Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ కథ - నాజూకు వన్నెలాడి

''వినీలా, మా ఫ్రెండ్‌ వికాస్‌, నాతో బాటే ఎంబిఏ చేశాడు కానీ పోయిపోయి జిమ్‌ పెట్టుకున్నాడు, యూస్‌లెస్‌ ఫెలో'' కాబోయే భార్యకు పరిచయం చేశాడు మదన్‌.

''కంగ్రాచ్యులేషన్స్‌ ఫర్‌ గెటింగ్‌ ఎంగేజ్‌డ్‌ టు యీక్వల్లీ యూస్‌లెస్‌ ఫెలో లైక్‌ మదన్‌'' అంటూ చేయి కలిపి షేక్‌హ్యాండ్‌ యిచ్చాడు వికాస్‌. 

ముగ్గురూ ఫక్కుమని నవ్వారు. బొకే అందుకుంటూ వినీల వికాస్‌ను పరికించి చూసింది. తన ఫియాన్సీ మదన్‌లాగే పొడుగ్గా, చక్కటి శరీరసౌష్టవంతో వున్నాడు. అతని కంటె ఫీచర్స్‌ బాగున్నాయి. పైగా నవ్వు మొహం. ఫోటోగ్రాఫర్‌ ఫోటోలు తీస్తూంటే ''మీ జిమ్‌ ఎక్కడుంది?'' అడిగింది పలకరింపుగా.

''సినిమా యాక్టర్‌ నాగార్జున యింటి పక్క వీధిలో.. 'జిమ్‌ అండ్‌ ట్రిమ్‌' అని..''

''ఓహ్‌, మా యింటికి దగ్గర్లోనే అన్నమాట..''

''అవును. మదన్‌కి తెలుసు. ఈ సారి వాడు బెంగుళూరు నుంచి వచ్చినపుడు వాడితో కలిసి రండి.'' అంటూ వేదిక దిగివెళ్లాడు. 

**********

మర్నాడు ఎయిర్‌పోర్టులో వికాస్‌ ప్రస్తావన తెచ్చాడు, మదన్‌. ''వినీలా, నువ్వోసారి వికాస్‌ జిమ్‌కి వెళ్లు.'' అని. ఆమె ప్రశ్నార్థకంగా కళ్లెగరేయడంతో నిదానంగా చెప్పాడు-''నువ్వు అందంగా వుంటావని ఒప్పుకుంటా కానీ కాస్త వెయిట్‌ తగ్గించి మంచి ఫిగర్‌ తెచ్చుకుంటే యింకా బాగుంటావు కదా. వికాస్‌కి చెప్పా. తన జిమ్‌లో చేరు. పెళ్లినాటికి నాజూగ్గా తయారవుతావు.''

అతనెంత నాజూగ్గా చెప్పానని అనుకున్నా వినీల నొచ్చుకుంది. ''పెళ్లి చూపుల్లోనే చెప్పాను, నా శరీరతత్వమే యింత అని. మా యింట్లో వాళ్లందరినీ చూశావు కదా, చాలా ఏళ్లు డైటింగ్‌ చేశా, లాభం లేకపోయింది. నాలుగు నెలల్లో ఏదో అద్భుతం జరుగుతుందని నువ్వేమీ ఆశలు పెట్టుకోవద్దు.'' అంది తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో.

మదన్‌ నొచ్చుకున్నాడు. ''ఛ, ఛ. అది కాదు నా ఉద్దేశం. తగ్గితే ఆరోగ్యానికి కూడా మంచిది కదాని. పెళ్లయ్యాక ఎలాగూ ఒళ్లు వస్తుంది. మా వికాస్‌ దగ్గర కొత్తరకం ఎక్విప్‌మెంట్‌ వుంది. శ్రమ పడకుండానే ఎక్సెస్‌ ఫ్యాట్‌ తగ్గించగలనంటాడు. అందరినీ తనే స్వయంగా దగ్గరుండి చూసుకుంటాడు. ఓ సారి ప్రయత్నించి చూస్తే తప్పు లేదు కదాని...''

''నాకైతే యిష్టం లేదు. నువ్వు వెళ్లమంటే తప్పదు కదాని వెళ్లాలంతే..'' కాస్త నిష్టూరంగానే అంది వినీల. 

''నేను మళ్లీ మూడువారాల్లో వస్తాను. ఈ లోపున చేరి చూడు. ఆ పాటికి ఎలా వుందో చూసి వద్దనుకుంటే మానేద్దువుగాని..''

వినీల మొహం కాస్త విప్పారింది. ''అదే జరగబోతోంది. నీ ముచ్చట ఎందుకు కాదనాలి?''

నాలుగో రోజున వికాస్‌ ఫోన్‌ చేశాడు - ''మీరు వస్తారా? నన్ను వచ్చి తీసుకెళ్లమంటారా?'' అని. వినీల ఏమీ మాట్లాడకపోవడంతో ''మదన్‌ సంగతి మీకు తెలియదు. వాడి కోసమైనా నేను మిమ్మల్ని నాలుగురోజులు రప్పించి, ఏ వర్కవుట్స్‌ చేసినా ప్రయోజనం లేదని చెప్పాలి. లేకపోతే మా స్నేహం పోయేట్టుంది.'' 

వినీలకు ఒళ్లు మండింది. ''నా కోసం మీ స్నేహం చెడగొట్టుకోవడం దేనికి లెండి? రేపు వస్తాం.'' అని ఫోన్‌ పెట్టేసింది.

వినీలకంటె వినీల తల్లికి జిమ్‌ బాగా నచ్చింది. అక్కడంతమంది శ్రద్ధగా వ్యాయామం చేయడం చేసి ముచ్చటపడింది. అందరితోటీ వికాస్‌ వ్యవహరిస్తున్న తీరు కూడా ఆమెను మెప్పించింది. వికాస్‌ది హైదరాబాదుకి దగ్గర్లో వున్న టౌను. అన్నగారు వ్యవసాయం చేయిస్తున్నాడు. మంచి మార్కులతో ఎమ్‌బిఏ పాసయిన తమ్ముడు ఉద్యోగం చేయకుండా తన వాటా పొలాలు తాకట్టు పెట్టి జిమ్‌ పెట్టడం అతనికి నచ్చలేదు. అత్యాధునికమైన పరికరాలతో జూబిలీ హిల్స్‌ లాటి ధనికప్రాంతంలో  జిమ్‌ పెట్టి క్లయింట్లపై వ్యక్తిగతంగా శ్రద్ధ పెడితే నాలుగైదేళ్లలో బాగా ఆదాయం వచ్చి జీవితంలో స్థిరపడవచ్చని, అప్పుడు పెళ్లి చేసుకోవచ్చని వికాస్‌ అంచనా. పెట్టి రెండేళ్లయింది. పేరు వచ్చింది కానీ పెట్టుబడికి తగ్గ రాబడి లేదు. వేరే ఇన్‌స్ట్రక్టర్స్‌ని పెట్టుకునే స్తోమత లేక అన్నీ తనే చూసుకుంటున్నాడు. ఆడవాళ్లు పెద్దగా రావటం లేదు. ప్రత్యేకంగా లేడీ ట్రెయినర్‌్‌ని పెడితే రావచ్చు కానీ జీతం చాలా యివ్వాలి. రోజంతా జిమ్‌లోనే గడుపుతున్నాడు కానీ కిట్టుబాటు కావటం లేదు. ఇవన్నీ వినీల తల్లి అడిగిన మీదట కొద్దికొద్దిగా చెప్పాడు. 

''మా అమ్మాయి చేరితే తనను చూసి యింకో నలుగురు చేరతారేమోలే, అది ఎక్కడ పాదం మోపినా సిరి తాండవిస్తుంది. తను పుట్టాకనే మాకు కలిసి వచ్చింది.'' అందావిడ. వికాస్‌ చిరునవ్వు నవ్వి ఏదో అనబోతూండగా ఎవరో పిలిచారు. ఆవిడ వినీల కేసి చూసి ''ఏమో అనుకున్నాను కానీ, దీనిలో చేరి రోజూ కాస్సేపు కాళ్లూ చేతులూ ఆడిస్తే తప్పేమీ లేదే! మా కాలంలో అయితే పచ్చళ్లు నూరడాలు అవీ బోల్డన్ని పనులు చేసేవాళ్లం. అదే పెద్ద కసరత్తు. నువ్వు యింట్లో యిక్కడి వస్తువు తీసి అక్కడ పెట్టవు. ఒళ్లు అస్సలు వంచకపోతే రేపు పురుడూ పుణ్యం వస్తే కష్టం.''

వినీల రుసరుస లాడుతూ ఆవిడ స్థూలకాయం కేసి చూసి ''ఇవన్నీ నువ్వు చెప్పడం వింతగా వుంది.'' అంది.

ఆవిడకు కోపం వచ్చింది. ''ఇప్పుడైతే యిలా వున్నాను కానీ, పెళ్లికి సన్నగానే వుండేదాన్ని. మా కాలంలో పీజాలు, బర్గర్లు మెక్కేవాళ్లం కాదు.'' అంటూ చరచరా వెళ్లి కారులో కూర్చుంది. కారులోనే కాదు, యింటికెళ్లాక కూడా ఏమీ మాట్లాడలేదు.

***********

ఆ సాయంత్రం జిమ్‌ మూసేసే టైముకి ట్రాక్‌ సూట్‌లో వచ్చిన వినీలను చూసి వికాస్‌ ఆశ్చర్యపడ్డాడు. కానీ ఏమీ అనకుండా ట్రెడ్‌మిల్‌ వద్దకు తీసుకెళ్లి ఎలా చేయాలో చూపించాడు. పావుగంట చేసేసరికి విపరీతంగా చెమట పట్టింది. దిగిపోయి, ఆయాసపడుతూనే వికాస్‌ దగ్గరకు వచ్చి ''ఎంత యివ్వాలి?'' అని అడిగింది. ''ఫర్వాలేదు లెండి.'' అని అతను అంటే గొంతు పెంచి ''నెలకెంతో చెప్పండి. లేకపోతే నాలుగునెల్ల్ల క్రాష్‌ కోర్స్‌లో చేరమన్నాడా మీ ఫ్రెండ్‌?'' అని గద్దించింది. 

''మీరేం యివ్వనక్కరలేదండి. నేనూ మదనూ చూసుకుంటాం.'' అన్నాడతను మెల్లగా.

''ఏమిటి చూసుకునేది? ఎన్ని కేజీలు తగ్గానో చూసి అన్ని వేలిస్తాడా?'' అరిచింది వినీల. 

''అలా ఏం కాదండి. మీకు ఎక్సర్‌సైజ్‌ మీద యింట్రస్టు కలిగేట్లు చేయమన్నాడు. అంతే..'' జిమ్‌లో వున్న యిద్దరు ముగ్గురూ వింటారేమోనని బెదురుతూనే చెప్పాడు.

''ఇంట్రస్టనేది మనిషిలో పుట్టాలండి, బయటనుండి ఒత్తిడి చేస్తే కలగదు.'' అంటూ వినీల బయటకు వెళ్లిపోయింది. 

మర్నాడు పొద్దున్న ఏడు గంటలకే మళ్లీ కనబడేసరికి వికాస్‌కు యీ అమ్మాయిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. ఆమెకు కొన్ని ఎక్సర్‌సైజులు చెప్పి తక్కినవాళ్లపై దృష్టి సారించాడు. ఆమె కాస్సేపు చేస్తూ, కాస్సేపు రెస్టు తీసుకుంటూ గంటన్నర గడిపింది, వికాస్‌ ఒంటరిగా చిక్కుతాడేమోనని వేచి చూసి, చివరకు వెళ్లబోయే ముందు ఆఫీసురూములోకి పిలిచి చెప్పింది. ''మదన్‌ చేస్తున్నదానికి మధ్యలో మీ మీద అనవసరంగా అరిచాను. ఓపికున్నన్ని రోజులు వస్తాను. మానేస్తే మానేస్తాను. ఏం?'' 

''మీరు ఎప్పుడు వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా ఫర్వాలేదు. నాకు చేతనైనంత నేర్పుతాను. మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ వుంది. రెగ్యులర్‌గా చేస్తే మంచి షేప్‌ వస్తుంది. ఆ పైన మీ యిష్టం. చేరి మధ్యలో మానేసేవాళ్లు నాకేం కొత్తకాదు. అలాటి వాళ్ల వల్లనే వ్యాపారం యిలా యీసురోమంటోంది.'' వికాస్‌ తల ఎత్తకుండానే సమాధానం చెప్పి గదిలోంచి వెళ్లిపోయాడు.

వినీలకు జాలేసింది. మదన్‌నుంచి వికాస్‌కు డబ్బు యిప్పించడం కోసమైనా జిమ్‌ వెళ్లాలని నిశ్చయించుకుంది. పొద్దున్న, సాయంత్రం తోచనప్పుడల్లా వెళ్లసాగింది. వారం రోజులు పోయేసరికి ఆమెకు కూడా జిమ్‌ నచ్చింది. ఎక్సర్‌సైజ్‌ చేసేది తక్కువ, రెస్టు తీసుకోవడం ఎక్కువగా వున్నా శరీరం కాస్త తేలికగా అనిపించసాగింది. పైగా రెస్టు తీసుకుంటూ వికాస్‌ కేసి చూస్తూ వుండడం ఆమెకు ఒక హాబీగా మారింది. ఎవరినీ విసుక్కోకుండా, నవ్వుతూ చకచకా తిరుగుతూ వుండడం చాలా నచ్చింది. జిమ్‌కి వచ్చే కొందరు ఆడపిల్లలేకాక, మధ్యవయసు మహిళలు కూడా అతనంటే యిష్టపడడం, కావాలని అతని ఛాతీని, భుజాలను తాకడం చూసి నవ్వు వచ్చేది. అతను యివేమీ పట్టించుకోనట్టు వుండడం చూసి మనసులోనే మెచ్చుకుంది. జిమ్‌లో జనం తక్కువగా వుండేటప్పుడు అతన్ని పలకరించేది. అతను చిరునవ్వుతో క్లుప్తంగానే సమాధానాలు యిచ్చేవాడు. 

''మీరు ఎప్పుడు చూసినా హుషారుగా వుంటారు, మదన్‌ ఎప్పుడూ చికాకుగా వుంటాడు. ఇద్దరూ ఫ్రెండ్సెలా అయ్యారు?'' 

- ''వాడి ఉద్యోగంలో నేనుంటే నేనూ అలాగే వుండేవాణ్నేమో..'' 

''ఆ ఆంటీ మిమ్మల్ని చూసి వంకర్లు తిరిగిపోతూ వుంటే మీరేమో ఋష్యశృంగుళ్లా పోజు పెడతారేమిటి?'' 

- ''అలా వుండకపోతే ఆవిడ యింకా వంకర్లు తిరిగి వెయిట్స్‌ కాలిమీద పడేసుకుంటుంది. వాళ్లాయన వచ్చి నా మీద కేసు పడేస్తాడు''

''జిమ్‌లో చేరడానికి ముందు, తర్వాత.. అని యాడ్‌ యిస్తూంటారుగా! నా ఫోటో తీసుకుని వేస్తారా?'' 

- ''అలా చేస్తే మా ఆవిడ మోడలింగ్‌ చార్జీలంటూ మదన్‌ లక్షల ఫీజు వసూలు చేస్తాడు. నేను జిమ్‌ మూసుకోవాలి.''

**************

మదన్‌, యితను స్నేహితులే అయినా యిద్దరి స్వభావాల్లో చాలా తేడా వున్న విషయం వినీల గుర్తించింది. మదన్‌ డబ్బులో పుట్టి డబ్బులో పెరగడంచేత ప్రతీదీ లెక్కలేసి చూస్తాడు. తన మాట చెల్లాలనే పట్టుదల వున్నవాడు. ఇతను మధ్యతరగతివాడు. జిమ్‌ ఎలా నడుస్తుందాని ఓ పక్క చింత వున్నా కొందరు పేదవాళ్ల దగ్గర ఫీజు తీసుకోడు. కానీ తన ద్వారా యింకా కొందరు వచ్చి చేరితే బాగుంటుందని అనుకుంటున్నాడు, అన్నాడు కూడా. తను చెప్తే తన ఫ్రెండ్స్‌ అయిదారుగురు చేరతారు కూడా. కానీ చెప్పాలనిపించలేదు. ఎందుకు? పెళ్లికానివాళ్లు కాబట్టి తనకంటె యితనికి చేరువవుతారన్న ఆలోచన చేతనా? అయితే మాత్రం తనకేం? ఏమో! కారణం యితమిత్థంగా తట్టకపోయినా వినీల ఎవరికీ సిఫార్సు చేయలేదు. అయినా వాళ్ల అమ్మగారు చెప్పినట్టు ఆమె పాదం మంచిది. ఈ వారంలోనే ఎనిమిదిమంది ఆడవాళ్లు చేరారు. అందరూ కొంచెం యించుమించుగా తన సైజు వాళ్లే. భారీ ఫీజులిస్తున్నారు. 

వినీల ఉత్సాహం, మదన్‌ రాకతో జావకారిపోయింది. అతను ఆమెను చూస్తూనే ''అబ్బే, ఐ ఎక్స్‌పెక్టెడ్‌ ఎ లాట్‌. నాకేమీ తేడా కనబడటం లేదు. మా వికాస్‌గాడికి ఫీజు దక్కే యోగం లేనట్టుంది.'' అన్నాడు. 

వినీల మనస్సు చివుక్కుమంది. చివ్వున కోపమూ వచ్చింది. ''ఎంతేమిటి?'' అడిగింది. 

మదన్‌ చెప్పలేదు. ''ఎంతైతేనేం, యివ్వబోయేది లేనప్పుడు..'' అన్నాడు. 

''అయితే అదేదో నాకియ్యి, నీకా ఖర్చు మిగిల్చినందుకు..'' 

''ఎందుకు? దానితో మరో బండెడు ఐస్‌క్రీమ్‌లు తిందామనా?'' 

తింటున్న ఐస్‌క్రీమ్‌ని దూరంగా నెట్టేసింది వినీల. సీరియస్‌గా చూపుడువేలు వూపుతూ మదన్‌కి చెప్పింది - ''నేను ఒక్క అంగుళం తగ్గకపోయినా పెళ్లి చేసుకోవడానికి రెడీగా వుండు. నువ్వేదో కలలు కని, నీ కలలరాణిగా నన్ను చేద్దామని చూస్తే కుదరదు. నా డ్రీమ్‌బాయ్‌ నన్నిలాటి మాటలతో వేధించడు.'' 

మదన్‌ యింకో రెండు రోజులున్నా వాళ్ల మధ్య మాటలు సరిగ్గా సాగలేదు. వినీల అతనితో కలిసి షాపింగ్‌కు వెళ్లడం మానేసి కసికొద్దీ రోజంతా జిమ్‌లోనే గడిపింది. మదన్‌ జిమ్‌కు వచ్చాడు. వినీల వికాస్‌ను పిలిచి చెప్పింది - ''నేను చేస్తున్నానో లేదో చెకింగ్‌కు వచ్చినట్టున్నాడు. నా గురించి మీరేమైనా మాట్లాడుకున్నారో, నేను రేపణ్నుంచి జిమ్‌కు రాను.'' అని. 

వికాస్‌ ఏం చెప్పాడో ఏమో మదన్‌ వినీల దగ్గరకు రాకుండానే వెళ్లిపోయాడు. ఆ రాత్రి ఫోన్‌ చేసి సారీ చెప్పాడు. కక్ష సాధించిన ఆనందంలో వినీల మెత్తబడింది. మర్నాడు సెండాఫ్‌ యివ్వడానికి వెళ్లింది. 

ఎక్సర్‌సైజ్‌ చేయడం అనేది వినీలకు ఒక వ్యసనంగా మారిపోయింది. ఇంట్లో వుండేది తక్కువ, జిమ్‌లో వుండేది ఎక్కువ అయిపోయింది. మధ్యాహ్నం భోజనం అక్కడికే తెప్పించుకోసాగింది. వికాస్‌ హోటల్‌కు వెళ్తుంటే వద్దని తనతోబాటు తినమనేది. అతనికీ బిడియం తగ్గింది. ఇదివరకటి కంటె ఫ్రీగా వినీలను తాకగలుగుతున్నాడు. అది కూడా ఎక్సర్‌సైజులు చేసేటప్పుడే ! మొదట్లో అస్సలు ముట్టుకునేవాడు కాడు. సైకిలు తొక్కేటప్పుడు పెడల్‌ మిస్సయితే పడిపోకుండా సైకిలు పట్టుకునేవాడు. ''తక్కినవాళ్లను ఏ సంకోచమూ లేకుండా ముట్టుకుంటున్నారు. ఫ్రెండ్‌కు ఫియాన్సీ అయినందుకు నాకు యీ శిక్షా?'' అని అడిగేది వినీల. 

''తెలిసినవాళ్లతో  యిలాటివి యిబ్బందేనండి'' అనేవాడు వికాస్‌ నవ్వుతూ.

ఆ రోజు రాత్రి తొమ్మిది దాటింది. జిమ్‌ మూసేద్దామన్నా వినకుండా వినీల లెగ్‌ ఏరోబిక్స్‌ చేస్తానని పట్టుబట్టింది. వచ్చేవారం స్విమ్మింగ్‌ క్లాసుల్లో చేరుతుందట. తొడల మందం తగ్గకుండా స్విమ్మింగ్‌ డ్రెస్‌ వేసుకుంటే బాగుండదట. ట్రాక్‌ సూట్‌ నుండి స్విమ్‌ సూట్‌కు మారి ఆటోమెటిక్‌ లెగ్‌ స్ట్రెచ్‌ మొదలుపెట్టింది. 'స్పీడు ఎక్కువ పెట్టుకోవద్దు, కాళ్లు మరీ బారసాగి తొడలు లాగుతాయి' అని చెప్పి వికాస్‌ హాల్లోనే మరో పక్క తన పాటికి తను పుల్‌ అప్స్‌ చేసుకోసాగాడు.  ఓ పావుగంట గడిచేసరికి వినీల ''వికాస్‌'' అంటూ కేక పెట్టింది. ఏ బటన్‌ నొక్కేసిందో ఏమో ఆమె కాళ్లు అటూ యిటూ బాగా  స్ట్రెచ్‌ అయి మళ్లీ వేగంగా వచ్చి కొట్టుకుంటున్నాయి. మిషన్‌ దిగబోయింది కానీ నడుంకు బెల్టు కట్టి వుండడంతో మిషన్‌తో సహా ముందుకు పడబోయింది. మిషన్‌ నేల మీదనుండి లేచిపోయి కింద పడేట్టుంది. ఆమె ఆమెకు కళ్లు తిరగసాగాయి. 

వికాస్‌ ఆమె వంక చూస్తూనే పరిస్థితి గమనించాడు. పరుగుపరుగున వెళ్లి ఆమె కాళ్ల మధ్య నిలబడ్డాడు. వెంటనే కాళ్లతో అతని నడుం చుట్టేసి తమాయించుకుంది. కానీ బాలన్స్‌ తప్పింది. మెషిన్‌తో సహా అతనిపై ఒరిగింది. అతను కుడి చేత్తో ఆమెను వాటేసుకుని నడుం బెల్టు విప్పడానికి ప్రయత్నిస్తూనే ఎడం చేత్తో మెషిన్‌ స్విచ్‌ బోర్డు పై స్విచ్చులు తడుముతున్నాడు. ఆమె నడుం బెల్టు ఊడిపోయి మెషిన్‌తో సహా అతనిపై పూర్తిగా వాలిపోయేసరికి మెషిన్‌ ఆఫ్‌ చేయగలిగాడు. ఆమె బరువు పూర్తిగా తనపై పడడంతో అతనూ నేలకు ఒరిగాడు. అతని నడుం చుట్టూ ఆమె కాళ్లు. ఆమె ఛాతీపై అతని మొహం. ఆమె నడుమును చుట్టిన అతని కుడి చేయి. వారిద్దర్నీ కదలనీయకుండా భారం మోపుతూ మెషిన్‌. 

ఒక ఐదు నిమిషాలు తంటాలు పడ్డాక వికాస్‌ మెషిన్‌ను పక్కకు జరపగలిగాడు. కానీ వినీల భయంతో అతన్ని చుట్టి వేసి పైనే వుండిపోవడంతో కదలలేకపోయాడు. ఆమె రొప్పుతూండడంతో వక్షం ఎగసిపడుతోంది. స్వేదంతో తడిసిన యిద్దరి కాళ్ల్లూ ఎప్పుడు పెనవేసుకున్నాయో అతను గమనించలేదు కానీ ఆమె అతన్ని దగ్గరకు లాక్కుని గట్టిగా హత్తుకుంది. వికాస్‌ చేతులు కిందకు జారాయి. ఆమె పిరుదులు గట్టిగా పట్టుకుని తనవైపుకు లాక్కుంటూ ఆమె పెదాలను చుంబించాడు. ఆమె అడ్డు చెప్పలేదు సరికదా, అతనిలో లీనమై పోతే బాగుండును అన్నట్టు మరింతగా అదుముకుంది. దృఢమైన అతని బాహువులను నిమురుతూ తన వీపుకి తెచ్చుకుంది. అతని కౌగిలి మరింత బిగిసింది. ఈ సారి ఆమె గాఢంగా ముద్దు పెట్టుకుంది. ఐదు నిమిషాలపాటు అలా వున్నాక యిద్దరికీ ఒక్కసారిగా స్పృహలోకి వచ్చారు. సిగ్గుపడ్డారు.

ఆమె కౌగిలి సడలించింది. అతను లేచాడు. ఏమీ మాట్లాడకుండా మెషిన్‌ ఎత్తి పెట్టాడు. ఆమె కూడా సహాయపడింది. వెళ్లి బట్టలు మార్చుకుంది. అతను లైట్లు ఆర్పి జిమ్‌ మూసేసి ఆమె కారు తలుపు తీసి పట్టుకున్నాడు. ఆమె కారు స్టార్ట్‌ చేయబోతూ వుండగా మౌనాన్ని ఛేదిస్తూ ''సా..'' అనబోయాడు. ''ప్లీజ్‌ డోంట్‌ సే సారీ'' అందామె. 

''చూస్తున్నారుగా, జిమ్‌లో కొత్తగా ఎంతమంది లేడీస్‌ చేరారో, మీ అమ్మగారు చెప్పినట్టు మీ గోల్డెన్‌ లెగ్‌ ప్రభావం... పని ఎక్కువై పోయింది.''

''ఏం పనో ఏమిటో!? మొన్న ఒకావిడ మీ గదిలోకి వెళ్లి అరుస్తోందేమిటి? ఆవిణ్నీ లెగ్‌ స్ట్రెస్‌ మెషిన్‌ ఎక్కించి, పడేసి ఆ తర్వాత..?'' తక్కినది కొంటెగా అభినయం చేసింది.  

అతని మొహం ఎఱ్ఱబడింది. తల దించుకున్నాడు. ఏదో చెప్పబోతూండగానే వినీల ఆపి ''జస్ట్‌ ఫర్‌ ఫన్‌!. ఆ విషయం వదిలేయండి. దాని వలన నాదికానీ, మీదికానీ కొంపేమీ మునగలేదు కదా? ఇంతకీ ఆవిడకి కోపం ఎందుకు వచ్చిందట?''

అతను నుదురు కొట్టుకున్నాడు.''ఏం చెప్పమంటారు? ఆవిడ రికార్డు చూపించమని వాళ్లాయన, చూపించడానికి వీల్లేదని యీవిడ.. యిద్దరి మధ్య ఛస్తున్నాను. ఈవిడ సరిగ్గా చేయడం లేదని ఆయన అనుమానం. ఇంతకంటె చేయలేనని యీవిడ మొత్తుకుంటుంది..''

వినీలకు హఠాత్తుగా అనుమానం వచ్చింది ''మదన్‌ నా రికార్డు పంపమంటున్నాడా?''

''లేదు'' అన్నాడు వికాస్‌. కానీ అతని తొట్రుపాటు చూసి ఆమెకు అనుమానం వచ్చింది. ''గాడ్‌ ప్రామిస్‌?''

''ఎస్‌, గాడ్‌ప్రామిస్‌! ఫోన్‌ చేసినపుడు ఎలా సాగుతోంది అని కాజువల్‌గా అడుగుతాడంతే...''

''మరి మొన్నోసారి కొన్ని రిపోర్టులు ఫ్యాక్స్‌ చేయిస్తూ కనబడ్డారు...?''

''అవా? అవి ఆ గిరజాల జుట్టు అమ్మాయి లేదూ, వాళ్ల నాన్నగారికి పంపుతున్నాను, బొంబాయిలో వుంటారు..''

ఆమెకు నమ్మకం చిక్కలేదు. అందుకే ''మదన్‌ ఒకవేళ అడిగితే చెప్పండి - నేను నాకోసం జిమ్‌కి వస్తున్నాను తప్ప అతనికోసం కాదని!'' అని చెప్పి బయటకు వచ్చేసింది. 

ఈ మధ్య బాగా బరువు తగ్గి మంచి చక్కటి సౌష్టవం ఏర్పడడంతో ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగింది. 'నేను ఎప్పుడు తలచుకుంటే అప్పుడు చిక్కగలను. నా శరీరం, నా యిష్టం. ఇంకోళ్లు చెపితే నేనెందుకు చేయాలి? కావాలంటే నేను పెళ్లి తర్వాత కూడా తగ్గగలను.' అనుకుని పంతంపట్టినట్టు జిమ్‌ మానేసింది. 

నిజానికి ఆమెకు పెళ్లిపనుల్లో టైము సరిపోవటం లేదు కూడా. షాపింగులకు, ఊళ్లకు తిరగడంలో కాస్త తిండి కూడా పెరిగింది. పెళ్లి పదిహేను రోజులుందనగా మదన్‌ వచ్చినపుడు అతను ఆమెను చూసి మొహం చిట్లించాడు. ''నువ్వీ మధ్య బాగా సన్నబడి నాజూకు వన్నెలాడిగా తయారయ్యావని మా అమ్మానాన్నా చెప్పారు. మరి నువ్వేమిటి యిలా వున్నావ్‌?'' అనేశాడు.

''నామీద గూఢచారులను పెట్టావా?'' అని అడిగింది ఆమె కొరకొరా చూస్తూ.

''అబ్బే, జోక్‌ చేశా..'' అన్నాడతను మొహం మీదకు నవ్వును తెచ్చుకుంటూ.

అన్నాడే కానీ మర్నాడు సాయంత్రం బయటకు తీసుకెళ్లి సీరియస్‌ డిస్కషన్‌ పెట్టాడు - ''మన పెళ్లి యింకో నాలుగు నెలలు వాయిదా వేస్తే ఏమవుతుంది? శుభలేఖలు పంచడం యింకా ప్రారంభం కాలేదు కదా...'' అని. వికాస్‌ను అడిగితే ఎక్సర్‌సైజ్‌ చేస్తే మాత్రం మంచి ఫలితం వుంటోందని కానీ యీ మధ్య జిమ్‌కు రావటం లేదని చెప్పాడట. 'ఫిజికల్‌గా నీకేదైనా ప్రాబ్లెమ్‌ వచ్చి వుండవచ్చు, కావాలంటే ఓ పది రోజులు రెస్టు తీసుకుని మళ్లీ మొదలు పెట్టవచ్చు, వేరే జిమ్‌లో చేరవచ్చు, బాడీ కాస్త ప్రెజంటబుల్‌గా తయారయ్యాకనే పెళ్లి చేసుకోవచ్చు. ఈ లోపున మిన్ను విరిగి మీదపడదు.' అన్నాడు.

అతన్ని పూర్తిగా చెప్పనిచ్చి అడిగింది - ''అయితే పెళ్లికి, నా వెయిట్‌కు లింకు పెట్టావన్నమాట. పెళ్లిచూపులనాడు నేను యింతకంటె లావుగా వున్నాను కదా, అప్పుడు ఎందుకు ఒప్పుకున్నట్టు? నా ఆస్తి, అంతస్తు, చదువు, మొహం చూసి..ఓకే అన్నావ్‌. అవన్నీ యిప్పుడూ వున్నాయిగా..మరి వాయిదా వేయడం దేనికి?'' 

అతను యిబ్బందిగా కదిలాడు ''వాటన్నిటితో బాటు మంచి ఫిజిక్‌ కూడా వుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. నన్ను చూశావ్‌ కదా, నేను రోజూ జిమ్‌ చేస్తానని తెలిసి నా పక్కన సరిజోడీగా కనబడడానికి నువ్వూ యిన్‌స్పయిర వుతావనుకున్నాను. ఇలాటి కేసుల్లో కాస్త మైల్డ్‌ పెర్సువేషన్‌ వుంటే చాలని మా మేనేజ్‌మెంట్‌ కోర్సులో చెప్తారు..''

''ఇది మైల్డో, వైల్డో చెప్పాల్సింది నేను, మీ ప్రొఫెసర్లు కాదు. నువ్వు చెప్పినది ఆలోచిస్తాను..'' అంటూ లేచి వచ్చేసింది.

''బాగానే వుంది కానీ, యింత హఠాత్తుగా మూసేయడానికి కారణం ఏమిటి? ఆ రోజు మనిద్దరి మధ్య జరిగిన సంఘటన వలన కలిగిన గిల్ట్‌ ఫీలింగా?'' అడిగింది వినీల.

''అదే అయితే, మర్నాడే మూసేయాలిగా. గిల్ట్‌ ఫీలింగ్‌ మాట నిజమే కానీ దానికోసం కాదు. జిమ్‌లో చేరిన ఆడవాళ్ల అవస్థ చూడలేకపోతున్నాను. నేను జిమ్‌ పెట్టినది ఆరోగ్యం బాగుపరచాలని, ఆ క్రమంలో ట్రిమ్‌గా కనబడితే చాలనీ. మొదట్లో అందరూ మగవాళ్లే చేరారు, ఆడ ట్రెయినర్లు లేకపోవడంతో ఆడాళ్లు రాలేదు. బరువు తగ్గిస్తామని ప్రకటనలు యిస్తేనే ఆడవాళ్లు చేరతారని మా స్నేహితుడు సలహా యిస్తే పేపర్లో అలా ప్రకటనలు యిచ్చాను. మీరు పాదం మోపాక చాలామంది వచ్చి చేరారు. అందరికీ ఒకటే యావ - సన్నబడాలి, ఫిగర్‌ కావాలి. ఎందుకు అని అడిగితే - బాయ్‌ఫ్రెండ్‌ కోసం, మొగుడికోసం, పెళ్లి కావడం కోసం, సొసైటీలో తన స్నేహితులు వెక్కిరించకుండా వుండడం కోసం..! చివరకు నాజూగ్గా లేకపోతే మనిషే కాదన్న సెల్ఫ్‌ హిప్నాసిస్‌లో పడ్డారు. ఇదొక శిక్షలా తయారయి వాళ్లు దీన్ని ఎంజాయ్‌ చేయడం లేదు. వాళ్లు ఎంత చేసినా పక్కవాళ్లకు తృప్తి లేదు. మాటలతో హింసిస్తున్నారు. ఈ హింసలో పాలుపంచుకోవడం నా వల్ల కాదు. అందుకే మూసేస్తున్నాను...''

వినీల దీర్ఘంగా చూసి ''అలా హింసించేవాళ్లలో మదన్‌ కూడా వున్నాడు కదూ! నిన్న వచ్చి మిమ్మల్ని కలిసి వుండకపోతే మీరింత యింత సడన్‌గా నిర్ణయం ఎందుకు తీసుకుంటారు?'' అని అడిగింది.

వికాస్‌ చేతులు జోడించాడు - ''చేసిన పాపం చెపితే పోతుందంటారు. నిజానికి మీ అవస్థకు కారణం నేనే. ఎంగేజ్‌మెంట్‌ ఫంక్షన్‌లో మిమ్మల్ని చూడగానే నాకు ఓ ఐడియా వచ్చింది. మదన్‌ టేస్టు నాకు తెలుసు కాబట్టి, 'నీ ఫియాన్సీని నా జిమ్‌కు పంపించు, పెళ్లినాటికి నువ్వు కోరుకున్నట్టు మంచి ఫిజిక్‌ వచ్చేట్టు చేస్తా' అని చెప్పాను. అలా చేస్తే ఏభై వేలు యిస్తానన్నాడు వాడు. మొత్తానికి మీరు చేరారు. మీ లక్కీ హేండ్‌ వలన నాకూ బిజినెస్‌ పెరిగింది. ఈ మధ్య మానేయడం వలన మీరు వెయిట్‌ పెరిగారు తప్ప మూణ్నెళ్లగా మీలో చాలా యింప్రూవ్‌మెంట్‌ వుందని వాడికి తెలుసు, వారంవారం రికార్డులు తెప్పించుకునేవాడుగా. కనీసం పదో, పాతికో యిచ్చి సరిపెడతాడనుకున్నా. కానీ వాడు ఏమీ యివ్వకపోగా యిష్టం వచ్చినట్టు తిట్టాడు. నేను మిమ్మల్ని యింకా ఎండగట్టాల్సిందట. పగలూరాత్రీ నూరేయాల్సిందట. ఆవిడకంటూ వ్యక్తిత్వం వుండదా, యిష్టాయిష్టాలు వుండవా అంటే వినలేదు. వాడికి ఆశలు కల్పించి ఆశాభంగం చేశాను కదా, అదీ కోపం. అందుకే పెళ్లికి వచ్చేందుకు మొహం చెల్లటం లేదు...''

వినీల వెక్కిరించింది. ''మరీ అంత ఫీలవకండి. పెళ్లి యిప్పట్లో లేదని చెప్పాడు, మీ ఫ్రెండు. నేను సన్నబడేదాకా పెళ్లి లేదట..'' 

వింటూనే వికాస్‌ ఆవేశపడ్డాడు. ''స్కౌండ్రల్‌, అంత మాటన్నాడా? తనకోసం మీరు ఎల్లకాలం వెయిట్‌ చేస్తూ వుండిపోవాలా?''

''అందుకే.. నాకో ఐడియా వచ్చింది. నేను అతను ఊహించినంత సన్నబడదలచుకున్నాను! ఆ తర్వాత అతను ఊహించలేనట్లు షాక్‌ యిస్తాను - నీతో నాకు పెళ్లి అక్కరలేదని చెప్పి! నన్ను అలా తయారుచేసే బాధ్యత మీదే. లక్ష యిస్తాను... నా కారణంగా మీరు నష్టపోయినదానికి రెండింతలు..''

వికాస్‌ కళ్లు చిన్నవి చేసి చూశాడు - ''ఇంత చెప్పినా నా బాధ మీకు అర్థం కాలేదనుకుంటా. అసలు సరైన ఫిగర్‌ అన్న కాన్సెప్టే తప్పండి. ఇదిగో మీకు బహుమతిగా యిచ్చిన బర్త్‌ ఆఫ్‌ వీనస్‌ పెయింటింగ్‌ చూడండి. వీళ్లందరూ చెప్పే కొలతలున్నాయా? ఆ మాటకొస్తే పాతకాలం పెయింటింగ్స్‌, విగ్రహాలు అవీ చూడండి, ఇండియన్‌ కానీ ఫారిన్‌ కానీ - ఎక్కడా ఈ ముఫ్పయార్లూ, ఇరవైనాలుగులూ వుండవు. సైజు జీరో ఫిగర్సూ వుండవు. సౌందర్యం అంకెల్లో వుండదండి.. మనసులో, భావంలో, ప్రవర్తనలో, గుణంలో, యితరుల పట్ల చూపే గౌరవంలో... ఎన్నో కూడితేనే అందం పుడుతుంది.''

ఇంతలో పనిమనిషి కూల్‌డ్రింక్స్‌ తెచ్చింది. ఆమె వెళ్లిపోయేదాకా ఆగి వినీల కొంటెగా అడిగింది - ''అయితే నేను యిప్పుడున్నట్టు వున్నా మీకు ఓకే అంటారు..''

వికాస్‌కు పొలమారింది. ''ఏమిటండోయ్‌, తమాషాగా మాట్లాడుతున్నారు..'' అన్నాడు.

''నా పెళ్లి సంగతి సరే, మీ పెళ్లి సంగతి చెప్పండి. నాలుగైదేళ్ల దాకా పెళ్లి లేదన్నవారు యిప్పుడు హఠాత్తుగా పెళ్లంటున్నారు. మొన్న సంఘటనతో లింకేమైనా వుందా?'' అడిగింది వినీల అదే మూడ్‌లో.

వికాస్‌ సిగ్గుపడ్డాడు - ''ఇన్‌ ఏ వే, ఎస్‌. నేను అవేళ అలా ప్రవర్తించానంటే మనసులో అడుగున ఎక్కడో అలాటి భావం వున్నట్టే కదా. కోరిక దాగి వుందన్నమాట. అందుకని మీలాటి అమ్మాయిని ఒకర్ని చూసి పెళ్లాడదామని ఫిక్సయిపోయా. ఉద్యోగం లేందే ఎవరు చేసుకుంటారు? అందుకని..''

''...నేను చేసుకుంటా'' అంది వినీల.

వికాస్‌ తెల్లబోయి చూస్తూంటే వినీల మళ్లీ చెప్పింది. ''..అవును, నేను రెడీ. మీ సంగతి మీరే తేల్చాలి..''

వికాస్‌ పెదాలు తడుపుకుంటూ ''మీ లెవెల్‌ ఎక్కడ, మా...'' అంటూండగానే కట్‌ చేసింది. ''చూశాంగా, లెవెల్‌ వున్న వాళ్ల బుద్ధులు. నిజానికి అవాళ్టి సంఘటన తర్వాత మరొకళ్లయితే నన్ను లైన్లో పెడదామని చూసేవారు. ఎందుకంటే మీరు యిందాకా చెప్పినట్టు లోపల అలాటి ఫీలింగ్స్‌ లేనిదే నేనూ అలా ప్రవర్తించనుగా... అయినా మీరు కంట్రోలు చేసుకున్నారు. హుందాగా నడుచుకున్నారు. ఇప్పుడు జిమ్‌ మూసేయడంలో కూడా మీ అభిప్రాయాలు నాకు చాలా బాగా నచ్చాయి. మీలాటి మంచివాడు దొరికినపుడు వదులుకోవడం బుద్ధితక్కువ. మా పేరెంట్స్‌ కూడా యీజీగా కన్విన్స్‌ అవుతారు.''

వికాస్‌ ఏమీ మాట్లాడలేదు. వణుకుతున్న చేత్తోనే వినీల చేతిని పట్టుకుని తనవైపు గుంజుకున్నాడు. ఆమె అతన్ని హత్తుకుంటూ చెవిలో ''అవేళ్టి వాత్సాయన భంగిమ హాల్లో వేస్తే పనిమనిషి దడుసుకుంటుందేమో పాపం, లోపలకి వెళదామా...'' అంది.

ఫిబ్రవరి 2013 స్వాతి వీక్లీ సరసమైన కథల పోటీలో ప్రథమ బహుమతి (10000 రూ.లు.) పొందిన కథ 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?