Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : ఓణమ్‌ను మరోలా..

ఎమ్బీయస్‌ : ఓణమ్‌ను మరోలా..

మలయాళీలందరూ ఎటువంటి భేదాలూ లేకుండా ఓణమ్‌ను ఘనంగా జరుపుకుంటారు. కలకత్తాలో దుర్గాపూజకు ఎంత హడావుడి జరుగుతుందో కేరళలో ఓణమ్‌కు అంత జరుగుతుంది. పంటలు యింటికి వచ్చే సమయం కాబట్టి, బయటి వూళ్లల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో వున్న వాళ్లందరూ యింటికి వస్తారు. వ్యాపారస్తులు ప్రత్యేక డిస్కౌంట్‌లిస్తారు, ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పడవల పోటీలు జరుగుతాయి. మతపపరమైన నేపథ్యం కొద్దిగా వుంది కానీ ప్రధానంగా సామాజికపరంగానే దీన్ని చూస్తారు. మతపరమైన విషయమేమిటంటే బలి చక్రవర్తి (మహాబలి) భూతలానికి వచ్చే రోజది. బలికి, కేరళకు లింకేమిటంటే కేరళను గతంలో మహాబలే పాలించాడట. అందుకే వాళ్ల భాషలో దాన్ని 'మావలినాడు' అంటారు. విష్ణువు వామనరూపంలో వచ్చి, త్రివిక్రముడై పాతాళానికి తొక్కేసినపుడు ఒక కోరిక కోరాడట. ఏడాదికి ఓ సారి భూమికి వచ్చి తన ప్రజలను చూస్తానని కోరితే విష్ణువు సరేనన్నాడట. అందువలన చింగమ్‌ మాసంలో తిరుఓణమ్‌ నక్షత్రం వున్న రోజున కేరళకు వస్తాడట. ఆ కథకు లింకు చేసి ఓణమ్‌ పండగ యాడ్స్‌లో మహాబలి బొమ్మలు, కారికేచర్స్‌ వేస్తారు. అతనో రాక్షసరాజు అని ఎవరూ ఫీలవరు. ఎందుకంటే మలయాళ జానపద గీతాల్లో మహాబలి కాలంలో ప్రజలందర్నీ హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా చూసి, అందర్నీ ఆనందంగా వుంచాడట. కేరళలో దీపావళిని కూడా మహాబలికే ముడిపెడతారు. అక్కడ నరకాసుర కథ చెప్పరు. కేరళకు మహాబలికి సంబంధం ఏమీ లేదని, కేరళను వామనుడి తర్వాతి అవతారమైన పరశురాముడు తన గొడ్డలితో సముద్రం నుంచి వెలికితీశాడని, అందువలన దాన్ని పరశురామ క్షేత్రమంటారని కొందరు వాదిస్తారు. కేరళలో ఏ ఉత్తర భాగాన్నో మహాబలి పాలించాడని, దక్షిణ కేరళను పరశురాముడు వెలికి తీశాడని అనుకుంటే సరిపోతుంది. కానీ అలా అయితే మహాబలి ఆరాధన కాకపోయినా అతన్ని ఒకప్పటి రాజుగా గౌరవించడం కొనసాగుతుంది. అది ఆరెస్సెస్‌ వర్గాలకు రుచించటం లేదు.

ఇటీవలి కాలంలో దళిత స్పృహ పేరు మీద పురాణాలను తమ కిష్టం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. నరకాసురుడు, మహిషాసురుడు, బకాసురుడు, హిడింబాసురుడు వగైరాలందరూ సడన్‌గా ఆరాధ్యదైవాలై పోయారు. వాళ్ల వాళ్ల కులాలు ఏమైనా, వాళ్లు రాజులుగా వుండి ప్రజల్ని పీడించుకుని తిన్నా వాళ్లందరి మీదా దళిత ముద్ర కొట్టేసి, వారికి అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెట్టేవారు ఎక్కువై పోయారు. వాళ్లు దళితులనడానికి గాని, వాళ్లు ఫలానా మంచిపనులు చేశారని అనడానికి గాని వీళ్ల దగ్గర ఏ ఆధారమూ వుండదు. పురాణాలన్నీ పుక్కిటి పురాణాలు, వాటిని తుంగలోకి తొక్కాలి అనేవాళ్లు హఠాత్తుగా వాటిలో పాత్రలను చారిత్రక పాత్రలుగా చిత్రీకరించ సాగారు. దేవుళ్లను నమ్మం కానీ అసురులను నమ్ముతాం అనసాగారు. అక్కడితో ఆగకుండా దేవీదేవతలను నీచులుగా, శీలం లేనివారిగా చిత్రీకరించసాగారు. 

తరతరాలుగా కేరళలో నడుస్తున్న మహాబలి పూజ కూడా యీ ధోరణిలో భాగమే అనిపించింది కేరళ ఆరెస్సెస్‌ వారికి హఠాత్తుగా. వాళ్లు నడిపే ''కేసరి'' అనే పత్రిక సంపాదకుడు ఎన్‌.ఆర్‌.మధు ''మహాబలి ఎంత గొప్ప రాజైనా వామనుణ్ని విలన్‌గా చూపించడం తగదు. నిజానికి మహాబలి పాలించిన దేశం నర్మదా నదీతీరంలో వుంది. వామనుడి తర్వాతి అవతారమైన పరశురాముడు సృష్టించిన ప్రాంతం కేరళ! క్రిస్మస్‌కు శాంతాక్లజ్‌ బొమ్మ వాడుతున్నట్లు కేరళలో ఓణమ్‌కు మహాబలి బొమ్మ వాడేసి పిల్లలకు ఆత్మీయుణ్ని చేసేస్తున్నారు.'' అని వాదిస్తున్నాడు. ఆయన పత్రికలో ఓణమ్‌కు ముందే ఒక వ్యాసం వచ్చింది - 'గతంలో ఓణమ్‌ను వామనజయంతిగా నిర్వహించేవారని, తర్వాత్తర్వాత మహాబలి పునరాగమనానికి లింకు పెట్టారని'. నిజానికి వామనజయంతి భాద్రపద శుద్ధ ద్వాదశినాడు! ప్రహ్లాదుడికి మనుమడైన మహాబలి యింద్రలోకాధిపత్యం కోసం 99 అశ్వమేధయాగాలు చేశాడు. నూరోది పూర్తి చేస్తే తన పదవికి ఎసరు వస్తుందని భయపడిన ఇంద్రుడు విష్ణువు శరణు జొచ్చితే, అతడు కశ్యపుడు తండ్రిగా, అదితి తల్లిగా వామనుడిగా పుట్టాడు. ఉపనయనం జరిగాక బలి చేసే యాగస్థలికి వెళ్లి మూడడుగులు దానం అడగడం, శుక్రాచార్యుడు వద్దంటున్నా బలి దానమిస్తాననడం, వామనుడి త్రివిక్రముడై ఒక పాదంతో భూమిని, మరో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించి, మూడో పాదంతో బలిని పాతాళానికి తొక్కివేయడం అందరికీ తెలిసున్న కథే. మన తెలుగు కాలండరులో చూస్తే సెప్టెంబరు 13 వామనజయంతి, 14 ఓణం పండగ. అలాటప్పుడు రెండిటిని కలిపేసి, ఆ వ్యాసకర్త ఓణాన్ని వామనజయంతిగా నిర్వహించాలని ఎందున్నాడో తెలియదు.

ఈ వ్యాసం రాగానే వామనజయంతి నాడు ఆరెస్సెస్‌ సంస్థ నుంచి బిజెపిలోకి వచ్చి అధ్యక్షుడిగా వెలుగుతున్న అమిత్‌ షా 'వామనజయంతి శుభాకాంక్షలు' అంటూ మహాబలి నెత్తి తొక్కుతున్న వామనుడి బొమ్మ వున్న పోస్టరుతో సహా ట్వీట్‌ చేశాడు. ఇక దాంతో మలయాళీలందరూ మండిపడ్డారు. కులమతాలకు అతీతంగా మలయాళీలందరూ జరుపుకుంటున్న ఓణమ్‌కు వామనజయంతి రంగు పులమడం దేనికి? అని. నిజానికి నంబూద్రిపాద్‌తో సహా కమ్యూనిస్టులు కూడా కేరళ ఒకప్పుడు మహాబలి రాజ్యం అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. ఎందుకంటే సోషలిస్టు సమాజం చెప్పే సర్వసమానత్వం, గొప్పాబీదా తేడా లేకపోవడం యివన్నీ మహాబలి కాలంలో వుండేవనే ప్రగాఢ నమ్మకం మలయాళీలలో వుంది కాబట్టి. ఓణమ్‌లో వ్యాపారస్తులు మహాబలిని ఆహ్వానిస్తున్న పోస్టర్లతో వస్తువులు అమ్ముతారు, ప్రభుత్వం కూడా 'మావెలి స్టోర్స్‌' అనే పేర చౌకధరల దుకాణాలలో సరుకులు అమ్ముతుంది. అలాటిది సడన్‌గా మహాబలిని పక్కన పడేసి, అతన్ని తొక్కేసిన వామనుణ్ని హైలైట్‌ చేయడం దేనికంటూ విమర్శలు వచ్చాయి. 

నిజానికి పండగ ఒకటే అయినా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ కారణాలతో జరుపుకుంటారు. విజయదశమిని బెంగాల్‌ వారు మహిషాసురుడిపై దుర్గ విజయంగా నిర్వహిస్తే, ఉత్తర భారతంలో రాముడు రావణుడిపై గెలిచిన రోజగా పరిగణించి రామ్‌లీలా నిర్వహిస్తారు. దీపావళిని మనం నరకాసుర వధకై జరుపుకుంటే, మార్వాడీలు లక్ష్మీపూజకై జరుపుకుంటే, జైనులు మహావీరుణ్ని స్మరిస్తూ, సిఖ్కులు వాళ్ల ఆరవ గురు హర్‌గోవింద్‌ను స్మరిస్తూ చేస్తారు. బెంగాల్‌లో కాళీపూజగా అనుకుంటే, గుజరాత్‌లో కృష్ణుడి రాసక్రీడలను గుర్తు చేసుకుంటారు. కేరళ వాళ్ల ఓణమ్‌కు ఆరెస్సెస్‌ వారు వేరే రంగు పులమడం దేనికి అని విమర్శలు రాగానే యింత రియాక్షన్‌ ఎదురు చూడని ఢిల్లీ బిజెపి నాయకులు వెంటనే 'వామనజయంతిని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో నిర్వహించుకుంటారు. వారి కోసం ఆ ట్వీట్‌' అని వాదించారు. వామనజయంతికి మన తెలుగువాళ్లలో ఒకరినొకరు కానీ, నాయకులు ప్రజలను కానీ గ్రీట్‌ చేయగా నేనెప్పుడూ చూడలేదు. అమిత్‌ షా హిందూ ధర్మాన్ని గొప్పగా పాటిస్తున్నాడు కాబట్టి.. అనుకుందామంటే భీష్మ ఏకాదశికి కూడా యిచ్చి వుండాల్సింది. ఇచ్చాడా? గత ఏడాది వామనజయంతికి ట్వీట్‌ చేశాడో లేదో తెలియదు. చివరకు గొడవ చల్లార్చడానికి వామనజయంతి మర్నాడు అమిత్‌ షా 'హేపీ ఓణమ్‌' కూడా ట్వీట్‌ చేశాడు. ఏం చేసినా, ఆరెస్సెస్‌ పత్రిక చేస్తున్న ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని అమిత్‌ షా కేరళ సమాజాన్ని మతపరంగా చీల్చడానికి చూస్తున్నాడనే భావం మలయాళీల మనసులో నాటుకుంటోంది. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?