Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ కథ: ప్రమోషన్ కైతే ఫర్వాలేదా?

ఎమ్బీయస్ కథ: ప్రమోషన్ కైతే ఫర్వాలేదా?

రమకు మొగుడి పద్ధతి అర్థం కాకుండా పోతోంది. ఇన్నాళ్లూ 'ఆనుమానపు మొగుడులే అని భరించడం నేర్చుకుంది. అప్పుడు అతని అత్యాశ తనకు మింగుడు పడడంలేదు. అదయినా ఎటువంటి ఆశ!?

సీతాపతి చిన్నప్పటి నుంచీ అదోరకం మనిషి. అతని తల్లి సాయంత్రం వేళ గుమ్మంలో కూచుని పక్కింటావిడతో కబుర్లు చెప్పుండడం అతనికి నచ్చేది కాదు. ఆవిడ సాయంత్రం నాలుగవగానే స్నానం చేసి, బొట్టూ కాటుక పెట్టుకుని పౌడరు రాసుకుని మల్లెపూలు పెట్టుకొని గుమ్మంలో కూచునేది. మొగుడి గురించి ఎదురు చూస్తూ తనలాటి ఇరుగమ్మ, పొరుగమ్మలతో బాతాఖానీ కొడుతూ ఉండేది. సీతాపతికి పధ్నాలుగు, పదిహేనేళ్లు వచ్చిన దగ్గర్నుంచి రోడ్డు మీద వెళ్లే మొగాళ్లు ఒక్కసారి ఆగి తల్లి అందాన్ని తేరిపార చూసి వెళ్లడం గమనించేవాడు. ఎవరి గురించి ప్రత్యేకంగా పట్టించుకోకపోయినా, తన అందం, అలంకరణ నలుగురి కంట్లో పడడం ఆవిడకి తృప్తినిచ్చేది. ఎందుకంటే భర్త సాయంత్రం ఆరున్నరకు ఉస్సురంటూ వచ్చి, కాఫీ తాగి ఉషారు తెచ్చుకుని వీధి చివర కల్వర్టు దగ్గర ఫ్రెండ్స్‌తో చేరి రాజకీయ నాయకులందర్నీ చీల్చి చెండాడేసి తొమ్మిది గంటలకు ఇంటికి చేరేవాడు!

'అమ్మా, ఇంట్లో లోపలి కెళ్లి కూచోకూడడూ?' అని సీతాపతి విసుక్కొంటే, “ఈ మూడు గదుల ఆగ్గిపెట్టె ఇళ్లల్లో రోజంతా మగ్గిపోయి, సాయంత్రం గాలి తిరిగినప్పుడు గుమ్మంలో కూర్చోకపోతే ఎలాగరా? మనకేమైనా లాన్లున్నాయా? పోర్టికోలున్నాయా? సిటవుట్లు వున్నాయా? నేనే కాడు, ఈ పేటలో ఆడంగులందరూ ఇలాగే కూచుంటారు పోయి చూడు. అయినా మీ నాన్నగారికి లేని అభ్యంతరం నీకేమిట్రా వెర్రి సన్నాపీ. వెళ్లి నీ చదువు చూసుకో" అంటూ ఆపేక్షగానే చివాట్లేసింది. అప్పుడేమీ అనలేకపోయినా ఇంటరు తప్పాక చెల్లెలు కూడా తల్లి పక్కన చేరితే ఇక ఓర్చుకోలేక చెల్లెల్ని తిడితే ఆమె ఫెడీమని జవాబిచ్చింది. "నువ్వు మాత్రం సాయంత్రం రోడ్డట్టుకు తిరుగుతావేం? నువ్వూ మధ్యగదిలో తలుపులు బిడాయించుక్కూచో, నేనూ పక్కనే కూచుంటా. నీ పెళ్లాం మీద చూపించి నీ ఆధార్టీ. వామీద చూపిస్తే ఊర్కోను' అంటూ పోట్లాడింది.

అప్పుడే నిర్ణయించుకొన్నాడు సీతాపతి- కష్టపడి పైకొచ్చి పెళ్లాం యితరుల కంటబడనక్కర్లేనంత కాంపాండున్న ఇంట్లో కాపురం ఉండాలని! కష్టమైతే పడ్డాడు కానీ పైకి రాలేదు. ముప్ఫయి రెండేళ్ల వయసు వచ్చేదాకా చూసి, యింతకంటే పైకి రానని తెలుకున్నాక రమను కట్టుకొన్నాడు. అందమైన భార్యనైతే పొందాడు కానీ ఆమెకు అందమైన ఇల్లు సమకూర్చలేక పోయాడు. ఓ ఇరుకు వాటా మాత్రమే అతనికి రాసి పెట్టి వుంది. ఇంటికి వస్తూనే కర్టెన్లు బిగించాడు. కావాలంటే పెరట్లో కూచోమన్నాడు. కానీ, అది ఎనిమిది వాటాల పంచవటి కాలనీ. నూతి దగ్గరికి వచ్చే జనం, పోయే జనం, పని చేసుకొనే జనం, మగా, ఆడా! అందుకని గదిలోనే కూచుని కాలం గడపమన్నాడు భార్యను.

'తన తల్లీ, చెల్లీ ఆరుబయట కూచున్నా కట్టుదప్పలేదు. తన భార్య కూచోకపోయినా తప్పవచ్చు. అందువల్ల తన జాగ్రత్తలో తను ఉండడం మంచిది' అనుకొని తనవైపు, భార్యవైపు మగ చుట్టాలు ఒక్కర్నీ రానిచ్చేవాడు కాదు. అన్నదమ్ముల వరసవాళ్లు కూడా తన ఎదురుగా ఉండి మాట్లాడాల్సిందే. బావ, మావ వరసవాళ్లతో గిల్లికజ్జాలు పెట్టుకొని వాళ్లు తన ఇంటికి రాకుండా చూసుకొన్నాడు. పొరుగువాళ్లలో కూడా తూర్పువైపు వాటాలో ముసలమ్మ గార్ని మాత్రం కలవనిచ్చేవాడు. రమ కూడా క్రమంగా ఈ అనుమానం మనిషితో బతకడం నేర్చుకొంది. ఈ ఒక్కటీ తప్ప మిగిలినవన్నీ మంచి గుణాలే. తనను బజారుకు తరిమి పనిచేయించడు. ఉబుసుపోవడం లేదంటే రేడియో కొని పెట్టాడు. వినివిని విసుగుపుట్టిందంటే పోర్టబుల్ టీవీ కొని పెట్టాడు. ఏదో దేవుడు చల్లగా చూసి ఓ పిల్లా, పాపా కడుపున పడితే వాళ్లతో కాలక్షేపం అయిపోతుంది. తనకీ పెద్ద కోర్కెలు లేవు.

పరిస్థితి ఇలా ఉండగానే సీతాపతి ప్రమోషన్ గొడవొచ్చి పడింది. సీతాపతి సర్వీసులో చేరి పది సంవత్సరాలయినా హెడ్ క్లర్క్ ప్రమోషన్‌పై ఆశ పెట్టుకోలేదు. ఉన్న ఇద్దరు హెడ్‌క్లర్క్‌లకీ ఒకడికి పది సంవత్సరాలు, మరొకడికి ఎనిమిది సంవత్సరాలు సర్వీసుందింకా. ఇంతలో హఠాత్తుగా పది సంవత్సరాలాయన పోవడంతో ఖాళీ ఏర్పడింది. దానికి పోటీపడ్డవాళ్లలో అతనితో సమానమైన అర్హతలు, సీనియారిటీ వాళ్లు ముగ్గురున్నారు. వాళ్ల మధ్యనే పోటీ! ఈ మధ్యనే కొత్త మేనేజరు వచ్చాడు. అతని రిపోర్ట్ మీదే మొత్తమంతా ఆధారపడి వుంది. అదే సీతాపతి బాధ! 'పాత మేనేజరయితే మనకి గ్యారంటీగా ప్రమోషన్ వచ్చేసేది. ఓసారి ఆయన టిఏ బిల్స్‌లో గొడవొస్తే పాత బిల్లులు దాచేసి ఆయనకు ఉపకారం చేసి పెట్టేడు తను. కొత్తవాడు ఎలాటివాడో ఏమో తెలియదు. మనిషన్నాక ఏదో ఒక బలహీనత ఉండకపోతుందా? అదేదో కనుక్కొని అప్పు తెచ్చయినా అది సమకూరిస్తే చాలు. ప్రమోషన్, మంచి జీతం, కాంపౌండు వాల్ ఉన్న ఇంటికి మారిపోవచ్చు. తక్కినవాళ్లకు ఈయన గురించి ఏం తెలుసో?'

వాళ్ళు తెలియదన్నారు. ఆలోచించగా ఈయన పనిచేసిన పాత బ్రాంచిలో ఫ్రెండు గుర్తొచ్చాడు. వివరాలకై ఉత్తరం రాసాడు. ఉత్తరం అందగానే స్నేహితుడు ఫోన్‌ చేశాడు. 'ఇటువంటివి ఉత్తరంలో రాయడానికి కుదరదని ఫోన్ చేస్తున్నాను గురూ! ఇతను డబ్బూ, గిబ్బూ ఏమీ తీసుకోడు. మామూలుగా స్ట్రిక్టు. అయితే ఒకటే వీక్నెస్సని చాలా తక్కువ మందికి తెలుసు. ఆడాళ్ల పిచ్చి. పెళ్లాన్ని వాడి పక్కలో పడుకోబెట్టిన వాడికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, ట్రైనింగులు అన్నీ ఇస్తాడు. పాపం ఏం చేస్తాడు? భార్య తన దగ్గర ఉండదు. విడాకులు తీసుకోలేదు కానీ, పిల్లల చదువు కోసం అంటూ వేరే ఊళ్లో పిల్లల్ని పెట్టుకుని ఉంటుంది. దాంతో ఈ పద్ధతి మొదలెట్టాడు. కానీ ఓ సుగుణం వుంది. పని చేసి పెడతాడు. పైకి ఎక్కడా చాటింపు వేసుకోకుండా గుంభనంగా ఉంటాడు. అందుకనే సంగతి బయటకు రాక, చాలా మందికి తెలీదు. ప్రమోషన్ కావాలంటే పెళ్లాన్నప్పగించాల్సిందే. నువ్వా పని చెయ్యవ్, నాకు తెలుసు. అందుకని ఆశ విడిచి పెట్టేయ్. ఇది నా సిన్సియర్ సలహా'.

సీతాపతి దిమ్మెరపోయాడు. 'ఎంత దారుణం' అనుకొన్నాడు. సాయంత్రానికి 'మనుషులు అనేక రకాలు' అని సమాధానపడ్డాడు. మరుసటి రోజు సాయంత్రానికి 'అందరితోబాటు నడవనివాడు ఎందుకూ కొరగాడు' అనుకొన్నాడు. మూడు రోజులకి 'ఒకటి సంపాదించాలంటే మరొకటి పోగొట్టుకోవాల్సిందే. ఇదే జీవితం' అని ఓదార్చుకున్నాడు. వారం రోజుల తర్వాత హఠాత్తుగా తట్టింది - ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా తన ప్రమోషన్ వస్తుందని నమ్మకం ఏమిటి? అప్పుడొచ్చే మేనేజర్ ఎటువంటివాడో? తనకు ఎవరో ఒకరు పోటీకి రాకమానరు. ఇటువంటి సమస్య మళ్లీ వచ్చి తాను రాజీపడినా పని అవుతుందని గ్యారంటీ ఏముంది? ఆ పడేదేదో ఇప్పుడే పడితే మంచిది. ఇతను గ్యారంటీ మనిషని ఫ్రెండు చెప్తున్నాడు. అయినా తనలాటివాడు ఇటువంటి స్థితికి దిగజారడమా? ఛా, ఛా అనుకొన్నాడు.

పది రోజులు పోయేసరికి 'నేను ఎటువంటి వాణ్నో అందరికీ తెలుసు. నాకు ప్రమోషన్ వచ్చినా ఇలా వచ్చిందని ఎవరూ అనుకోరు. ఈ విషయం నాకూ, మేనేజరుకూ, రమకూ తప్ప మరెవరికీ తెలియదు' అని అనుకున్నాడు. కానీ రమతో ఈ విషయం చర్చించే తెగింపు చేయలేదు. పదిహేను రోజుల తర్వాత, మేనేజరు “సీతాపతిగారూ, ప్రమోషన్ విషయం ఏమయిందని హెడ్డాఫీసువాళ్లు వాకబు చేస్తున్నారు. సూటబుల్ కేండిడేట్ ఎవరూ నాక్కనబడడం లేదు. అక్కణ్ణుంచే ఎవరైనా పంపమని నోట్ పుటప్ చేయండి" అన్నప్పుడు అప్రయత్నంగానే “సార్, మీరు మనుష్యులని తరచి చూడకుండానే ఓ నిర్ణయానికి రాకూడదు. ఓసారి మా ఇంటికి వచ్చి మా సంగతీ, సందర్భం తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది. ఈ నోట్ తర్వాత రాస్తాను సార్" అన్నాడు. ఆయన ఏమనుకొన్నాడో ఏమో రెండు నిమిషాలు పరీక్షగా సీతాపతి మొహం కేసి చూసి, “సరే అలాగే కానిద్దాం" అన్నాడు.

మేనేజరు దగ్గర ఏదో చెప్పేసినా భార్య దగ్గర ఈ విషయం ఎలా చెప్పాలో సీతాపతి చాలాసార్లు రిహార్సల్ వేసుకొన్నాడు. ఆ రాత్రి భోజనాల టైములో డబ్బు ఇబ్బందుల గురించి, జీవితంలో పైకి రావడానికి అందరూ అడ్డదారులు తొక్కడం గురించీ, అందరూ నడిచే దారిన వెళ్లకపోతే పడే కష్టాల గురించీ, ఒక్కసారి కళ్లు మూసుకుని భరిస్తే కలిగే లాభాల గురించీ, జీవితాంతం ఉండబోయే పెద్ద ఇల్లు గురించి చెప్పుకొచ్చాడు. చివరగా విషయం బయట పెట్టాడు. ఊహించినట్టుగానే రమ ఏడ్చింది, రాముడి పేరు పెట్టుకున్నందుకైనా భార్యను కాపాడుకోవాలని తిట్టింది, కేకలేసింది, నెత్తి మొత్తుకుంది, అన్నం మానేసి అలిగింది. బెక్కుతూ మంచమెక్కి ఎప్పటికో నిద్రపోయింది. తెల్లారి లేచాక ఉబ్బిపోయిన కళ్లతో మొగుడికేసి చూసి 'మీ ఇష్టప్రకారమే కానీయం'డంది.

తనెందుకు సరేనందో రమకే సరిగ్గా అర్ధం కాలేదు. 'భోగభాగ్యాలమీద ఆశ లేదని తనకు తాను నచ్చచెప్పుకుంటున్నా, తనూ దరిద్రంతో వేగలేకపోతోందా? మొగుడు తనను పంజరంలో పెడతాడు సరే. అది బంగారు పంజరమయినా బాగుణ్ణు. ఇప్పుడున్నది ఇనుప పంజరం. పిల్లలు పుడితే ముక్తి కలుగుతుందని ఎదురు చూస్తోంది తను. పెళ్లయి ఇన్నాళ్లయినా పిల్లలు కలగలేదేం? ఆయన లోపమా? లేక పద్ధతి తెలీదా? పూర్వానుభవం ఉంటే తనకు తెలిసేది ఏది సరైన విధానమో, కాదో. ఈ మేనేజరు దగ్గర తెలుస్తుందేమో! పిల్లల కోసం పరీక్షలు చేయించుకోమంటే ఈయన వద్దంటారు. నపుంసకుడా? పోనీ ఈ మేనేజరు వల్లనైనా పిల్లలు పుడితే బాగుండును. తనలో లోపం వలననే ఆయన ఇంత కట్టడి చేస్తున్నారేమో! ఈ కట్టుబాట్ల వల్లనే పరాయి మొగుడితో పొందు తను వాంఛిస్తోందా? తను చేసేది తప్పా? పుస్తకాలలో ఎక్కడో చదివింది. పాత కాలంలో ఇంటికొచ్చిన అతిథికి అన్నం పెట్టి, పక్కవేసి, పెళ్లాన్ని కూడా అప్పగించేవారట. అది అతిథి మర్యాదట. ఏమో బాబూ, తప్పో, ఒప్పో మొగుడు చెప్పిన ప్రకారం చేస్తున్నాను. పాపం, పుణ్యం ఆయనదే! అనుకుని సర్ది చెప్పుకుంది.

భార్య ఒప్పుకోవడంతో సీతాపతి మనస్సు చివుక్కుమంది. ఆవిడ శీలం శంకించబోయేడు కూడా. కానీ పెళ్లానికి సవ్యమైన మార్గాల్లో కూడు పెట్టలేనివాడు పెళ్లెందుకు చేసుకోవాలని ఆవిడ తిట్టిన విషయం గుర్తుకొచ్చింది. “తను పరమ విధేయురాలు. మరొకత్తయితే నేను పెట్టే ఆంక్షలకు పారిపోయేది. లేకపోతే తిరగబడేది. చెప్పిన మాట వినే రకం కాబట్టి నా ఆజ్ఞ పాలిస్తోంది. ఆమెదేం తప్పులేదు” అనుకొన్నాడు. ఇంకా ఆలోచించగా ఇంకో మార్గం తట్టింది. కర్ర విరక్కుండా, పాము చావకుండా కార్యం సాధించడంలోనే ఉంది గొప్ప. మేనేజర్ని ఊరించి, ఊరించి దగ్గరకు దాకా తీసుకు వచ్చి ఏ క్షణాన్నయినా అందుతుందని అనిపించి, కబుర్లతో కాలక్షేపం చేయించి ప్రమోషన్ తెప్పించేసుకుంటే ఆ తర్వాత రమకు ఇన్ఫెక్షన్ వచ్చిందని కొంతకాలం దాటించేస్తే.., ప్రమోషన్ కన్ఫర్మ్ అయిపోయాక 'పోరా' అంటే సరి! ఇవేమీ వివరంగా చెప్పకుండా భార్యకు తెలుగు సినిమాలు చూసి కాసిన్ని 'వేషాలు' నేర్చుకోమన్నాడు.

రమకంతా ఆయోమయంగా ఉంది. మేనేజరు మొదటిసారి వచ్చినప్పుడు మరీనూ. ఆయన్ని రమకి పరిచయం చేసి 'ఇంట్లో కాఫీపొడి అయిపోయింది వెళ్లి తెస్తాను సార్' అంటూ సీతాపతి బయటకెళ్లాడు. రమ మేనేజరు ఎదురుగా తలవంచుకొని కూచుంది. మేనేజరుకూ ఉతుకుష్టంగా వుంది. అతనికి ఇన్నాళ్లూ తగిలిన మనుష్యులు చొరవ గలవాళ్లు, భర్త అలా వెళ్లగానే చెయ్యిపట్టుకొని మంచం మీదకి తీసుకుపోయే వాళ్లు, మాట్లాడకుండా ఒళ్లు అప్పగించేసేవారు. తను ఇష్టమొచ్చినంత సేపు ఆడుకొని వచ్చేసేవాడు. మొగుడు మళ్లీ మర్నాడు ఆఫీసులోనే దర్శనం ఇచ్చేవాడు. ఈమె చూస్తే ముభావంగా ఉన్నట్టుంది. ఇష్టముందో, లేదో? తనకా చొరవ తీసుకొని తెలుసుకొనే అవసరమూ, అలవాటూ, నేర్పూ లేవు. ఏం మాట్లాడాలో తెలీకుండా ఉంది.

చివరికి రమే మొదలు పెట్టింది “మావారు ఉన్నంత సేపూ అంతలా మాట్లాడి, ఆయన వెళ్లగానే మూగనోము పట్టేరేం?" అని. “నాకు ఆఫీసు బయట ఆడవాళ్లతో మాట్లాడడం అంత అలవాటు లేదండి” అన్నాడతను. రమ తన కాలేజీ రోజులు, ఇటీవల చదివిన పుస్తకాలు గుర్తుకు తెచ్చుకొని తమాషాగా నవ్వి “మగాళ్ళతో మాట, ఆడాళ్లతో ఆట, అదన్నమాట మీ పాలసీ” అంది ఉడికిస్తూ. మేనేజరుకూడా కొద్దిగా ధైర్యం తెచ్చుకున్నాడు. మొదటిసారిగా నవ్వేడు. “మీరు చమత్కారంగా మాట్లాడతారే“ అన్నాడు. రమ కొంటెగా నవ్వి “పదిమందితో తిరిగిన వాళ్లకు అబ్బుతాయి చమత్కారం, విషయ పరిజ్ఞానం, అనుభవం. వాళ్లు మాలాటి వాళ్లకు పంచాలి" అంది. ఉమనైజింగుతో తను గడించిన లైంగికనైపుణ్యాన్ని ప్రదర్శించమని ఆమె కోరుకుంటోందనుకున్న మేనేజరు హుషారుగా “ష్యూర్, ష్యూర్" అన్నాడు.

ఇంతలో సీతాపతి తిరిగి వచ్చేశాడు. ‘రమా, కాఫీ పొడి ఇదిగో'నంటూ పొట్లం ఆమె చేతిలో పెట్టాడు. మేనేజరు, రమ తెల్లబోయారు. 'ఈమాత్రం యింగితం తెలియని వాడేమిట్రా వీడు' ఆనుకొని మేనేజరు ముఖంమీద చికాకు ప్రదర్శించాడు. కూడా. “సారీ సార్! అయిపోయిందనుకున్నాను” అన్నాడు సీతాపతి వినయం నటిస్తూ, “ఎక్కడయ్యా?!" అన్నాడు మేనేజరు కోపంగా. “పోన్లెండి సార్. బుధవారం మళ్లీ వద్దురుగాని” అంటూ పంపించేశాడు.

బుధవారం మళ్లీ అదే తంతు. సీతాపతి బయటకెళ్లగానే మేనేజరు అడిగేడు “ఆఫీసు పనిలోనే అనుకొన్నాను. మీవారు అన్నిట్లోనూ స్పీడే లాగుంది. ఇలా బజారుకెళ్ళి అలా వచ్చేస్తున్నారు” అన్నాడు.

“పెళ్లి మాత్రం లేటుగా చేసుకొన్నారు” అంది కొంటెగా.

“పెళ్ళి సరే. ఆ తర్వాతది? "

“నార్మలేదో, స్పీడేదో నాకెలా తెలుస్తుంది?”

“నాతో వుంటే తెలుస్తుంది” ఉత్సాహంగా అన్నాడు మేనేజరు.

“మీరు నార్మలా?”అంది రమ ఒత్తి పలుకుతూ. మేనేజరు ముఖం తుడుచుకున్నాడు. అందులో విపరీతార్థం తోచింది. రమ కూడా గుర్తించింది, అతను అవమానకరంగా ఫీలవుతున్నాడని. ఎలా సరిదిద్దాలో తెలియలేదు. కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. పరిస్థితి చక్కదిద్దడానికి “ఇల్లు చూసి ఇల్లాల్ని చూడమన్నారు. ఇల్లాల్ని చూశారు. ఇల్లు చూస్తారా?”అంది. మేనేజరు 'హమ్మయ్య' అనుకొని 'చూపించండి' అన్నాడు. ఇల్లు చూపుతూ 'ఇంటికీ ఇల్లాలికీ పోలిక ఉంటుందేమో అందుకనే లాగుంది ఆ సామెత. ఇల్లెలా ఉంది?”అంది రమ. “ఇరుగ్గా వుంది” అన్నాడు మేనేజరు.

రమకు ఆ పదప్రయోగం నచ్చలేదు. మొహం చిట్లించింది. మేనేజరు బెదిరాడు, ఆమెకు కోపం వచ్చిందేమో, ఇన్సల్ట్‌గా ఫీలయిందేమో అనుకుని, ఏమీ మాట్లాడకుండా కుర్చీలో కూలబడ్డాడు. వ్యవహారం ముందుకు సాగి ఏదో ఒకటి జరిగితే బాగుణ్ణని రమ అనుకుంటూండగానే సీతాపతి వచ్చిపడ్డాడు. మేనేజరు కోపంగా చరచరా బయటకు వెళ్ళిపోయాడు.

మర్నాడు ఆఫీసులో గట్టిగా చెప్పాడు, శనివారం మళ్లీ వస్తానని. రెండు గంటల దాకా సీతాపతి తిరిగివస్తే ఊరుకోడట. పంపాల్సిన రిపోర్టు దీని గురించే తొక్కి పెట్టాడుట. సీతాపతి రమకు మేనేజరు వస్తున్న విషయం చెప్పి 'జాగ్రత్త' అన్నాడు.

రమకు మొగుణ్ణి చూస్తే అసహ్యం వేసింది. అతని ప్లాను అర్థమయ్యింది. చేపకై తనను ఎఱగా వాడుతున్నాడు. కానీ చేప ఎఱను మింగకూడదు. భార్య పాతివ్రత్యాన్ని చెడగొట్టకూడదు. తనను దీనిలో దింపిందే తను. మళ్లీ మేనేజరు అటు వెళ్లగానే వచ్చి, ‘వాడు ముట్టుకున్నాడా? ఎక్కడ ముట్టుకున్నాడు? ఏమన్నాడు? నువ్వేం సమాధానం యిచ్చావ్?’ అంటూ వంద ప్రశ్నలు, వెయ్యి సందేహాలూ. అనుమానం మనిషి అలాగే వుంటే పోయుండేది. ప్రమోషన్ కైతే భార్య ఎలా చెడినా ఫర్వాలేదన్న కక్కుర్తి దేనికి? ఈ డబుల్ గేమ్ ఎందుకు మొదలు పెట్టడం? తనకి తన పని జరగాలి, అవతలివాళ్లకి పని జరక్కూడదు. ఇదీ వెధవ బుద్ధి. మధ్యలో తను ఛస్తోంది. మొగుడి తిక్క కుదరాలంటే ఈసారి ఏదో ఒకటి - అటో, ఇటో జరగాలి. ఈ దిక్కుమాలిన అవస్థ కంటె ఏదైనా బెటరే. ఆలోచించిఆలోచించి బుర్ర వేడెక్కిపోయి, ఏది ఏమైనా ఫర్వాలేదన్న స్థితికి వచ్చేసింది రమ.

అటు మేనేజరు కూడా తననుకొన్నది సాధించి తీరాలన్న తీర్మానానికి వచ్చాడు. ఇన్నాళ్లూ ఆమెను మెప్పించే ప్రయత్నం ఏదీ చేయలేదని గుర్తొచ్చింది. అందుచేత సీతాపతి అటు వెళ్లగానే, 'మీరు చాలా అందంగా ఉంటారు' అన్నాడు పోర్షన్ అప్పజెప్పినట్లు. వంటింట్లో అలికిడి వినిపించింది రమకు. సీతాపతి వీధి గుమ్మంలోంచి వెళ్లి వెనుక గుమ్మంలోంచి దూరి వంటింట్లో దాక్కున్నాడన్నమాట తన 'శీలరక్షణ'కు. అతని కళ్లెదురుగానే ఇది జరిగితే మరీ మంచిది అనిపించింది. తెగించింది. గుసగుసగా 'అందంగా ఉన్నానంటున్నారా? మందంగా ఉన్నానంటున్నారా?' అంటూ పైట పక్కకి లాగి పొట్టమీద చేయి వేసుకొని చూపించింది.

మేనేజరుకు అది చూడగానే నోట తడారిపోయింది. కాస్సేపు పెదాలు నాక్కుని, ఏదో ఒకటి అనాలని 'కండపట్టి వుంటేనే అందం' అని ఊరుకున్నాడు. రమ ఫైనల్ డ్రామాకు సిద్ధపడింది. మెల్లగానే 'కండ ఉంటేనే అందం అంటూ అక్కడే కూర్చుంటారేం? మిమ్మల్ని చూస్తే షోమాన్ అంటే కొత్త అర్థం తోస్తోంది. షోపుటప్ చేసి తను మ్యాన్, మగాడు అని చూపించుకునే వాడన్నమాట. మీ ఆవిడ వదిలిపెట్టి పోయిందంటే మీ మదపిచ్చి వలన కాదు, చూపులతో సరిపెట్టడం చూసి విసుగెత్తి వేరే ఊళ్లో సెటిలైందని అర్థమైంది లెండి.’ అంది వెక్కిరింతగా. మేనేజరుకి రోషం వచ్చింది. ఒక్క ఉదుటున ఆమె మీదకు లంఘించాడు. రెండు చేతులకూ పని చెప్పాడు. 'అబ్బ ఎంత కసి' అంటూ కెవ్వుమంది రమ. 'మరేంటనుకున్నావ్?' అంటూ పెదాల మీద పడి కొరికాడు. కొరుకుతూనే చేతులు వెనక్కి పోనిచ్చాడు.

జరుగుతున్నది చూసి సీతాపతి కొయ్యబారిపోయేడు. తన భార్యను, తను కూడా ఎప్పుడూ చేయని విధంగా, దారుణం.... వెధవ ప్రమోషన్.... ముందు పెళ్లాన్ని కాపాడుకోవాలి అనుకున్నాడు. చాటునుంచి సీతాపతి మీదకు ఉరకడంతో మేనేజర్ బిత్తరపోయేడు. అతను కొట్టే దెబ్బలు తట్టుకోలేక కింద పడిపోయాడు. తేరుకొనే టైముకూడా ఇవ్వలేదు సీతావతి. కొట్టి, కొట్టి అలసిపోయేక ఒగరుస్తూ 'పోరా స్కౌండ్రల్' అని మాత్రం అనగలిగేడు. 'అమ్మయ్య, దరిద్రం వదిలింది' అనుకొని, రమ మూల కెళ్లి నుంచుంది.

మేనేజరు చిదిమిన పెదవిని తుడుచుకుంటూ 'నీకు ప్రమోషన్ రాదు. సరికదా, ఇంక్రిమెంటు ఆపేస్తాను చూడు' అని అరిచాడు కోపంగా. 'ఇంక్రిమెంటూ అక్కర్లేదు, ఏదీ అక్కర్లేదు. నేనే రిజైన్ చేసి పోతాను. వేరే ఉద్యోగం దొరక్కపోదు. పోతూ, పోతూ నీ గుట్టంతా బయట పెట్టి, నీ సంగతి అందరికీ దండోరా వేసి పోతాను. పుండాకోర్’ అన్నాడు నరసింహావతారంలో ఉన్న సీతాపతి.

మేనేజరు చప్పబడిపోయేడు. తలకాయ పట్టుకు కూచుండి పోయేడు. రమ మంచినీళ్లు పట్టుకువచ్చి ఇస్తే తలెత్తి చూసి 'సారీ' అన్నాడు. కాస్సేపు పోయాక 'మనం ఈ విషయం ఇక్కడితో మరచిపోదాం. నీకు ప్రమోషన్ రికమెండు చేస్తాను. ట్రాన్స్‌ఫర్ కూడా అవుతుంది. దగ్గరూళ్లోనే లెండి' అన్నాడు.

నెల తిరిగేసరికి రమ ఇల్లు ఖాళీ చేస్తోంది. 'కొత్త ఊళ్లో మంచి కాంపౌండున్న ఇల్లు దొరికిందట. హమ్మయ్య! ఆనాడు తనలా తెగించి ఉండకపోతే ఆ చిత్రహింస ఇంకా ఎంతకాలం సాగేదో' అనుకుంది. (వ్యథావనితాయణంలో మరో కథ వచ్చే నెల మొదటి బుధవారం నాడు)

– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?