cloudfront

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: మీ టూ వేటుకు అక్బర్‌ బలి

ఎమ్బీయస్‌: మీ టూ వేటుకు అక్బర్‌ బలి

'మీ టూ' ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఏదో కొంచెం సంచలనం చెలరేగుతుంది, తర్వాత చప్పబడుతుంది అనుకున్నారు కానీ యిలా ఏకంగా ఓ కేంద్రమంత్రికే ఎసరు వస్తుందని ఎవరూ అనుకుని ఉండరు.  మొదటగా సినీరంగ ప్రముఖుల గురించి ప్రస్తావన వచ్చినపుడు  శ్రీ రెడ్డి ధర్మమాని, తెలుగు సినిమారంగంలో యిప్పటికే చూసేశాం కాబట్టి మనం 'సరేలే' అనుకున్నాం. సాధారణంగా హీరోల గురించి, దర్శకనిర్మాతల గురించి ఆరోపణలు రావడం సహజం. తమిళసీమలో గీతరచయితపై వచ్చినపుడు కాస్త వింతగా అనిపించింది. ఆ తర్వాత ముంబయి సినీమావాళ్లు 'డర్టీ పిక్చర్‌'లోకి వచ్చారు.

సాధారణంగా యిలాటివి వచ్చినపుడు, అన్నీ అసత్యాలని ఆరోపితులు కొట్టిపారేయడం జరుగుతుంది. ఆరోపణ చేసినవాళ్లు 'నా దగ్గర ఆధారాలు లేకపోయినా... నేను నిజమే చెపుతున్నాను. ఆ విషయం అవతలి వ్యక్తికీ తెలుసు' అంటూ డైలాగుల్లో అంతరాత్మ, మనస్సాక్షి వంటి వాటిని లాక్కు వస్తూంటారు. అదేదో యిద్దరు వ్యక్తుల మధ్య వ్యవహారమనుకుని తక్కినవాళ్లు వ్యాఖ్యానించకుండా ఊరుకుంటారు. వాళ్లతో పని చేసేటప్పుడు కూడా ఆ విషయాలు ప్రస్తావించకుండా గుంభనంగా ఉంటారు.

కానీ యీసారి హిందీ చిత్రసీమలో వ్యక్తులు భిన్నంగా ప్రవర్తించారు. కోర్టులు తీర్పులిచ్చేందుకు ముందే అక్షయ్‌ కుమార్‌, ఆమీర్‌ ఖాన్‌లు తీర్పులిచ్చేసి ఆరోపితులతో పని చేయం అనేశారు. నిందితుడు నేరస్తుడు కానక్కరలేదని అందరికీ తెలుసు. వాళ్లు నటించే సినిమాల ద్వారానే దాన్ని నొక్కి వక్కాణిస్తూ ఉంటారు. లోకంలో ఎవరైనా ఎవరిపైనైనా ఏ నిందైనా వేయవచ్చు. అది నిజమైనా కావచ్చు, అబద్ధమైనా కావచ్చు అనే యింగితంతోనే సత్యమో, అసత్యమో నిరూపించడానికి కొన్ని నియమాలు ఏర్పరచారు. దృఢమైనవి కాకపోయినా, ప్రాథమికంగా తేలకపాటి ఆధారాలున్నా, అనుమానాలున్నా పోలీసులు కేసు పెడతారు. ఆధారాలు కోర్టుకి సమర్పిస్తారు.

కోర్టులో విచారణకు జరుగుతుంది. అక్కడ కూలంకషంగా వాదప్రతివాదాలు జరుగుతాయి. సాక్షులు చెప్పేది వాస్తవమో, కాదో నిగ్గు తేలుస్తారు. కళ్లారా చూసినవాళ్లు లేకపోతే సందర్భం బట్టి యితర రకాల సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటారు. ముద్దాయి ప్రవర్తన, పూర్వచరిత్ర యిలాటివి న్యాయాధీశుడు గమనిస్తాడు. తొందరపడకుండా, నిదానంగా ఆలోచించి, పాత కేసులు అధ్యయనం చేసి, పోల్చి చూసుకుని అప్పుడు తీర్పు యిస్తాడు. ఇంత కసరత్తు చేసినా దీనిలో లోపం ఉండవచ్చు అనుకుని, యింతకంటె పై కోర్టుకి అప్పీలుకై వెళ్లే సావకాశం కూడా యిస్తోంది మన చట్టం. నిరపరాధిని శిక్షించకూడదు అనే సిద్ధాంతాన్ని పరిపూర్ణంగా నమ్మి యిన్ని నియమాలు ఏర్పరచింది మన దేశవ్యవస్థ.

మరి ఈ అక్షయకుమార్లు, ఆమీర్‌ ఖాన్‌లు నిందితులను యిటువంటి ప్రక్రియకు గురి చేశారా? పోనీ ఆరోపణలు చేసినవారిని పిలిపించి, వారి వాదనలు విని, అవి నిజమేనని వేరే విధంగా ధృవపరుచుకుని, జడ్జి స్థానంలో కూర్చుని సొంత న్యాయస్థానంలో తీర్పు వెలువరించారా? ఎవరు పడితే వాళ్లు జడ్జిలు కాలేరు. దానికి ఎంతో జ్ఞానం ఉండాలి, అధ్యయనం ఉండాలి, అనుభవం ఉండాలి. వీరికి అది ఉందా? వీరి తీర్పు వలన అవతలివాళ్లు జైలుకి వెళ్లటం లేదు కదా అనుకోవద్దు. ఇమేజి పరంగా వాళ్లకు అంతకంటె ఎక్కువ హాని చేశారు వీళ్లు. వాళ్లపై వచ్చిన ఆరోపణలు నిజమేనని మేం నమ్మేశాం అనే కలరింగు యిచ్చారు.

కోర్టులో వాళ్లు సచ్ఛీలురనే సర్టిఫికెట్టు వచ్చేదాకా వీళ్లు వాళ్లతో పనిచేయరన్నమాట. అంటే ఎవరైనా కేసు పడేయగానే వీళ్లు వాళ్లపై నేరస్తుడు ముద్ర కొట్టేసి, శిక్ష వేసేస్తారన్నమాట. ఏదైనా సినిమా 90% పూర్తయ్యాక, సాటి ఆర్టిస్టుపై యిలాటి ముద్ర రాగానే అప్పుడు కూడా తప్పుకుంటారా? లేక రిస్కు లేని సినిమాల విషయాల్లోనే యిలాటి నిర్ణయాలు తీసుకుంటారా? ఇలాటి సందేహం రావడానికి కారణం - ఇప్పటి వ్యవహారాలు చూస్తూ ఉంటే ఎవరి మీదనైనా ఏ బురదైనా చల్లేసి తప్పించుకోవచ్చనిపిస్తోంది. గతంలో అయితే ఆధారాలున్నాయా, సాక్ష్యాలున్నాయా? అనే అతి సాధారణ ప్రశ్నలు అడిగేవారు.

పోలీసులూ అవే అడుగుతారు, మన తరఫున వాదించడానికి సిద్ధపడిన లాయరూ అదే అడుగుతారు. ఏదైనా పత్రికకు వ్యాసంగా రాద్దామన్నా దాని ఎడిటరూ అదే అడుగుతాడు. 'రేపు అవతలివాళ్లు ఖండిస్తే ఆరోపణ సమర్థించుకునేందుకు మన దగ్గర మెటీరియల్‌ ఉండాలి కదా' అని కామన్‌సెన్స్‌ పాయింటు అడుగుతాడు. ఇప్పుడు సోషల్‌ మీడియా ధర్మమాని అలా అడిగేవాడు లేడు. సెన్సేషనల్‌గా ఏదైనా రాయగలిగితే చాలు భేష్‌, భేష్‌ అనే జనాభా ఎక్కువై పోయారు. 'మా యింట దున్నపోతు ఈనింది' అని రాస్తే 'దూడను గుంజకు జాగ్రత్తగా కట్టేయి, దానితో సెల్ఫీ దిగి పోస్టు చేయి' అనేవాళ్లు మాత్రమే కాదు, 'మా యింట్లో దున్నపోతు కూడా ఎప్పుడో  యీనింది, పబ్లిసిటీ యిష్టం లేక నేను అప్పుడు రాయలేదంతే' అనేవాళ్లూ కోకొల్లలు తయారయ్యారు.

రాసేవాడికి బుద్ధి ఉండనక్కరలేదు, వినేవాడికి వివేకం ఉండనక్కరలేదు, రాసేదానిపై ఒక ఎడిటింగు లేదు, ఒక పర్యవేక్షణ లేదు, ఒక అదుపు లేదు. సోషల్‌ మీడియా వాల్‌, సినిమాహాలు పక్కనున్న గోడలా  తయారైంది. ఎవడేం కావాలన్నా పోసేయవచ్చు. సాధారణ సమయాల్లోనే యిలా ఉంటే, ఉద్యమసమయంలో చెప్పనే అక్కరలేదు. అతిశయోక్తులు విపరీతంగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తే, 'కవిసమయం' అని సమర్థించుకునేవారు. అతిశయోక్తులు, ఉత్ప్రేక్షలు, అసత్యాలు చెప్పేసినా కవులకు చెల్లిపోతుంది. అలాగే 'ఉద్యమసమయం' అని ఒకటి యిటీవల రూపుదిద్దుకుంది.

ఉద్యమంలో ఉండగా కూసిన కూతలకు, బూతులకు, ఆరోపణలకు, చేసిన వాగ్దానాలకు జవాబుదారీ అక్కరలేదని సమర్థించుకుంటున్నారు - ఒకప్పటి ఉద్యమకారులు. ఇప్పుడు 'మీ టూ' కూడా ఉద్యమంలా నడుస్తోందని గుర్తుంచుకుంటే, యీ సమయంలో చేసే ఆరోపణలలో వాస్తవాల గురించి కూడా ఒక అంచనా వస్తుంది. కానీ అక్షయ్‌ కుమార్‌ తదితరులు యివి అక్షరసత్యాలని నమ్ముతున్నారు. సరే, వాళ్ల యిష్టం. కానీ యీ ధోరణి యిలాటి కేసులకు మాత్రమే పరిమితమా అనే సందేహం వస్తోంది. సినిమా పరిశ్రమలో అనేకమంది పంపిణీ దారులు కేసులు ఎదుర్కుంటూ ఉంటారు - నిర్మాతలకు యివ్వాల్సిన డబ్బులు ఎగొట్టారని.

నిర్మాతలూ ఎదుర్కుంటూ ఉంటారు - ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు యిస్తానన్న పారితోషికం యివ్వకుండా ఎగ్గొట్టారని.  దర్శకులూ ఎదుర్కుంటూ ఉంటారు - ఫలానా కథ నాదే, నాకు చెప్పకుండా కాపీ కొట్టేశాడనే రచయితల నుండి. ఇక సల్మాన్‌, సంజయ్‌ దత్‌ కేసుల గురించి చెప్పనే అక్కరలేదు. దారుణమైన కేసులవి. మరి వీళ్లు వాళ్లతో నటించడం మానేశారా? తీర్పు వచ్చి మీరు నిర్దోషులని తేలేదాకా మీకూ మాకూ రాంరాం అని అన్నారా? కేసు పడేయగానే షూటింగుకి రామురాము అన్నారా? ఈ 'మీ టూ' వ్యవహారంలో కేసులు పడడం, అవి కోర్టులో ఎడ్మిట్‌ కావడం కూడా కాకుండానే కేవలం సోషల్‌ మీడియాలో వారి రాతలు చూసే స్పందించేశారే! ఎందుకంటారు?

'మీ టూ ఉద్యమానికి మద్దతిస్తున్నాం కాబట్టి మేం బాధితుల తరఫున ఛాంపియన్లం. మేం అటువంటి అకృత్యాలకు పాల్పడలేదు' అని చాటుకోవాలన్న తాపత్రయమే నాకు కనబడుతోంది. మరీ అతి చేస్తే గతి చెడుతుందని కూడా వాళ్లు గుర్తించాలి. అమితాబ్‌కు అప్పుడే ఒకావిడ హెచ్చరిక పడేసింది. రేపుమర్నాడు వీళ్ల మీదా అలాటి ఆరోపణ వస్తే ఏం చేస్తారో మరి? 'మేం బాధితుల పక్షాన నిలబడ్డామన్న కోపంతో నిందితుల తరఫు వాళ్లెవరో ఎవరో మహిళ పేర చేసిన అబద్ధపు ఆరోపణ యిది' అని వాదిస్తారేమో! అలా వాదించడానికే ముందస్తు జాగ్రత్త చర్యగా యిలా చేశారా? ఏమో తెలియదు.

శృంగారం యిద్దరు వ్యక్తుల మధ్య వ్యవహారం. నిజానిజాలు వాళ్లకే తెలుస్తాయి. అదీ యిద్దరూ స్పృహలో ఉంటేనే! మద్యం మత్తులో ఉంటే ఆ విషయంలోనూ అస్పష్టత ఉంటుంది. వాళ్లకే సరిగ్గా తెలిసీతెలియనప్పుడు యింకోళ్లకు ఎలా తెలుస్తుంది?  కెమెరాల సాక్ష్యం ఉంటే తప్ప! ఎవరో వింతమనస్కులు తప్ప సాధారణ వ్యక్తులెవరూ కెమెరాల ముందు శృంగారంలో పాల్గొనరు కదా! మరి ఆధారాలు ఎలా దొరుకుతాయి అని ఆరోపణలు చేసేవారు అడగవచ్చు. ఈ ప్రశ్న ప్రతీ బలాత్కారం కేసులోనూ ఎదురవుతుంది. దానికి తగిన సమాధానాలు న్యాయవ్యవస్థలో దొరుకుతాయి.

ఇక్కడ కామన్‌సెన్స్‌తో అడిగే ప్రశ్న ఒకదాన్ని యీ 'బాధిత' మహిళలందరూ ఎదుర్కోవలసి వస్తుంది - 'అప్పుడే ఎందుకు చెప్పలేదు?' అని! తెలుగునాట 'ఆ ముక్క లెక్కెట్టుకోడానికి ముందు జెప్పాల' అనే సినిమా డైలాగు ఒక లోకోక్తిగా మారిపోయింది, ఎందుకంటే దానిలో హేతుబద్ధత ఉంది. ఇప్పుడు నోరు విప్పి యింత చెప్తున్నావు కదా, సంఘటన జరిగిన మర్నాడే ఎందుకు చెప్పలేదు? అని ఎవరైనా అడగగలిగే ప్రశ్న. దానికి వీళ్ల దగ్గర ఉన్న స్టాక్‌ ఆన్సర్‌- 'అప్పుడు భయపడ్డాను.'! పోలీసు వాడికి భయపడ్డాను అంటే అర్థం చేసుకోగలం, దొంగ కేసు పెట్టి జైల్లోకి తోస్తాడేమోనని.

గూండాకి, రాజకీయనాయకుడికి భయపడ్డాను అన్నా అర్థం చేసుకోగలం. ప్రాణహాని, ఆస్తిహాని ఉందని. పత్రిక ఎడిటరుని చూసి, సినిమా డైరక్టరును, ఆఫీసులో బాసుని చూసి భయపడవలసిన అవసరం ఎంతుంది? ఒప్పుకోకపోతే ఉద్యోగం తీసేస్తాడు, అంతేగా! నీ టాలెంటుతో వేరే చోట వెతుక్కోగలవు కదా! మహా అయితే అక్కడ జీతం తక్కువ వస్తుంది తప్ప తిండికి మాడవు కదా! 'తప్పు చేసినది వాడైతే నేనెందుకు మానేయాలి?' అనేది చాలా విలువైన ప్రశ్న. మాననక్కరలేదు - నీకు ధిక్కరించే, పోరాడే ఉద్దేశం ఉంటే! అతనిపై అతని పై అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.

అతని డిపార్టుమెంటు నుంచి వేరే డిపార్టుమెంటుకి మార్చమని డిమాండు చేయవచ్చు. సినిమా విషయమైతే నిర్మాతకు ఫిర్యాదు చేయవచ్చు. సినిమా మధ్యలో మానేస్తానని పేచీ పెట్టవచ్చు. ఇవేమీ చేయలేదంటే దాని అర్థం ఏమిటి? నీకు సమ్మతమైనా కావాలి, లేదా పరిస్థితితో రాజీయైనా పడి వుండాలి. అక్బరు విషయంలో ఫిర్యాదు చేస్తున్న వాళ్లు జర్నలిస్టులు. సాధారణంగా జర్నలిస్టులకు ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఎవరో గురించిన వాస్తవాలు బయటపెట్టడమే వాళ్ల పని. వేళకాని వేళల్లో పని చేస్తూ ఉంటారు. మతకలహాలు, కులఘర్షణలు, హింసాత్మకమైన ఎన్నికలు జరిగే చోట్లకు సైతం నిర్భయంగా వెళుతూ ఉంటారు.

మారుపేర్లు ఉపయోగించి, తామెవరో చెప్పకుండా సమాచారం సేకరిస్తారు. తెలుసుకున్నది బయటపెట్టడానికి వీల్లేదని బెదిరింపులు వస్తూ ఉంటాయి. అవన్నీ తట్టుకుని ఉద్యోగాలు చేసిన జర్నలిస్టులు యిలాటి విషయాలను బయటపెట్టడానికి జంకారా? భయపడ్డారా? బలాత్కారానికి గురైన ఆదివాసీ మహిళ సైతం పోలీసు స్టేషన్‌ తలుపు తడుతోందే! మీ వృత్తిలో భాగంగా పోలీసు బాసులతో కూడా పరిచయాలుండే మీకు ఫిర్యాదు చేసేందుకు భయమా? ఇదేమైనా నమ్మేట్లుగా ఉందా?

'అతనికి ఉన్న పేరు బట్టి అతనిలాటి వాడని అనుకోలేదు. సరదా మనిషే అనుకున్నాను తప్ప శృంగారపురుషుడని అనుకోలేదు' అని వాదించవచ్చు. 'తోటకూర నాడే చెప్పకపోయావా?' అని ప్రాచీనమైన కథ ఉంది. దానిలోనూ తర్కం ఉంది. పక్కింట్లో తోటకూర దొంగిలించి తెచ్చినపుడే మందలించి ఉంటే, యీ స్థాయి దొంగగా మారేవాణ్నా, యీనాడు జైల్లో పడేవాణ్నా? ఇప్పుడు వచ్చి వలవలా ఏడిస్తే ఏం ప్రయోజనం?' అని ఓ ఖైదీ తల్లిని నిలదీస్తాడు. అలాగే యీ ఆరోపణలు చేసినమ్మాయి తల్లి 'అతను సెక్స్‌జోక్‌ వేయగానే ఆపాల్సింది. అప్పుడు హోటల్‌కు వెళదామా అని అడిగివుండేవాడు కాదు.' అని చెపుతుందేమో!

నిజానికి  ప్రతి తల్లి కూతురికి చిన్నప్పటి నుంచి జాగ్రత్తలు చెప్తూనే ఉంటుంది. దానివలన ఆడవాళ్లకు ఒక స్పెషల్‌ ఏంటినా డెవలప్‌ అవుతుంది. ఎవళ్లు మర్యాదస్తులో, కాదో వాళ్లు అతి సులభంగా గ్రహించగలుగుతారు.  కొంతమందితోనే కంఫర్టబుల్‌గా ఉంటారు, కొంతమందితో దూరం పాటిస్తారు. అవతలివాడు అనవసరమైన చనువు తీసుకుంటున్నాడని తోచగానే కట్‌ చేస్తారు. కట్‌ చేయలేని స్థితిలో ఉంటే వాళ్లే పని మానుకుంటారు. ఇంటాయన వెకిలి చూపులు చూస్తున్నాడని తోస్తే పనిమనిషే పని మానుకుంటుంది, అలాటిది యింతటి విద్యాధికులు మానుకోలేక పోయారా?

నేరం జరిగినపుడు పోలీసులు వెంటనే పట్టుకోలేరు. అనుమానితులను కొంతకాలం పాటు గమనిస్తారు. అతని జీవనసరళిలో వచ్చిన మార్పును బట్టి విచారణ సాగిస్తారు. చివరకు లింకు దొరుకుతుంది. అలాగే యీ నిందలు వేసేవారు కూడా వాళ్లు చెప్పిన సంఘటన తర్వాత ఎలా ప్రవర్తించారు అనేది గమనిస్తే ఆ ఆరోపణలో నిజానిజాలు తెలియవచ్చు. కానీ దీనికి చాలా ఓపిక కావాలి, తీరిక వుండాలి. ఈ సోషల్‌ మీడియా యుగంలో అంత తీరిక ఎవరికీ లేదు. ఏదైనా వినగానే, క్షణం కూడా ఆలోచించకుండా తీర్పులు యిచ్చేస్తున్నారు.

పైగా రేప్‌ను నిర్వచించడం సులభం కానీ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ను నిర్వచించడం కష్టం. శృంగారపరమైన ఛలోక్తి వేసినా దాన్ని 'ఎడ్వాన్స్‌'గా ముద్ర వేయవచ్చు. 'మరి ఆ అమ్మాయి కూడా అదే జోక్‌ వేసింది కదా' అని అడిగితే 'అది సెన్సాఫ్‌ హ్యూమర్‌' అని వాదించవచ్చు. 'అమ్మాయికి ఆసక్తి ఉన్నా దాన్ని మరుగుపరిచి, మనచేత అడిగించుకుని కానీ బయటపడదు' అనే నమ్మకం మగవాళ్లలో నాటుకు పోవడం చేత కాస్త లీడ్‌ తీసుకుని ఎక్కడైనా వెళదామా? అని అడిగేట్లా చేస్తోంది.

అమ్మాయి 'నో' అనే రెండక్షరాల మాటతో అక్కడికక్కడే దాన్ని ఆపేయవచ్చు. లేదా 'సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌' అనే పేరుతో యాగీ చేయనూ వచ్చు. ఆ రిస్కు మగవాడు తీసుకోవలసి వస్తోంది. తీసుకోదలచినవాడు బుద్ధిగా ఉండి మంచిపేరు (కొండకచో 'పప్పు') తెచ్చుకోవచ్చు. ఛాయిస్‌ వాళ్లదే! ఉద్యమం అంటూ బయలుదేరాక ప్రతి ఉద్యమంలో లాగే దానిలో కూడా చెత్తా, చెదారం వచ్చి చేరతాయి. కొందరు గుర్తింపు కోసం 'నాకూ అన్యాయం జరిగింది..' అంటూ నినాదాలు అందుకుంటున్నారు. ఇది వేలం వెర్రిగా మారేటప్పటికి సానుభూతి తగ్గుతుంది.

'మరి అప్పుడేం చేశావు? ఏదో ఆశించి మౌనంగా వున్నావ్‌. అన్నీ ఉడిగాక యిప్పుడు అల్లరి పెడుతున్నావ్‌' అని యితరులు అనే ప్రమాదమూ ఉంది. గ్లామర్‌ ప్రపంచంలోనే కాదు, మామూలు ఆఫీసుల్లోనూ యిలాటివి జరుగుతూనే ఉన్నాయి. మహిళలు వాటిని ఎదుర్కుంటూనే ఉన్నారు. వారి కుటుంబసభ్యులు వారికి అండగా నిలుస్తూనే ఉన్నారు. కానీ అంతా గుట్టుగానే ఉంటోంది. ఇప్పుడు ప్రతీదీ బాహాటపరచుకోవడం ఫ్యాషన్‌ కాబట్టి 'నేను కూడా..' అని చాటి చెప్తున్నారు. ఇది ముదిరితే మహిళలతో కలిసి పనిచేయడానికి మగవారు యిచ్చగించకపోవడం, ఎందుకైనా మంచిదని సాటి మగవాళ్లకే అవకాశాలు కల్పించడం జరిగితే, ఉపాధి అవకాశాల రీత్యా మహిళలకే చేటు కలిగే ప్రమాదం ఉంది.

ఇవన్నీ ఒక ఎత్తయితే అక్బరు రాజీనామా మరొక ఎత్తు. మోదీ అతని చేత ఎందుకు రాజీనామా చేయించాడో అర్థం కావటం లేదు. అక్బరుపై వచ్చిన ఆరోపణలు అతను మంత్రిగా ఉన్నపుడు చేసిన చేష్టలపై కాదు. విదేశాల్లో యిలాటి ఆరోపణలపై రాజీనామా చేసిన మంత్రులున్నారు. కానీ ఆ కేసుల్లో ఆధారాలు చూపుతున్నారు. ఇక్కడ అది జరగలేదు. నైతిక కారణాల వలన.. అంటే మోదీ కాబినెట్‌లో అనేక మంది రాజీనామా చేయవచ్చు. అక్బరు నోరు మూసుకుని కూర్చోకుండా పరువునష్టం దావా వేసినందుకు మోదీకి కోపం వచ్చి దిగిపోమన్నాడు అని ఒక కథనం.

పరువునష్టం దావా వేయకపోతే అక్బరు సచ్ఛీలుడైనట్లా? తనపై ఆరోపణలు రాగానే అక్బరు అవన్నీ రాజకీయప్రేరితాలు అన్నాడు. ఒక నాయకుడికి అది సహజం. పరువునష్టం దావా విచారణకు వస్తే అవతలివాళ్లు ఏ ఆధారాలు చూపిస్తారో తెలిసేది. విచారణకు రాకుండానే రాజీనామా చేయించడం దేనికి? అతనిపై ఫిర్యాదు చేసే మహిళా జర్నలిస్టుల సంఖ్య పెరుగుతూ పోవడం వలన.. అని మరో కథనం. అంటే ఒకరితో మిస్‌బిహేవ్‌ చేస్తే ఫర్వాలేదు కానీ పదిమందితో చేస్తే శిక్షించాల్సిందే అనే లాజిక్‌ ఏమైనా ఉందా?

అక్బరుతో యీ దాడి ఆగదు. 'దుర్గాష్టమి నాడు ఒక రాక్షసుడు మరణించాడు' అంది ఒక మహిళా జర్నలిస్టు. మరి దీపావళి నాటి నరకాసురుడు ఎవరో? బిజెపికి సన్నిహితులైన జర్నలిస్టులపై నిందపడితే ఏం చేస్తారో చూడాలి. 2019 ఎన్నికలకై బిజెపి అనేకమంది సినిమా వాళ్లను దువ్వుతోంది. వారిపై యిలాటి ఆరోపణలు వస్తే ఏం చేస్తారో చూడాలి. ఆధారాలు చూపాలంటే కష్టం కానీ, ఆరోపణలు చేయాలంటే యిబ్బందేముంది? ఎడాపెడా చేయవచ్చు. అవతలివాళ్లు విలవిలలాడుతూంటే ఆనందించవచ్చు. ఏది ఏమైనా మనం ఒక గందరగోళపు దశలోకి అడుగుపెట్టాం. పర్యవసానాలు ఎలా వుంటాయో చూడాలి.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2018)
mbsprasad@gmail.com

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి