Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ కథలు- కాగితాల బొత్తి

సహోదర నగర్‌ పోలీసుస్టేషన్‌ రిపోర్టు నెం.1383/ 91 అని రాసివున్న కాగితాల బొత్తిని ఇన్‌స్పెక్టర్‌ రాజన్‌ చేతిలోకి తీసుకున్నాడు. రిపోర్టు యింకా తయారుకాలేదు. ఎవరో విలేఖరి అనేకమందితో యింటర్వ్యూలు టేపులో రికార్డు చేసి, అవన్నీ కాగితాల కెక్కించి గుదిగుచ్చి పెట్టుకున్నాడు. వాటి ఆధారంగా తన కథనాన్ని తయారుచేయాలని అతని ఉద్దేశంలా వుంది. 

xxxxxxxxxxxxxxxx

మొదటి కాగితం - ఇళ్ల బ్రోకరు రాజుతో ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు (రాజు వయస్సు 52 సంవత్సరాలు, పైజామా, కుర్తా, మాసిన గడ్డం, ఆదాయం నెలకు అయిదు వేలకు లోపు)

''అవునండి, రణసింహకు ఈ కాలనీ గురించి చెప్పిన బ్రోకర్ని నేనే. 'తన వెంట వచ్చిన వందల మంది శరణార్థులకు తలదాచుకొనేందుకు ఏదైనా చోటు చూపించమంటే ఈ సహోదర కాలనీ గురించి చెప్పి పైరవీలు చేసిపెట్టినవాణ్ణి నేనే. పోనీ పాపం అని సాయపడ్డాను. కానీ తర్వాత వాళ్ల గ్రూపుకీ రాజవేలు గ్రూపుకీ గొడవలొచ్చి దీన్ని కురుక్షేత్రం చేస్తారని ఎవరికి తెలుసండి? తెలిసుంటే ఈ మా స్థలంలో... మాదని ఎందుకన్నానంటే... చెప్తే నా వాలకం చూసి మీరు నమ్మకపోవచ్చు గానీ,  ఈ స్థలానికి హక్కుదార్లలో నేనూ ఒకణ్ణండి.

''అసలు విషయం ఏమిటంటే ఈ మొత్తం స్థలం సింహేంద్రనగరం జమీందారుగారిదండి. జమీందారీల రద్దులో ఇది గవర్నమెంటు లాగేసుకొంది. మిగిలిన ఆస్తంతా తనఖాలో ఉంది కాబట్టి  ఇది తనకు వదిలిపెట్టేయాలని ఆయన కోర్టుకెక్కాడు. ఎవరూ నమ్మలేదు కానీ అప్పటికే ఆయన చితికిపోయాడు పాపం. కారణమా? ఒకటేమిటండి - విలాసాలు, నమ్మకద్రోహులు, అప్పులవాళ్లు, తిరగబడిన రైతులు, వకీళ్లే తినేసేరనుకోండి, ఈ కేసు పేరు చెప్పి ! పోతూ పోతూ ఆయన భార్యలకూ, స్నేహితురాళ్లకూ, మేనల్లుళ్లకూ, విశ్వాసపాత్రులైన పనివాళ్లకూ అందరకూ విల్లులో వాటాలు వేసి పోయాడు. ఆ వారసుల్లో నేనూ ఒకణ్ణి. ఈ మహానగరంలో నడిబొడ్డున ఉన్న ఇంతపెద్ద జాగాలో కొంతభాగం వచ్చినా కలిసి వచ్చినట్టే కదాని మిగిలిన వాళ్లందరితో చేతులు కలిపి వ్యాజ్యం కొనసాగించాను. కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లేసరికి ఉన్న కొద్దిపాటి ఆస్తి కరిగిపోయింది.

ఈలోపున అలగా జనం వచ్చి గుడిసెలు వేసేసుకొన్నారు. 'కేసు తేలనీ, వాళ్లని లేవగొట్టేద్దామ'ని అనుకొంటూండగానే దయానిధి ముఖ్యమంత్రిగా వచ్చి స్థలాలు ఆక్రమించుకొన్న వాళ్లందరికీ వాటి మీద హక్కు లిచ్చేసి మా కొంపదీశాడు. 'ఖాళీ స్థలంగా ఉంటే ఎప్పటికైనా మాకొచ్చే ఛాన్సుంది కానీ ఇళ్లు కట్టడంతో మా కేసు బలహీన పడిపోయిందని' నాకు అప్పులిచ్చిన వాళ్లందరికీ అనుమానం వచ్చి ఉన్నదంతా లాక్కుపోయి నన్ను బజారుపాలు చేశారు. ఇదిగో, ఈ బ్రోకరు పని చేస్తూనే ఎప్పటికైనా కేసు గెలవపోతుందా, దశ తిరగకపోతుందాని ఆశగా ఉన్నానండి.''

xxxxxxxxxxxxxxx

రెండో కాగితం - సహోదరనగర్‌ కాలనీ వాసుల సమాఖ్య అధ్యక్షుడు శ్రీ వెంకటయ్యతో ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు (వెంకటయ్య, వయస్సు 58 సంవత్సరాలు, మధ్యతరగతికి ఎగబాకుతున్న చిల్లరకొట్టు వ్యాపారి, ఆదాయం నెలకు వెయ్యి రూపాయల వరకు)

ఈ ఊరు వచ్చిన కొత్తలో మేమంతా - ఓ నాలుగు వందల మందిమి ఉంటామండి. పోరంబోకు భూమి కదాని అక్కడ గుడిసెలు ఏసుకొన్నామండి. అది రాజాగారి దంటారా? రాజాగారిదో, రాణీ గారిదో పొట్ట చేత్తో బట్టుకొచ్చినోళ్లం పోయి దస్తావేజులు చూశామా? ముందు టెంపరవరీగా గుడిసెలు ఏసి చూశాం. నెల్లాళ్లయినా ఎవడూ వచ్చి అడక్కపోయేసరికి మట్టితో గోడల్లేపేశాం.

''అప్పట్లో కార్పొరేషన్‌ ఎన్నిక లొచ్చాయి చూడండి. మాకు మొదటి నుంచీ సాయం చేసినోళ్లు కదాని మా బస్తీ వోళ్లమంతా దయానిధిగారి పార్టీకే ఓట్లు ఏశామండి. కానీ కరుణాకరం పార్టీ వోళ్లు నెగ్గి కసికొద్దీ 'మురికివాడల నిర్మూలనం' అంటూ మా బస్తీ అంతా పెళ్లగించేశారు. మాకంటె అధ్వాన్నంగా ఉన్న వాటిని కూడా ఆళ్లకి ఓట్లేశారని అంటుకోలేదు. పాపం ఊరికే పోద్దా? ఆ ఎంబడే ఒచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో కరుణాకరం పార్టీ ఓడిపోయి దయానిధి పార్టీ నెగ్గింది. దాంతో ఆయన మాలాటి వోళ్ల కోసం 'మురికివాడ నివాసుల పునరావాసం' అని ఓ పథకం పెట్టారండి. దాని ప్రకారం మా అందరికీ - అంటే ఆయన పదవిలోకి ఒచ్చిన రోజున ఎవళ్లయితే ఎక్కడెక్కడ ఉంటున్నారో ఆళ్లందరికీ అన్నమాట - ఆ జాగా మీద హక్కులు దఖలు పరిచేశారండి. మేం హవుసింగ్‌ బోర్డు వాళ్లతో ఒప్పందం కుదుర్చుకొని డబ్బు కడితే ఆళ్లు మాకు ఇళ్లు కట్టి పెడతారన్నమాట.

''ఇక మాకు మంచిరోజులొచ్చాయనుకొన్నాం గానీ సవాలచ్చ గొడవలొచ్చిపడ్డాయి. పెతీవోడూ - తర్వాత గుడిసెలు ఏసుకొన్నోడు గూడా 'మొదటినుంచే ఉంటున్నాం, ఇళ్లు కట్టివ్వండని మొదలెట్టారు. మా స్థలంలో కూడా - మంచి డిమాండు ఉంది కదా - దయానిధి గారి పార్టీ కార్యకర్తలు మూడొందల మంది పై వాళ్లని ఈ స్కీములో చేర్పించేశారు. మొదటి నుంచీ ఉన్నవాళ్లం. మేమేం అనగలమండి? నోరు మూసుకొన్నాం - గట్టిగా అడిగితే మనపేరే కొట్టేస్తారేమోనని. ఈళ్ల లిస్టు ఇలా పెరిగిపోడంతో విడివిడి ఇళ్లు కట్టిస్తామన్న హవుసింగు బోర్డు వాళ్లు ప్లాట్లు మాత్రం కట్టిస్తానన్నారు. అది మావాళ్లకు - ఒరిజినల్‌గా ఉన్నోళ్లకు - నచ్చలేదు. తర్జనభర్జనలు పడి సరేనని కాగితాల మీద సంతకాలు పెట్టి ఇచ్చేసరికి ఈ లోపుల కేంద్ర ప్రభుత్వం వాళ్లు ఏదో మిషపెట్టి దయానిధిగారి మినిస్ట్రీని రద్దు చేసిపడేశారు. రాష్ట్రపతి పాలనలో అధికారులు 'ఇయన్నీ జనాల్ని ఆకర్షించే పథకాలు; డబ్బు వేస్టు' అంటూ తొక్కిపెట్టేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్లీ కరుణాకరం గెలిచాడు. ఈ స్కీము అమలుపరిస్తే అందరికీ దయానిధి గుర్తుకొస్తాడని చెప్పి దీన్ని సోదిలోకి లేకుండా చేసేశాడు.

''మాకు స్థలమూ పోయింది. హవుసింగు బోర్డుకి కట్టిన డబ్బూ ఇరుక్కుపోయింది. అంతా కలిసి కోర్టులో కేసు వేశాం. మూడేళ్లు పోయాక కోర్టు వాళ్లు 'మీరూ, మీరూ బయటే ఒప్పందం చేసుకోకూడదా' అంటే హవుసింగుబోర్డు ముందు ఒప్పుకొన్న రేటుకి మూడురెట్లు ఇస్తేగానీ ఇళ్లు కట్టలేము అన్నారు. 'ఈ కొత్త రేటుకి ఒప్పుకోవాలా? వద్దా' అన్న దాని మీద అందరూ కొట్టుకుచచ్చారు. ఎందుకంటే ఈ పదేళ్లలో భగవంతుడి దయవల్ల కొంతమంది బాగుపడ్డారు. కొంతమంది బినామీ వాళ్లు చేరారు. వీళ్లందరికీ కొంత ఎక్కువ పడేసయినా తొరగా ఇల్లు తీసుకొందాం అని ఉంది. కొంతమంది బాగా బికార్లయి పోయారు. - 'ఎప్పటికో అప్పటికి ఇళ్లు ఇవ్వకఛస్తారా?' అని బిగుసుక్కూచున్నారు. ఎవళ్లకి వాళ్లే అరడజను సంఘాలు పెట్టుకున్నారు. అంతలో కరుణాకరం పాతస్కీము పేరు మార్చి ఇంకో స్కీముగా ఇదే మొదలు పెట్టేసరికి అందరికీ ఆశపుట్టింది. అన్ని సంఘాలూ సమాఖ్యగా ఏర్పడి నన్ను ఛైర్మన్‌గా ఎన్నుకొన్నారండి. 

''ఆ తర్వాత అనేక రాద్దాంత సిద్ధాంతాలయ్యి మేం అంతా డబ్బు కట్టి హవుసింగు బోర్డు వాళ్లతో ఒప్పందానికి వచ్చాము. కాని ఆళ్లు ఏం చేశారనుకొన్నారు? అదేదో కొత్త మోడల్‌ట. 'రేడియల్‌ హవుసెస్‌- నా తలకాయ -రౌండ్‌ రౌండ్‌గా పావురాయి గూళ్లలా కట్టేశారు. అలాటి ఇళ్లలో ఉంటే మాకు నామర్దాగా ఉండదూ? మేం ఆ ఇళ్లలో చేరమని తెగేసి చెప్పాం. మీరు తీసుకోకపోతే ఇంకొకళ్లకి ఎలాట్‌ చేసేస్తామంటారు వాళ్లు. ఏం చేస్తాం? కోర్టుకెళ్లి స్టే తెచ్చుకొన్నాం. నాలుగేళ్లగా కేసు నడుస్తోంది.

''ఆ ఇళ్లు పడగొట్టి కొత్తగా మంచి ఇళ్లు కట్టివ్వమని కోర్డు ఆర్డరు వేస్తుంది కదాని ఆశగా మేమంతా ఎదురుచూస్తుంటే, ఈ సిళమా దేశపు శరణార్థులు వొచ్చిపడ్డారు. ఇంకెక్కడా చోటులేనట్టు గవర్నమెంటు వాళ్లు వాళ్లని మా ఇళ్లలో ఉండమన్నారు. 'వీళ్లు వచ్చి ఇళ్లు తగలెట్టేస్తున్నార్రా' అనుకొంటూంటే ఇంకో గ్రూపు వచ్చి వాళ్లూ ఆక్రమించారు. పైగా ఇద్దరూ ఒకళ్లతో ఒకళ్లు పోట్లాటలు కూడానూ. పోనీ ఏవో ఒక ఇళ్లు, రేడియల్‌వో, మరోటో తీసేసుకొందామనిపిస్తోంది మాలోకొంతమందికి. కానీ ఈ శనిగాళ్లు తిష్ట వేసుక్కూచున్నారు. ఎప్పుడు పోతారో ఏమిటో! అయినా నాకు తెలీక అడుగుతాను - మనోళ్లకే తిండి పెట్టలేక పోతూంటే శరణార్థులేటండీ? ఆళ్లకి ఇళ్లూ వాకిళ్లూ ఇచ్చి మేపడమేమిటి? ఆళ్లు ఒకప్పుడు మనవాళ్లే అయితే మాత్రం? మన్ని కాదనుకొనే దేశం ఇడిచి ఎళ్లారు కదా! అక్కడ ఆళ్లు తంతే, అప్పుడు మనం గుర్తుకొచ్చామా? ఏటండీ న్యాయం?''

xxxxxxxxxxxxxxxxx

మూడో కాగితం - 'సిళమా అసలు శరణార్థుల సంఘం నాయకుడు రాజవేలుతో ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలు (రాజవేలు, వయస్సు 55 సంవత్సరాలు, వృత్తి లీడరుగిరీ, ఫర్వాలేదనిపించే జీవనస్థాయి, తెలుగు పట్టిపట్టి స్వచ్ఛంగా మాట్లాడతాడు)

''మా సంఘం పేరు గురించా? ముందు 'శరణార్థుల సంఘం' అనే ఉండేదండి. కానీ ఈ రణసింహ గ్రూపువాళ్లు వచ్చిన దగ్గర్నుంచి ప్రజలు కన్‌ఫ్యూజ్‌ అయిపోతున్నారని - అదే.. సరిగ్గా అవగతం చేసుకోలేకపోతున్నారని - 'అసలు శరణార్థుల సంఘం' అని మార్పించామండి. రణసింహ గ్రూపువాళ్లు అసలు శరణార్థులే కారండి. మామూలు ప్రజలకి వివరాలు తెలీవు. కానీ మీబోటి వాళ్లకు తెలుసు కదా!...

''సిళమా దేశానికి, మన దేశానికి శతాబ్దాలుగా సంబంధ బాంధవ్యాలున్నాయి. కానీ మూడు వందల ఏళ్ల క్రితం మా పూర్వీకులు పనివారిగా వలస వెళ్లడంతోనే అక్కడ మనవారి స్థిరనివాసం ఆరంభమయింది. అంటే మనదేశం మీద మమకారం లేకకాదు వెళ్లింది. ఇక్కడ గడవక పొట్ట చేత్తో  పట్టుకొని వెళ్లాం, మూడేళ్ల క్రితం సిళమా దేశం మీద పొరుగుదేశం దాడి చేసి సరిహద్దుల్లో ఉన్న మమ్మల్ని దోచుకుంటున్నప్పుడు. ప్రాణాలు చేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చాం.  కూలీలుగానే వెళ్లాం, ఇంచుమించు కూలీలుగానే తిరిగివచ్చాం.

''కానీ, రణసింహ గ్రూపు వాళ్లు అలాక్కాదు. వాళ్లు సిళమాకి వచ్చి ఏభై ఏళ్లే అయింది. అదీ వ్యాపారస్తులుగా బాగా సంపాదించాక రాజకీయ అధికారం కోసం ప్రాకులాడి మనవాళ్లను సిళమా వాళ్లపైకి రెచ్చగొట్టి వాళ్లలో మనపై ద్వేషం పెంచారు. అంతర్యుద్ధం లేపి, క్రితం ఏడాది పారిపోయి వచ్చారు. అదీ పూర్తిగా కాదు ఇక్కడో కాలు, అక్కడో కాలు. ఇక్కడ నుంచి సిళమా వాళ్లపై యుద్ధం చేస్తారంట! అసలు వాళ్లకి ఇక్కడ ఆశ్రయం ఇవ్వడమే తప్పు.

''మాకు కరుణాకరం గారు ఆశ్రయం ఇచ్చినది మా ఓట్ల కోసం అనడం పొరపాటండి. మేమే కృతజ్ఞతా పూర్వకంగా ఆయన పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాం. మాకు ఉండడానికి చోటు ఎవరిస్తారు చెప్పండి? ఎవరికీ అక్కర్లేని ఈ ఇళ్లు చూపించి ఉండమన్నారు, ఉన్నాం. స్థానికులతో తగాదాలకు పోకుండా సర్దుకుపోతున్నాం. మా వాళ్లు ఓ కిళ్లీ కొట్టు పెట్టుకొంటామంటే, అక్కడ ముందే వున్న వ్యాపారస్థులు తన్నిస్తారు; తక్కువ కూలీకైనా పనికి పోదామంటే, మా కారణంగా కూలీ రేట్లు పడిపోతున్నాయని స్థానిక కూలీలకి మంట. గవర్నమెంటు మాకు దోచిపెడుతుందనీ, దానివల్లే ధరలు పెరిగిపోతున్నాయనీ ప్రజలకు మాపై రోత. అన్నీ తట్టుకు నిలబడుతున్నాం. ఎందుకు? ఇది మాకు జీవన్మరణ సమస్య కాబట్టి, మాకు వేరే దిక్కులేకపోయినా నిజాయితీగా కష్టపడి బతుకుతున్నాం కానీ రణసింహ ఆరోపించినట్లు చిల్లర నేరాలు చేసుకొని కాదు.

''వెంకటయ్యగారూ వాళ్లూ కేసుగెల్చి ఇళ్లు ఖాళీ చెయ్యమంటే ఏం చెయ్యాలిరా భగవంతుడా' అనుకొంటూంటే మధ్యలో రణసింహ గ్రూపు మనుషులు వచ్చిపడ్డారు. వాళ్లు బ్రోకరు రాజుగాడి ద్వారా హోం మినిష్టరుని పట్టుకొని డబ్బులు తినిపించేశారు. దానితో మమ్మల్ని ఏభై ఇళ్లు ఖాళీ చేసి వాళ్లకి అప్పగించమని ఆర్డరు వేయించేరు. కరుణాకరం గారి దగ్గరికెళ్లి మొరపెట్టుకొన్నాం. ఆయన మంచోడే. కానీ ఆ హోం మినిష్టరు మహాలంచగొండి. రాబోయే ఎలక్షన్లకి డబ్బు కావద్దా? అంటాడు. ఒచ్చే నెలలో ఇంకా రెండు వందలమంది శరణార్థులు వస్తారట. వాళ్లకోసం ఇంకా ఎన్ని ఇళ్లు ఇమ్మంటారో! 'ప్రాణాలైనా ఇస్తాం కానీ ఇళ్లు వదలమంటున్నారు' మావాళ్లు. సిళమా దేశంలో స్వంత ఇళ్లు పోగొట్టుకొన్నాం. కనీసం ఇక్కడ దొరికిన ఈ నీడనైనా కాపాడుకోవాలని మేం తాపత్రయపడితే తప్పంటారా?''

xxxxxxxxxxxxxxxxx

నాలుగో కాగితం - సిళమా శరణార్థుల అభ్యున్నతి సంఘం నాయకుడు రణసింహతో ఇంటర్వ్యూలోని కొన్ని అంశాలు: (రణసింహ, వయస్సు 30 సం.లు, ధనికుడు, సిళమా దేశంలోనూ, భారతదేశంలోనూ వ్యాపారాలున్నాయి. అహంభావం కొట్టవచ్చినట్లు కనబడుతుంది.)

''నేను ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? మీకు తెలిసే ఉంటుంది. ఏభయి సంవత్సరాల క్రితం మా నాన్నగారి తరం వాళ్లు సిళమా దేశానికి వలస వెళ్లి అక్కడ 'ఎకానమీ' పెరుగుదలకి ఎంతో దోహదం చేశారు. అంతకుముందు వెళ్లిన మనవాళ్లంతా వట్టి అలగా జనం కావడం వల్ల మనవాళ్లంటే సిళమా వాళ్లకి చాలా చులకనగా ఉండేది. మా వాళ్లు వెళ్లిన తర్వాతనే మన సత్తా ఏమిటో వాళ్లకి తెలిసివచ్చింది. మనవాళ్ల హక్కుల కోసం మేం పదేళ్లుగా చేస్తున్న పోరాటం పక్వదశకి వచ్చింది. ఇంతలో అక్కడ యుద్ధం రావడం, రాజవేలు గ్రూపువాళ్లు పిరికి పందల్లా పారిపోయి రావడంతో మనవాళ్లంటే వాళ్లకి అలుసైపోయింది. కానీ, డోంట్‌వర్రీ, మా పోరాటం ఇంకొక్క ఆర్నెల్లు మాత్రమే. ఆ తర్వాత ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంతా గుప్పిట్లో ఉంటుంది.

''మేం శరణార్థులుగా వచ్చినది బికారుల్లా కాదు. పోరాటంలో అలిసిపోయి తల్లి ఒడిలో సేద దీర్చుకోడానికి వచ్చినట్టన్నమాట. మళ్లీ బలం పుంజుకొని యుద్ధం సాగిస్తున్నాం. మాకు సహకారం అందించడం ఈ దేశ పౌరుల బాధ్యత. రాజవేలు గ్రూపు వాళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాళ్లకు వాళ్ల పొట్ట తప్ప మరే విషయం పట్టదు. విలువైన మా కాలం వాళ్లతో తగాదాల్లో వ్యర్థం అయిపోతోంది. ముందు వాళ్లను కంట్రోల్లో పెడితేకానీ మా లక్ష్యసాధన సాఫీగా సాగదు; ఈలోగా మీ పత్రిక ద్వారా మా శరణార్థుల గ్రూపు ఆశయాలు తెలియపరచి, మేం రాజవేలు గ్రూపులాటి 'పారసైట్‌'లు కాదని పాఠకులకు వివరిస్తారని ఆశిస్తున్నాను.

''ఇంకొక్క విషయం కూడా - రాజవేలు మనుష్యులు ఆరోపిస్తున్నట్లు ఇటీవల జరుగుతున్న బాంకు దోపిడీలు, కిడ్నాప్‌లతో మాకేమీ సంబంధం లేదు. మా విప్లవానికి కావలసిన నిధులు మా వద్ద ఉన్నాయని సవినయంగానే ప్రకటిస్తున్నాం''.

xxxxxxxxxxxxxxxxxx

ఐదో కాగితం - నహోదరనగర్‌ కాలనీకి ఎదురుగా ఉన్న సఖ్యతానగర్‌ నివాసుల సంఘం ప్రెసిడెంటు నీలకంఠశాస్త్రితో ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు: (నీలకంఠశాస్త్రి, 65 సం||లు, రిటైర్డు టీచర్‌, లిటిగెంటు)

''నహోదరనగర్‌ కాలనీ గురించి ఏం చెప్పమంటారు బాబూ, ఒక గొడవా? ఒక గందరగోళమా? అది ఖాళీ స్థలంగా ఉన్నంతకాలం చుట్టుపక్కల జనమంతా దాన్ని బహిర్భూమిగా వాడేవారు. దీన్ని ఆపించండి మహాప్రభో అని అర్జీలు పెట్టుకొంటే, అలగా జనానికి దాన్ని అప్పగించేశారు. వాళ్లు పరిసరాలన్నీ మురికి చేసి మా అందరికీ మలేరియాలూ, ఫైలేరియాలూ తెచ్చిపెట్టేరు. దాని గురించి మళ్లీ మొత్తుకోగా ఇళ్లు కడతామంటూ ఉన్నవన్నీ పీకేశారు. ఓ కాంపౌండువాలు మాత్రం కట్టి వదిలేశారు. ఇక తాగి తందనాలాడేవాళ్లు, చాటుమాటు సరసాల వాళ్లు, జూదర్లు అందరూ అక్కడే చేరారు.

''ఆ తర్వాత ఇళ్లు కట్టాక కూడా ఎవరూ 'ఆక్యుపై' చేయకపోవడంతో బహిరంగంగానే వ్యభిచారం, జూదం సాగింది. ఆ తర్వాత 'రిఫ్యూజీ గాళ్లు' వచ్చి పడ్డారు. ఇంకెక్కడా చోటు దొరకనట్టు గవర్నమెంటు వాళ్లు, వాళ్లని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. వీళ్లు దేనికైనా తెగించే రకం; పోగొట్టుకోడానికి ఒకటంటూ ఏదీలేని వాళ్లు 'లోకల్‌' వాళ్లతో అన్నిట్లోనూ పోటీపడి, పోట్లాడి తమ స్థానాన్ని పదిలం చేసుకొన్నారు. 'దొంగలూ, దొంగలూ ఊళ్లు పంచుకొన్నారన్నట్లు' ముందే ఉన్న చిల్లర నేరస్తులూ, వీళ్లూ కలిసి ఇక్కడో పెద్ద 'అండర్‌ వరల్డ్‌్‌' తయారుచేశారు. వీళ్లకంటె ఆ వెంకటయ్య తాలూకు వాళ్లే 'బెటర'ని - వాళ్ల పరిస్థితి ఇప్పుడు బాగుపడిందిలెండి. శుభ్రం నేర్పారు. వాళ్ల దగ్గరకెళ్లి మాట్లాడేం - 'మీరే వచ్చి ఇళ్లు ఆక్రమించకూడదా'ని. వీళ్లంత ధైర్యం వాళ్లకు లేదు. బతుకు బాగుచేసుకొందామనే వాళ్ల తాపత్రయం - మరి వీళ్లో! బతుకే ప్రశ్నార్థకం వీళ్లకి. వీళ్లకున్న 'విల్‌ పవర్‌' వాళ్లకెక్కడ ఏడ్చింది? వీళ్ల ధాటికి వాళ్లు ఆగలేకపోయారు. 

''ఇంతలో గుడినీ, గుడిలో లింగాన్నీ రెండిట్నీ మింగేవాళ్లు వచ్చిపడ్డారు - అదే రణసింహ గ్రూపు వాళ్లు. వాళ్లు ముందునుంచీ స్థితిపరులే. ఇప్పుడు విప్లవం పేరుతో ఆయుధాలు ఇక్కడ పోగేసి సిళమా దేశాన్ని లోబరుచుకోవాలని చూస్తున్నారు. ఈ కాలనీనిని బాంబుల ఫ్యాక్టరీగా మార్చిపడేశారు. వాటిలో ఎన్ని సిళమా దేశంపై ప్రయోగిస్తున్నారో, ఎన్ని రాజవేలు వాళ్లమీద ప్రయోగిస్తున్నారో దేవుడికే తెలియాలి. వాళ్ల పథకాలకి ఈ రాజవేలు ముఠాగాళ్లు అడ్డుపుల్లలాటి వాళ్లు. నిజానికి వాళ్లకూ, వీళ్లకూ ఎప్పుడూ వర్గవైరమే!

''అసలు హక్కుదార్ల కన్నా వీళ్లు ఆ ఇళ్లకోసం చచ్చేట్లు కొట్టుకుంటున్నారు. రాజవేలు గాడు వీళ్లకి ఒక్క ఇల్లయినా ఇవ్వనంటాడు - అది వాడి సొత్తయినట్లు. రణసింహగాడు వీళ్లందరినీ చంపిపారేసేనా ఇళ్లు ఆక్రమిస్తానంటాడు. గవర్నమెంటు వాళ్లకి ఒకళ్ల ఓట్లు కావాలి; మరొకరి నోట్లు కావాలి. అందుచేత కిమ్మనకుండా ఉన్నారు. ఇక వీళ్లు రోజూ కొట్టుకోడమే! కత్తులూ, సైకిలు చైన్లే కాదు, నాటు బాంబులు కూడాను. ఇక ప్రజలను తమవైపు తిప్పుకోడానికి పత్రికల ద్వారా యుద్ధం కూడాను. రాజవేలు మనుషులు చిల్లర నేరాలు చేస్తారనీ, సిళమా దేశంలోనే జైల్లో పెట్టబోతే పారిపోయి వచ్చారనీ, అసలు వీళ్లు తెలుగువాళ్లే కాదనీ, లోకల్‌గా అందర్నీ చెడగొడుతున్నారనీ రణసింహ ఆరోపణ. రణసింహ తాలూకు వాళ్లు పెట్టుబడిదారులనీ, బాంకు దోపిడీలు, స్మగ్లింగ్‌, కిడ్నాపులూ చేసి డబ్బు సంపాదించి కిరాయి సైనికులతో సిళమా దేశంతో యుద్ధం చేసి రెండు దేశాల సత్సంబంధాలన్నీ చెడగొడుతున్నారనీ వీళ్ల ఆరోపణ.

''వీటివల్ల జరిగిన మేలు ఏదైనా ఉందా అంటే ఇదంతా మీ పత్రికల దృష్టికి రావడం ఒకటి. అది ఖాళీ స్థలంగా ఉన్న దగ్గర్నుంచి ఇప్పటిదాకా ఈ గొడవల గురించి ఎన్నిసార్లు గవర్నమెంటు ఆఫీసుల చుట్టూరా తిరిగామో, ఎన్ని పత్రికలకు రాశామో లెక్కలేదు. అప్పుడు మా గోడు విన్నవాళ్లు లేరు. ఇప్పుడు మీ అంతట మీరే మా గుమ్మంలోకి వచ్చి అడుగుతున్నారు. అదీ విశేషం! పత్రికల్లో ఇవన్నీ రాసి చూడండి. ఏమవుతుందో చూద్దాం!''

xxxxxxxxxxxxxxx

ఆఖరి కాగితం స్టేషన్‌ స్టాఫ్‌ రాసినది -

..... మే నెల 5వ తారీకున నహోదరనగర్‌లో బాంబులు తయారుచేస్తున్న ఇళ్లలో ఒక దాంట్లో ప్రమాదవశాత్తూ ప్రేలుడు జరిగి అక్కడ ఇళ్లన్నీ సమూలంగా నాశనమైన విషయం ఇంతకుముందే నోట్‌ చేయడమైనది. అక్కడ దొరికిన అనేక శవాలలో ఒక శవం 'తెలుగు తేజం' పత్రికా విలేఖరి ఎల్‌.సుదర్శన్‌దిగా గుర్తింపబడింది. అతని భుజానికి తగిలించి ఉన్న సంచీలో దొరికిన పై కాగితాల బొత్తిని 'తెలుగు తేజం' అధిపతుల అభ్యర్థన మేరకు వారికి అందజేయడం జరిగిందని గమనించవలసినది....''

(ఆంధ్రప్రభ వీక్లీ నవంబరు 1994)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

mbsprasad@gmail.com