Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: మరాఠాల ఆందోళన

ఎమ్బీయస్‌: మరాఠాల ఆందోళన

మహారాష్ట్రలో మూక మోర్చా (మౌన ప్రదర్శన)ల ద్వారా మరాఠాలు చేస్తున్న ఆందోళన రెండు నెలలుగా సాగుతూ అంతకంతకీ ఉధృతమై ఫడ్నవీస్‌ పదవికి ఎసరు పెట్టేట్టుంది. ఆగస్టు 10 న ఔరంగాబాద్‌ జిల్లాలో నిర్వహించిన ప్రదర్శనకు లక్షమంది వచ్చారు. అప్పణ్నుంచి ఏ ప్రదర్శనలోనూ లక్షకు తక్కువమంది రావటం లేదట. ఇప్పటిదాకా ఔరంగాబాద్‌, ఉస్మానాబాద్‌, జలగావ్‌, బీడ్‌, పర్భణి జిల్లాలలో రమారమి 20 ప్రదర్శనలు జరిగాయి. సెప్టెంబరు 23న అహ్మద్‌నగర్‌లో ప్రదర్శన నిర్వహించబోతున్నాం అని రెండు వారాల ముందు ప్రకటించగానే కోటి రూ.ల విరాళం రెండు గంటల్లో అక్కడికక్కడ వసూలైంది. నాశిక్‌లో ప్రదర్శనకు కనీసం 10 లక్షల మంది వచ్చి వుంటారని అంచనా.  వచ్చినవారిలో కనీసం మూడోవంతు మంది మహిళలు వుంటున్నారు. తాము అపర జిజీబాయి (ఛత్రపతి శివాజీ తల్లి)లమని రాసిన ప్లకార్డులను యువతులు పట్టుకుంటున్నారు. (నిందితులపై చర్యలు తీసుకోవాలని, తమకు రిజర్వేషన్లు కల్పించాలని అనే డిమాండ్లతో బాటు సముద్రంలో కడుతున్న శివాజీ విగ్రహాన్ని ఏడాదిలోపు పూర్తి చేయాలన్న డిమాండు కూడా కలిపారు) అక్టోబరులో ముంబయిలో నిర్వహిస్తామంటున్నారు. ప్రదర్శనానంతరం యిచ్చే ప్రసంగాల్లో అప్పుల బాధతో తమ తలిదండ్రులు ఎలా ఆత్మహత్య చేసుకున్నారో కొంతమంది బాలికలు వివరిస్తున్నారు. ఎక్కడా రాజకీయనాయకులను దగ్గరకు రానీయటం లేదు.

జులై 13న అహ్మద్‌నగర్‌ జిల్లాలోని కోపార్డీ గ్రామంలో 14 ఏళ్ల మరాఠీ అమ్మాయి సామూహిక బలాత్కారానికి, హత్యకు గురి కావడంతో సమస్య ప్రారంభమైంది. మన దేశంలో ఎందరో యువతులు అటువంటి ఘోరాలకు గురవుతూంటారు. ఎవరి విషయంలోను యింతటి తీవ్రమైన ప్రతిస్పందన రాలేదు. మరి యీ కేసులో మాత్రం ఏమైంది అంటే దానికి రెండు కారణాలు - ఆమెపై అత్యాచారం జరిపిన ముగ్గురు యువకులు దళితులు, రెండో కారణం - వ్యవసాయం సరిగ్గా సాగకపోవడంతో మరాఠా రైతులు (ఆ మాటకొస్తే యితర కులాల రైతులు కూడా) ఆర్థికపరమైన యిబ్బందుల్లో పడడం! మొదటి సంగతికి వస్తే - మరాఠాలకు, దళితులకు 1991లో మరాట్వాడా యూనివర్శిటీ పేరు ఆంబేడ్కర్‌ యూనివర్శిటీగా మార్చడానికి ప్రయత్నించినపుడు ఘర్షణలు జరిగాయి. గతంలో మరాఠాలు బ్రాహ్మణాధిపత్యంపై పోరాడేవారు. 4% జనాభా మాత్రమే వున్నా ఉద్యోగాలన్నీ వారే చేజిక్కించుకున్నారని వాపోయేవారు. ఇటీవలి కాలంలో బ్రాహ్మణుల ప్రభావం క్షీణించింది. రిజర్వేషన్ల కారణంగా దళితులు అభివృద్ధి చెందుతున్నారని, తమను లెక్కచేయడం లేదని, అన్యాయంగా తమపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులు మోపుతున్నారని, యీనాడు మరాఠా బాలికనే చెరిచే స్థితికి వచ్చారని మరాఠాలు మండిపడుతున్నారు. ''సైరాట్‌'' అనే మరాఠీ యువప్రేమకథా చిత్రం యిటీవల విడుదలై చాలా హిట్టయింది. దానిలో ఒక మరాఠా అమ్మాయి, దళిత అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆ సినిమా చూశాకనే దళితులకు యిటువంటి కోరికలు పుడుతున్నాయని కొందరు మరాఠా నాయకులు సినిమాను తప్పుపడుతున్నారు. అత్యాచార చట్టాన్ని రద్దు చేయాలని, కనీసం సవరించాలని, మహిళలపై అత్యాచారాలు చేసేవారి కేసులు విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు నెలకొల్పాలని యిప్పుడు ఆందోళనకారులు అంటున్నారు. 

అత్యాచార చట్టం దుర్వినియోగం జరుగుతూండడం దేశమంతా జరుగుతోందని అందరూ అనే మాటే. శరద్‌ పవార్‌ కూడా 'నాకు తెలిసి అగ్రవర్ణాల నాయకులు తమ శత్రువులపై పగ సాధించేందుకు తమ అనుయాయియైన ఎస్సీల ద్వారా యీ చట్టాన్ని వాడుతున్నారు. దాన్ని సవరించవలసిన అవసరం వుంది.' అన్నాడు. 'చట్టం వుండి ఏం ప్రయోజనం? 94% కేసుల్లో శిక్షలు పడటమే లేదు' అని దళితులు విమర్శిస్తున్నారు. 'సాక్ష్యాలు లేకుండా, అసలేమీ జరగకుండా ఉత్తుత్తినే కేసులు పెడుతున్నారు కాబట్టే వీగిపోతున్నాయి' అంటున్నారు దళితేతరులు. మహారాష్ట్రలో దళితులు యితరులపై పెట్టిన అత్యాచార కేసులు 2005లో  258 వుంటే 2015 నాటికి 290 అయ్యాయి. అదే సమయంలో దళితులకు వ్యతిరేకంగా జరిగిన నేరాలు 2005లో 865 వుంటే 2015 నాటికి 1816 అయ్యాయి.

మరాఠాలు జనాభాలో మూడోవంతు వున్నారు. అగ్రవర్ణంగా పిలవబడతారు. రాజకీయ పదవులు, ఉద్యోగాలు, చక్కెర మిల్లులు, మిల్క్‌ కోఆపరేటివ్‌లు, కోఆపరేటివ్‌ బ్యాంకులు.. అన్నీ వాళ్లవే. చాలామంది మరాఠా ముఖ్యమంత్రులే 30 ఏళ్ల పాటు పాలించారు.  మరి వారు ఒబిసిల మంటూ కాలేజీ సీట్లలో, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ అడగడం ఏమిటి? అనే సందేహం వస్తుంది. ఒక పరిశీలకుడు మరాఠాలను నాలుగు వర్గాలుగా విభజించి వివరించాడు. మొదటి వర్గం మంత్రులు, కమిషన్‌ల చైర్మన్లు, అనేక బోర్డు చేర్మాన్‌లు, కోఆపరేటివ్‌ బ్యాంకుల డైరక్టర్లు, సుగర్‌ కోఆపరేటివ్‌ల బోర్డు సభ్యులు, జిల్లా పరిషత్‌, గ్రామపంచాయితీ చైర్మన్లు... యిటువంటి వారందరూ దీనిలోకి వస్తారు. వారి కంటె కాస్త తక్కువగా వున్న రెండో వర్గం వారు ధనిక రైతులు. వాణిజ్యపంటలు వేసేవారు. పల్లెటూళ్లలో వారి మాట వేదవాక్కు. వాళ్లు రాజకీయాల్లో డైరక్టుగా లేకున్నా, రాజకీయ నాయకులకు నిధులందించే వర్గం. జాతీయ బ్యాంకులు, ప్రయివేటు సెక్టార్‌ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు పల్లెల్లో విస్తరించడం వలన మరాఠాలు నడిపే కోఆపరేటివ్‌ బ్యాంకులు, చిన్న ఫైనాన్షియల్‌ సంస్థలు, యిటీవల దెబ్బతినసాగాయి. దాంతో యిన్నాళ్లూ వాళ్లు చలాయించిన ఆర్థికపరమైన పెత్తనం బలహీనపడసాగింది. ఇక మూడో వర్గం మధ్యతరగతి, చిన్న వ్యవసాయదారులు. వర్షాలు బాగా పడితే వాళ్లు కింగ్‌లు, లేకపోతే కుదేలవుతారు. రైతు కూలీలు (వాళ్లూ మరాఠాలే) కూలి పెంచేశారని ఫిర్యాదు చేస్తూ వుంటారు. చిన్న చిన్న కమతాలు నడుపుకోవడానికి ధనికుల వద్ద, బ్యాంకుల వద్ద అప్పులు తీసుకుంటారు. జీవనసరళిలో పెద్ద రైతులను అనుకరించబోయి పెళ్లిళ్లకు, పేరంటాలకు విపరీతంగా ఖర్చుపెట్టి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇక అట్టడుగున్న పొరలో వుండే మరాఠాలు భూమిలేని వ్యవసాయకూలీలు, రైతులు. ప్రభుత్వ స్కీముల మీద ఆధారపడతారు. వీళ్లకు ఉపాధి పోయింది. మరాఠాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విస్తరించి వున్నా, వ్యవసాయం ఘోరంగా దెబ్బ తిన్న మరాట్వాడాలోనే ఆందోళన తీవ్రంగా సాగుతోందని గుర్తిస్తే రైతు కోణం గోచరిస్తుంది. ఈ సారి వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఆందోళన క్రమేపీ తగ్గుముఖం పడుతుందని కొందరు ఆశిస్తున్నారు. 

ఒకప్పుడు బ్రాహ్మణులు, యిప్పుడు దళితులతో సహా అందరూ చదువులను నమ్ముకుని, ఉద్యోగాలు తెచ్చుకుని నగరాలకు విస్తరిస్తే, చాలామంది మరాఠాలు చదువును నిర్లక్ష్యం చేసి, వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. వ్యాపారపరంగా కాలేజీలు నడిపేది మరాఠాలే అయినా, దానిలో విద్యార్థులు మాత్రం మరాఠాలు అధికసంఖ్యలో వుండటం లేదు. తరాలు మారిన కొద్దీ ఆస్తిపంపకాల కారణంగా వ్యక్తిగత భూవసతి తగ్గుతూ వచ్చింది. వ్యవసాయం కిట్టుబాటు కాకుండా పోయింది. పైగా ఈ రోజుల్లో నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువుమందులు, మద్దతు ధర లేకపోవడం, వర్షాభావం, ఋణభారం యిటువంటి కారణాలతో వ్యవసాయం దెబ్బతినడంతో వీరి ఆర్థిక పరిస్థితి దెబ్బ తింది. చదువులు పెద్దగా లేకపోవడంతో ఉద్యోగాలూ లేవు. దానితో వారితో నిస్పృహ కలిగింది. ఏళ్ల తరబడి సాగిన కాంగ్రెసు-ఎన్‌సిపి పాలనలో తమ పరిస్థితి బాగుపడకపోవడంతో మోదీ వచ్చి ఏదో చేస్తాడన్న ఆశతో వీళ్లంతా బిజెపికి ఓటేశారు. కానీ పరిస్థితిలో మార్పు రాలేదు. దాంతో మరీ కృంగిపోయి ఆందోళన బాట పట్టారు. ఉన్నతవర్గాలకు చెందిన 200 మరాఠా కుటుంబాలను రాష్ట్రసంపదనంతా గుప్పిట్లో పెట్టుకుని చిన్న స్థాయి మరాఠాలను పైకి రానీయలేదని పరిశీలకులు అంటారు. ఆందోళన కారులు తమ కులపు నాయకులపై ఆగ్రహం వున్నా చెప్పుకోలేక, దళితులపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.

మరాఠాలతో సమానస్థాయిలో వుండే కుంబీలను ఒబిసిలుగా ముందే గుర్తించారు. తమనీ గుర్తించమని మరాఠాలు అడిగారు. ఇప్పటికే మహారాష్ట్రలో ఒబిసిల కున్న 27% రిజర్వేషన్‌తో కలిపి మొత్తం 52% వుంది. కాంగ్రెసు-ఎన్‌సిపి సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడ్డాక ఓట్ల కోసం మరాఠాలకు 16%, ముస్లిములకు 5% రిజర్వేషన్‌ కల్పించింది. లిమిటు దాటడంతో విషయం బాంబే హైకోర్టుకి వెళ్లింది. ఎప్పుడు తేలుతుందో తెలియదు. సుప్రీం కోర్టుకి వెళితే హైకోర్టు తీర్పు దాకా ఆగమంది. రిజర్వేషన్‌ కల్పించినా మరాఠాలు ఆ పార్టీలకు ఓటేయలేదు. ఇక అలాటప్పుడు తామెందుకు దానిలో తలదూర్చి తక్కినవారికి ఆగ్రహం కలిగించడం అని బిజెపి భావిస్తూండవచ్చు. ఇప్పటివరకు మరాఠాల ప్రదర్శనలలో రాజకీయనాయకులు చొరబడలేదు కానీ కొన్ని మరాఠా పెద్ద తలకాయలు వెనకనుంచి సాయపడుతున్నాయట. ఫడ్నవీస్‌ బ్రాహ్మణుడు కాబట్టి మరాఠాల ఆవేదన అర్థం చేసుకోలేడని, అతని స్థానంలో ఎవరైనా మరాఠాను తేవాలని కొందరు నాయకులు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఎన్నో ఏళ్లగా వున్న వాళ్ల సమస్యలను ఫడ్నవీస్‌ రెండేళ్లలో ఎలా తీరుస్తాడని అతని అనుచరులు అంటున్నారు.  దేశంలో జాట్లు, పటేళ్లు, కాపులు.. యిలా అనేక వర్గాలు రిజర్వేషన్లకై పోరాడుతున్నారు. మరాఠాలు కూడా వారి సరసన చేరారు. చివరకు యీ సమస్య ఎలా రూపుదిద్దుకుంటుందో చూడాలి.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2016) 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?