Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ కథలు : ఓ చిన్న శీల

భర్త నాలుగురోజులుగా చాలా ఆందోళనగా వుండడం రమ్య గమనించింది. పెద్ద కంపెనీలో సిఎఫ్‌ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి తరచుగా టెన్షన్లు పడడం సహజమే. పైగా ప్రస్తుతం వాళ్ల కంపెనీని అంతర్జాతీయంగా విస్తరించిన ఇటాలియన్‌ కంపెనీ టేకోవర్‌ చేసుకునే ప్రయత్నాల్లో వుంది కాబట్టి  అక్కణ్నుంచి వచ్చిన టీములతో మీటింగులూ వాటితో బిజీగా వున్నాడు. నెల్లాళ్లగా యిది నడుస్తూనే వుంది కానీ నాలుగు రోజులుగా సరిగ్గా నిద్ర కూడా పోవటం లేదు. సంగతేమిటని నిలదీసింది.

రాహుల్‌ నిట్టూర్చాడు. ''పని ఎంత వున్నా నేనెప్పుడూ వర్రీ కాను. ఇది వేరే సమస్య. కంపెనీకి వున్న ఆస్తిపాస్తుల విలువ, మార్కెట్‌ విలువ ఎక్కువ చేసి చూపించమని మా డైరక్టర్ల్లంటున్నారు. దాని బట్టే షేరు విలువ అంచనా వేస్తారు కాబట్టి వీళ్లకు అపారంగా వచ్చిపడుతుంది. అవతలి కంపెనీ నష్టపోతుంది. ఆ తప్పుడు డాక్యుమెంట్లను సర్టిఫై చేయాల్సింది నేను. ఏం చేయాలో తెలియటం లేదు. ఎంత చెప్పినా మా వాళ్లు వినటం లేదు. మీ మీదకి ఏమీ రాకుండా చూసుకుంటాం అంటున్నారు.''

''.. ఆ ఇటాలియన్‌ కంపెనీ నుంచి లాయర్లు, ఆడిటర్లు అనేకమంది గుంపులుగుంపులుగా వచ్చారుగా, నిజానిజాలేమిటో వాళ్లు కనుక్కోలేరా?''

''అదే నాకూ ఆశ్చర్యంగా వుంది. మావాళ్లు వాళ్లను కొనేశారా అనిపిస్తోంది. అస్సలు ప్రశ్నలే వేయడం లేదు. మా స్టాఫ్‌ ఏ ఫిగర్స్‌ యిచ్చినా ఓకేఓకే అనేస్తున్నారు.''

''అలాటివాళ్లను ఉద్యోగంలో పెట్టుకున్నవాళ్లను అనుభవించమనండి. మధ్యలో మీకెందుకు చింత? ఆఫ్టరాల్‌ పెద్ద యంత్రంలో మీరో చిన్న శీల. వాళ్లూవాళ్లూ కుమ్మక్కయిన తర్వాత మీరేం ఆపగలరు? ఊరుకున్నంత ఉత్తమం లేదు. టేకోవర్‌ అయిన తర్వాత అవతలివాళ్లు నిలదీస్తే అప్పుడే ఉద్యోగం వదిలేద్దురుగాని, ఐఐఎమ్‌లో చదివిన మీకు మరో ఉద్యోగం దొరక్కపోదు.'' తేల్చిపారేసింది రమ్య.

రాహుల్‌ తల విదిలించాడు. ''ఎలా తప్పించుకుందామా అని ఆలోచించేబదులు, దీన్ని ఎలా ఆపగలమో ఐడియా చెప్పు. మన కళ్లెదురుగా యింత ఘోరమైన ఆర్థిక అక్రమం జరుగుతూన్నపుడు నాకెందుకు అని వూరుకోవడం తప్పు. ఇదేదో ఊరికి ఉపకారం అనుకోకు. సత్యం కేసులో ఆడిటర్లకు కూడా శిక్ష పడిందని గుర్తు తెచ్చుకో.''

''..అయితే యిప్పుడే రిజైన్‌ చేసేయండి. పీడా వదిలిపోతుంది.''

''మా వాళ్లు నన్ను వదిలిపెడతారా? ఈ సమయంలో నేను తప్పుకుంటున్నానంటే ఇటలీవాళ్లకు అనుమానం వస్తుందని భయపడరా? కాదూ కూడదని పారిపోతే ఎంతకైనా తెగిస్తారు.''

రమ్య విసుక్కుంది. ''మీ మనస్సులో ఏదో పరిష్కారం వుండి వుంటుంది. నస పెట్టకుండా అదేమిటో చెప్పేయండి.''

రాహుల్‌ చెప్పసాగాడు. రాజీనామా అదీ ఏమీ చేయకుండానే, ఎవరికీ చెప్పకుండా సింగపూరు వెళ్లిపోతే మంచిది. ముందు రమ్య, పిల్లలు వెళ్లిపోవాలి. ఇక్కడి వ్యవహారాలు చక్కబెట్టి, వారం రోజులు పోయాక తనూ వచ్చేస్తాడు. తమ దగ్గర వున్న డబ్బుతో ఆర్నెల్లు సుఖంగా గడిపేయవచ్చు. ప్రస్తుతం వున్న కంపెనీ ప్రత్యర్థి కంపెనీకి సింగపూరులో బ్రాంచి వుంది. ఆ కంపెనీ వైస్‌ ప్రెసిడెంటు ఒకతను తనతో టచ్‌లో వున్నాడు. ఎప్పుడు కావాలన్నా వచ్చేయని ఆఫర్‌ యిచ్చాడు. రెండు, మూడు నెలలు అణిగి వున్న తర్వాత ఆ ఆఫర్‌ ఎలాటిదో చూసుకోవచ్చు. ఈ లోపున ఇటాలియన్‌ కంపెనీతో డీల్‌ అటోయిటో తేలిపోతుంది. 

ఈ ప్లానుకి ఒప్పుకోవడానికి రమ్యకు రెండు నిమిషాలు కూడా పట్టలేదు. కానీ సింగపూరుకి కాపురం మార్చబోయే ముందు ఓసారి ఇటలీ హెడాఫీసుకి వెళ్లి వాళ్ల ఫైనాన్స్‌ చీఫ్‌ను కలిసి వస్తానన్నపుడు మాత్రం అభ్యంతరం చెప్పింది. ఓవరాక్షన్‌ అంది. అది బయటకు వస్తే ఈ కంపెనీవాళ్లను రెచ్చగొట్టినట్లే అంది. వాళ్ల గురించి ఓ పక్క భయపడుతూనే యిలా ఎదురెళ్లడం దుస్సాహసం కాదా అని అడిగింది. రాహుల్‌ దగ్గర దానికి సమాధానం లేదు.

 

ఆ రాత్రి మళ్లీ నిద్ర పట్టలేదు. ఇటలీ వెళ్లడం అవసరమా, కాదా? సింగపూరుకి వెళ్లి దాక్కుంటే సరిపోతుందా? రమ్యకు చెప్పలేదు కానీ కంపెనీ వాళ్లు వదిలిపెడతారా? వెతికి పట్టుకుని, సంతకం పెట్టడానికి నీకు అభ్యంతరం దేనికని గట్టిగా అడగరా? తప్పుడు స్టేటుమెంట్ల మీద సంతకాలు పెట్టడం యిష్టం లేదని చెపితే, యిన్నాళ్లూ ఎప్పుడూ పెట్టలేదా? ఇన్వెస్టర్లకు, బ్యాంకర్లకు, షేర్‌ హోల్డర్లకు, గవర్నమెంటుకు అన్నీ కరక్టు ఫిగర్సే యిచ్చావా అని అడిగితే తన దగ్గర సమాధానం ఏముంది? 'అవన్నీ ఒక ఎత్తు, యింత ఫ్రాడ్‌ మాత్రం నా వల్ల కాదు' అని చెప్పగలడా? అంతకంటె రిస్కు తీసుకుని యిటలీకి వెళ్లి వాళ్లకు వాస్తవాలు చెప్పడమే మేలు. ఇటాలియను వాళ్లు తన మాట నమ్మి యీ వ్యవహారం నుంచి తప్పుకుంటే చాలు. ఇంకో రెండు నెలలకు ఏదో కారణం చెప్పి ఉద్యోగం మానేయవచ్చు. ఇంత విపులంగా చెపితే రమ్య వినదు. గతంలో మాత్రం అన్నీ రూల్సు ప్రకారం ఎందుకు చేయలేదని తగులుకుంటుంది. ఏ కంపెనీలోనైనా అడ్డగోలు వ్యవహారాలుంటాయి కానీ వీళ్లు బొత్తిగా నీతిమాలినవాళ్లు. వీళ్లు చెప్పినట్లు ఆడడం  కంటె నీచమైన పని లేదు. ఆలోచించిన కొద్దీ భయం వేస్తుంది. ఆచరణలోకి దిగి ఫలితం ఏమైనా సరే, అనుభవించడం మంచిది. అనుమానం తగిలి ఇటలీవాళ్లే రమ్మన్నారని చెపితే రమ్య నమ్ముతుంది.

తెగింపు వచ్చాక రాహుల్‌కు నిద్ర పట్టింది.

*******************
మిలాన్‌లో అనుకున్న ప్రకారం పనులు జరగలేదు. ఫైనాన్షియల్‌ డైరక్టర్‌ ఆంటోనినో తను చెప్పినదంతా ఓపిగ్గా విని చివర్లో నవ్వి పారేశాడు.  ''ఇలాటివి అన్ని దేశాల్లో అన్ని కంపెనీల్లో వున్న వ్యవహారాలే. బోల్డు టేకోవర్లు హేండిల్‌ చేశాం, వాస్తవ పరిస్థితేమిటో  మేం గ్రహించలేమా? వాటికి మార్జిన్‌ వదిలి బేరాలాడుకుంటాం. నువ్వు అనవసరంగా ప్యానిక్‌ అవుతున్నావ్‌.'' అన్నాడు.

తనను కుర్రవెధవలా తీసిపారేయడంతో రాహుల్‌కు ఉక్రోషం వచ్చింది. ''నేనూ యీ ఫీల్డులో పదిహేనేళ్లగా వున్నాను. ఏ మేరకు ఫిగర్స్‌ పెంచి చూపుతామో నాకూ తెలుసు. కానీ దీనిలో అన్ని అంకెలూ బోగస్సే. అందుకే నా సొంత ఖర్చుతో వచ్చి మిమ్మల్ని అలర్ట్‌ చేస్తున్నాను..'' అన్నాడు.

ఆంటోనినో ఎగాదిగా చూశాడు. ''నీకు మా అబ్బాయి వయసు వుంటుంది. అందుకే ఆవేశపడుతున్నావు. నేను ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌గా వుండి,  లోకంలో జరిగే అనేక ఆర్థిక లావాదేవీలపై రిసెర్చి చేసి, చైర్మన్‌ కోరిక మేరకు యీ గ్రూపుకు కన్సల్టెంట్‌గా వచ్చాను. అతను నాకు ఒకప్పుడు స్టూడెంటు. నా సలహాలు నచ్చి, నాకీ పదవి ఆఫర్‌ చేశాడు...''

''మీ అనుభవాన్ని కాదనటం లేదు. కానీ మా కంపెనీ విషయంలో మీకు తెలియకుండా మోసం జరుగుతోందని భయపడుతున్నాను. మీ గ్రూపుతో నాకే సంబంధం లేకపోయినా, ఏదో మంచితనానికి పోయి...''

''..డోంట్‌ వర్రీ, దీన్ని అఫీషియల్‌ ట్రిప్‌ కింద లెక్కేసి, నీ ఖర్చులు యిచ్చేస్తాం. నేనే రమ్మన్నానని మీ వాళ్లకు చెప్తాను. వచ్చినవాడివి ఎలాగూ వచ్చావు కాబట్టి నువ్వు చేయాల్సిన సంతకాలు యిక్కడే చేసేయ్‌. ఆ స్టేటుమెంట్ల కాపీలు యిక్కడ కూడా వున్నాయి...''

''..నేనింకా పూర్తిగా కన్విన్స్‌ కాలేదు కదా..'' రాహుల్‌ అభ్యంతర పెట్టబోయాడు.

''..పోటీ కంపెనీలో ఉద్యోగం గురించి బేరసారాలు చేస్తున్నావని విన్నాను. ఈ డీల్‌ చెడగొట్టి ఆర్నెల్లు పోయాక ఆ కంపెనీని ఆఫర్‌ చేసే ఉద్దేశంలో వుంటే నువ్వు కన్విన్స్‌ కాకపోవడంలో ఆశ్చర్యమేముంది?'' వెటకారంగా అడిగాడు. 

రాహుల్‌ కోపంగా ఏదో అనబోయేటంతలోనే అతను ''డీల్‌ ఆల్‌మోస్ట్‌ సెటిలయి పోయింది. దీన్ని ఆపడం నీ తరం కాదు. నువ్వు.. అంటే బాగుండదేమో కానీ.. ఎ స్మాల్‌ ఫ్రై... మియర్‌ కాగ్‌ యిన్‌ ద వీల్‌... ఇరుసువి కావు, చిన్న శీలవి. పడిపోయినా చక్రం దొర్లడం మానదు.''

రాహుల్‌కి ఏమనాలో తెలియలేదు. తల విదిలించి ఉగ్రంగా గదిలోంచి బయటకు వచ్చేశాడు. ఆంటోనినో సెక్రటరీ తన దగ్గరకు వస్తే తలనొప్పిగా వుంది, హోటల్‌కు వెళ్లి పడుక్కుంటాననీ, డాక్యుమెంట్లూ అవీ రేపు చూస్తాననీ చెప్పాడు. 

పరుపు మీద దొర్లుతూ వుంటే 'అందరూ కుమ్మక్కయ్యాక మీరేం చేయగలరు' అన్న భార్య మాటలే గుర్తుకొచ్చాయి. ఆడిటర్లు మాత్రమే అనుకున్నాడు, చూడబోతే మొత్తం గ్రూపే కిల్లాడీ ముఠాలా వుంది. వీళ్లకు వాళ్లు సరితూగుతారు. మధ్యలో తనేే పెద్ద ధర్మరక్షకుడిలా బయలుదేరి చివరకు గాడిదవుతున్నాడు.  రాహుల్‌కు తన చేతకానితనం మీద కోపం వచ్చింది. 

తను సంతకాలు పెట్టాక ఈ ఆంటోనినో తన కంపెనీవాళ్లకు తను యిలా వచ్చిన సంగతి చెప్పేస్తాడు. పైగా ఎక్కణ్నుంచి కూపీ లాగారో కానీ పోటీ కంపెనీని కూడా పిక్చర్‌లోకి లాక్కుని వచ్చారు. వాళ్ల ఏజంటుగా తనను చిత్రీకరించడానికి నిమిషం పట్టదు. తన కంపెనీ వాళ్లు తన జీవితాన్ని దుర్భరం చేసి తీరతారు. అవతలివాళ్ల దగ్గర నుంచి గట్టి హామీ తీసుకోకుండానే తను యిక్కడకు వచ్చేసేయడం పొరబాటే. తన కెరియర్‌ ఎలాగూ నాశనమైంది. వీళ్ల నెందుకు వదిలిపెట్టాలి? ఈ ఇటాలియన్‌ కంపెనీ పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ. వీళ్లు ఖర్చు పెట్టేది షేర్‌హోల్డర్ల డబ్బు. అవసరమైన దానికంటె ఎక్కువ పెట్టి కొని, మధ్యలో తమ జేబులు నింపుకుంటున్నారు. వీళ్ల బండారం బయటపెట్టి పారిపోవాలి.

*************
రోమ్‌ ఎయిర్‌పోర్టులో ఢిల్లీ ఫ్లయిట్‌ కోసం వెయిట్‌ చేస్తూండగా చైర్మన్‌ తాలూకు మనుషులు రాహుల్‌ని పట్టుకున్నారు. ఒకతను దగ్గరకొచ్చి 'రాహుల్‌?' అని అడగ్గానే అప్రయత్నంగానే తల వూపాడు. వెంటనే రెండోవాడు వెనక్కి చేరి తుపాకీ డొక్కలోకి గుచ్చి పద అన్నాడు. ''ఫ్లయిట్‌'' అని రాహుల్‌ గొణగబోతే ''ఫర్‌గెట్‌ ఇట్‌'' అన్నాడు. కారులో కూర్చున్నాక ''ఎక్కడికి వెళుతున్నాం?'' అని అడిగాడు జంకుతూనే. ''చైర్మన్‌ నీతో మాట్లాడదా మనుకుంటున్నారు.'' అన్నాడు మొదటివాడు. తుపాకీవాడు ''మిలానో ఎక్స్‌ప్రెసో'' పేపరు ముందు పడేసి ''నువ్వేగా వీడికి సమాచారం యిచ్చినది?'' అని అడిగాడు తుపాకీ వూపుతూ. రాహుల్‌ గతుక్కుమన్నాడు. 

ఈ పేపరువాళ్లను నమ్మడానికి లేదు. వారం రోజుల తర్వాత పబ్లిష్‌ చేస్తానని మాటిచ్చి తెల్లవారకుండా వార్త వేసేశాడు. వారం అంటే ఆ పాటికి తను సింగపూరులో వుండేవాడు. అసలు తనిచ్చిన పేపర్లన్నీ చదవడానికే మూడు రోజులు పడుతుంది కదా, ''మా ఆఫీసులో ఇంగ్లీషు బాగా వచ్చినవాళ్లు నలుగురే వున్నారు. వారిలో ఒకడు సెలవులో వున్నాడు. ఫైనాన్షియల్‌ మేటర్స్‌ ఎనలైజ్‌ చేసి చెప్పేందుకు నాలుగు రోజులు కనీసం పడుతుంది.'' అన్నాడు ఆ జర్నలిస్టు. తనకు ఇంగ్లీషు మాట్లాడడం వచ్చు కానీ చదవడంలో స్పీడు లేదట. సారాంశం ఏమిటో చెప్పమన్నాడు. గంటన్నర పాటు విశదంగా చెప్తే శ్రద్ధగా విన్నాడు. తన భాషలో నోట్సు రాసుకున్నాడు. 

''నేను చెప్పిదనదంతా నమ్మాలని లేదు. నేనెవరో, నా నిజాయితీ ఏమిటో మీకు తెలియదు. నేను తెచ్చిన పేపర్లు అన్నీ చదివి సత్యమేమిటో తేల్చుకుని అప్పుడు కథనం రాయండి.'' అని కాగితాల కట్ట అతని చేతికి యిచ్చాడు. 

''అది నువ్వు వేరే చెప్పాలా? మేం గాసిప్స్‌ రాసే పేపరు కాదు. ఏదైనా సరే, రిసెర్చి చేసే రాస్తాం. సోర్సు పేరు బయటకు రానివ్వం.'' అని జర్నలిస్టు గొప్పలు చెప్పాడు. కొన్ని గంటల్లోనే వాడి పరిశోధన ముగిసిపోయిందా? పేపర్లో ఏం రాసిచచ్చాడో, తనకు ఇటాలియన్‌ రాదు, తను చెప్పినదానికి కారం, ఉప్పూ కలిపి దట్టించేశాడేమో! 

''పేపరువాడు నా పేరు చెప్పాడా?'' అని అడిగాడు రాహుల్‌. 

తుపాకీవాడు నవ్వాడు. ''చెప్పాలా? కథనంలో ఇండియా కంపెనీ గురించి రాశారు, వాళ్ల ఆఫీసుకి ఓ ఇండియన్‌ వచ్చాడని సెక్యూరిటీలో తెలిసింది, నువ్వు కాక యింకెవరై వుంటారు? హోటల్లో అడిగితే ఏ ఫ్లయిటుకి వెళుతున్నావో తెలిసింది..''

''నేను ఏ హోటల్లో బస చేశానో పత్రికాఫీసులో చెప్పలేదే..'' రాహుల్‌ ఆశ్చర్యపడ్డాడు.

''ఆ మాత్రం కనుక్కోలేమా? ఇటలీలో మా గ్రూపు సత్తా నీకు తెలియదు. పోలీసుల నుంచి మాఫియా వరకు అందరితో మాకు సంబంధబాంధవ్యా లుంటాయి. కంపెనీ పేరు బజారు కీడ్చేముందు ఆ విషయం తెలుసుకోవాల్సింది.'' అన్నాడతను కటువుగా.

చైర్మన్‌ కూడా అవే మాటలన్నాడు. ''ఈ మధ్యే జరిగిన ఫిలిప్పీన్స్‌ టేకోవర్‌లో కూడా గోల్‌మాల్‌ జరిగిందని, ఇప్పుడు ఇండియాలో మరో కుంభకోణం జరగబోతోందని, చైర్మన్‌ షేర్‌హోల్డర్సును మోసం చేస్తున్నాడని పేపర్లో రాశారు. మీ కంపెనీతో మాకు యింకా సంబంధం కూడా ఏర్పడలేదు. ఎక్కణ్నుంచో వచ్చి నా పరువు తీయడానికి నీకేం అవసరం?'' అని నిలదీశాడు కోపంగా. 

''మీ ఫైనాన్షియల్‌ డైరక్టరుకి అన్నీ చెప్పినా వినలేదు. గత్యంతరం లేక..'' అని నాన్చాడు.

''ఆయన వినకపోతే నా దగ్గరకు రావలసినది..''

''ఆయన మీకు ఒకప్పుడు టీచరు, స్నేహితుడు అని విన్నాను..''

చైర్మన్‌ విసుగ్గా తల విదిలించాడు. ''దానికీ దీనికీ సంబంధం ఏమిటి? నువ్వు ఆయనతో ఏం చెప్పావో నాకేం తెలుసు? ఎదురుగా కూర్చోబెట్టి నిలదీస్తా, ఆయన యివాళ పొద్దున్నే ఇండియా వెళ్లాడు, రేపు ఉదయం మీటింగు.'' అంటూ 'గెట్‌ లాస్ట్‌' అన్నట్టు విసురుగా చేయి విదిలించాడు.

*************

మర్నాడు ఉదయం మీటింగు జరగలేదు. రాహుల్‌ని కంపెనీ గెస్ట్‌ హౌస్‌లో ఓ గదిలో వుంచారు. సెల్‌ఫోన్‌ తీసేసుకున్నారు. పేపరు, టీవీ ఏమీ లేవు. మాట్లాడడానికి మరో మనిషి లేడు. సమయానికి తిండి వస్తోంది, అంతే. కానీ అదీ రుచించటం లేదు. మాఫియా పేరు విన్న దగ్గర్నుంచి కెరియర్‌ ఏమవుతుందన్న కంటె ప్రాణానికి ఏమవుతుందాన్న భయం పట్టుకుంది. మధ్యాహ్నానికి తెగింపు వచ్చింది. తను పోయినా పిల్లలకు ఫర్వాలేదు. రమ్య  మళ్లీ ఉద్యోగంలో చేరి పిల్లల్ని పోషిస్తుంది. చచ్చేముందు ఒక మంచి పని చేసిన, రేదర్‌ చేయడానికి ప్రయత్నించిన, తృప్తి తనకు మిగులుతుంది. 

రాహుల్‌ మనసు కుదుటపడిన రెండు, మూడు గంటలకు చైర్మన్‌ నుంచి పిలుపు వచ్చింది. కోపంగా లేడు కానీ సీరియస్‌గా, బాధపడుతున్నట్టు వున్నాడు. ఆంటోనినో కనబడలేదు. వెళ్లి కూర్చోగానే ''నువ్వూ, ఆంటోనినో ఏం మాట్లాడుకున్నారో చెప్పు'' అన్నాడు చైర్మన్‌. జరిగినదంతా చెప్పి 'కావాలంటే మీరాయనతో క్రాస్‌చెక్‌ చేసుకోవచ్చు' అన్నాడు రాహుల్‌ ధీమాగా.

చైర్మన్‌ నిట్టూర్చాడు. ''ఆయన యిక లేడు. ఇవాళ ఎనిమిది గంటలకు ఫిలిప్పీన్స్‌లో తుపాకీతో పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నమ్మకద్రోహం చేసి తలవంపులు తెచ్చిపెట్టినందుకు క్షమించమంటూ నాకు మెసేజ్‌ పెట్టి మరీ పోయాడు...''

రాహుల్‌ నివ్వెరపోయాడు. ఏమనాలో అర్థం కాలేదు. ''ఇండియా నుంచి ఫిలిప్పీన్స్‌కు ఎందుకు వెళ్లాడు?'' అడిగాడు.

''ఇండియా వెళ్లనేలేదు. మిలానో ఎక్స్‌ప్రెసోలో యీ కథనం వస్తోందని తెల్లవారకుండానే అతనికి తెలిసిపోయింది. డామేజి కంట్రోలు చేయాలని  ఫిలిప్పీన్స్‌ వెళ్లాడు. నాకు అబద్ధం చెప్పాడు.''

''అంటే ఆ డీల్‌లోనూ ఏదో మతలబు జరిగిందన్నమాట..''

చైర్మన్‌ నెమ్మదిగా తలాడించాడు. ''..జరిగింది. మిలానో ఎక్స్‌ప్రెసో కథనం నేను నమ్మలేదు. అది ఒక సాధారణ పేపరు. దానికి పెద్దగా సర్క్యులేషన్‌ కూడా లేదు. మీ హోటల్లో ఆ పేపరు వేస్తారు కాబట్టి అదొక్కటే నీకు తెలుసు. అడ్రసు పట్టుకుని వాళ్ల దగ్గరకి వెళ్లి వుంటావు. ఆంటోనినో మెసేజ్‌ తర్వాత డీల్‌ డాక్యుమెంట్లన్నీ తెప్పించి చదువుతూ కూర్చున్నాను. ఇప్పటిదాకా అదే పని.''

''ఆ డీల్‌ గురించి ఆ జర్నలిస్టుకు వివరాలెవరిచ్చారో?'' రాహుల్‌ తనలో తను ఆశ్చర్యపడుతూ పైకి అనేశాడు.

''ఎవరూ యివ్వలేదు. అసలా కథనంలో దాని గురించి పెద్దగా రాయనూ లేదు. నీ సమాచారం వచ్చాక మా స్టాఫ్‌లో ఎవర్నో అడిగి వుంటాడు. వాళ్లకు సంగతులు తెలియకపోయినా అలాటి సందేహాలుంటాయని చెప్పి వుంటారు. అది చాలు వాడికి, రాసేశాడు. కాదని నిరూపించుకోవలసిన పని మా నెత్తిన పెట్టాడు.''

''ఆ మాత్రం దానికి ఆంటోనినో అంత బెదరడం దేనికి? అక్కడకు పరుగులు పెట్టడం దేనికి?''

''అదే తమాషా. ఒకలా చెప్పాలంటే నీ అదృష్టం. డీల్‌ గురించి మాకిక్కడ ఏమీ తెలియకపోయినా, ఫిలిప్పీన్స్‌ లోకల్‌ మీడియాకు సందేహాలు బలంగా వున్నాయి. వాళ్లలో ఓ పెద్ద పత్రిక చాలా సమాచారం సేకరించి, దగ్గర పెట్టుకుంది. ఒక విలేకరి అనేక ఆధారాలతో పూర్తి కథనం రాసి రెడీగా పెట్టాడు. కానీ ఎడిటరు ఒక నిర్ధారణకు రాలేకపోయాడు. ఏదైనా పొరపాటు జరిగితే పెద్ద కంపెనీతో పేచీ వస్తుంది, యాడ్స్‌ పోతాయని భయపడ్డాడు. ఈ మిలానో ఎక్స్‌ప్రెసో కథనం ఆన్‌లైన్‌లో వచ్చేటప్పటికి అతనికి ధైర్యం వచ్చింది. దీనికి పరపతి లేదన్న సంగతి యిక్కడ తెలుసు కానీ ఆన్‌లైన్‌లో చూస్తే ప్రతీదీ పెద్ద పేపరే. ప్రతీ దానికీ ఇంగ్లీషు వెర్షన్‌ ఒకటి పైగా! కంపెనీ హెడ్‌క్వార్టర్స్‌ వున్న వూళ్లో పేపరు వేసిందన్న ధీమా కలిగింది. దానికి తోడు ఆంటోనినో స్వయంగా అక్కడకు వెళ్లడంతో మసిపూసి మారేడుకాయ చేయడానికే వచ్చాడనే నిర్ధారణకు వచ్చాడా ఎడిటరు. ఇవాళ పొద్దున్న పేపర్లో వేసేశాడు.''

ఇక్కడ దాకా చెప్పి చైర్మన్‌ తల వంచుకుని ఆలోచనల్లో పడడంతో రాహుల్‌కి ఏమనాలో, ఏం చేయాలో తెలియలేదు. ఏమైతేనేం, ఆంటోనినో స్వయంగా తప్పు ఒప్పుకోవడంతో తను చెప్పినది వాస్తవమే అని చైర్మన్‌ నమ్ముతాడు, తనను క్షేమంగా యింటికి వెళ్లనిస్తాడు. అది చాలు తనకు, ఇండియా వెళ్లాక తన కంపెనీ వాళ్లతో ఎలా వేగాలో దారి కనబడకపోదు. ''నేను యివాళ ఇండియాకు తిరిగి వెళ్లవచ్చా?'' అని అడిగాడు నోరు పెగల్చుకుని.

చైర్మన్‌ తల ఎత్తాడు. ''వెళ్లవచ్చు కానీ నీకు ప్రమాదం కదా. నేనెలాగూ యీ డీల్‌ కాన్సిల్‌ చేయబోతున్నాను. దానికి కారణం నువ్వే అని మీ వాళ్లకు యీ పాటికే తెలిసి వుంటుంది. నిన్నక్కడ బతకనిస్తారా?'' అని జాలిగా అడిగాడు.

''ఆ ప్రమాదం లేకపోలేదు. కానీ ఏ సాహసంతో యిక్కడకు వచ్చానో, అదే సాహసంతో తిరిగి వెళతాను.''

చైర్మన్‌ కళ్లు విప్పార్చి మెచ్చుకోలుగా చూశాడు. ''మా నాన్న చెపుతూ వుండేవాడు - ఫేట్‌ ఫేవర్స్‌ డేర్‌ అని. ఆయనే యీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. నువ్వు ఏ ధైర్యంతో యిక్కడకు వచ్చావో తెలియదు కానీ ఫిలిప్పీన్స్‌ లింక్‌, ఆంటోనినో ఆత్మహత్య - యీ సంఘటనలన్నీ యాదృచ్ఛికంగా జరిగినవే. కానీ సాహసం అన్ని వేళలా పనికి రాదు. ఇండియా వెళ్లకు.''

రాహుల్‌ చిరునవ్వు నవ్వాడు. ''వెళ్లకపోతే ముద్ద ఎలా వస్త్తుంది? అక్కడైతే నాకో ప్రొఫైల్‌ వుంది. నేనేమిటో కార్పోరేట్‌ సర్కిల్స్‌లో తెలుసు. ఏదో ఒక ఇండియన్‌ కంపెనీలో వాళ్ల ఓవర్సీస్‌ బ్రాంచ్‌లోనే పోస్టింగు తెచ్చుకోవచ్చు. ఇక్కడేముంది?''

చైర్మన్‌ అతని కేసి దీర్ఘంగా చూశాడు. ''నిజం చెప్పాలంటే యీ టేకోవర్‌ సినారియోలో నువ్వొక చిన్న శీలవి. కానీ శీలమున్న శీలవి. ఈ రోజుల్లో టాలెంటున్నవాళ్లు చాలామంది కనబడుతున్నారు, కానీ కారెక్టరున్నవాళ్లు కనబడటం లేదు. కంపెనీ మునిగిపోతుంటే రిస్కు తీసుకుని కాపాడరు, పారిపోతారు. వీలుంటే మోసం చేస్తారు. గురువుగారు, మేధావి కదాని ఆంటోనినోకు పోస్టు యిస్తే ఏం చేశాడో చూడు. నిస్వార్థంగా మంచి చేసే నీలాటి గుణవంతుణ్ని, సాహసవంతుణ్ని వదులుకోకూడదు. మా గ్రూపు కంపెనీల్లో చేరు. నీకు తగిన పోస్టింగు ఏదో నువ్వే వెతుక్కో. నీ ఫ్యామిలీని కూడా రప్పించేస్తాను. ఇదంతా మా రాజ్యమే. మీ కంపెనీ వాడే కాదు, వాడి తలలో జేజెమ్మ కూడా యిటువైపు కన్నెత్తి చూడలేదు.'' అన్నాడు.

రాహుల్‌ మొహం విప్పారింది. ''మీరు నా సెల్‌ఫోన్‌ నాకు తిరిగి యిప్పిస్తే మా ఆవిడకు ఫోన్‌ చేసి యీ కబురు చెప్తాను. ఒక్కోప్పుడు చిన్నచిన్న శీలలు కూడా యంత్రాల దిశ మార్చేయగలుతాయని చెప్తాను.'' అన్నాడు.

అక్టోబరు 2015లో స్వాతి వారపత్రిక నిర్వహించిన సాహస కథల పోటీలోరూ.10,000ల ప్రథమ బహుమతి పొందిన పది కథల్లో యిది కూడా ఒకటి. 2016 ఫిబ్రవరి 19 సంచికలో ప్రచురితం

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

mbsprasad@gmail.com