Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ కథలు - అబ్బే, అంతా మామూలే...

పీటర్‌ పడక్కుర్చీలో వాలాడు. తలకాయ పక్కకి వాల్చి, గాలికెగురుతున్న కర్టెన్‌ను బుగ్గకదుముకుని ఉస్సురని నిట్టూర్చేడు.

''ఓ గాడ్‌! నా తల పగిలిపోతోంది! చచ్చిపోతున్నాను''

పక్కనే దివాన్‌మీద కూచున్న అమ్మాయి అతన్ని చూసి చిరునవ్వు నవ్వింది. ''ఏం, ఇవాళ ఒంట్లో బాలేదా?'' అంది.

''అబ్బే అదేంలేదు. బ్రహ్మాండంగా ఉన్నాను. ఎన్నింటికి నిద్రలేచానో తెలుసా? సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు! అంతకుముందే లేద్దామని మహా అనుకున్నాను. కానీ లేవబోయిన ప్రతిసారీ దిండుమీంచి తలకాయ దొర్లిపోయేది. ప్రస్తుతం నా మెడ మీద ఉన్నది నా తలకాయ కాదు. కిరీటం రోజూ పెట్టుకునే రాజుగారి తలకాయలా బరువుగా వుంది. అమ్మా... అబ్బా''

''పోనీ డ్రింకేదైనా కలిపి తీసుకురమ్మంటావా?''

''నిన్నరాత్రి కరచిన బొచ్చుకుక్క వెంట్రుకేమో ఇది'' అనుకుంటూ చేతిమీద వెంట్రుకను దులుపుకుంటున్న పీటర్‌ డ్రింకు పేరు వినగానే ఉలిక్కిపడ్డాడు. ''డ్రింకా? వద్దు బాబోయ్‌! జన్మలో ఆ మాటెత్తను. నా చెయ్యి చూడు తెల్లవారుజామున సాధన చేసే కొత్త గాయకుడి గొంతంత నిలకడగా ఉంది. నిన్న రాత్రి తాగుడువల్లనే ఇంత వణుకు. అవునూ, ఓ మాటడుగుతా, నిజం చెప్పు. కొంపదీసి నిన్నరాత్రి మత్తులో వెకిలి వేషాలేమైనా వేశానా?''

''అబ్బే... అదేంలేదే ఆ మాటకొస్తే అందరూ కాస్త హుషారుగా ఉన్నారు. నువ్వుమాత్రం సోబర్‌గానే ఉన్నావు'' అందా యువతి నచ్చచెబుతూ.

''నిజంగానా? నేను కాస్త తిక్కగా ప్రవర్తించి వుంటానేమోననిపిస్తోంది. అందరూ నేనంటే మండిపడ్డారా?''

''ఛ, ఛ. నిజానికి అందరూ నువ్వు భలే సరదాగా ఉన్నావన్నారు. డిన్నర్‌టైములో జిమ్‌ మాత్రం పోట్లాటకు దిగేడు. అదీ కాసేపే. కానీ మిగిలినవాళ్లంతా అతన్ని ఒడిసిపట్టుకుని చల్లబరిచేరులే. మిగిలిన టేబుల్స్‌ దగ్గరున్న వాళ్లకిదంతా అసలు తెలిసిందో లేదో కూడా!''

''పోట్లాటా? నన్ను తన్నబోయాడా? ఎందుకు? నేను తననేమైనా అన్నానా?''

''నువ్వేం అనలేదు. నువ్వు నిక్షేపంలా, మర్యాదగా ఉన్నావు. కానీ జిమ్‌ సంగతి నీకు తెలుసుకదా! ఎలినార్‌కేసి ఎవడైనా కన్నెత్తి చూస్తే చాలు అతనికి తిక్కరేగిపోతుంది''

''అంటే నేను ఎలినార్‌కేసి కన్నెత్తి చూశానా? లేకపోతే... కొంపదీసి... కన్ను కొట్టానా?''

''ఛఛ... అదేంలేదు. నువ్వూరికే తనను ఆటలు పట్టించావంతే. తను కూడా నువ్వు భలే తమాషాగా, సరదాగా ఉన్నావనుకొంది. ఒకే ఒక్కసారి మాత్రం కాస్త చికాకుపడింది. నువ్వు ఫిష్‌ సూప్‌ తన వీపుమీద ఒంపేశావు చూశావా... అప్పుడు''

''చచ్చాం! అంటే తన గౌనులోంచి సూప్‌ ఒంపితే వీపంతా కారిపోయిందన్నమాట. ఛ,ఛ... ఇకమీద తనకి మొహం ఎలా చూపించగలుగుతాను?''

''ఏం ఫర్వాలేదు. కాసిని గులాబీపూలు తన పేరిట పంపేయి. అదే సర్దుకుపోతుంది. అనవసరంగా బాధపడకు'' అని సలహా ఇచ్చిందామె.

''బాధపడడమా? పడి చేసేదేముంది కనక! అవునూ, ఇలాంటి చమక్కులు ఇంకా ఏమైనా చేశానంటావా?''

''నువ్వు మామూలుగానే ఉన్నావు. అనవసరంగా ఇదవ్వకు. అందరికీ నువ్వంటే వెర్రి ఇష్టం పట్టుకుంది కూడా. హోటల్‌ మేనేజర్‌కి మాత్రం నువ్వు పాడుతూంటే కాస్త బెంగ పట్టుకుంది. మరీ అంత కాదులే! సంగతేమిటంటే ఇంతకుముందు ఇలాగే గోల, గందరగోళం జరిగితే హోటల్‌ లైసెన్సు కాన్సిల్‌ చేసేశారట. చచ్చీ చెడీ లైసెన్స్‌ తిరిగి సంపాదించుకొన్నారట! మళ్లీ కాన్సిల్‌ చేస్తారేమోనని కాస్త భయపడ్డాడు. గంటసేపు ఏకబిగిన పాడినా నీ గొంతు చెక్కు చెదరకపోవడం చూసి ఆశ్చర్యపడ్డాడు కూడాను. అయినా నువ్వు మరీ అంత పెంకులెగిరిపోయేలా పాడలేదులే!''

''ఓహో... నేను పాడానన్నమాట! అదీ ఓ గంటసేపు! వెరీగుడ్‌! అందరికీ మహా వేడుకగా ఉండుంటుంది''

''అదేమిటి? నీకు గుర్తులేదా? నువ్వు ఒక పాట తర్వాత మరోటి పాడుతూనే ఉన్నా ఎవరూ ఏమీ అనకుండా ఉన్నారే! నువ్వు అదేదో సైనికుడి విరహం గురించి పాడబోయినప్పుడు మాత్రం అందరూ నిన్ను ఊరుకోబెట్టబోయారు. కానీ నువ్వు ఆ పాట వదలందే! నోటిమీద పట్టు సడలినప్పుడల్లా ఆ పాట అందుకొనేవాడివి. మేమంతా కనీసం ఓ నిమిషం పాటైనా పాటలాపించి నీ చేత డిన్నర్‌ తినిపిద్దామని తెగ ప్రయత్నించాం. అమ్మో అసాధ్యుడివి!''

''అంటే నేను డిన్నర్‌ అస్సలు తినలేదంటావా?''

''ఒక్క పిసరు కూడా కతకలేదు. వెయిటరు నీకు ఏదైనా ఇవ్వబోయినప్పుడల్లా 'చిన్నప్పుడు జిప్సీలెత్తుకుపోయిన మా చిట్టి తమ్ముడివి నీవే. నాకున్నదంతా నీదే' అంటూ నువ్వు ఠపీమని వాడికే అది తిరిగిచ్చేసేవాడివి. వాడిని భలే అరిపించావులే'

''అర్థమయింది బాబో అర్థమయింది. నన్ను చూస్తే అందరికీ హుషారుగా ఉందంటే ఉండదూ మరి! ఇంతేనా? ఇంకా ఏమైన సాహసకృత్యాలు మిగిలేయా!''

''మరీ పెద్దగా లేవులే. ఓ తెల్లజుట్టు ముసలాయనంటే నీకెందుకో నచ్చలేదు. ఆయన నెక్‌టై పరమ దరిద్రంగా ఉందని నీకనిపించిందిలావుంది. అది ఆయనకు చెప్దామని నువ్వు తెగ ఉబలాటపడ్డావు. ఆయన నిన్ను ఉతకడానికి వచ్చేలోగా మేం నిన్ను బయటకు ఈడ్చుకొచ్చేసేంలే''

''హమ్మయ్య! క్లబ్‌ చాప్టర్‌ అంతటితో సమాప్తమన్నమాట! మరి ఇంటికెలా వచ్చాం? నడిచా?''

''అఫ్‌కోర్స్‌! నువ్వు నడిచేవు. నువ్వు మామూలుగానే వున్నావు. పేవ్‌మెంట్‌మీద కాస్త స్నో ఉంటే దానిమీద చతికిలబడిపోయేవు. పాపం, అయినా ఎవరికైనా అలాగే జరిగుండేది''

''అంటే పేవ్‌మెంటు మీద కాలు జారిపడ్డానన్నమాట. నా మోచేతికి దెబ్బ ఎందుకు తగిలిందో ఇప్పుడర్థమైంది. సరే తర్వాతేమైందో కాస్త చెప్తావా?''

''పీటర్‌! నువ్వు నంగనాచిలా ఏమీ తెలియనట్టు మాట్లాడకు. అన్నీ నా చేత వాగిస్తున్నావు. నువ్వు  జారిపడిన తర్వాత ఏం జరిగిందో నీకు బాగా గుర్తుందికదూ! డిన్నరు టైములో కాస్త మత్తుగా, హుషారుగా ఉన్నమాట నిజమే కానీ నువ్వు పేవ్‌మెంట్‌ మీద పడిన దగ్గర్నుంచీ పూర్తి సోబర్‌గా, మామూలుగా ఉన్నావు. నీ హృదయం నా ఎదుట పరిచిన విషయం నీకు గుర్తుందికదా! మనిద్దరం కలిసి టాక్సీలో... ఆ వెన్నెల్లో చక్కర్లు కొట్టడం, మనస్సు విప్పి మాట్లాడుకోవడం అన్నీ గుర్తున్నాయి కదూ! గుర్తులేదని అబద్ధం చెబితే నా గుండె పగిలిపోతుంది సుమా'' ఆమె గొంతులో ఆతృత ధ్వనించింది.

''అలాగా, అలాగా ఆఁ... ఆఁ.... టాక్సీలో తిరిగేమా? అవును కదూ! చాలాసేపు తిరిగి ఉంటామేమో!''

''ఓ... చాలాసేపు పార్కు చుట్టూ రౌండ్లు కొడుతూనే వున్నాం. బయట చెట్లమీద పండులాంటి వెన్నెల! నీకు ప్రేమించే హృదయం ఉందని అప్పటిదాకా నీకే తెలియదని అన్నావు కదూ!''

''అన్నానా? అనేవుంటాను. అలాటివి అనేది నేనే''

''అదేంకాదు ఇంకా ఎన్నో తియ్యతియ్యని కబుర్లు చెప్పావు. నా మీద నీకింత ప్రేమ ఉందని నాకిన్నాళ్లూ తెలియనే తెలియదు. అఫ్‌కోర్స్‌ నేను నా ప్రేమను గుండెల్లోనే దాచుకొన్నాననుకో. కాని నిన్న రాత్రి మనం చేరువవడంతో ఓహ్‌ా... పీటర్‌, ఆ టాక్సీ ప్రయాణం మన ప్రణయ గాథలో ఒక ముఖ్య ఘట్టం కదూ''

''ఆఁ... ఆఁ... అలాగే వుంది. చూస్తుంటే''

''ఇక మనమిద్దరం కలిసి ఎంతో సంతోషంగా బతుకుదాం! నిన్నరాత్రి నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని అడిగిన వెంటనే అందరికీ వెళ్లి చెప్పివద్దామనుకున్నాను. కానీ పొద్దున్న దాకా ఆగితే మంచిదనిపించింది. మన పెళ్ళయ్యేవరకూ ఆ రహస్యం అలాగే దాచడం బాగుంటుంది కదూ!''

''ఆఁ... ఆఁ... బాగుంటుందనుకుంటాను''

''భలే బాగుందే''

''అవును, భలేగా వుంది''

''బ్రహ్మాండంగా ఉంది కదూ!''

''అవును, బ్రహ్మాండంగా ఉంది. కానీ కాస్త ఇటు చూడు. నువ్వేమనుకోకపోతే ఒక్క డ్రింక్‌ తెచ్చి పెడతావా? తల తిరుగుతున్నట్టుంది. నిన్న రాత్రి గొడవ వింటున్నాక బతికుండగా మళ్లీ తాగకూడదని అనుకుంటున్నాననుకో. అయినా... ఏదో మందు పుచ్చుకున్నట్టు... కాస్త తాగకపోతే కళ్లు తిరిగిపడేటట్టున్నాను''

''తప్పకుండా తాగు. కాస్త తీసుకుంటే కొంపలేం మునిగిపోవులే. నువ్వు మరీ అంత ఇదవక్కర్లేదు. కాస్త విస్కీ, సోడా కలిపి తీసుకొస్తానుండు. కాస్త హాంగోవర్‌ సర్దుకుంటుంది''

''నిజం చెప్పాలంటే నిన్నరాత్రి నేను చేసిన ఆగడం చూశాక నాతో ఇంకా ఎలా మాట్లాడుతున్నావో నాకర్థం కావటం లేదు. నాకే మాత్రం బుద్దున్నా వెళ్లి సన్యాసం తీసుకోవాలి!''

''నీకేం మతోయిందా? కాబోయే భార్యను దగ్గర పెట్టుకొని సన్యాసం, గిన్యాసం అంటావేమిటి? నన్నొదిలి వెళ్లనిస్తావేమిటి?'' అంటూ అమాంతం మీదపడి ముద్దు పెట్టుకుని విస్కీ తేవడానికి పరిగెట్టుకెళ్లింది.

పీటర్‌ పాలిపోయిన ముఖంతో ఆమె వెళ్లినవైపు చూస్తూ తల నెమ్మదిగా అడ్డంగా తాటించాడు. వణికిపోతున్న చేతుల్లో తలకాయ నిరికించుకొని మళ్లీ మూలగడం మొదలెట్టాడు. ''ఓ గాడ్‌! నా తల పగిలిపోతోంది! చచ్చిపోతున్నాను!''

(డరోతీ పార్కర్‌ 'యూ వర్‌ పెర్‌ఫెక్ట్‌లీ ఫైన్‌' కథకు అనువాదం )

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

mbsprasad@gmail.com

(విపుల డిసెంబరు 1995లో ప్రచురితం)