Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: పట్టిసీమ జలాలు పుష్కరాలను ముంచుతాయా?

ఎమ్బీయస్‌: పట్టిసీమ జలాలు పుష్కరాలను ముంచుతాయా?

కృష్ణాపుష్కరాల గురించి ధర్మశాస్త్ర వివాదం ఒకటి తలెత్తింది. కృష్ణ ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవేశించి కొద్ది దూరం వెళ్లాక గోదావరి జలాలు కలుపుతున్నారు కాబట్టి, పుష్కర పవిత్రత దెబ్బతింటుందన్న అనుమానం ప్రకటించారు కొందరు పండితులు. కృష్ణలో గోదావరి జలాలు కలిసినంత మాత్రాన అది కృష్ణ కాకుండా పోతుందా, పుష్కరసమయంలో అవి పుష్కర జలాలు కాకుండా పోతాయా అని కొందరు కొట్టిపారేస్తున్నారు. యమునానది యమునోత్రిలో పుట్టి 1376 కి.మీ.లు పయనించి సముద్రం దాకా వెళ్లకుండా త్రివేణీ సంగమం దగ్గర గంగలో కలిసిపోతుంది. ఇక ఆ పైన దానికి అస్తిత్వం లేదు. మొత్తమంతా గంగ అయిపోతుంది. గంగ బెంగాల్‌లో బంగాళాఖాతంలో కలుస్తుంది. ప్రవహించినంత మేర యమున యమునే. ఇక్కడి పరిస్థితి అలాటిది కాదు, కృష్ణ ఉనికి వేరే, గోదావరి ఉనికి వేరే, అవి సముద్రంలో కలిసే చోట్లు వేర్వేరే. గోదావరి నీళ్లు కాలువల ద్వారా ప్రవహింపచేసి ఒక ప్రదేశంలో కృష్ణలో కలుపుతున్నారంతే. ఆ నీళ్లు వచ్చి కలవడం వలన కృష్ణ నీళ్లు పలుచనై పోయి, దాని పవిత్రత 'నీరు'కారుతుందా? అని ప్రశ్న. 

ఇప్పటిదాకా యిలాటి ప్రశ్న ఎవరూ వేసి వుండరు. ఇప్పుడు పండితులు కూర్చుని తేల్చాలి. కాశీ వెళ్లినవాళ్లు గంగాజలం తెచ్చి గంగ చెంబుల్ని పంచుతూంటారు. వాటిని పూజామందిరాల్లో పెట్టుకుంటూంటారు. రాగి చెంబుల్లో గంగ నీరు పోసి సీల్‌ చేసి వుంటాయవి. పది కుటుంబాలకు యివ్వాలంటే పది చెంబులు తెస్తారు తప్ప ఒక్క చెంబు పట్టుకుని వచ్చి పది మినరల్‌ వాటర్‌ బాటిళ్లల్లో తలో చుక్క గంగనీళ్లు పోసి యివ్వరు. తక్కిన నీళ్లల్లో కలిస్తే గంగ ప్రభావం డైల్యూట్‌ అయిపోతుందనే ఫీలింగు కాబోలు. నిజంగా గంగ నీళ్లకు అంత శక్తి వుందా? ఉంటే గంగాపరీవాహక ప్రాంతంలో వున్నవాళ్లందరూ పవిత్రులవుతున్నారా? అనే ప్రశ్నలు వేయకూడదు. ఇవన్నీ నమ్మకాలంతే.

ప్రఖ్యాత హేతువాది అబ్రహాం టి. కోవూరు రాశారు - 1921 నుంచి 1924 వరకు ఆయనా, ఆయన తమ్ముడు కేరళలోని వాళ్ల స్వగ్రామం కురువిళ్లా నుంచి కలకత్తా వెళ్లి చదువుకునేవారట. అప్పట్లో కాశీ ఎంతో దూరంగా (1500 కి.మీ.లు) ఫీలయ్యేవారు కాబట్టి, చాలా తక్కువమంది వెళ్లేవారు కాబట్టి గంగాజలానికి (దాన్ని తీర్థమనే వ్యవహరించేవారు) బోల్డు గ్లామరు. సెలవులకు యింటికి వచ్చినపుడు పవిత్ర గంగాజలం తెచ్చిపెట్టిమని వాళ్ల వూళ్లో వాళ్లందరూ బతిమాలాడేవారట. గంగ అక్కడ ఎంత మురికిగా వుందో చూశాక, వీళ్లు తేబుద్ది అయేది కాదు. వాళ్ల వూరికి వెళ్లాలంటే కొట్టార్కర రైల్వే స్టేషన్‌లో దిగి బస్సులో వెళ్లాలి. స్టేషన్‌ కుళాయి నీళ్లు రెండు సీసాల్లో పట్టి, బిరడా బిగించి వీళ్లు బస్టాండుకి వెళ్లేవారు. మా దగ్గర గంగాతీర్థం వుందనగానే జనం ఎంత కిక్కిరిసి వున్నా సరే, వీళ్లకు డ్రైవరు పక్కన సీటిచ్చి, వూళ్లో వీళ్ల యింటి దగ్గర దింపి 'మాకూ కాస్త తీర్థం యివ్వండి' అని డ్రైవరు, కండక్టరు అడిగేవారు. వీళ్లమ్మగారు ఆ నీటిని ఊళ్లో అందరికీ పంచేది. దాని వలన తమ రోగాలు తగ్గిపోయాయని, బతుకులు బాగుపడిపోయాయని, అదృష్టం కలిసి వచ్చిందని వచ్చి చెప్పేవారు. సెలవులపై పోయి మళ్లీ కాలేజీకి బయలుదేరినప్పుడు యీ సారి యింకో రెండు సీసాల్లో తెమ్మనమని ప్రాధేయపడేవారు.  కోవూరూ, అతని తమ్ముడు నవ్వుకునేవారట - కొట్టార్కర రైల్వే స్టేషన్‌ నీళ్లకు అంత మహిమ వుందా అని! ఏది ఏమైనా యివన్నీ నమ్మకాలకు సంబంధించిన విషయం. అన్ని మతాలలోనూ యిలాటి విశ్వాసాలుంటాయి. పుష్కరసమయంలో నది పవిత్రతను సంతరించుకుంటుందని నమ్మకం. ఏ కారణం చేతనైనా అది తగ్గిపోతుందంటే ప్రజలు బెంగపడతారు. 

ఇలాటి సందేహం వేరే ఏదైనా సందర్భం గురించో, ఏదైనా క్షేత్రం గురించో లేవనెత్తితే యింత చర్చ వుండదు. కానీ యిది పుష్కరాల గురించి అయి కూర్చుంది. పుష్కరాలంటే కేవలం నదీస్నానాలు కాదు. పెద్ద మెగా యీవెంటు. మార్కెటింగు ఫీటు. ఎంత ఎక్కువమంది వస్తే సర్కారుకి అంత ఘనత. అంతమంది వస్తున్నారు కాబట్టి అంతకు మించిన స్థాయిలో ఏర్పాట్లు వుండాలంటూ బోల్డంత ప్రజాధనం వ్యయం చేసి పనులు చేపట్టే అవకాశం. ఏ కారణం చేత అనుకున్నంతమంది జనం రాకపోతే అది తమకు నగుబాటుగా ప్రభుత్వం భావించే రోజులు వచ్చాయి. ఇప్పుడీ వివాదం వేరెవరైనా లేవనెత్తితే కేవలం శాస్త్రచర్చ అని సరిపెట్టుకునే వారేమో కానీ, తెలంగాణ పండితులు ప్రస్తావించడంతో వారి వెనుక తెరాస హస్తం వుందనే అనుమానాలు రాజుకున్నాయి. పుష్కరస్నానం గోదావరితో సంకరమైన కృష్ణలో చేస్తారా? స్వచ్ఛమైన కల్తీ లేని కృష్ణలో చేస్తారా? అనే స్లోగన్‌తో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతే ఆంధ్ర ప్రభుత్వానికి మంట పుడుతుంది. అందువలన తెలంగాణ పండితుల వాదనను ఖండించే ప్రయత్నాలు మొదలయ్యాయి. 

గోదావరి నీళ్లు కలిసినంత మాత్రాన కృష్ణ కృష్ణ కాకుండా పోతుందా? అని ప్రశ్నిస్తున్నారు. దానికి జవాబుగా తెలంగాణ పండితులు ''మామూలప్పుడు ఏమో కానీ, గోదావరికి అంత్యపుష్కరాలు జరుగుతాయి. ఆ నీరు వచ్చి కృష్ణలో కలిస్తే పవిత్రత ప్రభావితమౌతుందని మా అనుమానం. పీఠాధిపతులెవరైనా తేల్చాలి.'' అని సందేహం వెలిబుచ్చారు. అంత్యపుష్కరాలంటే పుష్కరుడికి వీడ్కోలు సభ అన్నమాట. జులై 31 నుండి 12 రోజులు సాగుతాయి. అవి అవగానే కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12 నుంచి ప్రారంభమవుతాయి. అంటే పుష్కరుడికి స్వాగత సభ అన్నమాట. వీడ్కోలు సభ, స్వాగత సభ కలపకూడదన్నమాట. తేదీల ప్రకారమైతే కలవటం లేదు. కానీ ఆగస్టు 12న కృష్ణలో కలిసే గోదావరి జలాలు అంత్యపుష్కరకాలంలో పట్టిసీమ నుంచి బయలుదేరిన జలాలై వుంటాయి. అదీ దోషం అంటారు వీళ్లు. అవునో కాదో విజ్ఞులు చెప్పాలి. గంగా, యమునా పుష్కరాల విషయంలో యిలాటి పేచీ వస్తుందా అని చూశాను. రెండిటి మధ్య మూడేళ్ల తేడా వుంది. గోదావరి, కృష్ణల మధ్య ఏడాది మాత్రమే తేడా వుండడం వలన యీ పితలాటకం వచ్చింది. దీని గురించి ధర్మసింధు వంటి శాస్త్రగ్రంథాల్లో వుండి వుంటుందని నేననుకోను. అప్పట్లో నదీసంధానం లేదు కదా. ఇప్పుడు కొత్తగా పండితులందరూ కూర్చుని తేల్చాలి. 'ఏకం సత్‌, విప్రాః బహుధా వదన్తి' (ఉన్నదొకటే, మేధావులు రకరకాలుగా చెప్తారు) అనే సూక్తి యిటీవలి కాలంలో మరీ నిజమౌతోంది. ఉగాదికి ఒకటే పంచాంగం - కానీ టిడిపి ఆఫీసులో ఒకలా, తెరాస ఆఫీసులో మరోలా, కాంగ్రెసు ఆఫీసులో యింకోలా వినిపిస్తుంది. గతంలో రంజాన్‌ పండగ ఎప్పుడాన్న విషయం చివరి దాకా తేలేది కాదు. ఇప్పుడు హిందూ పండగలకు కూడా ఆ అవస్థ వచ్చింది. ఎవరైనా ఘనపాఠి, ఎవరైనా పీఠాధిపతి అభిప్రాయం వెలిబుస్తే వాళ్ల వూరేమిటి? వారి వెనుక ఏ నాయకుడున్నాదన్నది తేరిపార చూడాల్సి వస్తోంది. 

ఎవరి వాదన కరక్టన్నది ఎప్పటికీ తేలదు. అయితే ప్రజల సెంటిమెంటు అనేది ఎటు మొగ్గుతుందో చూడాలి. కితం ఏడాది గోదావరి పుష్కరాల్లో అంతమంది ఎందుకు చనిపోయారు? అదే స్నానఘట్టంలో, అదే సమయంలో పుష్కరస్నానం చేస్తే మోక్షం లభిస్తుందని అందరూ నమ్మారు కాబట్టి. ప్రభుత్వం అలా ప్రచారం చేయడం వలననే ప్రజలు ఆ స్థాయిలో వచ్చారు. దుర్ఘటన జరిగాక నాలిక కరుచుకుని, ఎక్కడైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు అని సర్కారువారు ప్రచారం చేశారు. అయినా యితర తీర్థాలలో కంటె రాజమండ్రికే ఎక్కువమంది జనం వచ్చిపడ్డారు. ఇప్పుడు ఇబ్రహీం పట్నం దిగువన కృష్ణలో గోదావరి జలాలు వచ్చి కలిసిన చోటు నుంచి పవిత్రత చూపువాసి తక్కువేమో అనే అనుమానం తగిలినా జనాలు ఎగువ ప్రాంతాలకే ఎగబడతారు తప్ప దిగువవాటిపై శీతకన్ను వేస్తారు. స్నానఘట్టాలు కట్టించేటప్పుడు, రోడ్లు వేయించేటప్పుడు ప్రభుత్వం యీ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, తదనుగుణంగా కాంట్రాక్టులు సవరిస్తే సమంజసంగా ఉంటుంది కానీ యిప్పటికే కాంట్రాక్టులు దక్కించుకున్న కాంట్ట్రార్లు అలా అనుకోరు. 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2016)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?