Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ కథలు - దర్జా బతుకు

అదిగో ఆ ఆఫీసులో పక్కపక్క సీట్లలో పనిచేసే యిద్దరు పెళ్లికాని అమ్మాయిలను చూస్తున్నారుగా. ఆ ఎడమ చేతివైపు అమ్మాయి స్టెనో. ఆ కుడివైపు అమ్మాయి టైపిస్టు.  టైపిస్టు కంటె  స్టెనో ఏడాదిన్నర సీనియర్‌, జీతం కూడా ఓ పిసరు ఎక్కువ. టైపిస్టమ్మాయి ఆఫీసులో చేరిన రోజే స్టెనో అమ్మాయికి స్నేహితురాలై పోయింది. వాళ్లిద్దరిలోనూ చాలా పోలికలు కనబడతాయి. అంటే చూపుల్లో కాదు. శరీరం ఒంపుసొంపుల్లో, నడుస్తూ ఒలకబోసే హొయల్లో, చేసుకునే అలంకారంలో, హావభావాల్లో... యిద్దరూ ఒకలాగానే అనిపిస్తారు. పెదాలకు పామే లిప్‌స్టిక్‌, వేళ్లకు పూసే నెయిల్‌ పాలిష్‌, ఒంటికి పట్టేసినట్టుండే గౌన్లు, ఎత్తుమడమల స్లిప్పర్లు - ఏవి చూసినా ఉన్నంతలోనే ఆకర్షణీయంగా కనబడడానికి ప్రయత్నిస్తున్నారు వీళ్లు అనిపిస్తుంది చూసేవారికి. 

ఇద్దరికీ ఒకలాటి నేపథ్యమే.  జీతంలో సగం యింట్లో యివ్వవలసిన మధ్యతరగతి బతుకులే. ఇద్దరూ కలిసే లంచ్‌ చేస్తారు, సాయంత్రం యిద్దరూ కలిసి ఆఫీసునుండి బయటపడి నడుచుకుంటూ వెళతారు. ఆదివారాలు కూడా కలిసే తిరుగుతారు. ఆదివారాలు తోడుగా వచ్చే అబ్బాయిలు తరచుగా మారుతూ వుంటారు కానీ వీళ్ల స్నేహంలో మాత్రం ఎలాటి మార్పూ లేదు. అలాగే శనివారం మధ్యాహ్నం చేసే స్పెషల్‌ లంచ్‌లలో కూడా.. తక్కిన రోజుల్లో కక్కుర్తిపడ్డా, అవేళ మాత్రం కాస్త దర్జాగానే లాగిస్తారు. 

శనివారం మధ్యాహ్నాలు గుట్టమీది రెస్టారెంట్‌కే వాళ్లు వెళతారు. హైహీల్స్‌ టక్కుటిక్కు లాడించుకుంటూ,  అల్లల్లాడే ముంగురులు సవరిస్తూ, గాలికి రెపరెపలాడే గౌను సర్దుకుంటూ, అవి చూసి యికిలించే, యీలలేసే కుర్రాళ్లను ఓరచూపులతో చూస్తూనే, అలగాజనాన్ని పట్టించుకోని యువరాణుల్లా ఫీలవుతూ వాళ్లు ఆ రెస్టారెంటులో అడుగుపెడతారు. అక్కడికే వెళ్లడానికి మరో ప్రత్యేక కారణం - వాళ్లు ఆడుకునే ఆటకు అదే అనువైన స్థలం కావడం! 

నిజానికి ఆ ఆట కనిపెట్టినది ఆ స్టెనో అమ్మాయే. 'నేనే ప్రధానమంత్రినైతే..' అని హైస్కూల్లో పెట్టే వక్తృత్వ పోటీల థీమ్‌ నుంచి ఆ అమ్మాయి ఈ ఆటను రూపొందించింది. ఆ ఉపన్యాసాల్లో మనం చిత్తం వచ్చినట్టు మాట్లాడేయవచ్చు. కానీ యీ అమ్మాయి ఆ ఆటకు బోల్డు రూల్సు పెట్టి, కష్టతరం చేసి, ఆటను రసవత్తరంగా తీర్చిదిద్దింది. 

ఇంతకీ ఆ ఆట ఏమిటంటే - 'ఎవరో దూరపు బంధువు చచ్చిపోతూ తన పదిలక్షల ఆస్తి నీ పరం చేసినట్టు' వూహించుకోవాలి. అయితే యీ ముదనష్టపు ఆస్తి నువ్వు అనుభవించాలంటే ఆ డబ్బంతా నీమీదనే ఖర్చు పెట్టుకోవాలి. దానాలు అవీ చేయకూడదు. వేరే ఎవ్వరి మీదా తగలేయకూడదు. ఏం చేస్తాం వీలునామాలో అలా రాసి పోయాడు ఆ మహానుభావుడు. ఆ పదిలక్షలూ ఎలా ఖర్చు పెడతావో నువ్వు చెపుతూ పోవాలి. ఆ చెప్పే అడావుడిలో 'ఓ పెద్ద బంగళా తీసుకుని దాని అద్దెకు యింత ఖర్చు పెడతా' అని చెప్పేశావనుకో. నీ ఛాన్సు పోతుంది. 

పైకి చూస్తే చాలా సులభంగా అనిపిస్తుంది కదా యీ ఆట. కానీ అడడం ఎంత కష్టమో తెలుసా? అసలు స్టెనోఅమ్మాయి యీ ఆటను కనిపెట్టగానే వాళ్లాఫీసులో యింకో అమ్మాయితో ఆడబోయింది. ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? 

'నాకు అంత డబ్బు రాగానే దానిలో సగం నా అభిమాన హాలీవుడ్‌ నటుడిని నాకంటే ముందే పెళ్లాడేసిన దాన్ని చంపడానికి ఓ కిరాయి హంతకుడికి సుపారీగా యిచ్చేస్తా. అది చచ్చిపోగానే తక్కిన సగంతో నేను పెద్ద కారు కొని దాన్లో ఆ అందగాడి దగ్గరకు వెళ్లి..''

'ఇక చాల్లే, నీలాటి వాళ్లు యీ ఆటకు తగరు' అని చెప్పేసింది స్టెనో అమ్మాయి. 

xxxxxxxxxxx

టైపిస్టు అమ్మాయి ఆఫీసులో చేరాక యీ అమ్మాయికే తనకు పార్ట్‌నర్‌గా వుండే అర్హత వుందని గుర్తించింది. ఆమె అంచనా తప్పలేదు. టైపిస్టమ్మాయి ఆ ఆటను తనే కనిపెట్టినంత నైపుణ్యంతో ఆడసాగింది. అంతేకాదు కొన్ని కొత్త షరతులు చేర్చి ఆటకు మెఱుగులు దిద్దింది కూడా -  'నీకు నడమంత్రపు సిరి అబ్బించిన ఆ పిచ్చిమారాజుని నువ్వెప్పుడూ అభిమానించలేదు. ఆ మాటకొస్తే అతనెవరో కూడా నీకు తెలియదు. అతను నిన్ను ఎప్పుడో, ఎక్కడో లీలగా చూశాడు. చూసీచూడగానే మురిసిపోయాడు-'ఈ అమ్మాయిది  దర్జాగా బతకవలసిన బతుకు. అణువణువునా హుందాతనం వుట్టిపడుతోంది యీమెలో. నాకు చావు ముంచుకు వచ్చినపుడు ఓ పదిలక్షలు యీ అమ్మాయికి సంక్రమింపక చేయకపోతే నా చావు ఓ చావే కాదు' అనుకున్నాడు. ఇలా...'

టైపిస్టమ్మాయి ఆ దారినపోయే దానయ్యకు కొన్ని వరాలు కూడా ప్రసాదించింది. అతనిది అకాలమృత్యువు కాదు. తీసుకునితీసుకుని పోయే జబ్బుతో అవస్థ పడలేదు. పరిపూర్ణ ఆరోగ్యంతో బతికి, పూర్ణాయుర్దాయం అనుభవించి నిద్రపోతూ వుండగా సునాయాసంగా పోయాడు. ఆ పోవడం పోవడం సరాసరి స్వర్గానికే పోయాడు. 

తమకు ఉత్తిపుణ్యానికి పదిలక్షలు దఖలు పరచిన పాత్రకు యీ విధమైన మార్పులు చేర్పులు చేసి తమ దయార్ద్రహృదయం చాటుకున్న తర్వాత కలిగిన మనశ్శాంతితో ఆ అమ్మాయిలిద్దరూ హాయిగా, ఉల్లాసంగా ఆట ఆడేవారు. 

టైపిస్టమ్మాయి ఆటను ఎంత చిత్తశుద్ధిగా ఆడేదంటే  స్టెనో అమ్మాయి ఖర్చు పెట్టడానికి ఎంచుకునే వస్తువుల లిస్టును కూడా జాగ్రత్తగా పరిశీలించి నచ్చనివి వుంటే మొహం మీద చెప్పేసేది. ఓ సారి స్టెనో అమ్మాయి తన పదిలక్షలలో మొట్టమొదటిగా కొనబోయేది సిల్వర్‌-ఫాక్స్‌ కోటని అనగానే చెప్పాపెట్టకుండా సడన్‌గా చెంపపెట్టు పెట్టినంత యిదిగా విలవిల్లాడింది టైపిస్టమ్మాయి. 

''నీలాటి టేస్టున్న అమ్మాయి పోయి పోయి సిల్వర్‌-ఫాక్స్‌ కోటు కొంటుందా? ఈ రోజుల్లో అడ్డమైన అమ్మాయిలందరూ అదే వేసుకుని తిరుగుతున్నారు..'' అని అరిచింది. 

 స్టెనో అమ్మాయి కూడా గట్టిగానే పట్టుబట్టింది. ''అడ్డమైనవాళ్లే కాదు, నిలువుగా వున్నవాళ్లూ వేసుకోవడం లేదు. అది అరుదుగా వేసుకునేదే..'' 

''అరుదా? నా తలకాయా? ఎవత్తె పడితే అదే వేసుకుని తిరుగుతోంది..''

''..తిరగటం లేదు.''

''.. భోషాణం తలుపు ఎత్తిచూస్తే ప్రతీ యింట్లోనూ అదే కనబడుతుంది.''

''..ఏడిశావ్‌, నీ కబుర్లూ నువ్వూనూ..''

''..సరే నీ యిష్టం నువ్వు అఘోరించు. నా మట్టుకు నేను నా శవాన్ని కూడా సిల్వర్‌ ఫాక్స్‌ కోటుతో కప్పనివ్వను...''

ఈ వివాదం వాళ్ల మధ్య అడ్డుగోడలు లేపింది. కలిసి మాట్లాడుకుంటూనే వున్నా సంభాషణ చాలా జాగ్రత్తగా పొడిపొడిగా సాగేది. ఆటంటారా? ఆడడమే మానేశారు. 

ఇలా కొన్నాళ్లు గడిచాక ఓ రోజు పొద్దున్న ఆఫీసుకి వస్తూనే స్టెనో అమ్మాయి టైపిస్టు దగ్గరకి వచ్చి చెప్పేసింది - తనకు వచ్చే పదిలక్షల్లోనూ సిల్వర్‌-ఫాక్స్‌ కోటు మీద అస్సలు ఖర్చు పెట్టనని. డబ్బు రావడం తరవాయి, ఓ మింక్‌ కోటు కొంటుందట తప్ప సిల్వర్‌-ఫాక్స్‌ కోటు జోలికి పోదట. 

టైపిస్టు అమ్మాయి మొహం చాటంత అయింది. ''ఇప్పుడు వచ్చావు దారిలోకి. నీలాటి దానికి మింకు కోటే వుండాలి'' అంది.

xxxxxxxxxxx

ఆ శనివారం గుట్టమీద రెస్టారెంటుకి వెళుతూండగానే వాళ్లు ఆట మొదలెట్టేశారు. వేసవేమో, రోడ్డుమీద జనం తక్కువగానే వున్నారు. ఉన్నవాళ్లు చెమట్లు కక్కుతున్నారు. దుమ్ము ఎగిరి కళ్లలో పడుతోంది. కానీ వీళ్లు మాత్రం ఆ కష్టం ఏమీ కనబరచకుండా నడమంత్రపు సిరితో మిడిసిపడే జమీందారిణుల పోకడలు పోతూ  చకచకా నడుస్తున్నారు. ఆట షరతులు వల్లించే పని పెట్టుకోకుండా డైరక్టుగా రంగంలోకి దిగిపోయారు.

స్టెనో అందుకుంది - ''ఇదిగో అమ్మాయ్‌, నీకు పదిలక్షలు వచ్చిపడ్డాయి. ఏం చేయబోతున్నావ్‌?''

సమాధానంతో సిద్ధంగా వుంది టైపిస్టు - ''ఓ మింకు కోటు కొనబోతున్నా''. 

''ఎస్‌, ఎస్‌. అది కొని తీరాల్సిందే. మాంచి దుక్కలా వున్న ముదురురంగు మింకు కోటు కొనాలి.''

నిజం చెప్పాలంటే వాళ్లిద్దరూ ఆ డైలాగులు ఏదో బట్టీపట్టి చెప్పినట్టున్నాయి తప్ప సహజమైన వుత్సాహంతో చెప్పినట్టు లేదు. ఎందుకంటే ఆ మాడ్చేస్తున్న ఎండలో మింకు కోటు - ముదురురంగుకానీ, లేతరంగు కానీ - వేసుకోవడం దుర్భరం. అసలా ఆలోచనే చెమట్లు పట్టిస్తోంది. అందుకే కాస్సేపు మౌనంగా నడిచారు. 

టైపిస్టు అమ్మాయి చూపు ఓ షాపు షోకేసుమీద పడింది. దానిలో మిలమిలలాడుతున్న వస్తువులు చూసి ఆమె కళ్లు మెరిసాయి. 

''ఆగాగు. నా మాట వెనక్కి తీసుకుంటున్నాను. మొట్టమొదటగా కొనబోయేది మింకు కోటు కాదు, అదిగో ఆ ముత్యాలహారం.''

స్టెనో కూడా అటువైపు చూసింది. దీర్ఘంగా ఆలోచించింది. ''ఈ ఐడియా బాగానే వుంది. సబబుగానే వుంది. ఎందుకంటే ముత్యాలహారం ఏ డ్రస్సు మీదనైనా సరే నప్పుతుంది.''

ఇద్దరూ ఆ షోకేసు అద్దానికి మొహం అతికించి, గుడ్లప్పగించి మరీ చూశారు. ఎమెరాల్డ్‌లో పొదిగిన పెద్ద పెద్ద ముత్యాలహారం రెండువరసల్లో వెల్వెట్‌ మెడ బొమ్మకు అలంకరించి వుంది. 

''ఎంతుంటుందంటావ్‌?'' అడిగింది స్టెనో.

''ఏమో, ...కానీ చాలానే వుంటుంది.'' అంది టైపిస్టు.

''పోనీ ఓ వెయ్యి వుంటుందా?''

''వెయ్యి కంటె ఎక్కువే కావచ్చు. ఎమరాల్డోటి వుందిగా.''

''అంటే పదివేలుంటుందంటావా?'' భయపడుతూనే అడిగింది స్టెనో.

''అంత యిదిగా అడిగితే నేనూ చెప్పలేను.'' ఒప్పేసుకుంది టైపిస్టు.

''అంత చెప్పలేనిదానివి లోపలికి పోయి కనుక్కోవచ్చుగా'' రెచ్చగొట్టింది స్టెనో.

''ఇట్టే కనుక్కోవచ్చు.''

''కబుర్లు కాదు, వెళ్లి అడుగుచూద్దాం.''

''దానికేం భాగ్యం! కానీ యిలాటి షాపులు మధ్యాహ్నం మూసేస్తారుగా..''

''మూసేయలేదు. ఇందాకా ఓ యిద్దరు బయటకు వచ్చారు కూడా. ధైర్యం లేకపోతే ఒప్పేసుకో...''

''అదేం లేదు. వెళ్లి అడుగుతా. అడిగితే కొడతారా? కానీ నువ్వూ రావాలి సుమా..''

ఇద్దరూ బెదురుతూనే దుకాణంలోకి వెళ్లారు. గుమ్మం దగ్గరవాడు తల వొంచి ఆహ్వానించాక థ్యాంక్స్‌ అంటూ గొణుగుతూ చుట్టూ చూశారు. పైకి చూస్తే వూరంత షాండిలియర్‌, కింద చూస్తే మెత్తటి తివాచీ, పక్కలకు చూస్తే వూరించే నగలు.  వాటన్నిటినీ నోరు తెరుచుకుని చూస్తే షాపువాడు తమ స్థాయి గుర్తు పట్టేస్తాడని పందులకొట్టంలోకి అడుగుపెట్టినవాడి అగరువత్తి వ్యాపారిలా మొహం మొటమొటలాడిస్తూ డబ్బున్నవాళ్ల చికాకు వొళ్లంతా పులుముకున్నారు వీళ్లు.  

మచ్చుకు చూపుదామన్నా మచ్చ లేని డ్రస్సు వేసుకున్న ఓ పెద్దమనిషి వీళ్లని చిరునవ్వుతో పలకరించాడు - 'మీలాటి వాళ్లు యిలా వచ్చారేమిటి?' అన్న భావం ఏమాత్రం తొణకనీయకుండా. 

''హలో..'' అన్నారిద్దరు భామలూ ఒకేసారి.

''హలో, మీకేదైనా..'' అని ఆ పెద్దమనిషి అనబోతూ వుండగానే స్టెనో ''ఏదో ఉత్తినే చూసిపోదామని...'' అంది.

టైపిస్టు తెగించింది. ''అబ్బే ఏమీ లేదు. నేనూ మా ఫ్రెండూ యిలా దారిలో వెళుతూ...'' జారిపోతున్న ధైర్యం కూడగట్టుకుంది. ''.. చెప్పానుగా, మా ఫ్రెండూ నేనూ ..ఊరికినే.. యిలా వెళుతూ వెళుతూ ఆ షోకేసులో ముత్యాల హారం ఎంతుంటుందా అని..''

పెద్దమనిషి వెంటనే జవాబిచ్చాడు. ''ఓ రెండు పేటల ముత్యాల హారమా? రెండున్నర లక్షలు మేడమ్‌..''

టైపిస్టు నోరు పెగల్చుకుని ''ఓ, అలాగా.. అనుకున్నాం లెండి'' అనగలిగింది.

''అద్భుతంగా వుంటుంది. కావాలని ఆర్డరిచ్చి చేయించుకున్నది. తెప్పించమంటారా, చూద్దురు గాని...'' అడిగాడు పెద్దమనిషి.

ధర వినగానే కాళ్లల్లో వణుకు ప్రారంభమైన స్టెనోకి చూస్తే యీ మర్యాదలు చూసి కళ్లు తిరిగి పడతానన్న భయం వేసింది. ''వద్దు, వద్దు'' అంది కంగారు పడుతూ. ఇంకాస్సేపు వుంటే పట్టుకు తంతారేమోనన్న భయం ఆమెది.

''చెప్పానుగా, మా ఫ్రెండూ నేనూ ..ఊరికినే యిలా వెళుతూ వెళుతూ..'' అంటోంది టైపిస్టు చిలకపలుకులు వల్లిస్తూ.  పరుగు పరుగున వెళ్లకపోతే దేవిడీమన్నా ఖాయం అన్న ఆమె భయం తెలుస్తోంది. 

ఎక్కించి ఊరేగించడానికి బయట గాడిదలు సిద్ధం చేసి వుంటారనే ఊహాచిత్రం కళ్లముందు కదలాడుతూండగా యిద్దరూ గబగబ తలుపువైపుకి నడిచారు. ఆ పెద్దమనిషి స్ప్రింగ్‌లా ముందుకు సాగి తలుపు తెరిచి వొంగి అభివాదం చేస్తున్నా వాళ్లు తమ మొహాలకు పులుముకున్న చికాకును చెరిపేయలేదు.

బయటకు వచ్చిన తర్వాత చెరిపేయవలసిన అవసరం పడలేదు. చికాకు పడుతూనే అడిగింది స్టెనో - ''నిజం చెప్పు. ఓ వస్తువు అంత ఖరీదు వుంటుందని నువ్వు కలలోనైనా ఎప్పుడైనా అనుకున్నావా?''

''రెండు లక్షల యాభైవేలట'' టైపిస్టు గొణుగుతోంది ''అంటే పదిలక్షల్లో పావు వంతు కొట్టేద్దామని చూస్తున్నాడు దొంగపీనుగ'' పళ్లు నూరింది.

''ఆశ చూడు వెధవది'' స్టెనో ముక్కు విరిచింది.

xxxxxxxxxxxx

ఇద్దరూ మౌనంగా నడుచుకుంటూ వెళ్లసాగారు. క్రమేపీ గొప్పవాళ్ల చికాకు మొహం నుండి మాసిపోయింది. దాంతో బాటు యువరాణీ దర్జా కూడా వెలిసిపోయింది. పదిలక్షలంటే పెద్ద ముల్లె అనుకుని వూహించుకుంటూ యిన్నాళ్లూ బతికిన ఆ అమ్మాయిలకు అది నిజంగానే చేతి కందినా వాళ్ల కలల జీవితపు దర్జాకి అది ఏ మూలకూ చాలదన్న గ్రహింపు రాగానే నిరాశ ఆవరించింది. నడకలో హుందా పోయి నీరసం వచ్చింది. భుజాలు కిందకి జారాయి, పాదాలు దేహాన్ని యీడ్చాయి. స్ట్రయికర్‌తో కొట్టిన కారంబోర్డు కాయిన్‌లా రోడ్డు మీద అడ్డదిడ్డంగా నడిచారు. ఒకళ్ల దారికి మరొకళ్లు అడ్డు వచ్చారు. కన్నీరో, దుమ్మో తెలియదు కానీ కళ్లల్లో మేఘాలు కమ్మినట్టు అనిపించింది.

అంతలోనే టైపిస్టు అమ్మాయి నిటారుగా అయిపోయింది. తల వెనక్కి ఎగరేసింది. తొణక్కుండా, బెణక్కుండా ధాటీగా చెప్పుకొచ్చింది - ''చూడమ్మాయ్‌. ఇప్పుడు నీకో డబ్బున్న దూరపుబంధువున్నాడు. ఎంత దూరం అంటే నువ్వు కొలవలేనంత దూరం అన్నమాట. అసలలాటి ప్రాణి వుందని నువ్వెప్పుడూ అనుకోనే లేదన్నమాట. అలాటివాడు నిన్ను ఓ పెళ్లిలో ఎక్కడో చూశాడు. లీలగా, కనీ కనబడకుండా.. కానీ చూడగానే నీమీద ఆపేక్ష కలిగింది. ఇలాటి అమ్మాయికి నా ఆస్తి యివ్వకపోతే నా బతుకెందుకు? నా చావెందుకు? అనుకున్నాడు. ఓ శుభముహూర్తాన అంతపనీ చేశాడు. హాయిగా నిద్రపోతూ పోతూ శాశ్వతనిద్ర పోయాడు. అప్పుడు నీకు కబురు వచ్చింది. ఆ ఆస్తంతా నీదేనని! ఎంతనుకున్నావ్‌? పదీ, ఇరవై కాదు.. ఏకంగా కోటి! సరే... కోటి వచ్చిపడితే నువ్వు ఎలా ఖర్చు పెడతావ్‌? అంతా నీమీదే ఖర్చు పెట్టుకోవాలమ్మాయ్‌! లేకపోతే కుదరదు.. మా అమ్మకు ఏదో కొంటాను, నాన్నకు మరోటి కొంటాను అంటే కుదరదు...'' 

కలల ముడిసరుకు సరఫరా ఒక్కసారిగా పదింతలు కాగానే స్టెనో అమ్మాయికి కూడా హుషారు వచ్చింది. మళ్లీ ఎప్పటి వుత్సాహంతో ఆట ఆడసాగింది. 

(డరోతీ పార్కర్‌ 'స్టాండర్డ్‌ ఆఫ్‌ లివింగ్‌‌' కథకు స్వేచ్ఛానువాదం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]

(విపుల 2010 లో ప్రచురితం)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?