Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ కథలు: బండూ నీళ్లు తాగే ఘట్టాలు

అలసి, సొలసి ఇంటికి చేరి పరువు మీద సొమ్మసిల్లి పడిపోయాడు బండూ. ''హమ్మా'' అని కూడా అన్నాడు.

అతని భార్య లత ఉత్సుకత ఆపుకోలేకపోయింది. ''అంటే అంతా దగ్ధం అయిపోయినట్టుంది. నారాయణగార్ని ఇంట్లోకి రానిచ్చినట్టు లేదు కదూ!'' అని అడిగింది.

తలకాయ రెండు చేతులా పట్టుకుని బండు ''హమ్మా! కాస్త ఫానేెద్దూ!'' అన్నాడు.

పతి ఆజ్ఞ అతిశ్రద్ధగా ఆచరించేసి, ''అసలేమయిందట? నళిని కొత్త షరతులేమైనా పెట్టిందా?'' అంది ఆతృతగా.

నళిని పేరు వింటూనే బండూ గుడ్లు తేలేశాడు. తలకాయ కాస్త లేపి కోడుమీద అన్ని 'హమ్మా, మంచినీళ్లు పట్టుకురా'' అంటూ కళ్లు మూసుకున్నాడు.

మొగుడు మంచి హుషారైన కథ వినిపిస్తాడన్న ఆశ విడిచిపెట్టకుండా ''నళిని అంత ఉపద్రవం తెచ్చి పెట్టిందన్నమాట! వాళ్ల పోలీసు ఇన్‌స్పెక్టరన్నయ్యను పిల్చుకొచ్చేసిందా ఏమిటి?'' అని వాకబు చేయబోయింది లత.

బండూ మంచంమీద అటునుంచి ఇటుకు వత్తిగిలి ''హయ్యో రామా, రెండు గ్లాసుల నీళ్లు నా మొహాన తగలేెసే దిక్కులేదు కదా'' అంటూ మూలిగాడు.

''ఆహా, అంటే క్రితంసారిలాగే ఆ ఇనస్పెక్టరన్నయ్య గారు మీ ఇద్దరికి గట్టిగా పాఠం చెప్పివుంటాడు.  అవేళ అతని చెయ్యి మీ భుజం మీద వాలిందో లేదో, నాలుగు రోజులదాకా భుజం లేస్తే ఒట్టు''

''బాబోయ్‌, నీళ్లు బాబోయ్‌'' అంటూ బండూ అరిచేసేడు.

ఇక లాభం లేదనుకుని లత చరచరా వంటింట్లోంచి రెండు పెద్ద గ్లాసుల నీళ్లు తెచ్చిపడేసింది. బండూ ఒకటి నెత్తిమీద ఒంపుకున్నాడు. ఆ నీళ్లు కాలరులోంచి లోపలికి కారుతుంటే ఇంకో గ్లాసు ఎత్తి గటగటా తాగి పెదాలు చేత్తో తుడుచుకున్నాడు. కాస్త ఓపిక వచ్చినట్టుంది. మంచం మీద బాసింపట్టు వేసుకుని కూచుని కళ్లల్లో రౌద్రం తెచ్చుకుని 'గెటవుట్‌' అని గాలిలో చేయి ఊపాడు.

''బావుందండోయ్‌, నేనేం చేసేనని నా మీద అంత కోసం'' అంత లత అలక నటిస్తూ.

''అబ్బా, నిన్ను కాదు. నారాయణ గాడినంటున్నా'' అంటూ చికాకుపడ్డాడు బండూ.

''అంటే నారాయణగార్ని ఆవిడ ఇంట్లోకి రానివ్వలేదన్నమాట! మీతో పాటు తీసుకువచ్చారన్నమాట బయటెందుకు నిలబెట్టేసేరు?'' అంటూ హడావుడిగా కిటికీలోంచి బయటికి చూసింది.

''అబ్బే, ఇక్కడకు తీసుకురాలేదు. ఎలాగోలా వాడిని ఇంట్లోకి నెట్టేసి వచ్చా. పెళ్లాంతో మళ్లీ పోట్లాడి ఇక్కడికి వస్తే  'గెటవుట్‌' ఎలా అనాలో ప్రాక్టీసు చేస్తున్నా'' అని బండూ వివరించాల్సి వచ్చింది.

''నేనూ అదే అంటాను. ఆయన భార్యతో పోట్లాడి పుట్టింటికి వచ్చేసినట్టు ఇక్కడికి వచ్చి కూచోడం, మీరు నాలుగైదు రోజులు తంటాలుపడి సయోధ్య కుదర్చడం, పాపం'' అంటూ మొగుడి మీద జాలి కురిపించింది లత.

''అసలు తప్పంతా నీదే. వాడొచ్చి నాలుగు మాటలు చెప్పగానే నువ్వు కరిగిపోతావు. ఉప్మా, కాఫీ మెక్కబెడతావు. వీటికి బాగా అలవాటుపడిపోయి భార్యతో పోట్లాడడం మరిగాడు'' బండూ హఠాత్తుగా లత మీద విరుచుకుపడ్డాడు.

''ఇది మరీ బావుందండోయ్‌. మీ క్లోజ్‌ ఫ్రెండాయె, ఇంటికొచ్చి కళ్లనీళ్లెట్టుకుంటే చూస్తూ ఊరుకోమంటారా?''

''గెటవుట్‌, పద పద, పైకెళ్లు. మా ప్రాణాలు తోడేయకు'' బండూ మళ్లీ గాలిలో శాల్తీని బెదిరించాడు.

''ఏం చెయ్యాలో, ఏం చెప్పాలో అదంతా మీరే చూసుకోండి. నాకు తెలీదు. ఇంటికొచ్చినవాళ్లకు కాఫీ, ఉప్మా ఇవ్వడమే నా పద్ధతి'' అంది లత బుంగమూతి పెట్టి.

''నో కాఫీ, నో ఉప్మా.. వీటిమీద ఆశకొద్దీ వాడు భార్య చేసిన ఆవడలు తినడం మానేశాడు'' అంటూ బండూ తర్జనితో భార్యమీద నేరారోపణ చేశాడు.

''ఆవిడ ఆవడలు బొత్తిగా రాళ్లలా తయారుచేస్తే ఎలా తింటారండీ పాపం?''

''నువ్వు తినకపోతే మానేయ్‌, కానీ నన్ను తినమని బలవంతం చేయడమెందుకు?'' అని బండూ అదృశ్యవ్యక్తిని కోప్పడుతున్నాడీ లోపుల.

''అయ్యయ్యో, అంటే ఆ నాలుగు రోజుల క్రితం ఆవడలు ఇవాళ మీరు తిన్నారా?''

''ఆవడలు కాదు, ఆవిడివాళ బిస్కటు చేసింది. నాలుగు బిస్కట్లు నమిలేసరికి అరగంట పట్టింది'' అని అంటుండగానే బండూ ఒళ్లు కాస్త జలదరించింది.

''టీలో నానబెడితే మెత్తబడేవిగా''

''మామూలు బిస్కట్లయితే లొంగుతాయి. ఆవిడ చేసినవా...'' బండూ ఓ దణ్ణం పెట్టాడు ఎలా వర్ణించాలో తెలియక.

''నళినికి సరిగ్గా వంట రాదు కానీ, సరదాలెక్కువ. పాపం నారాయణ గారు...''

''అదిగో అదే మరి. నీకేమో వాడి మీద జాలి. ఆ బిస్కట్లు తినాల్సి వచ్చేదేమో నేను... కటకటా... ఆ కట కట..''

''ఎంతసేపేమిటి ఆ 'కటకట'?''

''చెప్పానా అరగంటసేపు కటకట లాడించడం తమాషానా?  అందుకే చెప్తున్నా - నారాయణగాడొస్తే ఏమనాలి? - 'గెటవుట్‌' గుర్తుంచుకో, 'గెట్‌... అవుట్‌' '' బండూ గాలిలో మళ్లీ చేయి విసిరాడు.

xxxxxxxxxxxxxxx

''ఈ....'' బండూ చేయి అప్పుడే గుమ్మంలోంచి వస్తున్న సుమకి తగిలి, ఆ సుకుమారి ఇచ్చిన ప్రతిస్పందన అది. బండూ హడలిపోయాడు - 'నారాయణ మళ్లీ రాలేదు కదా'న్న దుశ్శంక అతని కళ్లల్లో తొంగిచూసింది. సుమను చూడగానే ''నువ్వా, చంపేశావ్‌ పో. నారాయణేమోననుకుని హడలి  చచ్చా'' అని నిట్టూర్చాడు.

''నారాయణ?? యూ మీన్‌, యువర్‌ ఇడియట్‌ ఫ్రెండ్‌? అదేమిటి బాబాయ్‌, నీ స్నేహితులందరూ ఇడియట్‌లై వుంటారేంటి?'' కాలేజీలో చదువుతున్న కారణంగా, తన అభిప్రాయాలు నిర్భయంగా వెల్లడించే హక్కు తనకు దఖలు పడిందన్న నమ్మకం సుమది.

''ఇడియట్లే కాదు, మూర్ఖులు, మహామూర్ఖులు, గాడిదలనుకో'' అంటూ బండూ పకపకా నవ్వి సుమ వీపు మీద చరచబోయాడు. కానీ వీపు సరైన స్థానంలో లేకపోవడం వల్ల అది సాధ్యపడలేదు.

పిన్నల అభిప్రాయాలను ఇంత ఇదిగా పెద్దలు మన్నించడం చూసి సుమ తెల్లబోయి, తెల్లముఖం వేసింది. బండూ గ్రహించాడు. ''అర్థం కాలేదా? మళ్లీ చెబుతాను విను'' అంటూ వీపు చరచడానికి మళ్లీ చెయ్యెత్తాడు. సుమ తన వీపు కాపాడుకోడానికి లత వెనుక నక్కింది.

భర్త గురించి లోకులను హెచ్చరించవలసిన అవసరాన్ని గుర్తించి, లత ''సుమా, ఆయన నోట్లో నోరెట్టకు. టిఫెన్‌ ఏం తింటానో ముందది చెప్పు'' అంది తన ఆశ్రితురాలితో. సుమ తన నోటిని రెండు విధాలుగా బిజీగా ఉంచుతుంది. ఒకటి మాట్లాడ్డం, రెండు నమలడం. ఇంట్లోకి వస్తూనే 'అది కావాలి, ఇది కావాలి' అని ఆర్డర్లు వేయడం ఆమె నోటి మూడో ఉపయోగం. కానీ అవాళ సుమ తినడానికి ఏమీ వద్దంది. ఈ మధ్య ఆకలేమీ వేయడం లేదట! అనారోగ్యమేమీ లేదట!

బండూకి అర్థం కాలేదు. ''అదేమిటి సుమా, నిన్న మధ్యాహ్నమే రోడ్డు మీద పానీపూరి తింటూ కనబడ్డావు. ఈ మధ్య ఏమీ తినడం లేదంటున్నావ్‌?!''

''అబ్బ, నువ్వెక్కడ దొరికావు బాబాయ్‌, ఈ మధ్య అంటే నిన్న సాయంత్రం నుంచీ అని'' పెద్దవాళ్లు ఇలాంటి చిన్న విషయాలు ఎందుకర్థం చేసుకోలేరో సుమకి బోధపడలేదు.

''సరే, అలాగే కానీ. ఇంతకీ నీకు ఆకలి వేయకపోవడానికి కారణం ఏమిటని...?'' బండూ ఏ సమస్యకైనా మూలకారణం వెతకడంలో సిద్ధహస్తుడు.

''చెప్పనా బాబాయ్‌, నాకు జీవితంలో ఒక గంభీరమైన ప్రశ్న ఎదురైంది. దాని గురించి ఆలోచించడంలో ఆకలే వేయడం మానేసింది'' సుమ తలెత్తి రూఫ్‌కేసి చూసి గంభీరముద్రలో పడిపోయింది.

''నువ్వూ, గంభీరమైన ప్రశ్నా?! హా, హా'' అని బండూ నవ్వుతూ వెక్కిరించబోయాడు కానీ ఇంతలోనే లత కలగజేసుకుంది. ''పాపం ఆ పిల్ల బాధపడుతుంటే ఓదార్చడం పోయి, వెక్కిరింతలు కూడానా, సిగ్గుండాలి. హు'' అని మెడ తిప్పింది, మూతితో పాటు.

''నవ్వనీ పిన్నీ, నవ్వనీ. నాకు ముందే తెలుసు. ఈ విశాల విశ్వంలో నాకై కన్నీరు కార్చే ప్రాణి ఎవరూ లేరని. నేను రేపు ఈ తనువు చాలించినా, నాకై తపించేవారెవరూ లేరు'' జీవన విషపాత్ర  చివరి చుక్కదాకా తాగేసి త్రేన్చిన వ్యక్తిలా సుమ పలికింది.

''బాప్‌రే! మై గాడ్‌!'' రెండు భాషల్లో బండూ భయపడ్డాడు.

''అదేమిటి సుమా, అలా అంటున్నావు. అసలేం జరిగిందో మొదటినుంచీ నాకు చెప్పవూ...'' అంటూ తొందరపెట్టింది లత బండూ హడావుడిలో సుమ ఏం చెప్పడం మర్చిపోతుందోనని భయపడుతూ.

''ఏం చెప్పను పిన్నీ, నేనెలా పోతే ఏం ఎవరికి పట్టింది కనక?'' ఈ పక్క సుమ విషాద కథానాయిక పాత్ర తెగ పోషించేస్తోంది. సుయ్‌, సుయ్‌మని ముక్కు ఎగబీలుస్తూ. 

ఆ శబ్ద్దం మగవాళ్లపై ఒక రకమైన ప్రభావాన్ని కలిగించి, తమ పాత్ర తాము పోషించడం లేదన్న విషయాన్ని గుర్తుకు తెస్తుంది. బండూ విషయంలో ఇప్పుడే జరిగింది. అతను వెంటనే ''తుడుచుకో కన్నీళ్లు, సుమా, ముడుచుకో కురులు. బండూ బాబయ్యింకా బతికే వున్నాడని తెలుసుకో. నీ బాధేమిటో తెలుపుకో'' అన్నాడు కవిత్వ భాషలో.

మొగుడే హీరోయిజం ప్రదర్శించి ఘనత కొట్టేస్తాడని లతకు భయం వేసినట్టుంది. ''నాకు చెప్పు సుమా నీ ప్రాబ్లమ్‌ ఏమిటో.. నారాయణగారూ, విశ్వనాథ్‌గారూ, ఇలాటి మీ బాబాయ్‌ ఫ్రెండ్సంతా వాళ్లకేమైనా సమస్యలొస్తే వచ్చి నన్ను సలహాలడిగి వెళ్తుంటారు. ఊళ్లో వాళ్లందరికీ సహాయం చేసే దాన్ని నీకు చేయకపోతావా?'' అని బుజ్జగించబోయింది.

సుమకు పిన్నిమీదే నమ్మకం కుదిరినట్టుంది. ''నువ్వే చెప్పు పిన్నీ, ప్రేమించడం నేరమా?'' అని అడిగింది. 

ఇంటివాసాల మీదనుంచి సుమ మీదకు చూపు మరల్చి ''ఛ, ఛ. నేరమేమిటి? ఎవరా అన్నది? అబ్బాయి బుద్ధిమంతుడయి, మంచి గవర్నమెంటు ఉద్యోగంలో వుండి, ఉండడానికో ఇల్లుంటే, వంశం వంగడం మంచిదయితే ప్రేమించడం తప్పేమిటి? చాల్లే...'' అంది లత సుమ ప్రేమకు తన మద్దతు ప్రకటిస్తూ.

కానీ షరతులతో కూడిన ఈ మద్దతు సుమకు నచ్చలేదు. ''ఏమిటి పిన్నీ, నువ్వూ అమ్మలాగే మాట్లాడతావు. ప్రేమలో ఇవన్నీ చూస్తారా ఎవరైనా...?'' అని మూతి ముడుచుకుంది.

''తన మాట వినకు. సుమా! ప్రేమా, దోమా ఏమీ తెలియదు తనకు. అసలు యువతీ యువకులు ఎలా వుంటారో, వాళ్ల మనోభావాలు ఎలా ఉంటాయో అస్సలు ఊహించలేదు. కుర్ర వయసులో ఇవన్నీ గుణించుకుని ప్రేమిస్తారా? నో! బేఫర్వాగా వుండి, మనసుకు నచ్చినవాణ్ణి వరిస్తారు'' బండూ ఛాతీ పొంగించి, కన్ను గిలిపి బేఫర్వాగా వుండడం అంటే ఏమిటో ఓ చిన్న ప్రత్యక్ష పురాణం ప్రదర్శించాడు.

''అది కాదండీ...''

''ఇదిగో అదే మరి మధ్యతరగతి బుద్ధులంటే! యువతరం ముందడుగు వేస్తుంటే వాళ్లు కాలుపట్టుకుని వెనక్కు గుంజుతుంటారు. యవ్వనంలో వున్నవాళ్లు ఎవరైనా కనబడితే చాలు, పట్టుకుని కాళ్లు లాగేయడమేనా? వాళ్ల వ్యవహారాల్లో అడ్డుపుల్ల వేయడమేనా? ఇలా అయితే దేశం ముందుకెలా వెళ్తుందట? మన యువతరం చంద్రుడి పైకి ఎలా వెళ్తుందంట? చంద్రుడిమీద గవర్నమెంటు జాబ్స్‌ వున్నాయా? చెప్పు'' సమాజం యొక్క స్థితిగతులు, వాటికి గల కారణాలపై తన విశ్లేషణ శ్రోతలకు అందించాడు బండూ. తనకు ఇటువంటివి కుదరకపోయినా, ఈనాటి యువతరమైనా సాహసంతో, నిర్భీతితో వర్ధిల్లాలని అతని ఆకాంక్ష.

''బాబాయ్‌ నువ్వు పచ్చి నిజాలు చెప్పేవు. మా అమ్మా, నాన్నలకు ఈ విషయాలు ఎవరైనా విశదీకరించి చెప్పవలసిన అవసరం వుంది!'' అంటూనే తనపై జరుగుతున్న అనేకానేక అన్యాయాలు గుర్తుకొచ్చి సుమ దిగాలుగా మొహం పెట్టింది.

''చెప్పవలసిన అవసరం వున్నప్పుడు చెప్పి తీరాల్సిందే. నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్లి ఎదురుగా నిలబడి మనసులో వున్నది చెప్పేయ్‌'' యువతరం పట్ల తన బాధ్యతను నిర్వర్తించిన ఆనందం బండూ ముఖంలో కనబడింది.

సుమలో ఆనందం వెల్లివిరిసింది. ''ఏం చెప్పమంటావ్‌?''

''ఏమిటేమిటి, ఉన్న విషయమే. మీరు నాపై అధికారం చలాయించడం ఇక నేనెంతమాత్రం సహించను. ఇదివరకు వాళ్లు సిగరెట్‌ తాగితేనే మీరు పెద్ద గొడవ చేసేశారు. ఇప్పుడు సిగరెట్‌ కాల్చడమే కాదు, మందు కూడా కొడుతున్నారు. మీరేం చేసుకుంటారో చేసుకోండి చాటుమాటుగా సిగరెట్‌ తాగే రోజులు పోయాయ్‌...'' పాత జ్ఞాపకాల కారణంగా బండూ ఆవేశపూరితుడయ్యేడు.

సుమ కాస్త కన్‌ఫ్యూజ్‌ అయినమాట వాస్తవం. ''వాళ్లు...? వాళ్లెవరు?'' అంది.

''ఇంకెవరు ఆ 'వాళ్లు' నేనే!  అన్నయ్యను కదాని మీ నాన్న నాపై జరిపిన అత్యాచారాన్ని ఎదుర్కోవలసిన అవసరం వచ్చింది'' బండూ లేచి నుంచొని గుప్పిలి బిగించి, పైకెత్తి నినదించాడు.

''భలేవాడివి బాబయ్యా, మా నాన్న... మా నాన్నంటే నీకు కొంచెం కూడా భయం లేదా?''

''పోవే పిచ్చిపిల్లా, మీ నాన్నంటే ఎవరికి భయం? ఏదో ఇన్నాళ్లూ... జస్ట్‌ గౌరవం. వెళ్లి డైరెక్టుగా ముఖం మీద చెప్పగలనివన్నీ'' సుమను అన్నగారిలా భావించి, బండూ ఆమెకేసి క్రూరంగా చూశాడు.

''నిజంగా చెప్తావా, అయితే ఓ పని చేయి బాబాయ్‌. నేను చెప్పాల్సింది కూడా నువ్వే చెప్పేయకూడదూ. ఓ పనయిపోతుంది. నీకున్నంత ధైర్యం నాకెక్కడిది చెప్పు'' సుమ మస్కా కొట్టనారంభించింది.

మార్చ్‌ చేసుకుంటూ వెళ్లిపోతున్నవాడిని హఠాత్తుగా ఓ చెంపదెబ్బ వేసి నిలవరించినట్టయింది బండూకి. మళ్లీ శక్తి అరువు తెచ్చుకుని ముందుకు వెళ్లబోయాడు. ముందుకీ వెనక్కీ ఆడే రబ్బరు బొమ్మ స్థితి అనుభవంలోకి వచ్చిందతనికి. కళ్లల్లో కాంతి యిగిరిపోయింది. కష్టంమీద నోరు పెగల్చుకుని ''ఏమిటన్నావ్‌?'' అని మాత్రం అనగలిగేడు.

''మరేం లేదు. 'ఈపాటిదానికి నేను చెప్పడం ఎందుకు, నువ్వే చెప్పేయచ్చు కదా' అంటున్నాను. ఏం చెప్తావంటే, వెళ్లి నాన్నగారి ఎదుట నిలబడు. నిలబడి, ఇదిగో మీ జులుం సుమ ఇక ఏమాత్రం సహించదు. ఇటువంటివాటికి తను ఆతీతం అయిపోయింది. మీరంటే తనకేమాత్రం భయం లేదు. తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్టు మలచుకుంటుంది' అని చెప్పేసేయి'' అని సుమ ఓపిగ్గా చెప్పింది.

''ఇవన్నీ నే...ను వెళ్లి చెప్పాలా?'' అన్నాడు తనపై ఇంత గురుతర బాధ్యత పెట్టేవాళ్లుంటారని ఊహించనైనా ఊహించలేని బండూ.

''నువ్వే బాబాయ్‌, ఏం భయపడక. అదరవద్దు, బెదరవద్దు. వెళ్లడం, చెప్పడం! అంతే సింపుల్‌!'' సుమయే బండూని ఉత్సాహపరచ వలసి వచ్చింది.

''చెప్పచ్చనుకో. కానీ నీ విషయం నేను చెప్పడం ఎలా కుదురుతుంది?'' బండూకి ఆవేశం తగ్గి శంకలు రావడం మొదలయింది.

''నువ్వు ముందు వెళ్లి చెప్పేయి బాబాయ్‌. అప్పుడు నాన్నగారు నన్ను పిలిచి 'నిజమేనా?' అని అడుగుతారు. 'అవును' అంటాను నేను. అంతే! ఫినిష్‌. ఇంతే కదా'' బండూ కుశంకను దూరం చేయబోయింది సుమ.

''నేను చెప్పడం, మళ్లీ వాళ్లు నిన్ను అడగడం, నువ్వు అవుననడం... ఇదంతా ఎందుకుగానీ నువ్విప్పుడు సరాసరి ఇంటికి వెళ్లి చెప్పేయకూడదూ, గొడవ వదిలిపోతుంది...''

''కానీ నేనిప్పుడు... ఇంటికెక్కడ వెళుతున్నాను కనుక?''

''ఆ'' అంటూ బండూ వెనక్కి తూలాడు. రబ్బరు బొమ్మ మళ్లీ గుర్తొచ్చింది.

''నాటకం ఆడాల్సిందే బాబాయ్‌, నేను ఇల్లు వదిలివెళ్లిపోయినట్టు వాళ్లకు నమ్మకం కలగాలి. నాకీ విషయంలో ఎంత పట్టుదల వుందో వాళ్లకు తెలిసిరావాలి'' సుమ గాలిలో తెర తీసినట్టు అభినయం చూపి నాటకం ఆరంభమయినట్టు తెలియబరిచింది.

''కానీ...'' అని బండూ గుటకలు మింగాడు.

''నో కానీ, నో అర్ధణా బిజినెస్‌. నువ్వెళ్లి నాన్నకు చెప్పేయి. 'సుమ మీ ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయింది. అది ఇక నితిన్‌ను పెళ్లాడుతుంది' అని..''. యాహూ.. అంటూ నితిన్‌ మాట గుర్తుకురాగానే కలిగిన ఉత్సాహాన్ని ఒక పొలికేక ద్వారా సుమ వ్యక్తపరిచింది.

ఇప్పటిదాకా ఏం చేయాలో తెలియక నిలబడిన లతకు ఓ అబ్బాయి పేరు వినగానే ఉత్సుకత పుట్టుకొచ్చింది. ''ఇంతకీ ఈ నితిన్‌ ఎవరు?'' అంది.

''నితినా? ఎవరా?! అదేమిటి పిన్నీ అలా అడుగుతావ్‌? అతను సిక్సర్లు కొడతాడు తెలుసా! చూస్తూండు అతను టెస్ట్‌ మ్యాచ్‌ల్లో కూడా ఆడతాడు. ఇంకా చూస్తూండు ఇంగ్లండులో లాడ్స్‌ మైదానంలో సెంచరీ కొట్టేస్తాడు. అప్పుడతను పెవిలియన్‌కు తిరిగివస్తుంటే నేను రయ్‌మని వెళ్లి టీవీ ఏడ్‌లో చూపిస్తారు చూడు, అలాగ వెళ్లి అందరి ఎదుటా అతనికి ముద్దుపెట్టి...'' సుమ పరవశమయిపోతోంది.

''క్రికెట్‌ సరేలే, అతని పేరూ, ఊరూ, అమ్మా, నాన్నా గురించి చెపుదూ...'' అంది లత కాస్త బెదురుతూనే.

''నేనిప్పుడు అతని దగ్గరకేగా వెళుతున్నది. ఇవన్నీ కనుక్కుంటానులే. కనుక్కుని నీకు చెబుతా. ఇప్పుడు మాత్రం నన్ను వెళ్లనియ్యి. బై, బై'' అంటూ సుడిగాలిలా వెళ్లిపోయింది ఆ పిల్ల.

xxxxxxxxxxxxxxxxxxxx

లత తల పట్టుకుని నేలమీద చతికిలపడిపోయింది. పక్కనున్న మంచంమీద బండూ చాపచుట్టలా పడిపోయాడు.

''ఖర్మ, ఇప్పుడేం చెయ్యాలి, దేవుడా!'' అంది లత, చేయాల్సినదేమైనా వుంటే బండూనే చేయాలి అన్న విషయం అతనికి గుర్తుచేస్తూ.

బండూకి అది అర్థం కాకపోలేదు. అందుకే మంచంమీద లేచి కూచున్నాడు. ''నేను ముందే చెబుతున్నాను - అన్నయ్య దగ్గరికి నేను వెళ్లబోయేది లేదు. నువ్వేం చేసుకున్నా సరే.''

''నేనేం చేసుకుంటాను? అత్తారింటి గొడవల్లో తలదూర్చద్దని మా అమ్మ ఎప్పుడో చెప్పింది'' అంది లత ఓ దణ్ణం పెడుతూ తనను వదిలిపెట్టమన్నట్టు సూచించింది. అలా అని అంతటితో ఊరుకోలేదు. మొగుడిని దెప్పడానికి వచ్చిన అవకాశం వదిలిపెట్టలేదు.

''ఇప్పుడిలా అంటున్నావా? సుమ వచ్చినప్పుడు ప్రేమించడం పాపం కాదంటూ సానుభూతి కురిపించింది నువ్వేగా. ఇదంతా ఎలా సంబాళించుకుంటావో నువ్వే సంబాళించుకో. నాకేమీ తెలియదు'' పెనం మీద పేలాల్లా బండూ కోపం ఎగిరిపడింది.

''బాగుండదండోయ్‌, నా మీదకి తిప్పుతున్నారే, నేను కుర్రాడు ఉద్యోగస్తుడై ఉండాలంటూ మంచీ చెడ్డా చెబుతుంటే, 'ఆ మాటలు.. అంటే నా మాటలు... వినవద్దు' అంటూ ఆ అమ్మాయికి హితబోధ చేశారుగా. అక్కడికి మీకు ఆ అమ్మాయంటే పేద్ద అభిమానం వున్నట్టు, ...నాకు లేనట్టు. అనుభవించండి''

''అదే నాకు నచ్చదు. ముందు ఎగదోసింది నువ్వు. తర్వాతే కదా నేను మాట్లాడింది. నారాయణ వ్యవహారంలోనూ అదే జరిగింది. నువ్వు వాళ్లమీద జాలి చూపించడం, అది చూసుకుని వాళ్లు ఎగరడం. మధ్యలో నేను ఇరుక్కోవడం. ప్రతి సమస్యలోను నన్ను గోతిలోకి తోసేయడం, పైనుంచి వినోదం చూడడం. నువ్వొక యూస్‌లెస్‌. నిన్ను అసలు డిస్‌మిస్‌ చేసేయాలి'' బండూకి కోపం అవధులు దాటితే అంతే. ఎవర్నైనా సరే డిస్మిస్‌ చేసేస్తాడు.

''మీరెంత నా మీదకు నెట్టేయాలని చూసినా, అబద్ధం నిజం అయిపోదు. నిజం ఏమిటో మీకూ తెలుసు, నాకూ తెలుసు'' వాద ప్రతివాదాల్లో లత ఓటమినంత సులభంగా ఒప్పుకునే రకం కాదు.

''మళ్లీ ఇంకా మాట్లాడుతుంది. బడబడా వాగడం కాదు. తెలివితేటలతో వ్యవహరించడం నేర్చుకోవాలి. ఊరికే మొగుణ్ని సతాయిస్తే సరిపోదు. బంద్‌ కరో బక్‌వాస్‌'' హిందీ సినిమాల ప్రభావంతో బండూ కొన్ని మాటలు హిందుస్తానీలో అంటేనే అందంగా వుంటాయని నమ్ముతాడు.

''ఇలా మనం ఇద్దరం పోట్లాడుకుంటే ఏమవుతుంది? ముందు మీ అన్నగారికి ఏం చెబుతారో అది ఆలోచించండి'' అంది లత మొగుడికి అసలైన అవస్థను గుర్తుచేసే ప్రయత్నంలో.

''మా అన్నయ్య దగ్గరికి వెళ్లి మాట్లాడడమంటే తమాషాయా? బతికుండగానే నంజుకు తినేస్తాడు'' బాల్యం గుర్తొచ్చి బండూ కాస్త వణికాడు.

''బాగానే వుంది సంబడం. రేప్పొద్దున ఆ అమ్మాయి ఏదో తికమక వ్యవహారంలో చిక్కుకుందంటే బావగారు మిమ్మల్నే అనరూ - తెలిసికూడా చెప్పలేదని చివాట్లేయరూ?'' ఎప్పటిలాగానే లత చికాకుపెట్టే ప్రశ్నలు వేసింది.

బండూ గుటకలు మింగుతూ కూచున్నాడు. మింగిన కొద్దీ నోట్లో ఉమ్మి ఊరసాగింది. ఛాతీలో రైలు ధణధణ శబ్దం చేసుకుంటూ వెళ్లినట్టయింది. ఆ తర్వాత ఇంకో రైలు... ఇది ఎక్స్‌ప్రెస్‌లా వుంది. కాస్సేపటికి అతను లేచి బట్టలు వేసుకోసాగాడు.

''వెళ్లి ఆయనతో ఏం చెప్తారు?'' చికాకు పెట్టే ప్రశ్నల స్టాకు లత దగ్గర చాలా వున్నట్టుగా వుంది.

''నీ తలకాయ!'' అలాంటి అన్ని ప్రశ్నలకీ బండూ దగ్గర వున్న సమాధానం అదొక్కటే.

''నా తలకాయ నా మెడకాయ మీదనే వుండనివ్వండి. కానీ ఆయన మీ తలకాయ తినేస్తాడేమోనని నా బెంగ. వెళ్లి 'మీ అమ్మాయి ఏదో అఘాయిత్యం చేయబోతోందట, కాస్త చూసుకో. నాకు తెలియగానే పరిగెట్టుకుని వచ్చి చెప్పాను. తర్వాత మీ ఇష్టం' అని చెప్పండి'' కామన్‌సెన్స్‌ పరీక్షల్లో ఫస్టు ప్రైజు కొట్టేసిన వాడి మొహంలా లత మొహం వెలిగిపోతోంది.

''అంటే నన్ను అబద్ధాలు చెప్పమనా నీ బోడి సలహా?'' బండూ అరిచాడు.

''తప్పేముంది?'' లత ఆశ్చర్యపడింది.

''తప్పా, తప్పున్నరా? పైగా సుమను వెన్నుపోటు పొడిచినట్టవదూ!'' అసలే సున్నితంగా వుండే బండూ మనసు విలవిలలాడింది.

''అయితే హరిశ్చంద్రావతారం ఎత్తి నిజం చెప్పేయండి. తర్వాత ఏం జరిగినా నన్నేమీ అనవద్దు'' మూతీ, శరీరమూ వంకర్లు తిప్పుకుంటూ లత నిష్క్రమించింది రంగంలోనుంచి.

xxxxxxxxxxxxxxxxx

బండూ ఇంటి దగ్గరనుంచి నిజం చెప్పేయాలన్న కృతనిశ్చయంతోనే బయలుదేరాడు పాపం. కానీ అన్నగారి ఇల్లు చేరుతున్నకొద్దీ, లత చెప్పినదే చెప్పడం శ్రేయస్కరం అనిపించింది. ఇల్లు చేరాక లత యుక్తిని సొంతం చేసుకుని, ఆమె చెప్పమన్నట్టుగా చెప్పాడు. .'..సుమ ఇల్లు విడిచిపెట్టి ప్రేమ వివాహం చేసుకునే ఐడియాలో వుందట' అని బండూ చెప్పే స్టేజి వచ్చేసరికి అన్నగారింట్లో వాతావరణం వేడెక్కిపోయింది. ఇటువంటి దగుల్బాజీ వ్యవహారాల్లో బండూ హస్తం వుండితీరుతుందనే ప్రాచీన విశ్వాసం ఒకటి పాతుకుపోయి వుండడం వల్ల ఆ వేడి బండూ మీద ప్రసరించింది.

బండూ అన్నగారు ''ఒరే బండూ, నువ్వు చిన్నప్పటి నుంచే భ్రష్టుపట్టిపోయావు. చిన్నప్పుడు జట్కావాళ్లతో కలిసి బీడీలు! తర్వాత సిగరెట్లు, ఈ మధ్య బార్లో మందు కొడుతున్నావుట. హిప్పీలతో కలిసి డ్రగ్స్‌ కూడా తీసుకుంటున్నావేమో కూడా. నువ్వు తగలడిందే కాకుండా మా అమ్మాయిని కూడా తగలేస్తావెందుకురా? దాని మానాన దాన్ని బతకనివ్వవా?'' అని విరుచుకుపడ్డాడు.

''అదేమిటి అన్నయ్యా?..''

''నోర్ముయ్‌ త్రాష్టుడా'' అనేసి ఆయన లోపలికి వెళ్లాడు. ఈ విరామంలో ఇక జారుకుంటే మంచిదనుకుని 'వెళ్లి వస్తున్నానని' ఓ కేక పెట్టేసి ఇంటికి చెక్కేద్దామని బండూ లేచాడు. అన్నగారు వంటింట్లోకి వెళ్లి ధూంధాం లాడుతూ ఓ పేద్ద చాకు పట్టుకుని బండూ మీదకు వచ్చేడు. పాపం బండూ వెనక్కి తగ్గాడు కానీ గోడ అడ్డువచ్చి, అన్నగారి చేతికి చిక్కిపోయాడు. ఆయన కత్తిని బండూ కళ్లముందు ఝుళిపించి అతని పీక పట్టుకున్నాడు. ''ఇంత ఉపకారం చేసినవాడివి, ఇంకో ఉపకారం కూడా చేసిపెట్టు. సుమ చేయగా వదిలిపెట్టింది నువ్వు పూర్తిచేయి. ఈ చాకు పెట్టి నా పీక కోసి వెళ్లు'' అంటూ ఆజ్ఞాపించాడు.

''ఛ, ఛ అదేమిటి అన్నయ్యా, అలాటి మాటలు..'' అని బండూ మందలించబోయేడు. దాంతో ఆయనకు మరీ తిక్కరేగింది. ''చీత్కారాలెందుకురా.. కోసేయ్‌. పీక కోసేయ్‌. కోస్తావా? లేదా? నా మాటంటే అంత లక్ష్యం లేకుండా వుందా? హన్నా...'' అంటూ గర్జించేడు. పీక నులిమివేయడుతుండడంతో బండూ సమాధానం చెప్పాలన్నా చెప్పలేని స్థితిలో  పడిపోయాడు.

ఇంతలోనే వదినగారు వచ్చింది. ఓ రోకలిబండ చేతపట్టుకుని. అర్జంటుగా బండూ చేతికి అందిచ్చింది. 'ఇదిగో నాయనా, మీ అన్నయ్య పీక కోసే పని పూర్తికాగానే ఇది పెట్టి నా తలకాయ పగలగొట్టు' అని అభ్యర్థించింది. అన్నగారి చిరంజీవులు కూడా వాళ్ల వాళ్ల వంతు పాత్రలు వాళ్లు నిర్వర్తించారు. అందరికంటే చిన్నవాడు అరుస్తుంటే మాత్రం బండూ సహించలేకపోయాడు.

xxxxxxxxxxxxxxxxxxxx

ఈ విధంగా చాలా రామాయణం జరగడం కారణంగా బండూ ఇంటికి తిరిగివచ్చేటప్పటికి చాలా అలసి, సొలసిపోయి వున్నాడు. అతని కాళ్లు మోకాళ్ల దగ్గర వణుకుతూ పట్టుదప్పి వున్నాయి. వస్తూనే మంచంమీద వాలిపోయి హుష్‌.. అన్నాడు.

''ఓరి నాయనోయ్‌, ఏమయిందేమిటి?'' అంటూ పతివ్రత తన పతిదేవుడి క్షేమం గురించి విచారించబోయింది. కానీ బండూ ఆవిడ ఉబలాటం తీర్చే ప్రయత్నమేమీ చేయకుండా ''ముందు ఫానేయ్‌'' అన్నాడు.

లత అతిశ్రద్ధగా, భక్తితత్పరతతో పతి ఆజ్ఞ పాలించి ''అంటే చాలా గొడవలే అయ్యాయన్నమాట. మీ అన్నగారికి కోపం వచ్చేవుంటుంది లెండి'' అంది ఆశగా.

అన్నగారి పేరు వినబడగానే బండూ వణికాడు. ''మంచినీళ్లు, మంచినీళ్లు'' అంటూ గగ్గోలుపెట్టాడు.

''ఏమిటండోయ్‌, మీ వరస చూస్తుంటే పరిగెట్టుకుని వచ్చినట్టుందే'' అంటూ మేలమాడబోయింది.  కానీ బండూ ఆ మూడ్‌లో లేడు. కళ్లు మూసుకుని మంచంమీద దొర్లుతూ ''రామా, గుక్కెడు నీళ్లు ఇచ్చే  దిక్కు లేదు కదా ఈ కొంపలో'' అంటూ  వాపోయాడు. ''త్వరగా వెళ్లి రెండు గ్లాసుల నీళ్లు తెచ్చి ఒకటి నా మొహాన్న, ఇంకోటి గొంతులోనూ తగలెయ్‌'' అని అభ్యర్థించాడు.

''అంటే అక్కయ్యగారు మళ్లీ రోకలిబండ తెచ్చి ఆవిడ బుర్ర బద్దలుకొట్టమని అడిగేరన్నమాట!'' అని సంబరపడుతూ అడిగింది లత.

''నీళ్లు... నీళ్లు...'' బండూ ఆక్రోశించాడు.

చివరికి నీళ్లు వచ్చాయి, మరచెంబుతో. బండూ కొంచెం నీళ్లు నెత్తిమీద ఒంపుకున్నాడు. అవి మొహం మీద నుంచి జారి అతని కాలర్‌లోంచి వీపును తడుపుతుండగా తక్కిన నీళ్లు నోట్లో ఒంపుకుని గటగటా తాగి త్రేన్చాడు.

లత ఈ కార్యక్రమం అంతా కానిచ్చేదాకా ఓపికపట్టి ''అయితే ఇప్పటికైనా చెబుతారా ఏం జరిగిందో'' అంది.

''చెప్తాను, దగ్గరికి రా'' అంటూ ఆమెను రానిచ్చి, బండూ చెంబులో మిగిలిన నీళ్లు ఆవిడ నెత్తిన దిమ్మరించాడు. దెబ్బకి ఆమె ఉలిక్కిపడింది. ''బాగుందండోయ్‌, వరస. ఉరుము ఉరిమి, మంగలం మీద పడ్డట్టు, నేనే దొరికానా మీకు?'' అంటూ గయ్‌ మంది. 

బండూ మంచంమీద నుంచి లేచాడు మరచెంబు పట్టుకుని. ''దొరికిందట, దొరికింది. గెటవుట్‌, గెటవుట్‌'' అంటూ విరుచుకుపడ్డాడు.

xxxxxxxxxxxxxxxxxxx

ఇంట్లో గొడవ ఈ స్థాయికి చేరాక సాధారణ పరిస్థితి నెలకొనడానికి రెండు, మూడు గంటలు పడుతుందని గృహస్థులందరికీ తెలుసు. అలా నెలకొన్న తర్వాత భార్యాభర్తలిద్దరూ కలిసి సుమ సంగతేమై వుంటుందాని చర్చించి వుంటారని కూడా ఊహించవచ్చు. ఓ గంటసేపు ఆమె అలా ప్రవర్తించడానికి కారణం ఏమయివుంటుందాని ఆలోచించడం జరిగింది. సమస్యనెలా ఎదుర్కోవాలా అని తలబద్దలు కొట్టుకోవడం ఇంకో గంట పట్టింది. ఆ తర్వాత బండూ కాళ్లు తపతప కొట్టుకుంటూ గదిలో పిండిమరలా గిరగిరా తిరగనారంభించాడు. అలా తిరిగే బదులు బయటకెళ్లి సుమను వెతకమని లత సలహా ఇస్తోంది. బండూ చివరిగా ఒక నిర్ణయానికి వచ్చాడు - సుమ మళ్లీ తిరిగివస్తే 'గెటవుట్‌' అని అనాలని. ఎంత తీవ్రంగా అనాలో రిహార్సల్‌ కూడా వేసుకోసాగాడు.

చివరికి సుమ వచ్చేటప్పటికి అలా చెప్పే సందర్భం బండూకి చిక్కలేదు. ఎందుకంటే వస్తూనే సుమ గట్టిగా ఏడవ నారంభించింది. బండూ భయపడుతూ ''ఏమయింది సుమా, చెప్పమ్మా'' అనవలసి వచ్చింది. లత ఆమె కన్నీళ్లు తుడుస్తూ ''నేను చెప్పిన మాటే నిజమైందా, సుమా?'' అని ఆరా తీయబోయింది.

''నితిన్‌...'' అంటూ ఒక్క మాట మాత్రం అని రాగాలాపనలో పడిపోయింది సుమ.

''నితిన్‌ కేమయింది?''

''నితిన్‌...'' మళ్లీ కన్నీళ్ల వరద.

ఇలా చాలాసేపయ్యాక, బండూ ఇంటి రూఫ్‌కేసి చూస్తూ పడుకున్నాడు. లత సుమ ఏడుపుకి పక్క వాయిద్యంలా అప్పుడప్పుడు ముక్కు ఎగబీల్చసాగింది. చివరికి మొహమూ, ముక్కూ రోషంతో ఎర్రబడ్డాక కన్నీళ్లు తుడుచుకుని సుమ నోరు విప్పింది. ''దరిద్రుడు, నమ్మకద్రోహి, నీచుడు...''

బండూ ఉలిక్కిపడ్డాడు ''ఎవడు?''

''నితిన్‌'' జవాబు వచ్చింది కానీ మళ్లీ కన్నీళ్ల వరద పారింది.

''ఇంతకీ నితిన్‌ చేసినదేమిటి, అది చెప్పు ముందు...'' బండూ విసుక్కున్నాడు. అతని సహనానికి కూడా సరిహద్దు వుంది పాపం.

''వాడికి మీనాక్షి అంటే ప్రేమట. దుష్టుడు, విశ్వాసఘాతకు-రాలు. నీచు-రాలు'' వరద మళ్లీ పారబోయింది.

''ఈ.. 'రాలు' ఏమిటి?'' అన్నాడు బండూ తెల్లబోయి.

''అబ్బ, మీకేమీ తెలియదు. ఆ 'డు' - నితిన్‌. 'రాలు' - మీనాక్షి అన్నమాట'' స్త్రీలకు సహజంగా వుండే నిశితబుద్ధి వల్ల లత పట్టేసింది.

'పోన్లే, ఎలాగోలా ఈ బెడద వదిలింది అదే చాల'నుకుని బండూ ''వదిలేయ్‌, దీన్ని బట్టి తేలిందేమిటంటే ఆ నితిన్‌గాడు వట్టి యూస్‌లెస్‌ అన్నమాట. అలాటి పనికిమాలినవాడు మనకి అక్కర్నేలేదు''

''అస్సలు అక్కర్లేదు. వదిలాడు శనిగాడు. నన్ను ప్రేమించే అర్హత లేదు వాడికి'' సుమ భీషణ ప్రకటన చేసింది కానీ కన్నీళ్ల జలపాతానికి ఆనకట్ట వేయలేదు.

''మంచే జరిగింది కదా!'' అని బండూ వత్తాసు పలికాడు.

''మంచిదేమిటి బాబాయ్‌? నువ్వేగా వాణ్ణి పెళ్లి చేసుకోమని నాకు సలహా ఇచ్చావ్‌. నీ మాట విని ఇల్లు వదిలి వెళితే నాకు అవమానం జరిగింది. దీనికంతా నువ్వే కారణం.'' ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని మగాడి నెత్తిన రుద్దేయవచ్చనే స్త్రీ సహజమైన ఎఱిక ఆమెకుంది.

''నేనా? నేనా అలా చెప్పింది?!'' అన్నాడు బండూ తెల్లబోతూ.

''నువ్వేగా - 'ఏం పట్టించుకోకు. ధైర్యంగా వుండు. వెళ్లి నాన్నగారిని ఎదిరించమని పోరింది నువ్వే. మీ అత్యాచారాలు ఇక సహించనంటూ ఎదురు తిరగమని ప్రోద్బలం చేసింది కూడా నువ్వే'' కోపంతో సుమ కళ్లల్లోంచి విస్ఫులింగాలు కురిశాయి.

''చిత్రంగా వుందే. అసలు నువ్వే కదా...'' అనబోయేడు బండూ.

''దీనికంతా కారణం నువ్వే. అసలు మొదటినుంచీ నాన్నగారు చెబుతూనే వున్నారు. నువ్వు చిన్నప్పుడే చెడిపోయావుట. నీ చెప్పుడు మాటలు వినద్దని చెప్పారు కూడా. అయినా నా ఖర్మ. నీ మాట విన్నాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను'' సుమ తన బాబాయిని చెరిగేస్తోంది.

''సుమా, ఇది అక్రమ, అన్యాయ ఆరోపణ సుమా''

''నాకు అలా చెప్పడమే కాకుండా నాన్నగారి దగ్గరికి వెళ్లి నేను ఇల్లు విడిచి వెళ్లిపోయానని, ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నానని చెప్పావా, లేదా, వెళ్లి నా మొహం ఎలా చూపించను? అంతా నీ వల్లనే...''

''భలేగా వుందే...''

''భలేగా వుందో, లేదో నువ్విప్పుడు నన్ను తీసుకుని మా ఇంటికి తీసుకెళ్లాలి. పొరబాటంతా నీదేనని చెప్పాలి'' సుమ నడ్డిమీద చేతులేసుకుని దుష్టశిక్షణ చేసే నాడియా పోజు పెట్టింది.

బండూ మంచం మీద కూలిపోయాడు ''అయ్యో రామా'' అంటూ.

అప్పుడు అతను చెప్పకుండానే లత గబగబా వెళ్లి మరచెంబు నిండా నీళ్లు తెచ్చి సగం అతని నెత్తిమీద పోసి మిగతా సగం  నోటికి అందించింది.

(గంగాధర్‌ గాడ్గీళ్‌ మరాఠీ రచనకు అనువాదం - ఎమ్బీయస్‌ ప్రసాద్‌

mbsprasad@gmail.com

ఆంధ్రజ్యోతి వీక్లీ మార్చి 1998 లో ప్రచురితం)