Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ కథ: రాంపండూ-పెసరట్ల సుబ్బీ

''సుబ్బి - ఈ పేరు ఎలా ఉంది?''

''గొబ్బెమ్మలా ఉంది''

''జోక్స్‌ కాదు, నిజంగా ఒకసారి మనస్సులో అనుకుని చూడు. సు..బ్బి... మెత్తగా, హాయిగా, ఆనందంగా, ఆహ్లాదంగా, ఆస్వాదమో మరోటో లేకపోతే 'ఆ'తో వచ్చే ఇంకోదానిలాగానో లేదూ''

''నా కేమీగా లేదు''

''తొందరపడి నీ అజ్ఞానాన్ని ఒప్పేసుకోవద్దు. నిదానించు. నాలుగుసార్లు అనుకుని చూడు. సు...బ్‌.... బి.... అహ్‌ఁ''

''ఇంతకీ అదేదో నీ కొత్త లవర్‌ పేరయివుంటుంది. అంతేనా? అంత పాతపేరుకింత కవిత్వం ఎందుకు?''

''పాతపేరేమిట్రా? అది మన తెలుగు పేరు. నేటివ్‌నేమ్‌. అనూష్కా, రబైష్కా అని రష్యన్‌ పేర్లు పెట్టుకోవాలా? నీకు అయిదు నిమిషాలు టైమిస్తున్నాను. ఆ పేరు తలుచుకుని నిన్ను నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్‌ చేసుకొని చూడు. మనసులో చిలక ఎగిరిపోతున్నట్టు, చుట్టూ కారువసంతం కమ్మేసినట్టు, కాళ్ళు తేలిపోతున్నట్టు...''

''ఒరే, నువ్వు కవిత్వం చెప్పే ప్రయత్నాలు ఆపేయ్‌. తెలుగుభాష ఖూనీ అయిపోతోంది. నువ్వన్న ఫీలింగులేవీ నా మనస్సులో మెదలటం లేదు. నువ్వేదైనా చెప్పేడేచిదేదైనా ఉంటే చెప్పేడు. లేదా ఏడ్చేసి చెప్పు''.

''నీకు బుర్రలేదన్న సంగతి నాకు చిన్నప్పుడే తెలుసు. హైస్కూలు రోజులనుంచి చూస్తున్నాను. ఎప్పటికైనా బుర్ర ఎదగకపోతుందా, వీడికి అబ్జర్వేషన్‌ పెరక్కపోతుందా అని.... అబ్బే...''

ఈ బాల్యమిత్రులలో సుబ్బి ప్రేమలో పడికొట్టుకుపోతున్న యువకుడే రాంపండు. ముందూ వెనకా ఎవరూ లేని అతనికి డబ్బు వచ్చే ఏకైక సాధనం వాళ్ల బాబాయ్‌ నెలనెలా ఇచ్చే పాకెట్‌మనీయే. ప్రేమలో పడుతూండడం అనే పెద్దపనిలో తలమునకలుగా ఉంటూంటాడు. కాబట్టి ఉద్యోగం లాటి చిన్నచిన్న వ్యాపకాలేమీ పెట్టుకోలేదు. అయినా అతని ఫ్రెండ్సెవరూ కూడా ఉద్యోగాలు చేసే బాపతు కాదు.

ప్రస్తుతం సుబ్బి పేరులో గొప్పతనాన్ని గుర్తించలేక పోతున్న(ఆ రకం ఫ్రెండ్సులో)ఆ అనంతం కూడా ఒకడు. పూర్తిపేరు అనంతశయనం. తల్లీదండ్రీ కాలుమీద కాలు వేసుకుని తిన్నా తరగనంత ఆస్తి ఇచ్చిపోయారు. కానీ కాలు మీద కాలు వేసి పెట్టేవాణ్ని అమర్చి పెట్టకపోవడంతో తనే వెతుక్కున్నాడు. - అచలపతి అనే సహచరుణ్ని. అనంతం పనులన్నీ - ఆలోచించడంతో సహా - అచలపతే చూసుకోవడంతో అనంతం బుర్ర తుప్పుపట్టిపోయిందని రాంపండులాంటి వాళ్ల అనుమానం. ప్రజలలా అనుకుని పోతున్నారని అనంతానికి తెలుసు. అందుకే ఉక్రోషంతో....

''ఒరేయ్‌, నీ సర్టిఫికెట్లు నువ్వే ఉంచుకో, ప్రేమా, దోమా వ్యవహారాలన్నీ నీకే! నేను హాయిగా లక్కీ బ్యాచిలర్‌గా గడిపేస్తున్న వాణ్ని. నా వల్ల కావలసిన సాయం ఏదైనా  ఉంటే చెప్పు. చేతనైతే చేస్తా. లేకపోతే హాయిగా క్లబ్బుకి పోతా'' అన్నాడు.

రాంపండు దిగొచ్చాడు.  ''మైడియర్‌ అనంతం! నువ్వు సాయంత్రం నేను చెప్పిన చోటుకు రావాలి. సుబ్బిని చూడాలి. నా సెలక్షన్‌ని మెచ్చుకోవాలి. ఆ తర్వాతే ఏమైనా సాయం కావాలంటే అడుగుతా'' అన్నాడు.

''సరే ఎక్కడ చూడాలి? నీ సంగతి నాకు తెలియదా? ఏదో హోటల్లో డిన్నర్‌ ఏర్పాటు చేసి  ఉంటావు. ఎక్కడ?.... కాకతీయ గ్రాండా?''

''కాకతీయా కాదులే. ఆ దగ్గర్లోనే....''

**********

ఆ ప్రకారం రాంపండు చెప్పిన చోటుకి వెళ్ళి చూడగా 'భూగోళశాస్త్రం' రీత్యా చూస్తే రాంపండు చెప్పినది కరెక్టే ననిపించింది. అది కాకతీయాకు దగ్గర్లోనే గుడిసెల మధ్య ఉంది. 'కానీ ఇంత నాసిరకం హోటల్లో గర్ల్‌ ఫ్రెండుకి డిన్నర్‌ ఇచ్చేస్థాయికి దిగజారాడా మనవాడు? వచ్చీ రాగానే అడగాలి' అని అనుకున్నాడు అనంతం విరిగిన కుర్చీల్లో కూచోడానికి అవస్థపడుతూ.

అంతలోనే రాంపండు రావడం, అక్కడ సర్వర్‌ని పిలిచి 'సుబ్బిని పిలు' అని చెప్పడం జరిగిపోయాయి. హోటల్‌ గురించి అడగదలచుకున్న ప్రశ్న వాయిదా వేసి, ''ఒరే రాంపండూ, మరీ పాతకాలం పేరెందుకు పెట్టిందిరా వాళ్లమ్మ?'' అని ఉత్సుకతతో అడిగేడు అనంతం.

''ఎందుకంటె తన పేరు సావాలమ్మ కాబట్టి'' అని రాంపండు జవాబు చెప్పేడు. ''సావాలమ్మ అమ్మ మాత్రం....''అని అనంతం అనుబంధ ప్రశ్న వేసేటంతలో ఓ అందమైన అమ్మాయి చకచక వచ్చి ''అల్లం పెసరట్టాండి?  ఉల్లిపాయా? నాపోతే రెండూ కలేసి ఏసేయమంటారా?'' అనడిగింది హుషారుగా.

అనంతానికి బుర్ర తిరగ నారంభించింది. ఆ తిరుగుతున్న బుర్రలోకే ఆ అమ్మాయిని సుబ్బిగా రాంపండు పరిచయం చేయడం, అలా వెళ్లగా చూసి తన సెలక్షన్‌ బాగుందాని అడగడం, పెసరట్లు పోయడంలో సుబ్బి నైపుణ్యాన్ని వర్ణించడం, పెళ్లి ఎక్కడ చేసుకుందా మనుకుంటున్నాడో చెప్పడం - ఇవన్నీ దూరాయి.

గబగబా బయటకు లాక్కొచ్చి అడిగేశాడు. ''ఒరేయ్‌, మీ బాబాయ్‌ అసలే పరమ ఛాందసుడు. ఇలా పెసరట్ల సుబ్బిని చేసుకుంటానంటే ఒప్పుకుంటాడ్రా? నీకు ఇచ్చే పాకెట్‌మనీ కూడా ఇవ్వడం మానేస్తే నువ్వేం తింటావ్‌? మీ సుబ్బికేం పెడతావ్‌?'' అని.

''అందుకే కదరా నిన్ను పిలుచుకుని వచ్చింది. నువ్వేదైనా చేసి మా ఇద్దరికి పెళ్లి జరిగేట్లా చూడాలి''.

''నేనా!?''

''నువ్వంటే... అచలపతి.... నీకెక్కడ బుర్రేడిచిందిలే! అచలపతికి నా కేసు పూర్వాపరాలు చెప్పి సలహా అడుగు''.

అచలపతికి పూర్వాపరాలు చెప్పనవసరం లేక పోయింది. రాంపండు కథ ముందే తెలుసున్నట్టు మాట్లాడేడు. రాంపండు బాబయ్య గురించి కూడా చాలా చెప్పాడు.

ఆయన రాంవరం సింహాద్రిరావు గారని చాలా డబ్బు సంపాదించాడు. కష్టార్జితమే. భార్యపోయింది. పిల్లలు అమెరికాలో సెటిలయ్యారు. చాలా ఖరాఖండీ మనిషి కావడంతో పిల్లలతో పడలేదు. ఎవరితోనూ కలవడు. విడిగా హాయిగా ఉంటున్నాడు. వంట చేసి పెట్టడానికి వెంకమ్మగారనే విధవావిడ ఉంది. సింహాద్రిగారు జిహ్వచాపల్యం మనిషి కావడంతో వెంకమ్మ గారిని మాటిమాటికి టిఫిన్లు చేసిపెట్టమని అడుగుతూంటాడు. వేరే చోట ఉంటే రాకపోకలు కష్టమని తిండీ, బట్టా పెట్టి ఇంట్లోనే ఉండమన్నాడు. సుష్టుగా తినడం, పేపరు చదువుకోవడం, డబ్బు వడ్డీలకు తిప్పుకోవడం తప్ప వేరే పనులేమీ లేవు. తన వంశం వాడే కదాన్న జాలితో రాంపండుని నెలకోసారి పిలిచి కాస్త డబ్బు, ఇంకాస్త చివాట్లు పెట్టి పంపుతాడు.

ఇదంతా వినగానే అనంతానికి ఐడియా వచ్చేసింది. ''ఆయనకి చిరుతిళ్లు ఇష్టం కాబట్టి రాంపండు గాడు ఓ నాలుగు కిలోలు పుల్లారెడ్డి స్వీట్స్‌ పట్టుకెళ్ళి... కాదు, కాదు సుబ్బి చేసిన పెసరట్లు పట్టుకెళ్లి ఇచ్చి మీ క్కాబోయే కోడలు చేసినవని చెప్పి....''

''సర్‌, ప్రస్తుతానికి అవేమీ తినే స్థితిలో లేడండాయన. బాగా తిని, తిని అజీర్తి చేసింది. రెండు నెలలపాటు లైటుగా తినమన్నాడు డాక్టరు. హఠాత్తుగా ప్రాణభయం పట్టుకుంది. రోజూ శాస్తుర్లు గారిని పిలిపించి పురాణం చదివించుకుంటున్నాడు'' అన్నాడు అచలపతి.

''ఇన్ని వివరాలు నీకెలా తెలుస్తాయి, అచలపతీ? ఏం తింటావ్‌?''అనడిగాడు అనంతం.

''మీకు పెట్టేదే సర్‌''. అన్నాడు అచలపతి అతి క్లుప్తంగా.

అనంతానికి నమ్మకం చిక్కలేదు. అయినా దాని గురించి ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేసి, అహాన్ని పక్కకు పెట్టి జనాభిప్రాయంతో ఏకీభవిస్తూ, ''అచలపతీ, మన రాంపండుగాడి ప్రాబ్లం ఎలా సాల్వ్‌ చేయాలో కాస్త ఆలోచించి చూడు. నాక్కాస్త తలనొప్పిగా ఉంది. ప్రస్తుతం ఆలోచించడానికి కష్టంగా ఉంది'' అన్నాడు లౌక్యంగా.

''దీనిలో ఆలోచించడానికి ఏమీ లేదు సర్‌. రాంపండు గారు సుబ్బిని వదులుకోనంటున్నాడు. ఆయన మనసు మారదంటున్నారు. అంటే అటునుంచి నరుక్కురావాలంటే పెద్దాయన మనసు, అంటే ఆలోచనా విధానం మార్చుకురావాలి'' అన్నాడు అచలపతి అతి కూల్‌గా.

''అది నిజమే. కానీ పాతకాలం మనిషి ఆయన ఏం మారతాడు? ప్రేమంటే ఆయనకేం తెలుస్తుంది? ఏ పన్నెండో ఏటో పెద్దవాళ్లు చెప్పిన పిల్ల మెళ్లో తాళికట్టి సంసారం చేసి ఉంటాడు. వీడెళ్లి అడిగితే ప్రేమా, దోమా ఏమిటి పోరా అంటాడు'' అంటూ పాయింటు లాగేడు అనంతం.

''మీరు చాలా కరక్టుగా చెప్పారు సర్‌. అందుకే ఆయన చేత కల్పనారాణి నవలలు చదివించమంటాను. ఆయన దృక్పథంలో తప్పకుండా మార్పు వస్తుంది''.

''కల్పనారాణా? అంటే ఆరడుగుల ధనవంతుడు మధ్యతరగతి అమ్మాయిని వరించి, వెంటపడే కథలా? నేను ఒకటి రెండు చదివాను కానీ నాకేం నచ్చలేదు.''

''దానికి కారణం మీరు మధ్యతరగతి అమ్మాయి కాదు కాబట్టి! ఆవిడ చాలా నవలలు రాసింది. ఏ వయస్సు వారైనా, ఏ లెవెల్‌ వారైనా సరే ప్రేమకు అతీతులు కారని చాటి చెబుతాయవి. అవి చదివి వినిపిస్తే సింహాద్రిగారు తప్పకుండా మారతారని నా నమ్మకం సర్‌''.

''అలాటివి చదివి వినిపిస్తానంటే కర్ర పుచ్చుకుంటాడు. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్‌ చేస్తావ్‌?''

''పురాణం శాస్తుర్లు గారికి లంచం పెట్టడం ద్వారా....'' అన్నాడు అచలపతి తేలిగ్గా.

**********

సింహాద్రిగారు పడకకుర్చీలో పులిలా కూచుని ఉన్నాడు. ఎదురుగా శాస్తుర్లు గారు మహాభారతం శ్రావ్యంగా పాడి వినిపిస్తున్నాడు. శంతనుడు పెళ్లి చేసుకోమని సత్యవతిని ఎలా బతిమాలుతున్నాడో మరీ మరీ చదువుతున్నాడు. సింహాద్రి గారికి విసుగు పుట్టింది.

''మరీ అంత సాగదీయడం ఎందుకండీ శాస్తుర్లు గారూ! ఏవిటో పిట్ట కథలు. చేపలు పట్టేదాన్ని చూసి ఒక రాజుగారు అంత అంగలార్చడం దేనికి? రాజే ఏమిటి, అంతకుముందు ఓ ఋషి గారు కూడా మహా మోహపడిపోయాడన్నారు. లోకంలో జరిగే విషయాలా ఇవి?''

''ఎంతమాట సెలవిచ్చారు? అప్పటికాలమే అనేముంది.... ఇప్పుడు కూడా చూస్తున్నాం. రాజాధిరాజులాటి  పారిశ్రామికవేత్త  కొడుకు ఒక సినిమా నటినీ, అదీ ఇంకో ఏక్టరుతో కొంతకాలం కాపురం చేసినదాన్ని... వరించి పెళ్లాడలేదూ? ప్రేమ బాబూ, ప్రేమ.... దాని మహత్తు అలాటిది. ఆ మధ్య మా మనవడు ఓ పుస్తకం తెస్తే చదివా. కల్పనారాణి అనే ఆవిడ రాసింది. నిజంగా జరిగిన కథని పేర్లు మార్చి రాసానని ముందుమాటలో రాసుకుంది. ప్రేమ గురించి ఏం రాసిందని...?'' చెబుతూంటే శాస్తుర్లు గారు కళ్లు  అర్ధనిమీలితాలయిపోయాయి.

సింహాద్రి గారికి పంతం వచ్చింది. ''ఏమిటండీ గాడిదగుడ్డు ప్రేమ? రేపా పుస్తకం పట్టుకురండి. దాన్నిండా ఎన్ని అవకతవకలున్నాయో చెబుతాను'' అంటూ ఛాలెంజ్‌ చేశాడు.

**********

నెల తిరక్కుండానే రాంపండు అనంతానికి ఫోన్‌ చేశాడు. ''మా బాబయ్య నిన్ను చూద్దామనుకుంటున్నాడ్రా'' అని.

అనంతానికి ఆశ్చర్యం.

''నన్ను చూద్దామని తహతహలాడే వాళ్లెవరినీ నేనిప్పటిదాకా చూళ్లేదు. నా గురించి ఏం చెప్పావేమిటి?'' అని అడిగేశాడు సూటిగా.

''అబ్బే, చెప్పేందుకేముంది, మాటల్లో నీ గురించి చెపితే రేపాదివారం లంచ్‌కి పిలు అన్నాడు. పెద్దాయన పిలిచాక వెళ్లకపోతే నొచ్చుకుంటాడు. నీకు పనీ, పాటా ఏముంది కనక. వెళ్లు''.

''నా పనీ పాట గురించి నువ్వు వర్రీ కానక్కరలేదు కానీ. నువ్వూ నాతో రా''

''నాకు సుబ్బితో పాటలు పాడే పని ఉంది. నువ్వు వెళ్లరా. మా బాబయ్య ఏమీ తినేయడులే''.

ఇందులో ఏదో తిరకాసు ఉందని అంతరాత్మ ఘోషిస్తున్నా అనంతానికి అదేమిటో అంతు పట్టలేదు. సుబ్బి వ్యవహారంలో ఒక స్నేహితుడిగా మా వాడికి బుద్ధి చెప్పద్దా అని ఇంటికి పిల్చి తిట్టడానికి ముసలాయన వేసిన ఎత్తేమో ఇది అన్న శంక ఒకటి ఎలాగూ ఉంది. సంప్రదిద్దామంటే సమయానికి అచలపతి ఊళ్లో లేడు. 

ఏమైతే అయిందని ఆదివారం సింహాద్రిగారింటికి వెళ్లాడు. ఆయన రిసీవ్‌  చేసుకున్న తీరు చూడగానే అనుమానాల మాట దేవుడెరుగు... ఉబ్బితబ్బిబ్బవడానికి వీల్లేనంత లెవెల్లో ఆశ్చర్యపోవలసిన అగత్యం ఏర్పడిపోయింది అనంతానికి.

''రండి, రండి.... మిమ్మల్ని  చూడాలని ఎన్నాళ్ల నుండో అనుకుంటున్నాను. మా వాడితో మీ ప్రస్తావన వస్తే 'అయ్యో నాకు తెలియకపోవడమేమిటి? మా బెస్టు ఫ్రెండు' అనేశాడు. ఇక అక్కణ్నుంచి మిమ్మల్ని చూడాలనీ, మీ సలహా కోరాలని ఒకటే ఇది. నా ఆహ్వానాన్ని మన్నించి మీరు రావడం నా అదృష్టం''. అంటూ ముసలాయన కౌగలించుకున్న తీరు చూస్తే అనంతానికి ఆశ్చర్యంతోబాటు, అపనమ్మకం కూడా వేసింది - ఇది కలా? నిజమా? అని. తనగురించి ఇంత ఇదిగా ఎదురు చూసేవాళ్లుంటారని ఎప్పుడూ అనుకోకపోవడం తప్పని తనని తాను తిట్టేసుకున్నాడు అర్జంటుగా.

ఇంతలోనే పనిమనిషి వచ్చి ''చిన్నయ్య రాంపండు గారు మీకు ఫోన్‌ చేసారండి'' అనడంతో జరుగుతున్నది వాస్తవమే అని తెలిసింది.

మెట్లు దిగి ఫోన్‌ అందుకునేసరికి రాంపండు కంఠం ఆదుర్దాగా వినిపించింది. ''ఎంత సేపయిందిరా నువ్వు వచ్చి? కొంపదీసి కల్పనారాణి నువ్వు కాదని చెప్పేశావా?''

''ఇప్పుడే వచ్చాను. మీ బాబయ్య నన్ను చూసి ఆహా, ఓహో అంటున్నాడు. నువ్వు ఫోన్‌ చేసి మంచి సీన్‌ చెడగొట్టేశావ్‌. అవునూ, మధ్యలో కల్పనారాణి గొడవేమిటి?'' అన్నాడు అనంతం విసుగ్గా.

''అది చెప్దామనే ఫోన్‌ చేశా. మా బాబయ్య నిన్ను చూసి అంత ఇదవడానికి కారణం ఏమిటనుకుంటున్నావ్‌? ఆయన అభిమాన రచయిత కల్పనారాణి నువ్వేనని అనుకుంటున్నాడు... అలా నోరెళ్లబెట్టావేమిటి?... ఫోన్‌లో ఆవులించినా పేగుల్లెక్కపెట్టగలనులే!  క్లియర్‌గా చెప్తాను. సరిగ్గా అర్థం చేసుకో. నీ సలహా... నీదేమిటిలే.. మీ అచలపతి సలహా బాగా పని చేసింది. మా బాబాయి ఛాలెంజ్‌ చేసి కల్పనారాణి నవలలు చదివించుకున్నాడుగా. క్రమంగా నచ్చడం మొదలు పెట్టాయి. పోను, పోను వీరాభిమాని అయిపోయాడు. రోజంతా అవే చదివించుకుని, చదివించుకుని మొత్తం నవలలు అన్నీ చదివించి పారేశాడు. ఇక అప్పణ్నుంచి ఆ రచయిత్రిని కలవాలని ఒకటే కలవరింతలు''.

''మంచిదే. ఆ పబ్లిషరు నడిగితే ఆవిడ ఎడ్రసు చెబుతాడుగా. మధ్యలో నా పేరెందుకు చెప్పావ్‌?'' అడిగాడు అనంతం అతి చికాగ్గా.

రాంపండు కూడా విసుక్కున్నాడు అనంతం తెలివితక్కువతనానికి- ''ఆవిడని పిలిస్తే నాకేం లాభంరా? అవిడ నా తరపున వాదిస్తుందన్న నమ్మకం ఏముంది? అందువల్ల నా స్వంత బుర్ర... నీలా అచలపతి బుర్ర ఉపయోగించి కాదొరేయ్‌....  నా సొంత బుర్ర.... అది ఉపయోగించి ఒక ప్లాను వేశా. 'కల్పనారాణి కల్పితమైన పేరు. ఆ కలం పేరు పెట్టుకుని ఫలానా మా క్లాసుమేటు అనంతశయనమే ఈ కథలు రాస్తాడ'ని చెప్పా. అందుకే నీకీ ఆహ్వానం. ఆయన నీ భక్తుడిప్పుడు. ఆస్తులు, అంతరాలు పట్టించుకోవద్దని, నన్నూ సుబ్బిని ఆశీర్వదించమనీ నువ్వు చెప్పు. అంతేకాదు... ఇది  ముఖ్యంగా గుర్తుంచుకో, నువ్వసలే మతిమరుపు గాడివి. నాకిచ్చే పాకెట్‌మనీ చాలదని చెప్పు. ఓ లక్ష ఇలా పడేయమను. ఆయన ఎప్పుడు పోతాడో, ఆస్తి ఎప్పుడు కలిసి వస్తుందో తెలియదు. ఈ లోపున మేం హోటల్‌ పెడదామనుకుంటున్నాం. సుబ్బి పెసరట్లు పోస్తుంది. నేను గల్లా పెట్టె దగ్గర కూచుంటా. అందుచేత వట్టి అక్షింతలతో సరిపెట్టక పెట్టుబడికి ఓ లక్ష... పోనీ రెండు లక్షలు...''

''నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది గానీ నాకీ విషయం ముందే ఎందుకు చెప్పలేదు?'' అనంతం అడిగేడు పళ్లు నూరుకుంటూ.

రాంపండు ఫెళ్లున నవ్వాడు. ''ఏడిచినట్లే ఉన్నాయి నీ తెలివితేటలు. ఇది ముందు చెబితే ఏ ఫూలైనా ఒప్పుకుంటాడురా? అందుకే చెప్పలేదు. సర్లే వెళ్లి పని చూడు. రెండు లక్షలకు తక్కువయితే పుచ్చుకోనని చెప్పు'' అని అనంతం చెప్పేది వినకుండా ఫోన్‌ కట్‌ చేసేశాడు.

**********

ఆ తర్వాత అనంతం పడ్డపాట్లు పగవాడికి కూడా వద్దు. ముసలాయన కథలెలా రాస్తారని, మూడ్‌ ఎలా వస్తుందనీ, అసలిలాటి ఐడియాలు  ఎలా వస్తాయని వంద రకాల ప్రశ్నలు ఉత్సాహంతోనే అడిగినా వాటికి జవాబు చెప్పడం అతనికి ప్రాణ సంకటం అయిపోయింది. అన్నిటికంటె గొప్ప కష్టం కల్పనారాణి రాసిన పుస్తకాల ప్రస్తావన వచ్చినప్పుడు!

''అతకని మనుసులు'లో సౌజన్య పాత్ర అలా ఎందుకు మలిచేరు? మధ్యలోనే రైలెక్కేస్తే పోయేదిగా?'' అని అడిగాడు సింహాద్రిగారు.

ఆ పుస్తకం ఏదో అనంతం చదివితేగా! అందునే 'రైలు సమయానికి వచ్చి ఉండదు' లాటి జవాబేదో ఇచ్చాడు. ముసలాయన తెల్లబోయాడు. అలాగే ''మాలోకమే మా లోకం'', ''అంతరాల సంగతి అంతే!'', ''బంధాలన్నీ బంద్‌'' నవలల విషయంలోనూ ఇంచుమించు అలాటి సమాధానాలే ఎదురయ్యాయి. రచయితలు మూడీ మనుషులని వినివుండడం చేత సర్దుకుని ''భోజనాలు చేద్దాం రండి'' అని పిలిచాడు. 

భోజన సమయానికి రాంపండు అందుకున్నాడు. హమ్మయ్య అనుకున్నాడు అనంతం. ఈ టాపిక్‌ తప్పినందుకు సంతోషించినా రాంపండు సైగల భాష అర్థం కాక అవస్థ పడవలసి వచ్చింది. సింహాద్రిగారు వంటింట్లోకి వెళ్లగా చూసి ''ఓకే అనేశాడా?'' అని అడిగేడు రాంపండు ఆదుర్దాగా.  ''ఏదీ, ఇంకా మొదలు పెట్టలేదే! భోజనాల దగ్గర ఆ సంగతి ఎత్తుదాం'' అని హామీ ఇచ్చాడు.

భోజనం చేస్తూ సింహాద్రిగారు అసలు విషయం చెప్పాడు. ''మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిపించిన కారణం ఒకటి వుంది. మీరు పుస్తకాలు రాస్తారు గానీ అవి ప్రజలను ఎలా ప్రభావితం చేస్తాయో బహుశా తెలుసుకోలేరు. మీ పుస్తకాలు చదివి మారిన వ్యక్తిని కాబట్టి ఆ విషయం మీకు చెప్పి మీ ఆశీస్సులు.. నా కంటె చిన్నవాళ్లు కదా... పోనీ అభినందనలు పొందుదామని పిలిచాను. నేనూ ఒకప్పుడు పెద్దకుటుంబాల వాళ్లు చిన్న కుటుంబాల జోలికి వెళ్లకూడదని అనుకునేవాణ్ని. కానీ ఈనాడు నేను మారిన మనిషిని. దానికి కారణం మీ పుస్తకాలు!'' అని ఎఫెక్టుకోసం కాస్త ఆగాడు.

ప్రశంసలు స్వీకరించడానికి అనంతం తల పంకించి నోరు విప్పబోయేటంతలో సింహాద్రి మళ్లీ అందుకున్నాడు. ''ఉదాహరణకి మనం దోసెలు, పెసరట్లు అవీ తింటాం. బాగున్నాయనుకుంటాం. కానీ దాని వెనుక ఉన్న మనిషి ఎవరు అని పట్టించుకోం... జిలుగువెలుగుల చీరశిల్పం ఎలా వచ్చెనో తెలుసుకోమని ఆత్రేయ చెప్పినట్లు ఇంత రుచైన పెసరట్లు చేసిన ఆ అమృత హస్తం ఎవరిదని ఒక్కసారి ఆలోచిస్తే మనకు వాళ్లమీద ప్రేమ పుట్టుకు వస్తుంది...''

ఇదే సమయమని రాంపండు డొక్కలో పొడవడంతో అనంతం నోరు విప్పబోయాడు, ''అందుకే మీ రాంపండు పెసరట్ల సుబ్బిని...'' అంటూ చెప్పడానికి నోట్లోని స్వీటు అటూ, ఇటూ, సర్దుకోబోతూండగానే ముసలాయన వాక్యం పూర్తి చేసేశాడు. ''.....అందుకే మా వంటావిడ వెంకమ్మను నేను  ప్రేమించడం మొదలు పెట్టాను. అసలు నాకు మొదటినుండీ ఆమె పట్ల ప్రేమ ఉందనుకుంటాను. కానీ పైజాతి అహంభావంతో కళ్లు మూసుకుని ఉన్నాను. మీ పుస్తకాల ధర్మమాని నా కళ్లు తెరుచుకున్నాయి. అందుకే మా వివాహ వార్త మీతోనే మొదటిగా చెప్పి... వెంకమ్మా... ఇలా రా!'' అని పిలిచాడు.

అనంతం పక్క సీట్లో ఉన్న రాంపండు తూలినట్టయ్యాడు. అనంతం ఖంగారుపడి ''రాంపండు..'' అని అనబోయాడు.

సింహాద్రిగారు తన ధోరణిలోనే ఉన్నారు. ''రాంపండు సంగతి చెప్పేదేముంది? ఇన్నాళ్లూ ఏదో నాకు తోచినది నెలనెలా ఇచ్చేవాణ్ని. నాకు సంసారం ఏర్పడుతోంది. కాబట్టి  ఇకపై అలా ఇవ్వడం కుదరదు. వెంకమ్మ ఏముంటుందో మరి! తనకు కూడా పిల్లల్ని కని, గొప్పగా పెంచాలని ఆశ. వారసులకోసం ఆస్తి దాచకపోతే ఎలా? రాంపండు కేముంది? హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు. మీ ''లోకానికి సవాల్‌''లో హీరో డబ్బున్న తండ్రిని కాదని బయటకు వచ్చి ఆటో నడిపి.... ఏరా రాంపండూ, నువ్వది చదివావా?.... అరె, వీడేడీ...'' అంటూ ఖంగారుపడ్డాడు సింహాద్రిగారు.

అప్పటికే రాంపండు కింద మూర్ఛపడి వున్నాడు!

**********

ఊరు నుండి వచ్చాక అచలపతిని మందలించేడు అనంతం - ''నీ సలహా బెడిసి కొట్టింది. పాపం రాంపండు సంగతి ఏమయిందో తెలుసా?''

''విన్నాను సర్‌. సుబ్బి చెప్పింది. ఇంకా ఏమైనా కావాలంటే సాయంత్రం పార్కులో కలిసినప్పుడు అడుగుతాను'' అన్నాడు అచలపతి కూల్‌గా.

''ఇది రెండో మలుపా? సుబ్బి ఎప్పణ్నుంచి తెలుసు నీకు?''

''ముందునుండీ నా ఫ్రెండే! రాంపండు గారు వచ్చి తన చేత హోటల్‌ పెట్టిస్తాననడంతో కాస్త ఊగింది. ఇప్పుడాయన పెసరట్లకే అరువు పెట్టే స్థితికి రావడంతో రాంపండు గారికి రాంరాం చెప్పేసింది.''

''పాపం, ఆ భగ్నహృదయుడి హృదయం ఎప్పటికి రిపేరవుతుందో కదా!'' అంటూ వాపోయాడు అనంతం.

''మీకాయన సంగతి తెలియనిదేముంది? అతి త్వరలోనే అయిపోతుంది'' అన్నాడు అచలపతి.

నిజమే! పదిహేను రోజులు తిరక్కుండా రాంపండు కంటబడింది షాలిని !!!

(పిజి ఉడ్‌హౌస్‌ రాసిన Jeeves exerts Old cerebellum, No Wedding Bells for Bingo కథల ఆధారంగా)

 'హాసం' హాస్య - సంగీత పత్రికలో జనవరి 2002 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

mbsprasad@gmail.com