదలెట్టగానే వాళ్లు ఆధారాలతో సహా ఎక్స్‌పోజ్ చేసి, మీకు పబ్లిక్ సింపతీ లేకుండా చేయగలరు. స్థానికుల మద్దతు లేకుండా, మీరు యుద్ధమెలా గెలవగలరు?’’ ఇలా అంటూనే ఆజాద్ సడన్‌గా గొంతు మార్చి అనునయంగా ‘‘అదంతా రేపటి మాట. ఈసారికి యిలా పోనీయండి. జైల్లో మగ్గుతున్న ఆ కామ్రేడ్స్‌ని వదిలేయండి. మీలో ఒకడైన చందర్ గురించి కూడా కాస్త ఆలోచించండి. ఇలాటి వెర్రివేషాలు మానుకోమని నేను నక్సలైట్లకు కూడా చెప్తాను.’’ అన్నాడు. కానీ సుధీర్ కరగలేదు. ‘‘మళ్లీ అదే పాట పాడుతున్నారు. ఈసారికి మేం బెసికేది లేదు. చర్చలూ, రాజీలూ జాన్తానై, ఇది మీరు గ్రహించాలి.’’ అని దృఢస్వరంతో చెప్పి, అంతలోనే ఆజాద్ మొహం చూసి ‘‘దయచేసి మీరు దీన్ని మీ ఓటమిగా చూడకండి. మా అవస్థ అర్థం చేసుకోండి. నేను మీలా ఫ్రీ బర్డ్‌ కాదు కదా. మీరైతే స్వేచ్ఛాజీవి.’’ అన్నాడు.

తనకు ఆజాద్ అనే పేరు పెట్టినందుకు అతను తన తండ్రికి ఎప్పుడూ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాడు. ఆయన లెఫ్టిస్టు కాబట్టి కొడుక్కి చంద్రశేఖర్ ఆజాద్ పేరు పెట్టాడు. ‘‘నేను స్వేచ్ఛాజీవిని. నాకు ఏ యిజాల శృంఖలాలూ లేవు. మానవతావాదిని. ప్రతీ అంశం యొక్క మంచి చెడ్డల బట్టి నేను స్టాండ్ తీసుకుంటాను.’’ అని గొప్పగా చెప్పుకుంటాడతను. ఏదైనా ఒక ఇజంకు కట్టుబడితే దాని గురించి కొన్ని యిబ్బందికరమైన ప్రశ్నలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇతనికి ఆ బాధ లేదు. తండ్రి ఆదర్శవాది కావడం చేత, ఏదో ఒక ప్రజాపోరాటంలో మాటిమాటికి జైలుకో, అండర్‌గ్రౌండ్‌కో వెళ్లి వస్తూండడం చేత యితను ఆదర్శాలను నమ్ముకుని ఉండలేకపోయాడు. సంసారం పెద్దది, అప్పులవాళ్లు వచ్చి తలుపు తడుతూండేవారు. అడ్డమైన ఒట్లేసి వాళ్లను నిలవరించాలి. పోలీసులు తనిఖీకి వస్తే వాళ్లకు కల్లబొల్లి కబుర్లు చెప్పాలి. పొయ్యిలో పిల్లి లేవాలంటే, అబద్ధాలాడి అప్పులు తేవాలి. పెద్దకొడుకుగా యీ బాధ్యత వహించాడు. ఉన్న కొద్దిపాటి ఆస్తి కాపాడుకుని, తండ్రి చిన్నపుడే చనిపోతే తమ్ముళ్లను, చెల్లెళ్లను సాకి పెళ్లిళ్లు చేశాడు.

అందరికీ నచ్చే కల్లబొల్లి కబుర్లు చెప్పిచెప్పి, అతను చివరకు లాయరు అయిపోయాడు. తండ్రి స్నేహితులు అతనికి లేబరు యూనియన్ కేసులిప్పించారు. ప్రజాన్యాయవాది అనే పేరూ వచ్చింది, డబ్బూ వచ్చింది. అది చూసి ఇండస్ట్రియలిస్టులూ పరిచయమయ్యారు. స్టేచరు పెరిగింది. హక్కుల కార్యకర్త కావడంతో మధ్యతరగతి వారు అభిమానించారు. ఇలా అతను అన్ని తరగతుల వారికీ ఆప్తుడయ్యాడు. ఏ రోటి దగ్గర ఆ పాట పాడేవాడు. నక్సలైట్ల గురించి అడిగితే ‘నేను వారి పద్ధతులను ఆమోదించను కానీ, వారి ఆవేదనను అర్థం చేసుకుంటాను.’ అనేవాడు. వాళ్లు చాటుగా యితన్ని కలిసి తాము చేసిన అకృత్యాలను సరైన కోణంలో పబ్లిక్‌లో ప్రెజంట్ చేసి, సింపతీ వచ్చేట్లు చేయమని కోరేవారు. పబ్లిక్‌లో పోలీసులను ఘాటుగా విమర్శించేవాడు కానీ వాళ్లతో పార్టీలకు వెళ్లి మీ సమస్యలు నాకు తెలుసనేవాడు. ఇలా యుద్ధంలో యిరు పక్షాల వారితోనూ అతనికి దోస్తీ ఉంది. అత్తతో అమ్మి, కోడలితో కొనే విద్య అబ్బడంతో మధ్యవర్తి పాత్ర నిర్వహణ అతని పరమైంది. దానివలన సమస్యలూ వచ్చాయి.

అడవిలో ఎకె గ్రూపు రహస్య స్థావరానికి కారులో వెళుతూ ప్రస్తుతావస్థ గురించి తిట్టుకుంటున్న ఆజాద్ తననెవరైనా వెంటాడుతున్నారా లేదా అనే విషయం పట్టించుకోలేదు. సాధారణంగా యిలా వెళ్లేటప్పుడు ఆ జాగ్రత్త తీసుకుంటూ ఉంటాడు. క్రైసిస్ మేనేజరుగా తనకున్న పేరు పోతోందన్న బాధ అతన్ని తినేస్తోంది. నిజం చెప్పాలంటే సుధీర్‌ను కలవడానికి ముందు రాజీకి ఒప్పుకుంటాడన్న ఆశ అతనికి చాలా తక్కువగా ఉంది.  ఎకె గ్రూపులో అతివాదియైన భిక్షపతే యీ కిడ్నాప్ చేశాడని తనకు తెలుసు. తమ టెర్మ్‌స్‌కు పోలీసులు ఎలాగూ ఒప్పుకోరని, సాధారణ జనం వాళ్లని తిట్టిపోస్తారని, తద్వారా వాళ్ల మానసిక స్థయిర్యం దెబ్బ తింటుందని భిక్షపతి ముందుగానే ఊహించాడు. ఎకెఆర్ తనను మధ్యవర్తిత్వం చేయమని కోరినప్పుడే ‘రాజకీయ నాయకులను, డబ్బున్నవాళ్లను కిడ్నాప్ చేస్తే అదో దారి. కానీ ఒక మంచి ఉద్యోగిని కిడ్నాప్ చేస్తే పబ్లిక్ సింపతీ పోతుంది. ఇక ముందైనా భిక్షపతిని కంట్రోలు చేస్తానని నువ్వు మాటిస్తేనే వెళతాను.’ అని చెప్పాడు. ‘ఈసారి మీరు సాధించుకుని రండి. అతన్ని అదుపు చేసే బాధ్యత నాది’ అన్నాడు ఎకెఆర్. ఈ కేసులో మధ్యవర్తిగా వెళ్లకూడదనే అనుకున్నాడు కానీ ఒకవేళ ఎకె గ్రూపు మరొకణ్ని వెతుక్కుని, అతను కార్యం సాధించుకుని వస్తే తనకు వీళ్ల మీద ఉన్న పట్టు పోతుందని దీనిలోకి దిగాడు.

‘తీరా చూస్తే యిలా అయింది. సుధీర్ బెట్టు చేస్తాడనుకున్నాను కానీ బొత్తిగా మొండికేస్తా డనుకోలేదు. మేమూ, నక్సలైట్లు డైరక్టుగా తలపడతాం, మధ్యలో నీలాటి వాడు దండగ అన్నట్లు మాట్లాడాడు. వీళ్లూ దిగి రావటం లేదు. ఎవరికి వాళ్లకే తలబిరుసుగా ఉంది. నా బోటి మధ్యవర్తి నిజంగా అవసరం లేడా? నేను లేకపోతే యీ కథ ఎలా ముగుస్తుంది?’ అనుకున్నాడు ఆజాద్.

సాయంత్రం ఆరున్నరకు తమ రహస్య స్థావరంలో ఎకె గ్రూపు నాయకులు రేడియోలో వచ్చిన వార్త విన్నారు. ‘‘ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు పోలీసు ఐజి ఆఫీసుకి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తన పేరు జనమిత్ర అని, తను ప్రఖ్యాత న్యాయవాది ఆజాద్‌ను కిడ్నాప్ చేశామని తెలిపాడు. అమాయక పౌరులను కిడ్నాప్ చేయడం విషయంలో నక్సలైట్లు, పోలీసులు ఒక అవగాహనకు వచ్చేదాకా ఆజాద్‌ను విడిచి పెట్టనని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఐజి సుధీర్ ఒక ప్రకటనలో ‘ఆజాద్‌కు ఏ ఆపదా కలిగించకుండా బేషరతుగా విడుదల చేయమని ‘జనమిత్ర’కు విజ్ఞప్తి చేశారు. మరో ప్రకటనలో ‘పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని, బయటి వ్యక్తుల ప్రమేయం లేకుండానే నక్సలైట్ సమస్యను పోలీసులు పరిష్కరించగలర’ని ప్రజలకు హామీ యిచ్చారు.’’

అరగంటలోనే మీటింగు జరిగింది. ఎకెఆర్ ‘‘ఆజాద్ గురించి నాకు బాగా తెలుసు. ఆయన తండ్రి నాకు తొలి రాజకీయ గురువు. అజాతశత్రువైన ఆజాద్‌ను పోలీసులే కిడ్నాప్ చేసి ఉంటారు. మన కోసమే మధ్యవర్తిగా వెళ్లినపుడు పోలీసులు పట్టుకుని లాకప్‌లో పడేసి, యీ ‘జనమిత్ర’ పేరుతో నాటకా లాడుతున్నారు. మనల్ని పట్టుకోలేక, మన సానుభూతిపరుడు, స్నేహితుడు ఐన ఆజాద్‌ను హింసిస్తున్నారు.’’ అన్నాడు. కానీ భిక్షపతి అతనితో విభేదించాడు. ‘‘పోలీసులు కాదు, జికె గ్రూపు వాళ్లు కిడ్నాప్ చేసి వుంటారు. మన గ్రూపుకి వస్తున్న పాప్యులారిటీకి కారణం చిత్తశుద్ధితో మనం చేస్తున్న పోరాటం కాదని, మన తరఫున ఆజాద్ బాగా వాదించ గలుగుతున్నాడని వాళ్ల అభిప్రాయం. అతని అండ మనకు లేకుండా చేయడానికే వాళ్లీ పని చేసి ఉంటారు.’’

చర్చ చాలాసేపే జరిగింది. గ్రూపులో కొందరు యిటు, కొందరు అటు వాదించారు. పోలీసులే అయి వుంటారని వారి సంఖ్య ఎక్కువ ఉండడంతో ఎకెఆర్ చివర్లో ‘‘మనల్ని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేద్దామని చూస్తున్న పోలీసులకు బుద్ధి చెప్పాలి. మన వద్ద బందీగా ఉన్న చందర్‌ను చంపేద్దాం. పబ్లిక్‌కు మన మీద కోపం రావచ్చు. కానీ పోలీసులే యీ పరిస్థితికి కారణమని గట్టిగా ప్రచారం చేద్దాం. మంత్రి గారి కొడుకు విషయంలో ఒకలా, ప్రభుత్వాధికారి విషయంలో మరోలా ప్రవర్తించారనే విషయాన్ని హైలైట్ చేయిద్దాం. ఇక ఆజాద్‌ను కిడ్నాప్ చేసినందుకు ప్రతీకారంగా వాళ్లవైపు ఎవరైనా ముఖ్యులను కిడ్నాప్ చేద్దాం. రాజకీయ నాయకులందరూ జాగ్రత్త పడి సెక్యూరిటీ పెంచుకున్నారు కాబట్టి వాళ్లు దొరకరు. వాళ్లకు సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడంలో బిజీగా ఉన్న పోలీసులు తమ కుటుంబాలను పట్టించుకోరు కాబట్టి, వాళ్లని టార్గెట్ చేద్దాం. సుధీర్‌కు ముగ్గురు పిల్లలున్నారు. ఎవరో ఒకళ్లు దొరక్కపోరు. ఆ కిడ్నాప్ గురించి మనం ఏ ప్రకటనా చేయవద్దు. సందేశం ఎవరికి అందాలో వాళ్లకే డైరక్టుగా అందుతుంది.’’ అని ప్రకటించాడు. భిక్షపతి ఒప్పుకోలేదు. జికె గ్రూపు క్యాంపుల మీద పడి, దొరికినంత మందిని చంపేద్దాం, నాతో వచ్చేవాళ్లు రావచ్చు అనడంతో కొందరు అతని వెనక గ్రూపులోంచి బయటకు వెళ్లిపోయారు.

సుధీర్ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి ‘మా అమ్మాయి కనబడటం లేదండి, నక్సలైట్లు ఎత్తుకు పోయారేమోనని సందేహంగా ఉంది...’ అనగానే, ఆయన ‘నాతో చెప్పావు కానీ మరెవ్వరితోనూ చెప్పక. పరువు పోతుంది. అయినా ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు. జాగ్రత్తగా ఉండమని పిల్లలకు చెప్పవద్దూ’ అంటూ చివాట్లు వేశాడు. ‘అది సరేననుకోండి, వాట్ ఆర్ మై ఆర్డర్స్? ఏం చేయమంటారు?’ అని అడిగాడు. ‘మన దగ్గర ఏవైనా ఆప్షన్లున్నాయా? వారం కితం చందర్ కిడ్నాప్ అయినపుడు ఏం చెప్పావ్? అతని మీద యీగ వాలేందుకు ముందే, అందర్నీ అరెస్టు చేస్తానన్నావ్...’ అన్నాడు ముఖ్యమంత్రి కటువుగా. కోపాన్ని అణుచుకుంటూ సుధీర్ ‘‘నార్మల్‌గా బందీలను ఓ పట్టాన చంపరు. చంపేసే మాటైతే పట్టుబడగానే చంపేసి ఉండేవారు. వాళ్లను జాగ్రత్తగా చూసుకుంటూ, రోజుల తరబడి మేపడం దేనికి? వాళ్లను అడ్డుపెట్టుకుని తమ కార్యం సాధించుకోవడానికి! అందుకే అలా చెప్పాను. ఆజాద్ కిడ్నాప్ కావడంతో వాళ్లకు మతిపోయి, ఏదో ఒకటి చేసి మనల్ని వెక్కిరిద్దామని చేసిన తొందరపాటు పని అది. ఇంకో వారం టైముంటే పట్టుకునేవాళ్లమే..’’

‘‘ఈ లాజిక్కులన్నీ వెళ్లి జనాలకు చెప్పు. మంత్రిగారబ్బాయి కోసం రాజీ పడ్డారు, ఉద్యోగిని బలిచ్చారు, ఇదీ పబ్లిక్‌లో టాక్. వాళ్లను పట్టుకుని వుంటే కథ వేరేలా వుండేది. కానీ అది మనకు చేతకాలేదు.’ అని రుసరుసలాడాడు ముఖ్యమంత్రి. సుధీర్ ఏమీ మాట్లాడకుండా కాస్సేపు ఉండి, ఆ తర్వాత ‘‘మా అమ్మాయి కిడ్నాప్ గురించి మీకు ఇంటెలిజెన్సు వాళ్లు చెప్పే ఉంటారు. తను నిన్న కాలేజీ నుంచి తిరిగి రాలేదు. ఏ గ్రూపూ క్లెయిమ్ చేయలేదు. ఎకె గ్రూపు పనే అని నాకు తోస్తోంది. వాళ్లను కాంటాక్ట్ చేసి అడిగితే...’’ అనబోతూండగానే ముఖ్యమంత్రి ‘‘ఏమీ అక్కరలేదు. వాళ్లతో ఏ చర్చలూ జరపవద్దు. బైటికి పొక్కిందంటే అప్రతిష్ఠ. ఈ ప్రభుత్వం దృష్టిలో మంత్రుల పిల్లలకు, పోలీసుల పిల్లలకు మాత్రమే ప్రాణాలుంటాయి. తక్కినవాళ్లు పోయినా లెక్క లేదు అంటూ విరుచుకుపడతారు. ఇంకో మాట, నేను పర్మిషన్ యివ్వటం లేదు కదాని మీరు దూకుడుగా వెళ్లే ప్రయత్నం చేయకండి. నక్సలైట్ల పేరుతో అమాయక జనాల్ని హింసిస్తున్నారని ఇప్పటికే అనేక ఫిర్యాదులున్నాయి.’’ అన్నాడు దురుసుగా.

సుధీర్ ‘‘సర్, మా అమ్మాయి...’’ అంటూ సణిగాడు. ‘‘తనకేమీ కాకూడదని మనందరం దేవుణ్ని ప్రార్థిద్దాం. మనుషుల్ని పెట్టి వెతికించండి. ఇతర శాఖల సాయం తీసుకోండి. కానీ పబ్లిసిటీ లేకుండా చూసుకోండి...’’ అని చెపుతూనే హఠాత్తుగా ‘‘అవునూ, ఆజాద్ కిడ్నాప్ కేసేమైంది? ఎనీ బ్రేక్‌త్రూ?’’ అని అడిగాడు. తన కూతురి విషయంలో ఆయన వైఖరికి మండిపడుతున్నా, డ్యూటీ చేయాల్సిందే కాబట్టి ‘‘ఆజాద్ కేసులో ఇన్ఫర్మేషన్ ఏమీ లేదండి. ఎకె గ్రూపు మనమీద పగబట్టి, మనమే కిడ్నాప్ చేయించామని పుకార్లు వ్యాప్తి చేస్తోంది. కానీ, లెట్ మీ ఎస్యూర్ యూ, మన హస్తమేదీ లేదండి.’’ అన్నాడు. ఆయన నిర్లిప్తంగా నవ్వి ‘‘ఏది నమ్మాలో, ఎవర్ని నమ్మాలో తెలియకుండా పోతోంది.’’ అన్నాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియక సుధీర్ నమస్కారం పెట్టి సెలవు తీసుకున్నాడు.

ఆఫీసుకి తిరిగి రాగానే సుధీర్ తన కొలీగ్స్‌ను సమావేశ పరిచాడు. ఎకె గ్రూపుకు గుణపాఠం చెప్పాలంటే జికె గ్రూపు సాయం తీసుకోవాల్సిందే అన్నారు వాళ్లందరూ. మన కుటుంబాలను మనం రక్షించుకోవడానికి ఏ తోవ తొక్కినా ఫర్వాలేదన్నారు. రెండు గంటల్లో జికె గ్రూపుకి చెందిన అండర్ ‌ట్రయల్స్‌ జైల్లోంచి తప్పించుకుని పారిపోయేందుకు ఏర్పాట్లు జరిగాయి. యూనిఫాంలో లేని పోలీసులు, వాళ్లు కలిసి భిక్షపతిని కిడ్నాప్ చేసి, సుధీర్ కూతుర్ని క్షేమంగా అప్పగిస్తేనే, అతన్ని విడిచి పెడతామని ఎకె గ్రూపుతో బేరం పెట్టాలనేది పోలీసులు వేసిన పథకం. కానీ జికె గ్రూపు ఆలోచన వేరేలా ఉంది. తమ గ్రూపులో చాలామందిని కిరాతకంగా చంపేసిన భిక్షపతి దొరికితే ప్రాణాలతో విడిచి పెట్టే ఉద్దేశం లేదు వాళ్లకు. అందుకని పోలీసులతో కలిసి చేసిన దాడిలో భిక్షపతిని రక్షించి, కిడ్నాప్ చేద్దామని పోలీసులు ప్రయత్నిస్తూండగానే జికె గ్రూపు వాళ్లు అతన్ని చంపేసి, పారిపోయారు. పోలీసులే భిక్షపతిని చంపేశారనే మాట ప్రచారంలోకి వచ్చింది.

భిక్షపతి మరణం గురించి వినగానే ఎకెఆర్‌కు కోపం వచ్చింది. ఇప్పుడు విభేదించినా, యిన్నాళ్లూ కలిసి పనిచేసిన కామ్రేడ్ మరణానికి పగ తీర్చుకోవాలనుకున్నాడు. తన వద్ద బందీగా ఉన్న సుధీర్ కూతురి తల నరికి సుధీర్‌కు పంపాడు. ప్రభుత్వంపై ఆల్‌ఔట్ వార్ ప్రకటించాడు. ముఖ్యమంత్రి ఉంపుడుగత్తె ఉండే చోటు తనకు తెలుసని, బయటకు చెప్పుకోలేని వ్యవహారం కాబట్టి, అఫీషియల్‌గా సెక్యూరిటీ ఏమీ ఉండదని ఒక అనుచరుడు చెప్పడంతో ఆమెను చంపేయమని ఆదేశించాడు.

తన ప్రియురాలి చావు వార్త వినగానే ముఖ్యమంత్రి కుప్పకూలాడు. ఈ లోకంలో తననుండి ఏమీ ఆశించకుండా ప్రేమించిన వ్యక్తి అలా దారుణంగా మరణించడంతో జీవితంపై విరక్తి కలిగింది. అమాయక ప్రజలు బలికావడానికి నైతిక బాధ్యత వహిస్తూ, పదవి నుంచి, ప్రజాజీవితం నుంచి తప్పుకుంటున్నాననీ ఒక చిన్న స్టేటుమెంటు యిచ్చి, రాజీనామా చేసేశాడు.

ఆ తర్వాతి రెండు నెలల్లో రాష్ట్రంలో అయోమయ పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి నిష్క్రమణకు సిద్ధంగా లేని అధికార పార్టీలో ఎవరికి వారే ఆ పదవి కోరడంతో అంతఃకలహాలు పెచ్చు మీరాయి. కుట్రలు, పరస్పర విమర్శలు, లాబీయింగులు, ప్రతిపక్షంలో కొందరితో చేతులు కలిపి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం.. యిలా సంక్షోభం వెంట మరో సంక్షోభం వచ్చిపడింది. మూడు ప్రభుత్వాలు మారాయి.  జవాబుదారీ ప్రభుత్వం ఏదీ లేకపోవడం చేత అంతా యిష్టారాజ్యంగా నడిచింది. పోలీసులు సర్వాధికారాలను తమ చేతిలోకి తీసుకున్నారు. కూతుర్ని పోగొట్టుకుని, కసితో రగిలిపోతున్న సుధీర్ జికె గ్రూపు సహాయంతో ఎకె గ్రూపును తుదముట్టించాలని చూశాడు. ఎకె గ్రూపు తన బలాన్ని నిరూపించడానికి యథేచ్ఛగా హత్యలు, కిడ్నాపులు చేస్తూ పోయింది. పోలీసుల సాయంతో జికె గ్రూపు ఎకె గ్రూపునే కాక, తమకు భవిష్యత్తులో పోటీ వస్తారనుకున్న ప్రతి గ్రూపునూ కడతేర్చింది. పోలీసులు, నక్సలైట్లు వీధుల్లో హోరాహోరీ పోట్లాడుకోవడం నిత్యదృశ్యమై పోయింది.

రెండు నెలల తర్వాత కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి నక్సలైట్ల పట్ల పాత ప్రభుత్వాలు అవలంబించిన ఘర్షణాపూరిత పద్ధతులన్నీ తప్పని ప్రకటించి, హింసామార్గం వదిలిన నక్సలైట్లందరికీ క్షమాభిక్ష ప్రకటిస్తానని ఆఫర్ చేశాడు. ఎవరైనా మధ్యవర్తి ద్వారా, వాళ్లతో సంప్రదింపులు జరపడానికి సిద్ధమని అన్నాడు. అప్పుడు అందరికీ ఆజాద్ మళ్లీ గుర్తుకు వచ్చాడు. అతని అవసరం యింతలా ఉంటే, ఎక్కడకు పోయాడు? కిడ్నాప్ చేసినవాళ్లు యిప్పటికైనా వదిలిపెట్టరా? పోలీసులే చేసి వుంటే తమ ప్రాణాలు కాపాడుకోవడానికైనా అతన్ని విడుదల చేయాలిగా!

నిజానికి ఆజాద్ ఎప్పుడో ఒకప్పుడు యీ రోజు వస్తుందని ముందే ఊహించాడు. హింసామార్గం ఎక్కువ రోజులు నడవదని, చర్చల ప్రక్రియే ఏకైక మార్గమని యిరు పక్షాలూ గుర్తిస్తాయని ఆశించాడు. అందుకే తనే ‘జనమిత్ర’ పేరుతో పోలీసులకు ఫోన్ చేశాడు. ఎక్కడో అజ్ఞాతంగా దాక్కుని, ఓ వారం తర్వాత బయటకు వద్దామని అనుకున్నాడు. పోలీసులను, నక్సలైట్లను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తే యిద్దరూ తను చెప్పినది చచ్చినట్లు వింటారని అనుకున్నాడు. కానీ అదే రోజు రాత్రి చీకట్లో అతని కారు గుట్ట మీద నుంచి స్లిప్ అయ్యి, కిందనున్న ప్రవాహంలో పడిపోయింది. అతను జలసమాధి అయిపోయాడు. తన సెల్ఫ్-కిడ్నాప్ రాష్ట్రంలో విలయాన్ని సృష్టించి, అంతిమంగా, తనకు బొత్తిగా పడని జికె గ్రూపుది పైచేయి అయిందని తెలిస్తే అతని ఆత్మ ఎంత క్షోభించేదో!

ఇదీ కథ. ముక్తాయింపుగా యీ కథకు ప్రేరణ ఏమిటో చెప్పాలి. 1990లో అనుకుంటా, బాలగోపాల్ అనే ప్రజాహక్కుల ఉద్యమకర్త, నక్సలైటు సానుభూతిపరుణ్ని ‘ప్రజాబంధు’ అనే వ్యక్తి కిడ్నాప్ చేశారనే వార్త వచ్చింది. ఆ టైములో ప్రజాబంధు వేరెవరో కాదు, పోలీసులే అనే పుకారూ వచ్చింది. ఆ తర్వాత ఏ డిమాండ్లూ లేకుండానే ఆయన విడిచి పెట్టబడ్డాడు. బయటకు వచ్చాక తననెవరూ కిడ్నాప్ చేయలేదని బాలగోపాల్ ప్రకటించారు. ఆయన 2009లో మరణించారు. ఇప్పటివరకు ఆ కిడ్నాప్ ఒక మిస్టరీగానే మిగిలింది. వచ్చే నెల నాలుగో బుధవారం మరో స్వీయానువాదం కథ. 

– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2022)

mbsprasad@gmail.com

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను