Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ కథలు - 30

మారువేషాల డిఫెక్టివ్‌

వారం రోజులుగా మెస్‌లో ఒకరినొకరు చూసుకుంటున్నా వాళ్లు మాట్లాడుకోవడం అదే మొదటిసారి. ''మీ పేరు వాణి కదూ'' అని మాధవ్‌ పలకరించాడు.

''అవును. కానీ మీకెలా తెలుసు?''

సమాధానంగా ఇవన్నీ నాకు తెలియకుండా ఉంటాయా అన్న స్టయిల్లో మాధవ్‌ చిరునవ్వు నవ్వి, ''మీరు డాన్సరు, 'నేటి మహిళ' నృత్యనాటకంలో కోరస్‌లో ఉన్నారు. గవర్నమెంటు కాంట్రాక్టుపైన మీ బృందం వాళ్లు ఊరూరా తిరుగుతున్నారు'' అని కలిపాడు.

వాణి తన అందమైన కనురెప్పలు టపటప లాడించి, ''అన్నీ నిజమే కానీ మీకెలా తెలుసు?'' అని అడిగింది మళ్లీ.

''అది నా వృత్తిధర్మం లెండి'' అని ఎఫెక్టు కోసం కాస్త ఆగి, ''నేను డిటెక్టివ్‌ను'' అని ఎనౌన్స్‌ చేశాడు మాధవ్‌.

xxxxxxxxxxxxxxxxxxxx

ఆ మాట చెప్పగానే అవతలివాళ్లు సాధారణంగా కనబరిచే హావభావాలు తెలుసు కాబట్టి వాణి ముందు వినయం ప్రదర్శించబోయిన మాధవ్‌ కంగు తినాల్సి వచ్చింది. వాణి కళ్లల్లో క్యూరియాసిటీ, ఎడ్మిరేషన్‌ లాటివి ఏవీ కనబడలేదు. అక్కడికీ ఏ డిటెక్టివూ తను డిటెక్టివునని చెప్పుకోడని, అలా చెప్పుకున్నవాడిని అవతలివాళ్లు అనుమానిస్తారనీ మాధవ్‌ ఫ్రెండ్సు తనను అనేకసార్లు మందలించారు. కానీ డిటెక్టివ్‌నని చెప్పి కాలరెగరేసే టెంప్టేషన్‌ను ఆపుకోవడం మాధవ్‌ తరం కాదు. నిజానికి ప్రజలందరికీ తెలిసిన అపరాధ పరిశోధక నవలల మార్కు డిటెక్టివు కాదు మాధవ్‌. అతనిప్పటిదాకా రక్తపు చుక్కల జోలికి పోలేదు. వేలిముద్రలు, కాలిముద్రలు ఒక్క అంగుళం కూడా కొలవలేదు. అందమైన అమ్మాయిని సెక్రటరీగా పెట్టుకోలేదు.

ఒక డిటెక్టివు కంపెనీలో అతను పనిచేస్తున్నాడు. వాళ్లు సాధారణంగా సెక్యూరిటీ కేసులు, ఫైనాన్షియల్‌ కేసులు, డైవోర్స్‌ కేసులు మాత్రం చూస్తూ ఉంటారు. అందువల్ల మాధవ్‌ పని ఎంతసేపూ ఎవళ్లో ఒకళ్ల వెంటపడి, వాళ్లు ఎలా తిరుగుతున్నారో కనిపెట్టి రిపోర్టు రాసి ఇవ్వడమే జరుగుతుంది. ఆ సదరు వెంటాడబడే వ్యక్తి హాయిగా హోటల్లో భోజనం లాగిస్తూంటే, బయట వర్షంలో గొడుగేసుకుని అతను కారు నెంబరు నోట్‌ చేసుకుని, అతనెవరితో వచ్చాడో గుర్తు పెట్టుకుని మాధవ్‌ అవస్థపడుతూంటాడు. కానీ డిటెక్టివ్‌ కుండే గ్లామరు డిటెక్టివుకుంది. 

అది కొంతమంది దగ్గర పనిచేయదని మాధవ్‌కి ఇప్పుడే తెలిసివచ్చింది. పనిచేయకపోయినా బావుణ్ను. నెగటివ్‌గా పనిచేసిందనిపించింది వాణి ముఖం చిట్లించిన విధానం చూస్తే! దానికి కారణం గురించి మరీ ఎక్కువగా పరిశోధన చేసే భారాన్ని మాధవ్‌కి తప్పిస్తూ వాణి తన అభిప్రాయం హోటల్లో అందుబాటులో ఉన్న అన్నంకుండ బద్దలకొట్టకుండానే చెప్పేసింది.

''నాకు డిటెక్టివులంటే పడదు. ఇతరుల జీవితాలలోకి తొంగి చూడడం తప్ప వాళ్లు చేసే పనేమీ ఉండదు'' అని ఈసడించేసింది.

మాధవ్‌ కలలమీద కుండెడు చన్నీళ్లు దిమ్మరించినట్టయింది. వాణిని చూసిన దగ్గర్నుంచీ అతనెన్నో  ఆశలు పెట్టుకున్నాడు. ఆమెను పెళ్లాడినట్టు కలలు కూడా కనేశాడు. తనతో స్నేహం పెరిగితే అభిప్రాయం మార్చుకుంటుందని అనుకోవడం కూడా పొరబాటని పదిరోజుల్లో తెలిసిపోయింది. వాణి పాయింట్లు వాణికున్నాయి. ''డిటెక్టివులు ఇంటిపట్టున ఉండేది తక్కువ. క్లయింట్లు ఏం చేస్తున్నారో చూడడంలోనే వాళ్ల బతుకంతా గడిచిపోతుంది. నేను పెళ్లాడబోయేవాడు నా కళను గౌరవించాలి. అంటే నా వంటి కళాకారుడయితే మంచిది'' అని చెప్పేసింది. ''నువ్వు వృత్తి మారిస్తే పెళ్లాడడానికి అభ్యంతరం లేదు'' అని సూచిస్తూ. 

xxxxxxxxxxxxxxxxxxxxxxxx

ఆ తర్వాత మూడు రోజులూ మాధవ్‌ ఆఫీసుకి వెళ్లలేదు. ఆటగానీ, పాటగానీ, నటనగానీ నేర్పుతానని ప్రకటించుకున్న సంస్థలన్నిటి చుట్టూ తెగ తిరిగేడు. వాళ్లందరూ ముక్తకంఠంతో వెలిబుచ్చిన అభిప్రాయం ఒక్కటే - మాధవ్‌కి వీటిలో ఏదీ రాదని. ఇక వాణిని పెళ్లాడే కార్యక్రమానికి ఫుల్‌స్టాపు పెట్టేదామని అనుకుంటూండగానే మాధవ్‌ మేనేజరు పిలిచి అతనికి ఒక కొత్త పని అప్పగించాడు. ''నేటి మహిళ'' నృత్యనాటిక ప్రదర్శించే బృందంలో ఒక నటుడి భార్యకు భర్తపై అనుమానం. ఆ బృందంతో బాటు ఊళ్లు పట్టుకుని తిరగడం ఆమెకు కుదరదు. కాబట్టి అతని ప్రవర్తనను గమనించి తనకు రిపోర్టు చేయమని మాధవ్‌ కంపెనీ నడిగిందామె. ఆ బృందం తిరిగే ఊళ్లన్నీ తిరిగి, ప్రేక్షకులలో ఒకడిగా ఉంటూ అతన్ని గమనించాలని, వాళ్లు ఏ హోటల్‌లో దిగితే అక్కడే దిగి అతనెవరితో కలుస్తున్నాడో కనిపెట్టాలని మాధవ్‌ను బాస్‌ ఆదేశించాడు.

మాధవ్‌ పొంగిపోయాడు వాణికి ఏదో విధంగా దగ్గరగా ఉండే అవకాశం వచ్చింది కదాని. కానీ ఇబ్బంది ఏమిటంటే అతను మామూలు వేషంలో ప్రతీ ఊరికీ ప్రేక్షకుడిగా వెళితే ఆ నటుడు రెండు, మూడు రోజుల్లో గుర్తుపట్టేస్తాడు. అందుకని ఊరూరికి మాధవ్‌ వేషం మారుస్తూ వచ్చాడు. ఓసారి పల్లెటూరి బైతుగా, మరోసారి షావుకారుగా, ఇంకోసారి పూజారిగా, ఇంకో రోజు పీచుమిఠాయి అమ్మేవాడిగా, మరోసారి క్రిస్టియన్‌ ఫాదిరీగా... ఇలా ఊరూరికి వేషం మారుస్తూ వచ్చాడు. ఈ వేషాల వల్ల వాణి తనను, తద్వారా తన ప్రేమను గుర్తించలేకపోతోందేనన్న బాధ కలుగుతున్నా వృత్తిధర్మం కొద్దీ అన్నీ ఓర్చుకున్నాడు మాధవ్‌.

ఆ డాన్స్‌ ట్రూప్‌ మేనేజర్‌ పరమశివం. స్వతహాగా మంచి నటుడు. గవర్నమెంటు కాంట్రాక్టు సంపాదించి టూర్లు నిర్వహించేది అతనే. అతనన్నా, అతని నటనన్నా మాధవ్‌కి ఎంతో ఇష్టం. అలాటివాడు తనను భోజనానికి ఆహ్వానించాడంటే మాధవ్‌ పొంగిపోయాడు. అప్పటికే అతను ఆరువారాలుగా ఆ ట్రూపును అంటిపెట్టుకుని తిరుగుతున్నాడు. గుంటూరులో ప్రదర్శన అయిపోయి, సీట్లోంచి లేచి వెళ్లిపోతూ ఉంటే ఓ కుర్రాడు వచ్చి చెప్పాడు 'పరమశివం గారు మిమ్మల్ని ఓ సారి కలవమన్నారు' అని. వెళితే 'రేపు మధ్యాహ్నం అన్నపూర్ణ హోటల్లో కలిసి భోజనం చేద్దాం రండి' అన్నాడతను.

ముసలిటీచరు వేషంలో పరిచయమయ్యాడు కాబట్టి పాపం మాధవ్‌కి మర్నాడు కూడా అదే వేషంలో భోజనానికి వెళ్లవలసి వచ్చింది. తెల్లగడ్డం, మీసం అడ్డుపడకుండా అన్నం తినడం పెద్ద ఫీటే అయింది. భోజనం అయిన తర్వాత సిగరెట్టు కాలుస్తూండగా ఆ ప్రశ్న అడిగేడు పరమశివం.

''బైదివే, ఇంతకీ మాలో ఎవర్ని వెంటాడుతున్నావు, మిస్టర్‌?''

ఉక్కిరిబిక్కిరయిపోయి, సిగరెట్‌ మింగేయబోయాడు మాధవ్‌. గడ్డం కాలిపోతుందన్న భయంతో కాబోలు, ఆ ప్రయత్నం విరమించుకున్నాడు కానీ తమాయించుకోవడం కష్టమయింది. ''మీరనేది నా కర్థం కావటం లేదు'' అన్నాడు తెల్లగడ్డం ఊడిపోయిందేమో చూసుకుంటూ.

''కమాన్‌ బుకాయింపులు వద్దు. నువ్వు డిటెక్టివ్‌ అని నాకు తెలుసులే. కానీ మాలో ఎవర్ని ఫాలో అవుతున్నావో మా కెవ్వరికీ తెలియటం లేదు. దాని మీద పందాలు కూడా వేసుకున్నాం''

మిన్ను విరిగి మీద పడ్డట్టయింది మాధవ్‌కి. ఇన్నాళ్ల దాకా తనేదో మిస్టర్‌ ఇండియాలా వాళ్లకు కనబడకుండా వాళ్లందరినీ మైక్రోస్కోపు కింద పురుగుల్లా పరీక్షించేస్తున్నాడనుకుంటున్నాడు. చూస్తే పురుగే ఎదురుతిరిగి మైక్రోస్కోపులోంచి తనను చూస్తూన్నట్టుంది. తప్పు, తప్పు ఒక పురుగు కాదు. పురుగులన్నీ... ఇన్నాళ్లూ మాధవ్‌కి తన మారువేషాలు వేసే సామర్థ్యం మీద నమ్మకం ఉండేది. అందునా రకరకాల మనుష్యుల వేషభాషలను, వాళ్ల యాసలను అనుకరించగలనని గర్వం ఉండేది. ఇవాళ అదంతా తుడిచి పెట్టుకుపోయింది.

పరమశివం మాధవ్‌కేసి పరిశీలనగా చూసాడు, ''అవునూ, ఇవాళ నువ్వు వేసుకున్న వేషం ఏమిటి? వందేళ్లు నిండిన ఓటు వేయడానికి వచ్చిన వృద్ధుడనా?''

వెటకారం అర్థం చేసుకోలేనంత అమాయకుడు కాడు మాధవ్‌. అద్దంలో తనను చూసుకున్నాడు. వందకు తక్కువగా, తొంభై ఏళ్లకి ఎక్కువగా ఉంది వేషం. గడ్డం, మీసం కాస్త ఎక్కువైపోయాయి. గడ్డివాములోంచి దూసుకువచ్చేసిన జీపులా ఉన్నాడనిపించింది.

పరమశివం ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ''మా ట్రూపు సభ్యులందరకూ ఇదో ఆట అయిపోయింది. పై ఊళ్లో నువ్వే వేషం వేస్తావో చర్చించడంతోనే సరిపోతోంది వాళ్లకు. రిహార్సల్స్‌లో కూడా ఇదే డిస్కషన్‌. రాజమండ్రిలో చెవిటి పాలేరు వేషం వేసేవు కాబట్టి, ఏలూరులో కుంటి జమీందారు వేస్తావని మాణిక్యం అంటాడు. కాదు మిలటరీ వాడి వేషం వేస్తావని సుందరం అంటాడు. అసలిన్ని వేషాలేయడం ఎందుకయ్యా? మా నాటకాల్లో చూడు. టై మారిస్తే మారువేషం వేసినట్టే లెక్క. కన్నతల్లి కూడా గుర్తుపట్టడానికి వీల్లేదు. అసలు నువ్వు ఒంగోలులో వేసిన అరవసర్వరు వేషం  నీకు బాగా నప్పింది. అదే ఉంచుకోవాల్సింది. పోనీ మార్టూరులో వేసిన తాగుబోతు కుర్రాడివేషమైనా ఉంచుకోవాల్సింది. అనవసరంగా ఇంతంత గడ్డాలు వేసుకుని తయారవ్వడం దేనికి, దురద పుడితే రూముకెళ్లేదాకా గోక్కోడానికి లేదు కదా... పోనీలే, నీ వేషాలు నీ ఇష్టం కానీ, ఇంతకీ నువ్వు ఎవరి వెంటపడ్డావో అది చెప్పు చాలు''

మాధవ్‌కి తన మీద తనకి కోపం దుఃఖం రెండూ కలిపి వచ్చేసాయి. అంటే తను వేసే ప్రతీ వేషం వీళ్లు.. వీళ్లలో ప్రతీ ఒకళ్లూ కనిపెట్టేస్తూనే ఉన్నారన్నమాట. ఏమనాలో తెలియక ఉక్రోషంగా, ''అవన్నీ మీకెందుకు లెండి?'' అన్నాడు.

''నాకెందుకేమిటి? కావాలి. నేను పందెం కడితే నాకు కాక ఇంకెవరికి కావాలి? మేమంతా కలిసి సిండికేట్‌గా ఏర్పడి డబ్బులు కలక్ట్‌ చేసాం. నువ్వు వెంటపడుతున్న వ్యక్తి మేం అనుకున్నవాడే అయితే నాకు రూపాయికి ఇరవై రెండు రూపాయలు వస్తాయి. వెయ్యి రూపాయలు కట్టాను. అందుచేత,  మై డియర్‌ డిఫెక్టివ్‌... సారీ, అది మేం నీకు పెట్టుకున్న ముద్దుపేరులే... వాడెవరో నువ్వు కాస్త చెప్పేసి పుణ్యం కట్టుకో'' అంటూ బతిమాలేడు పరమశివం.

మాధవ్‌కి అహం పూర్తిగా దెబ్బతినిపోయింది. డిఫెక్టివ్‌.. ఇదా వీళ్లు పెట్టుకున్న ముద్దుపేరు!? ఛ, తనంత లోకువ అయిపోయాడా? తన మారువేషాలు పనికిరాకుండా పోయాయా? తన నిస్సహాయత, అసమర్థత మీద తనకే ఒళ్లు మండింది. లేచి నిలబడ్డాడు. వెళ్లిపోవడానికి సిద్ధపడ్డాడు. పరమశివం చేయి పట్టుకుని ఆపాడు. ఎందుకు వెళ్లిపోతావన్నాడు.

''ఉండేం చేస్తాను? నా గురించి మీకందరికి తెలిసిపోయాక నేనుండి ప్రయోజనం ఏముంది? నేను ఫాలో అవుతున్న పెద్దమనిషి కూడా జాగ్రత్తపడతాడు. ఇన్ని వేషాలు వేయడం కూడా వేస్టు'' అన్నాడు మాధవ్‌ నిస్పృహగా.

''మైడియర్‌ డిఫెక్టివ్‌.. సారీ, మాధవ్‌. అదంతా నీకెందుకు? నీ బాస్‌ నీకేం చెప్పాడు? వెంటబడు అన్నాడు. నువ్వు వెంటనంటి ఉంటావు. నువ్వు అతన్ని పట్టుకున్నా, పట్టుకోకపోయినా నీ జీతం నీకొస్తుంది. ఈ మారువేషాలు మానేయి. మాతోబాటే ఉండు, తిను, తిరుగు. ఖర్చులన్నీ నేను పెట్టుకుంటాను. ఎందుకంటావేమో, నువ్వు నాకు అచ్చివచ్చావు. నువ్వు మాతో తిరిగినప్పటి నుంచీ అన్నీ హౌస్‌ఫుల్సే. గవర్నమెంటుతో కాంట్రాక్టు వల్ల హాలు సగం నిండితేనే నాకు ఖర్చులు కిట్టుబాటవుతాయి. ఇదివరకు టూర్స్‌లో కొన్ని రోజులు పావు కూడా నిండేది కాదు. ఈసారి టూర్‌లో నువ్వు వచ్చిన దగ్గర్నుంచి లాభం రాని ఒక్కరోజు కూడా లేదు...''

xxxxxxxxxxxxxxxxxxxxxxx

డిటెక్టివ్‌లు మానవమాత్రులే. అందునా డిటెక్టివ్‌ లక్షణాలు తక్కువైన కొద్దీ మానవలక్షణాలు మరింత ఎక్కువవుతాయి. తను అనుకున్నంత గొప్ప డిటెక్టివ్‌ కాదని తేలిపోయింది. కాబట్టి మాధవ్‌ మానవలక్షణాలనే ప్రదర్శించాడు. ప్రేయసికి దగ్గరగా, మారువేషం లేకుండా నిజస్వరూపంలో మసలగలిగే అదృష్టాన్ని కాలదన్నుకోదలచలేదు.

''ఐడియా చూస్తే బాగానే ఉన్నట్టుంది'' అన్నాడు మెల్లగా.

''బాగానే.. ఏమిటి? బ్రహ్మాండంగా ఉంటుంది. మాతోబాటు నువ్వు తిరుగుతూ ఉంటే నాకూ చాలా హుషారుగా ఉంటుంది. కలక్షన్స్‌ బాగుంటాయని మట్టుకే కాదు, ఆ జలజ నన్ను ఏడిపించినప్పుడల్లా నీతో కాస్సేపు మాట్లాడి ఓ మారువేషం వేయమంటాను. హాయిగా నవ్వొస్తుంది. మనసు కాస్త తేలికపడుతుంది...''

జలజ సంగతి మాధవ్‌కి తెలుసు. ''నేటి మహిళ'' హీరోయిన్‌. కాస్త లావుగానే ఉంటుంది, కానీ మహా పొగరు. యూనిట్‌లో అందరి మీద అధికారం చలాయిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పరమశివాన్ని కూడా. ఆమె అంటే అందరికీ కోపమే. కానీ ఆర్నెల్లకు కాంట్రాక్టు రాసుకోవడం వల్ల పరమశివం ఏమీ చేయలేక పళ్లు నూరుకుంటున్నాడు. అంతా బాగానే ఉంది కానీ తను కష్టపడే వేసే మారువేషాలు వీళ్లకు నవ్వు పుట్టించడానికి పనికొస్తాయంటే ఏడుపు వచ్చింది.

''జలజ అంటే అంత కోపమైతే కాంట్రాక్టు రద్దు చేయవచ్చుగా. ఆవిణ్ని కంటిన్యూ చేయడమెందుకు, ఆ బాధ మరవడానికి నా చేత మారువేషాలేయించడం ఎందుకు?'' అన్నాడు కసిగా.

''ఆవిడంతట ఆవిడ పోతానంటే తప్ప నేనేం చేయలేను. అలా రాసుకుని ఏడ్చాం కాంట్రాక్టులో.'' అన్నాడు పరమశివం నుదుదు బాదుకుంటూ. ''నా ఏడుపులు నేనేడుస్తాను కానీ, ఇంతకీ నువ్వు ఎవరి వెంటబడుతున్నావో చెప్పలేదు'' అన్నాడు అనునయంగా.

తన ముసలివేషం మాట మరిచిపోయి, మాధవ్‌ నడుం నిటారుగా చేసుకుని కూచున్నాడు. కొన్ని స్టేటుమెంట్లు ఇచ్చినప్పుడు అది తప్పనిసరి! ''నేను నా వృత్తికి ద్రోహం చేయను. మీ పందేలబేరంలోకి నన్ను ఇరికించకండి. మీతో రమ్మన్నారు, ఫైన్‌! అంతమాత్రం చేత నన్ను ఎవర్నైతే ఫాలో అవుతున్నానో వారిని కనిపెట్టి చూడడం మానను. మీకిష్టం లేకపోతే ముందే చెప్పేయండి'' అన్నాడు హుందాతనాన్ని జోడించి.

పరమశివం  కంగారుపడ్డాడు. ''అబ్బెబ్బే, వెధవ పందాలదేముంది. ఊరికే అడిగానంతే. దాని గురించి వర్రీ కావద్దు. ఒక్క విషయం మాత్రం చెప్పు. జస్ట్‌ బిట్వీన్‌ అవర్‌సెల్వ్‌స్‌, నేనైతే కాదు కదా!'' అన్నాడు ఆదుర్దాగా.

మాధవ్‌ పరమశివాన్ని క్రేన్‌షాట్‌లోంచి చూసినట్టు చూసి, ''హుఁ'' అనేసి దర్జాగా వెనక్కి తిరిగి చరచరచర నడుచుకుంటూ రూములోంచి బయటకు వచ్చేశాడు. చాలా మేజస్టిక్‌గా వచ్చేశాననుకున్నాడు. అవేళ మారువేషాల విషయంలో ఘోర అవమానం పొందినా, చివర్లో మాత్రం పరమశివాన్ని దెబ్బ కొట్టగలిగానన్న తృప్తితో నిద్రపోయాడు.

మర్నాడు రాత్రి నాటకం వేసే వేళకు స్టేజి వెనక చేరాడు మాధవ్‌. అసలు, సిసలు మాధవ్‌లా. అతన్నక్కడ చూసి వాణి తెల్లబోయింది. ''మీరెప్పుడొచ్చారు ఈ ఊరు? ఇక్కడికెలా రానిచ్చారు? వెళ్లి ఆడియన్స్‌లో కూచోండి'' అంది గబగబా, ఆశ్చర్యం, కంగారు కలిసిపోగా. ''నేటిమహిళ'' నృత్యనాటికలో ఆమె పూలబాలగా వేస్తోంది. హీరోయిన్‌ తోటలో తిరుగుతూ తన విరహబాధను పాట రూపంలో వెలిబుచ్చుదామనుకున్నప్పుడు పదిమంది వచ్చి వెనకాల డాన్సాడతాయి. ఆ డాన్సర్లలో వాణి ఒకరు.

నిన్నటినుండి మాధవ్‌ పట్టిపీడిస్తున్న సందేహం మాధవ్‌ను విడిచిపెట్టింది. తన మారువేషాలను కనిపెట్టి పందాలు వేసుకున్న ముఠాలో వాణి లేదన్న విషయం రూఢి అయిపోయిందతనికి. ఆనందం పుట్టుకొచ్చింది. అందుకే 'నువ్వు ఏ పువ్వులా ఉన్నావనుకుంటున్నావో గానీ కాబేజీపువ్వులా తప్ప మరే పువ్వులానూ లేవు' అని చెప్పదలిచినా చెప్పలేదు.

''వాణి... నా హృదయరాణి'' అన్నాడు డ్రమటిక్‌గా. మనసంతా ఆనందం నిండిపోయినప్పుడు డైలాగులు అలాగే వస్తాయి.

''ష్‌... రిహార్సల్స్‌ పక్కకెళ్లి వేసుకోండయ్యా. ఇక్కడైతే మైకు లాగేస్తుంది'' అన్నాడు ప్రాంప్టింగ్‌ చెబుతున్నవాడు.

''ఇది డ్రామా డైలాగు కాదు. నిజమైన జీవితపు డైలాగు'' అన్నాడు మాధవ్‌ కోపంగా అతనికేసి చూస్తూ.

''ఇంతకీ మీరు ఇక్కడకు... ఎలా?'' అడిగింది వాణి లోగొంతుతో.

''వాణి... నా హృదయరాణీ...''

''ష్‌... పక్కకెళ్లండయ్యా అంటే... స్టేజిమీద చెప్పే డైలాగులు లాగవు కాని ఎదవ మైకులు పక్కన పిన్ను పడేసినా సౌండు లాగేత్తాయి. థూ..''

''ఇంతకీ మీకు ఇక్కడకు.. ఎందుకు?'' వాణి ప్రశ్నలో కొద్దిగా మార్పు చేసింది.

''ష్‌.. ఇలా అయితే ప్రాంప్టింగ్‌ అయినట్టే..'' ప్రాంప్టింగ్‌ చెప్పే అతని విసుగు.

ఇలాటి పరిస్థితుల్లో ప్రేమించడానికి రోమియోకు కూడా కష్టమే! ఒకపక్క ప్రాంప్టింగు వాడి గోల... మరోపక్క స్టేజిమీద హీరోయిన్‌ జలజ ఖయ్‌మని పాట ఎత్తుకుంది. వాణి చూడబోతే ఆశ్చర్యాంబుధిలోంచి బయటపడలేకపోతోంది. ఇంకోపక్క నుంచి ఓ కుర్రాడు గబగబా వచ్చి ''సైడ్‌వింగ్‌లో గొడవేంటని జలజగారు కోపంగా చూస్తున్నారు. ఎవరయ్యా నువ్వు?'' అంటున్నాడు.

ఇక మాధవ్‌ ఓర్చుకోలేకపోయాడు. వాణి భుజం పట్టుకుని పక్కకు లాక్కెళ్లాడు. గట్టిగా కౌగిలిలో ఇముడ్చుకుని ''వాణీ, నేనింక మారువేషాలు మానేస్తాను. నన్ను పెళ్లి చేసుకోవూ?'' అని అడిగేసాడు. తెల్లబోయిన వాణి సమాధానం చెప్పేలోగానే ఆమె స్టేజిమీదకు వెళ్లాల్సిన ఘడియ రావడంతో ఇంకో అమ్మాయి వాణి మరో రెక్క పట్టుకుని స్టేజిమీదకు లాక్కుపోయింది. మాధవ్‌కి మతిపోయింది. జీవన్మరణ సమస్యకు పరిష్కారం దొరకబోయి, చేజారిపోవడం అతను సహించలేకపోయాడు. వాణి వెనక్కాలే పరిగెట్టాడు.

''నేటి మహిళ'' నృత్యనాటకం కథ పౌరాణిక యుగం నుండి రాకెట్‌ యుగం దాకా అన్ని కాలాలలోనూ సాగుతుంది. పౌరాణిక కాలానికి కావలసిన ట్రిక్కుల కోసం స్టేజి మీద అనేక రకాల మార్పులు చేశారు. స్ప్రింగు చెక్కల మీద గెంతి స్టేజిమీదకు ఎగిరివచ్చే గంధర్వపాత్రలు, గొయ్యిలోంచి నడిచివచ్చి స్టేజిభూమిలోంచి పైకివచ్చే నాగదేవత పాత్రలు- వేసేవారికి స్ప్రింగు చెక్కలు, గోతులు ఎక్కడ ఉన్నాయో తెలుస్తాయి కానీ పాపం మాధవ్‌కి ఎక్కడ తెలుస్తాయి? అందుకే వాణి వెంట పరిగెట్టే హడావుడిలో అతను చూసుకోకుండా స్ప్రింగు చెక్కమీద కాలు వేయడం, దాంతో స్టేజి మీదకు ఎగిరి రావడం జరిగింది.

అప్పటికే హీరోయిన్‌ జలజ తన భారీ శరీరంతో డాన్సు చేస్తూ, పాట పాడుతూండడం వెనక్కాల వాణితో సహా పూలబాలలందరూ ఆమె వెనక్కాల బారులు తీరడం జరుగుతోంది. ఆకాశం నుంచి ప్రత్యక్షమైన మాధవ్‌ సరాసరి జలజ మీద పడడం, ఆమె కుప్పకూలిపోవడం జరిగింది. ప్రేక్షకులందరూ ఒక్కక్షణం కొయ్యబారిపోయి, అంతట్లోనే కోలుకుని చప్పట్లు కొట్టారు. దాంతో జలజ ఉలిక్కిపడి, మాధవ్‌ను తోసేసి లేవబోవడం, ఒళ్లు సహకరించక మళ్లీ పడిపోవడం జరిగింది. ప్రేక్షకుల ఆనందానికి హద్దు లేకపోయింది. లేచి నిలబడి చప్పట్లు చరుస్తూ, ''వన్స్‌మోర్‌'' అని కేరింతలు కొట్టారు.

స్టేజి మీద మాధవ్‌ తొలి ప్రదర్శన అదే. మొదటిసారే ''వన్స్‌మోర్‌'' రావడంతో పులకించిపోయాడు. ప్రేక్షకుల కోరిక తీర్చడానికి మళ్లీ ఎగరవలసి వచ్చినందుకు బాధపడలేదతను.

xxxxxxxxxxxxxxx

పరమశివం పరమానందభరితుడయి ఉన్నాడు ఆ రోజు. పొద్దున్నే మాధవ్‌ కోసం వాకబు చేశాడు. నడుం పట్టేయడం వల్ల మంచం పట్టాడని విని తనే చూడడానికి వెళ్లాడు. మాధవ్‌ క్షమాపణలు మొదలుపెట్టాడు. ''ఆ చప్పట్లు విని నాకు ఒళ్లూ, పై తెలియలేదు. మొదటిసారి ఏక్సిడెంటల్‌ అనుకున్నా, రెండోసారి ఆవిడ మీద... పాపం...'' అని చెప్పబోతున్న మాధవ్‌ను మధ్యలోనే ఆపేశాడు పరమశివం.

''మై డియర్‌ డిఫెక్టివ్‌! క్షమాపణలు చెప్పడం ఆపేయ్‌. నువ్వెంత గొప్పవాడివో నీకు తెలియదు. నాకు జలజ పీడ వదిల్చిపారేశావ్‌. ప్రేక్షకుల ముందు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక జలజ కాంట్రాక్టు రద్దు చేసుకుని ఇంటికి వెళ్లిపోతోంది.''

''అయ్యో, మరి హీరోయిన్‌ పాత్ర ఎవరు వేస్తారు? ఆ పోర్షన్‌ యిప్పటికిప్పుడు ఎవరు బట్టీపట్టగలరు? నా వల్ల మీకా విధంగా నష్టం వచ్చినట్టేగా...'' అన్నాడు మాధవ్‌ ఆందోళనగా.

''నువ్వెందుకయ్యా అనవసరంగా ఇదవుతావ్‌... సుందరం భార్యకు హీరోయిన్‌ పోర్షనంతా కంఠతా వచ్చు. ఇందాకనే ఫోన్‌ చేసాను. మధ్యాహ్నానికల్లా వచ్చేస్తుంది. సాయంత్రం షోకి తను రెడీ. ఇక నాకు... అదేమిటి, అలా అయిపోయావ్‌?''

''సుందరం భార్యా...? అంటే నాకీ పని ఊడినట్టే! ఆవిడే కదా మాకీ పని అప్పగించింది. ట్రూప్‌లో ఆవిడే ఉందంటే తన భర్త మీద తనే ఓ కన్నేసి ఉంచుతుంది. మా బాస్‌ నన్ను వెనక్కి రమ్మనమంటాడు...'' అంటున్న మాధవ్‌ పరమశివం తనను కౌగిలించుకోవడంతో ఆగిపోవలసి వచ్చింది.

''అయితే ఆ వ్యక్తి సుందరమేనన్నమాట... ఆహా యూ ఆర్‌ గ్రేట్‌ మైడియర్‌ డిఫెక్టివ్‌! సుందరం గొప్ప పత్తిత్తని అందరి అభిప్రాయం. ఎవరూ అతని మీద అనుమానించలేదు. నేనొక్కణ్నే అతని మీద పందెం కట్టాను. రూపాయికి ఇరవైరెండు రూపాయలు. అంటే నలభై నాలుగు వేల రూపాయలు లాభమన్నమాట. మైడియర్‌... నా మాట విను. నువ్వు నా జేబులో బొమ్మవి. అదృష్ట చింతామణివి. కల్పవృక్షానివి. మరోటివి... ఇంకోటివి. నువ్వు ఆడియన్స్‌లో కూచుంటే చాలు - హౌస్‌ఫుల్‌. స్టేజిమీద అడుగుపెడితే చాలు - జలజ పిశాచాలు పరార్‌. వెంటాడితే చాలు - నలభైనాలుగువేలు లాభాలు. వెధవ డిటెక్టివ్‌ ఉద్యోగం మానేయ్‌. మా ట్రూప్‌లో ఉండు. మాతో బాటు నాటకాలెయ్యి''

''వేషాలేయగలిగితే వాణి కూడా దక్కుతుందనుకోండి. కానీ నాకు ఆటా, పాటా రాదని అందరూ ముక్తకంఠంతో అన్నారు...''

''ఏక్టరు కావడం ఏముందయ్యా. ఒకడి కోసం వెతికితే వందమంది దొరుకుతారు. కానీ నీలాటి అదృష్టదేవతలు ఎక్కడ దొరుకుతారు? నిన్ను స్టేజి ఎక్కించే పూచీ నాది. కాదనకు'' అంటూ చేతులు పట్టుకున్నాడు పరమశివం.

xxxxxxxxxxxxxxxxxxxx

ఏడాది తర్వాత ఫోన్లో మాట్లాడుతున్నాడు. ''లేదండి, వచ్చే రెండు నెలల దాకా బిజీయే. బుకింగ్స్‌ ఒప్పుకోవటం లేదు. మొన్న వేసిన డ్రామా సూపర్‌హిట్‌ కావడంతో దాన్ని సినిమా తీద్దామనుకుంటున్నారు. నన్ను అడిగితే కుదరదన్నాను. అయినా వాళ్లు వినటం లేదు. వెయ్యాల్సి వచ్చేట్టుంది. బిలీవ్‌ మీ... అస్సలు ఖాళీ లేదు. కావాలంటే మా ఆవిడ వాణిని అడగండి. తనే నా కాల్‌షీట్లన్నీ చూస్తోంది...''

అతనే ప్రఖ్యాత నటుడు మాధవ్‌!

ఉడ్‌హౌస్‌ ''ది మాన్‌విత్‌ గోల్డెన్‌ లెగ్‌'' కు స్వేచ్ఛానువాదం - ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

('హాసం' డిసెంబరు 2001లో ప్రచురితం)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?