Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ క్రైమ్ రచన : పార్టీకి రాని మొగుడు - 1/2

ఆ రోజు 1963 జనవరి 23. లెబనాన్‌ రాజధాని బీరూట్‌లో బ్రిటిష్‌ ఎంబసీలో ఫస్ట్‌ సెక్రటరీ యింట్లో పార్టీ జరుగుతోంది. ఉన్నతాధికారులు, రాజకీయనాయకులు, సంఘంలో పెద్దమనుషులు అందరూ వున్నారక్కడ. ఆ పార్టీలో ఒకామె తన భర్త రాక కోసం ఎదురుచూస్తోంది. 'నువ్వు ముందెళ్లు. పార్టీ జరుగుతూండగా నేను వచ్చి కలుస్తా' అని ఫోన్‌ చేశాడతను. అందుకని ఒంటరిగా వచ్చింది. 'కిమ్‌ యింకా రాలేదా?' అని అడుగుతున్న వారందరికీ వచ్చేస్తాడు అని చెప్తూనే, లోలోపల విసుక్కుంటోంది. 

ఆమె పేరు ఎలినార్‌. అమెరికాలో పుట్టి, ''న్యూయార్క్‌ టైమ్స్‌'' కరస్పాండెంట్‌ శామ్‌ బ్రూవర్‌ను పెళ్లాడింది. ఏడేళ్ల క్రితం మొగుణ్ని బీరూట్‌కు బదిలీ చేస్తే అతనితో బాటు వచ్చింది. వచ్చిన కొన్నాళ్లకే కిమ్‌ ఫిల్బీ పరిచయమయ్యాడు. అతను ఇంగ్లీషు వాడు. ఇంగ్లండు నుంచి వెలువడే ''ద అబ్జర్వర్‌'', ''ద ఎకనమిస్ట్‌'' అనే రెండు ప్రఖ్యాత వార్తాపత్రికల తరఫున మధ్యప్రాచ్యంలో విలేకరిగా పనిచేస్తాడు. అతని తండ్రి హేరీ కిల్బీ ఇండియాలో ఐసియస్‌ అధికారిగా పనిచేశాడు, తర్వాత అరేబియాలో పనిచేసి చాలా పేరు తెచ్చుకున్నాడు. ఇరాక్‌లో హోం మంత్రిగా చేశాడు. అరేబియా రాజుకు సలహాదారుగా వుండేవాడు. కిమ్‌ ఇండియాలో అంబాలాలో 1912లో పుట్టాడు. కేంబ్రిజ్‌లో చదివి ఇంగ్లండులో పెద్ద ఉద్యోగాలు చేసి వున్నాడు. భార్య, పిల్లల్ని ఇంగ్లండులోనే వుంచి బీరూట్‌కు ఒంటరిగా వచ్చి బీరూట్‌ శివార్లలో వున్న తన తండ్రికి చెందిన పెద్ద బంగళాలో వుండేవాడు. రాజధానిలో హై సర్కిల్స్‌లో జరిగే పార్టీల్లో కిమ్‌, ఎలినార్‌ కలిశారు. ఇద్దరి మధ్య పరిచయం, ప్రేమ ఏర్పడింది. తరచుగా కలవడానికి వీలుగా బీరూట్‌లోనే ఫ్లాట్‌ తీసుకున్నాడు. అనుబంధం చిక్కనైంది. పెళ్లి చేసుకుని కాపురం చేద్దామంటే కుదిరేట్లు లేదు. ఇద్దరూ వివాహితులే!

ఇంతలో 1957 డిసెంబరులో కిమ్‌ భార్య ఎయిలీన్‌ ఇంగ్లండులో నిద్రమాత్రలు  మింగి చనిపోయింది. ఆమెకు మానసికవ్యాధి వుండేది. బాగా తాగుతూ వుండేది. క్షయ కూడా సోకడంతో ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయాక తనను పెళ్లాడమని కిమ్‌ ఎలినార్‌ను అడిగాడు. దాంతో ఆమె తన భర్తకు విడాకులు యిచ్చి కిమ్‌ను పెళ్లాడింది. వాళ్లిద్దరికీ యిద్దరు పిల్లలు పుట్టారు. ఉద్యోగంలో కిమ్‌ పేరుప్రతిష్ఠలు సంపాదించుకున్నాడు. వార్తాసేకరణలో భాగంగా సౌదీ అరేబియా, ఈజిప్టు, జోర్డాన్‌, కువైత్‌, యెమెన్‌ వగైరా దేశాలన్నీ తిరుగుతూ వుండేవాడు. తనను ఆదరంగా చూసుకుంటూంటాడు. కిమ్‌ పెద్ద వక్త కాదు. నత్తి వుంది. ఉన్నతోద్యోగాల్లో పని చేసిన తండ్రి దాష్టీకం వలననే అతనికి యీ లోపం వచ్చిందంటారు. పెద్ద చొఱవ వున్నవాడూ కాదు. పార్టీకి వచ్చినపుడు మొదట కాస్సేపు బెరుగ్గా వుంటాడు. రెండు, మూడు పెగ్గులు పడ్డాక అప్పుడు హుషారు ప్రారంభమవుతుంది. అందరితో సరదాగా సరసాలాడతాడు. అందుకే అందరూ అతని గురించి మరీమరీ అడుగుతున్నారు.

రాత్రి పొద్దు పోయినా కిమ్‌ జాడ లేదు. 'ఏదైనా పనిలో వుండిపోయాడేమోలే, కంగారు పడకు' అని అందరూ ఓదార్చారు.  ఎలినార్‌ ఇంటికి తిరిగి వచ్చేసింది. రాత్రంతా ఎదురు చూసింది. ఏ కబురూ లేదు. పొద్దున్న తనకు తెలిసున్న అమెరికన్‌ బిజినెస్‌మన్‌ జాన్‌కు ఫోన్‌ చేసింది. అతను  బీరూట్‌లోనే స్థిరపడి వ్యాపారం చేస్తున్నాడు. పెద్దవాళ్లందరితో మంచి పరిచయాలున్నాయి. అతను వెంటనే లెబనీస్‌ సీక్రెట్‌ పోలీసు చీఫ్‌ కల్నల్‌ జల్బౌట్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు.  అతను వూళ్లోని ఆసుపత్రులను వెతికించాడు. బీరూట్‌ నుంచి బయటకు వెళ్లే మార్గాలన్నిటిని తనిఖీ చేయించాడు. ఎక్కడా కిమ్‌ సంగతి తెలియరాలేదు. 

మర్నాడు జాన్‌ ఎలినార్‌ యింటికి వచ్చి ''ఇదీ సంగతి, కంగారు పడకు, వెతుకుతున్నారు'' అన్నాడు. 

ఎలినార్‌ దుఃఖం ఆపుకోలేక పోయింది. ''అతని కోసం శామ్‌ను వదిలేసి వచ్చాను. అలాటిది పెళ్లయి ఐదేళ్లయిందో లేదో నన్ను ఒంటరిగా విడిచి వెళ్లిపోయాడన్న ఆలోచనే భయంకరంగా వుంది. అతనికి మొదటి భార్య లిజా అంటే చాలా యిష్టం. ఆమె ఎక్కడుందో ఏమైనా తెలుసా?'' అని అడిగింది.

***********

1933లో కిమ్‌ కేంబ్రిజ్‌ చదువు పూర్తయేనాటికి జర్మనీలో హిట్లర్‌ నాజీ నియంతగా చెలరేగిపోతున్నాడు. తన ప్రత్యర్థులను, యూదులను హింసలకు గురి చేస్తూన్నాడు. వారు దేశం వదిలి యితర దేశాలకు పారిపోతున్నారు. పారిస్‌కు వచ్చే అలాటి వారి కోసం జర్మన్‌ కమ్యూనిస్టులు శరణార్థి శిబిరాలు నడిపేవారు. కిమ్‌ వెళ్లి వారితో చేరాడు. అక్కణ్నుంచి వియన్నాకు వెళ్లి అక్కడా సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నాడు. అక్కడే అతనికి లిజా ఫ్రెడ్‌మన్‌ అనే ఆస్ట్రియన్‌ కమ్యూనిస్టు కార్యకర్త పరిచయమైంది. ఆమె హంగరీలో యూదు కుటుంబానికి చెందినది. లిజా చొరవ, నిజాయితీ, అంకితభావం కిమ్‌కు బాగా నచ్చాయి. ఆమెతో కలిసి పనిచేశాడు. 1934లో వాళ్లు పెళ్లి చేసుకున్నారు. ఇంతలో ఆస్ట్రియాలో రాజకీయ విప్లవం రావడంతో యిద్దరూ కలిసి ఇంగ్లండు పారిపోయి అక్కడ తలదాచుకున్నారు. రాయబార కార్యాలయాల్లో కాని, ప్రభుత్వ ఇంటెలిజెన్సు సర్వీసెస్‌లో కాని ఉద్యోగం సంపాదించుకోవడానికి విదేశీ భాష నేర్చుకోవడం చాలా వుపకరిస్తుందనే ఆమె సలహాతో అతను స్లావనిక్‌ భాషలు నేర్పే కళాశాలలో చేరి రష్యన్‌ భాష నేర్చుకున్నాడు. అదే సమయంలో ''ద వరల్డ్‌ రివ్యూ ఆఫ్‌ రివ్యూస్‌'' అనే పత్రికకు వ్యాసాలు రాస్తూండేవాడు. 

చదువు పూర్తయ్యాక 1936లో ఆంగ్లో-రష్యన్‌ ట్రేడ్‌ గెజెట్‌ అనే పత్రికకు ఎడిటరు అయ్యాడు. కొన్ని రోజులకు ఆ పత్రికను ఆంగ్లో-జర్మన్‌ ట్రేడ్‌ పేపరుగా మార్చారు. ఆ హోదా వుపయోగించుకుని కిమ్‌ లండన్‌లోని జర్మన్‌ రాయబారితో తరచుగా కలుస్తూండేవాడు. అతని సహకారంతో ఆంగ్లో-జర్మన్‌ ఫెలోషిప్‌లో చేరాడు. తరచుగా బెర్లిన్‌ వెళ్లి వస్తూండేవాడు. 1937లో స్పెయిన్‌లో అధికారంలో వున్న సోషలిస్టు రిపబ్లికన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫాసిస్టు భావాలున్న జనరల్‌ ఫ్రాంకో నేతృత్వంలో తిరుగుబాటు జరిగింది. ''ద టైమ్స్‌'' విలేకరి హోదాలో కిమ్‌ ఫ్రాంకోకు మద్దతుగా, వారి విజయాలను కీర్తిస్తూ వార్తలు పంపేవాడు. కానీ అంతర్గతంగా సోషలిస్టు ప్రభుత్వానికి సాయపడేవాడు. అంతేకాదు, బ్రిటిషు యింటెలిజెన్సు వారికి కోడ్‌ భాషలో రహస్య సమాచారం పంపేవాడు. మామూలుగా చూస్తే అవి ఎవరో అమ్మాయికి ప్రేమలేఖలు రాసినట్లు తోచేది. ఒకసారి అతను యితర జర్నలిస్టులతో కలిసి ప్రయాణిస్తున్న కారుపై ప్రభుత్వ సేనలు  బాంబులు వేశాయి. తక్కినవారు చనిపోగా కిమ్‌ స్వల్పగాయంతో బతికాడు. దాంతో అతని పట్ల ఫ్రాంకోకు గౌరవం పెరిగింది. 1938లో అతని మిలటరీ క్రాస్‌ ప్రదానం చేశాడు. దాని కారణంగా ఫాసిస్టు వర్గాలన్నిటికీ కిమ్‌ సన్నిహితుడై వారి నుంచి రహస్యాలు సేకరించి బ్రిటన్‌కు పంపడానికి వీలైంది. 

స్పెయిన్‌లో వుండగానే లేడీ లిండ్సే హాగ్‌ అనే ఆమెతో ప్రేమ వ్యవహారం సాగింది. ఆమె ధనికురాలైన వితంతువు. నటీమణి. ఫ్రాంకో, హిట్లర్‌లకు అభిమాని. ఇద్దరూ కలిసి స్పెయిన్‌లో వివిధ ప్రాంతాలకు విహరిస్తూండేవారు. ఈ కారణంగా లిజా, అతనూ ఎడమైౖ పోయారు. కానీ స్నేహంగానే వున్నారు. జర్మన్లు 1940లో పారిస్‌పై దండెత్తినపుడు లిజా అక్కడ యిరుక్కుపోయింది. జర్మన్లతో తన పలుకుబడి వుపయోగించి కిమ్‌ ఆమెను లండన్‌కు తప్పించివేశాడు. 1940 పాటికి కిమ్‌ లండన్‌ వచ్చేసి ఎయిలీన్‌ ఫర్స్‌ అనే ఆమెతో సహజీవనం సాగిస్తున్నాడు. ముగ్గురు పిల్లలు పుట్టాక, నాలుగో బిడ్డ గర్భంలో వుండగా పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకుని 1946లో లిజా నుంచి విడాకులు తీసుకుని యీమెను పెళ్లాడాడు. ఆ తర్వాత మరో పిల్లాడు పుట్టాడు. ఆమెకు తాగుడు వ్యసనం వుంది. భర్తపై అనుమానమూ ఎక్కువే. మానసిక సమస్యలతో సతమతమవుతూండేది. కిమ్‌కు రాజకీయంగా సమస్యలు వచ్చినపుడు అతనికి దూరంగా లండన్‌లోనే వేరే చోట వుండేది.

ఈ విషయాలన్నీ ఎలినార్‌కు, జాన్‌కు తెలుసు. ''లిజా ఆమె వేరే అతన్ని పెళ్లాడి, అక్కణ్నుంచి రష్యాకు తప్పించుకుని పారిపోయిందని అంటారు. రష్యాకు వెళ్లిపోయినవాళ్లు మళ్లీ వెనక్కి రావడం అసంభవం. రెండో భార్య వలన కలిగిన పిల్లల్ని చూడడానికి వెళ్లేడేమో, నువ్వు అనవసరంగా కంగారు పడవద్దు.'' అన్నాడు.

''అలా అయితే చెప్పే వెళ్లేవాడుగా. అతనికి ఆమె ద్వారా పిల్లలున్నారన్న సంగతి నాకెలాగూ తెలుసు.'' అంది ఎలినార్‌. ''ఎవరైనా ఎత్తుకుపోయారేమోనని నా భయం.''

''నీ కోసం ఉత్తరం ఏదీ రాసి పెట్టలేదా?''

''ఇంట్లో ఏమీ లేదు. నాకు రావల్సిన ఉత్తరాలన్నీ నార్మండీ హోటల్‌ కేరాఫ్‌గా వస్తాయి. అదే నా మెయిలింగ్‌ ఎడ్రస్‌.''

''రేపు ఓసారి వెళ్లి అక్కడ చూసిరా, ఎవరైనా ఎత్తుకుపోయి వుంటే అక్కడకి ఉత్తరం పంపి వుంటారు.'' అన్నాడు జాన్‌.

ఆమె సరేనంది. మర్నాడు పొద్దున్నే అక్కడకు వెళ్లింది. కాస్సేపటికి జాన్‌కు ఫోన్‌ చేసింది. ''జాన్‌, నువ్వు మీ జల్బౌట్‌తో కిమ్‌ గురించి వెతకడం మానేయమని చెప్పు.'' అని.

''ఏం అతను దొరికాడా?

''లేదు కానీ వర్రీ కావలసిన పని లేదు. నా మెయిల్‌ బాక్స్‌లో కిమ్‌ రాసిన ఒక ఉత్తరం కనబడింది. 'నాకు ఒక కొత్త ఎసైన్‌మెంట్‌ వచ్చింది. మిడిల్‌ ఈస్టంతా తిరగాలి. కంగారు పడవద్దు.' అని రాశాడు. ఇప్పుడు నాకు ఏ చింతా లేదు. అంతా సవ్యంగానే వుంది. పాపం మీ వాళ్లను ఎందుకు అవస్థ పెట్టడం?''

''ఓకే, వాళ్లకు చెప్తానులే.'' అన్నాడు జాన్‌. కానీ ఆ సాయంత్రం మళ్లీ వచ్చాడు. ''నిజం చెప్పు ఎలినార్‌, ఈజ్‌ ఎవిరిథింగ్‌ ఆల్‌రైట్‌?'' అని అడిగాడు.

చాలాసార్లు అడిగాక ఆమె మనసు విప్పి మాట్లాడింది. ''నాకేమీ పాలుపోవడం లేదు. ఊరు వెళ్లేవాడు బట్టలు, టూత్‌బ్రష్‌, పేస్టు, రేజరు పట్టుకెళ్లకుండా వట్టి చేతులతో ఎందుకు వెళతాడు?'' అంది నెమ్మదిగా.

''తనతంట తనే మాయం కావడం ఎవరికీ అర్థం కావటం లేదు. ఊళ్లో పుకార్లు. కైరోలో వున్నాడని, బ్రిటిషు యింటెలిజెన్సు వాళ్లు కిడ్నాప్‌ చేశారని, ఆత్మహత్య చేసుకున్నాడని, అదేం కాదు రష్యాకు పారిపోయాడని - యిలా రకరకాల పుకార్లు.'' అన్నాడు జాన్‌.

***********

కిమ్‌ కేవలం పత్రికా విలేకరే అయితే యింత చర్చ జరిగేది కాదు. అతను బ్రిటిషు యింటెలిజెన్సులో ఉన్నతాధికారిగా పనిచేసి వివాదాల్లో చిక్కుకున్న వ్యక్తి. రెండవ ప్రపంచయుద్ధం జరుగుతూండగా స్నేహితుల పలుకుబడితో కిమ్‌ బ్రిటిషు గూఢచారి వ్యవస్థలో ఎంఐ 6 విభాగంలో చేరాడు. విదేశాలలో ఇంగ్లీషు గూఢచారుల వ్యవహారాలు పర్యవేక్షించడం, వారి ద్వారా ఇంగ్లండులో పనిచేసే విదేశీ గూఢచారులను కనుగొని తప్పుడు సమాచారంతో వారిని తప్పుదోవ పట్టించడం ఆ విభాగం పని. దానిలో చేరేముందు కిమ్‌ను తన రాజకీయ అభిప్రాయాల గురించి ఉన్నదున్నట్లు చెప్పమన్నారు. తను కాలేజీ రోజుల్లో వుండగా వామపక్ష భావాలను అభిమానించానని, తన తండ్రి తరచుగా బ్రిటిషు బ్యూరాక్రసీని విమర్శిస్తూ వుండడం వలన కాలేజీలో వుండగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలలో పాల్గొన్నానని, తన భార్య లిజా కమ్యూనిస్టని, స్పెయిన్‌ యుద్ధంలో ఫ్రాంకోకు అనుకూలంగా వున్నట్లు నటించినా నిజానికి సోషలిస్టు ప్రభుత్వానికి నైతిక మద్దతు యిచ్చానని. ఎన్ని చేసినా తను బ్రిటనే ముఖ్యమని, అందుకే బ్రిటిషు యింటెలిజెన్సుకు సమాచారాన్ని అందించేవాణ్ననీ అతను చెప్పుకున్నాడు. ఆ రోజుల్లో యువకులందరిలో సోషలిస్టు భావాలు, ప్రభుత్వ వ్యతిరేక భావాలు వుండడం సహజమే కాబట్టి యీ వివరణను అధికారులు ఆమోదించారు. అతని రష్యాపై కౌంటర్‌ఎస్పియోనేజ్‌ అప్పగించారు. అంటే రష్యన్‌ గూఢచారి వ్యవస్థకు తప్పుడు సమాచారాన్ని అందించే పని. అది అతను అతి సమర్థవంతంగా నిర్వహించి చాలా పేరు తెచ్చుకున్నాడు. యుద్ధానంతరం అతనికి ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ ఎవార్డు యిచ్చారు. ప్రభుత్వం అతనికి చక్కని యిల్లు, మంచి ఆదాయం సమకూర్చింది. త్వరలోనే బ్రిటిష్‌ యింటెలిజెన్సు శాఖకు అతను అధిపతి కాబోతాడని అనుకునేవారు.

1949లో అతన్ని వాషింగ్టన్‌లోని బ్రిటిషు ఎంబసీలో ఫస్ట్‌ సెక్రటరీగా వేశారు. ఇంగ్లండు, అమెరికా యిరు దేశాలకు సంబంధించిన రక్షణ వ్యవహారాలపై సమాచారం యిచ్చి పుచ్చుకుంటూ పని అనుసంధానం చేసే బాధ్యత అప్పగించారు. అతని వద్దకు సిఐఏ, స్టేట్‌ డిపార్టుమెంటు, డిఫెన్సు డిపార్టుమెంటు అధికారులు తరచుగా వస్తూ వుండేవారు. ఏడాది తిరిగేసరికి అతని కింద సెకండ్‌ సెక్రటరీగా పాత మిత్రుడు గై బర్జెస్‌ను వేశారు. అతనూ, డోనాల్డ్‌ మెక్లీన్‌ అనే మరోతనూ కిమ్‌కు కేంబ్రిజ్‌లో సహాధ్యాయులు. వాళ్లిద్దరూ మార్క్సిస్టులు. వాళ్ల బోధనల వలన కాలేజీ రోజుల్లో కిమ్‌ ప్రభావితం అయ్యాడు. పెద్దయ్యాక బర్జెస్‌ చరిత్రకారుడయ్యాడు. బ్రిటిషు ప్రభుత్వోద్యోగి అయ్యాడు. ఇప్పుడు కిమ్‌తో కలిసి పనిచేయడానికి అమెరికా వచ్చాడు. కిమ్‌ అతన్ని తన క్వార్టర్స్‌లోనే వుండమన్నాడు. అతనూ, మెక్లీన్‌ రష్యా తరఫున గూఢచారులుగా పనిచేస్తున్నారని అమెరికా గూఢచారి సంస్థ ఎఫ్‌బిఐ సాక్ష్యాలు సేకరించింది. బ్రిటిషు రాయబార కార్యాలయంలో వున్న రష్యా గూఢచారుల జాబితాను కిమ్‌కు అందచేసింది. అలా అందచేసిన మర్నాడు బర్జెస్‌ అమెరికా విడిచి లండన్‌కు వెళ్లిపోయాడు. కొన్ని వారాల్లోనే అతనూ, మెక్లీన్‌ కలిసి రష్యాకు పారిపోయారు. దాంతో వాళ్లు గూఢచారులన్న సంగతి లోకానికి రూఢి అయిపోయింది. వాళ్లకు ఉప్పందించింది తనే అని కిమ్‌ ఒప్పుకున్నాడు. పై అధికారుల విచారణలో కిమ్‌ తొణక్కుండా బెణక్కుండా జరిగినది చెప్పాడు - 

''నేను ఓ రోజు పొద్దున్న ఆఫీసుకు వచ్చేసరికి ఎఫ్‌బిఐ రిపోర్టు టేబుల్‌ మీద వుంది. దానిలో బర్జెస్‌ పేరు చూసి నాకు నవ్వు వచ్చింది. అంతలో అతనే వచ్చాడు. ''ఈ ఎఫ్‌బిఐ వాళ్లకు వెర్రి ముదిరింది. నిన్ను రష్యన్‌ గూఢచారి అనుకుంటున్నారు.'' అని నవ్వాను. అతనూ పగలబడి నవ్వాడు - 'బాగానే వుంది వ్యవహారం' అంటూ. అతను గూఢచారి అని నేనెన్నడూ వూహించలేదు. ఆ రోజు రాత్రి యింటికి వెళ్లి అతని గదిలోకి తొంగి చూద్దును కదా, లేడు. నాకు సడన్‌గా సందేహం కలిగింది. వెంటనే రాయబారికి, ఉన్నతాధికారులకు అందరికీ యీ విషయం రిపోర్టు చేశాను.'' అని చెప్పుకున్నాడు.

ఇది విని పై అధికారులకు ఏం చేయాలో పాలుపోలేదు. వారిలో కొందరు కిమ్‌ ప్రవర్తనలో అసహజమైనది ఏదీ లేదని వాదించారు. కాలేజ్‌మేట్‌, స్నేహితుడు అయిన వ్యక్తితో ఆ మాత్రం జోక్‌ చేయడంలో వింతేముందన్నారు. నిజంగా రష్యాయే అతని వెంట వుండేమాటైతే కొద్ది రోజుల్లో బ్రిటన్‌ యింటెలిజెన్సుకి చీఫ్‌ కావల్సిన వ్యక్తిని యిలా పోగొట్టుకుంటుందా? అని కొందరు సందేహించారు. కిమ్‌ అమాయకుడే అని నమ్మారు. కానీ ఎఫ్‌బిఐ, సిఐఏ మండిపడ్డాయి. 'కిమ్‌ను యిక్కణ్నుంచి తీసివేయకపోతే మేం సమాచారాన్ని మీతో యిక పంచుకోం' అని బెదిరించాయి. దాంతో గత్యంతరం లేక 1951 మేలో అతన్ని వెనక్కి తీసుకుని వచ్చి జులైలో ఉద్యోగం పీకేశారు. కిమ్‌కు ఉద్యోగం పోయి, ఆదాయం లేక భార్య, ఐదుగురు బిడ్డలతో దరిద్రంలో బతకవలసి వచ్చింది. అతన్ని చూసి యింటెలిజెన్సు శాఖలో వుద్యోగులు జాలిపడసాగారు. ఇతను నిజంగా రష్యా గూఢచారి అయి వుంటే యింత పేదగా ఎందుకు బతుకుతాడు? హాయిగా రష్యాకు పారిపోయేవాడు కదా అనుకున్నారు. 1954 ఆగస్టులో ఫ్లీట్‌ స్ట్రీట్‌ లెటర్‌ అనే డిప్లోమాటిక్‌ న్యూస్‌ లెటర్‌లో ఉద్యోగం సంపాదించుకున్నాడు. 1955లో బ్రిటిషు పార్లమెంటులో లేబరు పార్టీ వారు కిమ్‌పై ఆరోపణలు చేస్తే ప్రభుత్వం తరఫున ఫారిన్‌ సెక్రటరీ 'అతని దేశభక్తిని శంకించడానికి లేదు' అని సర్టిఫికెట్టు యిచ్చాడు. - (సశేషం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?