Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ కథలు: తరాలూ - తీరాలూ

''నాకు స్టేట్సులో ఉద్యోగం వచ్చింది నాన్నా!'' రవి ఫోన్‌ పెట్టేసి మహదానందంగా చెప్పాడు.

''నిజంగానా? అలా ఎలా వచ్చింది?'' మాధవరావు తెల్లబోయాడు.

''మెక్లీన్స్‌లో అప్లయి చేశానని చెప్పాను కదా..''

''కానీ వాళ్ల దగ్గర్నుంచి ఉత్తరం ఏమీ రాలేదే''

''...మనింటి అడ్రస్‌ ఇస్తే కలిసిరావటంలేదని రాజూ కేరాఫ్‌ ఇచ్చాను. వాడిప్పుడే ఫోన్‌ చేసి చెప్పాడు. అపాయింట్‌మెంటు ఆర్డరు పంపారట. నెల్లాళ్లలో వచ్చి చేరాలట. రాజా ఇంటికెళ్లి ఆర్డరు తీసుకొస్తా''

''అమ్మకీ వార్త చెప్పేసి మరీ వెళ్లు'' 

రవి వెళ్లగానే మాధవరావు ఆలోచనల్లో పడ్డాడు. 'రాజా ఇంటి అడ్రస్‌ ఎందుకిచ్చినట్టు? ఇంటికొచ్చిన అపాయింట్‌మెంట్‌ లెటర్లన్నీ తను చింపేస్తున్నట్టు రవి పసిగట్టేడా? అబ్బే. వాడికి తెలిసి వుండదు. తెలుసుకునే అవకాశం ఇవ్వలేదు తను. 'ఇంత క్వాలిఫికేషన్‌ ఉన్నా ఎవరూ ఉద్యోగం ఇవ్వటం లేదేమిటి నాన్నా!' అని వాపోతుంటే 'కొన్ని ప్రయత్నాలు కలిసిరావంతే! దాని గురించి వర్రీ అవకు' అని నచ్చచెప్పేవాడు.

స్టేట్స్‌లో ఉన్న వీడి క్లాస్‌మేట్‌ గౌతమ్‌కి ముందే చెప్పి వుంచాడు తను. తన ఉద్యోగాల సంగతి చూడడానికి అతన్నే ఆశ్రయిస్తున్నాడు వీడు. అతను తను చెప్పినట్టే చేసి పెడుతున్నాడు. వీడు ఫోన్‌ చేసినప్పుడల్లా 'ఇక్కడ ఉద్యోగం వస్తుందన్న ఆశ వదిలేయి. నేను స్వయంగా వెళ్లి కనుక్కొన్నాను. దే ఆర్‌ నాట్‌ ఇంట్రస్టెడ్‌' అని చెప్పి ఊరుకోబెడుతున్నాడు.

ఈ మెక్లీన్స్‌ విషయం కూడా తను గౌతమ్‌కి రాశాడు. రవి గురించి చెడుగా చెప్పేసి కంపెనీ వాళ్లు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ పంపకుండా చూడమని. తప్పిదారి వాళ్లు పంపేసినా చింపేయడానికి తను ఇక్కడున్నాడు. మరి ఏం జరిగిందో ఏమో! వాళ్లు పంపేశారు. అడ్రస్‌ మార్చివేయడంతో అది తన చేతబడకుండా పోయింది.

తను మాత్రం ఏం చేస్తాడు? అప్పటికీ లక్షసార్లు చెప్పి చూశాడు. 'బాబూ రవీ! ఫారిన్లో ఉద్యోగం వద్దురా! ఇక్కడే ఏదైనా ఫ్యాక్టరీ పెట్టుకొని పదిమందికి జీవనోపాధి కల్పించి, హాయిగా మా కళ్ల ఎదురే ఉండరా' అని.

''అక్కడ భవిష్యత్తు బాగుంటుంది నాన్నా'' అన్నాడు వాడు.

''ఒరేయ్‌! నీ భవిష్యత్తు ఎక్కడ బాగుంటుందో నాకు తెలియదా? నీ భవిష్యత్తు పాడు చేసే ఉద్దేశ్యం ఉంటే నిన్ను నాలుగేళ్ల పాటు స్టేట్స్‌లో రీసెర్చి చేయడానికి పంపి వుండేవాడినా? నీకు స్కాలర్‌షిప్‌ వచ్చిందనుకో. రాకపోయినా ఫర్వాలేదని ఖర్చుకి వెనకాడకుండా ముందు పెట్టుబడి పెట్టి పంపానా? లేదా?''

''అదే నాన్నా! నాకూ అర్థం కాదు. అంత పెద్ద యూనివర్శిటీ డాక్టరేట్‌ చేయించినవాడివి అక్కడ సెటిలవ్వద్దంటావేమిటి? అక్కడ ఉద్యోగం చేయకుండా, ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి అంత పెద్ద చదువు ఎందుకు?''

''బాబూ! నువ్వక్కడకు వెళ్లింది జ్ఞానాన్ని సంపాదించడానికి. ఆ జ్ఞానంతో ఇక్కడి జనాలకు మేలు చెయ్యి. ఇక్కడున్నవాళ్లకి దాన్ని పంచు. ఓ ఫ్యాక్టరీ పెట్టు. నువ్వు తిను. పదిమందికి తిండి దొరికే మార్గం చూపించు. నువ్వు ఎక్కడో ఉండి కోట్లు సంపాదించినా మా బోటి తల్లిదండ్రులకు ఏం తెలుస్తుందిరా? మా కళ్లెదురుగా ఉండి నువ్వు సంపాదించి, అనుభవిస్తుంటే కళ్లారా చూసి సంతోషిస్తాం. నువ్వక్కడ సెటిలయిపోయి మీ పిల్లల్ని మూడేళ్లకోసారి మాకు చూపించి, మా భాష వాళ్లు మాట్లాడక, చుట్టాలూ, పక్కాలూ ఎవరూ వాళ్లకు తెలీక... ఒరేయ్‌ నువ్వక్కడ వుండి నోబెల్‌ ప్రైజ్‌ తెచ్చుకున్నా ఎవరో పరాయి వ్యక్తి గురించి వార్త చదివినట్టుంటుంది కానీ 'వీడు మనవాడే' అనిపించదురా!''

''నాతో వచ్చేయమంటే 'నేనింత ఇల్లు ఎందుక్కట్టినట్లు' అంటావు నువ్వు. మళ్లీ ఇప్పుడిలా అంటావ్‌. దూరంగా వెళ్లిపోయినంత మాత్రాన రక్తసంబంధం ఎక్కడికి పోతుంది? ఏదైనా కష్టం వస్తే పరిగెట్టుకు రానూ?''

''వస్తావు. తప్పకుండా వస్తావు. కష్టంలో పాలు పంచుకోడానికి. కానీ నేననేది సుఖంలో పాలు పంచుకోడానికి కూడా ఇక్కడ ఉండాలని. ఇక్కడ పెద్ద ఇల్లు కట్టుకున్నాను. ఇన్ని రూములున్నాయి. పెళ్లయ్యేక రేఖ కూడా వెళ్లిపోతుంది. అన్నగారిగా నువ్వు దగ్గరుండి దానికి మంచి సంబంధం చూడడం నీ బాధ్యత కూడానూ.పెళ్లయి అదీ వెళ్లిపోయి, నువ్వు ఫారిన్‌ వెళ్లిపోయి మా ఇద్దరికీ ఇంత ఇల్లెందుకురా? పిల్లలూ, మనవలతో హాయిగా వుండటానికే కదా....''

''ఇక్కడ ఫ్యాక్టరీ కట్టడం మాటలా నాన్నా?''

''ఆ విషయం నాకొదిలిపెట్టు. ఈ హైదరాబాద్‌లో ముప్ఫై అయిదేళ్లుగా ఉంటున్నాను. అన్ని డిపార్టుమెంటుల్లోనూ ఫ్రెండ్సు ఉన్నారు. నువ్వు సంతకాలు పెడితే చాలు. పర్మిట్లు, లోను శాంక్షన్లు అన్నీ నేను చూసుకొంటాను. దగ్గరుండి ఫ్యాక్టరీ కట్టిస్తాను. రెండేళ్ల సర్వీసుంది. వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకొని కంపెనీ ఎకౌంట్సన్సీ నేనే చూసి పెడతాను. డబ్బుంటే ఇక్కడ ఇండియాలో రాజభోగాలు అనుభవించవచ్చు. అక్కడేముంది? ఎంత సంపాదించినా నీ కారు నువ్వే తోలుకోవాలి. మంచు పడితే నువ్వే తవ్వుకోవాలి''

''నువ్వు నన్ను కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నావు నాన్నా'' అన్నాడు రవి చివరికి.

''కంగారేం లేదు. ఆలోచించే ఓ నిర్ణయానికి రా'' అన్నాడు తను, ఆనాడు తన మాట నెగ్గుతుందన్న సూచనలు కనిపించి.

xxxxxxxxxxxxxxxx

'ఇప్పుడిక అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ చేతిలో పడ్డాక వీడు ఆగుతాడా? ఉరకలు వేసుకుంటూ పరిగెట్టడూ?'

నెల్లాళ్లలో అక్కడికి వెళ్లి రిపోర్టు చేయాలంటూ ఉరకలు వేయకపోతే ఎలా? అంత అడావుడిలోనూ రవి అమలాపురం వెళ్లి తాతయ్యను చూసి వస్తానన్నాడు. ''నాన్నను చూసి ఏడాది దాటింది. పద, నేనూ వస్తా'' నన్నాడు మాధవరావు.

విశ్వనాథం గారూ, భార్య సంతోషించారు కొడుకునీ, మనవణ్ణి చూసి.

''ఈ టైమ్‌లో పొలానికి వెళ్లుంటావేమో ఇంట్లో ఉండవనుకొన్నా'' అన్నాడు మాధవరావు తండ్రితో.

''లెక్కప్రకారం అది కరెక్టే. కానీ ఈ మధ్యే పొలం అమ్మేశా, సొమ్ము అవసరం పడి'' అన్నాడు విశ్వనాథం.

'పొలం అమ్మేశాడా? తనకి చెప్పకుండానే? పాతికేళ్ల క్రితం కూడా తనకి చెప్పకుండానే కొంత అమ్మేశాడు. అదంతా ఆయన స్వార్థితమే. తనకు అడిగే హక్కు లేదు. అయినా ఓ మాటైనా తనకు చెప్పకుండా అమ్మిపారేయడం ధర్మమా?'

పైకి మాత్రం ''అంత అవసరం అయితే నేను పంపించనూ, పొలం అమ్మడం దేనికి'' అన్నాడు మాధవరావు.

''నీ ఖర్చులు నీకుంటాయి. వీడి చదువుకి చాలా అయిందిగా. రేఖ పెళ్లుంది. ఏవో చిల్లర బాకీలుంటే పొలం అమ్మి తీర్చి పారేశా!''

'తండ్రికి చిల్లర బాకీ! ఉన్నదాంట్లో తృప్తిగా బతికేసే తత్వం గల మనిషి ఇంకొకరికి ఋణపడతాడా?' 

తరచి అడిగినా తండ్రి చెప్పడని తెలిసిన మాధవరావు ఊరుకున్నాడు.

సాయంత్రం రవి ఊళ్లో తిరిగివస్తానని వెళ్లినప్పుడు విశ్వనాథం కొడుకుని కదలేశాడు. ''రవి ఫారిన్లో సెటిలవడం నీకేమీ నచ్చుబాటుగా ఉన్నట్టు లేదే'' అంటూ.

తండ్రి అలా అడిగేసరికి మాధవరావుకి దుఃఖం పొంగుకొచ్చింది. తనకీ, రవికీ  జరిగిన సంభాషణంతా చెప్పుకొచ్చాడు.

అంతా విని ''నలభై ఏళ్ల క్రితం నీకూ, నాకూ జరిగిన సంభాషణే పునరావృతమవుతోందన్నమాట! అన్నాడు విశ్వనాథం.

xxxxxxxxxxxxxxxxxx

'నిజమే తను హైదరాబాద్‌ వెళ్లి ఉద్యోగం వెతుక్కుంటానన్నప్పుడు తండ్రి అభ్యంతరం పెట్టాడు. ఇప్పుడు తను చెప్పిన కారణాలన్నీ తండ్రి అప్పుడు ఏకరువు పెట్టాడు. హైదరాబాద్‌లో తన కుద్యోగం రాకుండా చేయడానికి వాళ్లకూ, వీళ్లకూ చెప్పి పంపాడు. అయినా తను ఉద్యోగం సంపాదించి నిలదొక్కుకోగలిగాడు. తెలంగాణా ఉద్యమం మొదలయి తనలాటి వాళ్ల ప్రాణాలకే ముప్పొచ్చినప్పుడు అమలాపురం తిరిగొచ్చేయమని తండ్రి బతిమాలాడు. కానీ తనకు హైదరాబాదు విడిచి రాబుద్ధి కాలేదు. చివరికి యాదవ్‌ అనే పుణ్యాత్ముడొకడు దొంగ ముల్కీ సర్టిఫికెట్టు ఒకటి పుట్టించి తనను గట్టున పడేశాడు. మొదట్లో అతను తనంటే మహాద్వేషంగా ఉండేవాడు. ఎలాగైనా ఆంధ్రాకి తిరిగి పంపించేస్తానని బెదిరించేవాడు కానీ ఆ టైమ్‌లో మాత్రం ఆదుకున్నాడు. తన తారాబలం అలాంటిది. అందుకే హైదరాబాద్‌లో నిలదొక్కుకుని ఆస్తులు సంపాదించుకోగలిగాడు. ఇప్పుడు మాత్రం తారలు వక్రించినట్లున్నాయి.

''...మారే కాలంతో మనమూ సర్దుకుపోవాలి'' అంటున్నాడు తండ్రి.

''అప్పటి సంగతి వేరు. అప్పట్లో ఈ ప్రాంతాల్లో ఉద్యోగాలు లేవు'' అన్నాడు మాధవరావు.

''రవికి సరిపడే ఉద్యోగాలు ఇండియాలో లేవటగా...'' ఆర్ధోక్తిలో ఆపాడు విశ్వనాథం.

''ఉద్యోగం కాకపోతే పోనీ వ్యాపారం...''

''...నువ్వూ వ్యవసాయం చేసి ఉండవచ్చు''

''మట్టి పిసుక్కోవడం నా వల్లకాదు''

''అలాగే వ్యాపారంలో రకరకాల వేషాలు వేయడం వాడివల్లా కాదంటున్నాడు''

''ఏమిటి నాన్నా? నువ్వు వాణ్ని వెనకేసుకొస్తావ్‌. నేను వెళ్లింది హైదరాబాదుకేగా ! ఒకటే దేశం. ఒకటే రాష్ట్రం. వాడు? వాడు ఎక్కడో అమెరికాకి వెళ్తున్నాడు.''

''ఇప్పుడంటే సిద్ధాంతం బ్రిడ్జి పడింది కాబట్టి కానీ, ఇదివరకు హైదరాబాద్‌ నుండి అమలాపురానికి పూరీ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి, లాంచీ ఎక్కి, బొబ్బర్లంక బస్సు ఎక్కి వచ్చేసరికి ఎంత టైమయ్యేదో, ఇప్పుడు అమెరికా నుండి హైదరాబాద్‌కీ అంత టైము పడుతుంది.''

''టైమ్‌ సరే, డబ్బు ఖర్చో...''

''వద్దామనుకోవాలేగానీ అదొక లెక్కా? నెలకు లక్షలు సంపాదించేవాడికి వేలొక లెక్కా? నువ్వు హైద్రాబాద్‌ నుండి ఇక్కడికి రాకపోవడానికి డబ్బు ఖర్చే కారణమా?''

''ఛఛ! అవేం మాటలు నాన్నా?''

''మరి తరచు ఎందుకు రావుట? నువ్వొచ్చి పదిహేడు నెలలయింది తెలుసా? ఈసారైనా రవి పట్టుబట్టాడు కాబట్టి వచ్చావు. పోనీ వచ్చేటప్పుడు కోడల్నీ, రేఖని తీసుకొచ్చావా? అమ్మ అడిగితే రేఖకు కాలేజీ పోతుందని నసిగావు. పోనీ కాలేజీ సెలవులు ఇచ్చినప్పుడు పంపుతావా అంటే అప్పుడు 'గోవాకు వెళ్లాలి, ఊటీకి వెళ్లాలి' అంటావు. మా దగ్గరకొచ్చి ఓ వారం రోజులుంటే కష్టం ఏమిటట?''

'అలా అడిగితే ఏం చెప్పడం? భార్యకూ, కూతురుకూ ఇక్కడకు రావడం బోర్‌ అని చెప్పడం సాధ్యమా?' అనుకుని మాధవరావు ఏమీ మాట్లాడలేదు.

విశ్వనాథం కొనసాగించాడు ''... ఇవన్నీ అడిగితే అవసరమైతే రెక్కలు కట్టుకు వాలమా అంటావు నువ్వు. నీ కొడుకూ అదే అంటున్నాడు. ప్రతీవారం ఫోన్‌ చేస్తానంటాడు. చేస్తాడు ఓ ఏడాదిపాటు. ఆ తర్వాత నెలకోసారి...! ఆ తరువాత ఏదైనా విశేషం ఉన్నప్పుడు... కొన్ని రోజులు పోయేసరికి మీకు కామన్‌గా మాట్లాడుకునే విషయాలే తగ్గిపోతాయి.

''ఇరవయ్యేళ్లపాటు ఈ ఊళ్లో బతికినవాడివి. హైదరాబాద్‌ వెళ్లిన కొత్తలో ఇంటికొచ్చినప్పుడు కనబడేవాడివే కావు. పాత ఫ్రెండ్స్‌ని చూసి వస్తానంటూ తిరుగుతుండేవాడివి. ఈ రోజు ....తోటలు చూసి వస్తానంటూ వాడు వెళ్లాడు కానీ, నువ్వు ఇంట్లోనే వుండిపోయావు''

''... టచ్‌ తగ్గిపోయి'' అంటూ నసిగాడు మాధవరావు.

''అదే నేను చెప్పేదీనూ. నువ్వు పూర్తిగా పట్నవాసం మనిషివయిపోయావు. విదేశాల మనిషయిపోదామని వాడు చూస్తున్నాడు''

''విదేశంలో ఉన్న సౌకర్యాలన్నీ నేను హైదరాబాద్‌లోనే కలగజేస్తానంటున్నప్పుడు...''

''...ఒరేయ్‌! హైదరాబాద్‌లో ఉన్న సౌకర్యాలన్నీ నేనిక్కడే కలగజేస్తాను. ఇక్కడా ఫోన్లున్నాయి ఫాన్లున్నాయి. సెప్టిక్‌ లెట్రిన్లు ఉన్నాయి. టీవీలు, వీసీఆర్లు, స్టారు కనెక్షన్లు, సినిమాహాళ్లు అన్నీ వున్నాయి. ఇంటికి జనరేటరు పెట్టుకున్నామంటే కరెంటు కోత బాధే తెలియదు. 'మీ ఆవిడ చేత చెరువు నుంచి నీళ్లు తెప్పించే ఖర్మ' ఇప్పుడు లేదు. ఓవరుహెడ్డు ట్యాంకులున్నాయి. మరి రిటైరయ్యాక ఇక్కడికి వచ్చి ఉంటారా మీరు?'' అని ఆగాడు విశ్వనాథం.

మాధవరావుకు జవాబు తోచలేదు, మాట తప్పించడానికి ''అక్కడికీ రవితో చెప్పా నీ చెల్లెలు రేఖ, దాని పెళ్లి భారం నీదే. ఊళ్లో వుండి సంబంధం వెతికిపెట్టాలి సుమా అని'' అన్నాడు.

''... నేను మీ చెల్లెలి పెళ్లి గురించి నిన్ను అడిగినట్టే అడిగేవన్నమాట. వాడూ నీలాగే సమాధానం చెప్పి వుంటాడు - కన్నవాడిదే ఆ బాధ్యత - అని'' అందించాడు విశ్వనాథం.

మాధవరావుకి కోపం వచ్చేసింది. ''నీ పల్లెటూరి లౌక్యమంతా నా మీద ప్రయోగిస్తావేమిటి నాన్నా?'' అన్నాడు కటువుగా.

''జరిగిన విషయాల్ని గుర్తు చేయడం లౌక్యం అయితే మరి గౌతమ్‌తో చెప్పి రవి పథకాలకు అడ్డుపడటాన్ని ఏమంటారు?'' అన్నాడు విశ్వనాథం కొడుకు ముఖంలోకి తొంగిచూస్తూ.

మాధవరావు నోరు తడారిపోయింది. ''నీకు... నీకెలా తెలుసు గౌతమ్‌?'' అని మాత్రం అనగలిగాడు కష్టం మీద.

''తన ప్రయత్నాలు ఏవీ కలిసి రావటం లేదని ఆ మధ్య రవి ఉత్తరం రాసాడు. రాస్తూ మెక్లీన్స్‌లో కంపెనీలో అప్లయి చేస్తున్నానని కూడా రాశాడు. మన చెరువు వీధిలో ఉండే సుబ్రహ్మణ్యం గారి మనవడు ఆ కంపెనీలో పెద్ద పోస్టులో వున్నాడు. ఉత్తరం రాయించాను. రవికి ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధపడే టైమ్‌లో గౌతమ్‌ అనేవాడు వెళ్లి వాడి గురించి చెడ్డగా చెప్పి ఉద్యోగం ఇవ్వొద్దన్నాట్ట.

''ఇతను వెళ్లి గౌతమ్‌ పట్టుకొని నాలుగు ఝాడిస్తే నిజం కక్కేట్ట. 'మాధవరావు గారే చెడగొట్టమన్నారండి' అంటూ. ఆ గౌతమ్‌గాడి మాటలు విని కంపెనీవాళ్లు బెదిరిపోయి సెక్యూరిటీ డిపాజిట్‌ కావాలని పట్టుబట్టారట. అది అతను నాకు రాస్తే నేను పొలం అమ్మేసి డబ్బు పంపించి ఆ ఏర్పాటు చేశాను. ఈ కథేమీ రవికి తెలియదనుకో. అందువల్ల నువ్వు నిశ్చింతగా వుండవచ్చు.''

మాధవరావుకి భూమి కృంగినట్టయింది. తండ్రికేసి తదేకంగా కొన్ని నిమిషాల పాటు చూసి, ''ఇవన్నమాట నీ చిల్లర బాకీలు. నీ మాటలు కాదని పట్నం వెళ్లిపోయానన్న కసితో నా కొడుకుని నాకు దూరం చేస్తున్నావు కదూ?'' అన్నాడు కచ్చగా.

''మాధవా! నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావురా. నీమీద కక్ష ఎందుకుంటుంది నాయనా? నేను గ్రహించిన సత్యాన్ని నువ్వు గ్రహించకపోవడం వల్లనే ఇలాంటి పెడర్థం తీస్తున్నావు. ఆనాడు పట్నం మోజులకై నా మాట పెడచెవిన పెట్టావు. అది ఒకరకమైన స్వార్థమే. ఈనాడు నీ కొడుకుని నీ కళ్లెదర వుండాలని వాడి అభీష్టం సాగకుండా అడ్డుపడుతున్నావు. ఇది స్వార్థాతిస్వార్థం. పక్షికి రెక్కలు వచ్చాక ఏ తీరానికి కావాలనుకుంటే ఆ తీరానికి వెళుతుంది. తరం మారినకొద్దీ తీరం మారుతుంది. కొత్తతరం అభిలాషను హుందాగా అంగీకరించడమే పాతతరం చేయగలిగేది. నువ్వది గుర్తించలేకపోతున్నావు కాబట్టే నేను కలగజేసుకోవాల్సి వచ్చింది.''

''ఇది నాతోనే ఆరంభమయిందా? మేమందరం నీ కళ్లెదుర వుండాలని నేను అమలాపురంలో స్థిరపడాలని నువ్వు కోరుకోలేదా? హైదరాబాద్‌లో ఉద్యోగం రాకుండా ఉండాలని చేయలేదా?''

''చేశాను... కానీ నీ వైఖరి మారదని గ్రహించాక ఆ ప్రయత్నాలు విడిచిపెట్టేశాను. ఇప్పుడంటే సంపాదించావు గానీ ఆ ఊరెళ్లిన కొత్తలో ఆ చిన్న చిన్న వాటాల్లో ఎలా బతికావో గుర్తుందా? ...అదీ లంకంత కొంప ఇక్కడ వుండగా. కానీ నీ జీవితం నీది. అందుకే నీ దారికి నేను అడ్డు రాలేదు. నువ్వూ రవి దారికి అడ్డు రాకూడదని నా సలహా'' 

''నువ్వు చివరిదాకా నన్ను వెనక్కి ఈడ్చుకు రావాలని ప్రయత్నిస్తూనే వున్నావు. ముల్కీ గొడవల్లో ఉద్యోగం వదిలేసి రమ్మనలేదా?''

''అవును. కడుపుతీపి కొద్దీ రమ్మన్నాను. రేపు స్టేట్స్‌లో ఇండియన్లని పట్టుకు కొడుతున్నారని టీవీలో చూస్తే రవిని వెనక్కి రమ్మని అడగవా? కానీ ఎప్పుడైతే నీ మనసు మారలేదని గ్రహించానో వెళ్లి యాదవ్‌ని కలిశాను...''

''ఎవరు? మా ఆఫీసులో యాదవా? నీకెలా తెలుసు?''

''... తెలుసుకున్నాను. నిన్ను వెనక్కి పంపిస్తానని ప్రతిజ్ఞ చేశాడని తెలిసి, పొలం అమ్మి అతని చేతులు తడిపి మూడో కంటివాడికి తెలీకుండా రికార్డులు మార్చేయమన్నాను...''

''నాన్నా!!''

మాధవరావు ఏడుస్తున్నాడు. నీళ్లు నిండిన కళ్లల్లో అతనికి వెలుగుచుక్కలు, వలయాలు కనబడుతున్నాయి. వాటిల్లో దుర్నిరీక్ష్యమైన తేజోరాశిగా, అనుభవజ్ఞానంతో వెలుగులు చిమ్ముతున్న కాంతిపుంజంగా తండ్రి రూపం గోచరించింది. (సుప్రభాతం ఏప్రిల్‌ 1997)  

ఎమ్బీయస్‌  ప్రసాద్

[email protected]

Click Here For Archives

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?