Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ కథలు -జాలీ టైములో జాలి కథలా..?

భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు. బోల్డన్ని సుఖాలు ఇస్తూనే ఏదో ఒక లోపం పెడతాడు. ఆ విషయం తెలిసినా మనం పక్కవాణ్ని చూసి ఏడ్చుకుంటూనే ఉంటాం! వాడికేంరా హాయిగా ఉన్నాడు. అని. 

మా ఊరికి ఆనందరావు వచ్చిన కొత్తల్లో మేమూ అలాగే అనుకున్నాం. వేసవికాలం సెలవుల్లో మేమందరమూ మా ఊరికి వెళ్లడం అలవాటు. సముద్రం పక్కనే ఉండడం వల్ల కాబోలు మా ఊరికి కడలిలంక అనే పేరు వచ్చింది. సెలవులకు పాత ఫ్రెండ్సందరం కలిసి, రెండు నెలలు సరదాగా గడిపి, ఎవళ్ల ఊళ్లకి వాళ్లు వెళ్లడం రివాజు. ఆ ఏడాది ఆనందరావు కొత్తగా వచ్చాడు. మా ఊరివాడు కాదతను. మా ఊరి సముద్రపుగాలి గొప్పదనం ఎవరిదగ్గరో విని కులాసాగా గడిపిపోదామని వచ్చాడట! ఆరడుగుల పొడుగు, ఆటల్లో మేటి, డబ్బున్న వాలకం - ఇవన్నీ చూస్తే మేమందరం కుళ్లుకోవడంలో తప్పేముంది? 

కానీ అతని హృదయంలో ఆరని మంట ఉంటుందని ఎవరూహించగలరు? సూరిగాడు చెప్పేదాకా అతన్నీ, ఆరనిమంటనూ కలిపి ఎవరూ ఊహించలేకపోయాం. పోనీ గుండెల్లో ఆరని మంట ఉన్నవాడు ఊరుకోక పోయి, పోయి సూరిగాడిలాటి వాడితో చెప్పుకోవడ మేమిటి? అని ఆశ్చర్యపోయాం మేమంతా. నిజానికి సూరిగాడే ఆనందరావు దగ్గరకు పోయాడట. ఊరికెవరైనా రాగానే వెళ్లి వాడి విషాదగాథ చెప్పి ఊరడిల్లడం వాడి కలవాటు. ఊళ్లోవాళ్లంతా విని, విని ఇక వినడం మానేస్తే వాడు మాత్రం ఏం చేస్తాడు?  తను బస్సెక్కినప్పుడల్లా తనకు సీటు దొరక్కపోవడం గురించి, సీటు దొరికినా అటువైపు ఎండ పడడం గురించి, ఎండ పడకపోయినా, అమ్మాయిలు వేరేవైపు కూచోడం వాడు చెప్పినది ఊళ్లోవాళ్లు వినడం మానేశారు. దాంతో వాడు శ్రోతలకోసం నిరంతరం వేటలో ఉంటాడు. 

ఆనందం దగ్గరికి వెళ్లి మనవాడు సొద మొదలుపెట్టగానే ఆనందం కాస్సేపు ఊరుకుని తన కథ చెప్పాడట. దాంతో సూరిగాడు లాటి వాడు కూడా నోరు మూసుకోవలసి వచ్చింది. మద్దెలతో మొరపెట్టుకోవడం రోలు తరమా? ఓటమి నంగీకరించిన సూరిగాడు  ఊరుకుంటే బాగుణ్నా? అబ్బే, మాలో ప్రతీ ఒక్కడికీ  ఆనందం గాథ వినిపించాడు. చెప్పడానికి ముందే ఇంకెవ్వరికీ చెప్పకూడదన్న కండిషన్‌ పెట్టడం ఒకటి! రహస్యం దాచాలన్న తాపత్రయం కొద్దీ అనుకునేరు, అబ్బే, ఇంకోళ్లకి ఇది వినిపించే అవకాశం తనకెక్కడ తప్పిపోతుందోనన్న భయం.. అంతే! 

ఇంతకీ జరిగిందేమిటంటే - సూరిగాడు తన గాథ సగంలో ఉండగానే ఆనందం ఆపేయమన్నాడట.

''ఏదీ విషాదఘట్టం ఇంకా మొదలవ్వందే'' అంటూ సూరిగాడు లబలబ లాడాడు.

''నా కథ వింటే నేనడిగినా నువ్వే ముందుకుసాగవ్‌'' అన్నాడు ఆనందం. 

తన కథ కంటె రసవత్తరమైన మలుపులు ఇంకెవ్వరికుంటాయన్న  ధీమాతో ''చెప్పు చూద్దాం'' అన్నాడు సూరిగాడు. కానీ ఆనందం కథ విన్నతర్వాత అతనికి సలాం కొట్టి వచ్చేసాడట!

''ఏం, అతనిది అంత పెద్ద ట్రాజెడీయా?'' అని ఉడుక్కున్నాడు కథ వింటున్న బుజ్జిగాడు.

''మరి!  ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కాకపోవడం..''

మేమంతా ఫెళ్లున నవ్వాం. ఇదో పెద్ద ట్రాజెడీనా? ఆ మాటకొస్తే నేను ఆరుగురిని ప్రేమించి కూచున్నాను. ఒక్కరితోనూ పెళ్లయ్యే ఛాన్సు లేదు. అంతమాత్రం చేత హిస్టరీ బుక్స్‌లోకి ఎక్కేద్దామని చూడడం అత్యాశ కాదూ!?

''ఆగండోయ్‌, చెవలాయిలూ, ఆపాటి దానికయితే నేను తోకముడుచుకుని వచ్చేసేవాణ్ననుకున్నారా? వాళ్ల ప్రేమ ఫలించి పెద్దలు పెళ్లికి ఒప్పుకున్నారు కూడా. ''

''మరింకేం!?' కథ ఎటువైపు నడుస్తోందో మాకు అర్థం కాలేదు.

సూరిగాడు కాస్సేపు సస్పెన్స్‌ మేంటేన్‌ చేసి - ''కానీ ఆ అమ్మాయి పెళ్లిరోజునే చచ్చిపోయింది.'' అని డిక్లేర్‌ చేశాడు.

'పాపం' అని మే మనేలోపుగానే ''..ఇతని చేతుల్లోనే రాలిపోయింది.'' అని చేర్చాడు. 

ఇక మేమందరమూ కూడా నోర్మూసుకుని అతన్ని మించిన ట్రాజిక్‌ హీరో లేడని ఒప్పుకోవలసివచ్చింది. ఇక మీద మేం వెళ్లి అతనికి మా కథలు ఏం చెప్పినా చిన్నపిల్లల కథల్లా ఉంటాయని ఏకగ్రీవంగా ఒప్పుకున్నాం. మా కష్టాల గురించి అతని దగ్గర నోరు మెదిపే సాహసం చేయలేదు. మేం సాహసించమని నిర్ధారించుకున్న తర్వాత సూరిగాడు తక్కిన విశేషాలు కూడా చెప్పాడు. ఆ పోయిన అమ్మాయికి వచ్చిన రోగం ఏమిటో పెద్ద పెద్ద డాక్టర్లే తెలుసుకోలేక కళ్లు తేలేసేరనీ, ఆమె చేసిన గాయం ఆనందం గుండెల్లో ఇంకా పచ్చిగానే ఉందనీ, కావాలంటే స్కాన్‌ చేయించి చూసుకోవచ్చనీ..వగైరా, వగైరా.

xxxxxxxxxxxxxxxx

ఇంకా అలా ఊరుకునే వాళ్లమే కానీ ఊళ్లోకి కొత్తగా దిగిన హరిత కూడా అలాగే ప్రవర్తించడం నాకు నచ్చలేదు. హరిత చాలా అందంగా ఉండడం ఒక కారణమైతే, ఆమె మా ఊరిది కాకపోవడం మరో కారణం. ఆమె సుబ్బయ్యగారి మేనకోడలు. మామయ్యను చూడడానికి వచ్చింది. మళ్లీ ఏడాది వస్తుందేమో, అప్పుడు మన ప్రయత్నాలు మనం చేసుకోవచ్చన్న ఆశ లేదు. ఈ ఏడాదే  మన ఖర్మ కాలి ఆనందం తగలడ్డాడు. పాపం మరీ అంత తిట్టుకోవడం కూడా సబబు కాదేమో! అతని హంగూ, ఆర్భాటం చూస్తే అసూయగానే ఉంటుంది. చాలామంది అది చూసి మోసపోయేవారు. అతను మంచి మూడ్‌లో ఉన్నప్పుడు సందు చూసి తమ పురాణం విప్పి అతని సానుభూతి పొందుదామని చూశేవారు. 

కానీ  వాళ్లు మొదలుపెట్టిన ఐదు నిమిషాల్లోనే అతని కళ్లు చెమ్మగిల్లేవి, వీళ్ల కష్టాలకు కాదు, 'హు, నా కష్టాల ముందు మీవెంత!' అన్నట్టు ఉండేవి అతని చూపులు. దాంతో అతని చేతుల్లో ప్రాణాలు విడిచిన అమ్మాయి గుర్తుకువచ్చి వీళ్లు నీరుకారిపోయి, తమ నిరుత్సాహాన్ని తమలోనే దాచుకునేవారు.

హరిత, ఆనందం చాలా దగ్గరయ్యేరనే చెప్పాలి. కుర్రాళ్లం అందరూ కలిసి, బాడ్మింటను కోర్టు వేసి ఆడుతూంటే వాళ్లిద్దరూ ఒక జట్టుగా ఆడేవారు. రింగు ఆడినప్పుడు, షటిల్‌ ఆడినప్పుడూ అంతే! ఇద్దరూ కలిసి సముద్రానికి పోయి ఈతలు కొడుతున్నారని స్థానిక డిటెక్టివ్‌ల భోగట్టా. ఇక వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయంరా అనుకుంటున్న రోజుల్లో ఓ సారి ఆనందం మా ఇంటికి వచ్చాడు. 

మనిషి సాంఘికజీవి. కష్టం, సుఖం ఇతరులతో  పంచుకుందామని చూస్తాడు. ఒక్కోప్పుడు అలా చెప్పుకోకపోతే పొట్ట పగిలిపోతుందన్న భయం కూడా వేస్తుంది. ఆనందం అందరి దగ్గరా హుందాతనం మేంటేన్‌ చేసిన వ్యక్తి కాబట్టి తన ప్రేమగాథ చెప్పడానికి చాలా రోజులు తటపటాయించే ఉంటాడు. ముఖ్యంగా తను ఎవరి జాలిగాథా చెప్పనివ్వటం లేదు కాబట్టి, ఎవరూ వినరన్న భయం కూడా కావచ్చు. అలా అని ఊరుకుని తాత్సారం చేస్తే, తీరాచేసి పొట్ట పగిలిపోతే? పొట్ట కాపాడుకోవాలని గట్టిగా అనుకున్నాడేమో, ఆ రోజు తెగించి నా దగ్గర తన గోడు చెప్పబోయాడు.

''నేను హరితను ప్రేమించాను'' అని మొదలెట్టాడు. 

ఇందులో నాకేం విశేషం కనబడలేదు. అరడజను మంది అమ్మాయిలతో నేను చేసిందదే! 

''...హరిత కూడా నన్ను ప్రేమిస్తున్నానని  చెప్పింది.''

మరీ మంచిది. నా అరడజను మంది అమ్మాయిలకు ఇలా చెప్పాలన్న మంచి ఆలోచన ఎప్పుడూ రాలేదు. 

''మరి పెళ్లి చేసుకోవడానికి నీకు అభ్యంతరం ఏమిటి?'' అడిగేశా. 

''నాకు లేదు. హరితకు ఉంది. నాకూ, హరితకు మధ్య అరుణ నిలిచింది''.

''ఈ అరుణ ఎవరు?''

అరుణ అంటే పెళ్లిరోజున ఆనందం చేతుల్లో చనిపోయిన అతని ప్రియురాలుట. చచ్చిపోయిన అమ్మాయి అడ్డుపడడం ఏమిటి?

''అరుణ అంటే అరుణ కాదు, ఆమె స్మృతి. 'నువ్వెప్పుడూ ఆమెను మరవలేవు, ఎవరే దుఃఖగాథ వినిపించినా నీకు ఆమె చావు గుర్తుకువచ్చి కళ్లల్లో నీళ్లు తిరగడం గమనించాను. నీ గుండెలోనుండి ఆమె ఎన్నటికీ తొలగలేదు. ఇక నాకు చోటెక్కడిది?' అంది హరిత'' అన్నాడు ఆనందం.

''ఆ పాయింటూ కరెక్టే''

''నీ మొహం కరక్టు, అసలు అరుణ అంటూ ఉంటేగా?''

''లేకుండానే చచ్చిపోయిందా?''

''అసలు లేదయ్యా మొగడా, నేనే పుట్టించి, నేనే చంపేసా..''

''అదేం పోయేకాలం?'' అని అడిగాను ఆశ్చర్యంగా.

అప్పుడు చెప్పుకొచ్చాడు. ''నువ్వు పట్నంలో పనిచేస్తావు కాబట్టి ఒకళ్లతో ఒకళ్లు మాట్లాడుకోవడం తక్కువేమో కానీ నేను పనిచేసే పల్లెటూళ్ళో మాత్రం మహా ఎక్కువ. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అంటే ఏమిటి? వాడి కష్టాలు వీడూ, వీడి కష్టాలు వాడూ వినడం. వినేవాడున్నాడు కదాని చెప్పేవాడు మరీ రెచ్చిపోతాడు. వాడు ఎక్కడ సుఖపడిపోతున్నాడని మనం ఏడుస్తున్నామోననుకుని కనబడగానే కష్టాలన్నీ  ఏకరువు పెడతాడు. గేదె ఈనినా కష్టమే. సైకిలు పంచరయినా కష్టమే. ఎల్‌కేజీ చదివే కొడుకు పలక పారేసినా కష్టమే. పక్కింటి పిల్లవాడికి నాలుగు ఇంగ్లీషు మాటలు వచ్చాయన్నా కష్టమే. అందరి కష్టాలూ వినడానికి నేనే దొరికానులా వుంది. నా మొహం తయారీ అలా ఏడ్చింది. అందరికీ లోకువైపోయాను. అందరి సొదా వినలేక విసుగువచ్చింది. అందుకే ఖర్చయితే అయిందని సెలవురోజుల్లో ఇక్కడకు వచ్చిపడ్డాను...''

''....అర్థమయ్యింది నీ బాధ. ఇక్కడకు వచ్చి చూస్తే సూరిగాడు తగిలాడు..''

''అవును. అది చూశాక  ఇక్కడకు వచ్చాక కూడా ఆ గోడు తప్పదనిపించింది. దాంతో ఒళ్ళు మండి అరుణను పుట్టించి, అర్జంటుగా చంపేశాను. అప్పుడు ఇలా హరిత అనే అమ్మాయి వస్తుందని, నా మనసు దోచుకుంటుందని నాకేం తెలుసు? అరుణ కథ విన్నవాళ్లెవరూ నా దగ్గర ఏడుపులు ప్రారంభించే సాహసం చేయలేదు. హమ్మయ్య జాలికథలు వినక్కరలేకుండా ఈ వెకేషన్‌ జాలీగా గడిచిపోతుందని సంతోషించాను కానీ ఇప్పుడు ఇలా...'' అని మొరపెట్టుకున్నాడు ఆనందం.

అంతా విని ఓ పాయింటు లేవనెత్తాను. ''నువ్విప్పుడు సానుభూతి కోరుతున్నావు చూశావా? అలాగే అందరూను. బోరుకొడితే కొట్టవచ్చు గానీ బొత్తిగా ఇలా విషాదగాథ లల్లేయడమా?'' అని మందలించాను. 

మందలించాక ఓదార్చాను. చివరగా ''నిజం చెప్పేయి. హరిత అర్థం చేసుకుంటుంది'' అన్నాను.

xxxxxxxxxxxxxxx

హరిత అర్థం చేసుకోలేదు. 'నువ్వు అబద్ధం చెప్పినది. అప్పుడా ఇప్పుడా' అంది. మాటలు మానేసింది. ఇక మనవాడేం చేస్తాడు? కొన్నాళ్ళు ఊరుకున్నాడు. ఆ తర్వాత ఓ రోజు వచ్చి, ''నా గోడు వినిపించి బోరుకొట్టానన్న కోపంతో కావాలని తప్పుడు సలహా ఇచ్చావా?'' అని అడిగి చూశాడు. 

''అబ్బే. అదేం లేదు. నువ్వలాగే మొహం వేలాడేసుకుని తిరుగుతూండు. ఎప్పటికో అప్పటికి హరిత జాలిపడి ఓకే అంటుంది.'' అని ఓదార్చాను.

సరే, మనవాడు భగ్న ప్రేమికుడి స్టయిలు మేంటేన్‌ చేయాలి కాబట్టి రోజూ మధ్యాహ్నం (అప్పుడయితేనే బీచ్‌లో ఎవరూ ఉండరుట) ఒక్కడూ వెళ్ళి అలా గంటల తరబడి సముద్రం కేసి చూస్తూ గడపడం మొదలుపెట్టాడు. అలా చూస్తూ పాటలు అవీ పాడి ఆ మూడ్‌ నిలబెట్టాలని ప్రయత్నించేవాడు కానీ సమయానికి  సరైన పాటలు గుర్తొచ్చేవి కాదుట. అక్కడకు వెళ్ళాక శూన్యంలోకి చూడాలా, దిగంతాలలోకి చూడాలా అని కూడా ఒకటి రెండు సార్లు అడిగేడు నన్ను, పీతలు పీకకుండా చూసుకుంటే చాలని చెప్పాను నేను.

ఒక రోజు ఆనందం అలాటి ఒక మధ్యాహ్నం  సముద్రతీరాన గడుపుతున్నాడు. అనుకుంటాం గానీ శూన్యంలోకి చూడడం అంత తేలికైన పనేమీ కాదు. అలా చూసి, చూసి విసుగుపుట్టిందేమో చల్లగాలికి నిద్ర పట్టేసింది. అలా ఎంతసేపు నిద్రపోయాడో కానీ చటుక్కున మెలకువ వచ్చి చూస్తే సముద్రం హోరుమంటోంది. బీచ్‌కి వచ్చి దుఃఖపడాల్సింది పోయి ఇలా పడినిద్రపోయినందుకు సిగ్గుపడి లేచి కూచుని మళ్ళీ డ్యూటీ ఆరంభించాడు - అదే... సముద్రంలోకి చూస్తూ కూచోడం.

అంతలోనే పక్కనున్న రాళ్లగుట్ట అవతల ఏదో అలికిడయితే తల తిప్పి చూశాడు. అక్కడ హరిత ఉంది. తను కూడా ఇతనిలాగే విషాదం అభినయించడానికి వచ్చి చల్లగాలికి నిద్రపోయింది. నిద్రలేచి, సిగ్గుపడింది కానీ ఆనందంలా మళ్ళీ డ్యూటీలో చేరే ఉద్దేశం పెట్టుకోకుండా ఇంటి కెళ్లి నిద్రపోదామనుకుని లేచింది. లేచి ఆనందాన్ని చూసి నిరసనగా తల తిప్పుకుని, అవతలివైపు నడిచింది.

దూరంగా ఫోకస్‌లోంచి వెళ్లిపోతున్న హరితను చూడగానే ఆనందానికి మంచి ఏడుపు పాట గుర్తుకువచ్చింది. హమ్మయ్య అనుకుని అది అందుకున్నాడు. అంతలోనే హరిత తిరిగి వెనక్కి రావడం మొదలుపెట్టింది. సినిమాలో ఆ పాట ఉన్న సిట్యుయేషన్‌లో క్రమంగా హీరోయిన్‌ వీపు ఫేడౌట్‌ కావడం తప్ప మొహం మళ్లీ ఫ్రేములోకి రావడం ఉండదు. కానీ హరిత మొహం ఫ్రేములోకి వచ్చేస్తూండడంతో ఆనందం కంగారు పడి పాట ఆపేశాడు. హరిత తనను క్షమించిందా? తను ఏ పరిస్థితిలో అబద్ధం ఆడాడో గ్రహించిందా? అని ఆలోచిస్తూండగానే హరిత అతని వైపు రావడం, అతని పక్కగా నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోవడం జరిగింది.

హరిత వీపు మళ్లీ కనబడగానే ఆనందానికి పాట మళ్ళీ గుర్తుకువచ్చింది. తన మీద తనకే బోల్డు జాలి వేసింది. పాడుతున్న గొంతు గద్గమయింది. కళ్ళు మూసుకుని పాడుతూ తాదాత్మ్యం చెందాడు. మూసుకున్న కళ్లల్లో ఆ సినిమా హీరో మెదిలాడు. అతి కొద్ది సేపట్లోనే తనుగా మారిపోయాడు. ఆ మూడ్‌లోనే పాట పూర్తయేది కానీ హరిత కంఠం వినబడి ఆగిపోయింది.

''నేనేం నీ మీద జాలితో వెనక్కి రాలేదు'' అంది హరిత కటువుగా.

కళ్లు విప్పి, హరిత ఎదురుగానే నిలబడడం చూసి, నవ్వబోయి ఆమె ఏదో అన్నదని మాత్రం గ్రహించి, అంతకంటె ఎక్కువ గ్రహించలేక ''ఆఁ...'' అన్నాడు.

హరిత తను అన్నది రిపీట్‌ చేసి పక్కనే ఉన్న బండ మీద కూలబడింది, ఇసుకలో విసురుగా నడవడం వలన కలిగిన అలసట పోగొట్టుకోవడానికి.

ఆమె అలా అన్నా హరితలో పాత ప్రేమను పునరుద్ధరించవచ్చని ఆనందరావుకి ఆశ పుట్టింది. జోక్‌ చేయబోయాడు. ''జాగ్రత్త ఆ బండ మీద అలా కూచోకు. అక్కడో పీత కాపురం పెట్టింది. తన మీద ఎవరైనా కూచుంటే నొచ్చుకుంటుంది.'' అని.

హరిత నవ్వలేదు.

''మొన్నోసారి నేను కూచుంటే అది ఒప్పుకోలేదు'' అని చూశాడు ఆనందరావు. 

ఊహూఁ, హరిత నోరు విప్పలేదు.

ఆమె చూపంతా సముద్రం మీదే ఉంది. సముద్రం బాగా పొంగుతోంది. అలలు విపరీతంగా వస్తున్నాయి. విసిరికొడుతూ వచ్చి బండల మీద విరిగిపడుతున్నాయి. ఆకాశం అంతా చీకటయినట్టయింది. ప్రళయం ముంచుకొచ్చినట్టుంది. ఆ రోజు పున్నమో, అమావాస్యో గుర్తులేదు కానీ సముద్రం హఠాత్తుగా పోటెత్తుతోందని ఆమెకు తెలిసివచ్చింది.

ఆమె భయం చూసి అతను దగ్గరికి వచ్చి చేయి పట్టుకున్నాడు. హరిత చేయి విదిలించి కొట్టలేదు. 'అటూ, ఇటూ ఎటు చూసినా నీళ్లే. మనం నిలబడిన కొండ ఒక్కటే మిగిలింది. కొద్ది నిమిషాల్లో అదీ మునిగిపోతుంది.' అనుకుంది. మొహం పాలిపోయింది. తన మీద తనకే చాలా జాలి వేసింది. ఇరవై రెండేళ్లు కూడా నిండకుండా - మొగుడూ, పిల్లలూ సంగతి సరేసరి - కనీసం ప్రేమికుడు కూడా లేకుండా చచ్చిపోతున్నందుకు కళ్ల వెంబడి నీళ్లు వచ్చాయి.

''మన జాలికథకు ముగింపు ఇదేనా?'' అన్నాడు ఆనందం ఆవేశంగా. చుట్టూ ఉన్న సముద్రాన్ని సంజాయిషీ అడుగుతున్న ట్టనిపించింది హరితకు. 

వెంటనే దృఢనిశ్చయం చేసుకుంది. ''ఆనంద్‌, ఈ ఆఖరిఘడియల్లో నీ వద్దనుండి దాచాల్సింది ఏదీ లేదు. నేను నిన్ను ప్రేమించాను. నీ అబద్ధం నాకు కోపం తెప్పించినా  రెండు రోజుల్లోనే అది పోయింది. పంతం మాత్రం మిగిలిపోయింది. అందుకే నీకు దూరంగా మసిలేను. మృత్యువుకు దగ్గరయిన ఈ వేళ నీకు నేను, నాకు నువ్వు ఉన్నాం.'' అంది ఏడుస్తూ.

''ఆ మాట కాస్త దగ్గరగా వచ్చి చెప్పవచ్చుగా'' అంటూ ఆనందం అక్కున చేర్చుకున్నాడు. హరిత అతని గుండెల మీద తలపెట్టి వెక్కివెక్కి ఏడవసాగింది.

కాస్సేపు చూసి ఆనందం ఇక ఉండబట్టలేక అడిగేశాడు. ''నీకు చల్లగాలి అస్సలు పడదా?'' అని.

ఇంతటి గంభీరమైన సమయంలో ఆనందం అలాటి సిల్లీ ప్రశ్న వేయడం ఆమెకు నచ్చలేదు. ''చచ్చిపోయేవాళ్లకు చలీ, గిలీ ఏముంది? అయినా నీ వెచ్చని కౌగిలిలో ఉండగా నేను మృత్యువుకు భయపడను'' అంది ఎమోషనల్‌గా.

''అదే నేనూ అనుకుంటున్నాను. ఈ పాటికే న్యుమోనియా రావడం, చచ్చిపోవడం దాకా ఎందుకు ఆలోచిస్తున్నావా అని.'' అంటూ నాన్చాడు ఆనందం.

''యూ ఫూల్‌! న్యుమోనియా వల్ల కాదు, సముద్రం అలలు వచ్చి మనను ముంచేస్తాయి. ఇద్దరూ ఛస్తాం.'' అని అరిచింది హరిత అసహనంగా.

ఆనందానికి అర్థం కాలేదు. ''ఈ కొండ మీద ఉండగా అలలు మన్నేం చేస్తాయ్‌? ఇంతకు ముందు ఇలా పోటు రావడం, వెనక్కి మరలడం  రెండుసార్లు చూసాను. ఇక్కడ ఉండగా భయం దేనికి?'' అని అడిగాడు ఆశ్చర్యంగా, అయోమయంగా.

హరిత ఉలిక్కిపడింది. అంటే అలలు ఇక్కడ దాకా రావా? చావుభయం లేదా? మరి తను తొందరపడి మనసులో మాట చెప్పేసిందే!?

హఠాత్తుగా తన మీద తనకు ఇంకో రకమైన జాలివేసింది హరితకు, చావు గురించి కాదు, మనసు విప్పి చెప్పేసి లోకువైపోయినందుకు. ఆ జాలి లోంచి బయటపడేందుకు ఆనందాన్ని ''యూ చీట్‌'' అంటూ వెనక్కి తోసేసింది.

అప్పటికి గానీ హరిత ప్రవర్తనకు కారణమేమిటో ఆనందానికి అర్థం కాలేదు. 

ఆ రోజు మధ్యాహ్నం వాళ్లిద్దరూ మాత్రమే ఉన్నచోట జరిగిన విషయాలు నాకెలా తెలిసాయని మీరు ఇప్పటిదాకా అనుకుంటూ ఉండవచ్చు. నాకు ఆనందమే చెప్పాడు. చెప్పడం ఇక్కడ దాకానే చెప్పాడు. తర్వాత ఆనందం ఏం చేసి ఆమె కోపం పోగొట్టాడో కానీ వారం తిరక్కుండా వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.                               

(పి.జి.ఉడ్‌ హౌస్‌ ''విల్టన్స్‌ హాలీడే'' కథకు స్వేచ్ఛానువాదం 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌,

[email protected]

'హాసం'లో డిసెంబరు 2001లో ప్రచురితం)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?