Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ కథలు - 23

ఇలాగ.. అలాగ...

చావు పలురకాలుగా వస్తుంది.సదా కాకాకు అది నిద్రపోతుండగా వచ్చింది. సందర్శకులు, జాగరణలు, వీడ్కోలు వచనాలు, ఆస్తిపంపకాలు ఏమీలేకుండా నాటకంలో ఆఖరి ఘట్టం రాకుండానే తెర దించేసినట్టయింది. 

శుచీ, శుభ్రం ఎరిగిన సదా కాకా చింపిరిజుట్టు, మాసిన గడ్డంతో మంచానపడి సేవలు చేయించుకోవడాన్ని ఎన్నడూ ఇష్టపడలేదు. అయితే అతను కోరుకున్న పద్ధతిలోనే చావు వచ్చిందనడానికీ వీలులేదు. అతని తల దిండుమీరి నుండి జారి ఒక పక్కకు ఒరిగింది, నోరు సగం తెరుచుకుంది, కళ్లు సగం మూసుకున్నాయి.

తన భార్య చక్కనిదే అయినా నోరూ, కళ్లూ సగంసగం తెరచుకొని నిద్రపోయే ఆమె అలవాటును భరించలేకపోయేవాడు కాకా.  ఆమె చనిపోయేదాకా పాపం ఎలాగో ఓర్చుకొన్నాడు. ఇప్పుడు తనూ అటువంటి భంగిమలోనే శాశ్వత నిద్రలోకి జారుకొనడాన్ని ఇష్టపడేవాడు కాదు. కానీ....పాపం అలాగే జరిగింది.

తన చివరిదినాలలో ఎవరికీ భారంగా బతకకూడదని అనుకొనేవాడతను. తల్లిదండ్రులు మంచంపట్టినప్పుడు పిల్లలు సేవలు చేస్తారు. సేవలంటే మాటలా? నిద్రలేని రాత్రులు, వాంతి తెప్పించే వాతావరణంలో సపర్యలూ, ఎప్పటిదాకా ఈ తద్దినం సాగుతుందోనన్న ఆందోళనలూ మామూలే. అందుకే నాటకానికి త్వరగా తెర పడాలని అందరూ కోరుకుంటారు. అంతమాత్రాన పిల్లలకు తల్లిదండ్రులంటే ప్రేమ లేదని కాదు. వృద్ధాప్యంలో జబ్బులు రాక తప్పవని వారికి తెలియదనీ కాదు. జబ్బుపడ్డ ముసలివాళ్లను చూసుకోవడం ఇబ్బందే. అయినా తప్పనిసరి ఇబ్బంది అది. పక్షవాతంతో మంచాన్న పడిన తన తండ్రికి సమర్యలు చేసేటప్పటికి కాకాకు కూడా ప్రాణం చాలొచ్చింది. లోపల్లోపల గిల్టీగా ఫీలవుతూనే తండ్రి కథ త్వరగా కంచికెళితే బాగుండునని కోరుకునేవాడు. అందుకనే తన కొడుకు కూడా అలా కోరుకునే థ తనకు రాకూడదనుకున్నాడు. అదృష్టవశాత్తూ ఆ కోరిక తీరింది.

ఎవర్నీ వేపుకు తినకుండా పోయినందుకుగాను కాకా అంటే అందరూ ఇష్టపడవలసిందే! సక్రమంగా అంత్యక్రియలూ అవీ జరిపించి, అతన్ని గురించి నాలుగు మంచి మాటలు చెప్పుకుని, నాలుగు కన్నీళ్లు ఖర్చు చేయవలసిందే! కానీ అతని తప్పేమి లేకుండానే కథ అడ్డం తిరిగింది. దానికి కారణం అతని కోడలు.

xxxxxxxxxxxxxx

ఆ కోడలికి ఎప్పుడూ ఏదో ఒక జబ్బే. పైగా తీరూ తెన్నూలేని ఓ అడ్డగోలు మనిషి. పిల్లలను బడికి పంపించే అడావుడిలో మార్నింగ్‌ టీ తాగడానికి కాకా కిందకు రాలేదన్న విషయం గమనించనే లేదావిడ. తర్వాత తీరిగ్గా మేడెక్కి కాకా గదిలో ఆయన ఇంకా నిద్రిస్తుండటం చూసి నిద్ర లేపబోయింది. ఒరిగిన తల, తెరిచిన నోరు కళ్లబడటంతో బుర్ర పనిచేసి, విషయం గ్రహించి, వెర్రికేక వేసి మూర్ఛపోయింది.

ఆ పెడబొబ్బ విని మొగుడు మెట్లెక్కి వచ్చి చూశాడు. తర్వాత అతను పరిగెట్టుకెళ్లి డాక్టర్ని పిల్చుకొచ్చాడు. అతనూ పరిగెట్టుకొచ్చి కోడల్ని పరీక్షించి, ఇంజక్షన్‌ ఇచ్చి చూశాడు. కాసేపటికి పెదవి విరిచి, తర్వాత  కొరుక్కుని, తల ఆడించి, స్పెషలిస్టుని పిలిస్తే మంచిదన్నాడు. కాకా కొడుకు స్పెషలిస్టుకోసం మళ్లీ రోడ్డెక్కాడు. ఈలోపల కబురు తెలిసి ఆవిడ చెల్లెలు, తమ్ముడు పోగయ్యేరు. తల్లయితే మరీనూ. వెర్రెక్కినట్లు సదాకాకాతో సహా అందర్నీ తిట్టిపోసింది - తన కూతుర్ని అందరూ కలిసి వేపుకుతింటున్నారని.

ఈ సందడిలో కాకా గతేమయిందో పట్టించుకొనే తీరిక ఎవరికీ లేకపోయింది. స్పెషలిస్టుకోసం ఎదురుచూస్తూ తీరిగ్గా కూర్చున్న డాక్టరుమాత్రం అతను చచ్చిపోయినట్టు తేల్చి, సర్టిఫికెట్‌ కూడా రాసేశాడు, ఓ కాకి కిటికీలో కూచుని అరుస్తూ యావన్మంది ప్రజలకూ చావుకబురు తెలియబరిచింది. కాకా చిన్నకూతురు వచ్చి కూచుని శవజాగారం చేసింది.

కానీ పుణ్యం మరీ పుచ్చలేదు. ఎవరైనా మనిషి పోతే శవంవెంట నడిచే నలుగురూ పోయిన మనిషి తాలూకు చారెడేసి కళ్లగురించీ, క్షణభంగురమైన జీవితం గురించీ నాలుగు ముచ్చట్లాడి, ఆ తర్వాత వాళ్లవాళ్ల వ్యవహారాల్లో పడిపోవడం కద్దు. పాపం కాకా కూడా ఇంతకంటే ఏమీ ఆశించలేదు. కానీ ఒక చిన్న ఆశమాత్రం పెట్టుకొన్నాడు. కొడుకు తన ఫోటో పెద్దసైజుది హాల్లో తగిలించి ప్రతీ తద్దినంరోజూ అద్దం తుడిచి ఓ దండ తగిలించాలని అనుకున్నాడు. చాలామంది కొడుకులు అభిమానంకొద్దీ కాకపోయినా, ఎవరైనా ఏమైనా అనుకొని పోతారేమోనన్న భయంతోనైనా చేసే పనే ఇది. కానీ కాకా కొడుకు ఇది కూడా నెరవేర్చలేకపోయాడు.

ఎందుకంటే భార్యను చూసుకొనే అడావుడిలో ఉన్న అతను వేరే ఊళ్లో ఉన్న అక్కగారికీ, ఊళ్లోనే ఉన్న బంధుమిత్రులకూ కబురు చేయలేకపోయాడు. ఇరుగుపొరుగువాళ్లు కలగజేసుకొని మొక్కుబడిగా అంత్యక్రియలు కానిచ్చేశారు. పెద్దకర్మనాటికి కూడా కోడలుగారి అనారోగ్యం తగ్గకపోవడంతో అది కూడా తూతూమంత్రంగానే జరిగిపోయింది. విందు భోజనాలు లేవు. గోదానాలు అసలే లేవు.

ఫోటో విషయంలో కొడుకు సమ్మతించినా కోడలు ఆ అయిడియాకు గండి కొట్టించింది. కాకా చావు ఆమెను ఎంత దడిపించిందంటే, అతను భూతమై పోవడంచేతనే తను మూర్ఛపడి పోయేనని ఆమె మనసా వాచా నమ్మింది. ఓపక్క భార్య అలా అంటూంటే, నట్టింట్లో ఈ భూతం ఫొటో వేలాడదీస్తానని ఏ మొగుడుమాత్రం అనగలడు?

xxxxxxxxxxxxxx

ఆ మాటకొస్తే కొడుక్కీ ఓ విషయంలో తండ్రిపై కడుపుమంట ఉంది. కాకా చనిపోయిన రోజున అతనికి ఓ మంచి గల్ఫ్‌ ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఉంది. తండ్రి చావు, తద్వారా భార్య జబ్బు, చుట్టాలూ, చుట్టుపక్కలవాళ్లూ ఏమనుకొనిపోతారోనన్న బెదురు. వీటితో అతను ఇంటర్వ్యూకి వెళ్లలేకపోయాడు. 'ఎవరికైనా చెప్పి కొడుక్కి మంచి ఉద్యోగం ఇప్పించలేకపోయేను కదా, కనీసం వాడి ఇంటర్వ్యూ రోజున చావకూడదు' అన్న ఇంగితం తండ్రికి లేకపోయిందన్న బాధ అతనిది!

పైగా ఇంకో పిడకలవేట కూడా ఉంది. కొన్నాళ్లక్రితం ఓ కొత్త కంపెనీ షేర్లు కొంటానని తండ్రిని డబ్బడిగితే కష్టార్జితంతో షేర్‌ బజారువంటి జూదం ఆడకూడదని చెప్పి కాకా డబ్బు ఇవ్వననేశాడు. ఖర్మకాలి ఉత్తరోత్రా ఆ కంపెనీ షేరు విలువా, అదే మోతాదులో తండ్రిపై కొడుకు కోపం పెరిగాయి. తనాశించిన ఆర్థిక స్థితిని అందుకోలేకపోవడానికి కారణం తండ్రి పన్నిన పన్నాగమేనని అతని నమ్మకం. ఇప్పుడు... సరిగ్గా ఇంటర్వ్యూ చెడగొట్టటానికే తండ్రి ఏరి కోరి ఆ రోజుని చావుకై ఎన్నుకున్నందుకు కొడుకు అతన్ని ఎన్నటికీ మన్నించలేకపోయాడు.

ఆమాటకొస్తే సదా కాకా బాధ్యతలెరిగిన తండ్రికిందే లెక్క. కొడుక్కి పెద్ద చదువులు చెప్పించడమే కాక, బొంబాయి శివార్లలో ఇల్లు సమకూర్చాడు. కొడుకు పెళ్లి ఆర్భాటంగా చేయడమే కాక కోడలికి నగలు చేయించాడు. పైగా..

ఎందుకొచ్చిన సొద ఇదంతా? కొడుకూ, కోడలూ అతని మంచితనాన్నంతా మరిచిపోవాలని ఒట్టేసుకొని, తమ కష్టాలకు కారణభూతుడిగా చిత్రీకరించడానికి పూనుకొన్నప్పుడు ఎన్ని చెప్పి ఏంలాభం?

అంచేత ఎంతో ధనం, సమయం, ప్రేమకురిపించి కాకా కట్టుకొన్న ఇంటిలో అతన్ని గుర్తుకుతెచ్చే  ఒక చిహ్నం కూడా ఇప్పుడు కనబడదంటే ఆశ్చర్యం ఏముంది?

బతికుండగా కాకా కొడుకుమీది ప్రేమను మాటల్లో వ్యక్తపరిచేవాడు కాదు. అలా అని జానూలాగా పిల్లల్ని చితక్కొట్టేవాడూ కాదు. జానూ తాగొచ్చి పిల్లల్ని బాదినా, వాళ్లు అదేమీ మనసులో పెట్టుకోకుండా, అతను  పోయేక అతనిపేర ఓ స్కూలు ఏర్పాటుచేసి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టారు. జానూకంటె వ్యక్తిగా ఉన్నతుడూ, ఉదాత్తుడూ అయిన సదా కాకా ఖర్మమాత్రం ఇలా కాలింది. అతని పేరెత్తితేనే చాలు కొడుకు మండిపడుతున్నాడు. కోడలు సరేసరి.

xxxxxxxxxxxxxxxxxxx

సదా కాకా ఏ పనీ అరకొరగా చేసేరకం కాదు. తన తదనంతరం ఆస్తి పంపకాలెలా ఉండాలో చక్కగా రాసిపెట్టుకున్నాడు. వకీలు చేత విల్లు రాయించడం ఒకటే తరువాయి. తనకి తెలిసిన సీనియర్‌ లాయర్‌చేత తయారు చేయిద్దామనుకొంటుండగానే మేనల్లుడి వరసైనవాడొకడు నల్లకోటు తొడిగేడు. అయినవాళ్లలో యువతరంవాళ్లపై నమ్మకం ఉంచి, వారిలో ఆత్మవిశ్వాసం పెంచడం మంచిదని కాకా అనుకొన్నాడు. అది నీ నైతిక బాధ్యత అంది బంధువర్గం.

కాకా సరేనని తన ఆస్తి దస్తావేజులన్నీ కట్టకట్టి అతనికి పంపేవేళకి ఆ కుర్రలాయరుకు ఓ పెద్ద కంపెనీలో లీగల్‌ డిపార్టుమెంటులో ఉద్యోగం వచ్చింది. దాంతో అతను స్వంత ప్రాక్టీసు చేసే అయిడియా, దానితోబాటు కాకా విల్లు తయారుచేసే పనీ అటకెక్కించేసి ఉద్యోగంలో చేరిపోయాడు. కాకా ఎన్నిసార్లు గుర్తుచేసినా అదిగో ఇదిగోనంటూనే తాత్సారం చేశాడు. కాకా కూడా డాక్టరు పదేళ్లదాకా ప్రాణానికి ఢోకాలేదని భరోసా ఇచ్చాడుకదాని ఓపికపట్టాడు. కానీ చావుంది చూశారూ, మహా తిక్కపీనుగ. హామీ ఇచ్చిన నెల్లాళ్లకే కాకాను ఎగరేసుకుపోయింది - ఆ డాక్టర్ని వెక్కిరించడానికా అన్నట్టు!

తండ్రి పోగానే కొడుకు కాగితాలకోసం తెగ వెతికి వేశారాడు. చివరికి మేనల్లుడికి యిచ్చినట్టు గుర్తుకు వచ్చి అతన్ని అడిగాడు.  కాకా పోయాడు కదాన్న ధీమాతో అతను 'అవన్నీ మీ నాన్నకి ఎప్పుడో తిరిగిచ్చేసేనే!' అనేశాడు. వాటి నకళ్లకోసం గవర్నమెంటు ఆఫీసుల చుట్టూ తిరిగి సంపాదించేసరికి ఏడాది పట్టింది కొడుక్కి.

దాంతో కొడుక్కి తండ్రిపై గుర్రు మరింత పెరిగింది. దానికితోడు ఇంటికొచ్చిన ప్రతీవాడూ 'మీ నాన్న లెక్కా డొక్కా రాసిపెట్టే మనిషికదా! నీకే ఇబ్బంది లేదనుకొంటా'ననడంతో అతనికి చిర్రెత్తుకొచ్చేది. 'మా నాన్న పద్ధతి ప్రకారం పనులు చేసే మనిషనడం శుద్ధ అబద్ధం. ఆయన వ్యవహారాలు ఓ కొలిక్కి తెచ్చేందుకు నా తలప్రాణం తోకకొచ్చింది' అంటూ ఇదంతా ఏకరువు పెట్టేవాడు. వచ్చినవాళ్లు చప్పబడి, 'ఏమో.. ఇవన్నీ మాకేం తెలుసు? నేను పద్ధతి మనిషినని అతను చెప్పుకొంటూ వుంటే అవును కామోసనుకొన్నాం. చూస్తుంటే ఎవరిమాటా నమ్మడానికి లేనట్టుగా ఉంది' అంటూ జారుకొనేవారు.

సదా కాకా ఇదంతా వినివుంటే తోకతొక్కిన త్రాచై, మేనల్లుడి డొక్క చించి, డోలు కట్టి, తన వాదనను దండోరా వేసి వినిపించి ఉండేవాడు. కానీ అతనికా లక్కేది? అందువల్ల ప్రజలు వాళ్లు విన్నదీ, నమ్మినదీ ప్రచారం చేసేశారు.

ఆస్తి పంపకం కూడా అతననుకొన్న ప్రకారం జరగలేదు. అతని పెద్దకూతుర్ని కలిగిన ఇంట్లో ఇచ్చాడు. కొడుక్కి ఇల్లు ఏర్పాటు చేశాడు. అందువల్ల చిన్న కూతురికి చరాస్థిలో పెద్దవాటా ఇద్దామనుకొన్నాడు. చిన్న కూతురు అందమైనదే అయినా చొరవలేనిది. మంచి సంబంధం దొరక్క ఓపాటి ఇంట్లో ఇవ్వాల్సి వచ్చింది. ఆమె సౌమ్యురాలు. తండ్రంటే అభిమానం కలదీ. అందుకే కాకా ఆమెకు ఆడపాదడపా ఇవీ అవీ కొనిపెట్టి, కోడలి ఆగ్రహాన్ని కొని తెచ్చుకొన్నాడు.

విల్లు లేకపోవడంతో కొడుకే చాలా భాగం ఆస్తి తీసేసుకొన్నాడు. దస్తావేజులకోసం తిరిగినది అతనొక్కడే కాబట్టి తనకా హక్కు ఉందని అతని నమ్మిక. కానీ అతని అక్క నోరున్న మనిషి. ఢిల్లీనుంచి ఓరోజు వచ్చి తమ్ముడినీ, మరదలినీ ఝూడించేసింది. ఆ మాటలు పడలేక కోడలు గుడ్లనీరు కుక్కుకుని నగలపెట్టె పట్టుకొచ్చి ఆవిడముందు పెట్టేసింది. పెద్దకూతురు అది చంకనపెట్టుకొని వెళ్లిపోతుంటే కొడుకు, ''నువ్వే అన్నీ పట్టుకుపోతే, చెల్లాయి వచ్చి అడిగితే నేనేం సమాధానం చెప్పేది?'' అంటూ ఆక్రోశించాడు.

అక్కగారు గిర్రున వెనక్కి తిరిగి, ''నాన్న దగ్గిర పండగా, పబ్బం పేరు చెప్పి కొట్టేసిన చదివింపులు చాల్లేదా అని అడుగు. దానికి దీంట్లో చిల్లిగవ్వ ఇవ్వనక్కర్లేదు'' అని అంది. అన్నదేకానీ కాస్త ఉదారబుద్ది చూపించాలని ఎందుకో అనిపించింది. వెతికి, వెతికి ఓ సన్నపాటి గొలుసు తీసిచ్చి, ''ఇది దానికియ్యి, లేకపోతే నేనే అన్నీ ఊడ్చుకుపోయేనని చెప్పుకుని గగ్గోలుపెడుతుంది. ముంగిలా ఉంటుంది కనక అందరూ దానిమాటే నమ్ముతారు కూడాను'' అంది.

కానీ చిన్నకూతురు ఏమీ అడగనేలేదు. అందుచేత కొడుకు ఇంత చిన్న వస్తువు ఏం పంపిస్తాంలే అనుకొని తనదగ్గిరే ఉంచేసుకొని తన కొడుకు వొడుగుటైంలో ఆ గొలుసు వాడి మెడలో వేసేశాడు.

xxxxxxxxxxxxxxxxx

ఈ నగలపెట్టె పెద్దకూతురు ఎగరేసుకు పోయేముందు మరో ఉపాఖ్యానానికి కారణమయింది. కాకా చనిపోయాక కొడుకు ఓసారి బీరువా సరిగ్గా మూయకపోవడంతో ఆ నగల పెట్టె ఇంట్లోని పడుచు పనిమనిషి కంటబడింది. అది పిటపిటలాడుతూండటంవల్లా, దాని పైట బిగింపు చూసి తన భర్త లొట్టలు వేస్తూండడంవల్లా కోడలికి సన్నిహితురాలు కాలేకపోయింది. దాన్ని మాన్పిద్దామని ఆమె ప్రయత్నించినప్పుడల్లా భర్త వారించేవాడు.

''పనిమనుషులంతా ఇంతే, ఇన్నేళ్లుగా పనిచేస్తోంది ఉండనీ'' అనేవాడు.

నిజానికి అది ఇంట్లో తిరుగాడుతూవుంటే అతనికి చక్కిలిగింతలు పెట్టినట్టుండేది. అతను ధైౖర్యవంతుడే అయివుంటే ఓ చెయ్యి వేసి చూసేవాడే. కాకపోవడంతో లొట్టలతో సరిపుచ్చుకొన్నాడు. ఆ పనిమనిషికి సదా కాకా అంటే భక్తిశ్రద్ధలు ఉండేవి. కాళ్లుపట్టీ, తలనొప్పి వస్తే అమృతాంజనం రాసీ సొంతకూతురిలా సేవలుచేసేది. కాకా ఎప్పుడూ ఆమెకేమీ ఇవ్వకపోయినా అతని చావుతో ఏదో బంధం తెగిపోయిందనిపించింది ఆమెకు.

ఆనాడు నగలపెట్టె చూడగానేె ముందు కుతూహలంతో తెరిచి చూసింది. లోపల నగలు చూసి మురిసిపోయింది. ఒక్కటంటే ఒక్కటి తీసుకుంటే ఎలా ఉంటుందని తలపోసింది. కాకాకు తను చేసిన సేవలకు ప్రతిఫలంగా ఒక్క నెక్లెసు తీసుకొంటే తప్పులేదని సర్దిచెప్పుకొంది.

కోడలు ఓ నగ తక్కువైందని గ్రహించినా, కాకా తన చిన్నకూతురికి చేరేసేడేమోనని అనుకొని ఊరుకొంది.

పనిమనిషి కొంతకాలం ఓపిక పట్టి, ఇక ఉండబట్టలేక నగ దిగేసుకు తిరగడం మెదలెట్టింది. ఎక్కడిదెక్కడిదన్నాయి ఇరుగుపొరుగుల నోళ్లు.

''ఆ ముసలాయనకు సపర్యలు చేస్తే సంతోషపడి కానుకగా ఇచ్చాడు' అందీమె.

'ముసిలోడు రసికుడే' అన్నాయి వాళ్ల నొసళ్లు.

ఆమె కాకా ఇంటికి మాత్రం నగ దిగేసుకు వెళ్లేది కాదుకానీ, ఓరోజు నిద్రమత్తులో అలాగే వెళ్లిపోయింది. కోడలు పసిగట్టేసి, ''మా అత్తగారిదానిలా ఉందే!'' అనేసింది.

పనిమనిషికి ముచ్చెమటలు పట్టాయి. ముందు తడబడినా, గుండె దిటవు తెచ్చుకొని, ''మీ మావగారే ఇచ్చేరు. నేను ఆయనకు పనులు చేసిపెట్టినందుకు'' అంది.

కోడలు కళ్లు ముంజికన్నులంత అయ్యేయి. '' ఏమేం పనులు చేసేపెట్టావేం?'' అంది కసిగా.

''వేరే ఏముంది? ముసలాళ్లకు కావలసింది - వేళకు మాత్రలివ్వడం, కాళ్లు పట్టడం, తలనొక్కడం'' అంది పనిమనిషి కాస్త వెటకారంగా - 'కోడలివయ్యిండి ఈపాటి పనులు కూడా నువ్వు చెయ్యలేదు చూశావా?' అనే ధ్వనితో!

కానీ కోడలికి ఆ ధ్వని మరోలా ధ్వనించింది. కాస్త చిలువలు, పలవలు చేర్చి మొగుడికి చెప్పింది. ''ఎంత సపర్యలు చేస్తే మటుకు పెళ్లాం నెక్లెసు పట్టుకెళ్లి పనిమనిషి కిస్తారా!'' అని.

కొడుకు నివ్వెరపోయాడు. తాను కలలు కన్న పని తండ్రి నిజంగా చేసినట్టున్నాడు! తనే పిరికిపంద! తెగించకపోతే లాభం లేదనుకుని ఓరోజు దాన్ని వెనకనుంచి వాటేసుకున్నాడు. అది అతన్ని పక్కకు తోసేసి, ''నేనలాటిదాన్ని కాదు, ఒళ్లు జాగ్రత్త!'' అనేసింది.

కొడుకు కష్టాలు అంతటితో తీరలేదు. పనిమనిషి వెళ్లి అయ్యగారి ప్రతాపం గురించి అమ్మగారికి చెప్పేసింది. ఆవిడ నిలదీసినపుడు ఏం చెబ్దామాని తెగ ఆలోచించి చివరకు ఆవిడకు సబబుగా తోచేది చెప్పేశాడు కొడుకు - ''అది అబద్ధాలకోరు. మా నాన్నతో దాని సంబంధం గురించి నిలదీసి అడిగి, అందరిముందూ కడిగేస్త్తానని చెప్పాను. తన తప్పుడుపన్లు కప్పిపుచ్చుకోవడానికి నామీదే బురద జల్లుతోంది చూడు''

కోడలీ కథ నమ్మిందో లేదో కానీ తన స్నేహితురాలికి చెప్పింది. ఆమె మరొకరికి... వారు..యింకోరికి... కొద్దిరోజుల్లోనే అంతా ముక్కులమీద వేళ్లేసుకోసాగారు. పైకి పత్తిత్తులా కనిపించే కాకా ఇంత గ్రంథసాంగుడా అంటూ. 

పాపం కాకా! పడుచుతనంలో కన్న పగటికలల్లో తప్ప పెళ్లయ్యాక భార్యను కాక మరొక ఆడదాన్ని తాకి ఎరగడు. వయసు పైబడ్డాక నీతి నియమాలు లేక సమాజం ఎలా చెడిపోతోందో స్పీచులు దంచే అర్హత వచ్చిపడింది కూడా! అటువంటివాడికా ఈ అపనింద! శివశివ...

పెద్దకూతురు పట్టుకెళ్లిన నగలపెట్టె దరిమిలా దొంగల పాలయ్యింది. ఆ దొంగల్లో ఒక రసికుడు తన వాటాకొచ్చిన నగని ఉంచుకొన్నదానికి బహూకరించేడు. ఆ విధంగా పవిత్ర సనాతన కులస్త్రీల గళసీమను అలంకరించిన హారం చివరకు జారులను, చోరులను ఆకట్టుకొనే ఒక బజారు ఆడదానికి ఉపయోగపడసాగింది. ప్రాణంలేని వస్తువుకైనా పతనం తప్పదన్నమాట!

xxxxxxxxxxxxxxxxxxxx

వీటన్నింటినీ మించిన వింతొకటి జరిగింది, మరొకవిధంగా. సదాకాకా ఇంట్లో ఓ నల్లరాయి గణపతి విగ్రహం ఉండేది. అది వాళ్ల నాన్న తీర్థయాత్రల కెళ్లినప్పుడు తెచ్చాట్ట. రోజు దానికి అభిషేకం, పూజా చేసేవాడాయన. తండ్రి పోయాక కాకా తప్పదురా బాబూ అన్నట్టు మొక్కుబడిగా పూజ చేసేవాడు. గణపతి వాళ్ల కులదైవమూ కాదు, మరోటీ కాదు. ఏదో ముక్కోటి దేవతల్లో ఒకడు. అంతే. పైగా కాకాకు అంత భక్తీ అదీ లేదు. ఈ ఉత్తుత్తి పూజలకు మురిసి గణపతి కాకాకు భోగభాగ్యాలూ ఇవ్వలేదు, అలిగి చెరుపూ చేయలేదు.

కాకా పోయేక అతని చిన్నకూతురు తండ్రి మీద భక్తికొద్దీ అతని గుర్తుగా గణపతి బొమ్మ పట్టుకెళతానన్నది. రాతిబొమ్మే కదాని కొడుకూ, కోడలు మహా ఉదారంగా ఇచ్చేశారు. కూతురు మహా భక్తిగా గణపతిని కొలవసాగింది. రెండుతరాలుగా బధ్ధకించిన గణపతి హఠాత్తుగా మేల్కొని ఆమెకు వరాలు గుప్పించేయసాగాడు. నెల్లాళ్లలో రెండులక్షల ముదనష్టపు ఆస్తి కలిసొచ్చింది. ఆమెకు భర్త వైపు ఓ దూరపు బంధువున్నాడు. ఒంటరివాడు. ఈమె ఆడపదడపా ఆయన్ను ఇంటికి పిలిచి ఆదరం చూపించేది. జబ్బుపడితే సేవలు చేసింది కూడాను. తీర్థయాత్రల్లో ఆయన పరలోకానికి ప్రయాణం కట్టేడు. విల్లు తెరిచి చూస్తే దానిలో ఆస్తంతా ఈమె పేర రాసినట్టు తెలిసింది.

విల్లులో విషయాన్ని విని నిర్ఘాంతపోయిన చిన్న కూతురు దానికి కారణం తన మంచితనం, ముసలాయన ఔదార్యం అనుకోకుండా, అంతా గణపతి అనుగ్రహం అనుకుంది. వాళ్ళ నాన్న చేసిన పూజల ఫలమే తనకు దక్కిందనుకుంది. ఇక గణపతి విగ్రహం స్థాయి పెరిగింది. ఇరుగుపొరుగు వాళ్లు మొక్కులు మొక్క నారంభించారు. ఏ కళ నున్నాడో గణపతి వారి కోరికలూ తీర్చినట్లున్నాడు. ఇంటి దగ్గర తీర్థప్రజే అయ్యారు.

ఈ వరాలకి మరొకరయితే పూజారిలా అడ్డుపడేవారు. కానీ చిన్నకూతురు పాపం వాళ్లనందర్నీ దేవుడి అనుగ్రహాన్ని పొందనిచ్చింది. ...అసెంబ్లీకి నిలబడ్డ ఓ అభ్యర్థిని కూడా. అతను ఎన్నికల్లో నెగ్గగానే వచ్చి సాష్టాంగపడి, వెండి కిరీటం చేయిస్తానని మొక్కుకొని ఇంటికెళ్లగానే మంత్రయినట్టు ఫోనొచ్చింది. మళ్లీ గణపతి దగ్గరికి పరుగెట్టుకొచ్చి ఏకంగా గుడే కట్టించేస్తానన్నాడు. అతని వెంట అతని శిష్యగణం. వారిని అదుపు చేయడానికి పోలీసులు. అందరికీ ఒకటే కుతూహలం! దివిలో గణపతిని ఈ భువిలో ఈ విగ్రహంలోకి దింపి ఈ కలికాలంలో యిన్ని మహిమలు చూపించేటట్లు మొహమాటపెట్టిన భక్తశిఖామణి ఎవరు?

చిన్నకూతురు, ''నేను కాదు, మా నాన్నే'' అంది. ఇక జనమంతా కనీసం అతని ఫోటోనైనా చూపించాలని పట్టుబట్టారు. ఒక పాత ఫోటో ఎక్కణ్నుంచో వెలికితీసి సిల్వర్‌ఫ్రేము కట్టించి గణపతి విగ్రహం దగ్గిర పెట్టారు. గణపతికి నాలుగు పువ్వులేసిన ప్రతీవాడు కాకా ఫోటోదగ్గిర రెండైనా వేయడం మొదలెట్టేవారు. త్వరలో అతను దైవాంశసంభూతుడిగా పరిగణింపబడ్డాడు.

గుడి కట్టించినప్పుడు కూడా సదా కాకా పెద్దసైజు ఫోటో గర్భగుడిలో చోటు చేసుకుంది. చిన్నకూతురికి గుడి ప్రాంగణంలో ఇల్లు కట్టి ఇచ్చారు. కాకా బతికుంటే ఇదంతా చూసి తెగ చికాకుపడి ఉండేవాడు. యవ్వనంలో ఉండగా ఫేషన్‌గా ఉంటుందని నాస్తికుడనని చెప్పుకు తిరిగేవాడు కూడా. దరిమిలా ఉత్సాహం చల్లబడి, తండ్రి మరణం తర్వాత ఆయన మీద గౌరవం కొద్దీ అప్పుడప్పుడు పూజా పునస్కారం చేసేవాడు. అంతటితో సరి. బతికుంటే మాత్రం తనను భగవాన్‌ కాకా అన్నవాణ్ణి చితగ్గొట్ట్టేవాడు. నిజంగా కొట్టేవాడా? జనం వేలంవెర్రిని ఒక్క మనిషి ఆపగలిగేవాడా? ఏమో... చెప్పలేం!

తండ్రిపై దైవత్వం ఆపాదించడం కొడుకుని మండించింది. పనిగట్టుకొని ఆయన గురించీ, ఆయన తనకు చేసిన అన్యాయాల గురించీ చెప్పబోయేడు. కానీ విన్నవాడెవడు? పైగా ఖబడ్దార్‌ అంటూ భక్తుల బెదిరింపు ఉత్తరాలు కూడాను. పెద్దకూతురు అసూయతో వెర్రెక్కిపోయి 'నేనూ భక్తురాల్నే' అంటూ గుడిలో దూరబోయింది. జనం ఒప్పుకోలేదు. 'చిన్నకూతురే భగవాన్‌ కాకా నిజమైన వారసురాలు' అని డిక్లేర్‌ చేసేశారు.

సదా కాకా మరణం తర్వాత ఇలాటి అనేక సంఘటనలు కొన్ని ఇలాగ, కొన్ని అలాగ జరిగేయి. ఇంతటితో ఈ కథ అంతం కాలేదు. సంఘటనలు జరుగుతూనేవున్నాయి. ఈ కాలగమనాన్ని, కాల స్వభావాన్నీ ఎవరాపగలరు?

(విపుల మే 1995  లో ప్రచురితం)

మరాఠీ మూలం - గంగాధర్‌ గాడ్గీళ్‌ 

తెలుగు సేత - ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?