Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ కథలు - 27

అసలు సంగతేమిటంటే... 

''చివరగా అసలు విషయం మూడు ముక్కల్లో చెప్పాలంటే... అంటే 'టు పుట్‌ ఇట్‌ ఇనే నట్‌షెల్‌..'' అంటూ పుచ్చకాయను తడిమినట్లు చేతులాడించాడు వేదికవిూద నున్న వ్యక్తి.

అంతే! నాకర్థమయిపోయింది. ఇంకా ఇక్కడ కూచుని తలాడిస్తూ బోరు కొట్టించుకోవడం వ్యర్థం అని తెలిసిపోయింది. ఇక చెయ్యాల్సిందేమిట్రా అంటే ధైర్యంగా, తొణక్కుండా, బెణక్కుండా ఓ నిర్ణయం తీసుకోవాలి, దాన్ని అమలు చేయాలి. నేను నిర్ణయం తీసేసుకున్నాను -

జేబులోంచి వేరుశెనక్కాయ లాగాను. 'ఫట్‌'మని తెరిచి గింజలు నోట్లో పడేసుకొని, స్టేజి మిదకు దూసుకుపోయాను. ఉపన్యసిస్తున్న పెద్ద మనిషిని పట్టుకుని అతన్నే 'నట్‌షెల్‌'లో 'పుట్‌' చేసేసి, జేబులో పెట్టేసుకున్నాను. నేను అలాఅలా నడిచి వెళ్లిపోతూంటే సభలో ఉన్న వెర్రి పీనుగులందరూ ఆ వక్త గారు ఖాళీ చేసిన చోటు కేసే చూస్తూ ఉండిపోయారు. నాజేబులో ఉన్న డొల్లలోంచి సౌండు వస్తోందన్న సంగతే కనుక్కోలేకపోయారు. నేను చేయవలసిన మహత్కార్యం చేసేశాను. అది వాళ్లు అర్థం చేసుకోలేకపోతే అది వాళ్ల ఖర్మ!

ఇంటికిరాగానే చాకు పెట్టి మా పెరట్లో చిన్న గుంటతీసి లోపల సరుకుతో సహా వేరుశెనగ డొక్కుని పాతేశా. పాపం ఉపన్యాసకుడి గారికి లోపల ఉతుకుష్టంగా ఉండి ఉంటుంది. ఏం? మైకు పట్టుకుని గంటలతరబడి మనల్ని చంపుకు తిన్నప్పుడు లేదూ! వాళ్లకీ అప్పుడప్పుడు తెలిసిరావాల్లే!

xxxxxxxxxxxxx

ఈ సంగతంతా విని 'వీడికింత తిక్కేమిట్రా బాబూ' అనుకొని ఉంటారు విూరు. కానీ నా పద్ధతే అంత! వక్తలను కాజేసే నా అలవాటు అంతకంతకీ పెరుగుతోంది కానీ తరగటం లేదు. ఆ మధ్యోసారి ఒకాయన్ని చూసా. బల్లగుద్ది చెప్పాల్సిన పాయింటు వచ్చినప్పుడల్లా ఆయన గుప్పిలి బిగించి నిజంగానే బల్లగుద్దడం మొదలెట్టాడు. నా కొళ్లు మండింది. ఆ గుప్పిలి అలాగే పట్టుకొచ్చేసి ఇంట్లో పేపరు వెయిటులా ఉపయోగిస్తున్నా.

ఇంకోసారి ఓ విప్లవనాయకుడు తారసిల్లాడు. ఎప్పుడు చూసినా రక్తపాతం అనేవాడు. ఓ పెన్సిల్‌ కేప్‌ పట్టుకెళ్లి చటుక్కున నెత్తికి తగిలించి జేబులో పెట్టేసుకున్నాను. ప్రస్తుతం అతన్ని ఎర్రపెన్సిల్లా వాడుతున్నాను. అందుకే లాగుంది నా చేతిలో పరీక్ష పేపర్లు పడ్డాయంటే చాలామంది కుర్రాళ్లు తప్పడం ఖాయం.

ప్రస్తుతం మా ఆవిడకి 'జామ్‌' పెట్టడానికి జాడీ కావాలిట. తేనెలూరే పాటలు పాడే గాయని కోసం వెతుకున్నాను. పట్టుకొచ్చి ఆమె కిద్దామని. విూకెవరైనా కనబడితే చెప్పండి. కాస్త లావుగా, కింద కుదుమట్టంగా ఉంటే ప్రశస్తం!

xxxxxxxxxxxxx

ఒకసారి నేనూ మా ఆవిడా ఓ సినిమాకెళ్లాం. సినిమా పేరు 'ముస్కరాహట్‌' కదా ఏదో జంగిల్‌ ఫిల్మ్‌ అయివుంటుందనుకున్నాను. బ్రహ్మపుత్ర నదిలోని మొసళ్లను హిందీలో 'ముస్కరాహట్‌' అంటారని మనందరికీ తెలుసుకదా. కానీ తమాషా ఏమిటంటే మా ఆవిడకి ఆ విషయం తెలీదు. ముస్కరాహట్‌ అంటే చారల బెంగాల్‌ పులి అనుకొందామె. కాస్త వెర్రిమాలోకం లెండి. చాలాసేపు ఉగ్గబట్టుకుని చూసినా తెరవిూదకు పులులూ రాలేదు, మొసళ్లూ రాలేదు. ఇక నాకు చికాకేసుకొచ్చింది. లేచి నుంచొని 'సంగతేటయ్యా బాబూ' అని అరిచా. సమాధానం లేదు.

మా ఆవిడ చెయ్యి అడ్డుపెట్టి వారించినా, తెరవిూదకు సర్రున వెళ్లా. హీరోగాడికి ఒక్కటిస్తే వెళ్లి అవతలపడ్డాడు. హీరోయిన్‌ కేసి ఉగ్రంగా చూసి 'బ్రహ్మపుత్ర మొసళ్లేవి తల్లీ?' అని నిలదీసాను.

''మొసళ్లా?'' అని పళ్లికిలిస్తూ అడిగింది.

''కాపోతే నీ మొహం చూడ్డానికి వచ్చాననుకున్నావా? ముస్కరాహట్‌ ఎక్కడ? ఇంకా రాదేం?'' అని కడిగేశాను.

''చూడండి సార్‌. ముస్కరాహట్‌ అంటే చిరునవ్వు. నేను తెరవిూదకు వచ్చిన దగ్గర్నుంచీ చిందిస్తున్నది అదేగా'' అంది ఆ నంగనాచి.

''గాడిదగుడ్డు కాదూ... కాస్సేపు పోతే ముస్కరాహట్‌ అంటే ఓ బెంగాలీ స్వీటు అని చెప్తావులా ఉంది. చూడమ్మా, తెలీపోతే ఇప్పటికైనా అడిగి తెలుసుకో - ముస్కరాహట్‌ అంటే మొసలి. తెలీదూ? మొసలి అంటే... మొసలే''

ఆడవాళ్లకూ తర్కానికీ ఆమడదూరం. నా వాదం అర్థమయి ఛస్తేగా. తల అడ్డంగా తిప్పింది.

నాకూ పట్టుదల పెరిగింది. 'సరే నేనన్నది రైటని తిరుగులేని సాక్ష్యం సంపాదిస్తా చూడు' అంటూ...ఎకాయెకీ అలాగే ఢిల్లీ కెళ్లిపోయా. అప్పట్లో లార్డ్‌ మౌంట్‌బాటన్‌ గారు వైస్రాయిగిరీ వెలిగిస్తున్నారు. నే వెళ్లేటప్పటికి జున్ను డబ్బా మూత తీయడానికి అవస్థ పడుతున్నాడాయన.

''ఇదిగో మౌంట్‌బాటెనూ'' అని కేకవేసా.

''యస్‌'' అన్నాడు దర్జా ఒలకబోస్తూ.

''ముందా డబ్బా కిందపెట్టు'' ఆజ్ఞాపించా. వీళ్లని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాల్సిందే.

దెబ్బకి దడిసాడు. ''అలాగేనండి'' అంటూ డబ్బా బల్లవిూద పెట్టాడు. 

నేను జాలిపడ్డాను. ''దేశంలో ఆహారసమస్య తీవ్రంగా ఉందని తెలుసయ్యా, అది పరిష్కరించడానికి నువ్వు అస్తమానూ జున్ను తినక్కర్లేదు'' అని నచ్చచెప్పబోయాను.

''అయితే చేప తినమంటారా?'' అన్నాడు ఆశగా మొహం పెట్టి.

అబ్బే జాలి చూపిస్తే లాభంలేదు. చెడిపోయేట్టున్నాడు.

''ప్రస్తుతం తినడం, గినడం జాన్తానై'' అని చెప్పాల్సి వచ్చింది.

''అయితే టీ తెప్పించమంటారా?'' అని మర్యాద చేయబోయాడు.

''అది సరేలేవయ్యా, దేశానికి ఏ గతి పట్టించారో చూడు విూ వాళ్లు. నీకు ఒళ్లూపై తెలుస్తోందా'' అని కేకలు వేసాను.

''అసలేం జరిగిందండి?''

''ఇంకా ఏం జరగాలయ్యా? 'ముస్కరాహట్‌' అంటే 'చిరునవ్వు' అని బొంబాయిలో పబ్లిగ్గా చెప్పుకుంటున్నారు..''.

''ఎంతఘోరం'' అని కొయ్యబారిపోయాడు మౌంట్‌బాటెన్‌.

గంభీరంగా తల ఊపి ఊరుకున్నాను.

కాస్సేపాగి ''అయితే సైన్యాన్ని బొంబాయికి తోలమంటారా?'' అన్నాడతను.

''అప్పుడే ఒద్దులే. సిద్ధంగా మాత్రం ఉండమను. కావలిస్తే సైనికులను ఆ బటన్లూ, అవీ బాగా పాలిష్‌ చేసి ఉంచుకోమను. ఈ లోపున నువ్వో ఆర్డినెన్స్‌ పాస్‌ చేసి 'ముస్కరాహట్‌' అంటే 'బ్రహ్మపుత్ర నదిలో మొసలి సుమా' అని యావన్మంది ప్రజలకూ చాటిచెప్పు''

సరేనని ఆయన రాయడానికి కూచున్నాడు. మాంచి పదునైన భాష వాడదామనుకొన్నాడేమో, పెన్సిల్‌ ముల్లు పదునుబెట్టడం మొదలెట్టాడు.

''ఇండియాకు గవర్నర్‌ జనరల్‌ మరియు వైస్‌రాయ్‌నైన నేను, నా ఆధీనములోనున్న బ్రిటీష్‌ ఇండియా, ఇండియాలోని తక్కిన సంస్థానములు, అండమాన్‌, నికోబార్‌ దీవులు...

''....బర్మా సిలోన్‌ కూడా చేర్చేయ్‌'' అన్నాను.

''చేర్చడం నాకూ సంబరమే కానీ నాకా పవరు లేదే!''

''సరే, సరే ఇప్పటికిలా కానిచ్చేయ్‌. ఈసారి ఆరవ జార్జిని కలిసినప్పుడు దీనిగురించి అడుగుతానులే'' అని హామీ ఇచ్చా.

కాస్సేపు రాసాక మౌంట్‌బాటెన్‌ ఆగేడు. ''మళ్లా ఏమొచ్చిందయ్యా బాబూ'' అన్నట్టు చూసాను.

''ప్రస్తుతం దేశంలో ఆహారసమస్య తీవ్రంగా ఉంది. ఆ విషయం కూడా పరిగణనలోకి తీసుకోవాలి కదా'' అన్నాడతను.

''నిజమే ననుకో...'' అని ఒప్పుకోవాల్సి వచ్చింది.

''...అందువల్ల 'ముస్కరాహట్‌' అంటే 'ఉడికించిన చిలకడదుంప' అందాం. ఎలా ఉంటుందంటారు? విూకు ఏవిూ అభ్యంతరం లేకపోతేనే సుమండీ'' అన్నాడతను జంకుతూనే.

''ఆహారసమస్య మరీ అంత తీవ్రంగా ఉందంటారా?'' అని అడిగా సందేహనివృత్తి కోసం.

పెన్సిల్‌ గడ్డం విూద కొట్టుకుంటూ గంభీరంగా తలూపాడతను.

''మరి అంత ఇదిగా ఉంటే చిలకడదుంపెందుకు? బంగాళాదుంపయితే మరీ మంచిదికదా'' అన్నాను.

''అబ్బ, ఏం బుర్రండీ విూది'' అని మౌంట్‌బాటెన్‌ నన్ను తెగ మెచ్చుకుని ఆర్డినెన్స్‌పై సంతకం పెట్టి నాచేతికిచ్చేసాడు. నేను హుటాహుటిన బొంబాయి వచ్చేసి ఆ తారామణి కళ్లముందు ఆర్డినెన్సు కాగితం ఆడించాను.

''ఏమిటది?'' అందామె గుడ్లు మిటకరించి.

''దీంట్లో ఏముందో తెలుసా? నీ మొహం ఉడికించిన బంగాళాదుంపలా, నీ హీరో మొహం ఉడికించిన చిలకడదుంపలా ఉందని రాసుంది. చూసుకో'' అని మొహం పగిలేలా జవాబిచ్చి, నా సీటుకొచ్చి పడ్డాను.

ఇదండీ నా మొండి పట్టుదల. నేననుకొన్నది సాధించడానికీ, నా పంతం నెగ్గించుకోడానికీ చాలా చిత్రమైన పనులు చేస్తూంటాను. కానీ జనాలకి ఇవన్నీ తెలియవు. బయటి ప్రపంచంలో మామూలుగా బట్టలేసుకుని, కాలేజీలో పాఠాలు చెప్తూంటాను కాబట్టి నేనింతటి దేవాంతకుణ్నని వాళ్లు ఊహించను కూడా ఊహించలేరు. అందువల్ల నిజం ఏమిటో నేను చెప్పవలసి వస్తోంది. ఓ పిచికతో నాకు జరిగిన కోర్టు తగాదా ఉదంతం వింటే నా పోరాటపటిమ, బుద్ధికుశలత ఎలాటివో విూకే తెలుస్తుంది.

xxxxxxxxxxxxxx

వర్షాకాలంలో తప్ప నేను టోపీ వాడను. తతిమ్మా కాలాల్లో నా టోపీ చిలక్కొయ్యకు వేలాడుతూ ఉంటుంది. ఒకరోజు ఓ పిచిక ఓ గడ్డిపోచ ముక్కున పెట్టుకుని తయారయింది. ముందుగా తలుపు విూద వాలి నాకేసి ఓ చూపు పడేసింది. తర్వాత రేడియో సెట్టు విూదకు గెంతింది. అక్కణ్నుంచి టోపీకేసి మెచ్చుకోలుగా చూసింది. ఈ వేషాలకీ, చూపులకీ లొంగిపోయే ఘటంకాదు నేను. అందుచేత పేపరు చదువుతున్నట్టు నటిస్తూనే దానివిూద ఓ కన్నేసి ఉంచా.

అది నెమ్మదిగా గడ్డిపరక టోపీలో పడేసి టోపీ అంచెక్కి తన ఆస్తి తనివితీరా చూసుకునే యజమానిలా దాన్ని పర్యవేక్షించింది. ఇక నేను కలగజేసుకోవాల్సి వచ్చింది.''చూడు పిచికమ్మా, ఆ టోపీ నాది. దాంట్లో ఉండాల్సింది నా తలకాయ గానీ నీ గడ్డిపోచ కాదు'' అన్నాను.

చెవుడు వచ్చినట్టు నటించిందది. జవాబు చెప్పకుండా వెళ్లిపోయి, కాస్సేపటికి మరోటి పట్టుకొచ్చింది. తోడుగా మొగుడొకడు. ఇద్దరూ చెరోటీ పడేశారు. ఇక నాకు ఒళ్లు మండి ఇద్దర్నీ తోలేశా. దాంతో కథ ముగిసిపోయిందని పొరబడ్డా.

కొన్నాళ్లకి మా ప్రొఫెసరు బ్రహ్మాండరావుగారు వచ్చినప్పుడు ఆ టోపీక్రిందనే కుర్చీవేసి కూర్చోబెట్టా. ఆయన తన టోపీ తీసి, బట్టతల తడుముకుంటూ నాతో కబుర్లు చెప్తూండగా ఆయన నెత్తివిూద ఓ గడ్డిపోచ పడింది. ఆయన దాన్ని చేతిలో తీసుకుని పరధ్యాన్నంగా కొరకసాగేడు. కానీ మనస్సులో ఏదో సందేహం మొలకెత్తింది.

కాస్సేపటికి ఇంకోటి పడింది. దాన్ని మరో చేత్తో తీసాడాయన. అదేదో ఆల్జీబ్రా లెక్క అన్నట్టు దానికేసి చూసి తికమకపడి ''దీన్నేం చెయ్యనూ?' అని అడిగాడు నన్ను.

''చెవిలో గుబిలి తీసుకోండి''

ఆయన తల అడ్డంగా ఊపాడు. 

''గుబిలి తీసుకొనే ఉద్దేశ్యం లేదా? అలా అయితే దాన్ని తలవిూదే ఉంచాలి'' అన్నాను. 

ఆయన కీ సలహా నచ్చినట్టుంది. దాన్ని నా తలవిూద పెట్టి కబుర్లు సాగించాడు.

మూడో పరక కూడా పడింది. కానీ ఆయన ఇంటికెళ్లే హడావుడిలో పట్టించుకోలేదు. లేచి నుంచోడంలో నా టోపీ ఆయన తలకి కొట్టుకుని ఓ పిచిక గుడ్డు నెత్తివిూద వాలింది. ఆయనది గమనించకుండా పైన టోపీ తగిలించుకుని వెళ్లిపోయాడు.

''అండమండోయ్‌, బ్రహ్మాండంగారూ'' అని వెంటబడి పిలిచినా ఆయన వినిపించుకోకుండా వెళ్లిపోయాడు.

తిరిగి వచ్చేసరికి టోపీలోంచి పిచిక బయటకు వస్తోంది. ''ముందు నా టోపీ ఖాళీ చేయవే దరిద్రపు మొఖవా'' అని మొఖం వాచేట్లు చివాట్లు వేశా.

అది తక్కువ తిందా? ''నన్ను ఖాళీ చేయించడం నీ తరంకాదు. రెంటల్‌ కంట్రోలు యాక్ట్‌ నాకు రక్షణ కల్పిస్తోంది. దానికంటే ముందు ఇంకో పేచీ ఉంది తెలుసా? నా అండం దొంగిలించినందుకు నేను బ్రహ్మాండం గారి విూద పెట్టే క్రిమినల్‌ కేసులో నిన్ను సహనిందితుడిగా పేర్కొంటున్నాను. కాసుకో'' అని ఠలాయించింది.

తరవాత జరిగిన విషయాలన్నీ విూరు పేపర్లో చదివే ఉంటారు. బ్రహ్మాండం గారిని దొంగతనం కేసులో అరెస్టు చేసారు. ఆయనకు దొంగచాటుగా ముద్దులు పెట్టే అలవాటుందని ఆయన భార్య సాక్ష్యం చెప్పడంతో, ఆయనకు ముందునుంచి దొంగబుద్ధి ఉందని కోర్టు వారు నమ్మేరు. నేను మాత్రం ఓ ఠస్సా వేసి బయటపడ్డాను.

''బ్రహ్మాండం గారి తల విూద గుడ్డు చూసావా? లేదా?'' అని అడిగారు.

''చూశా''

''అయితే ఆయనకు చెప్పి పిచికమ్మ ఆస్తి ఆవిడకు ఎందుకు దఖలు పరచలేదు?''

పిచికమ్మ ఈ ఘట్టంలో కాస్త శోకం అభినయించింది. రెక్కలతో కళ్లు తుడుచుకుంది.

దాన్ని వోరగా చూస్తూ ''నెత్తివిూద ఎప్పుడూ అండం ఉంటుంది కాబట్టే ఆయన్ని బ్రహ్మాండం గారంటారు. అది ఆయనదేయేమో, ఆయనే గుడ్డెట్టారేమో ననుకున్నాను.'' అన్నాను.

''అంటే బ్రహ్మాండం గారు గుడ్లు పెట్టి వాటిని నెత్తివిూద మోసుకు తిరుగుతాడని అంటున్నారా విూరు?'' అన్నాడు లాయరు విస్మయంగా.

''ఆ మాత్రం దానికి విస్మయం దేనికి? భారత రాజ్యాంగంలో దాని గురించి నిషేధం ఏదీలేదే'' అన్నాను.

బ్రహ్మాండం గారు చటుక్కున లేచి నుంచొన్నాడు. ''ఎక్కడ కావాలంటే అక్కడ, ఎన్ని కావాలంటే అన్ని గుడ్లు పెట్టడం నా ప్రాథమిక హక్కు. తిక్కరేగితే ఇక్కడే వందగుడ్లు పెట్టేస్తానంతే'' అని అరిచాడు.

ఆయన భార్య ''ఆయనంత పనీ చేసినా నా కాశ్చర్యం లేదు. ఒఠ్ఠి తిక్కమనిషి'' అని స్టేటుమెంటిచ్చింది.

''అలా గుడ్లెడితే కోర్టు ధిక్కారం క్రింద వస్తుంది జాగ్రత్త'' అని జడ్జీగారు ఆయన్ని హెచ్చరించి నన్నొదిలేసారు.

నా వివరణ వల్ల కోర్టు వారికి బ్రహ్మాండం గారిని జైలుకి పంపే ఉద్దేశం మారింది. ఈక్వడార్‌ దేశ బాలలకు భారత ప్రభుత్వపు బహుమతిగా ఏనుగుని బదులు బ్రహ్మాండం గారిని పంపితే బాగుంటుందని సూచించారు జడ్జీగారు.

నెత్తివిూద గుడ్డుతో బ్రహ్మాండం గారు ఓడ ఎక్కుతున్న ఫోటో విూరు పత్రికల్లో చూసే ఉంటారు. బాంబే యూనివర్సిటీ వైస్‌ఛాన్సలరుగారు ఆ సందర్భంగా అండం గురించీ, బ్రహ్మాండం గురించీ బ్రహ్మాండమైన ఉపన్యాసం దంచేరు. ఉపనిషత్తుల్లోంచి పదకొండు శ్లోకాలు ఉదహరించారు కూడా. 'అసలు అండంలోంచే బ్రహ్మాండం పుట్టింది. గుడ్లు పెట్టడం ద్వారా మన సంస్కృతిని పరిరక్షిస్తున్న వీరిని అండపిండ బ్రహ్మాండరావుగారనే బిరుదుతో సత్కరిస్తున్నాను' అని ఉద్ఘాటించారాయన.

అందరూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరయిపోయారు. బ్రహ్మాండంగారు కృతజ్ఞత లర్పిస్తూ అచిరకాలంలో సభికులందరూ గుడ్లు పెడతారనీ, ప్రభుత్వం ఖర్చుపై విదేశాలు చుట్టివస్తారనీ ఆశాభావం వ్యక్తపరిచారు. ఇంకాస్తముందు వెళ్లి భారతీయులందరూ ప్రభుత్వం ఖర్చుపై విదేశాలలో స్థిరపడే రోజు వస్తుందని కూడా ఆశిస్తున్నానని చెప్పారు.

సరే, నా సంగతి కొస్తే - కోర్టు వాళ్లు నన్ను వదిలేసాక, మా లాయరు దగ్గరకెళ్లి గట్టి వెకేషన్‌ నోటీసు ఇమ్మన్నాను. ఆయన తయారు చేసి వినిపించాక ''స్ట్రాంగ్‌ లీగల్‌ నోటీసు ఇమ్మన్నాను కదయ్యా'' అని పోట్లాడాను.

''చూడండి సార్‌, పేపరు కూడా ఎంత స్ట్రాంగో'' అన్నాడు.

''స్ట్రాంగా!? 'సదరు' అనే మాట ఒక్కసారి కూడా ఉపయోగించలేదు. నువ్వేం లాయరువయ్యా బాబూ'' అని కడిగేసాను.

ఆయన నాలిక్కరుచుకుని ''పొరబాటే సుమండీ'' అన్నాడు. 

''అయితే మళ్లీ రాయి. కనీసం ఏడు 'సదర్లు' ఉండాలి.''

దీనికి జవాబుగా పిచికమ్మ ఇచ్చిన నోటీసులో పదకొండు సదర్లు ఉన్నాయి. దానితో బాటు ఉపనిషత్తుల నుండి ఓ కొటేషను కూడా ఉంది.

ఆ నోటీసుకు నేను బెదరలేదు. ఇంకో నోటీసు ఇచ్చా. దాన్లో మొదటినుంచి చివరదాకా సదర్లే. ఆఖరిపేరలో 'నెబుచెడ్నజార్‌', 'ఖతర్‌నాక్‌' వంటి స్ట్రాంగు పదాలు ఇరికించా.

చివరికి మా వ్యవహారం యు.ఎన్‌.ఓ. దాకా పోయింది. మధ్యవర్తులుగా పకక్షులుండడం నాకు సమ్మతం కాదు. మనుష్యులుండడం పిచికమ్మకు సమ్మతం కాదు. చివరికి రేడియోసెట్టు విూదున్న చెక్క ఏనుగు తుని తగవు చేసింది. పిచికమ్మ పిల్లలకు ఎదిగే వయసు వచ్చేదాకా నా టోపీలో నివసించే హక్కు దాని కుంటుంది. ఆ తర్వాత దాన్ని ఖాళీ చేస్తుంది కానీ అవసరం పడ్డప్పుడల్లా నేను దాన్ని వాడుకోనివ్వాలి. తగవు సందర్భంగా మేం వాడిన స్ట్రాంగ్‌ పదాలన్నీ ఇద్దరం ఉపసంహరించుకోవాలి.

ఒప్పుకున్నాను. ఏం చేస్తాం? ఇల్లు గలవాడిని. అద్దెకున్నవాళ్లతో వేగడం వక్తలను కాజేసినంత సులభం కాదుగా ! 

గంగాధర్‌ గాడ్గీళ్‌ మరాఠీ రచనకు  అనువాదం

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]

(విపుల లో ప్రచురితం)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?