Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍ కథ: వైట్‍ నైట్‍

ఎమ్బీయస్‍ కథ: వైట్‍ నైట్‍

‘’ఈ రాములు సంగతేమిటంటావ్‍?’’ అడిగాడు సిఎం.

‘’మీకు తెలియనదేముంది? పిలిచి మంత్రి పదవి యిచ్చారుగా..’’ అన్నాడు ఐజీ.

‘’అదే కదా, బుద్ధి తక్కువ పని! నాలుగుసార్లుగా ఎమ్మేల్యేగా గెలుస్తూ వచ్చాడు. ఎవడూ పట్టించుకోలేదు. ఏవో చిలక్కొట్టుళ్లు తప్ప పెద్దగా సంపాదించుకోలేదు. పోనీ దళితుడు కదా, వాళ్లని ఉద్ధరించానని చెప్పుకోవచ్చనుకుని మంత్రిని చేశా...’’

‘’..క్రీడల మంత్రి పదవి చాలనుకున్నారు...’’ ఐజీ చిరునవ్వు నవ్వుతూ అన్నాడు.

సిఎం నవ్వాడు. ‘’వాడి మొహానికి అదే ఎక్కువ. ఏవో జిల్లా సమీకరణాలు, కులసమీకరణాల్లో మంత్రి పదవి యిద్దామనుకున్నాను. ఇచ్చాను. చూస్తే మేయడం మొదలెట్టాడు. సరేలే ఎవడు తినటం లేదు కనుక అని వూరుకుంటే గ్రూపులు కడుతున్నాడు. నాకే ఎదురు తిరుగుతున్నాడు...’’

‘’...అందుకేగా, పాతికేళ్లక్రితం గుడిసెలో వుండేవాడివి, యిప్పుడు యిన్ని ఆస్తులెలా వచ్చాయని అప్పోజిషన్‍ లీడరు చేత అడిగించారు...’’

సిఎం కనుబొమ్మలు పైకి లేచాయి. ‘’నేనే అడిగించానని అనుకుంటున్నారన్నమాట..’’

‘’.. ప్రస్తుత పరిస్థితుల్లో స్వపక్షం కంటె ప్రతిపక్షం బలంతోనే ప్రభుత్వం నడుస్తోందని అనుకుంటున్నారు ప్రజలు..’’

‘’...ప్రజల సంగతి సరే, మీ యింటెలిజెన్సు వాళ్లు ఏమన్నారు?’’

‘’...ఇంచుమించు అలానే అన్నారు. రాములు జోరు తగ్గితే అప్పోజిషన్‍ లీడరు కంటె సిఎం గారికే లాభం కదా అని వాళ్ల లెక్క..’’

సిఎం ఫక్కున నవ్వాడు - ‘’..అసాధ్యులయ్యా..’’

‘’..రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని మా వాళ్ల నమ్మకమండి..’’ వినయం నటిస్తూ అన్నాడు ఐజీ.

‘’ఇంతకీ యిప్పుడు రాములు ఏం చేయబోతున్నాట్ట?’’

‘’ఆరోపణలు ఖండిస్తూ రేపే స్టేటుమెంటు విడుదల చేయబోతున్నారండి...’’

‘’...అవునా!? సంజాయిషీ ఏం యిచ్చాడట?’’ ముందుకు వంగి కుతూహలంగా అడిగాడు సిఎం.

‘’మీరు కూడా వూహించలేరండి. ‘మేం ఎప్పుడూ ఆస్తిపరులమే. తాతముత్తాతల నుండి ఆస్తులున్నాయి. సహజక్రమంలో వాటి విలువ పెరిగి యింతవాణ్నయ్యాను తప్ప అవినీతికి పాల్పడవలసిన ఖర్మ నాకు పట్టలేదు..’ అన్నారు..’’

సిఎంకు ఛట్టున కోపం వచ్చింది. ‘’ఆస్తిపరులా? గాడిద గుడ్డు కదూ.. పెద్ద జమీందారులా కబుర్లు చెపుతున్నాడే, మరైతే గుడిసెలో కాపురం ఎందుకో!’’

ఐజీ కాస్త వెక్కిరింతగా ‘’.. మా నాన్న గాంధేయవాది. సింపుల్‍గా బతకడం ఆయన కిష్టం. అందుకని ఆస్తులున్నా వూరి చివర గుడిసెలో మా వాళ్లమధ్య బతికేం..’’ అని చెప్తూ సిఎం ఎఱ్ఱగా చూడడంతో ‘’..అని రాములు గారంటున్నారు..’’ అని పూర్తి చేశాడు.

సిఎం పళ్లు పటపటలాడించాడు. ‘’చెప్పగానే సరిపోయిందా? జనాలు చెవిలో పువ్వులు పెట్టుకున్నారనుకున్నాడా?’’ అని అరిచాడు.

‘’కావాలంటే ఎలక్షన్‍ అఫిడవిట్‍ చూసుకోమంటున్నారండి. అవి చూస్తే క్రమేపీ తన ఆస్తులు ఎలా పెరిగాయో తెలుస్తుందన్నారండి..’’

‘’అదొకటా!? చూపించమనాల్సింది, బండారం బయటపడేది..’’

‘’..వెరిఫై చేశాం. ఆయన చెప్పిన కరక్టు. ఎప్పణ్నుంచో ఆస్తులున్నట్టు కనబడుతోంది. ఈయన ప్రతీసారీ డిక్లేర్‍ చేస్తూ వచ్చాడు...’’

ఆ అంటూ నిర్ఘాంతపోయాడు సిఎం. లేచి అటూ యిటూ తిరిగాడు. మంచినీళ్లు తాగాడు. పది నిమిషాలపాటు తల విదిలిస్తూ కూర్చున్నాడు. చివరకు ‘’దీనిలో ఏదో మిస్టరీ వుంది. నాకు తెలుసు వాడి బ్యాక్‍గ్రౌండ్‍. ఒట్టి గోచీపాతరాయుడు. మనమంతా వున్న ఆస్తులు దాచుకోలేక ఛస్తూ వుంటే వీడు లేనివి వున్నాయని ఎందుకు చెప్తాడంటావ్‍?.. కనుక్కో.. ఏదో వుంది దీనిలో.. సాధ్యమైనంత త్వరగా నాకు రిపోర్టు చేయి.’’ అన్నాడు.

ఐజీ సెల్యూట్‍ చేసి వెళ్లిపోయాడు.

ఆ సాయంత్రం ఐజీ తన పాత సహచరుడు మురళిని యింటికి డిన్నర్‍కి పిలిచాడు. మురళి కూడా ఐపియస్‍యే. మూడేళ్ల క్రితం వాలంటరీ రిటైర్‍మెంట్‍ తీసుకున్నాడు. పిలవగానే వచ్చాడు. రసగోష్టి తారస్థాయికి వెళ్లాక రాములు సంగతి అడిగాడు ఐజీ. ‘’రేపు యిలా స్టేటుమెంటు యివ్వబోతున్నాడు. మా అందరికీ ఒకటే ఆశ్చర్యం. మీ జిల్లావాడు, మీ కులస్తుడు కదా! నీకు నేపథ్యం తెలిసే వుంటుంది. నిజంగా మొదట్నుంచి డబ్బులున్నవాడే నంటావా?’’

మురళి నవ్వాడు. ‘’తెలివితేటలు మీ అగ్రకులస్తుల సొత్తే అనుకున్నావా? రాముల్లాటివాణ్ని వెర్రాణ్ని చేసి ఆడిద్దామనుకున్నాడు మీ సిఎం.! చూస్తూండు, ఎప్పుడో ఒకప్పుడు సిఎంను దింపేసి రాములే రాష్ట్రాన్ని ఏలబోతాడు.’’

‘’ఏలితే ఏలనీ, ఎవడు అక్కడ కూర్చుంటే వాడికి సలాం కొట్టడమే మన పని. నా క్వశ్చన్‍ ఏమిటంటే అతను నిజంగా డబ్బున్నవాడా? కాదా?’’

‘’తెలివున్నవాడు. అతని మోడస్‍ ఆపరాండి చెప్తాను విను. ఇరవై యేళ్ల క్రితం అతను నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఓ చిన్న వ్యాపారం ఏదో చేస్తున్నాడు. రాజకీయాల్లోకి వెళదామని నిశ్చయించుకున్నాడు. ఆ నియోజకవర్గం ఎస్సీకి ఎలాట్‍ చేశారు. ఎస్సీల్లో చదువుకున్నవాడు, బాగా మాట్లాడగలిగేవాడు యితనే కనబడుతున్నాడు. టిక్కెట్టు వస్తుందనుకుంటున్నారు. ఏడాదిదాకా ఎలక్షన్లు లేవు. అప్పుడు నా దగ్గరకు వచ్చాడు. చాలా ముక్కుసూటిగా మాట్లాడాడు...’’

‘’..అప్పుడు నువ్వు డిఎస్పీగా వుండి వుంటావు. ఇలాటి సామాన్యుణ్ని ఎందుకు దగ్గరగా రానిచ్చావ్‍? ఎందుకు మాట్లాడనిచ్చావ్‍?’’

‘’..మా కులసంఘం తరఫున సన్మానం అంటూ మాట్లాడడానికి యింటికి వచ్చాడు. అవీ యివీ మాట్లాడి సడన్‍గా ‘మీరు ఏదైనా పైన సంపాదిస్తే దాన్ని ఎలా దాచుకుంటార్‍, సార్‍?’ అన్నాడు. ‘నాకు అలాటి అలవాట్లు లేవులే’ అని తప్పించుకోబోయాను. ‘రేపు అలవాటైతే ఏం చేస్తారు? దాన్ని దాచుకోవడం ఎంత కష్టమో ఎప్పుడైనా ఆలోచించారా?’ అన్నాడు. నాకు అర్థం కాలేదు. ‘మా కొలీగ్స్ అందరూ ఏం చేస్తారో నేనూ అదే చేస్తాను.’ అన్నాను. ‘మీకూ వాళ్లకూ తేడా వుంది’ అన్నాడు...’’

‘’..ఏమిటట తేడా? బ్లాక్‍ మనీయో, కరప్ట్ మనీయో అంటూ చేరాక ఎవడ్కిటనా బినామీ వెతుక్కోవాల్సిందే..’’

‘’ఆ పాయింటు మీదే చెప్పాడు. మొదట్నుంచీ డబ్బున్నవాళ్లకూ, అగ్రవర్ణాల వారికీ  బినామీలు వెతుక్కోవడం యీజీ అంటాడతను. ఆల్‍రెడీ డబ్బుంటే దానిలో దీన్ని కలిపేయవచ్చు. వాళ్ల బిజినెస్‍లో వాటాలు తీసుకోవచ్చు. ఆస్తులు వాళ్ల పేర పెట్టి తర్వాత తీసుకోవచ్చు. కానీ పేదవాడి బంధువులందరూ పేదవాళ్లే. అగ్రవర్ణం అయితే కొందరు పేదలున్నా, డబ్బున్న బంధువులుంటారు. దళితుడైతే వాడే కాదు, వాడి బంధువులూ పేదలే. మరి ఎవరి పేర ఆస్తులు పోగేయగలడు? మహా అయితే  డబ్బున్న యితర కులాల స్నేహితుల పేర పెట్టాలి. కానీ కాస్ట్ ఫీలింగ్‍ ఎప్పుడు తలెత్తుందో తెలియదు. దళితుడు పైకి వస్తున్నాడన్న ఏడుపు కొద్దీ రేపు వాడు దగా చేస్తే...?’’

ఐజీ ఆలోచనలో పడ్డాడు - ‘’...మంచి పాయింటే చెప్పాడు. ఈ కోణంలో ఎప్పుడూ ఆలోచించలేదు.’’

‘’..నేనూ ఆలోచించలేదు. చెప్పి వారం రోజులు పోయాక మళ్లీ వచ్చాడు. సమస్య చెప్పి వెళ్లావు, ఉపాయం కూడా చెప్పి పుణ్యం కట్టుకో అన్నాను. అప్పుడు చెప్పాడు - నేను రాజకీయాల్లోకి వెళ్లబోతున్నాను. మీ కున్నవి నా పేర రాయండి. నేను మీకు ఎదురు డాక్యుమెంట్లు రాసి యిస్తాను. నిజాయితీగా వుంటానని హామీ యిస్తున్నాను. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు వెనక్కి యిచ్చేస్తాను. అప్పుడు నా ప్రామిసరీ నోట్లు నాకు వెనక్కి యిచ్చేయాలి. రాజకీయాల్లో వున్నాను కాబట్టి ఎవరూ ఏమీ అడగరు. మాకు ఓ రకమైన యిమ్యూనిటీ వుంటుంది. గట్టిగా అడిగితే మా జీవితం తెరిచిన పుస్తకం, ప్రజాకోర్టులో తేల్చుకుంటాం అంటాం. రాజకీయకక్షతో ఆరోపణలు చేశామంటాం. మరీ గట్టిగా అడిగితే ఎట్రాసిటీ యాక్టు మాట ఎత్తుతాం.  నేనెప్పుడూ రూలింగ్‍ పార్టీలోనే వుంటాను కాబట్టి ప్రభుత్వం నాపై విచారణ జరపదు. మీ అధికారులకు యిలాటి గ్యారంటీ ఏమీ లేదు. ఎసిబి రెయిడ్స్ జరగవచ్చు...’’

ఐజీ నోరు వెళ్లబెట్టాడు. ‘’వీడు గొప్ప కాలజ్ఞాని సుమా, యిప్పుడు జరుగుతున్నది అదేగా, అధికారులు జైళ్లకు వెళుతున్నారు. నాయకులు అమాయకుల మంటూ తప్పించుకుంటున్నారు...’’

‘’ఇలా చెప్పేసి వారం రోజులు పోయాక మళ్లీ వచ్చాడు. ఈ లోపునే వాడు చెప్పినది నాకు తలకెక్కింది. అప్పటికే నా దగ్గర క్యాష్‍ చాలా పోగుపడి వుంది. నా వైపు కానీ, మా ఆవిడవైపు కానీ ఎవడి పేర కొందామన్నా అందరూ దరిద్ర నారాయణులే. పైగా అసూయతో కుళ్లి ఛస్తున్నారు. వాళ్లందరికీ ఉద్యోగాలు యిప్పించలేదన్న కోపం ఒకటి. ఈ రాములు పేర కొంటే కాస్త రిస్కే కానీ ఏదైనా తేడా వస్తే చిన్నవాడే కదా, ఏదో కేసు పెట్టి లోపలకి తోసేయవచ్చన్న ధీమాతో వాడి పేర తీసుకున్నాను. దాని మీద తనకు ఏ విధమైన హక్కులూ లేవని నాకు కాగితం రాసి యిచ్చాడు. డాక్యుమెంట్లూ నా దగ్గరే పెట్టాడు. నా లాగే చాలామంది మా వాళ్లల్లో పెద్ద పోస్టుల్లో వున్నవాళ్లందరి దగ్గరకి వెళ్లి యిలాగే రాయించుకున్నాడు. అంతేకాదు, ఫార్వార్డ్ కాస్టు వాళ్లల్లో బాగా పేద కుటుంబం నుండి పైకి వచ్చినవాళ్లను కూడా యిలాగే కన్విన్స్ చేశాడు...’’

‘’...ఇలా మాకు మేలు చేస్తే నీకు వచ్చే లాభం ఏమిటి అని మీరడగలేదా?’’

‘’...అడిగాను. మీ అందరికీ సహాయపడితే మీరు నాకు ఉపయోగపడతారు కదా, నాకు నెగ్గే ఛాన్సు వుందా లేదాని ప్రభుత్వం సర్వే చేయించినపుడు రిపోర్టులు యిచ్చేది మీరే కదా, ఆ పాటి ఉపకారం చాలు నాకు అన్నాడు..’’

‘’... గుర్తుంది, మీరంతా అలాటి రిపోర్టులే యిచ్చారు. టిక్కెట్టు యిచ్చారు. ఆ ఎన్నికల్లో నెగ్గాడు... తర్వాత ఏమైంది?’’

‘’..ఏముంది, ఎమ్మెల్యే అయ్యాక ఏదో కార్పోరేషన్‍కి చైర్మన్‍ను చేశారు. మరీ హద్దులు మీరకుండా మేశాడు. తన పేర వున్న ఆస్తుల మీద టాక్సు కడుతూ పోయాడు. ఓ రెండేళ్లు పోయాక, నన్ను పిలిపించి మీరు నా పేర కొన్న తోటకు మార్కెట్‍ రేటు ప్రకారం డబ్బిచ్చి కొనేసుకుంటాను. డాక్యుమెంట్లు, నేను రాసిచ్చిన కాగితం నాకిచ్చేయండి అని ఆఫర్‍ యిచ్చాడు. అప్పటికి మా మేనల్లుడు ఫారిన్‍ వెళ్లి సంపాదించడం మొదలెట్టాడు. ఇతని దగ్గర డబ్బు తీసుకుని, వాడి పేర యింకోటి కొన్నాను...’’

‘’..అంటే యిక అప్పణ్నుంచి యీ ధంధా మానేశాడా?’’

‘’..అబ్బే, ఎప్పటికప్పుడు కొత్త ఆఫీసర్స్ వస్తారుగా. కెరియర్‍ ప్రారంభంలో అందరిదీ ఒకటే సమస్య - మంచివాడైన బినామీ దొరకడం! మీ జూనియర్నెవరినైనా చూపించండి, నా పేర కొనమనండి, నా నిజాయితీ చూశారుగా అన్నాడు. మనకేం పోయిందని ముగ్గురు నలుగురికి చెప్పాను. ఇంకో నాలుగేళ్లు పోయాక ఓ పెద్ద ప్రాపర్టీ అమ్మకానికి వస్తే నేనే రాములు పేర కొన్నాను. అప్పటికి రెండో టెర్మ్ ఎమ్మేల్యేగా వుండి యింకాస్త పెద్ద కార్పోరేషన్‍కి చైర్మన్‍గా వున్నాడు. దాని ధర చాలా బాగా పెరిగింది.’’

‘’అదీ కొనేశాడా?’’

‘’లేదు. ఆ రేటుకి తను కొనలేడని అన్నాడు. నేను వాలంటరీగా రిటైరయ్యాక వచ్చిన డబ్బుతో అతని దగ్గర కొన్నట్టు చూపించుకున్నాను. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. ఎంత ఎదిగినా, తన నిజాయితీని వదిలిపెట్టలేదు. అతని వలన నష్టపోయానని అనే అధికారి ఒక్కడూ కనబడడు...’’

‘’.. అంటే అతన్ని యిరికిద్దామంటే మీ రెవ్వరూ స్టేటుమెంట్లు యివ్వరన్నమాట’’ అన్నాడు ఐజీ నవ్వుతూ.

మురళి సీరియస్‍గానే ‘’ఔట్‍ ఆఫ్‍ క్వశ్చన్‍. అతని స్ట్రాటజీ వలన మాకు లాభమే కలిగింది తప్ప నష్టం కలగలేదు. అతను మాకు బినామీగా వుండి అతనేమీ బావుకోలేదు. మాది ఒక పైసా తినలేదు. మేం ఎందుకు అతనికి వ్యతిరేకంగా చెప్తాం?’’ అని అడిగాడు.

‘’అతని ఆస్తుల లిస్టు చూశాను. కొండవీటి చేంతాడంత వుంది. ఏది బినామీయో, ఏది లంచాలు పట్టి సంపాదించిందో తెలియటం లేదు...’’

‘’.. గట్టిగా యిన్వెస్టిగేట్‍ చేయకు మహాప్రభూ, వాటిల్లో మన ఫ్రెండ్స్వి చాలా వున్నాయి. నాకైతే యిక లావాదేవీలు ఏవీ లేవు కానీ మనవాళ్లు చాలామందికి యింకా లింకులున్నాయి. నువ్వు ద•ష్టి పెట్టిన ఆస్తి అసలు స్వంతదారు ఏ ఐయేయస్సో అయితే వాడు నీ మీద కక్ష కడతాడు. పైగా ఆ ఫైలు మాయమై పోతుంది. నీ విచారణ ముందుకు సాగదు, జాగ్రత్త.’’

ఐజీకి సర్వం అర్థమైంది. ఆ తర్వాత రోజుకి ముగ్గుర్ని చొప్పున కలిసి మాట్లాడాడు. అందరూ మురళి చెప్పినట్టే చెప్పారు. చూడడానికి అమాయకుడిగా కనబడే రాములు ఎంతటి ఘటికుడో అర్థమైంది. వెళ్లి సిఎంకు చెప్పి, తాను చేయగలిగినది ఏమీ లేదని చెప్పాడు.

‘’రాములు గారూ, ఏమిటి మీరు చేస్తున్న పని? స్వంత పార్టీలోనే గ్రూపులు కట్టి నేను అసమర్థుణ్నని ప్రచారం చేస్తే హై కమాండ్‍ వూరుకుంటుం దనుకుంటున్నారా?’’ అడిగాడు సిఎం తన యింట్లో రాములికి మందు పార్టీ యిస్తూ.

‘’నేను అవినీతిపరుణ్నని ప్రచారం చేయడానికి ప్రతిపక్షం వారితో మీరు చేతులు కలిపితే మాత్రం వూరుకుంటుందా?’’

‘’..అలా ఎందునుకుంటున్నారు? నా కాబినెట్‍ సహచరుడికి అవినీతిపరుడన్న ముద్ర పడితే మొత్తం కాబినెట్‍కే చెడ్డపేరు కదా, అందరి కంటె ముందు నేనే దెబ్బ తింటాను.’’

‘’..ఆ యింగితం నా మీద దుమారం లేపేటప్పుడు వుండాల్సింది. నా ఆస్తుల మీద పోలీసుల వాళ్ల చేత విచారణ చేయించేటప్పుడు వుండాల్సింది..’’

‘’..నో, నో, మీకు ఎవరో తప్పుడు సమాచారం యిచ్చారు. మన మధ్య అపోహలు స•ష్టించడానికి చేసిన ప్రయత్నం యిది. మీలాటి ప్రతిభావంతులకు క్రీడల శాఖ చాలా చిన్నదని తోచి, ఎక్సయిజ్‍ శాఖ అప్పగిద్దామని చూస్తూన్నవాణ్ని మిమ్మల్ని అప్రతిష్టపాలెందుకు చేస్తాను? ఇన్‍ ఫాక్ట్, పత్రికల్లో యీ రిపోర్టులు రావడం వలననే మీ శాఖ మార్పు విషయంలో ఆలస్యమౌతోంది..’’

రాములు మొహంలో ఆనందం, ఉత్సాహం కనబడింది. ‘’నిజంగానే ఎక్సయిజ్‍ యిస్తారా చెప్పండి. మనిద్దరి మధ్యా ఎలాటి దురభిప్రాయాలు లేవని స్టేటుమెంటు యిస్తాను. అంతా పత్రికల స•ష్టే అనేస్తాను. నాకు వ్యతిరేకంగా రిపోర్టులు రాకుండా నేను మేనేజ్‍ చేసుకుంటాను. ఎక్సయిజ్‍ ఖరారు చేయండి..’’

‘’..నేను మాటంటే ఖరారేనండి. మీకే నా మీద నమ్మకం లేదు, ఏం చేస్తాం?’’ అని సిఎం నిట్టూర్చాడు.

రాములు నొచ్చుకున్నట్టు మాట్లాడాడు. ‘’భలేవారే, మిమ్మల్ని నమ్మకపోతే ఎవర్ని నమ్ముతాను? పిలిచి మంత్రి పదవి యిచ్చినవారు మీరు. ఇవాళ యింకా అంతకంటె పెద్ద శాఖ యిస్తానంటున్నారు. నా దగ్గర ఏమీ ఆశించకుండా యింత ఉపకారం చేస్తున్న మిమ్మల్ని ఏవైనా అనుకుంటే కళ్లు పోతాయి..’’

‘’..ఆశించకుండా అంటే...’’ అంటూ సాగదీసి సిఎం కాస్త ఆగి ‘’.. నాది ఓ చిన్న రిక్వెస్టు.’’ అన్నాడు.

‘’చెప్పండి సార్‍.’’

‘’మీ ఆస్తులు డిక్లేర్‍ చేస్తూ ఈ మధ్యే పత్రికలకు ఓ ప్రకటన విడుదల చేశారు కదా. కరువు జిల్లాలో నాలుగు వందల ఎకరాలు వున్నాయన్నారు. అది నాకు అమ్మాలి. మార్కెట్‍ రేటుకి అటూయిటూగా యిచ్చేస్తాను. నామినల్‍ రేటుకి యిచ్చినట్టు రాసుకుందాం. తక్కినది బ్లాక్‍. నా దగ్గర చాలా పోగుపడి వుంది...’’

‘’..అయ్యో దాన్దేముందండీ, అలాగే చేద్దాం. అయినా అదెందుకండీ, శుద్ధ వేస్టు. జూబిలీ హిల్స్లోది యిమ్మన్నా యిస్తాను..’’ అన్నాడు రాములు సిన్సియర్‍గా.

‘’వద్దు, వద్దు. ఇదైతే ఎవరి ద•ష్టీ పడదు. జూబిలీ హిల్స్లో కొంటే పత్రికల్లో వచ్చేస్తుంది.’’ అన్నాడు సిఎం కంగారుపడుతూ.

‘’సరే, మీరెలా అంటే అలాగే.. ఇప్పుడే కాదు, మీకు ఏది కావాల్సి వచ్చినా మొహమాట పడకుండా అడగండి. నా దగ్గర వైట్‍లో చాలా వున్నాయి. ఇదిగో యీ టేబుల్‍మీద వున్నది బ్లాక్‍ నైట్‍ అయితే, నేను వైట్‍ నైట్‍ని. నన్నూ, నన్ను నమ్ముకున్నవారినీ నష్టపరచకుండా చూడండి చాలు. వాళ్లెవర్నీ యిబ్బంది పెట్టకుండా చూస్తే అదే పదివేలు..’’

ఇద్దరూ షేక్‍ హ్యాండ్‍ యిచ్చుకున్నారు. రెండు రోజుల్లో రాములు ఎక్సయిజ్‍ మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు.

మూడు నెలల తర్వాత కరువు జిల్లాలో తను కొన్న నాలుగు వందల ఎకరాల భూమికి పక్కనే నాలెడ్జ్ పార్క్ ప్రాజెక్టుకి సిఎం ప్రారంభోత్సవం చేశారు. దక్షిణాసియాలోనే అతి పెద్ద పార్కు అనీ, దాని వలన చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలందరూ విజ్ఞానవంతులవుతారనీ, అనేక పరిశ్రమలు, ఉద్యోగాలు వచ్చి ధనవంతులవుతారనీ ఆ నాటి ప్రసంగంలో సిఎం నొక్కి వక్కాణించారు. అక్కడ తనకేమీ మిగల్చకుండా మొత్తం భూమి చౌకగా లాగేసినందుకు వేదికపైన వున్న రాములు పళ్లు పటపటలాడించేడు.

- ఎమ్బీయస్‍ ప్రసాద్‍ (ఆగస్టు 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?