Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ క్రైమ్ రచన: పార్టీకి రాని మొగుడు - 2/2

కొన్నాళ్లకు బ్రిటిషు గూఢచారి వ్యవస్థ ఎంఐ కిమ్‌ సేవలను ఉపయోగించుకుందామని అనుకుంది. రష్యన్లు చురుకుగా వున్న అరేబియా ప్రాంతంలో ఏదో ఒక పేరు చెప్పి కిమ్‌ను పంపిస్తే అక్కడ అతను తన చొరవతో, కాంటాక్ట్స్‌తో వారి నుంచి సమాచారం సేకరించి పంపగలడు అనుకున్నారు. ఎంఐ వారే 'ద అబ్జర్వర్‌' 'ద ఎకనమిస్ట్‌' యాజమాన్యాలతో మాట్లాడి అతనికి జాయింటుగా ఉద్యోగం యిచ్చే ఏర్పాటు చేసి 1956 సెప్టెంబరులో బీరూట్‌కు పంపారు. 

**********

ఇవన్నీ ఎలినార్‌కు, జాన్‌కు తెలుసు. అతను కమ్యూనిస్టు గూఢచారి కాదని సర్టిఫికెట్టు సంపాదించుకున్నా, అతను యిక్కడకు వచ్చిన తర్వాత కూడా బ్రిటిషు ప్రభుత్వ గూఢచార వ్యవస్థకు పనిచేస్తున్నా అతన్ని నమ్మనివారు యింకా వున్నారనీ తెలుసు. 

''కిమ్‌ నిజంగా రష్యన్‌ గూఢచారి అంటావా?'' అని అడిగింది ఎలినార్‌.

''తెలియదు. స్పెయిన్‌ అంతర్యుద్ధంలో ఒకరి తరఫున పనిచేస్తూన్నట్లుగా కనబడుతూ అవతలివాళ్లకు సాయపడిన వ్యక్తి అతను. ఆ యుద్ధంలో తను సేకరించిన రహస్య సమాచారాన్ని అటు బ్రిటన్‌తో బాటు యిటు రష్యాకు కూడా పంపించాడని పుకారు వుంది. అంతేకాదు, రెండవ ప్రపంచయుద్ధం జరిగే రోజుల్లో రష్యాకు తప్పు సమాచారం పంపుతున్నానని డిపార్టుమెంటును నమ్మిస్తూ అసలైన సమాచారమే పంపించేశాడని కొందరంటారు.''

''అలా అయితే అతను ఉద్యోగం పోగొట్టుకుని అప్పుల్లో మునిగినప్పుడు రష్యా వూరుకుందేం? ఇక్కడకు వచ్చినప్పుడు కూడా తలమునకలా అప్పుల్లో వుండేవాడు. ఇంగ్లండులో వున్న భార్యాబిడ్డలకు పంపడానికి డబ్బు వుండేది కాదు. నాతో పెళ్లయ్యాకే దశ తిరిగింది.''

జాన్‌ ఆలోచనలో పడ్డాడు. ''..అది నిజమే. పైగా అతను సమాచార సేకరణకు పెద్దగా కష్టపడడు. గూఢచారి ఐతే అష్టకష్టాలు పడి విషయాలు సేకరిస్తాడు. ఇతను ఎవరైనా తనకు ఏదైనా చెపితే వాటి మీద రాసేవాడు కానీ పట్టుదలతో పని చేయలేదు.''

ఎలినార్‌ పుంజుకుంది - ''ఇంకో విషయం. ఇతను గూఢచారి అని ఏ కొద్ది ఆధారం వున్నా, బ్రిటష్‌ ప్రభుత్వం అతనికి క్లీన్‌ సర్టిఫికెట్టు ఎందుకిస్తుంది?'' అంది.

''ఆ పాయింటులో బలం లేదు. తమ గూఢచారి వ్యవస్థలో యింతటి ఉన్నతోద్యోగి డబుల్‌ ఏజంటు అని అంటే వాళ్లకు ఎంత తలవంపులు? అందువలన చర్య ఏమీ తీసుకోలేదు. అతను రష్యన్‌ గూఢచారి అని నమ్మడానికి, బాహాటంగా ప్రకటించడానికి ప్రభుత్వం అందుకే సంకోచించింది.'' అన్నాడు జాన్‌.

తన భర్త ఎలాటివాడో ఎలినార్‌కు అర్థం కాలేదు. జాన్‌ మాటలు ఎంతవరకు నిజమో తెలియదు. థాంక్స్‌ చెప్పి అతన్ని పంపించివేసింది.

**********

ఇది జరిగిన కొన్నాళ్లకు అరేబియాలోని ఓ వూరు నుంచి కిమ్‌ రాసిన ఉభయకుశలోపరి లేఖ ఎలినార్‌కు చేరింది. ఆ తర్వాత వేరే వూరి నుంచి మరొకటి, కొన్ని రోజులకు యింకొకటి. .. ఇలా వస్తూ వుండగానే 1963 ఏప్రిల్‌లో కిమ్‌ నుంచి ''ఆపరేషన్‌ ప్లాన్‌'' అనే పేరుతో ఒక లేఖ వచ్చింది. దాని ప్రకారం - ఆమె తనకూ, పిల్లలకూ ఫలానా రోజుకి లండన్‌కు బిఓఎసి ఎయిర్‌లైన్సు టిక్కెట్లు కొనాలి. తర్వాత ఎవరికీ తెలియకుండా బీరూట్‌లోని చెక్‌ (చెకొస్లొవేకియా) ఎయిర్‌లైన్సు ఆఫీసుకి వెళ్లాలి. అక్కడ తన పేరు చెప్పగానే విమానం టిక్కెట్లు చేతికిస్తారు. చెక్‌ విమానం, బిఓఎసి విమానం ఒకే సమయానికి బయలుదేరతాయి. ప్రయాణం రోజున బిఓఎసి విమానం ఎక్కబోతున్నట్లుగా కనిపిస్తూనే ఆఖరి నిమిషంలో చెక్‌ విమానం ఎక్కేయాలి. విమానం దిగగానే కిమ్‌ వాళ్లను పలకరిస్తాడు. దీనిలో ఏదైనా గందరగోళం వుంటే, ఎమర్జన్సీ ఫీలవుతే వుంటే ఎలినార్‌ తన కిచెన్‌ కిటికీలో పూలకుండీ పెట్టాలి. అప్పుడు కిమ్‌ తరఫున ఒక వ్యక్తి వెంటనే వచ్చి కలుస్తాడు.

ఇదంతా ఏమిటో, ఎందుకో తెలియక ఎలినార్‌ కంగారు పడింది. చెక్‌ ఎయిర్‌లైన్సు అంటున్నాడు కాబట్టి తన భర్త రష్యాకు పారిపోయి, తమను అక్కడకు రప్పించుకుంటున్నాడని అర్థమైంది. ఎందుకొచ్చిన గొడవ వదిలేసి వెళ్లిపోదామా అనుకుంది కానీ అతనిపై ప్రేమ వెనక్కు లాగింది. ముందు కొన్ని సందేహాలు నివృత్తి చేసుకోవాలి అనుకుంది. కిచెన్‌ కిటికీలో పూలకుండీ పెట్టింది.

గంట గడవకుండానే ఒక అపరిచితుడు తలుపు తట్టాడు. అతను రష్యా రాయబార కార్యాలయంలో ఉద్యోగిట. ఆ మాట వినగానే ఎలినార్‌ తన భర్త నిజస్వరూపమేమిటో చెపితేనే రష్యా వెళతానని ఆమె అనడంతో అతను కిమ్‌ సంగతంతా చెప్పాడు. 'కిమ్‌ ఎప్పటినుంచో రష్యాకు గూఢచారిగా వున్నాడు. స్పెయిన్‌ అంతర్యుద్ధంలో ఫ్రాంకో రహస్యాలు బ్రిటన్‌కే కాదు, రష్యాకూ చేరవేశాడు. బ్రిటన్‌ గూఢచారి విభాగంలో వుంటూ డబుల్‌ ఏజంటుగా వున్నాడు. కావాలనే  గై బర్జెస్‌, డోనాల్డ్‌ మెక్లీన్‌లు పారిపోవడానికి సాయపడ్డాడు. మధ్యలో రష్యాతో టచ్‌ పోయింది. బీరూట్‌లో పోస్టింగు వేశాక మళ్లీ గూఢచర్యం ప్రారంభించాడు. బ్రిటన్‌కు, రష్యాకు  డబుల్‌ ఏజంటుగా వున్నాడు...''  

''అలాగే కంటిన్యూ కావచ్చు కదా, యిప్పుడు రష్యా పారిపోవడం దేనికి? ఎవరికైనా సందేహం వచ్చిందా?'' అని అడిగింది ఎలినార్‌.

''అవును, 1961లో రష్యన్‌ గూఢచారి సంస్థ కెజిబిలో చీఫ్‌ డైరక్టరుగా పనిచేసిన వ్యక్తి అమెరికాకు డిఫెక్ట్‌ అయ్యాడు. ఆమెరికా, ఇంగ్లండులలో రష్యా తరఫున పనిచేసే గూఢచారుల జాబితా యిస్తాను, ఆశ్రయం యిమ్మనమని కోరాడు. సిఐఏ సరేనంది. ఆ జాబితాలో కిమ్‌ పేరుంది. అయినా ఎంఐ 5కి చీఫ్‌గా వున్న ఎలియట్‌ దాన్ని నమ్మలేదు. అతను కిమ్‌ దగ్గర గతంలో పనిచేసినవాడు. కిమ్‌ డబుల్‌ ఏజంటంటే నమ్మలేమన్నాడు. ఇకపై అతని కదలికలను జాగ్రత్తగా గమనించుదాం అన్నాడు....''

''...ఆ విషయం కితం ఏడాది కిమ్‌కు ఎవరో చెప్పినట్లున్నారు. అప్పణ్నుంచి కాస్త డిప్రెస్‌డ్‌గా వుంటున్నాడు. బాగా తాగుతున్నాడు కూడా.'' అంది ఎలినార్‌.  

''గత ఏడాది చివర్లో కిమ్‌ ఒక అరబ్‌ రాజకీయవేత్తతో స్నేహం పెంచుకుని, ఓ రోజు ఆ మాటా యీ మాటా చివరకు 'బ్రిటిషు గూఢచారిగా పని చేయరాదా?' అని అడిగాడు. 'చేస్తే ఎంతిస్తావు?' అని అడిగి కిమ్‌ చేత ఒక అంకె చెప్పించుకున్నాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని ఎంఐకు చెప్పాడు. అతను అప్పటికే వాళ్లకు గూఢచారిగా పనిచేస్తున్నాడు. అప్పుడు ఎంఐకు అనుమానం బలపడింది - కిమ్‌ రష్యా తరఫున గూఢచారులను చేర్చుకునే పనిలో వున్నాడని! బ్రిటన్‌ పేరు చెప్పి వీళ్ల దగ్గర సమాచారం సేకరించి, రష్యాకు పంపుతాడన్నమాట. వాళ్లకు ముట్టచెప్పేది రష్యా వాళ్లిచ్చే డబ్బే!''

ఎలినార్‌ ఆశ్చర్యపడింది. ''ఆ అరబ్బతను బ్రిటిషు గూఢచారి అని కిమ్‌కు ఎంఐ చెప్పలేదా?''

''లేదు. ఇతని నుంచి సమాచారం తీసుకోవడమే తప్ప యిక్కడి ఆపరేషన్స్‌ అతని చేతిలో పెట్టలేదు కదా. అందువలన ఆ పొరబాటు జరిగింది. ఇక అప్పుడు ఎంఐ వారు కిమ్‌ను రాత్రింబవళ్లు అనుసరించమని, పరిశీలించమని లెబనీస్‌ యింటెలిజెన్సు చీఫ్‌ కల్నల్‌ జల్బౌట్‌ను అడిగారు. అతను మనుష్యులను నియమించి కిమ్‌ హాజరవుతున్న రహస్య సమావేశాల గురించి ఆచూకీ లాగాడు. రాత్రి పూట మీ డాబా ఎక్కి నల్లని వస్తువును గాలిలో వూపుతూండడం గమనించాడు. నిజానికి అది ఎంతోమందికి కనబడుతుంది. ఎవరైనా చూసినా దానిలో వింతేమీ తోచదు. అయినా లెబనీస్‌ పోలీసు ఏజంట్లు బాగా గాలించి ఆ సందేశాలు రిసీవ్‌ చేసుకుంటున్న ఒక ఆర్మీనియన్‌ను పట్టుకున్నారు. ఆ సందేశాలను వేరే వాళ్లకు చేరవేయడం తప్ప వాటిలో ఏముందో అతనికి తెలియదు. ఆ కోడ్‌ను ఛేదించడంలో లెబనీస్‌, బ్రిటిషు గూఢచారులు విఫలమయ్యారు. కానీ అతన్ని అరెస్టు చేసి లోపల కూర్చోబెట్టారు.''

ఎలినార్‌ నిట్టూర్చింది. ''అదే జల్బౌట్‌ దగ్గరకు నేను వెళ్లి మా ఆయన్ని వెతికి పెట్టమని బతిమాలాను. నా అమాయకత్వం చూసి నవ్వుకుని వుంటాడు.''

''...తన సందేశాలు అవతలివాళ్లకు చేరటం లేదని గ్రహించిన కిమ్‌ ఒక నెల్లాళ్లపాటు ఓపిక పట్టి, యిక ఆగలేక ఏమైతే అదే అయిందని డైరక్టుగా తన బాస్‌లను కలుద్దామనుకున్నాడు. నాలుగైదు టాక్సీలు మారి, నైట్‌ క్లబ్బుల మధ్య వున్న ఆర్మీనియన్‌ కాండీ షాప్‌ పైన వున్న ఎపార్టుమెంటుకి వచ్చాడు. అక్కడకు నేనూ వెళ్లాను. విషయాలన్నీ చెప్పాడు. ఆ సమావేశంలోనే అతనిక్కడ కొనసాగడం ప్రమాదకరమని సలహా యిచ్చాను. ఇంకా వేచి చూస్తానన్నాడు కిమ్‌.''

''..ఇంత జరిగినా ఎంత మొండిధైర్యం?'' ఆశ్చర్యపడింది ఎలినార్‌.

''1962 డిసెంబరులో కిమ్‌ దగ్గరకు ఎలియట్‌ వచ్చాడు. ''నువ్వు యిటువంటివాడివి అనుకోలేదు. నా దగ్గర సాక్ష్యాలన్నీ వున్నాయి. నువ్వు తప్పు ఒప్పేసుకుని, మన వ్యవస్థలో పనిచేసే యితర డబుల్‌ ఏజంట్ల గురించి చెప్పేయ్‌.'' అన్నాడు. ''వాళ్ల గురించి చెప్పలేను కానీ, నేను తప్పు చేసిన మాట వాస్తవమే.'' అన్నాడు కిమ్‌. అయితే అది రాసి యిస్తావా? అంటే యివ్వనన్నాడు. ''జనవరి నెలాఖరులో మళ్లీ వస్తాను. ఆ పాటికి ఒక నిర్ణయానికి రా.'' అని చెప్పి వెళ్లిపోయాడు. ఎందుకంటే కిమ్‌ ఎదురు తిరిగితే అతన్ని బీరూట్‌లో అరెస్టు చేసే అధికారం ఎంఐకు లేదు. బ్రిటన్‌కు నమ్మకద్రోహం చేయడం లెబనాన్‌లో నేరం కాదు కదా!''

ఎలినార్‌ ఉత్కంఠతో వింటోంది. ''ఇవేమీ నాకు తెలియదు. పార్టీకి రాలేదేం అనుకున్నానంతే. అయితే యీ వార్నింగు రాగానే కిమ్‌ పారిపోయాడన్నమాట.'' అంది.

''అవును. కిమ్‌ మాయమయ్యాక ఎలా పారిపోయాడా అని జల్బౌట్‌ వాకబు చేయించాడు. జనవరి 24 తెల్లవారకుండా బీరూట్‌ నుంచి ఒడెస్సాకు వెళ్లే రష్యన్‌ ఓడ ఎక్కి పారిపోతూంటే చూశానని ఒకడు చెప్పాడు. కొందరు సిరియా, ఆర్మీనియాల ద్వారా రష్యా చేరాడని అంటారు. నిజానిజాలు నాకే తెలియవు. ఏది ఏమైనా అతను ప్రస్తుతం రష్యాలో వున్నాడు. మీరూ, పిల్లలూ అక్కడకు చేరడం క్షేమం.'' అన్నాడు వచ్చినతను.

**********

ఎలినార్‌కు సర్వం బోధపడింది. భర్త బాట పట్టడానికి ఆమెకు ఏదోలా అనిపించింది. జాన్‌ ద్వారా జల్బౌట్‌ను, అతని ద్వారా బ్రిటిషు యింటెలిజెన్సు వారిని సంప్రదించి, విషయాలన్నీ వాళ్లకు చెప్పేసింది. మే నెలలో ఎంఐ ఎలినార్‌ను, పిల్లల్ని రహస్యంగా, క్షేమంగా లండన్‌ చేర్చింది. పిల్లల్ని కిమ్‌ బంధువుల దగ్గర వదిలిపెట్టి, ఆమె ఒంటరిగా జీవించసాగింది. కిమ్‌ పట్ల ప్రేమ, అతని గూఢచర్యం పట్ల ఏవగింపు ఆమెను అటూయిటూ లాగి డిప్రెషన్‌కి లోను చేశాయి. 

కిమ్‌ తమ వద్దకు వచ్చేయడంతో రష్యా జులై 1 న ఒక ప్రెస్‌ కాన్ఫరెన్సు ఏర్పరచి అతన్ని బహిరంగంగా చూపిద్దామనుకుంది. బ్రిటిషు గూఢచారి వ్యవస్థలో ఉన్నతోద్యోగి, ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ ఎవార్డు పొందిన వ్యక్తి తమ తరఫున పనిచేశాడని ప్రకటించి, బ్రిటిషు వ్యవస్థ ఎంత లోపభూయిష్టమో లోకానికి చాటుదామనుకుంది. అది పసిగట్టిన ఎంఐ నాలుగు రోజుల ముందుగానే 'కిమ్‌ డబుల్‌ ఏజంటు' అని తనే ప్రకటించేసింది. ఇక దానితో జులై 30 న రష్యా కిమ్‌కు రాజకీయ ఆశ్రయం యిచ్చినట్లు ప్రకటించింది. సెప్టెంబరు నాటికి ఎలినార్‌ ఒక నిర్ణయానికి రాగలిగింది. ఏది ఏమైనా కిమ్‌తోనే తన జీవితం అనుకుంది. లెబనాన్‌ విమానం ఎక్కి, అక్కణ్నుంచి మాస్కో విమానం ఎక్కేసింది. 

కిమ్‌ ఫిల్బీ డబుల్‌ ఏజంటుగానే పనిచేసిన వైనం, దానిపై చాలాకాలం సాగిన తర్జనభర్జనలు జనాలకు చాలా ఆసక్తిదాయకంగా తోచాయి. అతనిపై కథలు, నవలలు, టీవీ సీరియల్స్‌, సినిమాలు చాలా తయారయ్యాయి. - (సమాప్తం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2016)

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?