Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ కథలు - స్వరశృంఖల

''రఫ్ఫాడించేస్తానే, పిల్లా, ఉఫ్‌, ఉప్ఫనిపిస్తానే..''

రికార్డింగ్‌ చేయిస్తూ పాట వింటున్న సంగీతదర్శకుడు దినేష్‌ ఉలిక్కిపడ్డాడు. ఇదేమిటి? చిన్న పిల్ల గొంతు పాడుతున్నట్టు వస్తోంది ! అటు చూశాడు. పాడుతున్నది కుమారే ! పాటకు అభినయించవలసిన మేషో స్టార్‌ హావభావాలను అనురిస్తూ కళ్లు మూసుకుని తన్మయత్వంతో పాడుతున్నాడు. ఇటు చూశాడు, ఆర్కెస్ట్రా ఆశ్చర్యం నుండి తేరుకుని పడిపడి నవ్వుతున్నారు.  ప్రాక్టికల్‌ జోక్‌ అనుకుంటున్నారు కాబోలు. పాడుతున్న కుమార్‌కు మాత్రం ఇయర్‌ ఫోన్స్‌లో మామూలుగానే వినబడుతున్నట్టుంది. మంచి వూపులో పాడేస్తున్నాడు.

దినేష్‌ ఆర్కెస్ట్రా కేసి చెయ్యెత్తి నవ్వులాపమన్నట్టు సైగ చేశాడు. కష్టపడి ఆపుకున్నారు. రికార్డు చేస్తున్న టెక్నీషియన్‌ కేసి ప్రశ్నార్థకంగా చూశాడు. అతను అప్పటికే రకరకాల మీటలు నొక్కేసి చూస్తున్నాడు. పెదవి విరిచి, ఏం జరుగుతోందో తెలియలేదన్నట్లు భుజాలు ఎగరేశాడు. దినేష్‌కు మతిపోయింది. కానీ అంతలోనే తేరుకున్నాడు. 'ఏం జరుగుతోందో తర్వాత చూడవచ్చు. మొదట యీ రికార్డింగ్‌ పూర్తి చేయాలి' అనుకుని ఆర్కెస్ట్రా దగ్గరకు వెళ్లి, ''ఇదో కొత్తరకం ప్రయోగం. నేను ముందే చెప్పాల్సింది. మీ నవ్వుల వలన రికార్డింగ్‌ పాడైంది. మళ్లీ మొదటినుండీ చేద్దాం'' అన్నాడు. వాళ్లు తల వూపారు.

లోపలకి వెళ్లి తన్మయత్వంతో పాడుతున్న కుమార్‌ భుజం తట్టాడు ''మళ్లీ యింకో టేక్‌ చేద్దాం'' అన్నాడు.

''ఏం బాగానే వుందిగా...!'' అన్నాడు కుమార్‌. తనంతటి ప్రఖ్యాత గాయకుడు యింత మంచి 'ఫీల్‌'తో పాడుతూంటే మళ్లీ యింకో టేక్‌ అంటాడేమిటని ఆశ్చర్యపడుతూ.

''ప్లీజ్‌.. ఫర్‌ మై సేక్‌..'' అన్నాడు దినేష్‌. దినేష్‌ తన వినూత్న ప్రయోగాలతో తెలుగు సినిమా సంగీతాన్ని ఓ వూపు వూపుతున్న టాప్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌. తననింతటి గాయకుణ్ని చేసింది కూడా అతనే. వ్యక్తిగతంగా స్నేహితుడు కూడా.

''ఓకే''

రికార్డింగ్‌ పూర్తయి, అందరూ వెళ్లిపోయిన తర్వాత కుమార్ని తన గదికి పిల్చుకుపోయి అప్పుడే రికార్డింగ్‌ అయిన పాటని వినిపించాడు దినేష్‌. పాట మొదలవగానే ఫక్కున నవ్వాడు కుమార్‌.

''ఇదేమిటి? నా వాయిస్‌ యిలా మార్చేశావ్‌? భలే ఫన్నీగా వుందే, ఆరేడేళ్ల పాప పాడినట్టు...''

దినేష్‌ సీరియస్‌గా చెప్పాడు - ''నేనేం మార్చలేదు. నువ్వే యిలా పాడావ్‌.''

''నాన్సెన్స్‌ ! నేనెలా పాడానో నా ఇయర్‌ ఫోన్స్‌లో నాకు వినబడదా? మామూలుగానే పాడాను. పాట విని మేషో స్టార్‌ విని పిచ్చెక్కిపోవాలనుకున్నాను...''

''..పిచ్చెక్కుతాడు, యిది వినిపిస్తే.. దానికో ఐడియా ఆలోచించి పెట్టానులే.. ముందు యీ మిస్టరీ విప్పు. పాతికేళ్ల మగాడు పాడితే ఏడేళ్ల పాప పాడినట్టు ఎలా రికార్డయింది?''

కుమార్‌కు కోపం వచ్చింది. ''దానికి సమాధానం చెప్పాల్సింది నువ్వు.  కొత్తకొత్త ప్రయోగాలు చేయడంలో దిట్టవి. బోదురుకప్ప గొంతుగాళ్లని కూడా పట్టుకుని వచ్చి సూపర్‌ సింగర్స్‌ చేశావ్‌. ఇప్పుడు కావాలని నా పాట చెడగొడుతున్నావ్‌. దిసీజ్‌ నాట్‌ ఫెయిర్‌. ఏజ్‌ ఏ ఫ్రెండ్‌, ఏజ్‌ ఏ మెంటార్‌.. అసలు నువ్వు  తయారు చేసిన సింగర్‌ని నేను. ఇవాళ మేషో స్టార్‌కు పాడుతున్నానంటే అది నీ చలవే. అలాటిది నువ్వు నన్ను నాశనం చేద్దామని చూస్తున్నావంటే..'' కుమార్‌ గొంతు పూడుకుపోయింది. 

దినేష్‌ చెయ్యి నెత్తిమీద పెట్టుకున్నాడు. ''కుమార్‌, ఐ స్వేర్‌.. అమ్మ మీద ఒట్టు. నేనేమీ చేయలేదు. నువ్వు పాడుతూంటే మైకులో యిలాగే వినబడింది. ఆర్కెస్ట్రావాళ్లంతా ఒకటే నవ్వు. అందుకనే రీటేక్‌ అన్నాను. వాళ్ల కేదో చెప్పి అనుమానం రాకుండా చేశాను. అందర్నీ పంపించేసి నిన్ను కూర్చోబెట్టాను. పాడేటప్పుడు మాత్రం నీ గొంతు ఎలా మారింది? అందులోనూ మాకు ఒకలా, నీకు ఒకలా ఎలా వినబడుతోంది?''

కుమార్‌ భయపడిపోయాడు. గుడ్లప్పగించి చూస్తూ వుండిపోయాడు.

దినేష్‌ ఓ రెండు నిమిషాలు అలాగే చూసి ''ఈ గొంతు వింటూ వుంటే - కరక్ట్‌ మీ ఇఫ్‌ ఐ యామ్‌ రాంగ్‌, - స్వర్ణ గొంతు గుర్తుకు వస్తోంది. వాడ్డూయూ సే?''

కుమార్‌ పాలిపోయాడు. ఏమీ మాట్లాడలేదు. లేచి అటూ యిటూ తిరిగాడు. సిగరెట్‌ ముట్టించాడు. సగం కాలాక తలెత్తి ''చచ్చి దెయ్యమై తిరుగుతోందంటావా? అయినా యిది ఆ టీవీ స్టూడియో కాదుగా, పోనీ ఆ మైకు కాదుగా..యిదంతా నీ స్వంత ఎక్విప్‌మెంటేగా!''

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

రెండు వారాల తర్వాత డాక్టర్‌ భావే కుమార్‌ని అడిగాడు - ''మీది గొంతు సమస్య అయినప్పుడు, ఇఎన్‌టి డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సింది. సైకియాట్రిస్టు దగ్గరి కెందుకు వచ్చారు? అదీ బొంబాయిలో...''

పాలిపోయి వున్నట్టున్న కుమార్‌ తనను తీసుకుని వచ్చిన దినేష్‌కేసి దీనంగా చూశాడు. దినేష్‌ గొంతు సవరించుకుని చెప్పాడు ''వాళ్ల దగ్గరకు వెళ్లాం డాక్టర్‌ ! క్లినికల్‌గా సమస్య ఏమీ లేదు. ఇది మానసిక సమస్య అనుకుంటున్నాం. అందుకని మీ దగ్గరకు వచ్చాం.''

డాక్టర్‌ కుమార్‌ కేసి చూసి కళ్లెగరేశాడు ''మీరు తెలుగు రంగంలో పాప్యులర్‌ సింగర్‌ట కదా ! ఎవరైనా హీరోయిన్‌తో ప్రేమలో పడి డిప్రెషన్‌లోకి వెళ్లారా? పాడాలంటే గొంతు పెగలటం లేదా?''

''పాడగలుగుతున్నాను డాక్టర్‌. కానీ గొంతు మరోలా ధ్వనిస్తోంది..''

నొసలు చిట్లించాడు డాక్టర్‌. ''కాస్త అర్థమయ్యేట్లు చెప్పండి.''

''జరిగినదంతా చెప్తాను. నేను తప్పు చేసి పశ్చాత్తాప పడుతున్నాను అన్న విషయం గుర్తించుకుని కాస్త సానుభూతితో నా సమస్య వినండి డాక్టర్‌'' అంటూ కుమార్‌ మొదలు పెట్టాడు.

''మీకు తెలియక పోవచ్చు - నేను మూడేళ్లగా తెలుగులో టాప్‌ స్టార్స్‌ అందరికీ పాడుతున్నాను. పబ్లిక్‌లో నాకు బాగా ఫాలోయింగ్‌ వుంది. నెల్లాళ్ల క్రితం హైదరాబాదులోనే ఓ తెలుగు టీవీ ఛానెల్‌ ఓనర్‌ నన్ను వాళ్ల కార్యక్రమం ఓ దానికి పిలిచారు. పదేళ్ల లోపు పిల్లలకి పాటల పోటీ పెట్టి అవార్డులు యిచ్చే కార్యక్రమం అది. దాన్ని ఓ వ్యాఖ్యాత నడుపుతూంటారు. వారం వారం బయటివాళ్లను జడ్జీగా పిలిచి ఎవరు బాగా పాడారో నిర్ణయించమంచారు. క్రమంగా ఎలిమినేట్‌ చేసుకుంటూ వచ్చి చివర్లో బెస్ట్‌ సింగర్‌ను ఎంపిక చేస్తారు..''

''...తెలుసు, యిక్కడ మాకు మరాఠీలోనూ యిలాటి కార్యక్రమాలున్నాయ్‌..''

''..నన్ను ఫైనల్‌ రౌండ్‌లో జడ్జిగా రమ్మనమన్నారు. సరేనన్నాను. కార్యక్రమం ముందు రోజు ఛానెల్‌ చైర్మన్‌ నన్ను పర్శనల్‌గా కలవమన్నారు. వెళ్లాను. అప్పటికి హాట్‌ ఫేవరేట్‌గా వున్న స్వర్ణ అనే అమ్మాయి మీద ఓ ట్రిక్‌ ప్లే చేయాలన్నారు...''

''..ట్క్రికంటే...?''

''ఆ అమ్మాయే విజేత అవుతుందని చాలా మంది బెట్స్‌ కట్టివున్నారు. కోట్లలో నడుస్తోంది వ్యవహారం..''

''..మై గాడ్‌! ఇంత చిన్న విషయం మీదనా..?''

దినేష్‌ కలగజేసుకున్నాడు - ''మా వాళ్ల సంగతి మీకు తెలియదు డాక్టర్‌. కోళ్ల మీద, ఎడ్ల మీదా లక్షల కొద్దీ పందాలు కాస్తారు. ఇక మనుషుల మీద కాయరా? ఎలక్షన్‌లో కాండిడేట్‌కు నెగ్గుతాడా లేదా అనే కాదు, ఎంత మెజారిటీ వస్తుంది, ఫలానా వాడికి డిపాజిట్‌ దక్కుతుందా దక్కదా? ఇలా ప్రతీ దానిమీదా కాస్తారు..''

కుమార్‌ కొనసాగించాడు - ''అనుకున్నదాని కంటె మీకు ఐదు లక్షలు అదనంగా యిస్తాను. ఏదో కారణం చెప్పి ఆమెను విన్నర్‌ కాకుండా చేయండి.' అన్నాడాయన. 'మార్కులు తక్కువ వేస్తే చాలుగా' అన్నాను. 'అదొక్కటే కాదనుకోండి, దానికే ఐతే ఐదులక్షలెందుకు?' అని సాగదీశాడాయన. ఆ అమ్మాయిని పబ్లిగ్గా తిట్లు తిట్టి అవమానించాలట. ఆ అమ్మాయి బిక్కమొహం వేయాలట. ఈ బిట్స్‌ అన్నీ ప్రమోలుగా వాడుకుని ప్రోగ్రాం రేటింగ్స్‌ పెంచుకుంటాడట...''

''..వాట్‌ నాన్సెన్స్‌! ఆల్‌ ఎట్‌ ద కాస్ట్‌ ఆఫ్‌ ఏ చైల్డ్‌..'' వృత్తిధర్మం మరచి డాక్టరు చికాకు పడ్డాడు.

కుమార్‌ నిట్టూర్చాడు - ''అవును డాక్టర్‌. ఓ పసిపిల్లను ఆధారం చేసుకుని యింత వ్యాపారం.., నీచమైన వ్యాపారం జరిగింది. దురదృష్టవశాత్తూ నేను దానిలో పాలుపంచుకున్నాను. మొదట్లో నేను ఒప్పుకోలేదు. కానీ ఆయన రకరకాల ఒత్తిళ్లు తెచ్చాడు. తను మేషో స్టార్‌తో తీయబోయే సినిమాలో బొంబాయి సింగర్స్‌ చేత కాకుండా నా చేతే అన్ని పాటలూ పాడిస్తానని ప్రామిస్‌ చేసి నా చేత యీ దుర్మార్గపు పనికి ఒప్పించాడు...''

''..మరి ఆ అమ్మాయి తలిదండ్రులు గోల చేస్తారన్న భయం లేదా?''

''..సరిగ్గా నేనూ అదే అడిగాను. 'వాళ్లు చాలా బీదవాళ్లు. ఈ అమ్మాయితో బాటు యింకో పిల్ల కూడా పుడితే దాన్ని ఎవరికో దత్తత యిచ్చేసి, ఆ డబ్బుతో దీన్ని సాకుతున్నారు. సంగీతం యిష్టం అంటే నేర్పించారు. ఆ పాప అసలు పేరు బంగారం. కార్యక్రమం నడిపే వ్యాఖ్యాతే స్వర్ణ అని పేరు మార్చి చాలా ఎంకరేజ్‌ చేస్తున్నాడు. ఆ అమ్మాయికి సెకండ్‌ ప్రైజ్‌ వచ్చినా వాళ్లు పొంగిపోతారు. అదే పదివేలు అనుకుంటారు' అని చెప్పారాయన..''

''..ఓకే, ఫైనల్‌ రౌండ్‌లో ఏమైంది..?''

కుమార్‌ తల వంచుకుని చెప్పాడు. ''అవేళ ఆ పాప బాగానే.. చాలా బాగా పాడింది. అయినా నేను ఆమెను వెక్కిరించాను.. ఆమెలాగే గొంతు పెట్టి.. అదే పాట.. మధ్యలో ఆపేసి 'ఇలాగా పాడడం?' అని గద్దించాను. అంతే ఆ పిల్ల బిక్కచచ్చిపోయింది. కళ్లు పెద్దవి చేసి నా కేసి భయంగా చూస్తూ.. కొయ్యబారిపోయింది.  కార్యక్రమం నడిపే యాంకర్‌ 'ఏం ఫర్వాలేదమ్మా, నాకు నచ్చింది' అంటూ దగ్గరకి తీసుకోబోయాడు. కానీ అప్పటికే ఒళ్లు చల్లబడిపోయింది...''

''.. మై గాడ్‌!''

''ఎస్‌.. డాక్టర్‌. ఆ అమ్మాయి దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది..'' కుమార్‌ కుళ్లి కుళ్లి ఏడవసాగాడు.

అతని భుజంపై చేయి వేసి నిమురుతూ దినేష్‌ డాక్టర్‌కు మిగతా కథ చెప్పాడు - ''అనుకోకుండా ఆ పాప  చచ్చిపోవడంతో పెద్ద స్కాండల్‌ అయిపోయింది. ఆ ఛానెల్‌ యజమాని వెంటనే తలిదండ్రులకు పదిలక్షలు పరిహారం ప్రకటించాడు. వాళ్ల దుఃఖమే కాదు, మా వాడి దుఃఖమూ ఎవరూ ఆపలేకపోయారు. మా వాడు చాలా అప్‌సెట్‌ అయ్యాడు. వారం రోజులు పూర్తిగా రెస్టు తీసుకున్నాక రికార్డింగ్‌ పెట్టుకున్నాం.'' అంటూ రికార్డింగ్‌లో జరిగినది చెప్పాడు.

డాక్టర్‌ ట్రీట్‌మెంట్‌ మొదలుపెట్టాడు.

xxxxxxxxxxxxxxxxxx

దినేష్‌ మేషో స్టార్‌తో మాట్లాడాడు. ''నేనో వెరయిటీ ప్రయోగం చేశా. మీరు హీరోయిన్‌ను టీజ్‌ చేస్తూ పాట పాడేటప్పుడు మీ పక్కనే ఏడేళ్ల పాప వుంటుంది, మీ మేనకోడలో, ఫ్రెండ్‌ కూతురో.. ఎవరో. మీరు వెంట్రిలాక్విజమ్‌ చేస్తున్నట్టు ఆ పాప గొంతుతో మీ పాటే పాడతారు...''

''..తమాషాగా వుంది. కానీ చైల్డ్‌ సింగర్‌ చేత అలాటి సెక్సీ సాంగ్‌ పాడిస్తే అల్లరవుతుందేమో..''

''అందుకే, కుమార్‌ చేత చిన్నపిల్ల పాడినట్టు పాడించాను. ఇప్పటిదాకా యిలాటి సాహసం ఎవరూ చేయలేదు.. విని ఎలా వుందో చెప్పండి..''

పాట వినగానే మేషో స్టార్‌ ముగ్ధుడై పోయాడు. సినిమా షూటింగ్‌ యీ పాట పిక్చరైజేషన్‌తోనే మొదలు పెట్టి, దీన్నే ప్రమోగా వాడదామన్నాడు. నెల్లాళ్లు తిరిగేసరికి రాష్ట్రమంతా యిదే పాట మార్మ్రోగింది. ఆ పాట ఎలా రూపుదిద్దుకుందో దినేష్‌, కుమార్‌ టీవీ యింటర్వ్యూలు యిచ్చారు. ''విచిత్ర సోదరులు'' లో పొట్టివాడిగా కనబడడానికి కమలహాసన్‌, సింగీతం ఎంత శ్రమించారో తాము అంతకంటె ఎక్కువ శ్రమించామని, కొన్ని నెలల పాటు రహస్యంగా సాధన చేశామని చెప్పుకున్నారు. 

ఆ కార్యక్రమం చూసిన ఓ పారిశ్రామికవేత్త ఓ ఆల్బమ్‌ చేస్తానని ముందుకు వచ్చాడు. కుమార్‌ గతంలో పాడిన కొన్ని పాటలను యిప్పుడు చిన్నపిల్ల గొంతుతో రీమిక్స్‌ చేయాలన్నాడు. పాతదీ కొత్తదీ కలిపి ఓ తండ్రీ, కూతురూ కలిపి పాడినట్లు డిజైన్‌ చేద్దామన్నాడు. ఆలోచించుకుని చెప్తామని చెప్పి అతన్ని పంపించేశాక కుమార్‌ మొత్తుకున్నాడు - 

''మనం ఊబిలో దిగబడిపోతున్నాం. ఆ బొంబాయి డాక్టర్‌గారి ట్రీట్‌మెంట్‌ నత్తనడకన సాగుతోంది. ఎంతవరకూ పనిచేస్తోందో తెలియదు. నాకేం కాన్ఫిడెన్స్‌ రావడం లేదు. తెల్లారగానే కంప్యూటర్‌లో పాడి రికార్డు చేసుకోవడం, మా వంటవాణ్ని విని నా వాయిస్‌ ఎలా వుందో చెప్పమనడం. నేను విన్నా నాకు తెలియదు కదా. గొంతు ఎప్పుడెలా వస్తుందో నాకే తెలియనప్పుడు యిలాటి ఆల్బమ్‌కు కమిట్‌ కావడం ఎలా?''

''రీమిక్సే కదా! మనం యిద్దరమే కూర్చుని రికార్డు చేద్దాం. నువ్వు పాట పాడేయ్‌. నీ గొంతుతో వస్తే ఓ ఫోల్డర్‌లో పెడతా, స్వర్ణ గొంతులో వస్తే వేరే ఫోల్డర్‌లో పెడతా. తర్వాత అన్నీ కలిపి మిక్స్‌ చేసుకుందాం. ఆల్బమ్‌ మొత్తమంతా పూర్తయితే అప్పుడు ఆ ఇండస్ట్రియలిస్ట్‌ చేతిలో పెడదాం. ఈ లోపుగా ఎడ్వాన్సు ఏమీ తీసుకోవద్దు.''

కుమార్‌ నిట్టూర్చాడు. ''మనం చేసేది రైటో, తప్పో తెలియడం లేదు. ఆ పాప చచ్చిపోతే తన గొంతుని మనం మార్కెట్‌ చేసుకుంటున్నాం.''

''కృంగిపోవడం పరాజితుల లక్షణం. ఆపదలోంచి కూడా సంపద చేసుకోకలిగినవాడే విజేత అవుతాడు. వరద వచ్చి యిల్లు కొట్టుకుపోయిందని ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం? వరదలో కొట్టుకుని వచ్చిన చెట్లని పట్టుకుని దుంగల్ని చేసి అమ్ముకోవడంలోనే వుంది ప్రజ్ఞ!'' అన్నాడు దినేష్‌.

అతని ఆశావాద దృక్పథం చూసి కుమార్‌ నవ్వాడు - ''స్వర్ణ దెయ్యమై నన్ను పట్టుకుంది కానీ నిన్ను పట్టుకుంటే తెలిసేది యీ కబుర్లు ఎలా చెప్పేవాడివో చూసేవాణ్ని..''

''నన్ను పట్టుకోవాలే గానీ, దెయ్యం కట్టిన ట్యూన్స్‌ అంటూ పది ఆల్బమ్స్‌ చేసి, హాలీవుడ్‌ వాళ్లకి అమ్మేసేవాణ్ని..''

ఇద్దరూ నవ్వుకున్నారు.

xxxxxxxxxxxxxxxxxx

కానీ పాటల రికార్డింగ్‌లో మాత్రం ఒక్కసారి కూడా నవ్వుకోలేకపోయారు. ఎందుకంటే గొంతు విప్పాక గానీ కుమార్‌ గొంతు పలుకుతుందో, పాప గొంతు పలుకుతుందో తెలిసేది కాదు. అది కుమార్‌కు ఎలా వినబడుతుందో తెలిసేది కాదు. ఇలా చేస్తే యిలా జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పలేకపోవడంతో చాలా శ్రమ పడాల్సి వచ్చింది. తన గొంతు అవతలివాళ్లకు ఎలా వినబడుతోందో తనకు తెలియకపోవడమనేది కుమార్‌ను పిచ్చెక్కించింది. ఒకదానికి ప్లాను చేసి, మరో దానిగా మార్చుకోవడంలో పడాల్సిన శ్రమతో దినేష్‌కు పిచ్చెక్కింది. వారం రోజులు గడిచేసరికి అతనికి సహనం పూర్తిగా నశించింది. ''వెధవ ఐదు లక్షల కోసం యీ తద్దినాన్ని తెచ్చుకున్నావ్‌. నన్నడిగినా పారేసేవాణ్ని..'' అని అరిచాడు.

కుమార్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ''అంతమాత్రానికే పాప చచ్చిపోతుందని అనుకున్నానా? ఏదో మార్కెటింగ్‌ జిమ్మిక్‌ అనుకున్నాను. సరే అన్నాను. నాకు ఆ పాప మీద కసా? ఏమన్నానా? నాకేమైనా పోటీ వస్తుందని భయమా? బోల్డుమంది మ్యాచ్‌ ఫిక్సింగ్‌లు చేసుకుని కోట్ల డబ్బు తీసుకుంటున్నారు. వాళ్ల కంతా యిలా జరుగుతోందా? నన్ను చూడు. ఆ పాప చచ్చిపోవడంతో షాక్‌ అయిపోయి ఆ ఐదు లక్షలే కాదు, జడ్జిగా వచ్చేందుకు తీసుకునే గెస్ట్‌ ఫీజు కూడా తీసుకోనన్నాను, తప్పుడు తీర్పు యిచ్చినందుకు నాకు పెనాల్టీ అన్నాను. అయినా అది దెయ్యమై పీడిస్తోంది. నా స్వరానికి సంకెల వేసి తన చేతిలో పెట్టుకుంది. ఎప్పుడు బిగిస్తుందో, ఎప్పుడు వదులుతుందో తెలియదు. నా కర్మ యిదంతా. చూడు.. ఎన్ని తాయెత్తులు కట్టించుకున్నానో ! కనబడ్డ సాధువుకీ, ఫకీరుకీ మొక్కుతూనే వున్నా. సైకియాట్రిస్టు దగ్గరకు రెగ్యులర్‌గా వెళుతున్నా.. యింత కంటె ఏం చేయమంటావ్‌ చెప్పు..పోనీ పాడడం మానేసి ఏదైనా ఆఫీసులో రిసెప్షనిస్టుగా చేరిపోనా ? నాకెవడైనా ఉద్యోగం యిస్తాడంటావా? బయటకు వస్తే మన సినిమావాళ్లం కాసుకు కొరగాం. డబ్బుంటే రియల్‌ ఎస్టేటు వ్యాపారం పెట్టుకోవాలి. నా దగ్గర అంత లేదు. ఇప్పుడిప్పుడేగా కెరియర్‌ ప్రారంభమైంది..''

దినేష్‌కి ఏమనాలో తెలియలేదు. ''అసలు యిదంతా ఆ టీవీ ఛానెల్‌ వాడి వల్లే వచ్చింది. వాడో బెట్టింగ్‌ కింగ్‌. రాకెట్‌ నడిపించి, అందరి చేతా పాప మీద పందాలు కట్టించి, ఆ డబ్బు కొట్టేద్దామని నిన్ను వాడుకున్నాడు. ఆ పాప మీద కోట్లు సంపాదించి పేరెంట్స్‌కు పదిలక్షలిచ్చి చేతులు దులుపుకున్నాడు. మొన్నొచ్చి భారీ బడ్జెట్‌ సినిమా తీస్తాను, నువ్వే మ్యూజిక్‌ డైరక్టర్‌ అన్నాడు. చెయ్యను పొమ్మన్నాను.. దొంగముం..'' తిట్టుకున్నాడు.

xxxxxxxxxxxxxxxxxxxxx

ఆల్బమ్‌ పూర్తయ్యేసరికి నెల పట్టింది. కానీ మార్కెట్‌లోకి వస్తూనే సూపర్‌ హిట్‌ అయింది. పెట్టుబడి పెట్టిన పారిశ్రామిక వేత్త గుమ్మైపోయాడు. ''కుమార్‌ గారూ, ఇదే కాన్సెప్ట్‌ మీద విదేశాల్లో ప్రోగ్రాంలు పెడదాం. ఇప్పుడు భక్త ప్రహ్లాద లాటిది వుందనుకోండి. మొదట మీరు హిరణ్యకశిపుడిలా మీ డీప్‌ వాయిస్‌తో ఓ పద్యం పాడతారు. తర్వాత దానికి జవాబుగా ప్రహ్లాదుడిలా 'మందార మకరందముల..' లాటి పద్యం చిన్నపిల్ల గొంతులో పాడతారు. అదిరిపోతుంది చూడండి. ఇప్పుడు స్టూడియోలో ఏవో ట్రిక్కులు చేసి వేరేవేరేగా చూపిస్తున్నారని పుకార్లు వున్నాయి. మీరు లైవ్‌లో అలా పాడితే జనాలు వెర్రెక్కిపోతారు. ఇక మీ రెమ్యూనరేషన్‌ అంటారా? మీరెంత చెపితే అంతే ! ఐ యామ్‌ రెడీ..''

దినేష్‌ దగ్గరకి వచ్చి మొరపెట్టుకున్నాడు కుమార్‌ - ''ఒక పక్క చూస్తే బ్రహ్మాండమైన ఆఫర్‌. ఇక పాటలు పాడడం మానేసినా ఫర్వాలేదన్నంత డబ్బు. ఇంకో పక్క చూస్తే భయం. ఏ గొంతు ఎప్పుడు పలుకుతుందో తెలియని సస్పెన్స్‌. పాటపాటకూ ఉత్కంఠే ! 'మందార మకరందముల..' అని ఎనౌన్సు చేసిందాకా వుండి మాధవపెద్ది టైపు గొంతుక పలికితే అభాసు అయిపోదా? డాక్టర్‌ భావే ట్రీట్‌మెంట్‌ ధర్మమాని నేను గిల్ట్‌ ఫీలింగ్‌నుండి బయటపడుతున్నాను. నా ఆత్మస్థయిర్యం నాకు తిరిగి వస్తోంది. ఈ దశలో యీయన యిలాటి ప్రతిపాదన తెచ్చాడు. ఏం చేద్దామంటావ్‌? ట్రూప్‌లో నువ్వు కూడా వుండాలని ఎలాగూ కండిషన్‌ పెడతాను. నువ్వు అప్పటికప్పుడు మేనేజ్‌ చేయగలవ్‌. అయినా ముందే ఏదో ఒకటి అనుకోవాలి కదా..''

దినేష్‌ చాలాసేపు ఆలోచించాడు. ''నాకు వచ్చేవారం ఢిల్లీ ప్రోగ్రాం వుంది. ఫారిన్‌ టూర్‌కు కమిటయ్యేముందు నాతో పాటు ఢిల్లీకి రా. స్టేజిమీద ఓ పాట పాడుదువుగాని.. పాటకు ముందు ఏదైనా మాట్లాడు. నీ గొంతు పలుకుతోందో, పాప  పలుకుతోందో నేను సిగ్నల్‌ యిస్తాను. నువ్వు రెండు రకాల పాటలూ రెడీగా పెట్టుకుని వుండు. నా సిగ్నల్‌ బట్టి ఆ తరహా పాట పాడేయ్‌. నీ గొంతే పలికిందనుకో, వెల్‌ అండ్‌ గుడ్‌. పాప గొంతు పలికిందనుకో.. కావాలని అలా పాడానని దబాయించు.''

''ఐడియా బాగానే వుంది. నా గొంతే ఫిక్సయిపోయిందనుకో. అంతకంటె కావలసినది ఏమీ లేదు కానీ.. యీ ఫారిన్‌ స్పాన్సర్‌కు మోజు పోతుంది...'' అన్నాడు కుమార్‌ సాలోచనగా.

''పోతే పోనీ.. నువ్వు ముందే చెప్పు. నేను ఏ గొంతుతో పాడతానో ముందే చెప్పను, కమిట్‌ అవ్వను. పాట ముందే ఎనౌన్సు చేయను. నా కిష్టమైనట్లు పాడతాను. దానికి సిద్ధపడితేనే టూర్‌, లేకపోతే కాన్సిల్‌..'' అని చెప్పేయ్‌. ఆ దెయ్యప్పిల్ల మనతో ఎప్పుడు ఎలా ఆడుకుంటుందో ఏం చెప్పగలం?'' 

''రైట్‌, అలాగే చేద్దాం. ఢిల్లీకి నా ఫియాన్సీ రేఖను రమ్మంటాను. ఈ భయాల వలన నా పాట క్వాలిటీ దెబ్బతింటోందా అన్నది ఆడియన్సులో కూర్చుని గమనించి చెప్తుంది.'' అన్నాడు కుమార్‌.

కానీ రేఖ రానంది. 'ఈ మధ్య కలవడం బాగా తగ్గిపోయిందని కోపమా?' అడిగాడు కుమార్‌.

''అది ఎలాగూ వుంది. కానీ యీ మధ్య ఆడ గొంతుక వేసుకుని ఆ పాటలేమిటి అసహ్యంగా ! మగాడు మగాడిలా వుండాలి. ఆడవేషాలేస్తే అటూయిటూ కానివాడిలా అనిపిస్తాడు నాకు. అస్సలు భరించలేను. ఎంగేజ్‌మెంట్‌ బ్రేక్‌ చేద్దామా అని కూడా ఆలోచిస్తున్నాను..'' అంది రేఖ. 

కుమార్‌ కంగారు పడ్డాడు. ''నువ్వు నాతో ఢిల్లీకి రా. దినేష్‌ ట్రూపుతో కలిసి వెళుతున్నామని మీ పేరెంట్స్‌కి చెప్పు. అక్కడ అన్ని విషయాలూ చెప్తాను.''

ఢిల్లీలో కార్యక్రమం ప్రారంభం కావడానికి అరగంట ముందు కుమార్‌ జరిగినదంతా రేఖకు చెప్పాడు. దెయ్యం మాట చెప్పగానే రేఖ భయపడి దూరంగా జరిగిపోయింది. అంతా విని ''దెయ్యం పట్టినవాడిని తెలిసి తెలిసి ఎవరైనా పెళ్లి చేసుకుంటారా?'' అంది.

కుమార్‌ విసుక్కున్నాడు. ''నేను దెయ్యం పట్టినవాడిలా కనబడుతున్నానా? నీ మీద పడి రక్కుతున్నానా? ఇదంతా సైకలాజికల్‌ వీక్‌నెస్‌. స్వతహాగా మంచివాణ్ని కాబట్టి, తప్పు చేసినందుకు అపరాధభావనతో కుమిలిపోతూండడం వలన యిలా జరుగుతోంది. సైకలాజికల్‌ ట్రీట్‌మెంట్‌తో అంతా సరిపోతుంది...''

''..కానీ చిన్నపిల్ల గొంతుతో పాడుతూండడం సైకలాజికల్‌ కాదుగా, నువ్వు వూహించుకోవడం లేదు. మా అందరికీ అలాగే వినబడుతోంది...''

''..కరక్టే. ఆ భయమే, ఆ భీతే.. నా కంఠనాళాలను పట్టేస్తోందన్నమాట. సైకో-సొమాటిక్కో ఏదో అంటారు యిలాటివాటిని.  దొంగాడు వచ్చి కత్తి చూపిస్తే మనకు భయంతో గొంతు పెగలదు చూడు, అడుగు ముందుకు పడదు చూడు.. అలాటిదే నన్నమాట..ఇది ఎలా వుందంటే.. ఎవడైనా పేదవాడికి పెద్ద తలకాయతో, మిడిగుడ్లతో పిల్లాడు పుట్టాడనుకో, వైద్యం చేయించలేక ఎగ్జిబిషన్‌లో 'విచిత్ర శిశువు' అనే పేరుమీద స్టాల్‌ పెట్టి డబ్బులు దండుకుంటాడు. డబ్బులు సంపాదించి తర్వాత పిల్లాడికి వైద్యం చేయిస్తాడు. దినేష్‌ సహాయంతో నేను చేస్తున్నదదే ! వైద్యం పనిచేసిందో లేదో కాస్సేపట్లో చూడబోతావు. నేను మామూలు గొంతుతో పాడితే హ్యేపీయే కదా..!  పాప గొంతు గోల వదిలిపోయిందనుకో, నాకంటె సంతోషించేవాడు ఎవడూ వుండడు.''

అవేళ్టి కార్యక్రమంలో కుమార్‌ మామూలు గొంతే పలికింది. హైదరాబాద్‌కు తిరిగి వస్తూనే కుమార్‌, దినేష్‌, రేఖా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ''ఇక యీ తాయెత్తులు తీసేయచ్చుగా..'' అంది రేఖ.

''తియ్యవచ్చనుకో.. యింకా ఎక్కడో కాస్త భయం. నిజంగా పాప దెయ్యమై సతాయిస్తుందేమోనని..'' నిజాయితీగా చెప్పాడు కుమార్‌.

''కోరికలు తీరనివాళ్లే దెయ్యాలవుతాయంటారు..'' అంది రేఖ ఆలోచిస్తూ.

ఫారిన్‌ ట్రిప్‌కు బయలుదేరేందుకు ముందు రోజే రేఖ కబురు తీసుకుని వచ్చింది. స్వర్ణ తలిదండ్రులకు టీవీ ఛానెల్‌ ఓనర్‌ ఎర్ర ఏగానీ యివ్వలేదట. గట్టిగా అడిగితే చావగొట్టించాడట. ''ఆ పదిలక్షలూ యిప్పిస్తే పాప దెయ్యం నిన్ను విడిచి పెట్టి వెళుతుందేమో..'' అంది రేఖ.

''వాడు చేసినదానికి నాకు శిక్షా?'' వాపోయాడు కుమార్‌.

''వాడికీ పడుతుందిలే ఎప్పుడో ఒకప్పుడు. ప్రస్తుతానికి నీ సంగతి నువ్వు చూసుకో..'' అన్నాడు దినేష్‌.

''ఆ పది లక్షలూ నువ్వు యిచ్చేయ్‌ కుమార్‌. ఛానెల్‌వాడు నీకివ్వాల్సినది తీసుకోలేదన్నావ్‌గా..అడుగు..'' అంది రేఖ.

కుమార్‌ ఫోన్‌ చేశాడు. ఛానెల్‌వాడు ఓ పట్టాన దొరకలేదు. దొరికాక కూడా ఆ ఐదులక్షలూ యివ్వనన్నాడు. స్వర్ణ చచ్చిపోయినందుకు గొడవ చేస్తామని మహిళా సంఘాలేవో బెదిరిస్తే వాళ్లకు యివ్వాల్సి వచ్చిందన్నాడు. చివరికి జడ్జిగా వస్తానని రాసుకున్న ఎగ్రిమెంట్‌మీద వేసిన రెండు లక్షలూ యిస్తానన్నాడు. అదీ, ఈ ఫారిన్‌ టూరుకై తీసుకున్న ఎడ్వాన్సు ఐదు లక్షలూ, బ్యాంకులో వున్న మూడు లక్షలూ కలిపి మొత్తం పదిలక్షలూ చేసి కుమార్‌ స్వర్ణ అమ్మానాన్నలకు రేఖ చేత పంపించాడు.

xxxxxxxxxxxxxxxx

లండన్‌లో మొదటి కార్యక్రమం. దిగగానే నిర్వాహకులు చెప్పారు - ''మీరు ఒక్క పాటైనా చిన్నపిల్ల గొంతుతో పాడాలి సార్‌. పబ్లిసిటీ అలా యిచ్చేశాం. లేకపోతే వూరుకోరు.''

బిక్కమొహం వేసిన కుమార్‌ భుజాన్ని దినేష్‌ తట్టాడు. హోటల్‌ రూమ్‌కి రాగానే చెప్పాడు - ''భయపడకు. నువ్వు పాప గొంతుతో పాడిన ట్రాక్స్‌ కొన్ని తెచ్చాను. అంతగా అవసరమైతే నువ్వు పెదాలు కదుల్చు. నేను అది ప్లే చేస్తాను.'' 

కృతజ్ఞతాభావంతో కుమార్‌కు మాట పెగలలేదు. దినేష్‌ను కౌగలించుకున్నాడు.

సాయంత్రం కార్యక్రమం ప్రారంభమైన గంటకు కుమార్‌ వణుకు తగ్గింది. తనకు తన గొంతుకే వినబడుతోంది. ఆడియన్సుకీ అదే వినబడుతోందని దినేష్‌ సిగ్నల్‌ యిస్తున్నాడు. మేషో స్టార్‌కి కుమార్‌ పాడిన పాటలకి విపరీతంగా రెస్పాన్స్‌ వస్తోంది. మధ్యమధ్యలో ఆర్గనైజర్స్‌ వచ్చి 'పాప పాట.., కనీసం ఒక్కటి..' అని గుర్తు చేస్తున్నారు.

ఎనిమిదో పాట ప్రారంభించబోతూ వుండగా కుమార్‌ దృష్టి ఆడియన్సు నుండి వస్తున్న స్వర్ణపై పడింది. తన పక్కనే వున్న ఫారినర్‌ దంపతులు వారిస్తున్నా లేచి నిలబడింది. ఆమెను చూస్తూండగానే కుమార్‌కు గుండె జారిపోయింది. ఎప్పుడో చచ్చిపోయిన స్వర్ణ ! తనకే కనబడుతోందా, అందరికీ కనబడుతోందా? ఆమె వైపే తదేకంగా చూస్తూండగా అతని పెదాలు తనంతట తామే కదిలాయి. 

''జీవము నీవే కదా, బ్రోచే భారము నీదేే కదా..''

సరిగ్గా ఆ రోజు ఫైనల్స్‌లో స్వర్ణ పాడిన పాటే.., స్వర్ణలాగే.., అచ్చు దింపేసినట్టు, తన గొంతులోంచి బయటకు వస్తోంది. తన ప్రయత్నం ఏమీ లేదు. దీన్నేనా ఆ రోజు తను వెక్కిరించినది ! ప్రేక్షకుల నుండి మిన్నుముట్టే హర్షధ్వానాలు. మరింత ఉత్సాహంగా వస్తోంది పాట, తన్మయత్వంతో.., బాలభక్తుడు ప్రహ్లాదుడితో తాదాత్మ్యం చెందుతూ,  తన దీనావస్థను పరమాత్ముడికి తెలుపుకుంటూ, కన్నీరు కారుస్తూ...

పాట పూర్తయ్యేసరికి కుమార్‌కు చప్పట్లు తప్ప మరేమీ వినబడటం లేదు. అశ్రుపూరితాలైన నయనాలలో స్వర్ణ రూపం తప్ప మరేమీ కనబడటం లేదు. స్వర్ణ దగ్గరగా వచ్చి నిలబడింది. 

''చూశావా అంకుల్‌ ! నా పాట స్థాయి ! ఇంకా బాగా లేదనే అంటావా ?'' అంది.

కుమార్‌ తల అడ్డంగా తిప్పాడు. ఆ బాలసరస్వతికి చేతులెత్తి దణ్ణం పెట్టాడు. 

ఏం జరుగుతోందో తెలియక ఆడియన్సులో కలకలం చెలరేగింది. ఆర్గనైజర్స్‌లో కొంతమంది ఆ పాపను పట్టుకుందామని స్టేజిమీదకు వచ్చారు. ఓ యిద్దరు ఆమె తలిదండ్రుల వద్దకు వచ్చి అలా ఎలా వదిలేస్తారని గద్దిస్తున్నారు. వాళ్లూ అయోమయంలో వున్నారు. ''మేం ఇంగ్లీషువాళ్లం. ఎప్పుడో ఇండియాకు వెళ్లి పొత్తిళ్లల్లో వున్న యీ పాపను దత్తత తీసుకున్నాం. మాకు తెలుగు రాదు, పాపకూ రాదు. ఇవాళ యీ ప్రోగ్రాంకు పట్టుబట్టి లాక్కుని వచ్చింది. ఇప్పుడు స్టేజిమీదకు దూసుకుని వెళ్లి తెలుగో, ఏదో మాట్లాడుతోంది. అంతా కన్‌ఫ్యూజింగ్‌గా వుంది.'' అంటున్నారు వాళ్లు.

దినేష్‌ కుమార్‌ వద్దకు వచ్చేటప్పటికే అతను పాప ముందు మోకరిల్లి వున్నాడు.

''తప్పు తెలుసుకున్నావ్‌ అంకుల్‌, మా అమ్మానాన్నకు డబ్బు ముట్టింది. ఇక నీకు విముక్తే..'' అంది పాప.

అప్పటికే కుమార్‌ కుప్పకూలాడు.

(చిత్ర మంత్లీ హారర్‌‌ కథల ఆగస్టు 2011 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌

mbsprasad@gmail.com