Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ కథ: సిల్వర్‌ లైనింగ్‌

''చూశారా వెండి ధర ఎలా పెరుగుతోందో. నలభై వేలట. దీపావళి నాటికి కిలో లక్ష అవుతుందట.'' పేపరు చూస్తూ ఆశ్చర్యపోయింది సావిత్రి.

''పెరగనీ, మనకేం పోయింది ! డబ్బున్నవాళ్ల తిక్క కుదురుతుంది. కందిపప్పు రేటు పెరిగితే భయపడాలి గానీ...''  అన్నాడు రాజా ఆవులిస్తూ.

''నాకీ దరిద్రపు బుద్ధులు చూస్తేనే అసహ్యం. అసలు మన పూర్వీకులు వెండి కంచాల్లో వేడి వేడి అన్నం మీద పలుచటి బంగారపు రేకులు వేసుకుని తినేవారట. ఆ వేడికి బంగారం కరిగి అన్నంలోకి వెళ్లి మంచి పుష్టి కలిగేదట..''

''నేనూ తినేవాణ్ని.. పెళ్లిలో మీ నాన్న యిస్తానన్న వెండికంచం నిజంగా యిచ్చి వుంటే..''

''పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా యింకా మా నాన్న మీద పడి ఏడవడం తప్ప మీకేమీ చేతకాదు. రేపు మనకు పిల్లలు పుట్టుకొస్తే మా నాన్నలాగే మీరూ అవిస్తాం, యివిస్తాం అని అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాల్సి వుంటుంది. అప్పుడు మీ అల్లుడూ మిమ్మల్ని యిలాగే దెప్పుతాడు.'' 

సావిత్రి అన్నమాట రాజాకు సూటిగా నాటుకుంది. ''అయితే ఏమిటంటావ్‌? సిల్వర్‌ కాయిన్‌ ఏమైనా కొని పెడదామంటావా?'' అన్నాడు కాస్సేపటికి. 

''మళ్లీ దరిద్రపు బుద్ధులే'' అంటూ మండిపడింది సావిత్రి. వెంటనే ఐడియా చెప్పింది. ఓ రెండు వెండి కంచాలు కొని పడేయాలంది. కేజీన్నరలో రెండూ వచ్చేస్తాయిట. వాటిలో అన్నం తింటే చాలా మంచిది. వాడుకున్నంతకాలం వాడుకుని కావాలంటే కూతురి పెళ్లి టైముకి మార్పించేసుకోవచ్చు. ఒక్క కంచంతోనే అప్పుడు వెండికంచం, గ్లాసు, పళ్లెం, పూజా సామగ్రి అన్నీ వచ్చేస్తాయి. ఇంకో కంచంతో రెండు కంచాలు వస్తాయి. 

'అలా ఎలా వస్తాయి? అప్పుడు వెండి ధర పెరుగుతుంది కదా' అన్నాడు రాజా. 'ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు ధరలు పెరిగి నాలుగు వందల గ్రాములతోనే నాజూగ్గా కంచాలు చేస్తార'ంది సావిత్రి. ఐడియా బాగానే వుంది కానీ యిప్పుడు అరవై, అరవై ఐదు వేలు ఎలా వస్తాయన్నాడు రాజా. 

''మీరు ఒప్పుకున్నారు, అదే పదివేలు...వుండండి బాబాయిని పిలుస్తా..'' అంది సావిత్రి సంతోషంగా.

''.. ఎందుకు, తక్కిన ఏభై వేలు ఆయనిస్తాడా?'' 

''అబ్బ, మా బాబాయిని చూస్తే మీకు ఎక్కడలేని పరాచికాలూ వస్తాయి'' అని విసుక్కుంది సావిత్రి. 

వాళ్ల బాబాయి కామరాజంటే ఆవిడకు చాలా యిష్టం. చిన్నప్పుడు చాలా గారాబం చేశాడట. స్వీట్లు కొనివ్వడమే కాదు, స్కూలు మాన్పించి సినిమాలకు తీసుకెళ్లేవాట్ట. ఈవిడకు తప్ప యింట్లో వారెవరికీ అతనంటే గౌరవం లేదు. ఉద్యోగం-సద్యోగం, పెళ్లీ-పెటాకులూ లేకుండా, గాలికి తిరుగుతూ ఆ పంచనా యీ పంచనా పడివుంటాడని అందరూ తిడుతూ వుంటారు. అందువలన యిక్కడే యిల్లరికపు అల్లుళ్లా తిష్ఠ వేశాడు. రాజా విసుక్కున్నప్పుడల్లా సావిత్రి అంతెత్తున లేస్తుంది. తనకి చాలా లోకజ్ఞానం వుందని, పెద్దదిక్కుగా వుంటాడని వాదిస్తుంది.

**********

కామరాజు నడిగితే 'వెండి కంచాలెెందుకు? అజాగ్రత్తగా వుంటే పనిమనిషి ఎత్తుకుపోతుంది. అలా అని లాకర్‌లో పడేసి పెడితే లాకరు అద్దె దండగ. డబ్బులుంటే శుబ్భరంగా షేర్‌ మార్కెట్లో పెడితే ఆర్నెలలో రెట్టింపు అవుతుంది'' అన్నాడు. అతని కెప్పుడూ అడ్డదారులూ వెతకడమే సరదా. పెట్టుబడి పెట్టేవాడుంటే తనూ, వాడూ ఏడాది తిరక్కుండా కోటీశ్వరులై పోగలరని ప్లాన్లు వేసి ఊరిస్తూ వుంటాడు. 

''సావిత్రీ, యిది నిజమే, వెండి కంచాలు పోతాయి..'' అన్నాడు రాజా వెంటనే.

''అందుకే పనిమనిషికి వేయకుండా మనమే తోముకుందాం.'' అంది సావిత్రి.

పళ్లు పటపటలాడించినా ఎరియర్స్‌ డబ్బుతో వారం తిరక్కుండా కంచాలు కొనాల్సి వచ్చింది రాజాకు. రెండు నెలల పాటు వెండి కంచాల్లోనే తిన్నారు. మొదట్లో శ్రద్ధగానే వున్నా కొన్నాళ్లకు తోమడానికి పడేయడం మొదలెట్టారు. ఓ రోజు మధ్యాహ్నం పడేసిన కంచాలు సాయంత్రం పనిమనిషి వచ్చేవేళకే లేవు. ఇక దాన్నేం అనుమానిస్తారు?

తాము కొన్నదగ్గర్నుంచి వెండి ధర పెరుగుతూంటే సావిత్రి చాలా సంతోషించేది. మనం కొన్న వెండి కంచాల విలువ యిప్పుడెంతో తెలుసాండి? డబ్భయి, డబ్భయి ఐదు, ఎనభై అంటూ చెప్పి మురిసిపోయేది. ఇంకా నయం నేను పట్టుపట్టబట్టి కొన్నారు. లేకపోతే తాత్సారం చేసి యిప్పుడు కొనబోతే ఇంకో పదిహేను వేలు ఎక్కువ అయ్యేది, కొనలేకపోయేవాళ్లం అని. ఇప్పుడు కంచాలు పోగానే ''ఎనభై వేలు పోయాయి'' అని నెత్తి మొత్తుకుంది.

''మనం పెట్టింది అరవై ఐదేగా..'' అడిగాడు రాజా.

''ఇప్పటి రేటు బట్టి చూడాలి. మళ్లీ కొనాలంటే యిప్పటి రేట్లోనే కొనాలిగా..''

''ఎందుకు కొంటాం? ఇలా కంచాలు వాటంతట అవే మాయమై పోతూ వుంటే.. మళ్లీ కొనం కాబట్టి మన నష్టం అరవై ఐదే, ఊరికే పెంచేయకు'' అని లాజిక్‌ లాగాడు రాజా.

అంత లెక్కప్రకారం మాట్లాడితే సావిత్రికి ఒళ్లుమండిపోయింది. ''నన్ను దెప్పడం పక్కనబెట్టి కంచాలు సంపాదించే సాధనం చూడండి'' అంది. ''పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరుకు తిరిగి రాకపోగా వాళ్ల మామూళ్లకి ఎదురివ్వాల్సి వుంటుంది'' అన్నాడు రాజా. 'సరైన విధంగా పోలీసులను పట్టుకుంటే పనులవుతాయి. ఆ తెలివితేటలుంటేగా..' అని యీసడించి 'బాబాయ్‌' అని మొరపెట్టింది సావిత్రి. 

కామరాజు చక్రం తిప్పాడు. డియస్పీ తనకు తెలిసున్నవాడేట. వెళ్లి చెప్పి వచ్చాడు. వారం తిరక్కుండా కంచాలు యింట్లో ప్రత్యక్షమయ్యాయి. వాటితో బాటు వెండి గ్లాసులు కూడా. ''గ్లాసులు మావి కావు.'' అన్నాడు రాజా నిజాయితీగా.

 తీసుకుని వచ్చిన కానిస్టేబుల్‌ సావిత్రి కేసి తిరిగాడు-''వ్యవహారం తెలియని యిలాటాయనతో ఎలా వేగుతున్నారమ్మా ! డియస్పీగారు చెప్పగానే మా ఎస్సయిగారు వెంటనే వెతికి పట్టుకోమన్నారు. ఇవన్నీ ఓ సెట్టుగా దొరికాయి. తీసేసుకోండి. కేసు మూసేస్తాం. తనంతట తాను యింటికి వచ్చే లక్ష్మికి అడ్డుపడకూడదు. మా కష్టానికి.. ఏదోలా ఫైసల్‌ చేసి డిఎస్పీగారికి మా గురించి ఓ మాట చెప్పండి చాలు. కానిస్టేబుల్‌ కనకయ్య అంటే అయ్యగారు గుర్తుపడతారు.'' 

''పోనీ ఓ వెండిగ్లాసు అతని కిచ్చేయ్‌'' అన్నాడు రాజా సావిత్రిని బెడ్‌రూమ్‌లోకి పిలిచి.

''వద్దు, కంచాలూ, గ్లాసులూ అన్నీ మంచి సెట్టుగా అమిరాయి. డబ్బిచ్చి పంపించండి.'' అని మొండికేసింది సావిత్రి.

రాజా హాల్లోకి వచ్చి ఓ వంద జేబులోంచి తీస్తూంటే కామరాజు పక్క గదిలోకి పిలిచాడు. ''నీకు బొత్తిగా ఏవీ తెలియదయ్యా, స్టేషన్లో ఎంతమంది వుంటారు, పంచుకుంటే యితనికి ఏమైనా మిగలాలా? ఓ రెండు వేలియ్యి.'' 

''అమ్మో, రెండు వేలా? నా దగ్గర ఎక్కడున్నాయి? జీతాలు వచ్చేందుకు యింకా వారం పడుతుంది..''

''ఇదిగో యివి పట్టుకెళ్లి అతనికియ్యి'' అని జేబులోంచి కట్ట తీశాడు కామరాజు.

''ఇంత డబ్బు మీ కెక్కడిది? మీ దగ్గర వంద నోటుకూడా నేనెప్పుడూ చూడలేదే !'' ఆశ్చర్యపడ్డాడు రాజా.

''..పొలం అమ్మేనులే.'' 

''ఇంకా ఎక్కడి పొలం? ఉంచుకున్నదానికి ఎప్పుడో రాసేశారటగా..'' 

''అబ్బ, అదే లేవయ్యా, దాని కూతురు మేజరై పది సెంట్ల భూమి తిరిగి నా పేర రాసింది. చిన్నప్పుడు దాన్ని చాలా ముద్దు చేసేవాణ్నిలే....'' 

''మీ కథే ఓ మిస్టరీ సీరియల్‌'' అని విసుక్కుంటూనే అతనిచ్చిన డబ్బుతో కానిస్టేబుల్ని పంపించేసాడు రాజా. 

**********

ఓ నెల్లాళ్లపాటు కామరాజులో ఔదార్యం పొంగి పొరలింది. రాజా దంపతులకు బట్టలు కొన్నాడు. అవి పెట్టుకోవడానికి బీరువా కొనిపెట్టాడు. కారులో తిరుపతికి తీసుకెళ్లాడు. రోజూ స్వీట్లు తెచ్చాడు. ఇన్నాళ్లూ అతన్ని పూచికపుల్లలా తీసిపారేసినందుకు సావిత్రి రాజాను బాగా దెప్పింది. ఎంత మంచివాడో గమనించనందుకు తిట్టింది. 

రాజా భరించలేక కామరాజును బయటకు తీసుకెళ్లి ''మీరు యిలా మామీద ఖర్చు పెట్టడం ఏమీ బాగా లేదు. ఇకనైనా ఆపండి'' అని ప్రాధేయపడ్డాడు.

''తప్పేముందోయ్‌? ఎటు తిరిగి యిది మీ డబ్బేగా '' అన్నాడు కామరాజు.

''అదెలా?'' తికమకపడ్డాడు రాజా.

''మీ వెండి కంచాలు పట్టుకెళ్లి మార్వాడీ దగ్గర ఏభై వేలకు తాకట్టు పెట్టాను కాబట్టి..'' అని విశదీకరించాడు కామరాజు.

కొయ్యబారిపోయాడు రాజా. అతన్ని ఆ స్థితిలోనే వుంచి కథంతా చెప్పాడు కామరాజు. ''ఆ మార్వాడీ దగ్గర ఎవడో దొంగాడు మన కంచాలూ, యింకోళ్ల గ్లాసులూ కలిపి కొట్టేసి వుంటాడు. పోలీసులకు దొరికిపోయి వుంటాడు. ఆ మార్వాడీ దొంగసొమ్ము డీల్‌ చేస్తాడు కాబట్టి భయపడి పోలీసులకు ఫిర్యాదు చేసి వుండడు. పోలీసుల దగ్గర సరుకు పడి వుంది. నేను డీయస్పీకి చెప్పగానే పట్టుకుని పడేశారు. అవి మన కంచాలే అని వాళ్లకు తెలియదు. ఏవో అన్‌ క్లెయిమ్‌డ్‌గా పడివున్నాయి. మన కిచ్చేశారు.''

''పోలీసుల సంగతి సరే, నా వస్తువే కాజేసి నాతోనే చెప్తున్నారే, ఎంత ధైర్యం మీకు?'' అన్నాడు రాజా తేరుకోగానే.

''మామూలుగా అయితే చెప్పేవాణ్ని కాను. కానీ సులభంగా డబ్బు సంపాదించే ఉపాయం ఒకటి తట్టింది కాబట్టి చెప్పా..'' అన్నాడు కామరాజు.

''ఏమిటది? పక్కింటి వాళ్ల వెండి కంచాలు కూడా కొట్టేయడమా?'' నొసలు చిట్లించి కసిగా అడిగాడు రాజా.

''ఫర్వాలేదు, నీకూ సెన్సాఫ్‌ హ్యూమరుందోయ్‌ ! అది అలా వుంచు, బిజినెస్‌ మాట్లాడదాం. ఇప్పుడు వెండి ధర బాగా పెరిగింది కదా, యాభై.. యాభై కాదులే.., వడ్డీతో యాభై ఐదు వేలనుకో.. అది పట్టుకుని మార్వాడీ దగ్గరకు వెళ్లి తాకట్టులో వున్న కంచాలు యిమ్మనమని దబాయిద్దాం. వాడు లేవంటాడు. అయితే ఒకటిన్నర కేజీల వెండికి విలువ కట్టి యిమ్మనమందాం. హీనపక్షం ఎనభై ఐదు వేలు వస్తాయి. ఒక్క దెబ్బకి ముప్ఫయి వేలు లాభం...'' 

అర్థం చేసుకోవడానికి రాజాకు కాస్త టైము పట్టింది. ''ఇది మాత్రం నాకెందుకు చెప్పినట్టు? మీ దగ్గరే యాభైవేలున్నాయి. ఇంకో ఐదు వేలు ఎవర్నైనా అడిగి తీసుకెళ్లి ముప్ఫయివేలు సంపాదించవచ్చుగా..'' అడిగాడు.

''అందుకే నీకు లోకజ్ఞానం లేదన్నది ! నా దగ్గర ఏభైవేలుంటే నీకెందుకు చెప్తాను? చెప్పానంటే లేవనేగా ! మరి మీ మీద పెట్టిన ఖఱ్చుకి ఎక్కణ్నుంచి వచ్చిందనుకున్నావ్‌? ఆగు.. ఏభైవేలు పెట్టలేదంటావ్‌. కానీ నాకు పాత అప్పులుండవా? ప్రస్తుతం మన దగ్గర సున్నకు సున్న హళ్లికి హళ్లి. అందుకే నీకు ఐడియా చెప్పి ముప్ఫయివేల లాభంలో సగం సగం పంచుకుందామని చెప్పా..''

రాజా తల అడ్డంగా తిప్పాడు. కానీ కామరాజుకి తక్కువ్వాడు కాడు. మూడు రోజుల్లో నిలువుగా ఆడేట్లు చేశాడు. సావిత్రికి చెప్పకూడదన్న షరతుమీద రాజా ఆ డబ్బు అప్పు తెస్తానన్నాడు. ఎందుకైనా మంచిది రౌండ్‌ ఫిగర్‌ అరవైవేలు అప్పు తెమ్మన్నాడు కామరాజు. అది పట్టుకుని మార్వాడీ దగ్గరకు వెళ్లారు. 

''కంచాలు పోయాయి.'' అన్నాడు మార్వాడీ. అయితే మార్కెట్‌ రేటు బట్టి ధర కట్టి క్యాష్‌ యిచ్చేయ్‌ అన్నారు వీళ్లు. ఇవ్వనన్నాడు. కేజీన్నర బరువు తూగే రెండు వెండి కంచాలు చేతిలో పెట్టి లెక్క చెల్లు అన్నాడు. రాజా వూగిసలాగుతూంటే కామరాజు గిల్లాడు. ''పుచ్చేసుకో. నాకో ఐడియా తట్టింది'' అన్నాడు.

మార్వాడీకి కట్టినది పోగా మిగిలిన మూడున్నర వేలూ బారులో తగిలేశాక కామరాజు ఐడియా బయటకు లాగాడు - ''వెండి రేటు ఎలాగూ పెరుగుతోంది. ఇంకో పదివేలు పెరిగాక యివి పట్టుకెళ్లి వెండిషాపులో అమ్మేద్దాం. నీ అరవై వేల అప్పూ తీరిపోగా నలభైవేల పై చిలుకు మిగులుతుంది. ఫిఫ్టీ, ఫిఫ్టీ. ఇంట్లో మన కంచాలు ఎలాగూ భద్రంగా వున్నాయి. ఇదంతా మనకు బోనస్సే'' 

వెండి రేటు పెరగగానే వీళ్లు షాపుల చుట్టూ తిరిగారు. కావాలంటే ఎక్స్‌ఛేంజ్‌ చేసుకుంటాం తప్ప రేటు యిలా వూగిసలాడే రోజుల్లో క్యాష్‌ యివ్వం అన్నారందరూ ముక్తకంఠంతో. అవతల అరవై వేల మీద వడ్డీ పెరుగుతూంటే జేబులోంచి డబ్బేసి కొత్తవేం కొంటాం అన్నాడు రాజా. 

అంతలో రేటు పడిపోసాగింది. ఇలా ఎంత కిందకు పడిపోతుందో, ఎంతకో అంతకు వదుల్చుకోకపోతే నిండా మునిగిపోతాను అని రాజా మొత్తుకుంటే తాకట్టుల మార్వాడీ దగ్గరకే తీసుకెళ్లాడు కామరాజు. రెండు కంచాలూ యిచ్చి నలభై ఐదు వేల రొక్కం తీసుకుని తన అప్పు తీర్చేయబోయాడు రాజా. వడ్డీతో కలిసి ఇంకా ఇరవై వేలు యివ్వాలని తేలింది. రాజా కామరాజుమీద మండిపడ్డాడు, నీ నిర్వాకం వల్లనే యిదంతా అని.

''అల్లుడూ, ఒక్కోసారి యిలాగ అవుతుంది. ఆ డబ్బు సంపాదించడానికి సులభోపాయం వుంది... పేకాట. రోజుకో రెండు వేలు  చేత పట్టుకుని ఆటలో దిగామంటే ఓ రోజు వచ్చినా, మరో రోజు పోయినా వారం తిరిగేసరికి ఐదువేలు నికరంగా మిగులుతాయి. నెల్లాళ్లలో నీ అప్పు చెల్లు..'' అన్నాడు కామరాజు గీతోపదేశం స్టయిల్లో.

''పేకాటలో నెగ్గుతామన్న నమ్మకం ఏమిటి? పోతే..?''

''..నేను లేనూ.. కొబ్బరితోట పోతే పోయింది కానీ పేకాటలో గుట్టుమట్లన్నీ తెలిసాయి. నాకు కావలసినవాడివి, నీకు అవన్నీ నేర్పనుటోయ్‌..?''

ఇక అవాళ్టినుంచి రాజా, కామరాజు వెంట పేకాటకు వెళ్లసాగాడు. సావిత్రి గోల చేయబోయింది కానీ రోజుకి ఐదువందలూ, వెయ్యీ పట్టుకుని వచ్చి చూపిస్తూంటే కాస్త తగ్గింది. ''మీ ఆయనది విన్నింగ్‌ హ్యేండమ్మా. మా అందర్నీ తలదన్నాడు'' అని బాబాయి యిచ్చిన సర్టిఫికెట్టు బాగానే పనిచేసింది. నిజానికి ఆ డబ్బంతా కామరాజు రాజాకు అప్పుగా యిస్తున్నదే. పేకాటలో అంతగా కలిసిరావటం లేదు కానీ రాజా బాగా అలవాటు పడ్డాడు. 

**********

ఇంకో పదిహేనురోజులకు గతంలో వచ్చిన కానిస్టేబులు కనకయ్య రాజా యింటికి వచ్చాడు. ''ఆ వెండి కంచాలు, గ్లాసులూ  ఎస్సయి గారు యిచ్చేయమన్నారండి'' అంటూ. పాత డియస్పీ గారికి బదిలీ అయిందట. కొత్తాయనకు ఎరిగున్నవాళ్ల యింట్లో చోరీ అయిందట. వీటిని పట్టుకెళ్లి వాళ్ల కిస్తారట. లేకపోతే కొత్త డియస్పీగారి దగ్గర మాట వస్తుందట. 

సావిత్రి పులిపిల్లలా పోట్లాడింది. ''మీ యిష్టమమ్మా, యివ్వకపోతే లాకప్‌లోంచి ఎవడ్నో పంపిస్తాం. వాడు వీటితో బాటు తన వాటాగా ఏ నెక్లెస్సో పట్టుకుపోతాడు. ఆ తర్వాత గోలపెట్టి లాభం లేదు.'' అనేశాడు కనకయ్య. 

సావిత్రి గతంలో యిచ్చిన రెండు వేల రూపాయల యినాం గురించి సణుక్కుంటూ కంచాలు, గ్లాసులు వాడి ఎదాన పోసింది. 'మీ పేకాట వల్లనే యీ అరిష్టం' అంటూ ఆ రాత్రే మొగుణ్నీ, మొగుడికి పేకాట మప్పిన బాబాయినీ తిట్టిపోసింది. 'మీ పేకాట డబ్బు ముట్టనైనా ముట్టన'ని ప్రతిజ్ఞ చేసింది. దానికి ఎక్కువ సంతోషించినవాడు బాబయ్యే. 

మర్నాడే పేకాట క్లబ్బులో రాజాకు ఎస్సయి తారసిల్లాడు. కంప్లయింటు వస్తే పట్టుకోవడానికి వచ్చి ఆట చూసి మురిసిపోయి తనూ మెంబరౖౖె పోయాడు. వెండి కంచాల మాట ఎత్తితే 'డియస్పీ గారు చెప్పాక మేమేం చేస్తామండీ' అని నోరు చప్పరించేశాడు. ఆ మాట అబద్ధమని తేలింది యింకో వారం తిరిగేసరికి.

అవేళ రాజా హ్యేండ్‌ మంచి రైజింగ్‌లో వుంది. రాత్రి తొమ్మిదయ్యేసరికి పదివేలు జేబులో పడ్డాయి. ఆ టైములో దిగబడ్డాడు ఎస్సయి. ''రాజాకు యివాళ లక్కీ డే'' అన్నారు తక్కిన మిత్రులు. 

''కాదు, నాకే లక్కీ డే. ఎన్నాళ్లనుంచో అడుగుతున్న విజయవాడ పోస్టింగు వచ్చింది. అక్కడ సంపాదనే సంపాదన. ఇంకోటి కూడా - నన్ను యిన్నాళ్లూ పీడించుకుని తిన్న నా యిలాకా బిచాణా ఎత్తేసింది, యింటి ఎదురుగా వున్న స్టూడెంటు కుర్రాడితో. ..'' అన్నాడు ఎస్సయి.

''..అయితే యిన్నాళ్లూ దానికి పెట్టినదంతా వేస్టన్నమాట!''

''..అబ్బే, ఆ మాత్రం జాగ్రత్త పడనా? నాలుగు రోజుల క్రితమే అనుమానం తగిలి ఓ కానిస్టేబుల్‌కి అక్కడే డ్యూటీ వేశా. సామాన్లతో లేచిపోతే తెలిసిపోతుందని వాళ్లు పొద్దున్న రైల్లో చెక్కేసి, సాయంత్రం వాడి ఫ్రెండుని సామాన్లు పట్టుకురమ్మన్నారు. వాడు తలుపు తెరవగానే మా వాడు ఫోన్‌ చేసి చెప్పాడు. మా కనకయ్య టీమును అటుపంపి యిలా వచ్చా. మనవి మనకు దక్కుడు.'' అన్నాడు ఎస్సయి.

ఎస్సయికి మిగతా విషయాల్లో అదృష్టం మాట ఎలా వున్నా పేకాటలో కలిసి రాలేదు. అతని దగ్గర డబ్బులు నిండుకునే సరికి రాజాకు యింకో పది జమపడ్డాయి. ''ఈ ఇరవై వేలతో నా అప్పు తీరిపోతుంది. దీనితో పేకాటకు మంగళం'' అంటూ లేవబోయాడు అతను. 

అంతలో కనకయ్య వచ్చాడు. ''సార్‌, దాని సరుకులు అమ్మేస్తే లక్షాపాతిక వచ్చింది. ఈ వెండి కంచాలు యింట్లోకి పనికి వస్తాయేమోనని తెచ్చా'' అంటూ. 

''చూశావా, అవి మన కంచాలే. డియస్పీ పేరు చెప్పి కంచాలు వెనక్కి లాక్కుని తను వుంచుకున్నదానికి యిచ్చాడన్నమాట ఎస్సయి గాడు. ఇప్పుడు పెళ్లానికి బహుమతిగా యిస్తాడేమో'' అని రాజాను గోకాడు కామరాజు. 

అతని ఆలోచన గ్రహించినట్లు ''ఆ ఏడుపుమొహానికి ఏమీ అక్కర్లేదులే, యిలా యియ్యి'' అంటూ ఎస్సయి కనకయ్య చేతిలోంచి కంచాలు లాక్కుని, వాటిని గాలిలో వూపుతూ అరిచాడు - ''ఇదిగో యిదే ఆఖరి పందెం. ఒక్కటే ఆట. గెలిస్తే ఆ యిరవై వేలూ నావి. నువ్వు గెలిస్తే యీ కంచాలు నీవి...'' రాజా నోరు తెరవబోయేంతలో యింకా అన్నాడు. ''..అసలు నావే కదా అంటూ హిస్టరీలోకి వెళ్లద్దు. ఇప్పుడు నా చేతిలో వున్నాయి. ఓడిపోతే వాటి వూసెత్తను. ఎలాగూ విజయవాడ వెళ్లిపోతున్నాను. వీళ్లే సాక్ష్యం.. సే ఎస్‌ ఆర్‌ నో..'' అన్నాడు. అతను ఆవేశంగా, కసిగా, పూనకం వచ్చినవాడిలా వున్నాడు.

''ఎవ్‌రీ క్లౌడ్‌ హేజ్‌ సిల్వర్‌ లైనింగ్‌. నీ కష్టాలు పారద్రోలే ఆశాదీపం యిదే. పందెం ఒడ్డేయ్‌'' అని సలహా చెప్పాడు కామరాజు.

''నీ సలహాలు వినే యింతదాకా వచ్చింది. ఇవాళ్టితో అప్పులు తీరిపోయి ఒడ్డున పడదామనుకుంటూంటే మళ్లీ యిదేమిటి? ఓడిపోతే కంచాలూ పోతాయి, అప్పూ తీరదు.'' అని మొరాయించాడు రాజా.

''నీకంత భయమైతే నేనాడతా నీ తరఫున'' ఆఫర్‌ చేశాడు కామరాజు. ఎస్సయి వీరావేశంతో ముక్కలు పంచేస్తున్నాడు. ''ఎవరాడినా నాకు ఒకటే'' అంటూ. ఓ ఐదు నిమిషాల తర్జనభర్జన తర్వాత చివరకు రాజాయే ముక్కలు చేతపట్టాడు. ఆడాడు. ఎట్టకేలకు గెలిచాడు.

**********

ఇంటికి తిరిగి వస్తూ వాళ్లు రైల్వే స్టేషన్‌ దగ్గర ఆగినప్పుడు కామరాజు అన్నాడు - ''నువ్వు నాకు థాంక్స్‌ చెప్పాలోయ్‌, ఇవాళ నీకు జేబులో యిరవై వేలూ, బ్యాగ్‌లో వెండి కంచాలూ వున్నాయంటే దానికి కారణం నేను చేసిన ట్రిక్కు. నీతో వాదులాడుతున్నట్టు నటిస్తూనే ఓ ఆసు నీ ముక్కల్లో కలిపేశా... నువ్వంటే నాకున్న అభిమానం అలాటిది.. అవునూ ఎవరి టిక్కెట్టు కోసం టిటిఇని అంతలా బతిమాలుతున్నావ్‌...'' 

''మా ఫ్రెండు ఇరవైవేలూ బాకీ తీర్చేసి యింటి కెళదామని ఫోన్‌ చేస్తే అతను అర్జంటుగా గుంటూరు వెళ్లాలి. ఎసి ఫస్ట్‌క్లాసు కూపేలో టిక్కెట్టు బుక్‌ చేయమన్నాడు. పైన ఎంతిచ్చినా ఫర్వాలేదన్నాడు''

ఇద్దరూ కూపేలో కూర్చున్నపుడు కామరాజు అడిగాడు ''ట్రెయిన్‌ బయలుదేరేవేళయింది. ఇంకా రాడేం మీవాడు? టిక్కెట్టు వేస్టు కాదూ?''

''వేస్టెందుకవుతుంది? అతని బదులు మీరెళతారు.. తెల్లారేసరికి గుంటూరు స్టేషన్‌లో దిగుతారు. మర్నాటికి మీ సామాన్లు ట్రాన్స్‌పోర్టులో వస్తాయి.''

తెల్లబోతూనే కామరాజు నవ్వు తెప్పించుకున్నాడు ''నన్ను వదుల్చుకుందామనా నీ ప్లాను? తర్వాతి స్టేషన్‌లో దిగి వెనక్కి వచ్చేస్తే..?'' 

రాజా చిరునవ్వు నవ్వాడు. ''ఉదాహరణకి నేను యిప్పుడు మిమ్మల్ని చాచిపెట్టి ఒక్కటిచ్చుకుంటేే కళ్లు తిరిగి బెర్త్‌ మీద పడతారు కదా. గుంటూరు చేరేదాకా స్పృహ రాదుగా!''

కామరాజు అయోమయంగా చూసి ''భలేవాడివే, నన్ను కొట్టి ఎందుకు తరిమేస్తావ్‌్‌? సావిత్రి ఫీలవదూ!?''

''ఎందుకంటే.. అదే నా జీవితానికి సిల్వర్‌ లైనింగ్‌ కనుక. ఇక సావిత్రంటారా? నేను ఫోన్‌ చేసి కంచాల సంగతి చెప్పగానే తనే ఈ ఐడియా యిచ్చింది. మళ్లీ యిటువైపు వస్తే కాల్చి వాతలు పెట్టమంది.''

కామరాజు సీటులోంచి లేవబోయేంతలో రాజా అతని కాలర్‌ పట్టుకుని కసిదీరా, దెబ్బకు స్పృహతప్పేలా ఒక్క గుద్దు గుద్దాడు.

(జూన్‌ 20, 2013 నవ్య వీక్లీలో ప్రచురితం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌