Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ కథలు : అస్థిమాల

సుధాకర్‌కి చికాగ్గా వుంది. ఇన్నాళ్లకు భార్యను హిల్‌ స్టేషన్‌కు తీసుకుని వస్తే యిలా జరగాలా అని. 

'అనుకోకుండా సెలవు దొరికింది. మసూరీ వెళదాం పద. పదిరోజుల దాకా తిరిగి రానక్కరలేదు' అని చెప్పినపుడు రోహిణి ఆశ్చర్యపడింది - ''పెళ్లయి పాతికేళ్లయింది. ఎప్పుడు చూసినా ఆఫీసు పని, ఆఫీసు పని అంటూంటారు. బంధువుల యిళ్లల్లో పెళ్లిళ్లకు, తీర్థయాత్రలకు తప్ప యింకెక్కడికి తీసుకెళ్లినది లేదు. ఇప్పుడు యిలా ఉరుము లేని జడివానలా...'' 

''.. ఇన్నాళ్లూ అలా గడిచింది కాబట్టే యిప్పుడు టూరు కెళదాం అంటే ఎగిరి గంతేస్తావనుకున్నాను కానీ దెప్పుతూ కూర్చుంటావనుకోలేదు. ఎయిర్‌ టిక్కెట్లు, హోటళ్లు అన్నీ బుక్‌ చేసుకుని వచ్చాను...''

''గంతేసే ఓపిక లేదు లెండిప్పుడు. ఆ ఓపిక వున్నపుడు తీసుకెళ్లలేదు... ఇంతకీ పిల్లలకు కూడా బుక్‌ చేశారా? వాళ్లు బెంగుళూరు నుండి డైరక్టుగా వస్తారా?''

''వాళ్లతో మాట్లాడాను. ఇద్దరికీ పరీక్షలట. హాస్టల్‌ వార్డెన్‌ పర్మిషను యివ్వడట. మనిద్దరికే చేశాను. పదిరోజులకు..! బదరీ, కేదార్‌నాథ్‌, గంగోత్రి అవీ తిరిగి రావచ్చు''

''అలాగే చెప్తారు. గోవాకు వెళ్లినపుడు, మరోసారి ఊటీకి వెళ్లినపుడు వెళ్లిన మూడో రోజున ఆఫీసువాళ్లు వెనక్కి పిలిచేశారు..''

''ఈ సారి అలా జరగలేదులే. మేనేజ్‌మెంట్‌ మారిందిగా. కొత్త మేనేజింగ్‌ డైరక్టరు రాగానే నేను చాలాకాలంగా వెకేషన్‌ తీసుకోలేదని మొత్తుకున్నాను. సరే, అయితే పదిరోజులు లీవు శాంక్షన్‌ అన్నాడు. పైగా యింకో విషయం. కొత్త సెటప్‌లో మనం యిమడలేక ఉద్యోగం మారాల్సింది వచ్చిందనుకో.. వీళ్ల దగ్గర్నుంచి రావల్సిన లీవులన్నీ రాబట్టడమే మంచిది కదా..''

రోహిణి తెల్లబోయింది. ''ఉద్యోగం మారతారా? ఇంత పెద్ద ఉద్యోగం ఏభై ఏళ్ల వయసులో యింకోడెవడిస్తాడు ?''

సుధాకర్‌ విసుక్కున్నాడు. ''ఇచ్చేవాడే యిస్తాడు. ఆ ఆఫీసు గొడవలన్నీ నీకెందుకు? బట్టలు సర్దు. రేపే ప్రయాణం.''

''ఏడుకొండలవాడా, యీ అనుకోని ప్రయాణం ఏమిటో, యిది మంచికో చెడుకో నీకే తెలియాలి.'' అని రోహిణి చేతులెత్తి దేవుడికి దణ్ణం పెట్టుకుంది. 

''నీతో యిదే వచ్చిన చిక్కు. పదిరోజుల టూరు కదా, సంతోషిస్తావేమో అనుకుంటే లేనిపోని భయాలూ, శంకలూ..'' చికాకు పడ్డాడు సుధాకర్‌.

**********

వచ్చిన నాలుగురోజులు బాగానే గడిచాయి. ఆ తర్వాత అనుకోకుండా ఆటంకం వచ్చింది. తండ్రికి స్ట్రోక్‌ వచ్చిందని బొంబాయిలో వున్న తమ్ముడు ఫోన్‌ చేసి చెప్పాడు. 'నిన్ను చూడాలంటున్నాడు' అన్నాడు. 'పెద్ద ప్రమాదం లేదట, వెళ్లి ఒక్కసారి చూసి తిరిగి వచ్చేస్తాను' అంది రోహిణి. తమ్ముడితో చాలాకాలంగా సత్సంబంధాలు లేవు. వాళ్లింటికి  భర్త వచ్చే పరిస్థితి లేదు. తనకైతే తప్పదు. 

''అలా ఎందుకు? నేను బొంబాయి వచ్చి హోటల్లో వుంటాను. నువ్వు వెళ్లి పలకరించి వచ్చేద్దువు గాని.''

''వాళ్ల వూరెళ్లి వాడింట్లో దిగకపోతే బాగుండదు. ఒక్క పూటకు మించి వుండడం నాకూ యిష్టం లేదు. సాయంత్రం ఫ్లయిట్‌ పట్టుకుని వెనక్కి వచ్చేస్తాను. హిమాలయాలన్నీ చుట్టబెడదాం. కదలకకదలక యిన్నాళ్లకు కదిలాం. ఇప్పుడు హైదరాబాదు వెళ్లిపోతే మీ కంపెనీవాళ్లు సెలవు కాన్సిల్‌ చేసుకుని వెంటనే డ్యూటీలో చేరమంటారు.'' అంది రోహిణి.

'...అంత సీను లేదులే యిప్పుడు. రోజులు మారాయని నీకు తెలియదుగా' అనుకున్నాడు సుధాకర్‌ - సాయంత్రం డెహ్రాడూన్‌లో ఆమెను  విమానం ఎక్కిస్తూ. 

సౌమ్యేంద్ర ఆఫీసుకి వచ్చిన రోజున తను ఘనమైన ఏర్పాట్లు చేశాడు. మంచి ఉపన్యాసం తయారు చేసుకున్నాడు కానీ సభలో సరిగ్గా చదవలేకపోయాడు. కారణం - సౌమ్యేంద్రను చూడగానే కలిగిన కలవరపాటు. అతను అచ్చు తనలాగానే - పాతికేళ్ల క్రితం తను ఎలా వుండేవాడో ముమ్మూర్తులా అలాగే - వున్నాడు. తనే కాదు, స్టాఫంతా గమనించారది. వచ్చి అడిగారు - ''మీరు బంధువులా?'' అని. సౌమ్యేంద్ర తెలుగువాళ్లే కానీ కులం వేరని విన్నాడు. బంధువులు కాకపోతే యిదేదో వింతగా వుందే అన్నారు సహోద్యోగులు. సౌమ్యేంద్ర కూడా తనను చూసి ఆశ్చర్యపడ్డాడు. ''మనిషిని పోలిన మనుషులు ఏడుగురు వుంటారట. మనిద్దరం కలిసి మిగతా అయిదుగుర్ని వెతుకుదాం'' అని జోక్‌ చేశాడు. ఆ హాస్యచతురత సాయంత్రానికి యిగిరిపోయింది.

స్టాఫ్‌తో పరిచయాలు, సంతకాలు అవీ పూర్తయేసరికి సాయంత్రం నాలుగు గంటలైంది. అప్పుడు సౌమ్యేంద్ర తనను పిలిపించాడు. ''మనిద్దరం ఒకే పోలికలో వుండడం నాకు చాలా డిస్టర్బింగ్‌గా వుంది. మిమ్మల్ని చూస్తూంటే ఏభై ఏళ్ల వయసులో నేను యిలా వుండబోతానని ఎవరో మాటిమాటికీ గుర్తు చేస్తున్నట్లు వుంది. ఇంతకీ యిన్ని పోలికలు ఎలా వచ్చాయి? ఇద్దరం ఒక యీడు వాళ్లం కాదు, చిన్నపుడు తిరణాళ్లలో తప్పిపోయిన కవలపిల్లల కథ మనకు సూటవదు. నేను బొంబాయిలోనే పుట్టి పెరిగినా మాది ఒరిజినల్‌గా రాయలసీమ. మీరు మాకు బంధువులవుతారా? మీదే వూరు? ఎక్కడ చదివారు? ఎక్కడెక్కడ పని చేశారు?'' అంటూ సంభాషణ మొదలుపెట్టాడు.

పది నిమిషాలు గడవకుండానే అతనికి విషయం అర్థమైంది - తన తల్లి, తన ఎదుటి కూర్చున్న వ్యక్తి ఇరవై ఆరేళ్ల క్రితం మద్రాసులో ఒకే ఆఫీసులో కలిసి పనిచేసేవారని! అంతే, సంభాషణ అక్కడితో ఆపేశాడు. ''నేను యింపార్టెంట్‌ కాల్‌ ఒకటి ఎటెండ్‌ కావాలి. మీరు వెళ్లవచ్చు'' అన్నాడు కఠినంగా.

**********

'అయితే యితను కనకతార కొడున్న మాట. మద్రాసులో మార్వాడీవాళ్ల కంపెనీలో పని చేసే రోజుల్లో తన పక్కసీటులో పని చేసేది. గొప్ప అందం కాదు కానీ చలాకీతనం వలన ఆకర్షణ వుండేది. మొగుడుకి అది చాలలేదు. నిర్లక్ష్యం చేసేవాడు. బాధపడుతూ తన ఓదార్పు కోరేది. అప్పటికి తన కింకా పెళ్లి కాలేదు. రాయపేటలో గది తీసుకుని ఒంటరిగా వుండేవాడు. ఆఫీసు అయిపోయాక గదికి వచ్చేసేది. 'నీ దగ్గర దొరికినంత హాయి మా ఆయన దగ్గర ఎప్పుడూ దొరకలేదు. ఆయన్ని విడిచి పెట్టి వచ్చేస్తాను. నన్ను పెళ్లాడతావా?' అని అడిగేది. తను సరేనన్నా 'ఏమో, నువ్వు మోసం చేస్తే ఎటూ కాకుండా పోతాను' అనేది. 

ఇలా తర్జనభర్జనలు పడుతూండగానే వాళ్లాయనకు బొంబాయిలో పెద్ద వుద్యోగం వచ్చి వెళ్లిపోయింది. ఎక్కడుందో ఏమైందో తెలియలేదు. తమ మధ్య శారీరకసంబంధం  ఐదారు నెలలు సాగి వుంటుంది. వెళ్లేటప్పటికి ఆమె గర్భవతి అవునో కాదో కూడా తనకు తెలియదు. ఇప్పుడు యిలా ఆమె కొడుకు... తన కొడుకు కూడా... యింత చిన్న వయసులో.. యింత పెద్ద జీవన్‌ గ్రూపు చైర్మన్‌గా.... అవును, తార భర్త పేరు జీవనే!'

*********

నాలుగున్నరకు సౌమ్యేంద్ర మళ్లీ పిలిచాడు. ఈ సారి అతని కంఠంలో కాఠిన్యం కొట్టవచ్చినట్టు కనబడుతోంది. ''సుధాకర్‌గారూ, గతంలో ఏం జరిగిందో క్లియర్‌గా తెలుస్తోంది. మా నాన్నగారు... యస్‌, మా నాన్న జీవన్‌గారు.. ఆరోగ్యం బాగా లేక ప్రస్తుతం రిటైరై యింట్లో వుంటున్నారు. కంపెనీ బాధ్యతలు నాకు అప్పగించారు. ఆయన మనసుకి కష్టం కలిగించడం నా కిష్టం లేదు. తప్పు చేసిన మా అమ్మ పై లోకాలకి వెళ్లిపోయింది...''

''..అయ్యో, తార పోయిందా? ఎప్పుడు?''

''..మా అమ్మ పేరు కనకతార. మీరు మా అమ్మను ముద్దుపేరుతో తలచుకోవడం కూడా నాకు నచ్చదు. ప్రస్తుతం హార్వర్డ్‌లో చదువుతున్న మా తమ్ముడు కూడా భరిస్తాడనుకోను. అసలు మనిద్దరం ఒకే చోట నిలబడడం కూడా నేను సహించలేకపోతున్నాను. మా అమ్మ మా నాన్నకు చేసిన ద్రోహం మాటిమాటికీ నన్ను కలవరపెడుతోంది...''

''..ఐ యామ్‌ సారీ ఎబౌట్‌ యిట్‌..''

''..యూ నీడ్‌ టూ... మీరు ఉద్యోగానికి రాజీనామా చేస్తారా? నన్ను డిస్మిస్‌ చేయమంటారా?''

తను తెల్లబోయాడు. ''రాజీనామా చేస్తే నాకెవరిస్తారు యీ వయసులో? నాకింకా చాలా బాధ్యతలున్నాయి. అయినా ఎందుకు మానేశావని నా ఫ్యామిలీ, స్నేహితులు, కొలీగ్స్‌ అడిగితే ఏం చెప్పుకోవాలి? ఇదీ కారణం, ఫలానావారితో యిలా జరిగిందని...''

''స్టాపిట్‌.. ఐ గాట్‌ ద పాయింట్‌.'' అని కాస్సేపు మౌనంగా వుండి ''నా ఫ్రెండ్‌కి తెలిసున్నవాళ్ల కంపెనీ ఒకటుంది. దానిలో యిదే హోదాలో ఉద్యోగం వేయిస్తాను. కానీ పదిహేను రోజులు పడుతుంది. అతను యుఎస్‌ వెళ్లాడు. మీరు తక్షణం లీవులో వెళ్లండి. తిరిగి వచ్చి ఆ కంపెనీలో చేరుదురు గాని.''

**********

పొద్దున్నే రోహిణి ఫోన్‌ చేసింది. ''నాన్నకు ఆపరేషన్‌ అక్కరలేదంటున్నారు. నన్ను చూసి చాలా సంతోషించారు. ఒక రోజు వుండి వెళ్లమంటున్నారు. మా తమ్ముడు  కూడా బాగానే రిసీవ్‌ చేసుకున్నాడు. పాత గొడవలు ఏవీ ఎత్తలేదు. మీరక్కడే వుండండి. నేను ఎల్లుండి కల్లా వచ్చేస్తాను. హిమాలయాలన్నీ చుట్టివద్దాం. మళ్లీ ఎప్పటికి కుదురుతుందో ఏమో.. హైదరాబాదు వెళ్లి రావడమంటే బోలెడు ఖర్చు.''

''బాగానే వుంది మన జాలీ ట్రిప్‌! నువ్వు మీ నాన్నగారి సిక్‌బెడ్‌ పక్కన, నేనిక్కడ ఒంటరిగా..'' అన్నాడు సుధాకర్‌ విరసంగా. 

డెహ్రాడూన్‌ కాలేజీలో తన పాత ఫ్రెండ్‌ ఒకడుండాలి. ఈ మధ్య టచ్‌లో లేడు. వెళ్లి చూసి వస్తే కాలక్షేపం అయినట్టుగా వుంటుందనుకుని డెహ్రాడూన్‌లోనే వుండిపోయాడు. పొద్దెక్కాక కాలేజీ కెళితే అతను ఉద్యోగం మానేసి ఏడాదయిందట. ఏమీ తోచక షాపింగ్‌ మాల్‌లో తిరుగుతూంటే ''ఏయ్‌, సుధా నిన్నే...'' అనే పిలుపు వినబడింది. 

ఎన్నో ఏళ్ల తర్వాత ఆ పిలుపు వినబడడంతో అతను స్తబ్దుడై పోయాడు. చటుక్కున ఆగిపోయి అటు చూశాడు. ఖరీదైన చీరలో, అంతకంటె ఖరీదైన కూలింగ్‌ గ్లాసెస్‌తో వున్నావిడ చేయి వూపుతోంది. మామూలుగా అయితే పోల్చుకోవడానికి సమయం పట్టేదే. కానీ సౌమ్యేంద్ర పుణ్యమాని జ్ఞాపకాల వీధిలోకి ఆమె మళ్లీ ప్రవేశించడం, తనకు మాత్రమే ప్రత్యేకమైన పిలుపుతో పలకరించడం వలన క్షణాల్లోనే పోల్చుకున్నాడు. 'తార' అన్నాడు అప్రయత్నంగా!

''హమ్మయ్య, యింత త్వరగా గుర్తుపడతావనుకోలేదు. లాంగ్‌ టైమ్‌, యూసీ.. నువ్వు పెద్దగా ఏం మారలేదు కానీ నేను బాగానే మారాను.'' అంటూ దగ్గరకు వచ్చి ''ఐ యామ్‌ సో హ్యాపీ టూ సీ యూ'' అంటూ గట్టిగా కౌగలించుకుంది. ఎవరూ తిరిగి చూడలేదు. అక్కడ యిది సాధారణమే కాబోలు. 

చెయ్యి పట్టుకుని లాంజ్‌లోకి లాక్కెళ్లి తన గురించి గడగడా చెప్పేసింది - జీవన్‌కి బొంబాయి వచ్చాక బాగా కలిసి వచ్చింది. ఐదేళ్ల తర్వాత సొంతంగా బిజినెస్‌ పెట్టి, తనను ఉద్యోగం మానేయమన్నాడు. తనూ బిజినెస్‌లో వాటాదారుగా వుంటూ కష్టపడింది. త్వరత్వరగా పైకి వచ్చారు, జీవన్‌ గ్రూప్‌కి ఒక బ్రాండ్‌ వేల్యూ తెచ్చిపెట్టారు. అంతలోనే పెద్ద కొడుకు అంది వచ్చాడు. రెండోవాడు హార్వర్డ్‌లో చదువుతూ రేపో మాపో బిజినెస్‌లోకి రాబోతున్నాడు. ఏడాది క్రితం జీవన్‌ యాక్సిడెంటులో పోయాడు. తనకీ విరక్తి పుట్టింది. డైరక్టరుగా కొనసాగుతూ పెద్దకొడుకుని చైర్మన్‌ చేసింది. బొంబాయిలో యిల్లు కొడుకుకోడలుకి అప్పగించి ప్రశాంతంగా వుంటుంది కదాని ఏడాదిగా డెహ్రాడూన్‌లోనే వాళ్ల గెస్ట్‌హౌస్‌లో వుంటోంది. పనిమనిషి, వాచ్‌మన్‌, డ్రైవరే తోడు. ఇవన్నీ చెప్పి నీ సంగతేమిటంది. 

'కఫెటేరియాలో కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం' అన్నాడు సుధాకర్‌. ఈ లోపునే అతనికి విషమంతా అర్థమైంది. సౌమ్యేంద్ర కావాలనే తల్లి చచ్చిపోయిందని అబద్ధం చెప్పాడు. బతికి వుందని తెలిస్తే తను ఎలాగోలా కలుసుకుని ఉద్యోగం వూడిపోకుండా చూసుకుంటానని భయపడ్డాడు. చచ్చిపోయిన తండ్రి బతికున్నాడని చెప్పి భయపెట్టబోయాడు. కానీ అతనొకటి తలిస్తే విధి మరొకటి తలచింది. తనను ఆమె దగ్గరకు తీసుకుని వచ్చింది. సమయానికి భార్యను దగ్గర లేకుండా చేసింది. విధి యిచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. తారకు మళ్లీ దగ్గరై సౌమ్యేంద్రకు బుద్ధి చెప్పాలి. ఇప్పుడే కాదు, అతను యిప్పించిన ఉద్యోగంలో స్థిరపడ్డాక...! ఈ లోపున తారకు విషయాలేవీ తెలియకూడదు. 

అందుకే ''నువ్వింకా మద్రాసులో ఆ మార్వాడీ కంపెనీలోనే వున్నావా?'' అని తార అడిగితే అవునన్నాడు. కొడుకు, కూతురు బెంగుళూరులో చదువుతున్నారని, తను బదరీనాథ్‌, కేదార్‌నాథ్‌ వగైరా చూద్దామని వచ్చాననీ చెప్పాడు. ''మరి మీ ఆవిడ?'' అంటే ''తను రోగిష్టిది. కీళ్లనొప్పులు. పెద్దగా ప్రయాణాలు చేయలేదు. నన్ను వెళ్లి రమ్మనమంది.'' అన్నాడు.

తార సానుభూతిగా అతని చేతిపై చేయి వేసింది. 'వయసు మీరకుండానే కీళ్లరోగాలా?' 

సుధాకర్‌ లేని నవ్వు తెచ్చిపెట్టుకున్నాడు. ''అందుకే యిలాటి చలిచోటకు కూడా ఒంటరిగా వచ్చాను.'' 

తార చిరునవ్వు నవ్వింది. 'ఇద్దరు ఒంటరుల జంట..' అంటూ తన చేతిని అతని చేతిలో యిరికించింది. అతను ఆమెను దగ్గరగా పొదువుకున్నాడు.

**********

ఇద్దరూ కలిసి నైనితాల్‌ వెళ్లారు. పాతరోజులు గుర్తున్నాయా అంటూ ఆమె పెనవేసుకుని పోయింది. కొత్తమోజుల్లా వున్నాయి అంటూ అతను అల్లుకుని పోయాడు. తండ్రికి తిరగబెట్టడంతో రోహిణి బొంబాయివాసం కొనసాగుతోంది. మన గతసాంగత్యం వలన గర్భం ధరించాను అని తార ఒక్కసారీ చెప్పలేదు. నా కొడుకుని నేను చూసుకున్నాను అని సుధాకరూ చెప్పలేదు. నిజానికి సౌమ్యేంద్ర తన కొడుకు అనే భావనే కలగటం లేదు. నిర్దయుడైన బాస్‌గానే అనిపిస్తున్నాడు. 

మూడు రోజుల తర్వాత డెహ్రాడూన్‌లో గెస్ట్‌ హౌస్‌కి తిరిగి వచ్చారు. మధ్యాహ్నం కలయిక తర్వాత సుధాకర్‌ చెప్పాడు - ''బహుశా యిప్పట్లో మనం కలవకపోవచ్చు. నా భార్యకు ఒంట్లో బాగాలేదని ఫోన్‌ వచ్చింది. నేను ట్రిప్‌ కాన్సిల్‌ చేసుకుని రాత్రి  ఢిల్లీ ఫ్లయిట్‌ కాచ్‌ చేస్తాను. మనం యిదివరకట్లా కాకుండా యిక టచ్‌లో వుందాం. సెల్‌ఫోన్‌లో నా నెంబరు సేవ్‌ చేసుకో.'' అని. నిజానికి వాళ్ల మావగారికి ఆరోగ్యం బాగుపడి రోహిణి తిరిగి వచ్చేస్తోంది. ఎయిర్‌పోర్టులో రిసీవ్‌ చేసుకుని మసూరీ తీసుకెళ్లాలి. 

''డిన్నర్‌ చేసి వెళుదువుగాని. డిన్నర్‌ టైమ్‌లో నీకో సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ యివ్వబోతున్నాను.'' అంది తార. 

ఏ డైమండ్‌ రింగో బహుమతిగా యిస్తే భార్యకు దాని గురించి ఎలా చెప్పుకోవాలా అని సతమతమవుతున్న సుధాకర్‌ డిన్నర్‌కు తయారవుతూండగానే తార సౌమ్యేంద్రను అతని దగ్గరకు తీసుకుని వచ్చింది. ''హియర్‌ యీజ్‌ యువర్‌ సన్‌, సుధా' అంటూ! సౌమ్యేంద్ర కేసి తిరిగి ''దిసీజ్‌ యువర్‌ రియల్‌ ఫాదర్‌, సౌమీ' అంది. 

సౌమ్యేంద్ర కనుగుడ్లు పెద్దవి చేసి చూశాడు. తన కళ్లను తాను నమ్మలేనట్టు మొహం పెట్టి ''హౌ కమ్‌..'' అంటూ తల్లి కేసి తిరిగి ''ఒంట్లో బాగా లేదంటూ అర్జంటుగా రమ్మనమన్నది యిందుకా?'' అన్నాడు. 

తార అతని పరిస్థితిని గమనించటం లేదు. సుధాకర్‌కి అతన్ని గర్వంగా చూపిస్తూ ''నీ కొడుకు యింతటివాడవుతాడని ఎప్పుడైనా వూహించావా, సుధా? అసలు నీ వలన నాకకు కొడుకు పుట్టాడని కూడా ఊహించి వుండవు కదా! ఆనాటి ఆనందఘడియల ఫలమే వీడు. అందుకే జీవితంలో ఎన్నో ఉన్నతశిఖరాలు అధిరోహించాడు. నీ నుంచి మంచితనం పుణికి పుచ్చుకున్నాడు, జీవన్‌ ట్రైనింగ్‌లో పట్టుదల అలవర్చుకున్నాడు. లెటజ్‌ సెలబ్రేట్‌ దిస్‌ యీవెంట్‌'' అంది హుషారుగా.

సౌమ్యేంద్ర సుధాకర్‌ కేసి చూసి కరకుగా అడిగాడు - ''తను యిక్కడ వున్నట్టు మీకెలా తెలుసు? ఎవరు చెప్పారు?'' 

సుధాకర్‌ తడబడ్డాడు. ''నాకు తెలియదు. ఎలాగూ సెలవు యిచ్చారు కదాని..యిటు వస్తే ...తారసపడింది.''

''..పడ్డారు. గుర్తుంచుకోండి, షీ యీజ్‌ మదర్‌ ఆఫ్‌ యువర్‌ బాస్‌ అండ్‌ మేజర్‌ షేర్‌హోల్డర్‌ ఆఫ్‌ ద కంపెనీ''

తార యిద్దరి కేసి ఆశ్చర్యంగా చూసింది. ''మీ యిద్దరూ యింతకుముందే కలిశారా?'' అని అడిగింది.

***********

జరిగినది సౌమ్యేంద్ర క్లుప్తంగా చెప్పి అతి కోపంగా ''అయినా నువ్వు యింత సిగ్గుమాలినదాని వనుకోలేదు. ఎవరైనా చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటారు. నువ్వు నన్ను పిలిచి యితన్ని పరిచయం చేయాలనుకోవడంలో అర్థమేమైనా వుందా? నీ పుట్టుక సక్రమమైనది కాదు అని చెప్పి ఏం సాధిద్దామనుకున్నావ్‌?'' అరిచాడు.

''నీ నిజమైన తండ్రిని కలిసి సంతోషిస్తావనుకున్నాను.'' అంది తార మొహం మాడ్చుకుని.

''నన్ను పెంచి పెద్ద చేసి, విద్యాబుద్ధులు నేర్పించి, యింతవాణ్ని చేసిన జీవన్‌గారే నా తండ్రి. ఇతను నా తల్లికి రంకుమొగుడు కావచ్చు కానీ నాకు తండ్రి కాడు.''

''అతను చెప్పినది కరక్టే, తారా! జీవన్‌గారే అతని తండ్రి. ఇప్పుడు నేను యిలా తారసిల్లడం అతనికి ఎంత యిబ్బందిగా వుంటుందో నేను అర్థం చేసుకోగలను.'' అన్నాడు సుధాకర్‌.

''ఓహో, యిది కొడుకు మీద ప్రేమా, లేక సాటి మగవాడిపై జాలా?'' వెక్కిరింతగా అడిగింది తార. ''నీకు కొన్ని విషయాలు తెలియవులే. వీడికి పదిహేనేళ్ల  వయసుండగా వీళ్ల నాన్న ఓ గోవన్‌ సెక్రటరీతో సంబంధం పెట్టుకున్నాడని నేను పోట్లాట పెట్టుకుని విడాకులు తీసుకుంటానంటే వద్దని వీడు ఒకటే గోల. చూసీ చూడనట్టు వదిలేయాలట. 'దానికి మీ నాన్న వలన ఓ కూతురు పుట్టిందటరా' అంటే 'పుడితే పుట్టనీ, కావాలంటే దానికి కాస్త ఆస్తి రాసీయనీ, నీకొచ్చేదానిలో కాస్త తగ్గినంత మాత్రాన ఏం ఫర్వాలేదు' అన్నాడు. ఇప్పుడు నేను నీకు ఆస్తి రాసిస్తానంటే వూరుకుంటాడా?''

సౌమ్యేంద్ర మండిపడ్డాడు - ''నీ పాత ఎఫయిర్‌ గురించి నాకప్పుడు తెలియదు. లేకపోతే దాని గురించే మాట్లాడేవాణ్ని. అంతకు పదిహేనేళ్ల క్రితమే నువ్వు రొమాన్సు నడిపి అప్పుడు డాడ్‌ను ఎలా తప్పుపట్టగలవ్‌?''

''ఫర్‌ యువర్‌ కైండ్‌ యిన్‌ఫర్మేషన్‌ - దీనిలో కూడా మీ నాన్నే సీనియర్‌. మెడ్రాసులో వుండగా తను తన కొలీగ్‌తో సంబంధం పెట్టుకున్నాడు. ఆ కసి కొద్దే నేను యితనివైపు మళ్లాను. నిజానికి యితనిది యాక్టివ్‌ రోల్‌ కాదు. నేనే అతన్ని పురికొల్పాను, ఆన్‌ రిబౌండ్‌! వచ్చింది కదాని యితను అనుభవించాడు. నేనే మీ నాన్నకు చెప్పాను - ఫలానా అతనితో తిరుగుతున్నాను అని. నమ్మలేదు కానీ ఎందుకైనా మంచిదని వేరే వూళ్లో ఉద్యోగం కోసం వెతికాడు. బొంబాయిలో దొరికింది. నువ్వు సుధాకర్‌ పోలికలతో పుట్టడంతో నేను ఎంతకైనా తెగించగలనని అర్థం చేసుకున్నాడు. అప్పణ్నుంచి బుద్ధిగా వున్నాడు. కాబట్టే నేనూ వ్యాపారంలో సహకరించాను. కానీ ఎప్పుడైతే డబ్బు బాగా చేతికి వచ్చిందో మళ్లీ తిరుగుళ్లు మొదలుపెట్టాడు. అప్పుడూ తిరగబడ్డాను. విడాకులు తీసుకుంటానన్నాను. మీరు ఎదిగివచ్చి అడ్డుపడ్డారు. మీ సుఖాలకు, యిమేజికి నష్టం వాటిల్లుతుందన్న స్వార్థం మీది. మేం విడాకులు తీసుకోలేదు కానీ భార్యాభర్తలుగా జీవించలేదు. నా బాధ మీకేం తెలుసు?'' అరుస్తూండగానే తార గొంతు గద్గదమైంది. కన్నీళ్లు తుడుచుకుంటూ కూలబడిపోయింది. 

ఆమె వద్దకు వెంటనే పరిగెట్టుకుని వెళ్లినవాడు సుధాకర్‌. ఆమె వీపు నిమురుతూ పక్కనే కూర్చున్నాడు. అనునయంగా ''వచ్చింది కదాని అనుభవించాడు అనడం బాగా లేదు తారా, నువ్వంటే నా కిష్టం వుండేది కాబట్టే అలా జరిగింది. నువ్వు బొంబాయి వెళ్లాక రెండు ఉత్తరాలు రాశాను. తర్వాత భయం వేసింది, జీవన్‌ చూస్తే నీ కాపురం చెడిపోతుంది కదాని...!''

కళ్లు నిండిన నీళ్లతోనే తార చివ్వున తలెత్తి చూసింది ''అప్పటిమాట సరే, యిప్పుడు సౌమ్యేంద్ర నీకు ముందే కనబడ్డాడని ఎందుకు చెప్పలేదు?''

సుధాకర్‌ సమాధానం నాన్చాడు - ''నువ్వు ఎంబరాసింగ్‌గా ఫీలవుతావనుకున్నాను. మేం యిద్దరం ఎప్పుడు కలవకుండా చూడాలనే ప్రయత్నిస్తావనుకున్నాను.''

తార విషాదంగా నవ్వింది ''నేనూ మగవాణ్నయితే అలాగే ఆలోచించేదాన్నేమో. మధ్యతరగతికి హిపాక్రసీ ఎక్కువ అంటారు. ఇప్పుడు నేను, నా ఫ్యామిలీ హై క్లాస్‌. మా యిళ్లల్లో మగవాళ్లు ఎవరితో పడితే వాళ్లతో తిరుగుతారు. వీడు కూడా తన పిఏతో తిరిగి  కడుపొస్తే అబార్షన్‌ చేయించాడు. భార్య గోలపెట్టినా వినలేదు. తను కూడా వీడిలాగే చేయవచ్చని వీడు తెలుసుకోవాలి. ఒకే స్థాయి మనుషుల్లో మగవాళ్లకో నీతి, ఆడాళ్లకో నీతా? ఆడదైనంత మాత్రాన నేను యింకోలా ఎందుకుండాలి? ఇంకోలా వున్నట్టు ఎందుకు నటించాలి?'' మాట్లాడుతూండగానే ఆమె కంఠంలో దృఢత్వం వచ్చి చేరింది. ''ఎస్‌, నాకేం భయం? నిన్ను నా కంపెనీలో డైరక్టరుగా తీసుకుంటాను. నాతో పాటు గతంలో కలిసి పని చేశావని బోర్డు మీటింగులో చెప్తాను. మీ యిద్దరి పోలికలు చూడగానే వాళ్లందరికీ విషయం బోధపడుతుంది. ఇప్పటికే వాళ్లకి జీవన్‌ రసికత్వం తెలుసు. ఈవిడా తీసిపోలేదురా అనుకుంటారు. నా కదే కావాలి...''

అప్పటిదాకా సోఫాలో తలపట్టుకుని కూర్చున్న సౌమ్యేంద్ర దిగ్గున లేచాడు. ''నో, యూ కాన్ట్‌ డూ యిట్‌.. డాడీ సంగతి వేరు, నీ సంగతి వేరు'' అంటూ అరిచాడు.

''ఐ కెన్‌ ! నేను మేజర్‌ షేర్‌హోల్డర్‌ నన్న సంగతి మర్చిపోవద్దు, సౌమీ! నాకు నచ్చినది నేను చేస్తాను. మీ యిద్దర్ని కలిపితే సంతోషిస్తారనుకున్నాను. జీవన్‌ పోయాడు కాబట్టి యితనితో సఖ్యంగా, ఆప్యాయంగా వుంటావనుకున్నాను. కానీ చూడబోతే మీ యిద్దరూ నాతో న్యాయంగా ప్రవర్తించటం లేదు. నా షేర్లు సుధాకర్‌ పేర ట్రాన్స్‌ఫర్‌ చేసి డైరక్టరును చేయగలను. ఎవరాపగలరు?''

సౌమ్యేంద్ర దానికి సమాధానం చెప్పలేదు కానీ సుధాకర్‌ చెప్పాడు - ''..నేను. నాకు ఏ షేర్లూ అక్కరలేదు. నా బతుకు నన్ను బతకనీ. ఇప్పుడు నాకు అర్థమవుతోంది. నీ కొడుక్కి సౌమ్య అని ఎందుకు పేరు పెట్టావో. నా పేరుకి అర్థం చంద్రుడు... తారకు చంద్రుడితో సంబంధం వలన కలిగినవాడు బుధుడు. బుధుడికి మరోపేరు సౌమ్యుడు. నీ భర్తను అనుక్షణం హెచ్చరించడానికి ఆ పేరు పెట్టి వుంటావు. పాతికేళ్ల క్రితం నీ భర్తపై కసి తీర్చుకోవడానికి ఉపయోగపడ్డాను. ఇప్పుడు నీ కొడుకుపై కోపం తీర్చుకోవడానికి ఉపయోగ పడదలచుకోలేదు. నాకు అంత డబ్బు, పదవీ ఏమీ వద్దు. నా బతుకు నేను బతకనీ..''

సౌమ్యేంద్రకు మొట్టమొదటిసారి సుధాకర్‌ నచ్చాడు. దగ్గరకు వచ్చి షేక్‌హ్యాండ్‌ యిచ్చాడు. దగ్గరగా, ఆత్మీయంగా నిలబడ్డాడు. 

తారకు ఒళ్లు మండిపోయింది. ''మగవాళ్లిద్దరూ కలిసిపోయారన్నమాట. నేను అనుకున్న ప్రకారం ఎనౌన్సుమెంటు యిచ్చేస్తాను. తర్వాత ఏం జరుగుతుందో అప్పుడే చూదాం..'' అంటూ రుసరుసలాడుతూ ఫ్రిజ్‌ తెరిచి కూల్‌డ్రింక్‌ తాగసాగింది.

సౌమ్యేంద్రకు ఏమీ పాలుపోలేదు. మీరే ఏదైనా చేయాలి అంటూ సుధాకర్‌ కేసి చూశాడు. 

సుధాకర్‌ తార వద్దకు వెళ్లి భుజం మీద చేయి వేశాడు. ఆమె విదిలించుకోబోతుంటే రెండు భుజాలూ పట్టుకుని తనవైపు తిప్పుకుని దగ్గరకు తీసుకున్నాడు. ఆమె అతని ఛాతీపై పడి ఏడవసాగింది. ఆమెను హత్తుకుంటూనే అతను సానునయపరచాడు - ''చూడు తారా, మా యిద్దరి సంగతి వదిలేయ్‌. నా భార్య సంగతి ఆలోచించు. నీవు చేసే పని వలన ఆమె కెంత క్షోభ కలుగుతుందో ఆలోచించు. తన భర్త నీతిమంతు డనుకుంటోంది యిన్నాళ్లూ. ఇప్పుడీ భయంకర సత్యాన్ని ఆమె ముందు పెడితే తల్లడిల్లిపోదా? తిరగబడడానికి, పగ తీర్చుకోవడానికి నీ కున్న అవకాశం, ఆర్థికస్థాయి లేదామెకు. జీవితాంతం కుమిలిపోతూ బతకాలి. సాటి ఆడదానిగా ఆమెపై జాలి చూపించు. మనిద్దరి మధ్య వున్న స్నేహం ఆమెకు విషప్రాయం కావడం ఏమంత భావ్యం? మాంసం తింటున్నాం కదాని ఎముకలు మెళ్లో వేసుకుని తిరుగుతామా? వాస్తవాలన్నీ బయటకు రానక్కరలేదు. కొన్ని విషయాలు గుట్టుగా వుంటేనే శోభిస్తాయి.''

అతని కౌగిలిలో ఐదు నిమిషాలు అలాగే వుండి మెల్లగా విడిపించుకుని బెడ్‌ రూమ్‌లోకి వెళ్లి ఆలోచనలో పడింది తార.

''మీకు టైమవుతోందేమో, రండి ఎయిర్‌పోర్టు దగ్గర డ్రాప్‌ చేసి వస్తాను'' అన్నాడు సౌమ్యేంద్ర సుధాకర్‌తో. సుధాకర్‌ తార వద్దకు వెళ్లి వెన్ను తట్టి మెల్లగా బయటకు నడవబోయాడు. 

తార తలెత్తి చూసి చిరునవ్వు నవ్వింది. ''తెలివైనవాడివి. అందుకే నచ్చావ్‌. నీ తెలివితేటలే సౌమీకి వచ్చాయి.'' అంది. (స్వాతి మాసపత్రిక 2013 లో ప్రచురితం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?