Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ కథలు- బుద్ధీ-హృదయమూ

ప్రతాప్‌, మరో నలుగురూ కలిసి అతని కళ్లకు గంతలు కట్టి తీసుకొచ్చేరు. రాత్రి కాబట్టి ఎవరికీ తెలియలేదు. ప్రతాప్‌ చెప్పినట్టే అతను నాజూగ్గా వున్నాడు. గదిలోకి తీసుకెళ్లి గంతలు విప్పి ''నిన్ను కిడ్నాప్‌ చేసిన విషయం మీ నాన్నగారికి ఇంకో గంటలో తెలియపరుస్తాం. మా షరతులు ఒప్పుకుని మా సహచరులైదుగురినీ విడిచిపెట్టేస్తే, నువ్వు ఇంటికి వెళ్లిపోవచ్చు. మంత్రి కొడుకువి కదా, రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది. నువ్వు మర్యాదగా నడుచుకుంటే చాలు. నీకు దేనికీ లోటు చేయం'' అంటూ ప్రతాప్‌ నన్ను చూపించి ''ఇదిగో ఈవిడదే ఈ మేడ. మా ఉద్యమంపై సానుభూతి కొద్దీ నిన్ను కనిపెట్టుకు చూసుకోడానికి ఒప్పుకుంది. ఏ మాత్రమైనా అసభ్యంగా ప్రవర్తించేవా... నీ ప్రాణాలు తీయడానికి వెరవని మనుష్యులను కాపలా పెట్టేం. ఒళ్లు దగ్గర పెట్టుకుని మసలుకో, తెలిసిందా?'' అని బెదిరించాడు.

అతను మౌనంగా తలూపాడు. గదంతా కలియజూసి నాకేసి పరీక్షగా, ప్రశ్నార్థకంగా చూపు విసిరేడు. ప్రతాప్‌ ఆ చూపుల్ని చదివేడులాగుంది  ''చెప్పానుగా, ఈవిడ మా దళ సభ్యురాలు కాదు, పెద్ద వ్యాపారస్తుని భార్య. ఈ ఏరియాలో ఇంత పెద్ద మేడ అంటే ఊహించుకో ఆమె స్థితిగతులు! అయినా నిన్ను 'హోస్టేజి'గా వుంచుకోడానికి మాకోసం ఒప్పుకుంది. కొండల్లో గుట్టల్లో వుండనక్కర్లేనందుకు సంతోషించు'' అన్నాడు కటువుగా.

గదికి తాళం వేసి బయటకు వచ్చిన తర్వాత తన అనుచరులతో కారులో పోయి కూర్చోమని చెప్పి ప్రతాప్‌ నా చేతులు పట్టుకున్నాడు. ''సుమిత్రా, నన్ను మన్నించు. నీకు కష్టం కలిగిస్తున్నాను. అతనికి వేళకు తిండీ, నాలుగు పుస్తకాలూ ఇస్తే చాలు. ఎం.బి.ఎ. చదువుతున్నాడు. చదువు, సంస్కారం కలవాడే. ఏ గొడవా చేయడు. ఒకవేళ తెగింపుకొద్దీ ఏదైనా చేయబోతే నీ దగ్గరున్న రిమోట్‌ కంట్రోలుతో మా ఎల్లయ్యకు సిగ్నలియ్యి. వాడు వచ్చి చూసుకుంటాడు. అయినా ఈ గొడవ ఎన్ని రోజులో వుండదులే  ! జస్ట్‌ రెండు రోజులు, మహా అయితే మూడు... నేను చెప్పినట్టుగా నువ్వు రేపు మధ్యాహ్నం షాపింగుకని వెళ్లి పబ్లిక్‌ బూత్‌నుంచి ఫోన్‌ చేసి షరతుల కొప్పుకుంటే టీవీలో ప్రకటించమని చెప్పు. రోజూ మూడుగంటలకు అక్కణ్ణుంచే నాకు ఫోన్‌ చేస్తూండు. మీ ఇంటి ఫోన్‌వైర్లన్నీ కట్‌ చేసేశాంగా''

''ఇతను అరచి గోలచేస్తే?'' భయం అణుచుకుంటూ అడిగేను.

''పిచ్చిదానా, మీ జూబిలీహిల్స్‌లో అరచినా, గోలపెట్టినా, కాల్చుకున్నా వినబడనంత దూరంలో ఇళ్లు కట్టుకున్నారు మీరందరూ. అథవా వినబడినా ఎవడూ మరొకడి జోలికి రాడు. వద్దామనుకున్నా వాచ్‌మన్‌గా వున్న మా ఎల్లయ్య ఆపేస్తాడు. అనవసరంగా వర్రీ కావద్దు'' అన్నాడు ప్రతాప్‌ నవ్వుతూ.

''మీ ఎల్లయ్య పేరు బాగోలేకపోయినా మనిషి బాగున్నాడు. ముసలి వాచ్‌మన్‌ని మాన్పించి ఈ అందగాడ్ని పెట్టేనని మా ఆయనకు తెలిస్తే అనుమానం వచ్చి కాల్చేస్తారేమో!'' వాతావరణం తేలిక చేయడానికి నేను సరదాగా మాట్లాడబోయేను.

ప్రతాప్‌ కూడా నా నెర్వస్‌నెస్‌ని తగ్గించడానికి కాబోలు, అవసరమైన దానికంటే పెద్దగా నవ్వుతూ ''కాల్చేయమను, ఏం ఫర్వాలేదు. ఎల్లయ్య వాడు పెట్టుకున్న పేరు. అసలు పేరుతో పోలీసు రికార్డుల్లో ఎప్పుడో చచ్చిపోయేడు. అంచేత కేసు రాదు'' అని సింహద్వారం వైపు నడుస్తూ, ఠక్కున ఆగి ''నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు సుమిత్రా. నా కోసం, మా ఉద్యమం కోసం నువ్వు చేసే సహకారం వెలకట్టలేనిది. వస్తా. మావాళ్లు కాచుకునుంటారు'' అంటూ వడివడిగా వెళ్లిపోయేడు.

xxxxxxxxxxxxxxxxxxxx

ప్రతాప్‌ తనను తాను ఎందుకు మోసం చేసుకుంటాడో నాకర్థం కాదు. నేను వాళ్ల ఉద్యమం కోసం సహకరిస్తున్నానా? నాన్సెన్స్‌. కాలేజీ రోజుల్లోనే నాకు రాజకీయాలంటే మహా తలనొప్పి. ప్రతాప్‌ కోసం ఆ ఉపన్యాసాలన్నీ భరించేదాన్ని. అతనికీ తెలుసు - నాకు అతనంటే వెర్రి అనీ, నన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి, ఉద్యమంలో చేరి అడవులకు వెళ్లిపోయినా, అతనంటే నాకున్న ఇష్టం అణువంతైనా తగ్గలేదనీ. ప్రతాప్‌ కాదన్నాక 'ఎవరైతేనేమిటిలే' అని అమ్మానాన్న చూపించిన బిజినెస్‌ మాగ్నెట్‌ను కట్టుకున్నాను. ఆయనకు ఎప్పుడూ వ్యాపారం మీద తప్ప నామీద ధ్యాస లేదు. పెళ్లయి ఏడాదైనా నా గురించి ఏమీ తెలియదాయనకు. తీరికెక్కడ పాపం!

ఆయన మూడు నెలల ట్రిప్పుకై అమెరికా వెళ్లిన పది రోజులకు ప్రతాప్‌ ఫోన్‌ చేశాడు, యూనివర్సిటీలో మేము ఇదివరకు కలిసే చెట్టుక్రింద కలవమని. మనిషి లావెక్కేడు. ''తాగుతున్నావా?'' అని అడిగా. ''ఛ, ఛ, నీకు తెలియదా? మా ఉద్యమంలో ఎటువంటి చెడ్డ అలవాట్లకూ తావులేదని?''

''ఆడవాళ్లను ప్రేమించడం కూడా చెడ్డ అలవాట్లలో ఒకటా?''

''సుమిత్రా! నేను అప్పుడూ, ఇప్పుడూ ఒకటే చెప్తున్నాను - ఉద్యమంలో దూకినవాళ్లకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు వుండకూడదు. అందుకే నీకు దూరమయ్యేను.''

''నాకంటే ఉద్యమమే ముఖ్యమనుకున్నవాడివి నన్నిక్కడికి ఎందుకు రమ్మన్నావ్‌?''

''ఉద్యమం కోసమే''

సిగ్గూ, శరం లేని మనిషి. నన్ను తిరస్కరించడమే కాక నా సహాయం అర్థిస్తున్నాడు కూడా. నేను  లేచి వెళ్లిపోతానన్నాను. కానీ ప్రతాప్‌ ఆకర్షణ ఎటువంటిదో నాకూ తెలుసు. కొద్ది నిమిషాల తర్వాత అతని ప్లాను శ్రద్ధగా వింటూ కూచున్నాను.

మా ఆయన ఊళ్లో లేరు కాబట్టి, నేను మా పుట్టింటికి వెళుతున్నానని చెప్పి, ఇంట్లో పనివాళ్లందరికీ సెలవలిచ్చి పంపేయాలి. పాలూ, పేపరువాడిని కూడా. వాచ్‌మన్‌ని ఏదో కారణం చెప్పి ఉద్యోగం తీసేసి, ప్రతాప్‌ మనిషిని పెట్టాలి. అంతా సవ్యంగా వుందని చెప్పాక ప్రతాప్‌, ఆరోగ్య మంత్రి కొడుకును కిడ్నాప్‌చేసి తీసుకొస్తాడు. మా ఇంట్లో దాచిపెట్టేమన్న సంగతి ఏ నరమానవుడూ ఊహించలేడు. పోలీసులు అడవులూ, గుడిసెలూ వెతుకుతారంతే! మంత్రి కొడుకు నెమ్మదస్తుడు. ఇంట్లో నేనొక్కతినీ వున్నా ఏ ఆపదా రాదు!

అప్పుడు గొర్రెలా తల ఊపాక ఇప్పుడు నిద్రపట్టక దొర్లితే ఏం లాభం?

తెల్లవారింది. కాఫీ తయారుచేసి పట్టుకెళ్లేను. ''మేడమ్‌! మీరే తెచ్చారే!'' అంటూ కంగారుపడ్డాడు.

నవ్వుతూ ''సుమిత్రగారంటే చాలు'' అన్నాను. అతను స్థిమితపడి చిరునవ్వు నవ్వి ''నా పేరు భూషణ్‌'' అని కాఫీ చప్పరించి ''చాలా బాగుంది'' అన్నాడు. 

''థాంక్స్‌'' అన్నాను మనస్ఫూర్తిగా. నేను వంట చేయడమే చాలా అరుదు, చిన్నప్పట్నుంచి సిరులలో పెరగడం వల్ల కాబోలు.

''నా వంట నచ్చడం మీ అదృష్టం. ఇంకా రెండు మూడు రోజులు నా చేతివంటే తినాల్సివస్తుంది మీరు, ఇష్టం వున్నా లేకున్నా'' అన్నాను సంభాషణ పొడిగిస్తూ.

అతని మొహం మ్లానమైంది. ''రెండు, మూడు రోజుల్లో సెటిలయిపోతే మంచిదే. నాకు భయంగా వుంది - ఎంతకాలం ఈ వ్యవహారం నడుస్తుందోనని. మా నాన్నగారికి డబ్బులేదు, పైగా రాజకీయ పరపతి లేదు. ఏదో జిల్లాలవారీ కులాలవారీ పంపిణీలలో ఈయనకు మంత్రి పదవిచ్చేరు. నిజాయితీపరుడు కావడంతో, ఏ గ్రూపుకీ చేరువ కాలేకపోయారు. ఎవరైనా ఒత్తిడి తెస్తే తప్ప ఇటువంటి విషయాల్లో త్వరగా నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం జంకుతుంది.''

ఈసారి ధైర్యం చెప్పడం నా వంతయింది. ''అనవసరంగా వర్రీ అవకండి. అంతా సవ్యంగానే జరుగుతుంది. అయినా మీ సెక్యూరిటీ గార్డులు మిమ్మల్ని రక్షించలేకపోయారా?''

''చెప్పాను కదండీ. మా నాన్నగారు పాత తరం మనిషి. సెక్యూరిటీ వద్దనేశారు. అయినా తప్పు నాది. ఫూలిష్‌గా మనుషుల్ని నమ్మి మోసపోయాను. నాతోపాటు చదివే అమ్మాయీ నేనూ లవ్‌ చేసుకున్నాం. ఫలానా చోటుకు రమ్మనమని కబురుపంపి, వీళ్లకి పట్టిచ్చింది. అడిగితే తనూ ఉద్యమంలో కార్యకర్తట. నన్ను ప్రేమించినట్టు నటించిందట తన లక్ష్యసిద్ధికై! మనుషుల మనసులతో ఆడుకునే వీళ్లూ, వీళ్ల ఉద్యమమూ. నిన్న రాత్రంతా ఆలోచిస్తూనే వున్నాను - నేనెంత వెర్రివాడినైనానా అని'' అతను కళ్లు తుడుచుకున్నాడు.

నా ఈడువాడే అయినా, దగ్గరకెళ్లి, తల నిమిరి, తల్లిలా బుజ్జగించ బుద్ధేసింది. ఇతనిదీ నా కేసే. అయినా ఈ ఉద్యమకారుల కిదేం బుద్ధి? - ప్రేమ నటించి, మోసం చేయడం.

వంట చేస్తుంటే గతం గుర్తుకొచ్చింది. ప్రతాప్‌ ప్రేమ నటించలేదు. ప్రేమ నణచుకున్నాడు. అతనికి నేనంటే ఎంత ఇష్టమో అనేక సంఘటనలద్వారా రుజువయ్యింది - అయినా ఒక్కసారి కూడా హద్దు మీరలేదు - నేను చొరవ తీసుకున్నా కూడా. అందుకే అతనంటే నాకు గౌరవం, మాట తోసెయ్యలేని మొహమాటం.

భూషణ్‌కి నా చేతి వంట నచ్చింది. తృప్తిగా తిని, దాపరికం లేకుండా మెచ్చుకున్నాడు. నాకెంత సంతోషం కలిగినా, విషయం మార్చడానికి అతను చదువుతున్న పుస్తకం ఎలా ఉందని అడిగాను. చాలా తెలివైనవాడులా వున్నా - చక్కగా విశ్లేషించి చెప్పడం మొదలెట్టాడు.

నాకు చిన్నప్పటినుంచి అనేక విషయాలు తెలుసుకోవడం ఇష్టం. కాని స్వయంగా చదువుకోవడం  బద్ధకం. ఎవరైనా చెబుతుంటే వినడానికి మాత్రం సిద్ధం. నా ప్లేటు కూడా అక్కడికే తెచ్చుకుని తింటూ వినసాగేను. అన్నం కాలేజి రోజుల్లో ప్రతాప్‌ కూడా ఇలాగే చెప్పేవాడు. కానీ అన్నిటికీ గతితార్కిక భౌతిక వాదమో, గతించిన వాదమో... ఏదో ఒకటి అన్వయించి చెప్పేవాడు. నాకు నచ్చేది కాదు. ఇతను అటువంటి 'సిద్ధాంత నిబద్ధత' లేకుండా ఆవేళ సాయంత్రం శృంగారపరమైన వర్ణనలు కూడా అతి సున్నితంగా, రమ్యంగా విశదీకరిస్తూ మాట్లాడేడు.

ప్రతాప్‌కూ, నాకూ ఎప్పుడూ ఈ విషయంలో పోట్లాట వచ్చేది. ''ఇదంతా బూర్జువా సంస్కృతి'' అనేవాడు.

''మీ సమసమాజం వచ్చేక సృష్టికార్యం ఆపేస్తారా మీరు?'' అనేదాన్ని కొంటెగా.

''జాతిని వృద్ధి చేయవలసిన బాధ్యతలలో అది కూడా ఒకటిగా తలుస్తాం'' అనేవాడు ప్రతాప్‌ అతి సిన్సియర్‌గా, ఉద్యమకారులందరిదీ తన అభిప్రాయమే నన్నంత ధీమాగా.

''ఒక బాధ్యతగా చేసే ఆత్మానందం ఏముంటుంది అందులో? మీ నవసమాజం నాకొద్దు బాబూ'' అనేదాన్ని అతన్ని ఏడిపిస్తూ.

''నీలాటివాళ్లు వద్దన్నా, పొమ్మన్నా ఆ సమాజం వచ్చి తీరుతుంది'' అనేవాడు.

xxxxxxxxxxxxxxxxxxx

భూషణ్‌ హఠాత్తుగా చర్చ ఆపి ''మధ్యాహ్నం మా నాన్నగారు ఫోన్లో ఏం సమాధానం చెప్పేరు?'' అని అడిగేడు.

ఏ విషయం అతడినుండి దాచుదామనుకుంటున్నానో అది చెప్పక తప్పలేదు. ''ఆ అయిదుగురు ఉద్యమకారులను పట్టుకునే ప్రయత్నంలో పదిహేనుమంది పోలీసుల ప్రాణాలు పోయేయమ్మా. నా కొడుకుది పదహారవదీ కావచ్చు. ప్రభుత్వపరంగా ఏం జరుగుతుందో వేచి చూద్దాం'' అన్నాడాయన.

భూషణ్‌ మొహం మీద భయం కనబడింది. ప్రతాప్‌లా మొండివాడు కాడితడు. ''చూశారా సుమిత్రగారూ, మా నాన్నగారి నిజాయితీ! అటువంటి పెద్దమనిషినా మీరు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నది? ఒక్కసారి ఆలోచించి చూడండి'' అన్నాడు కసి మేళవించి.

''నేనా? బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నది'' అన్నాను తెల్లబోయి.

''మీరు కాకపోతే, మీరు సమర్థించే ఉద్యమం'' అన్నాడతను రెట్టిస్తూ.

ఉద్యమమా? వల్లకాడా? నేను నా కథంతా చెప్పుకొచ్చేను. అతను కన్నార్పకుండా విన్నాడు. కళ్లు ఆర్ద్రమయ్యేయి. అంతా విని, లేచి ''మీ ప్రేమించే హృదయానికి జోహార్లర్పిస్తున్నాను మేడమ్‌. లత ఉద్యమకారిణి అని తెలిసిన క్షణం నుంచీ నాకు అసహ్యం తప్ప వేరొక భావం లేదామెపై. కానీ మీరు... ప్రతాప్‌ మీ ప్రేమను తన కోసం... పోనీ తన ఉద్యమం కోసం ఉపయోగించుకుంటున్నాడని తెలిసి కూడా సహకరిస్తున్నారు. హేట్స్‌ ఆఫ్‌. గుడ్‌ నైట్‌'' అంటూ షేక్‌హాండ్‌ ఇచ్చేడు. చేయి బలంగా వుంది. ఒళ్లు గగుర్పొడిచింది.

మరుసటి రోజు అనాలోచితంగానే కాస్త ట్రాన్స్‌పరెంట్‌ చీర కట్టుకుని వెళితే ''నిన్నటికన్నా ఇవాళ ఎక్కువ అందంగా వున్నారు మీరు'' అన్నాడు అతను అప్రయత్నంగానే.

అతని చూపులు పడ్డచోటు చూసుకుని ''ఎక్కువభాగం కనబడుతుంటే ఎక్కువ అందంగా వున్నట్టా?'' అన్నాను అతణ్ణి ఉడికించాలని. సిగ్గు పడిపోయేడు కుర్రాడు, బుగ్గలు ఎర్రగా అయిపోయేయి. సంస్కారం వున్నవాళ్లతో వచ్చిన ఇబ్బందే ఇది. సహజంగా కలిగే భావాలను అణచుకోవడమే సంస్కారమనుకుంటారు. అటువంటి సంస్కారం వల్ల లాభమేమిటో!

ఆరోజు ఉదయం భూషణ్‌ నాన్నగారు. ప్రధానమంత్రి స్వయంగా మాట్లాడి హామీ ఇచ్చేరని చెప్పేరు. ఒకటి, రెండు రోజుల్లో విడుదల అయిపోతాడని భూషణ్‌కి ధైర్యం చెప్పమన్నారు. ఆ వార్త చెబుదామన్న సంతోషంతో తలుపు తాళం తెరిచి, తలుపు తట్టకుండానే అతని గదిలోకి దూసుకుపోయేను. చిన్న అండర్‌వేర్‌తో మాత్రం వున్నాడు. సిగ్గుపడి ఒళ్లు దాచుకోబోయి, నా కళ్లలోకి చూస్తూ నిలబడిపోయేడు.

బయటకు నాజూకుగా కనబడినా, భూషణ్‌ శరీరం దృఢంగా, గ్రీకువీరుడి శిల్పంలా వుంది. ఛాతీపైన రోమాలు, ఒంకీలు తిరిగిన జుట్టు, ఒంపులు తిరిగిన కాళ్లు, సన్నటి నడుము - మూర్తీభవించిన మగతనంలా వున్నాడు. ఏం చెప్పానో నాకే తెలియకుండా గబగబా వాళ్ల నాన్నగారి మెసేజ్‌ అప్పచెప్పి వచ్చేశాను, అతని గది గడియైనా వేయకుండా.

అయిదు నిమిషాలకు అతనే కిచెన్‌లోకి వచ్చేడు. తనను మన్నించమన్నాడు. నేను హఠాత్తుగా వస్తానని అనుకోలేదని, ఇకపై జాగ్రత్తగా వుంటానని అన్నాడు. నాకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. 'ఈ మర్యాదలూ, మన్నింపులూ టూమచ్‌గా వున్నాయి. ఊరుకోవయ్యా' అనబుద్ధేసింది. అతన్ని ఈజ్‌ చేద్దామని కీట్స్‌ పొయిట్రీ గురించి చెప్పమన్నాను. అంతే! ప్రొఫెసరుగారు సిద్ధం. ఆత్మసౌందర్యం, ప్రేమ, అనుభూతి అంటూ చెప్పసాగేడు.

రాత్రి పడుకోబోయేముందు నాకనిపించింది - 'మనుషులు ఎందుకింత బండబారిపోతారా?' అని.. మా ఆయనలో రసానుభూతి, ఆర్ద్రత వున్నట్టే నాకెప్పుడూ అనిపించలేదు. మంచి చీర కట్టుకుని చూపించబోతే ''బుల్‌చంద్‌ దగ్గరేనా కొన్నావ్‌? డిస్కౌంటిచ్చాడా? ఫలానా అని చెప్పావా?' అని ఆరాలే తప్ప 'ఈ చీర కట్టినా, విప్పినా అందంగా వున్నావ్‌' లాంటి ప్రశంసే రాదు.

ప్రతాప్‌ కూడా తెలివితేటల్లో మా ఆయనకు తీసిపోడు. కానీ అతను ఎన్నుకున్న మార్గం వేరు. నా విషయంలో హృదయానికంటె, బుద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేడు. ఒకసారి అతన్ని వాటేసుకుని 'ఒక్క ముద్దు పెట్టుకోరాదా?' అని అడిగేశాను కూడా. అమలిన శృంగారం గురించి ఉపన్యాసం ఇచ్చి కౌగిలి విడిపించుకున్నాడు. శరీరానికి, దాని కోరికలకూ వీళ్లు విలువే ఇవ్వరా?

భూషణ్‌...? భూషణ్‌ తెలివైనవాడే. సంస్కారం వున్నవాడే. కానీ ప్రేమికుడా? లతను ఎంత గాఢంగా ప్రేమించాడో ఏమిటో! నా అందం అతన్ని కదిలిస్తుందా? వెళ్లి కవ్వించబుద్ధేసింది. నా నైటీకేసి చూసుకున్నాను. బాగా పల్చగా వుంది. పెట్టీకోటు వేసుకుందామని అనుకునే 'ఇలాగే వెళ్లి ఏడిపిద్దాం' అనిపించి అతని రూముకు వెళ్లి తలుపు తట్టాను. మధ్యాహ్నం నుంచి అతని గదికి తాళం వేయడం మానేశాను. అయినా అతను గదిలోనే వుండిపోయేడు. బయటకు వచ్చి నా బెడ్‌రూమ్‌లోకి తొంగిచూడలేదు. ఆత్మసంయమనం అమోఘంగా వుంది!

'నిద్రపట్టలేదంటూ' అతని మంచంమీద కూర్చున్నాను. అతని చూపు నాకేసే... శరీరమంతటినీ చూస్తున్నాడు. అతని మొహంలో ఉద్రేకం కనబడుతోంది. పరిస్థితి చేజారిపోతుందేమోనని ఒక్కసారిగా భయం వేసింది. పెళ్లయినదాన్ని, తీసుకున్న రిస్కులు చాలు. లేచి, వడిగా తలుపు దగ్గరకు నడిచేను.  'సుమిత్రా మై లవ్‌' అని గొణుగుతూ అతను నన్ను దగ్గరకు లాక్కున్నాడు. చిత్రం, నేను నిరోధించలేదు. అతని చదువు, సంస్కారం, నిగ్రహం ఏమయ్యాయో నాకు తెలీదు. అతనికీ తెలీదు... తనను తాను నాకు అర్పణ చేసుకున్నాడు.. నేను కూడా అంతే.

మా వారితో నాకెప్పుడూ ఆ అనుభూతి కలగలేదు. ఫోనెప్పుడూ బెడ్‌రూమ్‌లో అందుబాటులో వుంచుకుంటారాయన - అర్ధరాత్రి వచ్చే ఫోన్‌కాల్స్‌ కోసం. ఫోన్‌ మోగిన క్షణం ఏ స్థితిలో, ఏ భంగిమలో వున్నా సరే చెయ్యి ఫోన్‌ మీదకు వెళ్లాల్సిందే! తను తాను మరచే స్థితికి ఆయన ఎప్పుడూ చేరలేదు, నన్ను చేరనివ్వలేదు.

కానీ భూషణ్‌ ఈనాడు నా ఆడతనాన్ని నాకు నిరూపించేడు. ఎదుటి మనిషిలోని సహజ గుణాలను వెలికిదీయగల సామర్థ్యం నాకుందని నిరూపించేడు. బలాత్కారం చేసేవాళ్లే పశువుల్లా ప్రవర్తిస్తారని చదువుతాం. కానీ 'పేషనేట్‌ లవర్‌'లో కూడా పాశవికత వుంటుందని భూషణ్‌ వల్ల నాకు తెలిసింది. కోరినది, తనివితీరా ఏ మానసిక అవరోధాలూ లేకుండా అనుభవించడం పశులక్షణమైతే అదే మనిషి సహజ లక్షణం కూడా అనుకుంటున్నాను.

తెల్లవారేసరికి విజ్ఞానఖని మేల్కొన్నాడు. ''సుమిత్రా, నన్నర్థం చేసుకో. నేను కామంతో అలా ప్రవర్తించలేదు. ఇంతమందిలో మనసున్న మనిషివి నువ్వొక్కత్తివే! అందుకే నేనిష్టపడ్డాను. మా నాన్నగారి సంగతే తీసుకో. ఆ అయిదుగుర్నీ విడిచిపెట్టమని తెగించి ప్రధానమంత్రికి ఆయన చెప్పగలిగేడా? చెప్పలేడు - ప్రజలేమనుకుంటారోనన్న భయం, తెచ్చిపెట్టుకున్న సంస్కారం. అదే నాగరికత ఎరుగని ఆటవికుడయితే ముందువెనుకలు ఆలోచించకుండా ప్రాణాలొడ్డి, పోట్లాడి కన్నబిడ్డను కాపాడుకునేవాడు. మరి ఈయన? ఆ పితృప్రేమ ఏమయింది? సంస్కారం చాటున దాగింది. అణిగిపోయిందేమో కూడా. మీ ప్రతాప్‌? అతనూ అంతే. లత?... వీళ్లందరినీ చూసేక హృదయమున్న మనుషులుంటారంటే నమ్మి వుండేవాడ్ని కాదు - నువ్వు తారసిల్లకపోతే. అందుకే నువ్వంటే అంత ఇది. కానీ నువ్వు వివాహితవు. మరొకరి ప్రేయసివి. అందుకే నా భావాలు నేను అణచుకున్నాను. నాకు హృదయం వుందో లేదో అదెలాంటిదో నాకు తెలియదు. కానీ నిన్నరాత్రి తనున్నానని హృదయం నిరూపించుకుంది. తెరలు జారిపోయేయి. బుద్ధీ వివేకం ఓడిపోయేయి...''

అతని పెదాలు మూసేను - ''ఈ విశ్లేషణలే నాకు అసహ్యం. మనిద్దరం ఒకరికొకరం నచ్చేము, సుఖించేము, అంతటితో ఆపు. మా నాన్నగారు చిన్నప్పటినుంచీ తను నాపై ప్రేమనెందుకు బహిరంగంగా ప్రదర్శించడంలేదో వివరించేవారు. నాకై సమయం కేటాయించలేనందుకు తనకు తాను నచ్చచెప్పుకోవడమేమో అది! ఇప్పుడు మా ఆయనా అంతే. ప్రేమ మనసులో వుందట! అది ఆర్నెల్లకోసారి బిజినెస్‌-కమ్‌-ప్లెజర్‌ ట్రిప్‌లో హిల్‌ స్టేషన్‌లో అన్ని సౌకర్యాలు అమరిన తర్వాత మాత్రం బయటకొస్తుంది కాబోలు. ఇక ప్రతాప్‌ 'ప్లేటోనిక్‌ లవ్‌'తో విసిగిపోయేను. నువ్వే నా వాడివి. చర్చలు, వివరణలు కట్టిపెట్టి, లేచి ఇంటి పనులు చూద్దాం.''

తర్వాతి రెండు రోజులూ కలిసి వంట చేసుకునేవాళ్లం, కబుర్లు చెప్పుకునేవాళ్లం - రష్యా విప్లవం గురించి, రాష్ట్రకూటుల పరిపాలనా పద్ధతుల గురించి కాదు. స్వీట్‌, సిల్లీ నథింగ్స్‌ మాత్రమే. ఇద్దరం కలిసి తక్కిన లోకాన్ని మర్చిపోయేము - ప్రతాప్‌కి ఫోన్‌ చేయాలన్న సంగతి కూడా - మూడో రోజు ఎల్లయ్య వచ్చి గుర్తుచేసేదాకా.

ప్రతాప్‌ కోపంగా అడిగేడు ''ఫోనెందుకు చేయలేదు?''

''జ్వరం వచ్చింది'' అబద్ధమాడేను.

వెంటనే చల్లబడి, డిఫెన్సివ్‌గా అయిపోయేడు. ''అయాం సారీ సుమిత్రా. నిన్ను అవస్థ పెడుతున్నాను. ప్రభుత్వం వాళ్లు దిగిరావడం లేదు. మంత్రి కొడుకు కదా మహా అయితే నాలుగు రోజుల్లో సెటిలయిపోతుందనుకున్నాము. కానీ మా అంచనాలు తారుమారయ్యేయి. ఇప్పుడు అతన్ని వేరేచోటికి మారుద్దామన్నా వీలుపడని పరిస్థితులేర్పడ్డాయి. భూషణ్‌ తండ్రి అతన్ని విడిచిపెట్టమని గవర్నమెంట్‌పై ఒత్తిడి తేవడమే లేదు. కొడుకుకన్న దేశం ముఖ్యం అంటున్నాడు. అతను ఇంత బండరాయి అనుకోలేదు.''

''పోన్లే, బండరాయితో వ్యవహరించడం ఎంత కష్టమో నీకిప్పటికైనా తెలిసొచ్చింది కదా!''

''కోపం తెచ్చుకోకు. జాగ్రత్తగా వుండమని చెప్పడానికే పిలిపించాను. వాళ్లు పోలీసుల్ని పంపి ఊరంతా గాలిస్తున్నారు. ఏ మాత్రం అనుమానం వున్నా కాల్చేయమని ఉత్తర్వులున్నాయి. నిన్ను అనవసరంగా దీంట్లోకి దింపేను. పైగా జ్వరం కూడాను.''

తర్వాతి నాలుగురోజులూ ఆశ, నిరాశల మధ్య గడిచేయి. ప్రభుత్వానికి కొన్ని క్లూలు దొరికేయని ప్రకటన  వచ్చినప్పుడల్లా భూషణ్‌ విడుదల అవుతాడన్న ఆశ, మేం విడిపోవలసి వస్తుందన్న నిరాశ. ప్రభుత్వం నిరాశపడ్డప్పుడు, మాకు సంతోషం - ఇంకా కొన్ని రోజులు కలిసి వుండవచ్చు కదాని. చివరికి షరతులకు లొంగే ఉద్దేశం లేదని ప్రధానమంత్రి ఖరాఖండీగా ప్రకటించినరోజు భూషణ్‌ కృంగిపోయేడు.

''దీని అర్థం - పోలీసులు నా ఆచూకీ కొంతవరకు తెలుసుకోగలిగేరన్నమాట. వాళ్లు నన్ను విడిపించే ప్రయత్నంలో కాల్పులు జరిపితే పోలీసు తుపాకీకో, లేక ఎల్లయ్య తుపాకీకో నువ్వో, నేనో లేక మనిద్దరమో బలికావడం ఖాయం.''

''నీ అంచనా కరెక్టనుకుంటాను. కిరాణా షాపు వాడు, మిల్కుబూత్‌వాడు రెండుమూడుసార్లు అడిగేరు - 'పనివాళ్లు రాకుండా మీరే వస్తున్నారేమని?' టెలిఫోన్‌ బూత్‌ ఆపరేటరు కూడా ఎగాదిగా చూస్తున్నాడు... పోనీ నువ్వు పారిపోతే?''

''నీకు మతుందా? నేను పారిపోతే ఏమవుతుందో తెలుసా? వేరెవరో కాదు, ప్రతాపే నిన్ను చంపేస్తాడు. వర్గశత్రువంటూ. అతను కాకపోతే అతని దళసభ్యులు మరొకరు...''

''అది నిజమే. అందుకే నేనూ నీతో వచ్చేస్తా!''

''డోన్ట్‌ బి క్రేజీ, ఒకవేళ నేను పారిపోయినా, మా ఇంటికెళ్లను. గుండెల్లో తడిలేని ఈ మనుషుల మధ్య మసలేకంటే దూరంగా ఏ కూలో నాలో చేసుకు బ్రతుకుతాను, ప్రాణభయం లేకుండా. మనిద్దరం పారిపోయి పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే వాళ్లకు ఈ భోగభాగ్యాలు కలుగుతాయనుకుంటున్నావా? అసలు ఇంత ఐశ్వర్యం, హోదా వదిలి నువ్వెందుకు రావాలి?'

''నీ కోసం! వెయిట్‌... నేను ఎమోషనల్‌గా కాదు, రేషనల్‌గానే మాట్లాడుతున్నాను. నిన్ను వేరెక్కడికీ వాళ్లు తరలించలేరు. నీ అంతట నువ్వు తప్పించుకుని పారిపోయినా ప్రతాప్‌ అనుమానం కొద్దీ నన్ను కాల్చేస్తాడు. ఒకవేళ పోలీసులు ప్రతాప్‌నే కాల్చేసి, నిన్ను విడిపించినా, నా పరువూ ప్రతిష్ఠా బజారుకెక్కుతాయి. నేనీ భోగభాగ్యాలకై ఎన్నడూ వెంపర్లాడలేదు. అవి వున్నంతకాలం వుంటాయి. లేకపోతే పీడాపోయింది. నాక్కావలసింది ఓ మనసున్న మనిషి, నువ్వు మగ కూలీవయితే నేను ఆడ కూలీ నవుతా, సరేనా?''

భూషణ్‌ సమాధానం ఏమీ చెప్పలేదు. వచ్చి గాఢంగా కౌగలించుకుని, అంతకంటె గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు... తర్వాత ప్లాన్‌ చెప్పాడు.

''బాగా చీకటిపడ్డాక నీ రిమోట్‌ కంట్రోల్‌తో ఎల్లయ్యను పిలు. నేను చాటునుంచి దెబ్బకొట్టి స్పృహ పోగొడతాను. వాణ్ని కారు డిక్కీలో వేసుకుని ఈ హిల్స్‌లోనే ఓ బండమీద పడేసి, మనం రైల్వేస్టేషన్‌కి వెళ్లిపోదాం. నార్తిండియాలో ఏదో ఊరికి వెళ్లి అజ్ఞాతంగా బతుకుదాం. కూలీ పని చెయ్యక్కర్లేదులే, చదువుకున్నవాళ్లం, ఏ ప్రైవేట్‌ కంపెనీలోనో పనిచేసి ఒకరికోసం మరొకరం బతుకుదాం.''

కానీ భూషణ్‌ కొట్టిన దెబ్బకి ఎల్లయ్య నేలకూలలేదు. వెనక్కి తిరిగి భూషణ్‌పై కలియబడ్డాడు. భూషణ్‌కి నేనూ సాయపడ్డాను. చివరికి ఎల్లయ్య తుపాకీ భూషణ్‌ చేత చిక్కింది కానీ కాల్చడానికి అతనికి చేతులు రావడం లేదు. 'ఒక మనిషి నిండు ప్రాణం తీయకూడదు' అన్న ఆలోచన కాబోలు. నాకు తెలుసు వీణ్ని చంపితే కానీ మేమిద్దరమూ ఒకటి కాలేమని. అందుకే అరిచేను ''భూషణ్‌, కాల్చెయ్‌, సందేహించకు'' అని... ఒక్కసారి నా కళ్లలోకి చూసి, మంత్రముగ్ధుడైనట్టు తక్షణం కాల్చేశాడు భూషణ్‌... నా వాడు, నా మనసెరిగినవాడు, నా సమక్షంలో అన్నిటినీ మరువగలిగినవాడు. (ఆంధ్రజ్యోతి వీక్లీ జులై 1996)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

mbsprasad@gmail.com